Economy

పీఎల్‌ఐతో తయారీ రంగంలో మార్పు

విధానం నుంచి ఉత్పత్తి వరకు

Posted On: 13 NOV 2026 5:46PM

భారత్‌లో విధానపరంగా పారిశ్రామిక రంగంలో చేపట్టిన అత్యంత ముఖ్యమైన చర్యల్లో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్‌ఐ) వ్యవస్థ ఒకటిగా ఎదిగింది. 14 వ్యూహాత్మక రంగాలకు విస్తరించిన ఈ పథకం దేశవ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షించింది, తయారీ సామర్థ్యాన్ని విస్తరించింది, ఎగుమతులకు ఊతమిచ్చింది, ఉపాధి కల్పించింది. దేశీయ విలువ గొలుసులను బలోపేతం చేయడంతో పాటు, తయారీ రంగంలో పోటీపడగల గమ్యస్థానంగా భారత్‌ను నిలబెట్టేందుకు తోడ్పడింది. వికసిత్ భారత్ 2047 దిశగా దేశం ముందుకు సాగుతున్న క్రమంలో, అంతరాయాలను తట్టుకోగల, ఆవిష్కరణలకు ప్రాధాన్యమిచ్చే, ప్రపంచంతో అనుసంధానమైన పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థకు పీఎల్‌ఐ పునాదులు వేస్తోంది.

తయారీకి భారత్ సంకల్పించిన వేళ
తమిళనాడులో అసెంబుల్ చేసిన స్మార్ట్‌ఫోన్. గుజరాత్‌లో తయారైన సోలార్ మాడ్యూల్. బల్క్ డ్రగ్ పార్కులో ఉత్పత్తి చేసిన ఔషధ ముడి పదార్థం. ఇవి విడివిడిగా సాధించిన విజయాలు మాత్రమే కావు. మరింత స్వావలంబనతో, సాంకేతికత ఆధారంగా పనిచేస్తూ, ప్రపంచంతో అనుసంధానమవుతున్న భారత ఆర్థిక వ్యవస్థకు నిదర్శనాలు. ఎలక్ట్రానిక్స్, విద్యుత్ వాహనాలు, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాల్లో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం నుంచి, ఆయా రంగాలకు అవసరమైన సమగ్ర వ్యవస్థలను అభివృద్ధి చేయడం వైపు దృష్టి మళ్లుతోంది.

ఈ మార్పులో 2020లో ప్రవేశపెట్టిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్‌ఐ) స్కీమ్ కీలకంగా నిలుస్తోంది. గత ఆరేళ్లలో వివిధ రంగాల్లో పెట్టుబడులకు ఊతమిస్తూ, విధానపరమైన లక్ష్యాలను ఉత్పత్తి సామర్థ్యంగా మార్చింది. వికసిత్ భారత్ 2047 దిశగా దేశం సాగుతున్న వేళ, తదుపరి దశలో విలువ గొలుసులను మరింత బలోపేతం చేయడం, ప్రపంచ ఉత్పత్తి వ్యవస్థల్లో భారత్ పాత్రను పెంచడం కీలకం.

విధానం నుంచి ఉత్పత్తి వరకు: పీఎల్‌ఐ వ్యవస్థ ఎదుగుదల
ఆత్మనిర్భర్ భారత్ కింద ప్రారంభించిన పీఎల్‌ఐ పథకాన్ని తయారీ రంగ వృద్ధిని వేగవంతం చేసేందుకు రూపొందించారు.

ప్రారంభంలో మొబైల్ తయారీ, నిర్దిష్ట ఎలక్ట్రానిక్ విడిభాగాలు, క్రియాశీల ఔషధ ముడి పదార్థాలు, వైద్య పరికరాలు వంటి రంగాలు ఈ పథకం పరిధిలో ఉండేవి. తర్వాత ఔషధాలు, వస్త్రాలు, ప్రత్యేక రకాల ఉక్కు తదితరాలతో కలిపి మొత్తం 14 వ్యూహాత్మక రంగాలకు విస్తరించింది. పథకానికి ఆమోదించిన మొత్తం ఆర్థిక కేటాయింపు ₹1.91 లక్షల కోట్లు (₹1,91,049 కోట్లు). దీని వెనుక ఉన్న ఆలోచన సులభమైనదే- దేశీయ పరిశ్రమల పరిమాణం, నాణ్యత, పోటీపడే సామర్థ్యం పెరిగితే వాటితో పాటే పెట్టుబడులు, ఎగుమతులు, ఉద్యోగాలు, ఆవిష్కరణలు పెరుగుతాయి.

 

 


మార్పును చాటే గణాంకాలు
పీఎల్‌ఐ మద్దతు పొందుతున్న పలు రంగాల్లో భారతీయ‌ తయారీ, ఎగుమతుల పనితీరు ఊపందుకుంటోంది. 2021-2025 మధ్య పలు పీఎల్‌ఐ రంగాల్లో ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. సగటు వార్షిక ప్రాతిపదికన ఐటీ హార్డ్‌వేర్‌లో 77.2%, ఏసీసీ బ్యాటరీల్లో 45.0%, ఎలక్ట్రానిక్స్‌లో 38.8%, సోలార్ పీవీ మాడ్యూల్స్‌లో 23.9%, ప్రత్యేక రకాల ఉక్కులో 22.5% ఎగుమతుల వృద్ధి నమోదైంది.

 



30 జూన్ 2026 నాటికి 14 రంగాల్లో 791 దరఖాస్తులకు ఆమోదం లభించింది. వాస్తవంగా వచ్చిన మొత్తం పెట్టుబడులు ₹2.58 లక్షల కోట్లు (₹2,58,835 కోట్లు) దాటాయి. మొత్తం ఉత్పత్తి/అమ్మకాలు ₹23.79 లక్షల కోట్లు దాటాయి. ఎగుమతులకు ₹15.53 లక్షల కోట్ల మేర ఊతం లభించింది. 14.57 లక్షలకు పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు ఏర్పడ్డాయి. ఇందులో 8.81 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలు, ఐటీ హార్డ్‌వేర్, ఎల్‌ఎస్‌ఈఎం, సోలార్ పీవీ మాడ్యూల్స్ రంగాల్లో 5.75 లక్షల పరోక్ష ఉద్యోగాలు ఉన్నాయి. మొత్తం ప్రోత్సాహకాల విడుదల ₹36,754 కోట్లకు చేరింది. ప్రోత్సాహకాల విడుదల స్థాయి పథకంలో పనితీరుకు ఉన్న ప్రాధాన్యాన్ని తెలియజేస్తోంది. కంపెనీలు నిర్దేశించిన పెట్టుబడి, ఉత్పత్తి, ఇతర అర్హత ప్రమాణాలను చేరుకున్నప్పుడు ప్రోత్సాహకాలను విడుదల చేస్తారు. ప్రాజెక్టులు ముందుకు సాగి, ఉత్పత్తి ప్రారంభించిన తర్వాత సంబంధిత పథకాల నిబంధనల ప్రకారం అర్హత గల ప్రోత్సాహకాల కోసం కంపెనీలు దరఖాస్తు చేసుకుంటాయి.

వివిధ రంగాల ఫలితాలు దేశీయ తయారీ మరింత పెరుగుతోందని చాటుతున్నాయి. మొబైల్ ఫోన్ల దిగుమతులు దాదాపు 77% తగ్గాయి.

191 బల్క్ డ్ర‌గ్స్‌ను తొలిసారిగా దేశంలోనే తయారు చేసేందుకు కూడా పీఎల్‌ఐ వీలు కల్పించింది. టెలికాం ఎగుమతులు ₹21,033 కోట్లకు చేరాయి.

దేశీయ తయారీ ప్రపంచ విలువ గొలుసులతో మరింతగా అనుసంధానమవుతున్న తీరును ఈ ధోరణులు ప్రతిబింబిస్తున్నాయి.

కొత్త పారిశ్రామిక భారత్ నిర్మాణం
వివిధ రంగాల్లో పీఎల్‌ఐ వ్యవస్థ విధానాలను స్పష్టమైన ఫలితాలుగా మారుస్తోంది. కొత్త కర్మాగారాలు, విస్తరిస్తున్న ఉత్పత్తి విభాగాలు, కొత్తగా ఏర్పడుతున్న పారిశ్రామిక సముదాయాలు భారత్ తయారీ రంగానికి కొత్త రూపునిస్తున్నాయి. విధానపరమైన మద్దతు ఆచరణలో ఫలితాలనిస్తూ పరిశ్రమలు, కార్మికులు, వ్యాపార వ్యవస్థాపకులకు కొత్త అవకాశాలను కల్పిస్తోంది. స్పష్టమైన ఫలితాలు సాధించిన కొన్ని రంగాలు:

లార్జ్ స్కేల్ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ (ఎల్‌ఎస్‌ఈఎం): డిజిటల్ తయారీలో భారత్ ఎదుగుదలకు ఊతం

 


పీఎల్‌ఐ పథకం ద్వారా అత్యధికంగా ప్రయోజనం పొందిన రంగం ఎలక్ట్రానిక్స్ తయారీ, ఐటీ హార్డ్‌వేర్. ఎల్‌ఎస్‌ఈఎం పథకం గడువు ఇప్పుడు ముగిసింది. ఈ పథకం కింద కంపెనీలు 2026 జూన్ వరకు మొత్తం ₹20,580.20 కోట్ల పెట్టుబడులు పెట్టాయి. ప్రారంభ లక్ష్యం ₹7,000 కోట్లకు ఇది దాదాపు మూడు రెట్లు. మొత్తం ఉత్పత్తి ₹11,61,505 కోట్లకు చేరింది. 1,69,249 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించింది. మొత్తం ₹19,090.98 కోట్ల ప్రోత్సాహకాలు విడుదల చేశారు. దీనితో పాటు ఐటీ హార్డ్‌వేర్ 2.0 కింద ₹954 కోట్ల పెట్టుబడులు, ₹24,386 కోట్ల ఉత్పత్తి నమోదయ్యాయి. 5,216 ప్రత్యక్ష ఉద్యోగాలు ఏర్పడ్డాయి, ₹97.84 కోట్ల ప్రోత్సాహకాలు విడుదల చేశారు. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి 2024-25లో ₹11.32 లక్షల కోట్ల నుంచి 2025-26లో ₹13.11 లక్షల కోట్లకు పెరిగింది. వార్షిక ప్రాతిపదికన ఇది 15.8% పెరుగుదల.

భారత్ ఎలక్ట్రానిక్స్ తయారీ సామర్థ్యంలో వచ్చిన గణనీయమైన మార్పును ఈ వృద్ధి ప్రతిబింబిస్తోంది. 2014-15తో పోలిస్తే ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి ఇప్పుడు ఏడు రెట్లకు పెరిగింది. ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు పదకొండు రెట్లకు పెరిగి ₹4.24 లక్షల కోట్లకు చేరాయి. దీంతో ప్రపంచ మార్కెట్‌లో భారత్ స్థానం బలోపేతమైంది. ఈ మార్పులో మొబైల్ తయారీ కీలక పాత్ర పోషిస్తోంది. మొబైల్ ఫోన్ల ఉత్పత్తి 33 రెట్లకు పెరిగి ₹6.27 లక్షల కోట్లకు చేరింది. ఉత్పత్తి పరిమాణంలో భారత్ నేడు ప్రపంచంలో రెండో అతిపెద్ద మొబైల్ తయారీ దేశం. 2014లో మొబైల్ ఫోన్ల నికర దిగుమతిదారుగా ఉన్న దేశం ఇప్పుడు నికర ఎగుమతిదారుగా మారింది. భారత్‌లో ఉపయోగిస్తున్న మొబైల్ ఫోన్లలో 99.2% ఇప్పుడు దేశీయంగా తయారవుతున్నాయి.

ఔషధ రంగం: ప్రపంచ ఔషధశాలగా భారత్ బలోపేతం
ఔషధ పరిశ్రమలో ఉత్పత్తి పరిమాణం పరంగా భారత్ ప్రపంచంలో మూడో స్థానంలో, విలువ పరంగా పదకొండో స్థానంలో ఉంది. ప్రపంచ జనరిక్ ఔషధాల్లో దాదాపు 20% భారత్ సరఫరా చేస్తోంది. ప్రధాన మార్కెట్లలో ఔషధ అవసరాల్లో గణనీయమైన వాటాను తీరుస్తోంది.

పీఎల్‌ఐ స్కీమ్ ఫర్ ఫార్మాస్యూటికల్స్‌కు 2020-21 నుంచి 2028-29 వరకు ₹15,000 కోట్ల కేటాయింపు ఉంది. అధిక విలువ గల ఔషధ ఉత్పత్తుల దేశీయ తయారీకి, సాంకేతికతను ఆధునీకరించడానికి ఈ పథకం తోడ్పడుతోంది.

పరిశ్రమకు ఉన్న బలమైన నమ్మకాన్ని చాటుతూ, 30 జూన్ 2026 నాటికి ఈ పథకం కింద మొత్తం ₹46,744 కోట్ల పెట్టుబడులు నమోదయ్యాయి. మొత్తం ఉత్పత్తి/అమ్మకాలు ₹4,02,869 కోట్లకు (₹4.02 లక్షల కోట్లకు పైగా) చేరాయి. 1,21,294 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించింది. మొత్తం ₹6,662 కోట్ల ప్రోత్సాహకాలు విడుదల చేశారు. అధునాతన తయారీ, విభిన్న ఉత్పత్తుల అభివృద్ధి, ఎగుమతుల ఆధారిత వృద్ధికి అవసరమైన పెట్టుబడులకు పథకం మద్దతు ఇస్తోంది. అదనంగా, ₹6,940 కోట్ల కేటాయింపుతో అమలవుతున్న బల్క్ డ్రగ్స్ పీఎల్‌ఐ పథకం కింద మొత్తం పెట్టుబడులు ₹5,211 కోట్లకు, అమ్మకాలు ₹3,792 కోట్లకు చేరాయి. 5,127 ప్రత్యక్ష ఉద్యోగాలు ఏర్పడ్డాయి, ₹88 కోట్ల ప్రోత్సాహకాలు విడుదల చేశారు; ₹3,420 కోట్ల కేటాయింపుతో అమలవుతున్న మెడికల్ డివైసెస్ పీఎల్‌ఐ పథకం కింద పెట్టుబడులు ₹1,185 కోట్లకు, అమ్మకాలు ₹16,612 కోట్లకు చేరాయి. 5,769 ప్రత్యక్ష ఉద్యోగాలు ఏర్పడ్డాయి. ₹266.64 కోట్ల ప్రోత్సాహకాలు విడుదల చేశారు.

 



టెలికాం & నెట్‌వర్కింగ్ ఉత్పత్తులు: దిగుమతుల స్థానంలో దేశీయ ఉత్పత్తులకు ప్రోత్సాహం
₹12,195 కోట్ల కేటాయింపుతో పీఎల్‌ఐ వ్యవస్థ కింద ప్రారంభ దశలోనే విజయాలు సాధించిన రంగాల్లో టెలికాం ఒకటి. 2021-25 మధ్య టెలికాం ఎగుమతుల్లో సగటున ఏటా 1.5 శాతం వృద్ధి నమోదైంది. అదే సమయంలో దిగుమతులు ఏటా 18.5 శాతం తగ్గాయి. 30 జూన్ 2026 నాటికి ఈ పథకం మొత్తం ₹5,627 కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. మొత్తం ఉత్పత్తి/అమ్మకాలు ₹1,20,721 కోట్లకు చేరాయి. 36,319 ప్రత్యక్ష ఉద్యోగాలను కల్పించింది, ₹2,796 కోట్ల ప్రోత్సాహకాలను విడుదల చేసింది. దిగుమతుల స్థానంలో దేశీయ ఉత్పత్తులను వినియోగించడంలో ప్రారంభ విజయాన్ని ఈ ధోరణి సూచిస్తోంది. విదేశీ మార్కెట్లలో భారత ఉత్పత్తుల విస్తరణను పెంచాలన్న పీఎల్‌ఐ విస్తృత లక్ష్యానికి ఇది అనుగుణంగా ఉంది.

వైట్ గూడ్స్ (ఏసీలు, ఎల్‌ఈడీ లైట్లు): కీలక విడిభాగాల తయారీకి పునాది
ప్రతి ఎయిర్ కండిషనర్, ఎల్‌ఈడీ లైట్ వెనుక అధిక విలువ గల విడిభాగాల సరఫరా వ్యవస్థ ఉంటుంది. ఇవే వాటి ఖర్చును, మార్కెట్‌లో పోటీపడే సామర్థ్యాన్ని నిర్ణయిస్తాయి. ₹6,238 కోట్ల కేటాయింపుతో పీఎల్‌ఐ స్కీమ్ ఫర్ వైట్ గూడ్స్ ద్వారా భారత్ ఈ తయారీ సామర్థ్యాలను దేశంలోనే క్రమంగా అభివృద్ధి చేస్తోంది. రంగంలో పెరుగుతున్న పురోగతికి అనుగుణంగా బడ్జెట్ మద్దతు 2025-26లో ₹303.54 కోట్ల (సవరించిన అంచనా) నుంచి 2026-27లో ₹1,003.54 కోట్లకు (బడ్జెట్ అంచనా) పెరిగింది. పథకం నాలుగో విడతలో ₹1,914 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలతో 13 దరఖాస్తులు వచ్చాయి. 15 సెప్టెంబర్ నుంచి 10 నవంబర్ 2025 వరకు దరఖాస్తులను స్వీకరించారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు (ఎంఎస్‌ఎంఈలు) ఉత్సాహంగా పాల్గొన్నాయి. 30 జూన్ 2026 నాటికి పథకం కింద మొత్తం ₹7,670 కోట్ల పెట్టుబడులు, ₹57,057 కోట్ల ఉత్పత్తి/అమ్మకాలు నమోదయ్యాయి. 54,049 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించింది, మొత్తం ₹593 కోట్ల ప్రోత్సాహకాలు విడుదల చేశారు.

వాహనాలు & విడిభాగాల పరిశ్రమ: రవాణా విప్లవానికి ఊతం
పీఎల్‌ఐ స్కీమ్ ఫర్ ఆటోమొబైల్స్ అండ్ ఆటో కాంపోనెంట్స్ అధునాతన, పర్యావరణహిత రవాణా దిశగా భారత్ ప్రయాణాన్ని వేగవంతం చేస్తోంది. ₹25,938 కోట్ల కేటాయింపుతో ఈ పథకం విద్యుత్ వాహనాలు, అధునాతన వాహన సాంకేతికతలు, అధిక విలువ గల విడిభాగాల అభివృద్ధికి తోడ్పడుతోంది. ప్రపంచ వాహన పరిశ్రమ విలువ గొలుసులో భారత్ స్థానాన్ని బలోపేతం చేస్తోంది.

బడ్జెట్ మద్దతు 2025-26లో ₹2,091.26 కోట్ల సవరించిన అంచనా (ఆర్‌ఈ) నుంచి 2026-27లో ₹5,939.87 కోట్ల బడ్జెట్ అంచనాకు (బీఈ) పెరగడం ప్రభుత్వ నిరంతర కట్టుబాటును ప్రతిబింబిస్తోంది. 30 జూన్ 2026 నాటికి ఈ పథకం మొత్తం ₹45,477 కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. మొత్తం ఉత్పత్తి/అమ్మకాలు ₹64,374 కోట్లకు చేరాయి. 71,337 మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించింది, ₹3,174.15 కోట్ల ప్రోత్సాహకాలను విడుదల చేసింది.

ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమ: పొలాల నుంచి ప్రపంచ మార్కెట్ల వరకు
ఆహార ప్రాసెసింగ్ రంగం తయారీ వృద్ధిని గ్రామీణ ఉత్పత్తులకు విలువ జోడించడంతో అనుసంధానిస్తోంది. ₹10,900 కోట్ల కేటాయింపుతో పీఎల్‌ఐ స్కీమ్ ఫర్ ది ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ (పీఎల్‌ఐఎస్‌ఎఫ్‌పీఐ)ని 2021-22 నుంచి 2026-27 వరకు అమలు చేస్తున్నారు. 30 జూన్ 2026 నాటికి సుమారు 3.36 లక్షల (3,35,516) ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు ఏర్పడ్డాయి. 2026-27 నాటికి 2.5 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న పథకం లక్ష్యాన్ని ఇది గణనీయంగా అధిగమించింది.

పీఎల్‌ఐఎస్‌ఎఫ్‌పీఐ కింద సాధించిన కొన్ని ప్రధాన విజయాలు:
- వివిధ ఆహార ప్రాసెసింగ్ విభాగాల్లో 165 దరఖాస్తులకు ఆమోదం లభించింది.
- ఆమోదం పొందిన లబ్ధిదారు సంస్థ‌ల్లో 69 ఎంఎస్‌ఎంఈలు ఉన్నాయి.
- దేశవ్యాప్తంగా 274 ప్రదేశాల్లో ప్రాజెక్టులు ఏర్పాటయ్యాయి. ఇవి ప్రాంతీయ పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడుతున్నాయి.
- 30 జూన్ 2026 నాటికి లబ్ధిదారు కంపెనీలు మొత్తం ₹9,207 కోట్ల పెట్టుబడులను నివేదించాయి. మొత్తం ఉత్పత్తి/అమ్మకాలు ₹5,13,104 కోట్లకు (₹5.13 లక్షల కోట్లకు పైగా) చేరాయి.
- 30 జూన్ 2026 నాటికి మొత్తం ₹3,271.44 కోట్ల ప్రోత్సాహకాలను విడుదల చేశారు. ఇందులో 2025-26లో ₹1,193 కోట్లు, 2026-27లో జూన్ వరకు ₹556.64 కోట్లు ఉన్నాయి.
ఈ పురోగతిని కొనసాగిస్తూ పీఎల్‌ఐఎస్‌ఎఫ్‌పీఐలో మిగిలిన నిధులతో 2022-23లో ప్రత్యేకంగా పీఎల్‌ఐ స్కీమ్ ఫర్ మిల్లెట్-బేస్డ్ ప్రొడక్ట్స్ (పీఎల్‌ఐఎస్‌ఎంబీపీ)ని ప్రవేశపెట్టారు. 2026 జూన్ నాటికి ఈ పథకానికి కేటాయించిన మొత్తం ₹800 కోట్లలో, 29 మంది దరఖాస్తుదారులకు ప్రోత్సాహకాలు అందించేందుకు ₹793.27 కోట్లకు ఆమోదం ఇచ్చారు. వీరిలో 8 పెద్ద సంస్థలు, 21 చిన్న, మధ్యతరహా సంస్థలు ఉన్నాయి.

ప్రత్యేక రకాల ఉక్కు: భారత్ పారిశ్రామిక రంగానికి బలం
మౌలిక సదుపాయాలు, వాహనాల తయారీ నుంచి రక్షణ, ఇంజినీరింగ్ వరకు పలు వ్యూహాత్మక పరిశ్రమలకు ప్రత్యేక రకాల ఉక్కు వెన్నెముకగా నిలుస్తోంది. ఉక్కు తయారీ ప్రక్రియలో తర్వాతి దశల్లో మరింత విలువ జోడించి రూపొందించే ఉత్పత్తే ప్రత్యేక రకాల ఉక్కు. దేశీయ సామర్థ్యాలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం 2021లో ₹6,322 కోట్ల కేటాయింపుతో పీఎల్‌ఐ స్కీమ్ ఫర్ స్పెషాల్టీ స్టీల్‌ను ప్రారంభించింది. 30 జూన్ 2026 నాటికి పథకం మొత్తం ₹27,368 కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. మొత్తం ఉత్పత్తి/అమ్మకాలు ₹4,170 కోట్లకు చేరాయి. 16,200 ప్రత్యక్ష ఉద్యోగాలు ఏర్పడ్డాయి, ₹236 కోట్ల ప్రోత్సాహకాలను విడుదల చేశారు.

అడ్వాన్స్‌డ్ కెమిస్ట్రీ సెల్ (ఏసీసీ) బ్యాటరీ స్టోరేజ్: స్వచ్ఛ ఇంధన భవిష్యత్తుకు శక్తి
భారత్ విద్యుత్ వాహనాలు, స్వచ్ఛ ఇంధనాల వైపు వేగంగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో దేశీయ బ్యాటరీ తయారీ వ్యూహాత్మక ప్రాధాన్యాంశంగా మారింది. ₹18,100 కోట్ల కేటాయింపుతో పీఎల్‌ఐ స్కీమ్ ఫర్ అడ్వాన్స్‌డ్ కెమిస్ట్రీ సెల్ (ఏసీసీ) బ్యాటరీ స్టోరేజ్‌కు 2021 మేలో ఆమోదం లభించింది. దేశీయంగా 50 గిగావాట్-గంటల (జీడబ్ల్యూహెచ్) ఏసీసీ తయారీ సామర్థ్యాన్ని, ప్రత్యేక ఏసీసీ సాంకేతికతల కోసం అదనంగా మొత్తం (5) జీడబ్ల్యూహెచ్ సామర్థ్యాన్ని ఏర్పాటు చేయడం దీని లక్ష్యం. ఇందులో 2025 ఆగస్టు నాటికి రెండు విడతల్లో నాలుగు లబ్ధిదారు సంస్థలకు 40 జీడబ్ల్యూహెచ్ సామర్థ్యాన్ని కేటాయించారు. గ్రిడ్ స్థాయిలో స్థిర నిల్వ వ్యవస్థల కోసం 10 జీడబ్ల్యూహెచ్ సామర్థ్యానికి 2026లో ప్రత్యేకంగా టెండర్ ప్రక్రియ చేపడుతున్నారు. దేశీయ తయారీని బలోపేతం చేయడం, దిగుమతి చేసుకునే ఏసీసీలపై ఆధారపడటాన్ని తగ్గించడం ఈ పథకం ఉద్దేశం. 30 జూన్ 2026 నాటికి మొత్తం ₹5,270 కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది, 1,292 ప్రత్యక్ష ఉద్యోగాలను కల్పించింది.

అధిక సామర్థ్య సోలార్ పీవీ: భారత్‌లో సౌర తయారీకి ఊతం
భారత్ స్వచ్ఛ ఇంధన లక్ష్యాల్లో సౌరశక్తి కీలకం. ఇందుకు బలమైన దేశీయ తయారీ వ్యవస్థ అవసరం. ₹24,000 కోట్ల కేటాయింపుతో పీఎల్‌ఐ స్కీమ్ ఫర్ హై-ఎఫిషియెన్సీ సోలార్ పీవీ మాడ్యూల్స్ ఈ అవసరాన్ని నేరుగా తీరుస్తోంది. దేశీయ తయారీని ప్రోత్సహించడం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, సౌర విలువ గొలుసులో ప్రతి దశలో విలువ జోడింపునకు ఊతమివ్వడం పథకం లక్ష్యాలు. తయారీలోని దశలను పూర్తిగా/పాక్షికంగా అనుసంధానించే 48,337 మెగావాట్ల సోలార్ పీవీ మాడ్యూల్ తయారీ సామర్థ్యాన్ని ఏర్పాటు చేసేందుకు పథకం కింద అవార్డు పత్రాలు జారీ చేశారు. 2025 సెప్టెంబర్ నాటికి ఈ పథకం సుమారు ₹52,900 కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. దాదాపు 44,400 మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించింది.

 



విధానం నుంచి సమృద్ధి దిశగా ప్రయాణం
2020లో విధానపరమైన ప్రయోగంగా ప్రారంభమైన పీఎల్‌ఐ, భారత్ పారిశ్రామిక చరిత్రలో ప్రత్యేక అధ్యాయంగా మారింది. ఉత్పత్తిని ప్రోత్సహించడంతో పాటు దేశ ఆలోచనా ధోరణిలోనూ మార్పు తెచ్చింది. తయారీ ఇప్పుడు తెరవెనుక జరిగే కార్యకలాపం స్థాయిని దాటి, వ్యూహాత్మక ప్రాధాన్యాంశంగా మారింది.

పీఎల్‌ఐ విజయానికి అసలైన కొలమానం గణాంకాలు మాత్రమే కాదు. ఆరేళ్ల క్రితం లేని కర్మాగారాల్లో, ఇప్పుడు విద్యుత్ వాహనాల బ్యాటరీలపై పనిచేస్తున్న ఇంజినీర్లలో, ప్రపంచ మార్కెట్లకు ఉత్పత్తులు అందిస్తున్న రైతుల్లోనూ ఆ విజయం కనిపిస్తుంది. భారత్ ఎక్కువగా తయారు చేయడమే కాదు.. తయారీ తీరును మారుస్తోంది. తదుపరి దశ మొదలవుతున్న వేళ లక్ష్యం స్పష్టం: ప్రపంచం కోసం ఉత్పత్తి చేయడంతో పాటు, ప్రపంచం కోసం ఆవిష్కరించడం.

References

Ministry of Electronics & IT

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2247771&reg=3&lang=2

https://www.pib.gov.in/Pressreleaseshare.aspx?PRID=2108602&utm_source&reg=3&lang=2

Ministry of Commerce & Industry

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2246089&utm_source&reg=3&lang=2

Ministry of Textiles

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2250951&reg=3&lang=2

Ministry of Chemicals and Fertilizers

https://pharma-dept.gov.in/sites/default/files/Annual%20Report%202025-26.pdf

Ministry Of New and Renewable Energy

https://sansad.in/getFile/loksabhaquestions/annex/187/AS368_BC8yvX.pdf?source=pqals

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2116602&reg=3&lang=2

Economic Survey 2025-26

https://www.indiabudget.gov.in/economicsurvey/doc/echapter.pdf

https://www.indiabudget.gov.in/doc/eb/vol1.pdf

NITI Aayog

https://www.niti.gov.in/sites/default/files/2026-11/Impact-Assessment-of-PLI-Schemes.pdf

PIB Archives

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2254015&reg=3&lang=2

https://www.pib.gov.in/PressReleseDetailm.aspx?PRID=2234442&reg=3&lang=2

https://www.pib.gov.in/PressNoteDetails.aspx?NoteId=155082&ModuleId=3&reg=3&lang=2

https://www.pib.gov.in/PressNoteDetails.aspx?NoteId=155232&ModuleId=3&reg=3&lang=2

Click here to see pdf 

 

***

(Explainer ID: 160831) आगंतुक पटल : 5
Provide suggestions / comments
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , हिन्दी , Assamese , Bengali , Tamil