ప్రధాన మంత్రి కార్యాలయం
‘ఓఖీ’ తుఫాను బాధిత ప్రాంతాలైన లక్షద్వీప్, తమిళ నాడు మరియు కేరళ లలో రేపు పర్యటించనున్న ప్రధాన మంత్రి
Posted On:
18 DEC 2017 3:54PM by PIB Hyderabad
లక్షద్వీప్, తమిళనాడు మరియు కేరళ లలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపు పర్యటించనున్నారు. ‘ఓఖీ’ పెనుతుఫాను కారణంగా తలెత్తిన పరిస్థితితో పాటు, కవరత్తీ, కన్యాకుమారి మరియు తిరువనంతపురం లలో సహాయక కార్యకలాపాలు కొనసాగుతున్న తీరును ఆయన సమీక్షించనున్నారు. ప్రజా ప్రతినిధులు మరియు అధికారులతో ప్రధాన మంత్రి సమావేశమవుతారు. అలాగే మత్స్యకారులతో, తుఫాను బాధితులతో మరియు రైతు ప్రతినిధివర్గాలతో కూడా ఆయన భేటీ అవుతారు.
అరేబియా సముద్రంలో నవంబర్ 30వ తేదీన అకస్మాత్తుగా, ఇంతవరకు ఎరుగని రీతిలో సంభవించిన ‘ఓఖీ’ మహాచక్రవాతం బారిన కేరళ, తమిళ నాడు మరియు లక్షద్వీప్ లు పడ్డాయి. పర్యవసానంగా కేరళ లో 70 మంది, తమిళ నాడు లో 18 మంది ప్రాణాలను కోల్పోయారు. కాగా, చేపల వేటకై సముద్రం లోకి వెళ్ళిన అనేక మంది జాడ ఇప్పటికీ తెలియరావడం లేదు.
కన్యాకుమారి కి సుమారు 500 కిలో మీటర్లు ఆగ్నేయ దిశలో శ్రీలంక కు ఆవల బంగాళాఖాతంలో నైరుతి దిక్కున నవంబర్ 29వ తేదీన అల్పపీడనం ఏర్పడినట్లు భారత వాతావరణ అధ్యయన విభాగం (ఐఎమ్‌డి) విడుదల చేసిన తొలి ప్రకటనలో పేర్కొంది. అదే రోజున బహుశా తుఫాను రావచ్చంటూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఒక హెచ్చరిక సందేశాన్ని పంపింది.
బాధిత రాష్ట్రాలతో పాటు కేంద్రంలోని ప్రభుత్వ ఏజెన్సీలు వెనువెంటనే రంగంలోకి దిగి, పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించ సాగాయి; తగిన రక్షణ, సహాయక కార్యకలాపాలను నిర్వహించారు. అన్వేషణ మరియు రక్షణ కార్యకలాపాలలో స్థానిక ప్రభుత్వ సంస్థలతో సహా కోస్తా తీర రక్షక దళం, వాయు సేన, నౌకాదళం, ఎన్‌డిఆర్ఎఫ్ లు కలసి పనిచేశాయి. ఎన్‌డిఆర్ఎఫ్ కు చెందిన రెండేసి బృందాలను తమిళ నాడు లో, కేరళ లో అన్వేషణ మరియు సహాయక కార్యకలాపాల నిమిత్తం మోహరించారు. ఈ బృందాల ఇంకా తమ సహాయాన్ని అందిస్తూ వస్తున్నాయి. ‘ఓఖీ’ మహాచక్రవాతాన్ని దృష్టిలో ఉంచుకొని మహారాష్ట్ర కు 3 ఎన్‌డిఆర్ఎఫ్ బృందాలను, గుజరాత్ కు 7 ఎన్‌డిఆర్ఎఫ్ బృందాలను పంపించి, సర్వ సన్నద్ధంగా ఉంచారు.
ఇంతవరకు లక్షద్వీప్ లో 367 మందిని, కేరళ లో 309 మందిని, తమిళ నాడు లో 220 మందిని రక్షించడం జరిగింది. సుమారు 12000 మందిని తుఫాను బాధిత ప్రాంతాల నుండి తరలించారు. తమిళ నాడు, కేరళ, మరియు కర్ణాటక లకు చెందిన 250 మంది మత్స్యకారులు డిసెంబర్ 3వ తేదీన లక్షద్వీప్ తీరానికి క్షేమంగా చేరుకొన్నారు. అలాగే, 809 మంది జాలర్లు 68 పడవలతో సహా (వీటిలో కేరళకు చెందిన 66 పడవలు, తమిళ నాడు కు చెందిన 2 పడవలు ఉన్నాయి) మహారాష్ట్ర లోని సింధుదుర్గ్ లో దేవ్‌గఢ్ ఓడ రేవుకు క్షేమంగా తిరిగి వచ్చాయి. ఈ పడవలలోని మత్స్యకారులు వారి వారి రాష్ట్రాలకు ఇప్పటికే పయనమయ్యారు.
ప్రభుత్వం ‘ఓఖీ’ పెనుతుఫాను నేపథ్యంలో ఇబ్బందులు పడిన వారి కోసం లక్షద్వీప్ లో 31 సహాయక శిబిరాలను, కేరళ లో మరో 52 సహాయక శిబిరాలను, తమిళ నాడు లో 29 సహాయక శిబిరాలను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ సంస్థలు నెలకొల్పిన సహాయక శిబిరాలలో తలదాచుకొన్నవారికి సహాయక సామగ్రిని అందజేయడం జరుగుతోంది. పరిస్థితిని ఎదుర్కోవడంలో తమిళ నాడు, కేరళ రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు, లక్షద్వీప్ పాలన యంత్రాంగం సైతం సత్వర చర్యలు తీసుకొన్నాయి.
రక్షణ మరియు సహాయక కార్యకలాపాల కోసం కేంద్ర ప్రభుత్వం కోస్తా తీర రక్షక దళానికి చెందిన 13 నౌకలను, 4 విమానాలను, ఒక హెలికాప్టర్‌ను, నౌకాదళానికి చెందిన 10 నౌకలు, 4 విమానాలు, 5 హెలికాప్టర్లకు తోడు వాయు సేనకు చెందిన 3 హెలికాప్టర్లను, ఒక విమానాన్ని మోహరించింది. లక్షద్వీప్ లో ‘ఓఖీ’ తుఫాను బారిన పడిన ప్రజలకు నౌకాదళం విపత్తు సంబంధిత సహాయాన్ని మరియు కరుణామయ సహాయాన్ని అందజేసింది. నౌకాదళానికి చెందిన నౌకలు మినీకాయ్ దీవికి మరియు కవరత్తీ, ఇంకా కల్‌పేనీ దీవులకు సహాయక సామగ్రిని తీసుకువెళ్ళాయి.
‘ఓఖీ’ పెనుతుఫాను తో సహా ప్రాకృతిక దుర్ఘటనలను ఎదుర్కోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే ప్రయత్నాలకు అదనంగా వర్తమాన 2017-18 ఆర్థిక సంవత్సరంలో తమిళ నాడు మరియు కేరళ ప్రభుత్వాలకు రాష్ట్రాల విపత్తు సహాయక నిధి (ఎస్‌డిఆర్ఎఫ్) నుండి రెండో వాయిదాను కేంద్రం విడుదల చేసింది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను కేరళ ప్రభుత్వానికి ఎస్‌డిఆర్ఎఫ్ లో కేంద్రం వాటా రూ. 153 కోట్లు కాగా తమిళ నాడుకు ఇది రూ. 561 కోట్లుగా ఉంది.
రక్షణ శాఖ మంత్రి శ్రీమతి నిర్మల సీతారమణ్ డిసెంబర్ 3 మరియు 4వ తేదీలలో తమిళ నాడు లోని కన్యాకుమారి జిల్లాలో మరియు తిరువనంతపురం లో తుఫాను బాధిత ప్రాంతాలను సందర్శించారు. కేబినెట్ కార్యదర్శి శ్రీ పి. కె. సిన్హా అధ్యక్షతన పనిచేస్తున్న జాతీయ విపత్తు నిర్వహణ సంఘం (ఎన్‌సిఎమ్‌సి ) డిసెంబర్ 4వ తేదీన సమావేశమై తుఫాను బాధిత రాష్ట్రాలలోను, కేంద్ర పాలిత ప్రాంతాలలోను అమలవుతున్న రక్షణ మరియు సహాయక కార్యకలాపాలను సమీక్షించింది.
***
(Release ID: 1513058)
Visitor Counter : 155