Energy & Environment

నూతన శకంలోకి భారత సౌరశక్తి రంగం

Posted On: 17 NOV 2026 9:33AM

గత దశాబ్దకాలంలో భారత సౌరశక్తి రంగం గణనీయంగా విస్తరించింది. దేశ ఇంధన రంగ పరివర్తనలో కీలక చోదకశక్తిగా అవతరించింది. స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెరగడం, దేశీయ తయారీ విస్తరణ, వివిధ ప్రాంతాల్లో సౌర విద్యుత్ వినియోగం పెరుగుతుండటం ఈ రంగం సాధిస్తున్న పురోగతికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ప్రభుత్వ విధానపరమైన మద్దతు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రజల భాగస్వామ్యం ఈ మార్పును మరింత వేగవంతం చేస్తున్నాయి. ఇంధన భద్రతను బలోపేతం చేయడం, ఆర్థికాభివృద్ధికి తోడ్పడటం, వాతావరణ మార్పులను ఎదుర్కొనే చర్యలను ముందుకు తీసుకెళ్లడంలో సౌరశక్తి కీలక పాత్ర పోషిస్తోంది. నవంబర్ 2 నుంచి 5 వరకు న్యూఢిల్లీలో నిర్వహించిన భారత్ పునరుత్పాదక ఇంధన సదస్సు, ప్రదర్శన (బీఆర్ఈఎస్ఈ) 2026లో జరిగిన విస్తృత చర్చల్లో ఈ పరిణామాలు కూడా ప్రధానంగా ప్రస్తావనకు వచ్చాయి.

 

భారత్‌లో సౌరశక్తి రంగం పురోగతి

దశాబ్దం క్రితం భారత విద్యుత్ ఉత్పత్తిలో సౌరశక్తి వాటా చాలా తక్కువగా ఉండేది. ప్రస్తుతం దేశ పునరుత్పాదక ఇంధన స్థాపిత సామర్థ్యంలో సౌరశక్తిదే అత్యధిక వాటా. 2014లో కేవలం 2.82 గిగావాట్లుగా ఉన్న సౌర విద్యుత్ స్థాపిత సామర్థ్యం సుమారు 62 రెట్లు పెరిగి, 2026 అక్టోబర్ 31 నాటికి దాదాపు 175 గిగావాట్లకు చేరుకుంది.

 

ప్రభుత్వ విధానాల మద్దతు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, తయారీ రంగ విస్తరణ, ప్రజల భాగస్వామ్యం ఈ మార్పున‌కు దోహదపడుతున్నాయి. సోలార్ పార్కులు, భవనాల పైకప్పులపై సౌర విద్యుత్ వ్యవస్థలు, సౌరశక్తితో పనిచేసే వ్యవసాయ పంపుల వంటి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా సౌర విద్యుత్ వినియోగాన్ని వేగవంతం చేస్తున్నాయి. భారత్‌లో విస్తరిస్తున్న పునరుత్పాదక ఇంధన రంగం బీఆర్ఈఎస్ఈ 2026 సదస్సులో ప్రధాన అంశంగా నిలిచింది. స్వచ్ఛ ఇంధన రంగంలో సహకారం, పెట్టుబడులు, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ప్రపంచవ్యాప్తంగా వివిధ భాగస్వామ్య వర్గాలు ఈ సదస్సులో పాల్గొన్నాయి.

 

న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నవంబర్ 2 నుంచి 5 వరకు భారత్ పునరుత్పాదక ఇంధన సదస్సు, ప్రదర్శన 2026ను నిర్వహించారు. ‘పెట్టుబడి పెట్టండి. ఆవిష్కరించండి. స్ఫూర్తినివ్వండి’ అనే ఇతివృత్తంతో జరిగిన ఈ కార్యక్రమంలో 130కి పైగా దేశాల నుంచి విధాన రూపకర్తలు, పరిశ్రమల ప్రముఖులు, పెట్టుబడిదారులు, పరిశోధకులు పాల్గొన్నారు. తొమ్మిదో అంతర్జాతీయ సౌర కూటమి సమావేశం, నాలుగో అంతర్జాతీయ హరిత హైడ్రోజన్ సదస్సుతోపాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉన్నత స్థాయి చర్చలు, మంత్రుల సమావేశాలు, వ్యాపార సంబంధిత కార్యక్రమాలకు సదస్సు వేదికగా నిలిచింది. 400కు పైగా సంస్థల భాగస్వామ్యంతో ప్రదర్శనను కూడా నిర్వహించారు. భాగస్వామ్య రాష్ట్రాలుగా 13 రాష్ట్రాలు పాల్గొని తమ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని, పెట్టుబడి అవకాశాలను ప్రదర్శించాయి. పునరుత్పాదక ఇంధన రంగంలోని పది వాస్తవ సవాళ్లకు పరిష్కారాలను ప్రతిపాదించిన భారత్ పునరుత్పాదక ఇంధన హ్యాకథాన్-2026 విజేతలను సదస్సులో సత్కరించారు.

 

భారత సౌరశక్తి రంగం సాధించిన పురోగతి స్పష్టమైన ఫలితాల రూపంలో కనిపిస్తోంది. 2025లో భారత్ కొత్తగా 37 గిగావాట్ల సౌర విద్యుత్ సామర్థ్యాన్ని జోడించి, వార్షిక సామర్థ్య పెరుగుదలలో అమెరికాను అధిగమించింది. ప్రపంచంలో సౌర విద్యుత్ సామర్థ్యం అత్యంత వేగంగా విస్తరిస్తున్న మార్కెట్లలో భారత్ రెండో స్థానానికి చేరుకుంది. ప్రపంచ స్వచ్ఛ ఇంధన పరివర్తనలో భారత్‌కు పెరుగుతున్న ప్రాధాన్యాన్ని ఇది తెలియజేస్తోంది.

 

సౌరశక్తి విస్తరణలో దశాబ్దకాల పురోగతి

బలమైన విధానపరమైన వ్యవస్థ భారత సౌరశక్తి రంగ విస్తరణకు పునాదులు వేసింది. జాతీయ సౌర మిషన్ (2010), సోలార్ పార్కుల పథకం, గ్రీన్ ఎనర్జీ కారిడార్ కార్యక్రమం, పోటీతత్వ బిడ్డింగ్ విధానం ఇందులో కీలక పాత్ర పోషించాయి. ఈ కార్యక్రమాలన్నీ కలిసి దేశంలో భారీ స్థాయిలో సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటును వేగవంతం చేశాయి.

 

దేశవ్యాప్తంగా సౌర విద్యుత్ సామర్థ్యం

విభిన్న భౌగోళిక ప్రాంతాలు, వాతావరణ పరిస్థితుల్లో సౌర విద్యుత్ ప్రాజెక్టులు విస్తరిస్తున్నాయి. దేశంలో మొత్తం స్థాపిత సౌర విద్యుత్ సామర్థ్యంలో రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాలు గణనీయమైన వాటాను కలిగి ఉన్నాయి. హైబ్రిడ్ ప్రాజెక్టుల్లోని సౌర విద్యుత్ సామర్థ్యంతో కలిపి భారీ సౌర విద్యుత్ ప్రాజెక్టుల స్థాపిత సామర్థ్యం 133 గిగావాట్లుగా ఉంది. రాజస్థాన్‌లోని భడ్లా సోలార్ పార్క్, కర్ణాటకలోని పావగడ సోలార్ పార్క్, ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, కర్నూలు సోలార్ పార్కులు, మధ్యప్రదేశ్‌లోని రేవా అల్ట్రా మెగా సోలార్ పార్క్ దేశంలోని ప్రధాన సౌర విద్యుత్ ప్రాజెక్టుల్లో ఉన్నాయి. విద్యుత్ గ్రిడ్‌కు అనుసంధానించిన పైకప్పు సౌర విద్యుత్ వ్యవస్థల సామర్థ్యం మరో 34.97 గిగావాట్లుగా ఉంది. మిగిలిన సామర్థ్యం గ్రిడ్‌తో అనుసంధానం లేని సౌర విద్యుత్ వ్యవస్థల నుంచి లభిస్తోంది. హైబ్రిడ్ ప్రాజెక్టుల్లో సౌరశక్తిని బ్యాటరీ నిల్వ వ్యవస్థలు లేదా ఇతర విద్యుత్ వనరులతో అనుసంధానిస్తారు. గ్రిడ్ సదుపాయం లేని ప్రాంతాలకు ఆఫ్‌గ్రిడ్ వ్యవస్థల ద్వారా విద్యుత్ సరఫరా చేస్తారు.

 

ఇటీవలి సంవత్సరాల్లో రికార్డు స్థాయి వృద్ధి

గత కొన్నేళ్లలో సౌర విద్యుత్, శిలాజేతర ఇంధన సామర్థ్యంలో భారత్ గణనీయమైన పెరుగుదలను నమోదు చేసింది. స్వచ్ఛ ఇంధన రంగం వేగంగా విస్తరిస్తోందనడానికి ఈ పురోగతి నిదర్శనం.

- 2025–26 ఆర్థిక సంవత్సరంలో భారత్ కొత్తగా 44.61 గిగావాట్ల సౌర విద్యుత్ సామర్థ్యాన్ని జోడించింది. అంతకుముందు 2024–25లో నమోదైన 23.83 గిగావాట్లతో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు.

- ప్రస్తుత 2026–27 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 24.29 గిగావాట్ల సౌర విద్యుత్ సామర్థ్యం అదనంగా అందుబాటులోకి వచ్చింది. గత ఆర్థిక సంవత్సరానికి సమానమైన వేగంతో విస్తరణ కొనసాగుతోంది.

- సౌర విద్యుత్ మాడ్యూళ్ల దేశీయ తయారీ సామర్థ్యం 2014లో 2.3 గిగావాట్లుగా ఉండగా, 2026 మార్చి 31 నాటికి సుమారు 172 గిగావాట్లకు పెరిగింది. 2026 జూన్ నాటికి ఇది 192 గిగావాట్లకు చేరుకుంది.

- 2026 సెప్టెంబర్ 30 నాటికి మొత్తం శిలాజేతర ఇంధన స్థాపిత సామర్థ్యం 308.03 గిగావాట్లకు చేరుకుంది. ఇందులో పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 299.25 గిగావాట్లు, అణు విద్యుత్ సామర్థ్యం 8.78 గిగావాట్లు.

- 2025-26 ఆర్థిక సంవత్సరంలో శిలాజేతర ఇంధన సామర్థ్యం రికార్డు స్థాయిలో 55.29 గిగావాట్లు పెరిగింది.

- 2025 జూలై 29న దేశ విద్యుత్ డిమాండ్‌లో 51.5 శాతాన్ని పునరుత్పాదక ఇంధన వనరులు తీర్చాయి. ఇప్పటివరకు నమోదైన అత్యధిక నెలవారీ వాటా ఇదే.

 

సౌరశక్తి విస్తరణకు విధానపరమైన వ్యవస్థ

స్థిరమైన విధానపరమైన వ్యవస్థ, పోటీతత్వ బిడ్డింగ్ విధానాలు, దీర్ఘకాలిక లక్ష్యాలు దేశంలో భారీ స్థాయిలో సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు అనుకూల వాతావరణాన్ని సృష్టించాయి. పరస్పరం అనుబంధంగా పనిచేసే పలు చర్యలు భారత సౌరశక్తి రంగ విస్తరణకు తోడ్పడ్డాయి. వీటిని ప్రధానంగా ఐదు అంశాలుగా విభజించవచ్చు.

 

దార్శనికత రూపకల్పన: వాతావరణ లక్ష్యాలు, దీర్ఘకాలిక ప్రణాళికలు

గ్లాస్గోలో జరిగిన కాప్26 సదస్సులో భారత్ ‘పంచామృత’ లక్ష్యాలను ప్రకటించింది. 2030 నాటికి 500 గిగావాట్ల శిలాజేతర ఇంధన సామర్థ్యాన్ని సాధించడం, 2070 నాటికి నికర సున్నా ఉద్గారాల స్థాయికి చేరుకోవడం ఈ లక్ష్యాల్లో ఉన్నాయి. పారిస్ ఒప్పందం కింద భారత్ సవరించిన జాతీయ స్థాయి కట్టుబాట్లలో కూడా ఈ లక్ష్యాలు ప్రతిబింబించాయి.

 

ఈ ప్రయత్నాలకు అనుబంధంగా ‘మిషన్ లైఫ్’ (పర్యావరణ హిత జీవనశైలి) కార్యక్రమం సుస్థిర వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. పర్యావరణ పరిరక్షణకు అనుగుణమైన విధానాలను ప్రజలు తమ రోజువారీ జీవితంలో అనుసరించేలా ప్రోత్సహిస్తోంది.

 

డిమాండ్ పెంపు: జాతీయ మిషన్లు, పునరుత్పాదక విద్యుత్ కొనుగోలు బాధ్యతలు

సౌరశక్తి రంగం అభివృద్ధిలో స్థిరమైన, నిరంతర డిమాండ్ కీలక పాత్ర పోషించింది. జాతీయ సౌర మిషన్ దీర్ఘకాలిక సామర్థ్య లక్ష్యాలను నిర్దేశించి, దేశంలో సౌర విద్యుత్ వినియోగ విస్తరణకు తొలి దశలో ఊతమిచ్చింది.

 

పునరుత్పాదక విద్యుత్ కొనుగోలు బాధ్యతలు (ఆర్‌పీఓ) విద్యుత్ పంపిణీ సంస్థలు, ఇతర సంబంధిత సంస్థలు తమ విద్యుత్ అవసరాల్లో నిర్దిష్ట శాతాన్ని పునరుత్పాదక వనరుల నుంచి కొనుగోలు చేయాలని నిర్దేశిస్తున్నాయి. ఈ విధానం ప్రాజెక్టుల అభివృద్ధిదారులు, పెట్టుబడిదారులకు దీర్ఘకాలిక మార్కెట్‌పై భరోసా కల్పిస్తోంది. పునరుత్పాదక విద్యుత్ వినియోగాన్ని కూడా ప్రోత్సహిస్తోంది. 2029-30 వరకు ఆర్‌పీఓ లక్ష్యాలను ప్రభుత్వం ప్రకటించింది. 2026-27 సంవత్సరానికి ఈ లక్ష్యాన్ని 35.95 శాతంగా నిర్దేశించింది.

 

విద్యుత్ సంస్థలు, భారీ ప్రాజెక్టుల అభివృద్ధిదారులకే పరిమితం కాకుండా ఇతర వర్గాల్లోనూ సౌర విద్యుత్‌కు డిమాండ్ పెరుగుతోంది. పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజ్లీ యోజన ద్వారా గృహాల్లో పైకప్పు సౌర విద్యుత్ వ్యవస్థల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నారు. ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్షా ఏవం ఉత్థాన్ మహాభియాన్ (పీఎం-కుసుమ్) ద్వారా వ్యవసాయ రంగంలో సౌర విద్యుత్ పంపుల వినియోగం, వ్యవసాయ విద్యుత్ ఫీడర్ల సౌరీకరణకు మద్దతు అందిస్తున్నారు. ఈ కార్యక్రమాలు సౌర విద్యుత్ మార్కెట్‌ను విస్తరించడంతోపాటు వినియోగదారులు, రైతులు, వ్యాపార సంస్థలు, విద్యుత్ సరఫరా సంస్థల భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తున్నాయి.

 

వ్యయాల తగ్గింపు: పోటీతత్వ బిడ్డింగ్, విద్యుత్ ధరల నిర్ణయం

గత దశాబ్దకాలంలో సౌర విద్యుత్ రంగంలో చోటుచేసుకున్న ప్రధాన పరిణామాల్లో విద్యుత్ టారిఫ్‌లు తగ్గడం ఒకటి. ఈ-రివర్స్ వేలం విధానంలో పోటీతత్వ బిడ్డింగ్ ద్వారా ఇది సాధ్యమైంది. ఈ విధానంలో ప్రాజెక్టుల అభివృద్ధిదారులు అత్యంత తక్కువ ధరకు విద్యుత్ సరఫరా చేసేందుకు పోటీపడతారు.

 

ఈ పారదర్శక ధరల నిర్ణయ విధానాన్ని విస్తృతంగా అమలు చేయడంలో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) వంటి విద్యుత్ కొనుగోలు సంస్థలు కీలక పాత్ర పోషించాయి. మరింత మంది ప్రాజెక్టు అభివృద్ధిదారులు పోటీలో పాల్గొనడంతో 2010లో యూనిట్‌కు సుమారు రూ.18గా ఉన్న సౌర విద్యుత్ ధర రికార్డు స్థాయిలో రూ.1.99కి తగ్గింది. 2020లో గుజరాత్ ఊర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్ (జీయూవీఎన్ఎల్) ఈ ధరను సాధించింది. దీంతో సౌర విద్యుత్ మరింత సరసమైన ధరకు అందుబాటులోకి రావడంతోపాటు దేశవ్యాప్తంగా దాని వినియోగం వేగవంతమైంది.

 

విద్యుత్ టారిఫ్‌లు తగ్గడంతో సౌర విద్యుత్ ధరలు మరింత అందుబాటులోకి వచ్చాయి. ఫలితంగా ప్రపంచంలో అత్యంత తక్కువ వ్యయంతో సౌర విద్యుత్ ఉత్పత్తి చేసే మార్కెట్లలో భారత్ ఒకటిగా నిలిచింది. 2025లో భారీ సౌర ఫోటోవోల్టాయిక్ ప్రాజెక్టుల నుంచి ఉత్పత్తి చేసే విద్యుత్ సమీకృత సగటు వ్యయం మెగావాట్ గంటకు 35 అమెరికా డాలర్లుగా ఉంది. ప్రపంచ సగటు 44 అమెరికా డాలర్లతో పోలిస్తే ఇది చాలా తక్కువ.

 

మౌలిక సదుపాయాల కల్పన

సౌర విద్యుత్ ప్రాజెక్టుల అభివృద్ధిదారులకు భూమి, అవసరమైన మౌలిక సదుపాయాలు సులభంగా అందుబాటులో ఉండేలా ప్రభుత్వం సోలార్ పార్కుల పథకాన్ని ప్రారంభించింది. తొలుత 20 గిగావాట్ల సామర్థ్య లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. 2017లో లక్ష్యాన్ని 40 గిగావాట్లకు పెంచారు. 2026 అక్టోబర్ నాటికి దేశవ్యాప్తంగా మొత్తం 39,461 మెగావాట్ల మంజూరైన సామర్థ్యంతో 56 సోలార్ పార్కులకు ఆమోదం లభించింది.

 

వివిధ రాష్ట్రాల్లో భారీ స్థాయిలో పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తికి సోలార్ పార్కులు ముఖ్యమైన కేంద్రాలుగా అవతరించాయి.

క్రమ సంఖ్య

రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం

పార్కుల సంఖ్య

మంజూరైన సామర్థ్యం (మెగావాట్లు)

1

ఆంధ్రప్రదేశ్

5

4,200

2

బిహార్

1

150

3

ఛత్తీస్‌గఢ్

1

100

4

గుజరాత్

7

12,150

5

ఝార్ఖండ్

2

562

6

ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్*

1

310

7

కర్ణాటక

1

2,000

8

కేరళ

3

255

9

మధ్యప్రదేశ్

9

4,208

10

మహారాష్ట్ర

4

1,000

11

మిజోరం

1

20

12

ఒడిశా

1

40

13

రాజస్థాన్

11

10,726

14

ఉత్తరప్రదేశ్

8

3,740

మొత్తం

 

54

39,461

* ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో విస్తరించిన ఒక అంతర్రాష్ట్ర తేలియాడే సౌర విద్యుత్ పార్క్ కూడా ఇందులో ఉంది.

ఈ పథకం ద్వారా దేశంలోని పలు ప్రముఖ సోలార్ పార్కులను అభివృద్ధి చేయగలిగారు.

సోలార్ పార్కుల పథకానికి అనుబంధంగా గ్రీన్ ఎనర్జీ కారిడార్ (జీఈసీ) కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. పునరుత్పాదక ఇంధన వనరులు సమృద్ధిగా ఉన్న ప్రాంతాల నుంచి విద్యుత్ డిమాండ్ అధికంగా ఉన్న ప్రాంతాలకు విద్యుత్‌ను సరఫరా చేయడం ఈ కార్యక్రమం లక్ష్యం. విద్యుత్ ప్రసార వ్యవస్థలను బలోపేతం చేయడంతోపాటు పునరుత్పాదక విద్యుత్‌ను గ్రిడ్‌లో సులభంగా అనుసంధానించేందుకు ఇది తోడ్పడుతోంది.

 

2026 ఫిబ్రవరి నాటికి ఈ కార్యక్రమం ద్వారా బలోపేతం చేసిన విద్యుత్ ప్రసార వ్యవస్థల సహాయంతో 24,567.8 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌ను తరలించే సదుపాయం ఏర్పడింది. పది రాష్ట్రాల్లో చేపట్టనున్న గ్రీన్ ఎనర్జీ కారిడార్ ప్రాజెక్టుల ద్వారా సుమారు 44 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌ను తరలించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఈ ప్రాజెక్టులు జాతీయ విద్యుత్ గ్రిడ్‌లో పునరుత్పాదక విద్యుత్ అనుసంధానాన్ని మరింత బలోపేతం చేయనున్నాయి.

 

భడ్లా సోలార్ పార్క్: ఎడారి ప్రాంతం నుంచి స్వచ్ఛ ఇంధన కేంద్రంగా అభివృద్ధి

రాజస్థాన్‌లోని శుష్క ప్రాంతమైన భడ్లాలో ఏర్పాటు చేసిన సోలార్ పార్క్, విస్తారమైన బంజరు భూములను ప్రపంచంలోని అతిపెద్ద సౌర విద్యుత్ కేంద్రాల్లో ఒకటిగా మార్చింది. సోలార్ పార్కుల పథకం కింద 2015లో దీని అభివృద్ధి ప్రారంభమైంది. 2020 నాటికి వివిధ దశల్లో నిర్మాణం పూర్తయింది.

 

దాదాపు 5,700 హెక్టార్లలో (56 చదరపు కిలోమీటర్లు) విస్తరించిన ఈ పార్క్ స్థాపిత సామర్థ్యం 2,245 మెగావాట్లు. అధిక సౌర వికిరణం, తక్కువ వర్షపాతం, అరుదైన వృక్ష సంపద వంటి పరిస్థితులు ఈ ప్రాంతాన్ని భారీ సౌర విద్యుత్ ఉత్పత్తికి అనువైనదిగా మార్చాయి.

 

భారీ సామర్థ్యంతోపాటు సోలార్ పార్కుల నమూనా ఎలా పనిచేస్తుందో భడ్లా ప్రాజెక్టు తెలియజేస్తోంది. భూమిని సిద్ధం చేయడం, విద్యుత్ సరఫరా మౌలిక సదుపాయాలు వంటి ఉమ్మడి సౌకర్యాలు ప్రాజెక్టుల వేగవంతమైన అభివృద్ధికి తోడ్పడ్డాయి. గణనీయమైన ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించాయి. ఈ పార్క్‌లో పోటీతత్వ బిడ్డింగ్ ద్వారా దేశంలో అత్యంత తక్కువ సౌర విద్యుత్ ధరలను సాధించగలిగారు. దీంతో సౌర విద్యుత్ మరింత సరసమైన ధరకు అందుబాటులోకి వచ్చింది.

 

తేలియాడే సౌర విద్యుత్, ఇంధన నిల్వ వ్యవస్థలు

ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన (పీఎం-ఎస్ఎస్‌వై)కు కేంద్ర ప్రభుత్వం 2026 జూలై 31న ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద విద్యుత్ నిల్వ వ్యవస్థలతో అనుసంధానించిన 5,000 మెగావాట్ల తేలియాడే సౌర ఫోటోవోల్టాయిక్ ప్రాజెక్టులకు మద్దతు అందించనున్నారు. విద్యుత్ నిల్వ వ్యవస్థలు కనీసం రెండు గంటల పాటు విద్యుత్‌ను నిల్వ చేయగల సామర్థ్యంతో, మొత్తం 10,000 మెగావాట్ గంటల నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అధిక విద్యుత్ డిమాండ్ ఉన్న సమయాల్లో అవసరాలను తీర్చేందుకు ఈ వ్యవస్థలు రాష్ట్రాలకు తోడ్పడతాయి. ఇప్పటికే ఉన్న జలాశయాలు, పారిశ్రామిక చెరువులను వినియోగించడం ద్వారా పరిమితంగా అందుబాటులో ఉన్న భూములపై ఒత్తిడిని తగ్గించవచ్చు. సమగ్ర విద్యుత్ నిల్వ వ్యవస్థల ద్వారా గ్రిడ్ విశ్వసనీయత కూడా మెరుగుపడుతుంది. రూ.5,070 కోట్ల వ్యయంతో ఈ పథకాన్ని 2026–27 నుంచి 2030–31 ఆర్థిక సంవత్సరాల వరకు అమలు చేయనున్నారు.

 

జాతీయ సౌరశక్తి సంస్థ (ఎన్ఐఎస్ఈ) నిర్వహించిన అంచనా ఆధారంగా ఈ పథకాన్ని రూపొందించారు. దేశంలోని జలాశయాలు, అనువైన అంతర్గత జలవనరుల్లో సుమారు 102.18 గిగావాట్ పీక్ సామర్థ్యంతో తేలియాడే సౌర విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉందని ఈ అంచనా పేర్కొంది. ఈ పథకం ద్వారా ఏటా సుమారు కోటి టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించవచ్చని అంచనా. పూర్తి కాల ఉద్యోగాలతో సమానమైన 16,000 నుంచి 17,000 ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయి. సౌర ఫలకాలను నీటిపై తేలియాడేలా ఉంచే వ్యవస్థలు, ఫోటోవోల్టాయిక్ సెల్స్, మాడ్యూళ్లు, ఇంధన నిల్వ వ్యవస్థల దేశీయ తయారీకి కూడా ఈ పథకం ఊతమివ్వనుంది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఈ పథకం ప్రయోజనాలను పొందేందుకు అర్హత కలిగి ఉంటాయి. ప్రస్తుతం సుమారు 800 మెగావాట్లుగా ఉన్న దేశ తేలియాడే సౌర విద్యుత్ సామర్థ్యానికి ఈ కార్యక్రమం ద్వారా మరో 5,000 మెగావాట్లు జోడించనున్నారు.

 

దేశీయ తయారీ రంగానికి ప్రోత్సాహం

సౌర విద్యుత్ పరికరాల దేశీయ తయారీని బలోపేతం చేయడం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది.

 

అధిక సామర్థ్యం కలిగిన సౌర ఫోటోవోల్టాయిక్ మాడ్యూళ్లకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం

అధిక సామర్థ్యం కలిగిన సౌర ఫోటోవోల్టాయిక్ మాడ్యూళ్ల తయారీకి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకాన్ని 2021లో రూ.4,500 కోట్ల ప్రారంభ కేటాయింపుతో ప్రవేశపెట్టారు. 2022లో అదనంగా రూ.19,500 కోట్లు కేటాయించి పథకాన్ని విస్తరించారు. దేశీయ తయారీని ప్రోత్సహించడం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, సౌర విద్యుత్ విలువ ఆధారిత సరఫరా వ్యవస్థలో అదనపు విలువ సృష్టిని పెంపొందించడం ఈ పథకం లక్ష్యాలు. 2024 అక్టోబర్ నాటికి ఈ పథకం ద్వారా సుమారు రూ.35,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దాదాపు 10,000 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించింది.

 

ఆమోదం పొందిన నమూనాలు, తయారీదారుల జాబితా (ఏఎల్ఎంఎం)

సౌర ఫోటోవోల్టాయిక్ మాడ్యూళ్లు, సెల్స్ నాణ్యతను నిర్ధారించేందుకు 2019లో ఆమోదం పొందిన నమూనాలు, తయారీదారుల జాబితా (ఏఎల్ఎంఎం) విధానాన్ని ప్రవేశపెట్టారు. అర్హత కలిగిన ప్రాజెక్టుల్లో ఉపయోగించే సౌర విద్యుత్ పరికరాలు నిర్దేశిత నాణ్యత, పనితీరు ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా ఈ విధానం నిర్ధారిస్తుంది. ప్రభుత్వ మద్దతుతో చేపట్టే నిర్దిష్ట సౌర విద్యుత్ ప్రాజెక్టులు, పోటీతత్వ బిడ్డింగ్ ద్వారా ఎంపిక చేసే ప్రాజెక్టుల్లో ఆమోదిత జాబితాల్లో ఉన్న తయారీదారులు, నమూనాలను మాత్రమే ఉపయోగించేందుకు అనుమతి ఉంటుంది. ఆమోదం పొందిన ఉత్పత్తుల వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా ఈ విధానం దేశీయ తయారీ రంగానికి కూడా మద్దతు ఇస్తోంది.

 

పీఎల్ఐ పథకం, ఏఎల్ఎంఎం విధానం కలిసి భారత సౌర పరికరాల దేశీయ తయారీ వ్యవస్థను బలోపేతం చేశాయి. స్వావలంబన పెంపునకు తోడ్పడటంతోపాటు సౌర విద్యుత్ ప్రాజెక్టుల వేగవంతమైన విస్తరణకు దోహదపడ్డాయి. ఆమోదం పొందిన పరికరాల వినియోగాన్ని నిర్ధారించడం ద్వారా వినియోగదారులు, ప్రాజెక్టుల అభివృద్ధిదారుల్లో విశ్వాసాన్ని పెంపొందిస్తున్నాయి.

 

ప్రతి ఇంటికి, వ్యవసాయ క్షేత్రానికి సౌర విద్యుత్

భారత్‌లో సౌరశక్తి వినియోగ విస్తరణ భారీ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకే పరిమితం కాలేదు. గృహాలు, రైతుల కోసం ప్రత్యేకంగా అమలు చేస్తున్న పథకాల ద్వారా విద్యుత్ లభ్యత మెరుగుపడుతోంది. విద్యుత్ ఖర్చులు తగ్గడంతోపాటు కొత్త జీవనోపాధి అవకాశాలు ఏర్పడుతున్నాయి.

 

పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజ్లీ యోజన

రూ.75,021 కోట్ల కేటాయింపుతో 2024 ఫిబ్రవరి 13న ప్రారంభించిన పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజ్లీ యోజన ద్వారా దేశవ్యాప్తంగా గృహాలకు నేరుగా పైకప్పు సౌర విద్యుత్ ప్రయోజనాలను అందిస్తున్నారు. గృహాల పైకప్పులపై సౌర విద్యుత్ వ్యవస్థల ఏర్పాటుకు సంబంధించి ప్రపంచంలోనే అతిపెద్ద కార్యక్రమం ఇదే. అర్హత కలిగిన కుటుంబాలకు పైకప్పు సౌర విద్యుత్ వ్యవస్థల ఏర్పాటుకు రాయితీలు అందిస్తున్నారు. ఎలాంటి పూచీకత్తు అవసరం లేని రుణాల ద్వారా ఈ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడాన్ని సులభతరం చేస్తున్నారు. ప్రత్యేక జాతీయ పోర్టల్ ద్వారా పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్, సౌర విద్యుత్ వ్యవస్థల ఏర్పాటు, రాయితీల పంపిణీ ప్రక్రియలు సులభంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నారు.

ప్రధాన విజయాలు

- 2026 నవంబర్ నాటికి సుమారు 65 లక్షల గృహాల్లో సౌర విద్యుత్ వ్యవస్థలు ఏర్పాటు చేశారు.

- 2026 జూలై వరకు కేంద్ర ఆర్థిక సహాయం కింద రూ.28,024 కోట్లు పంపిణీ చేశారు.

- 2026 నవంబర్ నాటికి 21 లక్షలకు పైగా గృహాలకు సున్నా విద్యుత్ బిల్లులు వచ్చాయి.

ఈ పథకం ద్వారా కుటుంబాలు తమకు అవసరమైన విద్యుత్‌ను సొంతంగా ఉత్పత్తి చేసుకునే అవకాశం లభిస్తోంది. విద్యుత్ బిల్లులు తగ్గడంతోపాటు పైకప్పు సౌర విద్యుత్ వ్యవస్థల వినియోగం పెరుగుతోంది. పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజ్లీ యోజనకు అంతర్జాతీయ స్థాయిలో కూడా మద్దతు లభించింది. భారత్‌లో గృహాల పైకప్పులపై సౌర విద్యుత్ వ్యవస్థల ఏర్పాటును విస్తరించేందుకు ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయానికి ఆమోదం తెలిపింది.

 

అధిక విద్యుత్ బిల్లుల నుంచి సౌరశక్తితో పొదుపు దిశగా

పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజ్లీ యోజన గురించి తెలుసుకున్న గ్వాలియర్‌లోని జవార్ కాలనీ నివాసి సుధాంశు దూబే తన ఇంటి పైకప్పుపై సౌర విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

 

సౌర విద్యుత్ వ్యవస్థ ఏర్పాటు, రాయితీ మంజూరు ప్రక్రియలు సులభంగా పూర్తయ్యాయి. రాయితీ మొత్తం నేరుగా ఆయన బ్యాంకు ఖాతాలో జమ అయింది. ఏడాదికి పైగా ప్రతి నెలా ఈ పథకం ప్రయోజనాలను ఆయన పొందుతున్నారు. గతంలో ఆయన ఇంటి విద్యుత్ బిల్లు తరచూ రూ.10,000 దాటేది. ప్రస్తుతం ఆ ఖర్చు దాదాపు నామమాత్రంగా మారింది. ఇంటి పైకప్పుపై ఏర్పాటు చేసిన సౌర విద్యుత్ వ్యవస్థ నిరంతరాయంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ కుటుంబ అవసరాలను తీరుస్తోంది. నెలవారీ విద్యుత్ ఖర్చులను కూడా గణనీయంగా తగ్గిస్తోంది.

 

సుధాంశు దూబేకు ఈ పథకం సూర్యరశ్మిని పొదుపుగా మార్చింది. దేశవ్యాప్తంగా కుటుంబాలు స్వచ్ఛ ఇంధనాన్ని వినియోగించుకుంటూ విద్యుత్ ఖర్చులను మరింత సమర్థంగా నియంత్రించుకునేందుకు పీఎం సూర్య ఘర్ పథకం ఎలా తోడ్పడుతోందో ఆయన అనుభవం తెలియజేస్తోంది.

 

ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్షా ఏవం ఉత్థాన్ మహాభియాన్ (పీఎం-కుసుమ్)

వ్యవసాయ రంగంలో సౌరశక్తి వినియోగాన్ని విస్తరించేందుకు 2019లో పీఎం-కుసుమ్ పథకాన్ని ప్రారంభించారు. వికేంద్రీకృత సౌర విద్యుత్ కేంద్రాలు, స్వతంత్ర సౌర వ్యవసాయ పంపుల ఏర్పాటు, విద్యుత్ గ్రిడ్‌కు అనుసంధానించిన వ్యవసాయ పంపుల సౌరీకరణకు ఈ పథకం మద్దతు అందిస్తోంది. వ్యవసాయానికి పగటిపూట విశ్వసనీయమైన విద్యుత్ సరఫరా అందించడం, డీజిల్‌పై ఆధారపడటాన్ని తగ్గించడం, రైతులకు అదనపు ఆదాయ అవకాశాలను కల్పించడం ఈ పథకం లక్ష్యాలు.

 

పీఎం-కుసుమ్ ద్వారా రైతులు సాగునీటి అవసరాలతోపాటు విద్యుత్ ఉత్పత్తికి కూడా సౌరశక్తిని వినియోగించుకోవచ్చు. ఈ పథకం కింద రైతులు సాగునీటి కోసం సౌర పంపులను ఏర్పాటు చేసుకోవడంతోపాటు అర్హత ఉన్న సందర్భాల్లో మిగులు విద్యుత్‌ను పంపిణీ సంస్థలకు విక్రయించవచ్చు. 2026–27 నాటికి సుమారు 34,800 మెగావాట్ల సౌర విద్యుత్ సామర్థ్యాన్ని అదనంగా ఏర్పాటు చేయడంపై ఈ పథకం దృష్టి సారిస్తోంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం రూ.34,422 కోట్ల ఆర్థిక సహాయం అందించనుంది.

 

ప్రధాన విజయాలు (2026 సెప్టెంబర్ 30 నాటికి)

- వ్యవసాయ అవసరాల కోసం గ్రిడ్‌తో అనుసంధానం లేని దాదాపు 11.91 లక్షల సౌర పంపులను ఏర్పాటు చేశారు.

- ఫీడర్ స్థాయి సౌరీకరణ ద్వారా 17.18 లక్షలకు పైగా వ్యవసాయ పంపులకు సౌర విద్యుత్ సదుపాయం కల్పించారు.

- రైతుల భూముల్లో సుమారు 2,426 మెగావాట్ల వికేంద్రీకృత సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.

- 2025 డిసెంబర్ 31 నాటికి దేశవ్యాప్తంగా 21.77 లక్షలకు పైగా రైతులు ప్రయోజనం పొందారు.

ఈ రెండు పథకాలు భారత్‌లో వికేంద్రీకృత సౌర విద్యుత్ వ్యవస్థ విస్తరణకు ముఖ్యమైన ఆధారాలుగా నిలిచాయి.

 

2025–26 ఆర్థిక సంవత్సరంలో దేశంలో అదనంగా అందుబాటులోకి వచ్చిన 44.61 గిగావాట్ల సౌర విద్యుత్ సామర్థ్యంలో 16.3 గిగావాట్లు, అంటే 36 శాతం వికేంద్రీకృత సౌర విద్యుత్ వ్యవస్థల ద్వారా సమకూరింది.

 

ఇందులో పీఎం-కుసుమ్ ద్వారా 7.6 గిగావాట్లు, పైకప్పు సౌర విద్యుత్ వ్యవస్థల ద్వారా 8.7 గిగావాట్ల సామర్థ్యం అందుబాటులోకి వచ్చింది.

 

అంతర్జాతీయ సౌరశక్తి సహకారంలో పెరుగుతున్న‌ భారత‌దేశ‌ నాయకత్వం

సౌరశక్తి రంగంలో భారత నాయకత్వం దేశ సరిహద్దులను దాటి విస్తరిస్తోంది. అంతర్జాతీయ సహకారం, సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి, సామర్థ్యాల అభివృద్ధిని భారత్ మరింత బలోపేతం చేస్తోంది.

 

- అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్ఏ): 2015లో పారిస్‌లో జరిగిన కాప్21 సదస్సు సందర్భంగా భారత్, ఫ్రాన్స్ సంయుక్తంగా అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్ఏ)ని స్థాపించాయి. ప్రపంచవ్యాప్తంగా సౌరశక్తి రంగంలో సహకారాన్ని పెంపొందించే కీలక వేదికగా ఈ కూటమి అవతరించింది. సౌర విద్యుత్ వినియోగాన్ని వేగవంతం చేయడం, విజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకోవడం కోసం మాల్దీవులు, గ్రీస్, జర్మనీ, ఇటలీ, భూటాన్, లక్సెంబర్గ్, అర్జెంటీనా వంటి దేశాలను ఈ కూటమి ఒకే వేదికపైకి తీసుకొస్తోంది. సభ్య దేశాల మధ్య పరస్పర సహకారాన్ని పెంపొందించే ముఖ్యమైన వేదికగా ఐఎస్ఏ అభివృద్ధి చెందింది.

 

- వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్ (ఓఎస్ఓడ‌బ్ల్యూఓజీ): ప్రపంచవ్యాప్తంగా పరస్పరం అనుసంధానించిన పునరుత్పాదక విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేయాలనే దార్శనికతతో భారత్ 2018లో ‘వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్’ (ఓఎస్ఓడబ్ల్యూఓజీ) ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చింది. ఈ దార్శనికతను కార్యరూపంలోకి తీసుకెళ్లేందుకు భారత్, యునైటెడ్ కింగ్‌డమ్ సంయుక్తంగా 2021లో జరిగిన కాప్–26 సదస్సులో ‘గ్రీన్ గ్రిడ్స్ ఇనిషియేటివ్-వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్’ (జీజీఐ–ఓఎస్ఓడబ్ల్యూఓజీ) కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, అమెరికా, అంతర్జాతీయ సౌర కూటమి ఈ కార్యక్రమానికి మద్దతు అందిస్తున్నాయి. వివిధ దేశాల విద్యుత్ గ్రిడ్‌లను పరస్పరం అనుసంధానించడం ద్వారా సరిహద్దులు దాటి పునరుత్పాదక విద్యుత్ వాణిజ్యాన్ని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం లక్ష్యం. ఇంధన భద్రతను బలోపేతం చేయడంతోపాటు స్వచ్ఛ ఇంధన రంగ పరివర్తనను వేగవంతం చేసేందుకు ఇది తోడ్పడుతోంది.

 

అంతర్జాతీయ సౌర కూటమి, ఇతర భాగస్వామ్యాల ద్వారా అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య పునరుత్పాదక ఇంధన సహకారాన్ని భారత్ బలోపేతం చేసింది. జీ–20 అధ్యక్ష బాధ్యతలు నిర్వహించిన సమయంలో 2030 నాటికి ప్రపంచ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని మూడు రెట్లు పెంచాలనే అంశంపై ఏకాభిప్రాయం సాధించడంలో కూడా భారత్ కీలక పాత్ర పోషించింది.

 

భవిష్యత్ కార్యాచరణ

 

సౌరశక్తి రంగంలో భారత్ సాధించిన విజయాలు నిరంతర విధానపరమైన మద్దతు, తయారీ రంగ విస్తరణ, మౌలిక సదుపాయాల బలోపేతం, ప్రజల భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తున్నాయి. పంచామృత లక్ష్యాల సాధన, 2070 నాటికి నికర సున్నా ఉద్గారాల స్థాయికి చేరుకోవాలనే లక్ష్యం దిశగా భారత్ ముందుకు సాగుతున్న నేపథ్యంలో సౌరశక్తి కీలక ఆధారంగా కొనసాగనుంది. దేశంలో స్వచ్ఛ ఇంధన రంగ పరివర్తనను ముందుకు నడిపించడంలో సౌరశక్తి ప్రధాన పాత్ర పోషించనుంది.

 

Reference:

Prime Minister's Office

https://www.pib.gov.in/PressReleaseDetail.aspx?PRID=2331444&reg=48&lang=2

Ministry of Power

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2240739&reg=48&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2183866&reg=48&lang=2

https://beeindia.gov.in/show_content.php?lang=1&level=1&ls_id=119&lid=291

https://www.recregistryindia.nic.in/pdf/REC_Regulation/Renewable_Purchase_Obligation_and_Energy_Storage_Obligation_Trajectory_till_2029_30.pdf

https://aerc.assam.gov.in/information-services/renewable-purchase-obligation-rpo

https://www.pib.gov.in/PressReleaseDetail.aspx?PRID=2329438&reg=19&lang=1

https://npp.gov.in/dashBoard/cp-map-dashboard

Ministry of New and Renewable Energy (MNRE)

https://mnre.gov.in/en/physical-progress/

https://mnre.gov.in/en/development-of-solar-parks-and-ultra-mega-solar-power-projects/

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2292433&reg=48&lang=1

https://mnre.gov.in/en/green-energy-corridor-0verview/

https://mnre.gov.in/en/document/guidelines-for-tariff-based-competitive-bidding-process-for-procurement-of-firm-and-dispatchable-power-from-grid-connected-renewable-energy-power-projects-with-energy-storage-systems-2/

https://pmkusum.mnre.gov.in/#/landing

https://pmkusum.mnre.gov.in/#/landing/read-more

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2250039&reg=3&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1763712

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2244667&reg=3&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2241551&reg=48&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2204466&reg=6&lang=1

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2082901&reg=48&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2042069&reg=3&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2010133&reg=48&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1983208&reg=48&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1622459&reg=48&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1489763&reg=48&lang=2

https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=2081250&reg=48&lang=2

https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=1831364&reg=48&lang=2

https://www.pib.gov.in/newsite/PrintRelease.aspx?relid=122567&reg=3&lang=2

https://sansad.in/getFile/annex/270/AU2064_DoGkMO.pdf?source=pqars

https://sansad.in/getFile/loksabhaquestions/annex/187/AU2011_5nmHOe.pdf?source=pqals

https://sansad.in/getFile/loksabhaquestions/annex/183/AU1418_Edvm7x.pdf?source=pqals

https://sansad.in/getFile/annex/270/AU1260_BzS52V.pdf?source=pqars

https://pmsuryaghar.gov.in/#/

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1594759&reg=48&lang=2

https://cdnbbsr.s3waas.gov.in/s3716e1b8c6cd17b771da77391355749f3/uploads/2024/02/202402091231907238.pdf

https://x.com/mnreindia/status/1779835768795546038

https://x.com/byadavbjp/status/2062136611501113852

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1710114&lang=2&reg=48

https://forumofregulators.gov.in/Data/Meetings/Minutes/98.pdf

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2294208&lang=1&reg=48

https://x.com/mnreindia/status/2067931108449399061

https://www.pib.gov.in/PressReleaseDetail.aspx?PRID=2329695&reg=3&lang=1

https://youtu.be/9YFnxvpO89Q?si=y9PfyIRqM7KsS-TQ

Ministry of Environment, Forest and Climate Change

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1795071&reg=48&lang=2

PIB Backgrounder

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2233832&reg=3&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2199729&lang=1&reg=3

Cabinet

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1861127&reg=48&lang=2

India Solar Alliance (ISA)

https://isa.int/who-we-are

NITI Aayog

https://www.niti.gov.in/sites/default/files/2023-02/Brochure-10-pages-op-2-print-file-20102022.pdf

Government of Gujarat

https://gpcl.gujarat.gov.in/showpage.aspx?contentid=4354

https://cmogujarat.gov.in/en/latest-news/khavda-renewable-energy-park-gujarat-green-electricity

International Renewable Energy Agency (IRENA)

https://www.irena.org/-/media/Files/IRENA/Agency/Publication/2026/Mar/IRENA_DAT_RE_capacity_highlights_2026.pdf

https://www.irena.org/-/media/Files/IRENA/Agency/Publication/2026/Jul/IRENA_TEC_RPGC_2025_Executive_summary_2026.pdf

United Nations Framework Convention on Climate Change (UNFCCC)

https://unfccc.int/news/international-solar-energy-alliance-launched-at-cop21

Asian Development Bank (ADB)

https://www.adb.org/projects/44426-016/main

World Bank

https://www.worldbank.org/en/news/press-release/2026/07/09/world-bank-supports-india-s-solar-rooftop-program-to-boost-clean-energy-create-jobs-and-unlock-private-capital

India Brand Equity Foundation (IBEF)

https://www.ibef.org/news/india-surpasses-us-in-annual-solar-capacity-additions-becomes-second-largest-solar-growth-market-in-2025

Click here to see pdf

***

(Explainer ID: 160847) आगंतुक पटल : 15
Provide suggestions / comments
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali