ప్రధాన మంత్రి కార్యాలయం

స్వీడ‌న్ కు మ‌రియు యుకె కు బ‌య‌లుదేరి వెళ్ళే ముందు ప్ర‌ధాన మంత్రి విడుదల చేసిన ప్ర‌క‌ట‌న‌

Posted On: 15 APR 2018 8:50PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ స్వీడ‌న్ కు మ‌రియు యునైటెడ్ కింగ్ డ‌మ్ కు  ప‌ర్య‌ట‌న‌ నిమిత్తం బ‌య‌లుదేరి వెళ్ళే ముందు ఇచ్చిన ప్ర‌క‌ట‌న పాఠం ఈ కింది విధంగా ఉంది.  
 
‘‘నేను 2018 ఏప్రిల్ 17, 20 వ తేదీల మ‌ధ్య స్వీడ‌న్, ఇంకా యునైటెడ్ కింగ్ డ‌మ్ ల‌ను సంద‌ర్శించ‌నున్నాను.  ఆ కాలంలో ద్వైపాక్షిక స‌మావేశాలు, ఇండియా- నార్డిక్‌ శిఖ‌ర స‌మ్మేళ‌నం మరియు కామ‌న్‌ వెల్త్ ప్ర‌భుత్వ అధినేత‌ల స‌మావేశం లో నేను పాల్గొంటాను. 

స్వీడ‌న్ ప్ర‌ధాని శ్రీ స్టీఫన్ లోఫ్‌వెన్ ఆహ్వానించినందున నేను ఏప్రిల్ 17వ తేదీ నాడు స్టాక్ హోమ్ చేరుకొంటాను.  నేను స్వీడ‌న్ లో పర్యటించడం ఇదే మొట్టమొదటి సారి. భార‌త‌దేశ‌ం మ‌రియు స్వీడ‌న్ ల మధ్య చ‌క్క‌ని స్నేహ‌పూర్వ‌క సంబంధాలు నెలకొన్నాయి.  మన భాగ‌స్వామ్యం ప్ర‌జాస్వామ్య విలువ‌లు, నియ‌మాలపైన ఆధారపడినటువంటి, అంద‌రినీ క‌లుపుకుపోయేట‌టువంటి, అర‌మ‌రిక‌లు లేన‌టువంటి ప్ర‌పంచ వ్యవస్థ కోసం క‌ట్టుబ‌డిన భాగ‌స్వామ్యం.  మ‌న అభివృద్ధి కార్య‌క్రమాల‌లో స్వీడ‌న్ ఒక విలువైన భాగ‌స్వామ్య దేశంగా ఉంటోంది.  ప్ర‌ధాని శ్రీ లోఫ్‌వెన్ మ‌రియు నేను ఉభయ దేశాల‌కు చెందిన అగ్ర‌గామి వ్యాపార‌ రంగ ప్ర‌ముఖుల‌తో సమావేశమయ్యే అవ‌కాశాన్ని, అలాగే వ్యాపారం, పెట్టుబ‌డులు, నూత‌న ఆవిష్క‌ర‌ణ‌లు, సైన్స్ అండ్ టెక్నాల‌జీ, నైపుణ్యాల అభివృద్ధి, స్మార్ట్ సిటీస్‌, స్వ‌చ్ఛ‌ శ‌క్తి, డిజిటైజేశన్, ఇంకా ఆరోగ్య రంగాలపై శ్ర‌ద్ధ వ‌హించే స‌హ‌కారాత్మకమైనటువంటి ఒక భావి మార్గ సూచి ని రూపొందించే అవ‌కాశాన్ని చేజిక్కించుకోనున్నాము.  స్వీడ‌న్ రాజు మాన్య శ్రీ కార్ల్‌ XVI గుస్‌టాఫ్‌ తో కూడా నేను భేటీ అవుతాను.

ఏప్రిల్ 17వ తేదీ నాడు ఫిన్‌లాండ్‌, నార్వే, డెన్మార్క్ మ‌రియు ఐస్‌లాండ్‌ ల ప్ర‌ధానుల‌తో స్టాక్ హోమ్ లో ఇండియా- నార్డిక్‌ స‌మిట్ ను భార‌త‌దేశం మ‌రియు స్వీడ‌న్ సంయుక్తంగా ఏర్పాటు చేయ‌నున్నాయి.  స్వ‌చ్ఛ సాంకేతిక ప‌రిజ్ఞానం, ప‌ర్యావ‌ర‌ణ సంబంధ ప‌రిష్కార మార్గాలు, నౌకాశ్రయాల ఆధునికీక‌ర‌ణ‌, శీత‌ల గిడ్డంగుల స‌ముదాయ శృంఖలాలు, నైపుణ్యాల అభివృద్ధి మ‌రియు నూత‌న ఆవిష్క‌ర‌ణల విష‌యాల‌లో నార్డిక్ దేశాల‌కు ప్ర‌పంచవ్యాప్తంగా గుర్తింపు లభించిన బలాలున్నాయి.  భార‌త‌దేశంలో పరివర్తన తీసుకురావడంకోసం నడుం కట్టిన మన దార్శ‌నిక‌త‌ తో నార్డిక్ దేశాల సామ‌ర్ధ్యాలు చ‌క్క‌గా ఇమిడిపోతాయి.  

ప్ర‌ధాని థెరెసా మే ఆహ్వానించినందున నేను 2018 ఏప్రిల్ 18వ తేదీ నాడు లండ‌న్ కు చేరుకోనున్నాను.  యుకె లో నేను కడపటి సారిగా ప‌ర్య‌టించింది 2015 న‌వంబ‌ర్ లో.  భార‌త‌దేశానికి మ‌రియు యునైటెడ్ కింగ్ డ‌మ్ కు మధ్య నెలకొన్నటువంటి ఆధునిక భాగస్వామ్యం దృఢ‌మైన చారిత్ర‌క బంధంతోనూ పెన‌వేసుకొన్నది.  

నా లండ‌న్ ప‌ర్య‌ట‌న నానాటికీ వ‌ర్ధిల్లుతున్న ద్వైపాక్షిక సంబంధాల‌కు ఒక స‌రికొత్త వేగాన్ని సంత‌రించేందుకు ఉభ‌య దేశాల‌కు మ‌రొక అవ‌కాశాన్ని అందిస్తోంది.  ఆరోగ్య సంర‌క్ష‌ణ‌, నూత‌న ఆవిష్క‌ర‌ణ‌లు, డిజిటైజేశన్‌, విద్యుత్తు సంబంధ గ‌తిశీల‌త‌, స్వ‌చ్ఛ శ‌క్తి, ఇంకా సైబ‌ర్ సెక్యూరిటీ రంగాల‌లో భార‌త్‌-యుకె భాగ‌స్వామ్యాన్ని ఇనుమడింపచేయ‌డం పైన నేను శ్ర‌ద్ధ తీసుకొంటాను.  ‘‘లివింగ్ బ్రిడ్జ్’’ ఇతివృత్తంలో భాగంగా, నేను భార‌త్-యుకె బ‌హుముఖీన సంబంధాన్ని ఇతోధికం చేసినటువంటి విభిన్న వ‌ర్గాల‌కు చెందిన వారిని కలుసుకొనే అవకాశాన్ని కూడా ద‌క్కించుకోబోతున్నాను.

శ్రేష్ఠురాలైన రాణి గారి తో నేను సమావేశమవుతాను.  అలాగే, ఇరు దేశాల ఆర్థిక భాగ‌స్వామ్యం తాలూకు ఒక కొత్త కార్యాచ‌ర‌ణ‌పై క‌స‌ర‌త్తు చేస్తున్న భారతదేశం, యుకె లకు చెందిన సిఇఒ ల‌తోనూ నేను సంక్షిప్తంగా సంభాషిస్తాను.  లండ‌న్ లో ఒక ఆయుర్వేద ప్రావీణ్య కేంద్రాన్ని ప్రారంభిస్తాను.  అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్ ఎ) లో ఓ నూత‌న స‌భ్యురాలు గా యుకె కు స్వాగతం పలుకుతాను.

ఏప్రిల్ 19 మ‌రియు ఏప్రిల్ 20వ తేదీల‌లో నేను యునైటెడ్ కింగ్ డ‌మ్ ఆతిథ్యం ఇచ్చే కామ‌న్‌వెల్త్ ప్ర‌భుత్వ అధినేత‌ల స‌మావేశం (సిహెచ్ ఒజిఎమ్) లో పాలుపంచుకొంటాను.  కామ‌న్‌వెల్త్ యొక్క నూత‌న ఛైర్-ఇన్-ఆఫీస్ ప‌ద‌వీ బాధ్య‌త‌ల‌ను మాల్టా నుండి యునైటెడ్ కింగ్ డ‌మ్‌ స్వీక‌రించనుంది.  కామ‌న్‌ వెల్త్ అనేది ఒక విశిష్ట‌మైన బ‌హుళ పార్శ్విక బృందం.  అభివృద్ధి చెందుతున్న దేశాల‌కు, మ‌రీ ముఖ్యంగా చిన్న దేశాల‌కు మ‌రియు అభివృద్ధి చెందుతున్నచిన్న ద్వీప దేశాల‌కు ఉప‌యుక్త‌మైన‌టు వంటి స‌హాయాన్ని కామన్ వెల్త్ అందించ‌డ‌మే కాకుండా, అభివృద్ధి సంబంధిత అంశాల‌పై ఒక బ‌ల‌మైన అంత‌ర్జాతీయ వాణి గా కూడా వ్యవహరిస్తోంది.  

స్వీడ‌న్ మ‌రియు యుకె ల‌లో జ‌రిపే ప‌ర్య‌ట‌న‌లు ఆయా దేశాల‌తో మ‌న సంబంధాల‌ను  పెంపొందించుకోవ‌డంలో ఉప‌యోగ‌ప‌డుతాయ‌న్న నమ్మకం నాకుంది.’’


 
*****



(Release ID: 1529180) Visitor Counter : 122