Social Welfare
కాశీ తమిళ సంగమం 5.0
తిరుక్కురళ్ పయిల్వోమ్: దేశవ్యాప్తంగా విద్యాసంస్థలకు తిరుక్కురళ్ బోధనలు
Posted On:
25 NOV 2026 9:38AM
ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ తమిళనాడు, కాశీ (వారణాసి) మధ్య చిరకాలంగా కొనసాగుతున్న సాంస్కృతిక, భాషా, నాగరికతా సంబంధాలను కాశీ తమిళ సంగమం చాటిచెబుతోంది. 2026 నవంబర్ 28 నుంచి డిసెంబర్ 12 వరకు జరిగే ఐదో విడత కార్యక్రమం “తిరుక్కురళ్ పయిల్వోమ్ - తిరుక్కురళ్ అభ్యాస్ కరేన్” ఇతివృత్తంతో సాగనుంది. ఏ కాలానికైనా వర్తించే తిరుక్కురళ్ బోధనలను యువ విద్యార్థులకు చేరువ చేయడంపై దృష్టి సారిస్తుంది. తమిళనాడు నుంచి సుమారు 1,400 మంది ప్రతినిధులు వారణాసి, ప్రయాగ్‌రాజ్, అయోధ్యలను సందర్శిస్తారు. దేశవ్యాప్తంగా నిర్వహించే స్టూడెంట్స్ ఎంగేజ్‌మెంట్ ప్రోగ్రామ్‌లో 1,000 ఉన్నత విద్యా సంస్థలు పాల్గొంటాయి. తమిళనాడు ఉపాధ్యాయులు ఉత్తరప్రదేశ్‌లోని పాఠశాలలు, కళాశాలల్లో తిరుక్కురళ్‌ను పరిచయం చేస్తారు. విద్యాపరమైన మార్పిడి కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ భాషల్లో ప్రజలకు చేరువయ్యే చర్యల ద్వారా పరస్పర అవగాహనను పెంపొందించడం, ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేయడం, భారత ఉమ్మడి వారసత్వాన్ని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం లక్ష్యం.
కాశీ తమిళ సంగమం గురించి
ప్రాచీన విద్యా కేంద్రాలైన తమిళనాడు, కాశీ మధ్య అనాదిగా కొనసాగుతున్న నాగరికతా బంధాలను కాశీ తమిళ సంగమం చాటిచెబుతోంది. మత సంప్రదాయాల్లో భాగంగా రెండు రాష్ట్రాలకు చెందిన అనేక మంది కాశీ, రామేశ్వరాలను సందర్శిస్తుంటారు. ఇది ఉత్తర, దక్షిణ భారత ప్రాంతాల మధ్య సాంస్కృతిక బంధాలకు నిదర్శనం.
తమిళనాడుకు చెందిన అనేక కుటుంబాలు తరతరాలుగా హనుమాన్ ఘాట్, కేదార్ ఘాట్ పరిసరాల్లో నివసిస్తున్నాయి. ధర్మపురం ఆధీనానికి చెందిన స్వామి కుమారగురుపర తమిళనాడు నుంచి కాశీకి వచ్చి కేదార్ ఘాట్‌లో కేదారేశ్వర ఆలయాన్ని నిర్మించారు. 200 ఏళ్ల చరిత్ర ఉన్న కుమారస్వామి మఠం, మార్కండేయ ఆశ్రమం కూడా ఇదే ఘాట్‌లో ఉన్నాయి. తమిళనాడులోని తెన్‌కాశీని దక్షిణ కాశీగా పిలుస్తారు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో మహాకవి సుబ్రహ్మణ్య భారతికి అంకితమైన అధ్యయన పీఠం ఉంది.
రెండు ప్రాంతాల జ్ఞాన, సాంస్కృతిక సంప్రదాయాలను మరింత చేరువ చేయడం, ఉమ్మడి వారసత్వంపై అవగాహన కల్పించడం, ప్రజల మధ్య బంధాలను బలోపేతం చేయడం సంగమం విస్తృత లక్ష్యం. 2022లో ఈ కార్యక్రమాన్ని ప్రకటించినప్పుడే ఈ లక్ష్యాలను నిర్దేశించారు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా 2022లో తొలి కాశీ తమిళ సంగమం జరిగింది. నాలుగు విడతల్లో రెండు ప్రాంతాల మధ్య జ్ఞానం, భాష, సంప్రదాయాలు, జీవితానుభవాల మార్పిడికి ఇది వేదికగా నిలిచింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దీన్ని "'ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్' స్ఫూర్తిని మరింత బలోపేతం చేసే ఉత్సాహభరిత కార్యక్రమం"గా అభివర్ణించారు.
ప్రతి విడతలో తమిళనాడుకు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, హస్తకళాకారులు, పండితులు, ఆధ్యాత్మిక నాయకులు, సాంస్కృతిక రంగాలవారు కాశీలో వారం నుంచి పది రోజులపాటు గడిపారు. కాశీలోని ఆలయాలు, తమిళ సంబంధాలు ఉన్న ప్రదేశాలతోపాటు సమీపంలోని అయోధ్య, ప్రయాగ్‌రాజ్ నగరాలను సందర్శించారు. సదస్సులు, ప్రసంగాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడా పోటీలు, ప్రదర్శనల్లో కాశీలో తమ రంగాలకు చెందినవారిని కలిశారు.
ఐఐటీ మద్రాస్, బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, చెన్నైలోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్లాసికల్ తమిళ్ (సీఐసీటీ), ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో విద్యా మంత్రిత్వ శాఖలోని ఉన్నత విద్యా విభాగం ఈ సంగమాన్ని నిర్వహిస్తోంది. సాంస్కృతిక, రైల్వే, పర్యాటక, జౌళి శాఖలు సహా పలు కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు కూడా భాగస్వాములుగా ఉన్నాయి.
కాశీ తమిళ సంగమం 5.0: తిరుక్కురళ్ పయిల్వోమ్
ఐదో విడత సంగమం 2026 నవంబర్ 28 నుంచి డిసెంబర్ 12 వరకు "తిరుక్కురళ్ పయిల్వోమ్ - తిరుక్కురళ్ అభ్యాస్ కరేన్" (తిరుక్కురళ్ నేర్చుకుందాం) ఇతివృత్తంతో జరగనుంది.
నైతికత, నడవడిక గురించి వివరించే ప్రాచీన తమిళ గ్రంథం తిరుక్కురళ్. రచయిత తిరువళ్లువర్ దీన్ని అరమ్ (ధర్మం), పొరుల్ (సంపద), ఇన్‌బమ్ (ప్రేమ) అనే మూడు భాగాలుగా రచించారు. ఈ గ్రంథంలో 1,330 ద్విపదలు ఉన్నాయి. రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో ఉన్న మొత్తం 22 భాషలు సహా 25 భారతీయ భాషలతోపాటు పలు విదేశీ భాషల్లోకి సీఐసీటీ దీన్ని అనువదించింది. బ్రెయిలీ రూపంలోనూ అందుబాటులోకి తెచ్చింది.
ఐదో విడత కార్యక్రమం లక్ష్యాలు:
- తిరుక్కురళ్‌లోని నైతికత, సత్ప్రవర్తనకు సంబంధించిన జ్ఞానాన్ని దేశవ్యాప్తంగా యువత, విద్యార్థులకు చేరువ చేయడం.
- విద్యా కార్యకలాపాలు, బహుభాషా అధ్యయన వనరులు, విస్తృత ప్రజా ప్రచారం ద్వారా ఈ గ్రంథాన్ని చదవడం, అర్థం చేసుకోవడం, అందులోని విలువలను నిత్యజీవితంలో ఆచరించడాన్ని ప్రోత్సహించడం.
- వివిధ విద్యా విభాగాలు, భిన్న భాషా నేపథ్యాలకు చెందిన విద్యార్థుల్లో తిరుక్కురళ్‌పై విస్తృత అవగాహన పెంపొందించడం.

కాశీ తమిళ సంగమం 5.0లో ప్రధాన కార్యక్రమాలు
స్టూడెంట్స్ ఎంగేజ్‌మెంట్ ప్రోగ్రామ్
వివిధ విద్యా విభాగాలు, భిన్న భాషా నేపథ్యాలకు చెందిన విద్యార్థుల్లో తిరుక్కురళ్‌పై విస్తృత అవగాహన పెంపొందించేందుకు దేశవ్యాప్తంగా 1,000 ఉన్నత విద్యా సంస్థల ద్వారా స్టూడెంట్స్ ఎంగేజ్‌మెంట్ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తారు. ఇందులో ప్రణాళికాబద్ధ అధ్యయనం, పరిశోధన, విద్యాసంస్థల్లో నిర్వహించే కార్యకలాపాలు ఉంటాయి.
- పాల్గొనే ప్రతి విద్యాసంస్థ ఆసక్తి ఉన్న విద్యార్థులకు తిరుక్కురళ్‌పై మూల్యాంకనం నిర్వహించి, ప్రతిభ ఆధారంగా ఒక విద్యార్థిని ఎంపిక చేసి నామినేట్ చేస్తుంది.
- ఎంపికైన విద్యార్థులు ఆన్‌లైన్ విద్యా అవగాహన కార్యక్రమంలో పాల్గొంటారు. రాజ్యాంగ షెడ్యూల్‌లోని 22 భాషలు, ఆంగ్లంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
- అనంతరం సీఐసీటీ అందించే బహుభాషా అధ్యయన సామగ్రితో నెలపాటు పరిశోధన, విద్యా కార్యకలాపాలు కొనసాగుతాయి. ఎంపికైన విద్యార్థుల్లో కార్యక్రమ మార్గదర్శకాల ప్రకారం అర్హత కలిగి, నిర్దేశిత అవసరాలను పూర్తిచేసిన ప్రతి ఒక్కరికి ₹10,000 స్టైపెండ్ అందుతుంది.
- ప్రతి విద్యార్థి అధ్యాపకుడి మార్గదర్శకత్వంలో 4 నుంచి 10 పేజీల వ్యాసం లేదా పరిశోధన గమనిక రాయాలి. తమ విద్యాసంస్థలో తిరుక్కురళ్‌పై గంటపాటు ప్రజెంటేషన్ ఇవ్వాలి.

ఉత్తరప్రదేశ్ పాఠశాలలు, కళాశాలల్లో తిరుక్కురళ్ బోధన
సంగమం సందర్భంగా తమిళనాడు నుంచి 50 మంది ఉపాధ్యాయులు ఉత్తరప్రదేశ్‌కు వెళ్లి పాఠశాలలు, కళాశాలల్లో తిరుక్కురళ్‌ను బోధిస్తారు. తమిళనాడుకు చెందిన తిరుక్కురళ్ నిపుణులు కూడా వారణాసిలోని పాఠశాలలు, కళాశాలలను సందర్శిస్తారు. అవగాహన పాఠ్యాంశాలు, పరస్పర చర్చలు, క్విజ్‌ల ద్వారా గ్రంథంలోని ప్రధాన విలువలను విద్యార్థులకు పరిచయం చేస్తారు.
పాఠశాలల్లో పుస్తక పఠన కార్యక్రమాలు
రాష్ట్రీయ ఈ-పుస్తకాలయతో కలిసి నేషనల్ బుక్ ట్రస్ట్ వారణాసి పాఠశాలల్లో పుస్తకాలు చదివే అలవాట్లు, కథలు చెప్పడం, సృజనాత్మక కార్యకలాపాలపై విద్యార్థులతో చర్చా కార్యక్రమాలను నిర్వహిస్తుంది.
ప్రారంభోత్సవం, సదస్సు, సాంస్కృతిక కార్యక్రమం
కాశీ తమిళ సంగమం 5.0ను 2026 నవంబర్ 28న ప్రారంభిస్తారు. ముగింపు సభ 2026 డిసెంబర్ 12న జరుగుతుంది. స్టూడెంట్స్ ఎంగేజ్‌మెంట్ ప్రోగ్రామ్ కింద ఎంపికైన విద్యార్థులు ఈ రెండు కార్యక్రమాల్లో ఆన్‌లైన్ ద్వారా పాల్గొంటారు. భారతీయ భాషా సమితి భాగస్వామ్యంతో తిరుక్కురళ్‌పై నిర్వహించే జాతీయ సదస్సుకు బనారస్ హిందూ విశ్వవిద్యాలయం సహ నిర్వాహక సంస్థగా వ్యవహరిస్తుంది. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కార్యక్రమ వేదికల వద్ద సాంస్కృతిక బృందాలు, తిరుక్కురళ్ లఘుచిత్రాల ప్రదర్శనలు, సాంస్కృతిక ప్రదర్శనలను సమకూరుస్తుంది. ప్రధాన వేదిక వద్ద ప్రతినిధుల కోసం తమిళనాడు, ఉత్తరప్రదేశ్ హస్తకళలు, చేనేత ఉత్పత్తుల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.
డిజిటల్ వేదికలు, ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాలు
దేశవ్యాప్తంగా మరింత మందికి తిరుక్కురళ్ బోధనలను అందుబాటులోకి తీసుకురావడానికి కాశీ తమిళ సంగమం 5.0 సాంకేతికతను కూడా ఉపయోగించుకుంటుంది. సీఐసీటీ తిరుక్కురళ్ మల్టీలింగ్వల్ యాప్‌లో మొత్తం 1,330 ద్విపదలు, వాటికి 22 షెడ్యూల్ భాషల్లో అనువాదాలు ఉన్నాయి. ఈ విడత కోసం సీఐసీటీ రూపొందించిన కార్యక్రమంలో ఎంపిక చేసిన ద్విపదలపై చిన్న యానిమేషన్ వీడియోలు, చిత్రాలు, తిరుక్కురళ్ ఆడియో పుస్తకాలు కూడా ఉన్నాయి. భారతీయ రైల్వేలు, భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ, భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ సమన్వయంతో రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, రహదారి టోల్ ప్లాజాల వద్ద ప్రయాణికుల సమాచార వ్యవస్థలు, సూచిక బోర్డుల్లో ద్విపదలు, వాటి అనువాదాలను ప్రదర్శించేందుకు ప్రణాళిక రూపొందించారు.
ప్రతినిధులు, పర్యటన ప్రణాళిక
తమిళనాడు నుంచి సుమారు 1,400 మంది ఎనిమిది రోజుల పర్యటన చేపడతారు. ఒక్కో బృందంలో సుమారు 200 మంది చొప్పున ఏడు బృందాలుగా వీరిని విభజిస్తారు. ఇందులో నాలుగు రోజులు ప్రయాణం, మరో నాలుగు రోజులు సందర్శనలు, ప్రణాళికాబద్ధ కార్యక్రమాలు ఉంటాయి. వారణాసి, ప్రయాగ్‌రాజ్, అయోధ్యలను పర్యటనలో చేర్చారు. సాంస్కృతిక, విద్యా, నిర్దిష్ట రంగాలకు సంబంధించిన కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ప్రతినిధులు పాల్గొంటారు.
పాల్గొనేవారు ఏడు వర్గాలకు చెందినవారు:
- విద్యార్థులు
- ఉపాధ్యాయులు
- రచయితలు, మీడియా వృత్తి నిపుణులు
- వ్యవసాయం, అనుబంధ రంగాలవారు
- వృత్తి నిపుణులు, హస్తకళాకారులు
- మహిళలు
- ఆధ్యాత్మిక నాయకులు
వారణాసిలో ఉన్న సమయంలో ప్రతినిధులు కాశీ విశ్వనాథ ఆలయం, సారనాథ్ లేదా బనారస్ హిందూ విశ్వవిద్యాలయం (బీహెచ్‌యూ), రామ్‌నగర్ కోట, భారత్ మాతా ఆలయం సహా ప్రముఖ మత, చారిత్రక, సాంస్కృతిక ప్రదేశాలను సందర్శిస్తారు. పర్యటనలో గంగా ఆరతి, గంగా స్నానం, విద్యా సంబంధిత సమావేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి. అనంతరం ప్రతినిధులు ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణీ సంగమం, అయోధ్యలోని శ్రీరామ ఆలయాన్ని సందర్శిస్తారు.
ప్రత్యేక తమిళ వారసత్వ పర్యటనలో భాగంగా ప్రతినిధులు మహాకవి సుబ్రహ్మణ్య భారతి పూర్వీకుల ఇల్లు, కేదార్ ఘాట్, లిటిల్ తమిళనాడులోని కాశీ మఠంలను సందర్శిస్తారు. బీహెచ్‌యూ తమిళ విభాగంలో విద్యాపరమైన చర్చా కార్యక్రమం కూడా ఉంటుంది.
గత విడతలు
2022 నుంచి 2025 మధ్య జరిగిన తొలి నాలుగు కాశీ తమిళ సంగమం కార్యక్రమాలు తమిళనాడు, కాశీ మధ్య సాంస్కృతిక, భాషా, చారిత్రక సంబంధాలను బలోపేతం చేశాయి. ఈ వారసత్వాన్ని కొనసాగిస్తూ ప్రజల మధ్య సంబంధాలను మరింత బలపరచడం, రెండు ప్రాంతాల ఉమ్మడి వారసత్వాన్ని చాటిచెప్పడం ఐదో విడత లక్ష్యం.
కాశీ తమిళ సంగమం 1.0 (2022 నవంబర్ నుంచి డిసెంబర్ వరకు)
తొలి విడత కార్యక్రమం 2022 నవంబర్ నుంచి డిసెంబర్ వరకు జరిగింది. తమిళనాడులోని 12 విభిన్న రంగాలకు చెందిన 2,500 మందికి పైగా ఎనిమిది రోజుల పర్యటనల్లో వారణాసి, ప్రయాగ్‌రాజ్, అయోధ్యలను సందర్శించారు. వారణాసిలోని బీహెచ్‌యూలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 2022 నవంబర్ 19న వారణాసిలో ప్రధానమంత్రి దీన్ని ప్రారంభించారు. తమలాంటి వ్యాపారాలు, వృత్తులు, ఆసక్తులు ఉన్నవారిని కలిసేందుకు ప్రతినిధులు సదస్సులు, క్షేత్రస్థాయి సందర్శనల్లో పాల్గొన్నారు. రెండు ప్రాంతాల చేనేత, హస్తకళలు, వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ ఉత్పత్తులు, పుస్తకాలు, డాక్యుమెంటరీలు, వంటకాలు, కళారూపాలతో కాశీలో నెలపాటు ప్రదర్శన నిర్వహించారు. దీనితోపాటు నిపుణులు, పండితుల మధ్య విద్యాపరమైన మార్పిడి కార్యక్రమాలు, సదస్సులు, చర్చలు జరిగాయి.
కాశీ తమిళ సంగమం 2.0 (డిసెంబర్ 2023)
రెండో విడత కార్యక్రమం 2023 డిసెంబర్ 17 నుంచి 30 వరకు వారణాసిలోని నమో ఘాట్‌లో జరిగింది. ప్రధానమంత్రి దీన్ని ప్రారంభించారు. సందర్శనకు వచ్చిన ప్రతినిధుల కోసం ప్రధానమంత్రి ప్రసంగాన్ని యాప్ సాయంతో అప్పటికప్పుడు తమిళంలోకి అనువదించడం తొలిసారిగా ఈ విడతలో చోటుచేసుకుంది. రైలు ద్వారా వారణాసి, ప్రయాగ్‌రాజ్, అయోధ్యల్లో ఎనిమిది రోజుల పర్యటనలు చేపట్టేలా కార్యక్రమాన్ని రూపొందించారు. ప్రతినిధులు ఏడు బృందాలుగా ప్రయాణించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఒక్కో బృందానికి గంగ, యమున, సరస్వతి, సింధు, నర్మద, గోదావరి, కావేరి వంటి పవిత్ర నదుల పేర్లు పెట్టారు. తమిళనాడు, కాశీ కళలు, చేనేత, హస్తకళలు, వంటకాల స్టాళ్లు, నమో ఘాట్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు ఇందులో భాగంగా ఉన్నాయి. సాహిత్యం, ప్రాచీన గ్రంథాలు, తత్వశాస్త్రం, ఆధ్యాత్మికత, సంగీతం, నృత్యం, నాటకం, యోగా, ఆయుర్వేదం, ఆధునిక ఆవిష్కరణలపై విద్యాపరమైన మార్పిడి కార్యక్రమాలు కూడా జరిగాయి.
కాశీ తమిళ సంగమం 3.0 (ఫిబ్రవరి 2025)
మూడో విడత కార్యక్రమం 2025 ఫిబ్రవరి 15 నుంచి 24 వరకు జరిగింది. అగస్త్య మహర్షి వారసత్వాన్ని ప్రధానంగా చాటిచెప్పిన ఈ కార్యక్రమం భారతీయ జ్ఞాన సంప్రదాయాన్ని సమకాలీన చర్చలతో అనుసంధానించింది. తమిళనాడు నుంచి సుమారు 1,000 మంది ప్రతినిధులతోపాటు వివిధ కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు చెందిన మరో 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా, అయోధ్యలో కొత్తగా ప్రారంభించిన రామ మందిర సందర్శనలను తొలిసారిగా ఈ విడత కార్యక్రమంలో చేర్చారు. అగస్త్య మహర్షి రచనలపై సదస్సులు, వర్క్‌షాప్‌లు, పుస్తకావిష్కరణలతోపాటు కాశీలో ఆయనపై ప్రదర్శన నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. భారతీయ జ్ఞాన వ్యవస్థలను ఆధునిక జ్ఞాన వ్యవస్థలతో అనుసంధానించాలన్న జాతీయ విద్యా విధానం 2020 ప్రాధాన్యానికి అనుగుణంగా ఈ విడత సాగింది. 869 మందికి పైగా కళాకారులు, 190 స్థానిక జానపద, శాస్త్రీయ కళాబృందాలు ప్రదర్శనలు ఇచ్చాయి. దాదాపు 2 లక్షల మంది సందర్శించారు.
కాశీ తమిళ సంగమం 4.0 (డిసెంబర్ 2025)
2025 డిసెంబర్ 2 నుంచి 15 వరకు జరిగిన నాలుగో విడత కార్యక్రమం “తమిళ్ కర్కలామ్ - తమిళం నేర్చుకుందాం” ఇతివృత్తంపై దృష్టి సారించింది. తమిళనాడు నుంచి ఏడు వర్గాలకు చెందిన 1,400 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు. 50 పాఠశాలల్లో 1,500 మందికి పైగా విద్యార్థులకు ప్రాథమిక తమిళం నేర్పేందుకు శిక్షణ పొందిన 50 మంది తమిళ ఉపాధ్యాయులు, సమన్వయకర్తలు వారణాసికి రావడం ఈ విడత ప్రధాన విశేషం. తమిళ్ కర్పోమ్ కార్యక్రమం కింద కాశీకి చెందిన 300 మంది కళాశాల విద్యార్థులకు తమిళనాడులో తమిళ భాషా అధ్యయన పర్యటనలు నిర్వహించారు. రెండు ప్రాంతాల ఉమ్మడి సాంస్కృతిక, నాగరికతా వారసత్వాన్ని చాటిచెబుతూ తెన్‌కాశీ నుంచి కాశీ వరకు సేజ్ అగస్త్య వెహికల్ ఎక్స్‌పెడిషన్ కూడా నిర్వహించారు. ప్రతినిధుల కోసం భారతీయ రైల్వేలు ఏడు ప్రత్యేక రైళ్లను నడిపాయి. ప్రాచీన తమిళ గ్రంథం తొల్కాప్పియం అనువాదాలను నాలుగు భారతీయ భాషలు, ఆరు విదేశీ భాషల్లో విడుదల చేశారు. 2025 డిసెంబర్ 30న రామేశ్వరంలో జరిగిన ముగింపు సభతో ఈ విడత ముగిసింది.
ఉమ్మడి నాగరికతా వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ
భాష, సాహిత్యం, జ్ఞానం, ఉమ్మడి ఆచారాలు వివిధ ప్రాంతాల ప్రజలను అనుసంధానించిన భారత చిరకాల సాంస్కృతిక మార్పిడి సంప్రదాయాన్ని కాశీ తమిళ సంగమం ప్రతిబింబిస్తోంది. ప్రత్యక్ష పరిచయాలు, అభ్యసనం ద్వారా ప్రజలను ఒకచోట చేర్చి పరస్పర అవగాహనను పెంపొందించడం, తమిళనాడు, కాశీ మధ్య బంధాలను బలోపేతం చేయడం ఈ కార్యక్రమం లక్ష్యం.
తిరుక్కురళ్పై దృష్టి సారించిన ఐదో విడత, సంగమం సాధారణ కార్యక్రమ పరిధిని దాటి దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు, యువ విద్యార్థులకు ఈ అనుబంధాన్ని విస్తరిస్తోంది. భాషా, ప్రాంతీయ హద్దులకు అతీతంగా ప్రాచీన తమిళ గ్రంథ అధ్యయనాన్ని ప్రోత్సహించడం ద్వారా భారత సాహిత్య, తాత్విక వారసత్వాన్ని మరింత మందికి అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఉమ్మడి జ్ఞానం, సాంస్కృతిక అవగాహన, ప్రజల మధ్య సంబంధాల ద్వారా జాతీయ సమైక్యతను పెంపొందిస్తూ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని కాశీ తమిళ సంగమం ముందుకు తీసుకెళ్తోంది.
References
Ministry of Education
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2326535
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2332761
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2198004
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1877338
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1869678
https://kashitamil.iitm.ac.in/
https://kashitamil.iitm.ac.in/programs
https://kashitamil.iitm.ac.in/events
https://www.kts.cict.in/about
https://www.kts.cict.in/programme
https://www.kts.cict.in/partners
https://www.kts.cict.in/schedule
https://static.pib.gov.in/WriteReadData/specificdocs/documents/2025/feb/doc2025214502301.pdf
Prime Minister's Office
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2197770
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1877325
Vice President's Secretariat
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2197743
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2209893
Ministry of Railways
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2197516
Special Service and Features (PIB)
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1980376
PIB Backgrounders
https://static.pib.gov.in/WriteReadData/specificdocs/documents/2025/dec/doc2025121712401.pdf
https://static.pib.gov.in/WriteReadData/specificdocs/documents/2025/jun/doc202562561301.pdf
Click here to see pdf
****
(Explainer ID: 160902)
आगंतुक पटल : 5
Provide suggestions / comments