మంత్రిమండలి
ఐడిబిఐ బ్యాంకు లో నియంత్రణానుకూల వాటాను కొనుగోలు చేయనున్న ఎల్ఐసి
ప్రభుత్వ వాటా ను 50 శాతం కన్నా తక్కువ కు పరిమితం చేసుకోవడానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం
Posted On:
01 AUG 2018 6:09PM by PIB Hyderabad
ఐడిబిఐ బ్యాంక్ లిమిటెడ్ లో భారత ప్రభుత్వ వాటాను 50 శాతం కన్నా తక్కువ కు పరిమితం చేసుకోవడానికి అభ్యంతరం లేదని తెలిపే ప్రస్తావన కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. అలాగే, ఈ బ్యాంకు లో ప్రభుత్వానికి ఉన్న నియంత్రణ పూర్వక యాజమాన్యాన్ని రద్దు చేసుకోవడానికి, ఒక ప్రమోటర్ గా భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసి) నియంత్రణానుకూలమైన వాటా ను ప్రిఫరెన్శియల్ అలాట్‌మెంట్/ ఓపెన్ ఆఫర్ ఆఫ్ ఎక్విటి మార్గాలలో కొనుగోలు చేసేందుకు కూడా మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.
ప్రభావం:
ఈ కొనుగోలు ఇటు ఐడిబిఐ బ్యాంకు కు, అటు ఎల్ఐసి కి మరియు వినియోగదారులకు కూడా విస్తృత శ్రేణి లో సహకారి ప్రయోజనాలను అందించగలదు.
ఉభయ సంస్థల కు పరిమాణం పరంగా ఒనగూరే ప్రయోజనాలు, వినియోగదారు సంస్థల ను ఆకర్షించడంలోను, పంపిణీ పరమైన ఖర్చులను తగ్గించుకోవడంలోను, కార్యకలాపాలలో సామర్ధ్యాన్ని, సరళత్వాన్ని పెంపొందించుకోవడంలోను, ఉత్పత్తుల, సేవల విక్రయం లోను ఇతోధిక అవకాశాల లభ్యత వంటి లాభాలు దక్కుతాయి.
ఈ నిర్ణయం ఇటు ఐడిబిఐ బ్యాంకు కు, అటు ఎల్ ఐసి కి ఆర్థికంగా శక్తిని సమకూర్చడమే కాకుండా, గృహ నిర్మాణ సంబంధిత ఆర్థిక సహాయాన్ని అందజేయడం, ఇంకా మ్యూచువల్ ఫండ్ ల వంటి ఫైనాన్శియల్ ప్రోడక్ట్స్ ను అందిస్తున్న ఇరు సంస్థల అనుబంధ సంస్థల కు కూడా అండదండలను అందించగలుగుతుంది.
దీనికి తోడు, ఎల్ఐసి కి చెందిన 11 లక్షల మంది ఏజెంట్ల బలగాన్ని బ్యాంకింగ్ సేవలకు వినియోగించుకొనే అవకాశాన్ని బ్యాంకు పొందగలుగుతుంది. దీని ద్వారా బ్యాంకు యొక్క ఖాతాదారు సేవలు మెరుగుపడి, అన్ని వర్గాలకు ఆర్థిక సేవల లభ్యత విస్తృతం కాగలదు.
తక్కువ ఖర్చయ్యే డిపాజిట్ల సేకరణ, మరియు చెల్లింపు సేవలకుగాను రుసుము రూపంలో వచ్చే ఆదాయం.. ఈ మార్గాలలో నిధుల సేకరణ పరంగా తక్కువ ఖర్చు తో కూడినటువంటి ప్రయోజనాన్ని పొందే స్థితికి బ్యాంకు చేరుకొంటుంది.
బ్యాంకు కు చెందిన నగదు నిర్వహణ సేవల లభ్యతతో పాటు, బ్యాంకు కు చెందిన 1,916 శాఖల నెట్‌వర్క్ ద్వారా బ్యాంకశ్యూరెన్స్ (బ్యాంకు ద్వారా బీమా పథకాల విక్రయం వగైరా) ను ఎల్ఐసి పొందగలుగుతుంది.
పైపెచ్చు, ఆర్థిక సేవలన్నిటినీ ఒకే చోటులో అందజేయాన్న తన విజన్ ను నెరవేర్చుకోవడం లో ఎల్ఐసి మరింత ముందంజ వేయగలుగుతుంది.
వినియోగదారులు సైతం ఒకే కప్పు కింద ఆర్థిక సేవల విస్తృతి తాలూకు ప్రయోజనాన్ని పొందుతారు. ఎల్ఐసి కూడా జీవిత బీమా రక్షణ పథకాలను మరింత మందికి చేరవేయగలిగిన స్థితికి చేరుకొంటుంది.
పూర్వరంగం:
ఐడిబిఐ బ్యాంకు లో పరివర్తన ప్రక్రియ ఆరంభమైందని, ఆ బ్యాంకు ను ప్రభుత్వం ముందుకు తీసుకు పోతుందని, అంతేకాకుండా బ్యాంకు లో ప్రభుత్వ వాటాను 50 శాతం కన్నా తక్కువ కు తగ్గించుకొనే ఐచ్ఛికాన్ని కూడా పరిశీలిస్తామని ఆర్థిక మంత్రి 2016 లో తన బడ్జెట్ ప్రసంగం లో ప్రకటించారు. ఈ ప్రకటన ను పరిగణన లోకి తీసుకొని ఎల్ఐసి తన బోర్డు ఆమోదాన్ని పొందిన అనంతరం ఐడిబిఐ బ్యాంకు లో నియంత్రణకు అనువైన వాటా ను కొనుగోలు చేయడం కోసం ఇన్శూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డివెలప్ మెంట్ అథారిటి ఆఫ్ ఇండియా (ఐఆర్‌డిఎఐ) ను అనుమతించ వలసిందని కోరింది. ఐఆర్‌డిఎఐ అనుమతి ని అందుకొన్న తరువాత సాధ్యాసాధ్యాల అధ్యయనాన్ని చేపట్టి ఐడిబిఐ బ్యాంకు లో 51 శాతం నియంత్రణానుకూల వాటాను కొనుగోలు చేయడం పట్ల ఎల్ఐసి తన ఆసక్తి ని వ్యక్తం చేసింది. ఈ ఆఫర్ ను బ్యాంకు బోర్డు పరిశీలించిన అనంతరం, ప్రతిపాదిత కొనుగోలు ఫలితంగా ప్రభుత్వ వాటా 51 శాతం కన్నా తక్కువ కు క్షీణించే అంశం లో ప్రభుత్వ నిర్ణయాన్ని తెలుసుకోగోరింది.
**
(Release ID: 1541155)
Visitor Counter : 156