Technology
చిన్నతరహా జలవిద్యుత్ సామర్థ్య వినియోగం
సుస్థిరాభివృద్ధి కోసం ఇంధన భద్రత బలోపేతం
Posted On:
22 NOV 2026 5:19PM
నదులు, కాలువల్లో సహజంగా ప్రవహించే నీటితో చిన్నతరహా జలవిద్యుత్ ప్రాజెక్టులు స్వచ్ఛమైన, నమ్మకమైన విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి. భారత్‌లో 25 మెగావాట్ల వరకు సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులు ఈ కేటగిరిలోకి వస్తాయి. భౌగోళిక పరిస్థితుల కారణంగా భారీ ప్రాజెక్టుల నిర్మాణానికి, గ్రిడ్ విస్తరణకు పరిమితులు ఉన్న కొండ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాలకు ఇవి అనుకూలం. దేశవ్యాప్తంగా 7,133 ప్రాంతాల్లో 21,134 మెగావాట్ల చిన్న జలవిద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని గుర్తించారు. ఇందులో సుమారు నాలుగో వంతు సామర్థ్యాన్ని వినియోగిస్తున్నారు. ఈ ప్రాజెక్టులకు తక్కువ భూమి అవసరమవుతుంది. ప్రజలు నిర్వాసితులయ్యే పరిస్థితి చాలా తక్కువగా ఉంటుంది. ఇవి సుదీర్ఘకాలం పనిచేస్తాయి. ప్రభుత్వ విధానాల మద్దతు నిరంతరం కొనసాగితే, భారత్‌లో విద్యుత్ సేవలు తగినంతగా అందని ప్రాంతాల్లో విద్యుత్ అందుబాటును చిన్న జలవిద్యుత్ మెరుగుపరచగలదు.
పరిచయం
నీటి సహజ ప్రవాహంతో ఉత్పత్తి చేసే జలవిద్యుత్ ప్రపంచంలో అత్యంత నమ్మకమైన, చాలాకాలంగా వినియోగంలో ఉన్న పునరుత్పాదక ఇంధన వనరుల్లో ఒకటి. భారత్ ఇంధన రంగంలో మార్పులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో గ్రిడ్ స్థిరత్వం, ఇంధన భద్రత, ఆటంకాలను తట్టుకునే విద్యుత్ వ్యవస్థను నిర్ధారించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తోంది. జలవిద్యుత్ రోజంతా స్థిరమైన విద్యుత్‌ను అందించడంతోపాటు అవసరానికి అనుగుణంగా ఉత్పత్తిని సర్దుబాటు చేసుకునే వెసులుబాటును కల్పిస్తుంది. స్వచ్ఛ ఇంధన వనరుల వాటాను పెంచే దిశగా భారత్ వేగంగా ముందుకు సాగుతున్న తరుణంలో, సుస్థిర విద్యుత్ ఉత్పత్తికి జలవిద్యుత్ కీలక ఆధారంగా నిలుస్తోంది.
25 మెగావాట్ల వరకు స్థాపిత సామర్థ్యం ఉన్న చిన్న జలవిద్యుత్ (ఎస్‌హెచ్‌పీ) ప్రాజెక్టులు.. భారత్‌లో ఇంకా వినియోగంలోకి రాని జల వనరులను ఉపయోగించుకునేందుకు విస్తృత అవకాశాలను అందిస్తున్నాయి. హిమాలయ రాష్ట్రాలు, ఈశాన్య ప్రాంతం, దేశంలోని ఇతర ప్రాంతాల్లో గణనీయమైన అవకాశాలు ఉన్నందున, ఈ ప్రాజెక్టులు భారత్ పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యానికి ముఖ్యమైన తోడ్పాటు అందించగలవు. ఈ అవకాశాలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం చిన్న జలవిద్యుత్ అభివృద్ధిని ప్రోత్సహించేందుకు, పెట్టుబడులను ఆకర్షించేందుకు, వినియోగంలోకి రాని వనరులను ఉపయోగించుకునేందుకు వివిధ కార్యక్రమాలను చేపట్టింది. స్వచ్ఛ విద్యుత్ ఉత్పత్తిని విస్తరించడంతోపాటు మారుమూల, భౌగోళికంగా క్లిష్టమైన ప్రాంతాల్లో విద్యుత్ అందుబాటును మెరుగుపరచడం ఈ చర్యల లక్ష్యం.
విద్యుత్ ఉత్పత్తితోపాటు చిన్న జలవిద్యుత్ ప్రాజెక్టులు పలు అభివృద్ధి, ఆర్థిక ప్రయోజనాలను అందిస్తాయి. భారీ జలవిద్యుత్ ప్రాజెక్టులతో పోలిస్తే వీటికి సాధారణంగా తక్కువ భూమి అవసరమవుతుంది. పర్యావరణంపై ప్రభావం కూడా తక్కువగా ఉండవచ్చు. ఇవి స్థానిక పెట్టుబడులను ప్రోత్సహించగలవు, ఉపాధిని కల్పించగలవు. ప్రాంతీయ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయగలవు. మారుమూల ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలకు మద్దతు ఇవ్వగలవు. ఇతర పునరుత్పాదక ఇంధన వనరులకు తోడ్పడుతూ, దేశ ఇంధన వనరుల్లో వైవిధ్యాన్ని పెంచడం ద్వారా భారత్ ఇంధన భద్రత, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు చిన్న జలవిద్యుత్ దోహదపడగలదు.
మీకు తెలుసా?
భారత్‌లో భారీ, చిన్న జలవిద్యుత్ ప్రాజెక్టుల మధ్య ప్రధాన తేడాలు వాటి స్థాపిత సామర్థ్యం, పర్యవేక్షించే మంత్రిత్వ శాఖల పరిధికి సంబంధించినవి. 25 మెగావాట్ల వరకు స్థాపిత సామర్థ్యం ఉన్నవాటిని చిన్న జలవిద్యుత్ ప్రాజెక్టులు (ఎస్‌హెచ్‌పీ)గా నిర్వచించారు. ఇవి కొత్త, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ (ఎంఎన్ఆర్ఈ) పరిధిలో ఉంటాయి. 25 మెగావాట్లకు మించి సామర్థ్యం ఉన్న భారీ జలవిద్యుత్ ప్రాజెక్టులు విద్యుత్ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తాయి.
చిన్న జలవిద్యుత్ అభివృద్ధికి ప్రభుత్వ చర్యలు
చిన్న జలవిద్యుత్ ప్రాజెక్టులను ప్రోత్సహించే నోడల్ మంత్రిత్వ శాఖగా కొత్త, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ (ఎంఎన్ఆర్ఈ) వ్యవహరిస్తోంది. 2026–27 నుంచి 2030–31 ఆర్థిక సంవత్సరాల వరకు అమలు చేసేందుకు రూ. 2,584.60 కోట్ల వ్యయంతో స్మాల్ హైడ్రో పవర్ (ఎస్‌హెచ్‌పీ) డెవలప్మెంట్ స్కీమ్‌కు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదం తెలిపింది. సుమారు 1,500 మెగావాట్ల చిన్న జలవిద్యుత్ సామర్థ్యాన్ని అదనంగా సమకూర్చడం ఈ పథకం లక్ష్యం. ఆర్థిక సాయం, ప్రాజెక్టుల సన్నద్ధతకు మద్దతు, సాంకేతిక సామర్థ్యాల పెంపు ద్వారా కొండ ప్రాంతాలు, ఈశాన్య ప్రాంతాలు, సరిహద్దు ప్రాంతాలకు ప్రాధాన్యం ఇస్తుంది.
పథకం అమలుకు తోడ్పడేందుకు, ప్రాజెక్టులు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేసేందుకు, వివిధ ప్రాంతాల్లో భవిష్యత్తులో చేపట్టే ఎస్‌హెచ్‌పీ ప్రాజెక్టులు నిరంతరం సిద్ధంగా ఉండేలా చూసేందుకు పలు ప్రత్యేక చర్యలను ఇందులో పొందుపరిచారు. ముఖ్యంగా క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులు ఉన్న ప్రాంతాల్లో నిధులు, ప్రాజెక్టుల సన్నద్ధత, అమలుకు సంబంధించిన ప్రధాన అడ్డంకులను పరిష్కరించడంపై దృష్టి సారిస్తుంది. ఈ చర్యల ద్వారా ఎస్‌హెచ్‌పీ సామర్థ్యాన్ని మరింత వేగంగా, సమర్థంగా వినియోగంలోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఆర్థిక సాయం విధానం:
- ఈశాన్య రాష్ట్రాలు & అంతర్జాతీయ సరిహద్దు జిల్లాల్లో ప్రతి మెగావాట్‌కు రూ. 3.6 కోట్లు లేదా ప్రాజెక్టు వ్యయంలో 30%, ఈ రెండింటిలో ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని ఆర్థిక సాయంగా అందిస్తారు. ఒక్కో ప్రాజెక్టుకు గరిష్ఠ పరిమితి రూ. 30 కోట్లు.
- ఇతర ప్రాంతాల్లో ప్రాజెక్టు పరిమాణం, ప్రాంతాన్ని బట్టి ప్రతి మెగావాట్‌కు రూ. 2.4/1.78/2.054 కోట్లు లేదా ప్రాజెక్టు వ్యయంలో 20%, ఈ రెండింటిలో ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని ఆర్థిక సాయంగా అందిస్తారు. ఒక్కో ప్రాజెక్టుకు గరిష్ఠ పరిమితి రూ. 20 కోట్లు.
పెట్టుబడులు, ఆర్థిక ప్రభావం:
- చిన్న జలవిద్యుత్ రంగంలో సుమారు రూ. 15,000 కోట్ల పెట్టుబడులను ఈ పథకం ఆకర్షిస్తుందని అంచనా.
- దేశీయంగా తయారైన పరికరాలు, యంత్రాల వినియోగాన్ని కూడా ప్రోత్సహిస్తుంది. స్థానిక తయారీ, సరఫరా వ్యవస్థలకు ఊతమిస్తూ ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి తోడ్పడుతుంది.
భవిష్యత్తు ప్రాజెక్టుల రూపకల్పన, డీపీఆర్‌లకు మద్దతు:
- ఈ రంగం దీర్ఘకాలిక వృద్ధిని నిర్ధారించేందుకు కనీసం 200 ప్రాజెక్టులకు సమగ్ర ప్రాజెక్టు నివేదికలు (డీపీఆర్‌లు) సిద్ధం చేసేందుకు పథకం మద్దతు అందిస్తుంది. భవిష్యత్తులో చేపట్టే ప్రాజెక్టులను పకడ్బందీగా సిద్ధం చేయడంలో కేంద్ర, రాష్ట్ర సంస్థలకు తోడ్పడేందుకు ప్రత్యేకంగా రూ. 30 కోట్లు కేటాయించారు.
ఉపాధి కల్పన:
- నిర్మాణ దశలో సుమారు 51 లక్షల పనిదినాల మేర ఉపాధిని ఈ పథకం కల్పిస్తుందని అంచనా. అదనంగా, ముఖ్యంగా గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో ప్రాజెక్టులను నడపడం, వాటి నిర్వహణకు సంబంధించిన పనుల్లో స్థిరమైన ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది.
భారత్‌లో ఇంకా వినియోగంలోకి రాని చిన్న జలవిద్యుత్ సామర్థ్యాన్ని ఉపయోగించుకునే దిశగా ఎస్‌హెచ్‌పీ డెవలప్మెంట్ స్కీమ్‌కు ఆమోదం కీలక ముందడుగు. నిర్దిష్ట ఆర్థిక సాయం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సుస్థిరతను సమన్వయం చేస్తూ స్వచ్ఛ విద్యుత్ సామర్థ్యాన్ని బలోపేతం చేయనుంది. సేవలు తగినంతగా అందని ప్రాంతాల్లో అందరికీ అభివృద్ధి ఫలాలు అందేలా తోడ్పడనుంది.
సుస్థిర ఇంధన అభివృద్ధిలో చిన్న జలవిద్యుత్ ప్రాధాన్యం
భారత్‌లో స్వచ్ఛమైన, నమ్మకమైన, వికేంద్రీకృత విద్యుత్ ఉత్పత్తిని విస్తరించడంలో చిన్న జలవిద్యుత్ కీలక పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా మారుమూల, కొండ ప్రాంతాలకు అనుకూలమైన ఈ ప్రాజెక్టులు స్థానికంగా లభించే జల వనరులను ఉపయోగించి వినియోగ కేంద్రాలకు సమీపంలోనే విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి. దీనివల్ల విద్యుత్ అందుబాటు మెరుగుపడటంతోపాటు సుదీర్ఘ విద్యుత్ ప్రసార నెట్‌వర్క్‌లపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది, మొత్తం సామర్థ్యం పెరుగుతుంది.
- వికేంద్రీకృత, సమర్థ విద్యుత్ సరఫరా: డిమాండ్ ఉన్న ప్రాంతాలకు సమీపంలో ఉండే ఈ ప్రాజెక్టులు విద్యుత్ ప్రసార నష్టాలను తగ్గిస్తాయి, వోల్టేజీ స్థిరత్వాన్ని మెరుగుపరుస్తాయి. సరిహద్దు, కొండ ప్రాంతాలు సహా భౌగోళికంగా క్లిష్టమైన ప్రాంతాల్లో నమ్మకమైన విద్యుత్ సరఫరాను నిర్ధారిస్తాయి.
- స్వచ్ఛమైన, తక్కువ వ్యయంతో లభించే ఇంధన వనరు: ఇంధన వినియోగం, ఉద్గారాలు లేకుండా చిన్న జలవిద్యుత్ ప్రాజెక్టులు విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి. దీనివల్ల ఇవి సుస్థిరమైన, ఆర్థికంగా ఆచరణ సాధ్యమైన దీర్ఘకాలిక పరిష్కారంగా నిలుస్తాయి.
- గ్రామీణ అభివృద్ధికి ఊతం: విద్యుత్ సేవలు తగినంతగా అందని ప్రాంతాల్లో అందుబాటును మెరుగుపరచడం ద్వారా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ ప్రాజెక్టులు తోడ్పడతాయి, స్థానిక ఆర్థిక వృద్ధిని వేగవంతం చేస్తాయి.
- ఉపాధి, జీవనోపాధి కల్పన: నిర్మాణం, నిర్వహణ దశల్లో ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలను కల్పిస్తాయి. చిన్న పరిశ్రమలు, స్వయం ఉపాధిని కూడా ప్రోత్సహిస్తాయి.
- పర్యావరణ సుస్థిరత: అతి తక్కువ భూమి అవసరం, ప్రజలు నిర్వాసితులయ్యే పరిస్థితి చాలా తక్కువగా ఉండటంతో చిన్న జలవిద్యుత్ ప్రాజెక్టుల పర్యావరణ, సామాజిక ప్రభావాలు పరిమితంగా ఉంటాయి. సుదీర్ఘకాలం పనిచేయడం కూడా వీటి సుస్థిరతకు తోడ్పడుతుంది.
ఇంధన భద్రత, సుస్థిర అభివృద్ధిని సమన్వయం చేసే సమతుల్య పరిష్కారాన్ని ఎస్‌హెచ్‌పీ అందిస్తుంది. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో నమ్మకమైన విద్యుత్‌ను రోజంతా అందించడం, ఆటంకాలను తట్టుకునేలా గ్రిడ్‌ను బలోపేతం చేయడం ద్వారా అందరికీ అభివృద్ధి ఫలాలు అందేలా ఈ ప్రాజెక్టులు గణనీయమైన తోడ్పాటు అందిస్తాయి. పర్యావరణ సుస్థిరతతోపాటు సామాజిక, ఆర్థిక ప్రయోజనాలను అందించగల సామర్థ్యం కారణంగా భారత్ స్వచ్ఛ ఇంధన పరివర్తనలో ఇవి కీలక భాగంగా నిలుస్తాయి.
భారత్‌లో చిన్నతరహా జలవిద్యుత్ సామర్థ్యం, అవకాశాలు

భారత్ స్వచ్ఛ ఇంధన పరివర్తనలో ఎస్‌హెచ్‌పీ కీలకమైన, నమ్మకమైన భాగంగా ఎదుగుతోంది. కొండ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాలు, క్లిష్టమైన భూభాగాలకు ఇది ప్రత్యేకంగా అనుకూలం. ఇలాంటి ప్రాంతాల్లో వికేంద్రీకృత ఉత్పత్తి ద్వారా సుస్థిర విద్యుత్‌ను అందించవచ్చు, విద్యుత్ అందుబాటును మెరుగుపరచవచ్చు. స్థానిక జీవనోపాధికి మద్దతు ఇవ్వవచ్చు. భారత్‌లో గుర్తించిన 7,133 ప్రాంతాల్లో 21,134 మెగావాట్ల ఎస్‌హెచ్‌పీ సామర్థ్యం ఉంది. 2026 సెప్టెంబర్ 30 నాటికి సుమారు 5,182 మెగావాట్లను, అంటే దాదాపు 25% సామర్థ్యాన్ని ఇప్పటికే వినియోగంలోకి తీసుకొచ్చారు. ఇది స్థిరమైన పురోగతిని సూచిస్తోంది. మిగిలిన 15,952 మెగావాట్ల సామర్థ్యం, నిర్దిష్ట విధాన మద్దతు, ప్రభుత్వ, ప్రైవేటు రంగాల సహకారంతో అభివృద్ధిని వేగవంతం చేసేందుకు విస్తృత అవకాశాన్ని అందిస్తోంది.

ఈ సామర్థ్యం ప్రాంతాలవారీగా విస్తరించి ఉండటం దేశ భౌగోళిక వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తోంది. వివిధ ప్రాంతాలకు ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తోంది. ఉత్తర ప్రాంతంలో, ముఖ్యంగా పర్వత ప్రాంతాల్లో 8,030 మెగావాట్ల ఎస్‌హెచ్‌పీ సామర్థ్యం ఉంది. ఈశాన్య ప్రాంతంలో 2,995 మెగావాట్ల సామర్థ్యం ఉంది. ముఖ్యంగా కొండ ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లో విస్తరణకు ఇది కీలక అవకాశాన్ని అందిస్తోంది. మెరుగైన నదీ వ్యవస్థలు, మౌలిక సదుపాయాల తోడ్పాటుతో దక్షిణ ప్రాంతంలో 5,490 మెగావాట్ల ఎస్‌హెచ్‌పీ సామర్థ్యం ఉంది. పశ్చిమ ప్రాంతంలో 2,912 మెగావాట్లు, తూర్పు ప్రాంతంలో 1,707 మెగావాట్ల సామర్థ్యం ఉంది. తూర్పు ప్రాంతంలోని గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో మంచి అవకాశాలు ఉన్నాయి.
వివిధ ప్రాంతాల్లో విస్తరించిన ఈ సామర్థ్యం, ఆయా ప్రాంతాలకు అనుగుణంగా సమతుల్య వ్యూహాన్ని అనుసరించేందుకు వీలు కల్పిస్తోంది. ఉత్తర, ఈశాన్య ప్రాంతాల్లో ఇంకా వినియోగంలోకి రాని వనరులు విస్తృతంగా ఉన్నాయి. పటిష్ఠ మౌలిక సదుపాయాలు ఉన్న దక్షిణ, పశ్చిమ ప్రాంతాలు ప్రాజెక్టులను వేగంగా అమలు చేసేందుకు మెరుగైన స్థితిలో ఉన్నాయి. ఇటీవల ఆమోదించిన స్మాల్ హైడ్రో పవర్ డెవలప్మెంట్ స్కీమ్ ద్వారా నిర్దిష్ట ప్రోత్సాహకాలు, సరళీకృత విధానాలు, మెరుగైన ఆర్థిక సాయంతో ఈ విభిన్న ప్రాంతాల సామర్థ్యాన్ని వినియోగించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది.
అన్ని ప్రాంతాలకు ప్రాధాన్యం ఇస్తూ, లక్ష్యంపై దృష్టి సారించిన విధానాన్ని అనుసరించడం ద్వారా చిన్న తరహా జలవిద్యుత్ ప్రయోజనాలను పూర్తిస్థాయిలో పొందే దిశగా భారత్ ముందుకు సాగుతోంది. తద్వారా ఇంధన భద్రతను బలోపేతం చేయడం, సమ్మిళిత వృద్ధిని ప్రోత్సహించడం, సుస్థిరమైన, స్వావలంబనతో కూడిన ఇంధన భవిష్యత్తు లక్ష్యాన్ని సాధించడం సాధ్యమవుతుంది.
ఉత్తర ప్రాంతం
పర్వత భూభాగం, ఏడాది పొడవునా ప్రవహించే నదులు, అనుకూల జల పరిస్థితుల కారణంగా భారత్ ఎస్‌హెచ్‌పీ రంగానికి ఉత్తర ప్రాంతం కీలక ఆధారంగా నిలుస్తోంది. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో అభివృద్ధికి ఇది ఎంతో ప్రాధాన్యం కలిగి ఉంది. ఈ ప్రాంత సామర్థ్యంలో హిమాచల్ ప్రదేశ్ (3,460 మెగావాట్లు), ఉత్తరాఖండ్ (1,664 మెగావాట్లు), జమ్మూ & కశ్మీర్ (1,312 మెగావాట్లు) ప్రధాన వాటా కలిగి ఉన్నాయి. లద్దాఖ్ (396 మెగావాట్లు) వ్యూహాత్మక ప్రాధాన్యాన్ని కూడా కలిగి ఉంది. ఇంత బలమైన వనరులు ఉన్నప్పటికీ సామర్థ్య వినియోగం మోస్తరు స్థాయిలోనే ఉంది. ఇది ఇంకా వినియోగంలోకి తీసుకురాగల గణనీయమైన సామర్థ్యం ఉందని సూచిస్తోంది.
మీకు తెలుసా?
భారీ ఆనకట్టలు నిర్మించకుండా, నదీ జలాల సహజ ప్రవాహాన్ని ఉపయోగించి రన్-ఆఫ్-ది-రివర్ ప్రాజెక్టులు విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి. కొంత నీటిని కాలువలు, పైపుల ద్వారా మళ్లించి టర్బైన్లను నడుపుతారు. ఆ నీటిని తిరిగి నదిలోకి వదులుతారు. దీంతో పర్యావరణంపై ప్రభావం అతి తక్కువగా ఉంటుంది.

ఈశాన్య ప్రాంతం
ఈశాన్య ప్రాంతంలో వృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కొండ ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లో పునరుత్పాదక విద్యుత్ విస్తరణకు ఇది ఎంతో కీలకం.
ప్రాంతీయ సామర్థ్యంలో అరుణాచల్ ప్రదేశ్ (2,065 మెగావాట్లు) అత్యధిక వాటా కలిగి ఉంది. ఆ తర్వాత మేఘాలయ (230 మెగావాట్లు), అస్సాం (202 మెగావాట్లు), నాగాలాండ్ (182 మెగావాట్లు), మిజోరం (169 మెగావాట్లు), మణిపుర్ (100 మెగావాట్లు), త్రిపుర (47 మెగావాట్లు) ఉన్నాయి.

ఈ ప్రాంతంలో ఎస్‌హెచ్‌పీ అభివృద్ధి, ముఖ్యంగా మారుమూల, గిరిజన ప్రాంతాల్లో వికేంద్రీకృత, గ్రిడ్‌తో అనుసంధానం అవసరం లేని విద్యుత్ వ్యవస్థలకు మంచి అవకాశాలను అందిస్తోంది. విద్యుత్ అందుబాటును గణనీయంగా మెరుగుపరచగలదు, స్థానిక ఉపాధిని ప్రోత్సహించగలదు, సంప్రదాయ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించగలదు. నిర్దిష్ట విధాన చర్యలు, మెరుగైన అనుసంధానం, స్థానిక ప్రజల ఆధ్వర్యంలో సాగే నమూనాలతో భారత్ ఎస్‌హెచ్‌పీ రంగం వృద్ధికి ఈశాన్య ప్రాంతం ప్రధాన చోదకశక్తిగా ఎదగగలదు.
దక్షిణ ప్రాంతం
పటిష్ఠ మౌలిక సదుపాయాలు, స్థిరపడిన ఇంధన వ్యవస్థలు, అనుకూల నదీ పరీవాహక ప్రాంతాల తోడ్పాటుతో ఎస్‌హెచ్‌పీ అభివృద్ధిలో దక్షిణ ప్రాంతం కీలక పాత్ర పోషిస్తోంది. 3,726 మెగావాట్ల సామర్థ్యంతో కర్ణాటక అగ్రస్థానంలో ఉంది. ఇది ప్రాంతీయ సామర్థ్యంలో దాదాపు 68%. ఆ తర్వాత కేరళం 647 మెగావాట్లు, తమిళనాడు 604 మెగావాట్లతో ఉన్నాయి. ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ సామర్థ్య వినియోగం ఎక్కువగా ఉంది. ఇది సమర్థ ప్రాజెక్టు అమలు, పటిష్ఠ గ్రిడ్ అనుసంధానాన్ని ప్రతిబింబిస్తోంది.

పటిష్ఠ మౌలిక సదుపాయాల పునాదితో, ఉన్న వనరులను మరింత సమర్థంగా వినియోగించుకోవడం, ఇతర స్వచ్ఛ ఇంధన వనరులతో అనుసంధానించడం ద్వారా మరింత విస్తరించేందుకు దక్షిణ ప్రాంతం మెరుగైన స్థితిలో ఉంది. కొండ ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లో వృద్ధికి తోడ్పడుతూ భారత్ ఎస్‌హెచ్‌పీ విస్తరణలో స్థిరత్వాన్ని అందించే పాత్రను కొనసాగిస్తుంది.
తూర్పు ప్రాంతం
తూర్పు ప్రాంతంలో ఎస్‌హెచ్‌పీ సామర్థ్యం మోస్తరుగా ఉన్నప్పటికీ వ్యూహాత్మకంగా ముఖ్యమైనది. ముఖ్యంగా గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో వికేంద్రీకృత అభివృద్ధికి ఇది ప్రాధాన్యం కలిగి ఉంది.
బిహార్ (527 మెగావాట్లు), పశ్చిమ బెంగాల్ (392 మెగావాట్లు), ఒడిశా (286 మెగావాట్లు) ఈ ప్రాంతంలో ముందున్నాయి. ఆ తర్వాత సిక్కిం (267 మెగావాట్లు), ఝార్ఖండ్ (228 మెగావాట్లు) ఉన్నాయి. ఈ ప్రాంతంలోని నదీ వ్యవస్థలు, భౌగోళిక పరిస్థితులు చిన్న జలవిద్యుత్ ప్రాజెక్టులకు అనుకూలంగా ఉన్నాయి.

ఈ ప్రాంతంలో ఎస్‌హెచ్‌పీ విస్తరణ ద్వారా స్థానికంగా విద్యుత్ అందుబాటు, వ్యవసాయ ఉత్పాదకత, గ్రామీణ జీవనోపాధిని మెరుగుపరచవచ్చు, సమ్మిళిత అభివృద్ధికి తోడ్పడవచ్చు. నిర్దిష్ట చర్యలు, మెరుగైన నిధుల సమీకరణ విధానాలు, వికేంద్రీకృత అమలు నమూనాలతో తూర్పు ప్రాంతం జాతీయ స్థాయి వృద్ధికి తోడ్పడగలదు.
పశ్చిమ ప్రాంతం
విస్తృత సాగునీటి వ్యవస్థలు, కాలువల ఆధారిత మౌలిక సదుపాయాలతో పశ్చిమ ప్రాంతం ఎస్‌హెచ్‌పీ అభివృద్ధికి ప్రత్యేక అవకాశాలను అందిస్తోంది.
1,098.20 మెగావాట్ల సామర్థ్యంతో ఛత్తీస్‌గఢ్ ఈ ప్రాంతంలో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత మధ్యప్రదేశ్ (820 మెగావాట్లు), మహారాష్ట్ర (786 మెగావాట్లు) ఉన్నాయి. మొత్తం ప్రాంతీయ సామర్థ్యం 2,912 మెగావాట్లు కాగా, స్థాపిత సామర్థ్యం 730 మెగావాట్లుగా ఉంది. మహారాష్ట్ర, గుజరాత్‌లలో సామర్థ్య వినియోగం తులనాత్మకంగా ఎక్కువగా ఉంది. ఇతర రాష్ట్రాల్లో విస్తరణకు అవకాశాలు ఉన్నాయి.

కాలువలు, ఆనకట్టల దిగువ భాగంలో ఏర్పాటు చేసే ప్రాజెక్టులపై దృష్టి పెట్టడం ద్వారా తక్కువ వ్యయంతో ఎస్‌హెచ్‌పీ సామర్థ్యాన్ని విస్తరించవచ్చు. ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాలను వినియోగించుకోవడం, వినూత్న అమలు నమూనాలను ప్రోత్సహించడం ద్వారా పశ్చిమ ప్రాంతం వికేంద్రీకృత పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిని బలోపేతం చేయగలదు. కొండ ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లో పురోగతితోపాటు సమతుల్యమైన, వైవిధ్యంతో కూడిన ఎస్‌హెచ్‌పీ వృద్ధిని నిర్ధారించడంలో ఇది కీలక పాత్ర పోషించగలదు.
మీకు తెలుసా?
సాగునీటి కాలువల్లో నీరు ఎత్తు నుంచి కిందికి పడే ప్రదేశాలు లేదా ఆనకట్టలు, బ్యారేజీలకు దిగువన ఏర్పాటు చేసే ఎస్‌హెచ్‌పీ ప్రాజెక్టులు నీటిమట్టాల మధ్య ఎత్తులో ఉండే తేడాను విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగిస్తాయి. నీటిని విద్యుత్ కేంద్రానికి మళ్లించి, విద్యుత్ ఉత్పత్తి తర్వాత తిరిగి ప్రధాన కాలువలోకి వదులుతారు. ఈ విధంగా ఇప్పటికే ఉన్న జల మౌలిక సదుపాయాలను వినియోగించుకుంటారు.
ముగింపు
దేశ స్వచ్ఛ ఇంధన ప్రయాణంలో చిన్న తరహా జలవిద్యుత్ ప్రత్యేక ప్రయోజనాలను వినియోగించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నిర్ణయాత్మక విధాన చర్యగా స్మాల్ హైడ్రో పవర్ డెవలప్మెంట్ స్కీమ్ (2026–31) నిలుస్తోంది. రూ. 2,584.60 కోట్ల వ్యయంతో 1,500 మెగావాట్ల కొత్త సామర్థ్యాన్ని సమకూర్చడం లక్ష్యంగా పెట్టుకున్న ఈ పథకం, నమ్మకమైన, వికేంద్రీకృత విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యం ఇస్తుంది. ముఖ్యంగా ఇతర పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగానికి పరిమితులు ఉన్న క్లిష్టమైన భూభాగాలపై దృష్టి సారిస్తుంది.
విద్యుత్ సామర్థ్యాన్ని పెంచడంతోపాటు విస్తృత అభివృద్ధి ఫలితాలను అందించేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. నిర్దిష్ట ఆర్థిక సాయం, సులభతరమైన ప్రాజెక్టు సన్నద్ధత, దేశీయ తయారీ ప్రోత్సాహాన్ని సమన్వయం చేయడం ద్వారా ప్రైవేటు పెట్టుబడులకు ఊతమిస్తుంది, దేశీయ సరఫరా వ్యవస్థలను బలోపేతం చేస్తుంది, మారుమూల, గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది. ఈ సమగ్ర విధానం సమ్మిళిత వృద్ధి, ప్రాంతాల మధ్య సమాన అభివృద్ధికి చిన్న జలవిద్యుత్‌ను సమర్థ సాధనంగా నిలుపుతుంది.
ఇంధన రంగంలో మరింత స్వావలంబన, సుస్థిర భవిష్యత్తు దిశగా భారత్ ముందుకు సాగుతున్న తరుణంలో, పర్యావరణ బాధ్యతను సామాజిక, ఆర్థిక పురోగతితో సమన్వయం చేసే సమతుల్య పరిష్కారాన్ని చిన్న జలవిద్యుత్ అందిస్తోంది. ఈ ప్రత్యేక ప్రోత్సాహంతో విద్యుత్ సేవలు తగినంతగా అందని ప్రాంతాల్లో ఈ పథకం వెలుగులు నింపుతుందని, ఆటంకాలను తట్టుకునే గ్రిడ్ సామర్థ్యాన్ని పెంచుతుందని, మరింత స్వచ్ఛమైన, బలమైన, స్వావలంబన కలిగిన భారత్ నిర్మాణానికి గణనీయంగా తోడ్పడుతుందని కేంద్ర ప్రభుత్వం విశ్వసిస్తోంది.
References
Ministry of New and Renewable Energy (MNRE)
NITI Aayog
Central Electricity Authority
Others
click to see pdf
***
(Explainer ID: 160890)
आगंतुक पटल : 14
Provide suggestions / comments