Social Welfare
ప్రకృతి చికిత్స: ఆరోగ్యవంతమైన భారత్ కోసం సహజ చికిత్సా విధానం
దేశవ్యాప్తంగా చికిత్స, శిక్షణ, పరిశోధన, ఆరోగ్య సంరక్షణ సేవలు
Posted On:
17 NOV 2026 9:58AM
ఆహార నియమాలు, ఉపవాసం, నీరు, మట్టి, మర్దన, సహజ జీవన విధానాల ద్వారా శరీరం స్వయంగా కోలుకునేందుకు తోడ్పడే మందులు అవసరం లేని, తక్కువ ఖర్చుతో కూడిన చికిత్సా విధానమే ప్రకృతి చికిత్స. భారత్‌లో ప్రతి సంవత్సరం నవంబర్ 18న జాతీయ ప్రకృతి చికిత్స దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ ఏడాది తొమ్మిదో జాతీయ ప్రకృతి చికిత్స దినోత్సవాన్ని ‘ప్రాకృతిక్ చికిత్స, స్వస్థ్ భారత్’ అనే ఇతివృత్తంతో కర్ణాటకలోని నాగమంగళలో నిర్వహించనున్నారు. పుణెలోని జాతీయ ప్రకృతి చికిత్స సంస్థ ఆధ్వర్యంలో 250 పడకల ప్రకృతి చికిత్స ఆసుపత్రి ‘నిసర్గ్ గ్రామ్’ పనిచేస్తోంది. కేంద్ర ప్రభుత్వ పరిధిలో తొలి బ్యాచిలర్ ఆఫ్ నేచురోపతి అండ్ యోగిక్ సైన్సెస్ (బీఎన్‌వైఎస్) కళాశాల కూడా ఇక్కడే ఉంది.
ప్రకృతి ద్వారా స్వస్థత
శరీరానికి తనను తాను స్వస్థపరచుకునే సామర్థ్యం ఉందనే ప్రాథమిక భావనపై ప్రకృతి చికిత్స ఆధారపడింది. వివిధ సంస్కృతుల్లోని సంప్రదాయ వైద్య విజ్ఞానం నుంచి రూపుదిద్దుకున్న ఈ విధానంలో మందుల అవసరం లేకుండా, తక్కువ ఖర్చుతో సహజ వనరులను ఉపయోగించి ఆరోగ్య సంరక్షణ సేవలు అందిస్తారు. భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశం అనే ప్రకృతిలోని పంచభూతాల సహాయంతో శరీరంలో సహజసిద్ధంగా ఉన్న జీవశక్తిని పెంపొందించడం ఈ చికిత్స లక్ష్యం.
ప్రకృతి చికిత్స కేవలం ఒక వైద్య విధానం మాత్రమే కాదు, అదొక జీవన విధానం. సరళమైన ఆహారపు అలవాట్లు, జీవనశైలిని అనుసరిస్తూ మనతో మనం, సమాజంతో, పర్యావరణంతో సామరస్యంగా జీవించాలనే ‘ప్రకృతి వైపు తిరిగి వెళ్లాలి’ అనే సందేశాన్ని ఇది అందిస్తుంది. ఆరోగ్యాన్ని పెంపొందించడం, వ్యాధులను నివారించడం, వాటికి చికిత్స అందించడం, అనారోగ్యం నుంచి కోలుకునేందుకు తోడ్పడే సామర్థ్యం ఈ విధానానికి ఉంది.
ప్రకృతి చికిత్సలో వైద్య విధానాలు
ప్రకృతిలో లభించే వనరులతో ప్రకృతి వైద్యులు చికిత్స అందిస్తారు. ఉపవాసం, ఆహార నియమాలు, జలచికిత్స, మట్టి పట్టీలు, చల్లని పట్టీలు, స్నానాలు, మర్దన వంటి పద్ధతులను ఉపయోగిస్తారు. పుణెలోని జాతీయ ప్రకృతి చికిత్స సంస్థ ప్రాంగణమైన నిసర్గ్ గ్రామ్‌లో అయస్కాంత చికిత్స, వర్ణ చికిత్స, ఫిజియోథెరపీ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. యోగా మందిరం, సాత్విక ఆహార కేంద్రం కూడా ఇక్కడ ఉన్నాయి.

ప్రకృతి చికిత్స ఉపయోగాలు
దీర్ఘకాలిక వ్యాధులు, అలర్జీలు, శరీర రోగనిరోధక వ్యవస్థ సొంత కణజాలంపైనే దాడి చేసే వ్యాధులు, శరీర అవయవాల క్షీణతకు సంబంధించిన సమస్యలు, ఒత్తిడి సంబంధిత రుగ్మతల చికిత్సలో ప్రకృతి వైద్యం ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. జీవనశైలి సంబంధిత వ్యాధులు, ఊబకాయం, ఒత్తిడి, ఆరోగ్యకరమైన వృద్ధాప్యంపై ప్రజల్లో అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో పోషకాహారం, సహజ చికిత్సలు, జీవనశైలి మార్పులకు ప్రాధాన్యమిచ్చే ప్రకృతి వైద్య విధానం మరింత ప్రాసంగికతను సంతరించుకుంది. ఆరోగ్యకరమైన ఆహారం, శారీరక శ్రమ, తగినంత విశ్రాంతి, ఒత్తిడి నియంత్రణ అన్ని వయసుల వారిలో వ్యాధుల నివారణకు తోడ్పడతాయి.
భారత్‌లో ప్రకృతి చికిత్స, యోగా
భారత్‌లో ప్రకృతి చికిత్స, యోగా పరస్పరం అనుసంధానమై ఉన్నాయి. జాతీయ ప్రకృతి చికిత్స సంస్థ ప్రకారం.. భారతీయ ప్రకృతి వైద్య విధానంలో యోగాతోపాటు ‘పంచభూతాల ఆధారంగా ఆరోగ్యం, వ్యాధులను అర్థం చేసుకోవడం’ వంటి ప్రాచీన భారతీయ భావనలు కూడా భాగంగా ఉన్నాయి. పంచభూతాలు అంటే భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశం. కాలక్రమేణా ప్రకృతి చికిత్స వ్యాధుల నివారణ, చికిత్సతోపాటు ప్రకృతికి దగ్గరగా ఆరోగ్యకరమైన జీవనం సాగించే విధానాన్ని నేర్పించే సమగ్ర ఆరోగ్య సంరక్షణ వ్యవస్థగా అభివృద్ధి చెందింది.
ఆయుర్వేదం, యునానీ, సిద్ధ, సోవా రిగ్పా, హోమియోపతి వంటి ఆయుష్ వైద్య విధానాలతోపాటు యోగా, ప్రకృతి చికిత్సను కూడా ఒకే విభాగంలో చేర్చారు. జాతీయ ప్రకృతి చికిత్స సదస్సు-2026లో యోగా, ప్రకృతి చికిత్స ఒకదానికొకటి అనుబంధంగా పనిచేస్తాయని ఆయుష్ మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటించింది. ఈ రెండు విధానాలను అనుసంధానిస్తూ ప్రభుత్వం సమగ్ర వ్యవస్థను అభివృద్ధి చేసింది. ప్రకృతి చికిత్స, యోగా శాస్త్రాలను కలిపిన డిగ్రీ కోర్సు, ఈ రెండు విభాగాల కోసం కేంద్ర యోగా, ప్రకృతి చికిత్స పరిశోధన మండలి (సీసీఆర్‌వైఎన్), వైద్యులకు కేంద్ర స్థాయిలో రిజిస్ట్రేషన్, దేశంలో తొలి జాతీయ ప్రకృతి చికిత్స ఆసుపత్రి ఈ వ్యవస్థలో భాగంగా ఉన్నాయి.
9వ జాతీయ ప్రకృతి చికిత్స దినోత్సవం: ప్రాకృతిక్ చికిత్స, స్వస్థ్ భారత్
9వ జాతీయ ప్రకృతి చికిత్స దినోత్సవాన్ని 2026 నవంబర్ 18న కర్ణాటకలోని నాగమంగళలో ఉన్న కేంద్ర యోగా, ప్రకృతి చికిత్స పరిశోధన సంస్థ (సీఆర్ఐవైఎన్)లో నిర్వహించనున్నారు. ‘ప్రాకృతిక్ చికిత్స, స్వస్థ్ భారత్’ అనే ఇతివృత్తంతో జరిగే ఈ కార్యక్రమంలో వ్యాధుల నివారణకు ప్రాధాన్యమిస్తారు. ముఖ్యంగా ఊబకాయం నివారణపై దృష్టి సారిస్తూ ఆరోగ్యకరమైన ఆహారం, శారీరక శ్రమ, యోగా, ఒత్తిడి నియంత్రణను ప్రోత్సహిస్తారు. ఆరోగ్యవంతమైన, దృఢమైన భారత్‌ను నిర్మించాలనే ప్రధానమంత్రి దార్శనికతకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా), ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రతాప్‌రావ్ జాధవ్ మాట్లాడుతూ:
‘‘జీవనశైలి, ప్రకృతి, సంపూర్ణ ఆరోగ్యం మధ్య ఉన్న సన్నిహిత సంబంధాన్ని గుర్తించేందుకు ప్రకృతి చికిత్స మనల్ని ప్రోత్సహిస్తుంది. విశ్వసనీయమైన పరిశోధనలు, నాణ్యమైన విద్య, సంప్రదాయ ఆధునిక వైద్య సేవలతో బాధ్యతాయుతమైన అనుసంధానం ద్వారా ప్రకృతి చికిత్సకు శాస్త్రీయ పునాదులను బలోపేతం చేయడంపై మేం దృష్టి సారిస్తున్నాం’’ అని తెలిపారు.
మహాత్మా గాంధీ, ప్రకృతి చికిత్స దినోత్సవ ఆవిర్భావం
ప్రకృతి వైద్యం పట్ల మహాత్మా గాంధీ చూపిన నిబద్ధతకు గుర్తుగా ప్రకృతి చికిత్స దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1945 నవంబర్ 18న పుణెలోని అఖిల భారత ప్రకృతి చికిత్స ఫౌండేషన్ ట్రస్ట్‌కు మహాత్మా గాంధీ జీవితకాల అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి, ట్రస్ట్ పత్రంపై సంతకం చేశారు. ఈ తేదీని ప్రతి సంవత్సరం ప్రకృతి చికిత్స దినోత్సవంగా నిర్వహించాలని ఆయుష్ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. 2018 నుంచి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
భారత్‌లో ప్రకృతి చికిత్సకు ఆద్యుడిగా మహాత్మా గాంధీని పరిగణిస్తారు. 1946లో పుణె సమీపంలోని ఉరులి కాంచన్ గ్రామంలో ఆయన ప్రకృతి చికిత్స ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. అదే ఏడాది ఆయన ఇలా పేర్కొన్నారు:
‘‘వ్యక్తిగత, గృహ, ప్రజా పరిశుభ్రత నియమాలను కచ్చితంగా పాటిస్తూ ఆహారం, వ్యాయామం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే అనారోగ్యం లేదా వ్యాధులు వచ్చే అవకాశమే ఉండదని నేను విశ్వసిస్తున్నాను. అంతర్గతంగా, బాహ్యంగా సంపూర్ణ పరిశుభ్రత ఉంటే అనారోగ్యానికి తావుండదు. గ్రామీణ ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకోగలిగితే వారికి వైద్యులు, హకీమ్‌లు, వైద్యుల అవసరమే ఉండదు.’’ (హరిజన్, 26 మే 1946)
జాతీయ ప్రకృతి చికిత్స సంస్థ, నిసర్గ్ గ్రామ్
పుణెలోని జాతీయ ప్రకృతి చికిత్స సంస్థ (ఎన్ఐఎన్) 1986 డిసెంబర్ 22న ఏర్పాటైంది. అంతకుముందు 1975 మార్చి 17న భారత ప్రభుత్వానికి అప్పగించిన ప్రకృతి చికిత్స కేంద్రంలో ఈ సంస్థను ఏర్పాటు చేశారు. మహాత్మా గాంధీ గౌరవార్థం ఈ సంస్థ ప్రాంగణానికి ‘బాపూ భవన్’ అని పేరు పెట్టారు. జాతీయ ప్రకృతి చికిత్స సంస్థ ఆయుష్ మంత్రిత్వ శాఖ పరిధిలో స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థగా పనిచేస్తోంది. దీని పాలకమండలికి కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి అధ్యక్షత వహిస్తారు. ఈ సంస్థ ప్రధాన లక్ష్యాలు:
- ప్రకృతి చికిత్స, యోగాలో అందుబాటులో ఉన్న విజ్ఞానాన్ని ప్రామాణీకరించడం, విస్తృతంగా వ్యాప్తి చేసేందుకు అవసరమైన సౌకర్యాలను కల్పించడం, ప్రోత్సహించడం.
- ప్రకృతి చికిత్స విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ప్రకృతి చికిత్స, యోగాలో నాణ్యమైన శిక్షణ, విద్యను ప్రోత్సహించడం.
- మానవ ఆరోగ్యానికి సంబంధించిన అన్ని అంశాలపై పరిశోధనలను చేపట్టడం, సులభతరం చేయడం, ప్రోత్సహించడం.
- మహాత్మా గాంధీ స్మారకార్థం సజీవ స్మారక కేంద్రాన్ని ఏర్పాటు చేయడం.
సాధారణ ఆరోగ్య అవసరాల కోసం జాతీయ ప్రకృతి చికిత్స సంస్థ ప్రత్యేక ఔట్ పేషెంట్ విభాగాలను నిర్వహిస్తోంది. ప్రసవానికి ముందు, తరువాత మహిళల ఆరోగ్య సంరక్షణ కోసం మాతృ సంరక్షణ విభాగం, ఆహార నియమాలు, యోగా, జీవనశైలి మార్పుల ద్వారా మధుమేహ నియంత్రణ కోసం ప్రత్యేక విభాగం, ఒత్తిడి, ఆందోళనలను తగ్గించేందుకు యోగా, ధ్యానం, విశ్రాంతి పద్ధతులను ఉపయోగించే మానసిక, శారీరక ఆరోగ్య చికిత్స విభాగం వీటిలో ఉన్నాయి.
నిసర్గ్ గ్రామ్
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 ఫిబ్రవరి 25న పుణెలో జాతీయ ప్రకృతి చికిత్స సంస్థ నూతన ప్రాంగణం ‘నిసర్గ్ గ్రామ్’ను ప్రారంభించారు. రూ.213.55 కోట్ల వ్యయంతో 25 ఎకరాల్లో ఈ ప్రాంగణాన్ని నిర్మించారు. ఇందులో 250 పడకల ఆసుపత్రి, పరిశోధన, విస్తరణ సేవల కేంద్రం, అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, పారామెడికల్ కోర్సులను అందించే ప్రకృతి చికిత్స వైద్య కళాశాల ఉన్నాయి. దేశంలో తొలి జాతీయ ప్రకృతి చికిత్స ఆసుపత్రి ఇదే. జీవనశైలి కారణంగా తలెత్తే జీవక్రియ సంబంధిత రుగ్మతలకు ఇక్కడ సహజ చికిత్సా విధానాల ద్వారా చికిత్స అందిస్తారు.
నిసర్గ్ గ్రామ్ విశేషాలు
అంశం వివరాలు
ప్రాంగణం పుణెలోని యేవలేవాడిలో 25 ఎకరాలు
నిర్మాణ వ్యయం రూ.213.55 కోట్లు
ఆసుపత్రి 250 పడకలతో దేశంలో తొలి జాతీయ ప్రకృతి చికిత్స ఆసుపత్రి
కళాశాల ప్రకృతి చికిత్స వైద్య కళాశాల; 2026–27లో బీఎన్‌వైఎస్ కోర్సుకు 100 సీట్లు
సౌకర్యాలు యోగా మందిరం, సాత్విక ఆహార కేంద్రం, జలచికిత్స, అయస్కాంత చికిత్స, వర్ణ చికిత్స, మర్దన, ఫిజియోథెరపీ
గిరిజన సమాజాలకు ప్రకృతి చికిత్స సేవలు
మహారాష్ట్ర ప్రభుత్వ గిరిజన అభివృద్ధి శాఖ సహకారంతో జాతీయ ప్రకృతి చికిత్స సంస్థ పుణె జిల్లా అంబేగావ్ తాలూకాలోని గోహే (బుద్రుక్) గ్రామంలో గిరిజనుల కోసం పూర్తిస్థాయి యోగా, ప్రకృతి చికిత్స ఆసుపత్రి ‘నిసర్గ్ ఆరోగ్య సాధన కేంద్రం’ను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రంలో 20 పడకలు, పురుషులు, మహిళలకు ప్రత్యేక వార్డులు, యోగా మందిరం, ఆహార కేంద్రం ఉన్నాయి.
స్థానికంగా అందుబాటులో ఉన్న వనరుల ద్వారా గిరిజనుల పోషకాహార అవసరాలను తీర్చడం, సహజ చికిత్సలతో స్వయం సమృద్ధి సాధించగల ఆరోగ్య సంరక్షణ నమూనాను అందించడం ఈ కేంద్రం లక్ష్యం. ప్రకృతి చికిత్స, యోగా నైపుణ్యాలను గిరిజన యువత తమ ఆరోగ్య సంరక్షణలో ఉపయోగించుకునేందుకు శిక్షణ కేంద్రంగా కూడా ఇది పనిచేస్తోంది. ఇక్కడ నిర్వహించే చికిత్స సహాయకుల శిక్షణ కోర్సులో ఏటా 40 మంది గిరిజన విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తారు.
ప్రకృతితో సామరస్యంగా జీవించాలని ప్రకృతి చికిత్స సూచిస్తుంది. ప్రకృతితో అనుబంధం, సంప్రదాయ విజ్ఞానం కలిగిన గిరిజన సమాజాల జీవన విధానంలోనూ ఇదే భావన కనిపిస్తుంది. భగవాన్ బిర్సా ముండా జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం నవంబర్ 15న నిర్వహించే జనజాతీయ గౌరవ్ దివస్ సందర్భంగా గిరిజనుల విజ్ఞానం, ప్రకృతితో వారి అనుబంధాన్ని గుర్తించి గౌరవిస్తారు.
ఈ సంప్రదాయ విజ్ఞానాన్ని ప్రభుత్వం మరింత ప్రోత్సహిస్తోంది. గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను ప్రజలకు చేరువ చేసేందుకు సంప్రదాయ వైద్యులను సమాజ స్థాయిలో భాగస్వాములుగా తీర్చిదిద్దే లక్ష్యంతో 2026 జనవరి 16న హైదరాబాద్‌లో జాతీయ స్థాయి సామర్థ్యాభివృద్ధి కార్యక్రమాన్ని కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత వైద్య పరిశోధన మండలి, ఆయుష్ మంత్రిత్వ శాఖ సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది.
దేశవ్యాప్తంగా లక్ష మంది గిరిజన సంప్రదాయ వైద్యులకు గుర్తింపు కల్పించేందుకు మంత్రిత్వ శాఖ సూచనాత్మక లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. జనజాతీయ గౌరవ్ పఖ్వాడా-2026లో భాగంగా నవంబర్ 1, 2 తేదీల్లో హైదరాబాద్‌లో సామర్థ్యాభివృద్ధి సదస్సు నిర్వహించారు. తొమ్మిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సుమారు 1,500 మంది సంప్రదాయ వైద్యులు ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
భావితరాల ప్రకృతి వైద్యులకు శిక్షణ
ప్రకృతి చికిత్స వ్యవస్థ విస్తరిస్తున్న కొద్దీ శిక్షణ పొందిన వైద్యుల అవసరం కూడా పెరుగుతోంది. ఈ అవసరాన్ని తీర్చేందుకు ప్రభుత్వం స్పష్టమైన విద్యా, శిక్షణ మార్గాన్ని రూపొందించింది.
బీఎన్‌వైఎస్ డిగ్రీ కోర్సు
కేంద్ర విశ్వవిద్యాలయమైన న్యూఢిల్లీలోని శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం అనుబంధంతో బ్యాచిలర్ ఆఫ్ నేచురోపతి అండ్ యోగిక్ సైన్సెస్ (బీఎన్‌వైఎస్) కోర్సును అందిస్తున్న దేశంలోని తొలి కేంద్ర ప్రభుత్వ సంస్థ జాతీయ ప్రకృతి చికిత్స సంస్థ.
బీఎన్‌వైఎస్ కోర్సు వ్యవధి ఐదున్నరేళ్లు. విద్యార్థులు ఈ కాలమంతా కళాశాల ప్రాంగణంలోనే ఉంటారు. ఇందులో నాలుగున్నరేళ్లు విద్యా బోధన, వైద్య శిక్షణ ఉంటాయి. ఆ తరువాత ఏడాది పాటు తప్పనిసరి రొటేటరీ రెసిడెన్షియల్ ఇంటర్న్‌షిప్ పూర్తి చేయాలి. 2026–27 విద్యా సంవత్సరానికి నిసర్గ్ గ్రామ్‌లో 100 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 2026 నవంబర్ 30 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.
2024 ఏప్రిల్ 1 నాటికి దేశవ్యాప్తంగా 71 ప్రకృతి చికిత్స అండర్ గ్రాడ్యుయేట్ కళాశాలల్లో 5,214 మంది విద్యార్థులకు ప్రవేశ సామర్థ్యం ఉంది. ఆరు పోస్ట్ గ్రాడ్యుయేట్ కళాశాలల్లో 144 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 2024 జనవరి 1 నాటికి రాష్ట్ర బోర్డులు, మండళ్లలో 5,083 మంది ప్రకృతి వైద్యులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
కేంద్ర స్థాయిలో రిజిస్ట్రేషన్
జాతీయ ప్రకృతి చికిత్స సంస్థ ఆధ్వర్యంలో ఆయుష్ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ప్రకృతి చికిత్స రిజిస్ట్రేషన్ బోర్డు (ఎన్ఆర్బీ), ప్రకృతి వైద్యులకు కేంద్ర స్థాయిలో రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని కల్పిస్తోంది. ప్రకృతి చికిత్స సంస్థలు, ఆసుపత్రులకు గుర్తింపు కూడా అందిస్తోంది. విశ్వవిద్యాలయాల గ్రాంట్ల సంఘం గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాల నుంచి బీఎన్‌వైఎస్ పట్టా పొందినవారు కేంద్ర రిజిస్ట్రేషన్ ధ్రువపత్రం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
స్వీయ ఆరోగ్య సంరక్షణ కోసం కోర్సులు
జాతీయ ప్రకృతి చికిత్స సంస్థ స్వల్పకాలిక నైపుణ్యాభివృద్ధి కోర్సులను కూడా నిర్వహిస్తోంది. ఆక్యుప్రెషర్, ప్రకృతి చికిత్స, ప్రకృతి చికిత్సకు అనుగుణమైన వంట విధానాలకు సంబంధించిన కోర్సులు ప్రధానంగా స్వీయ ఆరోగ్య సంరక్షణకు ఉపయోగపడతాయి. ‘స్వీయ ఆరోగ్య స్వావలంబన’ అనే నినాదంతో ప్రజలు తమ ఆరోగ్యంతోపాటు కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని సంరక్షించుకునేలా ఈ కోర్సులను రూపొందించారు. మర్దన, ఫిట్నెస్ శిక్షణ, యోగా కోర్సులు వృత్తిపరంగా ఉపాధి పొందేందుకు కూడా తోడ్పడతాయి.
శాస్త్రీయ ఆధారాల బలోపేతం: పరిశోధనలు, కొత్త ఆసుపత్రులు
ప్రకృతి చికిత్సకు శాస్త్రీయ పునాదులను బలోపేతం చేయడంలో పరిశోధనలు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ సందర్భంగా ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వైద్య రాజేశ్ కొటేచా మాట్లాడుతూ:
‘‘ప్రకృతి చికిత్స విశ్వసనీయతను పెంపొందించేందుకు, దాని వినియోగాన్ని మరింత విస్తరించేందుకు శాస్త్రీయ ధ్రువీకరణ అత్యవసరం. సీసీఆర్వైఎన్తోపాటు ఇతర సంస్థల ద్వారా క్రమబద్ధమైన పరిశోధనలు, వైద్యపరమైన మూల్యాంకనం, పరస్పర సహకారాన్ని ప్రోత్సహిస్తున్నాం. తద్వారా ప్రకృతి చికిత్సా పద్ధతులను తగిన శాస్త్రీయ విధానాలతో పరిశీలించి, బాధ్యతాయుతమైన ఆరోగ్య సంరక్షణ విధానాలుగా ఉపయోగించేందుకు కృషి చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు.
పరిశోధన మండలి, సంస్థలు, ఆసుపత్రులు
ఆయుష్ మంత్రిత్వ శాఖ నుంచి పూర్తి ఆర్థిక సహాయం పొందుతున్న కేంద్ర యోగా, ప్రకృతి చికిత్స పరిశోధన మండలి (సీసీఆర్‌వైఎన్) 1978 నుంచి యోగా, ప్రకృతి చికిత్స రంగాల్లో పరిశోధన, ప్రచారం, అభివృద్ధి కార్యకలాపాలను నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా ఈ మండలికి 22 విభాగాలు ఉన్నాయి. ఆయుష్ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఐదు పరిశోధన మండళ్లు 2025–26లో మొత్తం 653 పరిశోధన పత్రాలను ప్రచురించాయి.
ప్రస్తుతం హరియాణాలోని ఝజ్జర్, కర్ణాటకలోని నాగమంగళలో 200 పడకల సామర్థ్యంతో యోగా, ప్రకృతి చికిత్స ఆసుపత్రులు అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు యోగా, ప్రకృతి చికిత్స విద్య, పరిశోధన కోసం పోస్ట్ గ్రాడ్యుయేట్ సంస్థలు కూడా ఉన్నాయి.
ఝజ్జర్‌లో 19 ఎకరాల్లో రూ.63.88 కోట్ల వ్యయంతో నిర్మించిన కేంద్ర యోగా, ప్రకృతి చికిత్స పరిశోధన సంస్థ (సీఆర్ఐవైఎన్) అత్యున్నత స్థాయి పరిశోధన, విద్యా కేంద్రంగా పనిచేస్తోంది. నిసర్గ్ గ్రామ్ను ప్రారంభించిన రోజే, 2024 ఫిబ్రవరి 25న ప్రధానమంత్రి ఈ సంస్థను కూడా ప్రారంభించారు.
2024లో ఒడిశాలోని ఖోర్దా, ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో మరో రెండు కేంద్ర యోగా, ప్రకృతి చికిత్స పరిశోధన సంస్థల నిర్మాణానికి ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. 2024 ఏప్రిల్ 1 నాటికి దేశవ్యాప్తంగా 1,663 పడకల సామర్థ్యం కలిగిన 35 ఆసుపత్రులు, 95 డిస్పెన్సరీల్లో ప్రకృతి చికిత్స సేవలు అందుబాటులో ఉన్నాయి.
జాతీయ ప్రకృతి చికిత్స సంస్థలో ప్రత్యేక పరిశోధన విభాగంతోపాటు ఆరోగ్య పరిశోధన విభాగంలో రిజిస్ట్రేషన్ పొందిన సంస్థాగత నైతిక కమిటీ కూడా ఉంది. పరిశోధనా పద్ధతులపై కార్యశాలలు, ఉత్తమ వైద్య పరిశోధన పద్ధతులపై శిక్షణ, పరిశీలనాత్మక అధ్యయనాలు, క్రమబద్ధమైన సమీక్షలు, ఇతర సంస్థలతో సంయుక్త పరిశోధనలను ఈ సంస్థ నిర్వహిస్తోంది.
ప్రస్తుతం సంస్థ అంతర్గతంగా చేపడుతున్న పరిశోధనల్లో వివిధ రకాల ఉపవాస పద్ధతులు, నడుము వరకు నీటిలో కూర్చుని చేసే స్నానాలు, తడి దుప్పటి పట్టీల వినియోగం ఉన్నాయి. టైప్-2 మధుమేహంపై సూర్యరశ్మి ప్రభావం, సమగ్ర ప్రకృతి చికిత్స-యోగా కార్యక్రమం ద్వారా పేగుల్లోని సూక్ష్మజీవులపై కలిగే ప్రభావం, మోకాలి కీళ్ల అరుగుదల సమస్యకు ప్రకృతి చికిత్స, యోగా వినియోగంపైనా అధ్యయనాలు కొనసాగుతున్నాయి.
భారతీయ సంప్రదాయ వైద్య విధానాలకు అంతర్జాతీయ ప్రాధాన్యం
వైద్య చికిత్సల కోసం భారత్‌కు వస్తున్న విదేశీ రోగుల సంఖ్య పెరుగుతోంది. అన్ని రకాల వైద్య సేవల కోసం భారత్‌ను సందర్శించిన అంతర్జాతీయ రోగుల సంఖ్య 2020లో 1,82,945గా ఉండగా, 2024 నాటికి 6,44,387కు చేరుకుంది. ఈ పెరుగుదలలో యోగా, ఆయుర్వేదం, సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ ఆధారిత చికిత్సలు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. దీర్ఘకాలిక వ్యాధులు, జీవనశైలి సంబంధిత రుగ్మతల నిర్వహణ, పునరావాసం, సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాల కోసం విదేశీ రోగులు ఆయుర్వేదం, యోగా, ప్రకృతి చికిత్స, యునానీ, సిద్ధ, హోమియోపతి వంటి భారతీయ సంప్రదాయ వైద్య విధానాలను ఎక్కువగా ఎంచుకుంటున్నారు.
భారత్‌లో ఆరోగ్య పర్యాటకం ప్రధానంగా యోగా, ఆయుర్వేదం, ప్రకృతి చికిత్స వంటి సంప్రదాయ విధానాల ద్వారా వ్యాధుల నివారణ, సమగ్ర ఆరోగ్య సంరక్షణపై దృష్టి సారిస్తోంది. విదేశీయులు ఈ సేవలను మరింత సులభంగా పొందేందుకు ప్రభుత్వం 2023 జూలై 27న ప్రత్యేక ఆయుష్ వీసాను ప్రవేశపెట్టింది. ఆయుష్ వైద్య విధానాల ద్వారా చికిత్స పొందాలనుకునే విదేశీయులు, వారి సహాయకుల కోసం ఈ వీసా సౌకర్యాన్ని కల్పించారు. 2022 ఏప్రిల్‌లో గాంధీనగర్‌లో నిర్వహించిన గ్లోబల్ ఆయుష్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్నోవేషన్ సదస్సులో ప్రధానమంత్రి ఈ వీసా గురించి ప్రకటించారు. వైద్య చికిత్సల కోసం భారత్‌ను అంతర్జాతీయ గమ్యస్థానంగా ప్రోత్సహించే ‘హీల్ ఇన్ ఇండియా’ కార్యక్రమ కార్యాచరణ ప్రణాళికలో ఆయుష్ వీసా ఒక భాగం. 2026 ఫిబ్రవరిలో కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన ఐదు ప్రతిపాదిత ప్రాంతీయ వైద్య పర్యాటక కేంద్రాల్లో ఆయుష్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ కేంద్రాల్లో అధునాతన వైద్య చికిత్సలతోపాటు సంప్రదాయ చికిత్సలు, సంపూర్ణ ఆరోగ్య సేవలు, పునరావాస సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.
ప్రకృతి చికిత్సను మరింత ముందుకు తీసుకెళ్లడం
మంచి ఆహారం, తగినంత విశ్రాంతి, శారీరక శ్రమ, ప్రకృతిలోని సహజ చికిత్సా శక్తి వంటి సరళమైన పద్ధతులపై ప్రకృతి వైద్యం ఆధారపడింది. ఈ వైద్య విధానాన్ని ప్రోత్సహించేందుకు భారత్ జాతీయ ప్రకృతి చికిత్స సంస్థ, దేశంలో తొలి జాతీయ ప్రకృతి చికిత్స ఆసుపత్రి, కేంద్ర విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ కోర్సు, పరిశోధన సంస్థలు, ఆసుపత్రులు, కేంద్ర స్థాయి రిజిస్ట్రేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా ఆరోగ్య కేంద్రాల్లో ఆయుష్ వైద్య సేవలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. 2026 నవంబర్ 18న కర్ణాటకలోని నాగమంగళలో తొమ్మిదో జాతీయ ప్రకృతి చికిత్స దినోత్సవాన్ని నిర్వహించనున్న నేపథ్యంలో ‘ప్రాకృతిక్ చికిత్స, స్వస్థ్ భారత్’ అనే దార్శనికతతో అన్ని వయసుల ప్రజల్లో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ, యోగా, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడంపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు.
References
Ministry of Ayush
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2335313
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2217203
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2222044
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1945070
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2319947
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2224733
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2209263
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2087319
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2008908
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1987900
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2178490
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1678010
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1674434
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1660260
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1697470
https://sansad.in/getFile/lsapps/loksabhaquestions/annex/188/AU1041_6OkVSb.pdf?source=lsapps
https://ayush.gov.in/assets/pdf/whatsnew/Approved-Ayush-in-India-2024-Single.pdf
Ministry of Tribal Affairs
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2335189
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2248346
Prime Minister’s Office
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2206712
PIB Backgrounders
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2257447
National Institute of Naturopathy, Pune
https://ninpune.ayush.gov.in/#!/aboutUs
https://ninpune.ayush.gov.in/#!/missionObjectives
https://ninpune.ayush.gov.in/#!/aboutNisargGram
https://ninpune.ayush.gov.in/#!/naturopathy
https://ninpune.ayush.gov.in/#!/specialOPDs
https://ninpune.ayush.gov.in/#!/ninTribalUnit
https://ninpune.ayush.gov.in/#!/ongoingIMRprojects
https://ninpune.ayush.gov.in/#!/skillDevelopment
Indian Council of Medical Research
https://www.icmr.gov.in/icmrobject/static/icmr/dist/images/pdf/gandhi-and-health/Gandhi_Quote_Book_final_30092020.pdf
Click here to see pdf
***
(Explainer ID: 160843)
आगंतुक पटल : 23
Provide suggestions / comments