మంత్రిమండలి
యువజన వ్యవహారాలలో సహకారానికి భారతదేశం మరియు ట్యునీశియా ల మధ్య కుదిరిన ఎమ్ఒయు మంత్రివర్గం దృష్టికి
Posted On:
07 FEB 2018 8:14PM by PIB Hyderabad
యువజన వ్యవహారాలలో సహకారాన్ని పెంపొందింపచేసుకొనే అంశంపై భారతదేశానికి, ట్యునీశియా కు మధ్య ఒక అవగాహనపూర్వక ఒప్పంద పత్రం ( ఎమ్ఒయు) పైన సంతకాలు జరిగిన సంగతిని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం దృష్టికి తీసుకు రావడమైంది. ఈ ఎమ్ఒయు పై 2017 అక్టోబర్ 30వ తేదీన న్యూ ఢిల్లీ లో సంతకాలయ్యాయి.
భారతదేశ యువతీయువకులలో అంతర్జాతీయ దృష్టి కోణం గురించిన అవగాహనను ఏర్పరచడం, ఆలోచనలకు, విలువలకు మరియు సంస్కృతి కి సంబంధించిన ఆదాన ప్రదానాలను ప్రోత్సహించడం, శాంతిని, ఇంకా అవగాహనను పెంపొందింప చేయడంలో వారిని భాగస్వాములను చేయడం ఈ ఎమ్ఒయు ధ్యేయం.
ఈ ఎమ్ఒయు అయిదు సంవత్సరాల పాటు అమలులో ఉంటుంది. ఈ ఎమ్ ఒయు లో భాగంగా:
i. యువజన బృందాల రాకపోకలకు సంబంధించిన కార్యక్రమాల నిర్వహణ;
ii. అంతర్జాతీయ సమావేశాలు మరియు చర్చాసభలకు ఆహ్వాన పత్రాలను ఇచ్చి పుచ్చుకోవడం;
iii. ముద్రిత పత్రాలు, చిత్రాలు, అనుభవాలు, పరిశోధన మరియు ఇతరత్రా సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడం;
iv. యువజన శిబిరాలలో, యువజన ఉత్సవాలలో మరియు ఇతర సహకారపూర్వక యువజన కార్యక్రమాలలో, అధ్యయనాత్మక పర్యటనలలో, యువతకు సంబంధించిన అంశాలపై చిన్న చిన్న కార్యశాలలు, చర్చా సభలు, తదితర కార్యకలాపాలలో పాలుపంచుకోవడం
వంటి రంగాలలో పరస్పరం సహకరించుకొంటారు.
***
(Release ID: 1519973)
Visitor Counter : 89