ప్రధాన మంత్రి కార్యాలయం

మైసూరు లో రైల్వే ప్రాజెక్టుల‌ను ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి; శ్రావ‌ణ‌బెళ‌గోళ లో అభివృద్ధి ప‌నుల‌ను కూడా ఆయ‌న ప్రారంభించారు

Posted On: 19 FEB 2018 4:02PM by PIB Hyderabad


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మైసూరు మ‌రియు కెఎస్ఆర్‌ బెంగ‌ళూరు ల మ‌ధ్య విద్యుద్దీకరణ జరిగిన రైలు మార్గాన్ని దేశ ప్ర‌జ‌ల‌కు ఈ రోజు అంకితం చేశారు.  మైసూరు రైల్వే స్టేష‌న్ లో ఏర్పాటు చేసిన ఒక కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాలుపంచుకొని, మైసూరు మ‌రియు ఉద‌య్‌పూర్ మ‌ధ్య రాక‌పోక‌లు జ‌రిపే ప్యాలెస్ క్వీన్ హ‌మ్‌స‌ఫ‌ర్ ఎక్స్‌ప్రెస్ కు ప‌చ్చ జెండాను చూపి ఆ రైలును ప్రారంభించారు.
 
అంత‌క్రితం ప్ర‌ధాన మంత్రి బాహుబ‌లి మ‌హామ‌స్త‌కాభిషేక మ‌హోత్స‌వం 2018 లో పాలుపంచుకొనేందుకు గాను శ్రావ‌ణ‌బెళ‌గోళ ను సంద‌ర్శించారు.  వింధ్య‌గిరి ప‌ర్వ‌తం వ‌ద్ద ఎఎస్ఐ ఏర్ప‌ర‌చిన నూత‌న సోపానాల‌ను ఆయ‌న ప్రారంభించారు.  అలాగే, బాహుబ‌లి సార్వ‌జ‌నిక ఆసుప‌త్రి ని కూడా ఆయ‌న ప్రారంభించారు.  
 
శ్రావ‌ణ‌బెళ‌గోళ లో స‌భికుల‌ను ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగిస్తూ, మ‌న దేశానికి చెందిన సాధువులు మ‌రియు మునులు ఎల్ల‌వేళ‌లా స‌మాజానికి సేవ‌లు అందించార‌ని, అంతేకాకుండా వారు ఒక స‌కారాత్మ‌క వ్య‌త్యాసాన్ని కూడా తీసుకువ‌చ్చార‌ని పేర్కొన్నారు.  మారుతున్న కాలాలతో పాటే మ‌న‌మూ మారుతూ, కొత్త కొత్త సంద‌ర్భాల‌కు త‌గిన‌ట్లుఎంతో చ‌క్క‌గా ఒదిగిపోవ‌డం మ‌న స‌మాజం యొక్క బ‌లం అని ప్ర‌ధాన మంత్రి తెలిపారు.  పేద‌ల‌కు మంచి నాణ్య‌త క‌లిగిన మ‌రియు త‌క్కువ ఖ‌ర్చుతో కూడిన ఆరోగ్య సంర‌క్ష‌ణ‌ ను అందించడం మ‌న క‌ర్త‌వ్యం అని ఆయ‌న అన్నారు.

***



(Release ID: 1520968) Visitor Counter : 82