మంత్రిమండలి

ఇండియా ఉజ్బెకిస్తాన్ మధ్య వ్యవసాయం మరియు అనుబంధ రంగాల్లో సహకార ఒప్పందానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం

Posted On: 26 SEP 2018 4:12PM by PIB Hyderabad

ఇండియా ఉజ్బెకిస్తాన్ మధ్య వ్యవసాయం మరియు అనుబంధ రంగాల్లో సహకార ఒప్పందం కుదుర్చుకోవాలనే ప్రతిపాదనకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ఆమోదించింది .
రెండు దేశాల మధ్య ఒప్పందం వల్ల దిగువ పేర్కొన్న క్షేత్రాలలో రెండు దేశాలు పరస్పరం సహకరించుకుంటాయి. 
i)    చట్టాలు, ప్రమాణాలు, ఉత్పత్తుల నమూనాలకు సంబంధించి ఉభయులకు హితమైన సమాచారం
     ఇచ్చిపుచ్చుకోవడం 
ii)    ఉజ్బెకిస్తాన్ లో ఉమ్మడి వ్యవసాయ సముదాయాలు ఏర్పాటు చేయడం
iii)    పంటల ఉత్పత్తి , వాటి వైవిధ్యానికి సంబంధించిన అనుభవం మార్పిడి 
iv)    ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విత్తన ఉత్పత్తిలో అనుభవాల మార్పిడి; రెండు దేశాలలో అమల్లో ఉన్న చట్టాల ప్రకారం సీడ్ సర్టిఫికేషన్ కు  సంబంధించిన సమాచారాన్ని మార్పిడి చేసుకోవడం; ఉభయులకు ప్రయోజన కరమైన రీతిలో విత్తన నమూనాలను మార్పిడి చేసుకోవడం
v)    వ్యవసాయం మరియు నీటిపారుదలతో పాటు అనుబంధ రంగాలలో నీటి వినియోగ సామర్ధ్యం పెంపొందించడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం
vi)     జన్యుశాస్త్రం, మొక్కల పెంపకం బయోటెక్నాలజీ, మొక్కల సంరక్షణ, భూ సంరక్షణ, యాంత్రీకరణ, నీటి వనరులు  వంటి రంగాలలో ఉమ్మడిగా శాస్త్రీయ పరిశోధనలు జరపడం మరియు పరిశోధన ఫలితాలను ఆచరణలోకి తేవడం  
vii)     మొక్కల్లో రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో, వాటి నిర్బంధ సంరక్షణలో అభివృద్ధి, సహకారాన్ని విస్తరించడం 
viii)     పశుపోషణ, సంరక్షణతో సహా పశుగణాభివృద్ధి, కోళ్లపెంపకం, జన్యు సంబంధ అంశాల పరిశీలన, రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి అవసరమైన సౌకర్యాలను కల్పించడం
ix)     వ్యవసాయం, ఆహార పరిశ్రమకు సంబంధించిన పరిశోధనా సంస్థల మధ్య శాస్త్రీయ మరియు ఆచరణాత్మక కార్యకలాపాలను (మేళాలు, ప్రదర్శనలు, సదస్సులు, గోష్ఠులు ఏర్పాటు చేయడం) గురించిన సమాచారం మార్పిడి 
x)    ఉమ్మడిగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు గల అవకాశాల అన్వేషణ
xi)    ఉభయుల ఆమోదం మేరకు మరే ఇతర సహకారం అందించుకోవడం
 ఈ ఒప్పందం మేరకు రెండు దేశాలకు చెందిన ప్రతినిధులతో కూడిన జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటుకు అవకాశం ఉంటుంది.  ఈ బృందం ఒప్పందం అమలులో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం సూచిస్తుంది మరియు ఒప్పందం సజావుగా అమలయ్యేందుకు అవసరమైన సహకారం కోసం ప్రణాళికలు రూపొందిస్తుంది. భాగస్వామ్య పక్షాలు నిర్దేశించిన పనులు అమలు జరిగే తీరును పర్యవేక్షిస్తుంది. వర్కింగ్ గ్రూప్ సమావేశాలు ప్రతి రెండేళ్లకోసారి వైకల్పికంగా ఇండియాలో, ఉజ్బెకిస్తాన్ లో జరుగుతాయి. సంతకాలు జరిగిన  రోజు నుంచి ఐదేళ్ళపాటు ఒప్పందం అమలులో  ఉంటుంది.  ఆ తర్వాత మరో ఐదేళ్ల చొప్పున దానంతట అదే పొడిగించబడుతుంది. భాగస్వామ్య పక్షాలలో ఏ ఒక్కరు కోరినా, ఒప్పందం రద్దును గురించి వారి నుంచి నోటీసు అందిన ఆరు నెలల తర్వాత ఒప్పందం రద్దవుతుంది. 
 



(Release ID: 1547594) Visitor Counter : 80