Economy

2026-27 ఆర్థిక సంవత్సరంలో భారత్ ఎగుమతుల వృద్ధి: బలమైన పనితీరు, కొత్త మైలురాళ్లు

వార్షిక ప్రాతిపదికన వరుసగా ఏడు నెలల పాటు ఎగుమతుల్లో వృద్ధి

Posted On: 14 NOV 2026 8:35PM

2026-27 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-అక్టోబర్ మధ్య భారత్ ఎగుమతులు 16.66% పెరిగి 568.84 బిలియన్ అమెరికా డాలర్లకు చేరాయి. వివిధ ఉత్పత్తులు, సేవలు, విదేశీ మార్కెట్లలో వృద్ధి నమోదైంది. ఎగుమతుల ప్రోత్సాహక చర్యలు, విస్తరిస్తున్న వాణిజ్య భాగస్వామ్యాలు, మెరుగైన సరకు రవాణా సదుపాయాలు ఈ పురోగతిని కొనసాగించేందుకు భారత వ్యాపార సంస్థలకు తోడ్పడుతున్నాయి. ఏప్రిల్-జూన్‌లో 7.8% జీడీపీ వృద్ధి, జూలై-సెప్టెంబర్‌లో నిరుద్యోగం 5.1%కు తగ్గడం వంటి విస్తృత ఆర్థిక పురోగతికి ఎగుమతుల వృద్ధి తోడవుతోంది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో బలమైన వృద్ధి కొనసాగుతుందని ప్రధాన అంతర్జాతీయ సంస్థలు కూడా అంచనా వేస్తున్నాయి.

 

పరిచయం

అంతర్జాతీయ వాణిజ్యం వ్యాపార సంస్థలు దేశీయ మార్కెట్లను దాటి విస్తరించేందుకు వీలు కల్పిస్తుంది. ఉత్పాదకతకు, దీర్ఘకాలిక ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుంది. భారత్ ఆర్థిక వృద్ధిలో ఎగుమతులు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. అంతర్జాతీయ ప్రతికూలతల మధ్య కూడా వృద్ధిని కొనసాగించేందుకు సహకరిస్తున్నాయి.

 

ఈ పురోగతి కొన్నేళ్లుగా కొనసాగుతోంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో కొత్త గరిష్ఠ స్థాయికి చేరిన భారత్ మొత్తం ఎగుమతులు, తర్వాత ప్రతి ఆర్థిక సంవత్సరంలో కొత్త రికార్డులను నెలకొల్పాయి. 2025-26 నాటికి 863.1 బిలియన్ అమెరికా డాలర్లకు చేరాయి. దీంతో వరుసగా ఐదేళ్లపాటు రికార్డు స్థాయి ఎగుమతులు నమోదయ్యాయి.

 

2026-27 ఆర్థిక సంవత్సరంలోనూ ఈ పురోగతి కొనసాగుతోంది. ఎగుమతుల విలువ పెరగడంతో పాటు పలు ఉత్పత్తులు, విదేశీ మార్కెట్లలో వృద్ధి నమోదవుతోంది.

 

2026-27 ఆర్థిక సంవత్సరంలో కొనసాగుతున్న భారత్ ఎగుమతుల వృద్ధి

2026-27 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-అక్టోబర్ మధ్య మొత్తం ఎగుమతులు 568.84 బిలియన్ అమెరికా డాలర్లుగా అంచనా వేశారు. గత ఏడాది ఇదే కాలంలోని 487.59 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఇది 16.66% పెరుగుదల. వస్తు, సేవల ఎగుమతులు రెండింటిలోనూ వృద్ధి నమోదైంది.

 

ఈ కాలంలో వస్తు ఎగుమతులు 21.96%, సేవల ఎగుమతులు 10.93% పెరిగాయి.

 

2026-27 ఆర్థిక సంవత్సరంలో ప్రతి నెలా ఎగుమతుల్లో వృద్ధి

2026-27 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలలంతటా బలమైన పనితీరు కొనసాగింది. ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య మొత్తం ఎగుమతులు రికార్డు స్థాయిలో 479.0 బిలియన్ అమెరికా డాలర్లకు చేరాయి. ఈ కాలానికి వస్తు, సేవల ఎగుమతులు కూడా గతంలో ఎన్నడూ లేనంత విలువకు చేరాయి.

- వస్తు ఎగుమతులు 259.71 బిలియన్ అమెరికా డాలర్లకు చేరాయి. వార్షిక ప్రాతిపదికన 18.4% పెరిగాయి.

- సేవల ఎగుమతులు 219.27 బిలియన్ అమెరికా డాలర్లకు చేరాయి. వార్షిక ప్రాతిపదికన 10.2% పెరిగాయి.

అక్టోబర్‌లో వృద్ధి మరింత ఊపందుకుంది. మొత్తం ఎగుమతులు 89.99 బిలియన్ అమెరికా డాలర్లుగా అంచనా వేశారు. వార్షిక ప్రాతిపదికన 29.90% వృద్ధి నమోదైంది.

- వస్తు ఎగుమతులు 45.06% పెరిగి 49.47 బిలియన్ అమెరికా డాలర్లకు చేరాయి.

- సేవల ఎగుమతులు 40.51 బిలియన్ అమెరికా డాలర్లుగా అంచనా వేశారు. వార్షిక ప్రాతిపదికన సుమారు 15.2% పెరిగాయి.

 

భారత్ ఎగుమతుల్లో పలు రంగాలకు విస్తరించిన వృద్ధి

ఏ) భారత్ ఎగుమతులకు సేవల రంగం బలమైన ఆధారం: గత దశాబ్దంలో భారత్ సేవల ఎగుమతులు ప్రపంచ సగటు కంటే వేగంగా విస్తరించాయి. భౌగోళిక రాజకీయ పరిణామాలతో తలెత్తే అంతరాయాల ప్రభావం నుంచి దేశ విదేశీ ఆర్థిక లావాదేవీల రంగాన్ని కాపాడటానికి సేవల ఎగుమతులు తోడ్పడ్డాయి. ముప్పును తగ్గించి, వాణిజ్య స్థిరత్వానికి సహకరించాయి.

 

2015 నుంచి 2025 మధ్య భారత్ సేవల ఎగుమతుల సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు 10.3%గా నమోదైంది. ప్రపంచవ్యాప్తంగా ఇది 6.6%. ఫలితంగా ప్రపంచ సేవల ఎగుమతుల్లో భారత్ వాటా 3.1% నుంచి 4.3%కు పెరిగింది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్–అక్టోబర్ మధ్య మొత్తం ఎగుమతుల్లో సేవల వాటా సుమారు 45.7%.

 

భారత్ వాణిజ్య ఒప్పందాల పరిధి విస్తరిస్తుండటంతో సేవల రంగానికి విదేశీ మార్కెట్లు మరింత అందుబాటులోకి వస్తున్నాయి. ఈ ఒప్పందాలు నిపుణులు ఇతర దేశాలకు వెళ్లి పనిచేయడాన్ని సులభతరం చేస్తున్నాయి. వివిధ సేవలు అందించే భారత సంస్థలకు కొత్త అవకాశాలను కల్పిస్తున్నాయి.

 

బీ) వివిధ రంగాల బలమైన పనితీరుతో ఎగుమతులకు ఊతం: పారిశ్రామిక వస్తువులతో పాటు వ్యవసాయ, సంప్రదాయ ఉత్పత్తులు భారత్ వస్తు ఎగుమతుల వృద్ధికి తోడ్పడ్డాయి. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్–అక్టోబర్ మధ్య పది ప్రధాన ఎగుమతి విభాగాల్లో ఏడు రెండంకెల వృద్ధిని నమోదు చేశాయి. గణనీయమైన వృద్ధి నమోదైన కొన్ని విభాగాలు:

ఎంపిక చేసిన ఎగుమతి విభాగం

వార్షిక ప్రాతిపదికన వృద్ధి

ఇతర ధాన్యాలు*

109.74%

పెట్రోలియం ఉత్పత్తులు

47.71%

ఎలక్ట్రానిక్ వస్తువులు

46.92%

మాంసం, పాడి, కోళ్ల పరిశ్రమ ఉత్పత్తులు

40.81%

చేతితో తయారు చేసిన తివాచీలు మినహా హస్తకళా ఉత్పత్తులు

36.05%

ఇంజినీరింగ్ వస్తువులు

22.00%

ప్లాస్టిక్, లినోలియం

19.57%

సేంద్రీయ, అసేంద్రీయ రసాయనాలు

18.21%

సముద్ర ఉత్పత్తులు

13.32%

రత్నాలు, ఆభరణాలు

12.16%

* ఇతర ధాన్యాల్లో రై, బార్లీ, ఓట్స్, ఫోనియో, క్వినోవా తదితరాలు ఉంటాయి. గోధుమలు, బియ్యం, మొక్కజొన్న, చిరుధాన్యాలు ఇందులో ఉండవు.

 

ఎగుమతుల విస్తృత పరిధిలోనూ బలమైన వృద్ధి కనిపిస్తోంది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్–అక్టోబర్ మధ్య పెట్రోలియం మినహా ఇతర ఎగుమతులు వార్షిక ప్రాతిపదికన 18.01% పెరిగి 259.22 బిలియన్ అమెరికా డాలర్లకు చేరాయి.

 

వివిధ రంగాల్లో ఎగుమతి విజయాలు

ఎలక్ట్రానిక్ విడిభాగాల నుంచి ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల వరకు వివిధ ఉత్పత్తుల విజయాలు విదేశీ మార్కెట్లకు చేరుతున్న భారత వస్తువుల వైవిధ్యాన్ని చాటుతున్నాయి.

 

విభిన్న ఎలక్ట్రానిక్ ఉత్పత్తులతో వృద్ధికి ఊతం: 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య ఎలక్ట్రానిక్ వస్తువుల ఎగుమతులు వార్షిక ప్రాతిపదికన 44% పెరిగి 31.97 బిలియన్ అమెరికా డాలర్లకు చేరాయి. స్మార్ట్‌ఫోన్లతో పాటు ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్లోనూ వృద్ధి నమోదైంది.

 

- స్మార్ట్‌ఫోన్లు మినహా ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ఎగుమతులు 56.5% పెరిగాయి. స్మార్ట్‌ఫోన్ల ఎగుమతుల వృద్ధి 35.8% కంటే ఇది అధికం.

- విడిభాగాలు, పరికరాల్లోనూ వృద్ధి విస్తరించింది. ఇతర మౌంటెడ్ సర్క్యూట్ బోర్డుల ఎగుమతులు 3,219% పెరిగాయి.

- మెమరీ చిప్‌లు, సాలిడ్-స్టేట్ స్టోరేజ్ పరికరాల ఎగుమతులు వరుసగా 2,332%, 1,681% పెరిగాయి.

- లోడెడ్ సర్క్యూట్ బోర్డుల ఎగుమతులు 304%, నెట్‌వర్కింగ్ పరికరాల ఎగుమతులు 98% పెరిగాయి.

ఈ ఉత్పత్తుల ప్రధాన ఎగుమతి గమ్యస్థానాల్లో సింగపూర్, చైనా, హాంకాంగ్ ప్రముఖంగా నిలిచాయి. మెమరీ చిప్‌లకు మలేసియా ప్రధాన మార్కెట్‌గా ఉండగా, నెట్‌వర్కింగ్ పరికరాలకు అమెరికా, నెదర్లాండ్స్ ముఖ్యమైన మార్కెట్లుగా నిలిచాయి.

 

భారత ప్రధాన ఆహార ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్లలో వృద్ధి: ఎలక్ట్రానిక్స్‌తో పాటు 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య కొన్ని వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్లోనూ బలమైన వృద్ధి నమోదైంది.

- బాస్మతి బియ్యం ఎగుమతులు వార్షిక ప్రాతిపదికన 25% పెరిగి 1,601 మిలియన్ అమెరికా డాలర్లకు చేరాయి. ఇరాన్, సౌదీ అరేబియా, అమెరికా ప్రధాన మార్కెట్లుగా నిలిచాయి.

- ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల్లోనూ వృద్ధి నమోదైంది. ఫ్రోజెన్ బంగాళాదుంపల ఎగుమతులు 21% పెరిగి 179 మిలియన్ అమెరికా డాలర్లకు చేరాయి.

- ఈ ఉత్పత్తుల్లో యెల్లో డెంట్ మొక్కజొన్న ఎగుమతులు అత్యధికంగా 1,156% పెరిగి 123 మిలియన్ అమెరికా డాలర్లకు చేరాయి. బంగ్లాదేశ్, వియత్నాం, ఫిలిప్పీన్స్ ప్రధాన మార్కెట్లుగా ఉన్నాయి.

 

ప్రపంచ మార్కెట్లలో విస్తరిస్తున్న భారత్ ఎగుమతులు

భారత్ ప్రధాన విదేశీ మార్కెట్లలోనూ ఎగుమతుల వృద్ధి బలంగా నమోదైంది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్–అక్టోబర్ మధ్య పది అతిపెద్ద వస్తు ఎగుమతి గమ్యస్థానాల్లో ఎనిమిది రెండంకెల వృద్ధిని సాధించాయి.

ఎంపిక చేసిన ఎగుమతి గమ్యస్థానాలు

వార్షిక ప్రాతిపదికన వృద్ధి

సింగపూర్

107.50%

మలేసియా

106.87%

స్పెయిన్

88.38%

దక్షిణాఫ్రికా

62.20%

శ్రీలంక

60.42%

హాంకాంగ్

47.61%

జపాన్

41.02%

చైనా

37.71%

జర్మనీ

14.53%

అమెరికా

14.48%

యూకే

13.30%

 

ప్రధాన మార్కెట్లను దాటిన ఎగుమతుల వృద్ధి

భారత్ అతిపెద్ద ఎగుమతి గమ్యస్థానాలకే పరిమితం కాకుండా ఇతర మార్కెట్లలోనూ వాణిజ్యం విస్తరించింది. ప్రాంతాల వారీ పరిస్థితి ఈ విస్తృత వ్యాప్తిని ప్రతిబింబిస్తోంది.

 

కొత్త మార్కెట్లకు చేరుతున్న మరిన్ని ఉత్పత్తులు

2026-27 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య ఒక దేశానికి ఒక ఉత్పత్తిని ఎగుమతి చేసి, గత ఏడాది ఇదే కాలంలో ఆ ఉత్పత్తిని ఆ దేశానికి ఎగుమతి చేయకపోతే, ఆ ఉత్పత్తి–దేశం కలయికను కొత్త మార్కెట్‌గా పరిగణిస్తారు.

 

2026-27 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య భారత్ ఎగుమతుల పరిధి మరింత విస్తరించింది. కొత్తగా ఏర్పడిన 1,985 ఉత్పత్తి–మార్కెట్ కలయికల ద్వారా 622.1 మిలియన్ అమెరికా డాలర్ల ఎగుమతులు జరిగాయి. 229 దేశాలు, ప్రాంతాల్లో 116 ఉత్పత్తి వర్గాలకు ఇవి విస్తరించాయి. ఇందులో ప్రధాన ఐదు ఉత్పత్తులు:

- ఓడలు, పడవలు, తేలియాడే నిర్మాణాలు 293.3 మిలియన్ అమెరికా డాలర్లతో ముందున్నాయి. ఈ ఎగుమతుల్లో వీటి వాటా 47.2%.

- వెండి ఎగుమతులు 70.6 మిలియన్ అమెరికా డాలర్లు. వీటి వాటా 11.3%.

- గోధుమల ఎగుమతులు 61.3 మిలియన్ అమెరికా డాలర్లు. వీటి వాటా 9.9%.

- రైల్వే పరికరాలు, విడిభాగాల ఎగుమతులు 55.8 మిలియన్ అమెరికా డాలర్లు. మొత్తం వాటాలో ఇవి 9.0%.

- మోటారు వాహనాలు, కార్ల ఎగుమతులు 9.5 మిలియన్ అమెరికా డాలర్లు. వీటి వాటా 1.5%.

 

ప్రాంతీయ ప్రత్యేక ఉత్పత్తులకు కొత్త మార్కెట్లు

స్థానిక ఉత్పత్తులు కూడా కొత్త గమ్యస్థానాలకు చేరుతున్నాయి. భారత్ ప్రాంతీయ ప్రత్యేక ఉత్పత్తులు విదేశీ కొనుగోలుదారులకు అందుతున్నాయి. అక్టోబర్ 2026లో జరిగిన కొన్ని ఎగుమతులు ఈ విస్తరణను చాటుతున్నాయి:

 

ఫ్రోజెన్ ఆహార ఉత్పత్తులు: హర్యానాలోని సోనిపట్ నుంచి కెనడాకు 24 టన్నులు రవాణా చేశారు.

 

సేంద్రీయ తాటి బెల్లం పొడి: తమిళనాడులోని ఈరోడ్ నుంచి బల్గేరియాకు తొలిసారిగా 1.75 టన్నులు రవాణా చేశారు.

 

లిక్విడ్‌ గ్లూకోజ్: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నుంచి వియత్నాంకు తొలిసారిగా వాణిజ్య ప్రాతిపదికన 48 టన్నులు రవాణా చేశారు.

 

సిందూరి దానిమ్మలు: హిమాచల్ ప్రదేశ్‌లోని కుల్లు నుంచి దుబాయ్‌కి 1.3 టన్నులు ఎగుమతి చేశారు.

 

కివీ: అరుణాచల్ ప్రదేశ్‌లోని జీరో నుంచి దుబాయ్‌కి 1.5 టన్నులు రవాణా చేశారు.

 

జీఐ గుర్తింపు గల తాండూరు కంది: తెలంగాణ నుంచి ఆస్ట్రేలియాకు తొలిసారిగా 2.5 టన్నులు రవాణా చేశారు.

 

జీఐ గుర్తింపు గల సియోని జంబో సీతాఫల్: స్వయం సహాయక బృందం నుంచి సేకరించిన సుమారు 1.25 టన్నులను మధ్యప్రదేశ్ నుంచి షార్జాకు తొలిసారిగా రవాణా చేశారు.

 

వాణిజ్య ఒప్పంద భాగస్వాములతో పెరిగిన ఎగుమతులు

2026-27 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య వివిధ వాణిజ్య ఒప్పంద భాగస్వామ్య దేశాలకు భారత్ ఎగుమతులు పెరిగాయి.

- ప్రాంతీయ భాగస్వామ్యాల్లో బలమైన వృద్ధి నమోదైంది. ఆగ్నేయాసియా దేశాల సంఘానికి (ఆసియాన్) ఎగుమతులు 58%, సౌత్ ఏషియన్ ఫ్రీ ట్రేడ్ ఏరియా (సాఫ్టా) సభ్య దేశాలకు ఎగుమతులు 22% పెరిగాయి.

- భాగస్వామ్య దేశాల్లో సింగపూర్, మలేసియా, శ్రీలంక ప్రత్యేకంగా నిలిచాయి. సింగపూర్‌కు ఎగుమతులు రెట్టింపునకు పైగా, అంటే 103% పెరిగాయి. మలేసియాకు 83%, శ్రీలంకకు 73% పెరిగాయి.

- ఇతర దీర్ఘకాలిక భాగస్వామ్య దేశాలకూ ఎగుమతులు విస్తరించాయి. జపాన్, దక్షిణ కొరియాలకు వరుసగా 40%, 24% పెరిగాయి. నేపాల్, భూటాన్, థాయ్‌లాండ్‌లకు వరుసగా 19%, 16%, 7% పెరిగాయి.

ఇటీవలి వాణిజ్య ఒప్పందాల పరిధిలో ఎగుమతుల పనితీరు:

- ఇటీవలి ఒప్పంద భాగస్వాముల్లో ఒమన్, మారిషస్ అత్యధిక వృద్ధిని నమోదు చేశాయి. ఈ దేశాలకు ఎగుమతులు వరుసగా 47%, 45% పెరిగాయి.

- ఆస్ట్రేలియాకు ఎగుమతులు 11% పెరిగాయి. యూకే, యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్‌కు (ఈఎఫ్‌టీఏ) వరుసగా 7%, 5% వృద్ధి నమోదైంది.

భారత్-ఈయూ ఎఫ్‌టీఏ వచ్చే ఏడాది ప్రారంభంలో అమల్లోకి రానుండటంతో, ఒక పెద్ద వాణిజ్య కూటమిలో భారత ఎగుమతులకు పోటీపరమైన ప్రయోజనం లభించనుంది.

 

భారత్ విస్తృత ఆర్థిక పురోగతిలో ఎగుమతుల పాత్ర

బలమైన దేశీయ డిమాండ్, మెరుగవుతున్న ఉపాధి పరిస్థితులు, పటిష్ఠమైన విదేశీ ఆర్థిక స్థితితో పాటు దేశ విస్తృత ఆర్థిక పురోగతికి ఎగుమతుల వృద్ధి తోడ్పడుతోంది.

 

బలమైన దేశీయ పునాది

2026-27 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్–జూన్ మధ్య వాస్తవ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వార్షిక ప్రాతిపదికన 7.8% పెరిగింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి కూడా వృద్ధి అవకాశాలు బలంగా ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓఈసీడీ, ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ 7–7.1% వృద్ధిని అంచనా వేస్తున్నాయి. వినియోగం, పెట్టుబడులు, ఎగుమతులు, సేవలు ఆర్థిక వృద్ధికి ప్రధాన చోదకాలుగా ఉంటాయని పేర్కొంటున్నాయి.

 

2026-27 మొదటి త్రైమాసికంలో భారత్ జీడీపీ పనితీరు గురించి మరింత తెలుసుకునేందుకు ‘భారత్ జీడీపీ పనితీరు’ చూడండి.

 

ఏళ్లుగా తగ్గుతున్న పేదరికం

పేదరికం తగ్గడంలోనూ భారత్ ఆర్థిక పురోగతి ప్రతిబింబిస్తోంది. ప్రపంచ బ్యాంక్ ‘పావర్టీ & ఈక్విటీ బ్రీఫ్’ (అక్టోబర్ 2026) ప్రకారం.. రోజుకు 4.20 అమెరికా డాలర్ల కంటే తక్కువ ఆదాయంతో జీవించే భారతీయుల వాటా 2011లో 57.7% నుంచి 2023లో 16.1%కు తగ్గింది. దీంతో సుమారు 496 మిలియన్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. ఇదే కాలంలో తీవ్ర పేదరికం, అంటే రోజుకు 3 అమెరికా డాలర్ల కంటే తక్కువతో జీవించేవారి వాటా 27.1% నుంచి 2.6%కు తగ్గింది.

 

భారత్ ఉపాధి మార్కెట్‌లో విస్తృత మెరుగుదల

ఈ ఆర్థిక విస్తరణతో పాటు ఇటీవలి ఉపాధి మార్కెట్ సూచికలు శ్రామిక భాగస్వామ్యం, ఉపాధి మెరుగుపడుతున్నట్లు చూపిస్తున్నాయి.

సూచిక

సూచిక తెలిపే అంశం

ప్రాంతం

ఏప్రిల్–జూన్ 2026

జూలై–సెప్టెంబర్ 2026

శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు (ఎల్‌ఎఫ్‌పీఆర్)

జనాభాలో పనిచేస్తున్న, పని కోసం వెతుకుతున్న లేదా పని చేయడానికి అందుబాటులో ఉన్నవారి వాటా

గ్రామీణ

56.9%

58.1%

   

పట్టణ

50.2%

50.4%

కార్మిక–జనాభా నిష్పత్తి (డబ్ల్యూపీఆర్)

జనాభాలో ఉపాధి పొందుతున్నవారి నిష్పత్తి

గ్రామీణ

54.2%

55.6%

   

పట్టణ

46.8%

46.9%

అదనంగా, 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్నవారిలో నిరుద్యోగం ఏప్రిల్–జూన్‌లో 5.4% నుంచి జూలై–సెప్టెంబర్ 2026లో 5.1%కు తగ్గింది.

 

మహిళల భాగస్వామ్యం ముందడుగు: గ్రామీణ మహిళల్లో శ్రామిక శక్తి భాగస్వామ్యం ఏప్రిల్–జూన్‌లో 37.2% నుంచి జూలై–సెప్టెంబర్ 2026లో 39.2%కు పెరిగింది. ఇదే కాలంలో పట్టణ మహిళల్లో 25.0% నుంచి 25.5%కు పెరిగింది.

 

అందువల్ల మెరుగుదల కేవలం నిరుద్యోగం తగ్గడానికే పరిమితం కాలేదు. మరింత మంది ఉపాధి మార్కెట్‌లో భాగస్వాములవుతున్నారు, జనాభాలో ఉపాధి పొందుతున్నవారి వాటా కూడా పెరుగుతోంది.

 

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, విదేశీ మారకద్రవ్య నిల్వలు

నిరంతర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, గణనీయమైన నిల్వలు భారత్ విదేశీ ఆర్థిక స్థితికి బలం చేకూరుస్తున్నాయి. నికర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం ఏప్రిల్–సెప్టెంబర్ 2026లో 8.8 బిలియన్ అమెరికా డాలర్లకు పెరిగింది. గత ఏడాది ఇదే కాలంలో ఇది 7.4 బిలియన్ డాలర్లు. 6 నవంబర్ 2026 నాటికి విదేశీ మారకద్రవ్య నిల్వలు 719.55 బిలియన్ అమెరికా డాలర్లుగా ఉన్నాయి. విదేశీ ఆర్థిక ఒడిదొడుకులను ఎదుర్కొనేందుకు ఇవి గణనీయమైన రక్షణ కల్పిస్తున్నాయి.

 

భారత్ ఎగుమతుల వృద్ధిని కొనసాగించే విధానపరమైన మద్దతు

భారత్ విదేశీ వాణిజ్యానికి చట్టబద్ధమైన పునాది

ఫారిన్ ట్రేడ్ (డెవలప్‌మెంట్ అండ్ రెగ్యులేషన్) యాక్ట్, 1992 భారత్ విదేశీ వాణిజ్యానికి చట్టబద్ధమైన వ్యవస్థను అందిస్తోంది.

 

సుంకాల ఉపశమనం, ఉత్పత్తికి మద్దతు, స్థానిక ఎగుమతుల అభివృద్ధి, ప్రత్యేక సాయం ద్వారా భారత్ ఎగుమతి విధానం వ్యాపారాలకు తోడ్పడుతోంది. 1 ఏప్రిల్ 2023 నుంచి అమల్లో ఉన్న ఫారిన్ ట్రేడ్ పాలసీ (ఎఫ్‌టీపీ) 2023 దేశ ఎగుమతులు, దిగుమతులకు సమగ్ర విధానాన్ని అందిస్తోంది. దానితో పాటు ఉన్న హ్యాండ్‌బుక్ ఆఫ్ ప్రొసీజర్స్ (హెచ్‌బీపీ) ఈ నిబంధనలను ఎలా అమలు చేయాలో వివరిస్తుంది.

 

ఎగుమతుల పోటీతత్వం పెంపు

ఎగుమతి ఉత్పత్తికి మద్దతు

ఎగుమతి ఉత్పత్తికి అవసరమైన ముడి పదార్థాలు, పరికరాలను పొందేందుకు ఎఫ్‌టీపీ కింద సదుపాయాలు ఉన్నాయి:

పథకం

ప్రధాన నిబంధనలు

అడ్వాన్స్ ఆథరైజేషన్ (ఏఏ)

ఎగుమతి ఉత్పత్తుల్లో నేరుగా భాగమయ్యే ముడి పదార్థాలను సుంకం లేకుండా దిగుమతి చేసుకునేందుకు అనుమతిస్తుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 26,283 అనుమతిపత్రాలు జారీ చేశారు.

డ్యూటీ ఫ్రీ ఇంపోర్ట్ ఆథరైజేషన్ (డీఎఫ్‌ఐఏ)

ఎగుమతుల అనంతర ప్రాతిపదికన ముడి పదార్థాలను సుంకం లేకుండా దిగుమతి చేసుకునేందుకు అనుమతిస్తుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 3,579 అనుమతిపత్రాలు జారీ చేశారు.

ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ క్యాపిటల్ గూడ్స్ (ఈపీసీజీ)

ఉత్పత్తికి ముందు, ఉత్పత్తి సమయంలో, ఉత్పత్తి తర్వాత అవసరమైన మూలధన వస్తువులను సున్నా కస్టమ్స్ సుంకంతో దిగుమతి చేసుకునేందుకు అనుమతిస్తుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 21,838 అనుమతిపత్రాలు జారీ చేశారు.

 

దేశీయ పన్నుల భారం తగ్గింపు

ఎగుమతి ఉత్పత్తుల ధరల్లో భాగంగా ఉన్న అర్హత గల పన్నులు, ఇతర విధింపుల భారాన్ని తిరిగి చెల్లింపు విధానాలు తగ్గిస్తున్నాయి:

పథకం

ప్రధాన నిబంధనలు

రెమిషన్ ఆఫ్ డ్యూటీస్ అండ్ టాక్సెస్ ఆన్ ఎక్స్‌పోర్టెడ్ ప్రొడక్ట్స్ (ఆర్‌ఓడీటీఈపీ)

31.12.2026 వరకు పొడిగించారు. డొమెస్టిక్ టారిఫ్ ఏరియా (డీటీఏ) యూనిట్లు, ఏఏ అనుమతిపత్రాలు కలిగినవారు, ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్) యూనిట్లు, ఎగుమతి ఆధారిత యూనిట్ల (ఈఓయూలు) అర్హత గల ఎగుమతులపై ఇతర మార్గాల్లో తిరిగి పొందని పన్నులు, సుంకాలను తిరిగి చెల్లిస్తుంది. 2021 ఏప్రిల్–2025 డిసెంబర్ మధ్య ఎగుమతిదారులకు ₹77,262.60 కోట్ల ప్రయోజనాలు లభించాయి.

రిబేట్ ఆఫ్ స్టేట్ అండ్ సెంట్రల్ టాక్సెస్ అండ్ లెవీస్ (ఆర్‌ఓఎస్‌సీటీఎల్)

31.12.2026 వరకు పొడిగించారు. దుస్తులు, తయారైన ఇతర వస్త్ర ఉత్పత్తులపై ఇతర మార్గాల్లో తిరిగి పొందని రాష్ట్ర, కేంద్ర పన్నులు, విధింపులను తిరిగి చెల్లిస్తుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 444+ జిల్లాల్లో 15,400+ మంది ఎగుమతిదారులకు ప్రయోజనం కలిగింది. వీరిలో ప్రధానంగా ఎంఎస్‌ఎంఈలు ఉన్నాయి.

 

ఎగుమతుల్లో భాగస్వామ్యం విస్తరణ: స్థానిక వ్యాపారాలకు ప్రపంచ మార్కెట్లు

ఎంఎస్‌ఎంఈలు, స్టార్టప్‌లు, హస్తకళాకారులు, చిన్న ఎగుమతిదారులకు తోడ్పడేందుకు పలు విధానపరమైన, సౌలభ్య చర్యలు చేపట్టారు.

 

ఏ) డిస్ట్రిక్ట్స్ యాజ్ ఎక్స్‌పోర్ట్ హబ్స్ (డీఈహెచ్): ఎగుమతి ప్రణాళికలో ప్రతి జిల్లాను ఒక యూనిట్‌గా పరిగణించే కార్యక్రమం ఇది. స్థానిక వ్యాపారాలు పోటీపడే సామర్థ్యాన్ని పెంచుకునేందుకు, ప్రపంచ మార్కెట్లను చేరుకునేందుకు తోడ్పడుతుంది. ఆత్మనిర్భర్ భారత్, వోకల్ ఫర్ లోకల్ లక్ష్యాలకు అనుగుణంగా జిల్లా ఆధారిత వృద్ధికి మద్దతు ఇస్తుంది.

 

మార్చి 2026 నాటికి 590 జిల్లాలకు ముసాయిదా ప్రణాళికలు రూపొందించారు. వాటిలో 249 ప్రణాళికలను జిల్లా ఎగుమతుల ప్రోత్సాహక కమిటీలు అధికారికంగా ఆమోదించాయి.

 

బీ) ఈ-కామర్స్ ఎగుమతులు: డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో వస్తువులు, సేవల అంతర్జాతీయ వాణిజ్యానికి ఎఫ్‌టీపీ విధానపరమైన మద్దతు అందిస్తుంది. ఈ-కామర్స్‌ను, కొత్త ఎగుమతి మార్గాలను ప్రోత్సహిస్తుంది. ఇందులో భాగంగా ఈ-కామర్స్ ఎక్స్‌పోర్ట్ హబ్స్‌ను (ఈసీఈహెచ్‌లు) సరిహద్దులు దాటి జరిగే ఈ-కామర్స్‌కు వ్యాపార మౌలిక వసతులు, సదుపాయాలు అందించే కేంద్రాలుగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది.

 

ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ మిషన్ (ఈపీఎం): సమగ్ర ప్రోత్సాహం

2025 నవంబర్‌లో ఆమోదం పొందిన ఈపీఎంకు 2025-26 నుంచి 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు ₹25,060 కోట్ల కేటాయింపు ఉంది. ఎగుమతుల పోటీతత్వాన్ని పెంచడం, ఎగుమతులను విస్తరించడం, ఉపాధి కల్పించడం దీని లక్ష్యాలు. వాణిజ్యానికి నిధులు, నిబంధనల అనుసరణ, మార్కెట్ అవకాశాలు, సరకు రవాణా అంశాల్లో ఆర్థిక, ఆర్థికేతర సాయాన్ని సమగ్రంగా అందిస్తుంది. ఎంఎస్‌ఎంఈలు, తొలిసారి ఎగుమతులు చేసేవారు, ఎక్కువ శ్రమశక్తి అవసరమయ్యే రంగాలు, అంతర్గత ప్రాంతాలు, ఎగుమతులు తక్కువగా జరిగే ప్రాంతాల ఎగుమతిదారులపై ఈ పథకం దృష్టి పెడుతోంది.

 

వాణిజ్య అంతరాయాల సమయంలో సాయం: ఈపీఎం కింద రెజిలియన్స్ & లాజిస్టిక్స్ ఇంటర్వెన్షన్ ఫర్ ఎక్స్‌పోర్ట్ ఫెసిలిటేషన్ (రిలీఫ్)కు ₹497 కోట్ల కేటాయింపు ఉంది. ముఖ్యంగా ఎంఎస్‌ఎంఈలకు ఇది మద్దతు ఇస్తుంది. గల్ఫ్–పశ్చిమాసియా సముద్ర రవాణాలో అంతరాయాల వల్ల పెరిగిన సరకు రవాణా ఖర్చులు, బీమా ప్రీమియంలు, యుద్ధ సంబంధిత ముప్పులకు సాయం అందిస్తుంది. అర్హత గల గత సరకు రవాణాలకు, భవిష్యత్తు ఎగుమతులకు కూడా వర్తిస్తుంది.

 

విదేశీ మార్కెట్లకు అవకాశాలు: పెరుగుతున్న వాణిజ్య భాగస్వామ్యాలు

భారత్ వాణిజ్య భాగస్వామ్యాలు విస్తరిస్తూ విదేశీ మార్కెట్లకు అవకాశాలను పెంచుతున్నాయి. అంతర్జాతీయ సవాళ్ల మధ్య ఆర్థిక వ్యవస్థ ఒడిదొడుకులను తట్టుకునే సామర్థ్యాన్ని బలోపేతం చేస్తున్నాయి.

 

మారుతున్న భారత్ వాణిజ్య భాగస్వామ్యాల స్వరూపం: ఇటీవలి ఒప్పందాలను అమలు చేయడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా తన పరిధిని విస్తరించేందుకు భారత్ తొమ్మిది వాణిజ్య చర్చలు చేపడుతోంది. అమెరికా, కెనడా, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ), ఇతర భాగస్వాములతో చర్చలు ఇందులో ఉన్నాయి. అదనంగా నాలుగు ఒప్పందాల సమీక్ష లేదా మెరుగుదల చర్చలు కూడా కొనసాగుతున్నాయి. భారత్–కొరియా సీఈపీఏ, ఆసియాన్–ఇండియా ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంట్ వీటిలో ఉన్నాయి.

 

ప్రత్యేక ఆర్థిక మండళ్లు (సెజ్‌లు): ఎగుమతి మౌలిక వసతుల విస్తరణ

వాణిజ్యం, పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా గుర్తించిన ప్రాంతాలే సెజ్‌లు. దేశీయ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, మౌలిక వసతులను అభివృద్ధి చేయడం, పారిశ్రామిక కార్యకలాపాలకు వీలు కల్పించడం ద్వారా ఎగుమతులకు తోడ్పడతాయి. విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జిస్తాయి, ప్రత్యక్ష, పరోక్ష ఉపాధిని కల్పిస్తాయి. స్థానిక వ్యాపారాలు, ఆర్థిక వ్యవస్థలకు ఊతమిస్తాయి. జూలై 2026 నాటికి మొత్తం 372 సెజ్‌లను నోటిఫై చేశారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా ఎనిమిది సెజ్‌లను నోటిఫై చేశారు.

సంస్థ

రంగం

ప్రాంతం

ప్రతిపాదిత పెట్టుబడి (సుమారు ₹ కోట్లు)

ప్రతిపాదిత ప్రత్యక్ష/పరోక్ష ఉద్యోగాలు (సుమారు)

టాటా సెమీకండక్టర్ మాన్యుఫాక్చరింగ్ ప్రైవేట్ లిమిటెడ్

ఐటీ/ఐటీఈఎస్ సహా ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్

ధోలేరా ప్రత్యేక పెట్టుబడి ప్రాంతం, గుజరాత్

91,000

21,900

ఎన్‌డీఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్

బహుళ రంగాలు

రాణిపేట జిల్లా, తమిళనాడు

316.1075

1,000

పాండిచ్చేరి ఇండస్ట్రియల్ ప్రమోషన్ డెవలప్‌మెంట్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ (పీఐపీడీఐసీ)

బహుళ రంగాలు

పుదుచ్చేరి జిల్లా, పుదుచ్చేరి (కేంద్రపాలిత ప్రాంతం)

1,250

5,000

ఊల్గారెట్ మునిసిపాలిటీ సెజ్

ఐటీ/ఐటీఈఎస్

పుదుచ్చేరి జిల్లా, పుదుచ్చేరి (కేంద్రపాలిత ప్రాంతం)

725

3,500

కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్

ఐటీ/ఐటీఈఎస్

విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్

1,582.98

17,302

హెటెరోజీనియస్ ఇంటిగ్రేషన్ ప్యాకేజింగ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్

సెమీకండక్టర్

ఖోర్ధా, జట్నీ, ఒడిశా

297.39

250

పాలీమాటెక్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్

ఎలక్ట్రానిక్స్, ఇంజినీరింగ్—సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ తయారీ

నవా రాయ్‌పూర్, అటల్ నగర్, ఛత్తీస్‌గఢ్

130

1,300

ఎన్‌ఐడీపీ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్

డేటా సెంటర్ అభివృద్ధికి ఐటీ/ఐటీఈఎస్ సెజ్

గ్రేటర్ నోయిడా, గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా, ఉత్తరప్రదేశ్

2,448.66

166

 

ఎగుమతుల నిర్వహణ సులభతరం

డిజిటల్ సేవలు, సరళమైన కస్టమ్స్ విధానాలు, సరకు రవాణా మౌలిక వసతులను సులువుగా పొందే అవకాశాల ద్వారా భారత్ ఎగుమతుల నిర్వహణను బలోపేతం చేస్తోంది.

 

అంతర్జాతీయ వాణిజ్య సమాచారం, సేవలను ఒకే చోట అందించి భారత ఎగుమతిదారులకు తోడ్పడేలా ట్రేడ్ కనెక్ట్‌ను రూపొందించారు. ప్రపంచ మార్కెట్లను చేరుకోవడాన్ని ఇది సులభతరం చేస్తుంది.

 

ఐస్‌గేట్ (ఇండియన్ కస్టమ్స్ ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్‌చేంజ్ (ఈడీఐ) గేట్‌వే) ఒకే డిజిటల్ వేదిక ద్వారా భారత కస్టమ్స్, వ్యాపారులను అనుసంధానిస్తుంది. కస్టమ్స్ విధానాలను సరళీకరించి, అంతర్జాతీయ వాణిజ్యానికి తోడ్పడుతుంది.

 

యూనిఫైడ్ లాజిస్టిక్స్ ఇంటర్‌ఫేస్ ప్లాట్‌ఫామ్ (యూలిప్) ఏపీఐల ద్వారా ప్రభుత్వ సరకు రవాణా వ్యవస్థలను అనుసంధానిస్తుంది. జూలై 2026 నాటికి 12 కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని 46 వ్యవస్థలను 142 ఏపీఐల ద్వారా యూలిప్ అనుసంధానించింది.

 

లాజిస్టిక్స్ డేటా బ్యాంక్ (ఎల్‌డీబీ) ఎగుమతి–దిగుమతి (ఎగ్జిమ్) కంటెయినర్ల కదలికలను ఎప్పటికప్పుడు గుర్తిస్తుంది. సమాచార మార్పిడిని మెరుగుపరుస్తుంది, సరకు రవాణా స్థితిని తెలుసుకునేందుకు వీలు కల్పిస్తుంది.

 

డాక్ ఘర్ నిర్యాత్ కేంద్రాలు (డీఎన్‌కేలు) బుకింగ్, డిజిటల్ పత్రాలు, కస్టమ్స్ అనుమతుల ద్వారా తపాలా ఎగుమతులను సులభతరం చేస్తాయి. జనవరి 2026 నాటికి దేశవ్యాప్తంగా 1,013 డీఎన్‌కేలు పనిచేస్తున్నాయి. మారుమూల ప్రాంతాల్లోని ఎగుమతిదారులు ప్రపంచ మార్కెట్లకు చేరేందుకు తోడ్పడుతున్నాయి.

 

ఎగుమతుల వృద్ధికి తోడ్పడే విస్తృత విధాన వ్యవస్థ

మేక్ ఇన్ ఇండియా, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్‌ఐ) పథకాలు, పీఎం మిత్ర పార్కులు తయారీ సామర్థ్యాలను, ఎగుమతి సామర్థ్యాన్ని బలోపేతం చేస్తూ భారత్ ఎగుమతుల వృద్ధికి ఊతమిస్తున్నాయి.

 

నేషనల్ లాజిస్టిక్స్ పాలసీ, పీఎం గతిశక్తి, సాగర్‌మాలా ఈ ప్రయత్నాలకు తోడవుతున్నాయి. మెరుగైన అనుసంధానం, తక్కువ సరకు రవాణా ఖర్చుల ద్వారా ఎగుమతుల పోటీతత్వాన్ని పెంచేందుకు సహకరిస్తున్నాయి.

 

ముగింపు

భారత్ ఇటీవలి ఎగుమతుల పనితీరు వస్తు, సేవల రంగాలు రెండింటిలోనూ వృద్ధిని ప్రతిబింబిస్తోంది. వివిధ ఉత్పత్తులు, భాగస్వామ్య దేశాలకు ఈ వృద్ధి విస్తరించింది. పోటీతత్వాన్ని పెంచేందుకు, కొత్త కొనుగోలుదారులను చేరుకునేందుకు ఎగుమతిదారులు, ఎంఎస్‌ఎంఈలు, వ్యాపారులు, ప్రభుత్వం సమష్టిగా చేస్తున్న కృషి ఈ విస్తరణకు ఆధారం. తయారీ ప్రోత్సాహకాలు, మార్కెట్లను చేరుకునేందుకు సాయం, సరకు రవాణా కార్యక్రమాల రూపంలో నిరంతర విధానపరమైన మద్దతు ఈ ప్రయత్నాలకు అండగా ఉంది.

 

వాణిజ్యాన్ని సులభతరం చేయడం, అనుసంధానాన్ని మెరుగుపరచడం, కొత్త మార్కెట్లలో ప్రవేశించేందుకు వ్యాపారాలకు సహకరించడం వంటి చర్యలు ఈ మద్దతును మరింత బలోపేతం చేస్తున్నాయి. మరిన్ని మార్కెట్లకు విస్తరించేందుకు భారత వ్యాపార సంస్థలకు ఈ చర్యలు తోడ్పడతాయి.

 

References

Ministry of Commerce & Industry

https://www.commerce.gov.in/files/2026-04/Annual_0.pdf

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2290437&lang=1&reg=3

https://content.dgft.gov.in/Website/om199.htm

https://content.dgft.gov.in/Website/Chapter_1_Revised_FTP_v1.2.2.pdf

https://content.dgft.gov.in/Website/dgftprod/a11b458e-0d61-460f-aef4-b201ed40a9aa/FTP2023_Chapter04.pdf

https://content.dgft.gov.in/Website/dgftprod/9f6336a2-e03d-4dbb-86eb-305615f0db13/FTP2023_Chapter05.pdf

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2318052&lang=1&reg=3

https://www.commerce.gov.in/files/2026-04/Annual_0.pdf

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2317338&lang=2&reg=48

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2287009&lang=1&reg=3

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2305826&lang=1&reg=3

https://content.dgft.gov.in/Website/Chapter%209%20FTP%20eCommerce.pdf

https://www.dgft.gov.in/CP/index.jsp?opt=export-promotion-mission

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2242410&lang=1&reg=3

https://www.trade.gov.in/pages/about-trade-connect-eplatform

https://static.pib.gov.in/WriteReadData/specificdocs/documents/2026/nov/doc_10476_20261113_22550501.pdf

https://www.sezindia.gov.in/sites/default/files/approved_sez/State%20wise%20distribution%20of%20SEZs%20upto%2031.07.2026.pdf

Ministry of Statistics & Programme Implementation

https://www.pib.gov.in/PressReleseDetailm.aspx?PRID=2304949&lang=2&reg=48

https://www.pib.gov.in/PressReleseDetailm.aspx?PRID=2334642&lang=1&reg=1

https://static.pib.gov.in/WriteReadData/specificdocs/documents/2026/oct/doc_10178_20261015_12230801.pdf

Ministry of Communications

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2216466&lang=1&reg=3

Niti Aayog

https://www.niti.gov.in/sites/default/files/2025-07/Trade-Watch-Quarterly.pdf

https://www.niti.gov.in/sites/default/files/2026-06/Trade-Watch-Quarterly-Jan-March-Q4-FY26.pdf

Reserve Bank of India (RBI)

https://www.rbi.org.in/scripts/BS_PressReleaseDisplay.aspx?prid=63742

https://www.rbi.org.in/Scripts/BS_PressReleaseDisplay.aspx?prid=63403

World Bank

https://www.worldbank.org/en/news/press-release/2026/10/06/india-development-update-oct-2026

https://www.worldbank.org/en/news/press-release/2026/10/06/india-development-update-oct-2026

https://www.worldbank.org/en/news/press-release/2026/04/09/india-remains-among-the-fastest-growing-economies

https://documents1.worldbank.org/curated/en/099722104222534584/pdf/IDU-25f34333-d3a3-44ae-8268-86830e3bc5a5.pdf

International Monetary Fund (IMF)

https://www.imf.org/-/media/files/publications/weo/2026/october/english/text.pdf

https://www.imf.org/en/publications/weo/issues/2026/07/08/world-economic-outlook-update-july-2026

Organisation for Economic Co-operation and Development (OECD)

https://www.oecd.org/content/dam/oecd/en/publications/reports/2026/09/oecd-economic-outlook-interim-report-september-2026_8312492f/f751d02b-en.pdf

https://www.oecd.org/content/dam/oecd/en/publications/reports/2026/06/oecd-economic-outlook-volume-2026-issue-1_8be0dba6/2d1956f0-en.pdf

Asian Development Bank (ADB)

https://www.adb.org/sites/default/files/publication/1155601/asian-development-outlook-july-2026.pdf

PIB Archives

https://www.pib.gov.in/PressNoteDetails.aspx?ModuleId=3&NoteId=158804&lang=1&reg=3

https://www.pib.gov.in/PressNoteDetails.aspx?ModuleId=3&NoteId=160423&lang=1&reg=3

https://static.pib.gov.in/WriteReadData/specificdocs/documents/2026/aug/doc2026818961401.pdf

https://static.pib.gov.in/WriteReadData/specificdocs/documents/2026/oct/doc_10178_20261015_12230801.pdf

https://static.pib.gov.in/WriteReadData/specificdocs/documents/2026/mar/doc2026328835301.pdf

https://static.pib.gov.in/WriteReadData/specificdocs/documents/2026/mar/doc2026314824001.pdf

See in PDF

 

***

(Explainer ID: 160833) आगंतुक पटल : 9
Provide suggestions / comments
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , Bengali , Assamese , English , हिन्दी