మంత్రిమండలి

ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యం ద్వారా అహ్మదాబాద్, జైపూర్, లక్నో, గువాహటి, తిరువనంతపురం, మంగళూరు ఆరు విమానాశ్రయాల లీజుకు మంత్రిమండలి ఆమోదం.

Posted On: 08 NOV 2018 8:42PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఆధ్ద్యక్షతన సమావేశమైన కేంద్రమంత్రి మండలి దిగువ అంశాలకు ఆమోదం తెలియజేసింది :

i.      ఏఏఐ కి చెందిన అహ్మదాబాద్, జైపూర్, లక్నో, గువాహటి, తిరువనంతపురం, మంగళూరు -  ఆరు విమానాశ్రయాలను ప్రభుత్వ ప్రయివేటు భాగస్వామ్య అంచనా కమిటీ (పిపిపిఏసి) ద్వారా  ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యం (పిపిపి) కింద  నిర్వహణ, యాజమాన్యం, అభివృద్ధి చేయడానికి లీజుకు ఇవ్వడానికి సూత్రప్రాయంగా ఆమోదం. 

ii.      పిపిపిఏసి పరిధి దాటి ఉన్న ఏ అంశాలనైనా నిర్ణయించడానికి - నీతీ ఆయోగ్ సీఈవో అధ్యక్షతన - పౌర విమానయాన శాఖ కార్యదర్శి, ఆర్ధిక వ్యవహారాల శాఖ కార్యదర్శి, వ్యయ శాఖ కార్యదర్శులతో ఒక కార్యదర్శుల సాధికార బృందం ఏర్పాటు.  

ప్రయోజనాలు :

1.   మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో పిపిపి వల్ల - ప్రభుత్వ రంగంలో అవసరమైన పెట్టుబడులను నియంత్రించడంతో పాటు - సేవల సరఫరా, నైపుణ్యం, వ్యవస్థ,  వృత్తి నైపుణ్యంలలో సామర్ధ్యం పెరుగుతుంది.

2.       విమానాశ్రయాల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో పిపిపి వల్ల - విమానాశ్రయాల్లో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, విమాన ప్రయాణీకులకు సకాలంలో సమర్ధవంతమైన సేవల సరఫరా, ఎటువంటి పెట్టుబడి లేకుండా భారత విమానాశ్రయాల సాధికార సంస్థకు ఆదాయ వృద్ధి మొదలైనవి లభిస్తాయి. వీటిలో హైదరాబాద్, బెంగళూరు లలో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలు కూడా ఉన్నాయి.   ప్రస్తుతం ఢిల్లీ, ముంబయి, బెంగుళూరు, హైదరాబాద్, కొచ్చిన్ విమానాశ్రయాలు పిపిపి కింద నిర్వహించబడుతున్నాయి. 

3.       భారతదేశంలోని పిపిపి విమానాశ్రయాలు - విమానాశ్రయాల సేవా నాణ్యత (ఏఎస్ క్యూ) పరంగా - ఆయా విభాగాలలో - అంతర్జాతీయ విమానాశ్రయాల మండలి (ఏసిఐ) - ఎంపిక చేసిన జాబితాలో -  మొదటి ఐదు స్థానాలను దక్కించుకున్నాయి. 

4.       పీపీపీ ప్రయోగాలు ప్రపంచ స్థాయి విమానాశ్రయాలను రూపొందించాయి. ఏఏఐ తన ఆదాయాన్ని పెంచుకోడానికీ - అలాగే దేశంలోని ఇతర ప్రాంతాల్లో విమానాశ్రయాలు అభివృద్ధి చేయడంపై , విమానయాన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం పై దృష్టి కేంద్రీకరించడానికి కూడా ఇవి సహాయపడ్డాయి. 

పూర్వరంగం :

భారతదేశంలో దేశీయ, విదేశీ విమానయానం పెరగడంతో - చాలా విమానాశ్రయాల్లో రద్దీ పెరిగింది.  దశాబ్దకాలం క్రితం ప్రయివేటు పరం చేసిన ఐదు విమానాశ్రయాలు,  రాకపోకలు పెరగడంతో  - అంతేకా అంతర్జాతీయ ఆపరేటర్లు, పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.  అంతర్జాతీయ ఆసక్తి కారణంగా - మౌలిక సదుపాయాల రంగాలన్నింటిలో - విమానయాన రంగం - అగ్ర స్థానంలో ఉంది.  అంతర్జాతీయ ఆపరేటర్లు, పెట్టుబడిదారులు -  3-4 మిలియన్ ప్రయాణీకుల కంటే ఎక్కువ సామర్ధ్యం ఉన్న బ్రౌన్ ఫీల్డ్ విమానాశ్రయాల విస్తరణ అవకాశాలకోసం ఎదురుచూస్తున్నారు.  పిపిపి విధానాన్ని అనుసరించడం ద్వారా - విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్ డీ ఐ) లను వెంటనే ఆకర్షించడానికి - విమానాశ్రయాల రంగం - అవకాశం కల్పిస్తోంది. 

అందువల్ల, ఏఏఐ కి చెందిన అహ్మదాబాద్, జైపూర్, లక్నో, గువాహటి, తిరువనంతపురం, మంగళూరు -  ఆరు విమానాశ్రయాలను -  ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యం (పిపిపి) కింద  మొదటి దశ నిర్వహణ, యాజమాన్యం, అభివృద్ధి చేయడానికి లీజుకు ఇవ్వాలని - నిర్ణయించడం జరిగింది.   దీనివల్ల, ఏఏఐ కి ఆదాయం పెరుగడంతో పాటు, ఉపాధి కల్పన, సంబంధిత మౌలికసదుపాయాల కల్పన  ద్వారా - ఈ ప్రాంతాలలో ఆర్ధికాభివృధి మెరుగౌతుందని భావిస్తున్నారు. 

**



(Release ID: 1552217) Visitor Counter : 214