Social Welfare

నషా ముక్త్ భారత్ అభియాన్‌కు ఆరేళ్లు

అవగాహనగా మొద‌లై ప్రజా ఉద్యమంగా మారిన కార్య‌క్ర‌మం

Posted On: 11 NOV 2026 12:22PM

నషా ముక్త్ భారత్ అభియాన్‌ను 15 ఆగస్టు 2020న 272 జిల్లాల్లో ప్రారంభించారు. 15 ఆగస్టు 2023న దేశంలోని అన్ని జిల్లాలకు విస్తరించారు. 10 నవంబర్ 2026 నాటికి ఈ కార్యక్రమం 35.84 కోట్లకు పైగా ప్రజలకు చేరింది. వీరిలో 14.33 కోట్లకు పైగా యువత, 11.32 కోట్ల మంది మహిళలు ఉన్నారు. నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ డ్రగ్ డిమాండ్ రిడక్షన్ (ఎన్‌ఏపీడీడీఆర్) కింద సహాయ సేవలు వేగంగా విస్తరించాయి. చికిత్స, కౌన్సెలింగ్ కోసం వచ్చినవారి సంఖ్య 2020-21లో 2.08 లక్షల నుంచి 2025-26లో 9.11 లక్షలకు పైగా పెరిగింది. 10 నవంబర్ 2026 నాటికి 2 లక్షలకు పైగా పౌరులు నషా ముక్తి మిత్ర్‌లుగా నమోదు చేసుకున్నారు.

35 కోట్ల మంది ప్రజల ఉద్యమం
ఆరోగ్యానికి హాని చేసే మత్తు పానీయాలు, మాదకద్రవ్యాల వినియోగాన్ని వైద్య అవసరాలకు మినహా నిషేధించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 47 నిర్దేశిస్తోంది. భారత్‌లో 7 కోట్లకు పైగా ప్రజలు మత్తు పదార్థాల వినియోగంతో తలెత్తే రుగ్మతలతో బాధపడుతున్నట్లు 2018 నాటి జాతీయ సర్వే వెల్లడించింది. వీరిలో దాదాపు 1.2 కోట్ల మంది పిల్లలు, 58 లక్షల మంది మహిళలు ఉన్నారు. మత్తు పదార్థాలపై ఆధారపడటం మానసిక, సామాజిక, వైద్య అంశాలతో ముడిపడిన సంక్లిష్ట సమస్య. ఇది వ్యక్తులు, కుటుంబాలు, మొత్తం సమాజానికి హాని కలిగిస్తుంది.

ఈ సవాలును ఎదుర్కొనేందుకు సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ 15 ఆగస్టు 2020న నషా ముక్త్ భారత్ అభియాన్‌ను (ఎన్‌ఎంబీఏ) ప్రారంభించింది. మత్తు పదార్థాల వినియోగం (మద్యం, గంజాయి, ఓపియాయిడ్లు, మానసిక స్థితిపై ప్రభావం చూపే ఇతర పదార్థాల వాడకం) ముప్పు అత్యధికంగా ఉన్నట్లు గుర్తించిన 272 జిల్లాల్లో దీన్ని చేపట్టారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అందించిన సమాచారం, మత్తు పదార్థాల వినియోగ విస్తృతి, తీరుపై నిర్వహించిన తొలి జాతీయ సర్వే ఫలితాల ఆధారంగా ఈ జిల్లాలను ఎంపిక చేశారు. 2022 ఆగస్టులో 372 జిల్లాలకు విస్తరించారు. 15 ఆగస్టు 2023 నుంచి దేశంలోని అన్ని జిల్లాలకు వర్తింపజేశారు. నివారణ, చికిత్స, పునరావాసం కోసం మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ డ్రగ్ డిమాండ్ రిడక్షన్ (ఎన్‌ఏపీడీడీఆర్) కింద ఇది ప్రధాన అవగాహన కార్యక్రమం. సంస్థల భాగస్వామ్యం నుంచి సమాజ భాగస్వామ్యం వైపు సాగిన మార్పుగా ఈ ఆరేళ్ల ప్రయాణాన్ని మంత్రిత్వ శాఖ పేర్కొంటోంది. రాష్ట్రాలు, జిల్లాలతో పాటు స్థానిక భాగస్వాములు కార్యక్రమ బాధ్యతను స్వీకరించారు. ఈ చొరవతో ఇది ప్రజా ఉద్యమంగా మారింది.

10 నవంబర్ 2026 నాటికి ఎన్‌ఎంబీఏ 35.84 కోట్లకు పైగా ప్రజలకు చేరింది. వీరిలో 14.33 కోట్లకు పైగా యువత, 11.32 కోట్ల మంది మహిళలు ఉన్నారు. విద్యాసంస్థల్లో 33.57 లక్షలకు పైగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. 2021లో 1.4 కోట్ల మందికి చేరిన కార్యక్రమం ఇప్పుడు మరింత విస్తరించింది. 18 నవంబర్ 2025న అమృత్‌సర్‌లో ఐదేళ్ల వేడుకలు నిర్వహించినప్పుడు, 2.10 లక్షలకు పైగా ప్రదేశాల్లో జరిగిన వార్షికోత్సవ కార్యక్రమాల్లో 6 కోట్లకు పైగా ప్రజలు పాల్గొన్నారు. అప్పటికి అభియాన్ 23.74 కోట్ల మందికి చేరింది.

 

 


సవాలు ఎంత పెద్దది?
ఆరోగ్యానికి హాని చేసే మత్తు పానీయాలు, మాదకద్రవ్యాల వినియోగాన్ని వైద్య అవసరాలకు మినహా నిషేధించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని రాజ్యాంగంలోని ఆర్టికల్ 47 నిర్దేశిస్తోంది. మద్యపానం, మత్తు పదార్థాల దుర్వినియోగ నివారణకు మంత్రిత్వ శాఖ 1985-86 నుంచి ఒక పథకాన్ని అమలు చేస్తోంది.

మత్తు పదార్థాల వినియోగ విస్తృతి, తీరుపై నిర్వహించిన తొలి జాతీయ సర్వేతో సమస్య తీవ్రత స్పష్టమైంది. న్యూఢిల్లీ ఎయిమ్స్‌లోని నేషనల్ డ్రగ్ డిపెండెన్స్ ట్రీట్‌మెంట్ సెంటర్ (ఎన్‌డీడీటీసీ) 2018లో ఈ సర్వే నిర్వహించింది. ఫలితాలను 2019 ఫిబ్రవరిలో విడుదల చేశారు. సుమారు 16 కోట్ల మంది మద్యం సేవించేవారు. వీరిలో 5.7 కోట్లకు పైగా మందికి హానికరమైన మద్యపానం లేదా మద్యం వ్య‌స‌నం నుంచి బయటపడేందుకు సహాయం అవసరమైంది. సుమారు 3.1 కోట్ల మంది గంజాయి ఉత్పత్తులను, 2.26 కోట్ల మంది ఓపియాయిడ్లను ఉపయోగించేవారు. దాదాపు 25 లక్షల మందికి గంజాయి వ్య‌స‌నంగా మారింది. సుమారు 77 లక్షల మందికి ఓపియాయిడ్ల వినియోగం నుంచి బయటపడేందుకు సహాయం అవసరమైంది. మొత్తంగా 7 కోట్లకు పైగా ప్రజలు మత్తు పదార్థాల వినియోగ రుగ్మతలతో బాధపడ్డారు. వీరిలో దాదాపు 1.2 కోట్ల మంది పిల్లలు, 58 లక్షల మంది మహిళలు ఉన్నారు.

నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ డ్రగ్ డిమాండ్ రిడక్షన్ కేంద్ర రంగ అంశాలతో కూడిన కేంద్ర ప్రాయోజిత పథకం. దీనికి రెండు లక్ష్యాలు ఉన్నాయి. నివారణ విద్య, అవగాహన, బాధితుల గుర్తింపు, కౌన్సెలింగ్, చికిత్స, పునరావాసం ద్వారా మాదకద్రవ్యాల డిమాండ్‌ను తగ్గించడం మొదటి లక్ష్యం. మాదకద్రవ్యాలపై ఆధారపడేవారు తిరిగి సమాజంలో కలవడానికి అడ్డుగా ఉన్న చిన్నచూపు, వివక్షను తగ్గించడం రెండో లక్ష్యం.

అభియాన్ అమలు విధానం
ఎన్‌ఏపీడీడీఆర్, ఎన్‌ఎంబీఏ పురోగతిని సమీక్షించేందుకు న్యూఢిల్లీలో నిర్వహించిన ఎన్‌సీఓఆర్‌డీ తొమ్మిదో అత్యున్నత స్థాయి సమావేశానికి గౌరవ హోం మంత్రి అధ్యక్షత వహించారు. అభియాన్‌లోని భాగస్వాములందరి కృషిని ప్రశంసిస్తూ, దేశంలో మాదకద్రవ్యాల డిమాండ్‌ను తగ్గించేందుకు మూడేళ్ల కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. ఈ ప్రయత్నాలకు మరింత సంస్థాగత రూపం ఇచ్చేందుకు, సమర్థంగా అమలు చేసేందుకు మూడు స్థాయిల పర్యవేక్షణ, సమన్వయ వ్యవస్థను ప్రతిపాదించారు. ఇందులో:
1. రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన మార్గనిర్దేశక, పర్యవేక్షణ కమిటీ ఉంటుంది. ఇది మూడు నెలలకోసారి సమావేశమవుతుంది. సంబంధిత భాగస్వాములు, శాఖలతో కూడిన అత్యున్నత సంస్థగా, ఉన్నత స్థాయి కార్యాచరణ బృందంగా పనిచేస్తుంది. రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతంలో మాదకద్రవ్యాల డిమాండ్ తగ్గింపునకు చేపట్టే అన్ని కార్యక్రమాలను సమన్వయం చేసి, పర్యవేక్షిస్తుంది.
2. జిల్లా కలెక్టర్/డిప్యూటీ కమిషనర్ అధ్యక్షతన జిల్లా స్థాయి మాదకద్రవ్యాల డిమాండ్ తగ్గింపు కమిటీ ఉంటుంది. ఇది నెలకోసారి సమావేశమవుతుంది, ప్రతి మూడు నెలలకు తప్పనిసరిగా తనిఖీలు నిర్వహిస్తుంది.
3. బ్లాక్ అభివృద్ధి అధికారి అధ్యక్షతన బ్లాక్ స్థాయి మాదకద్రవ్యాల డిమాండ్ తగ్గింపు కమిటీ ఉంటుంది. ఇది నెలకోసారి సమావేశమై, క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహిస్తుంది.

మూడు స్థాయిల కమిటీల పాత్ర
మూడు స్థాయిల కమిటీల బాధ్యతలు:
1. రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంత స్థాయి మార్గనిర్దేశక, పర్యవేక్షణ కమిటీ:
- ఎన్‌ఏపీడీడీఆర్ & ఎన్‌ఎంబీఏ కింద రాష్ట్ర కార్యాచరణ ప్రణాళిక అమలును మొత్తంగా పర్యవేక్షించడం.
- రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతంలో మాదకద్రవ్యాల డిమాండ్ తగ్గింపునకు అవగాహన, చికిత్స, పునరావాసం, కౌన్సెలింగ్, సామర్థ్య పెంపు, ఇతర సంబంధిత అంశాల్లో త్రైమాసిక, వార్షిక లక్ష్యాలను సాధించేలా చూడటం.
- సాంఘిక సంక్షేమం, ఆరోగ్యం, హోం, యువజన వ్యవహారాలు, మహిళా & శిశు అభివృద్ధి, ఉన్నత విద్య, పాఠశాల విద్య, నైపుణ్యాభివృద్ధి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సమాచార & ప్రసార శాఖలు, స్థానిక స్వచ్ఛంద సంస్థలు (ఎన్‌జీఓలు)/పౌర సమాజ సంస్థలు (సీఎస్‌ఓలు), ఇతర సంబంధిత శాఖల ప్రయత్నాలను సమన్వయం చేయడం.
- మాదకద్రవ్యాల డిమాండ్ తగ్గింపు కార్యకలాపాలను ఇప్పటికే అమల్లో ఉన్న రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంత కార్యక్రమాలు, పథకాలతో అనుసంధానించడం.
- విద్యాసంస్థలు, గ్రామాలు, పంచాయతీలు, వార్డులు, ముప్పు ఉన్న సామాజిక వర్గాలు తదితర ప్రాంతాల్లో ప్రజలకు చేరువయ్యేందుకు నిర్వహించిన కార్యక్రమాలను సమీక్షించడం.
- మరింత మందికి చేరువయ్యేలా నషా ముక్త్ భారత్ అభియాన్ అమలును, మత్తు పదార్థాల దుర్వినియోగ నివారణకు సంబంధించిన ముఖ్యమైన జాతీయ కార్యక్రమాల నిర్వహణను పర్యవేక్షించడం.
- యువజన సంఘాలు, మై భారత్ వాలంటీర్లు, స్వచ్ఛంద సంస్థలు, ఆధ్యాత్మిక సంస్థలు, ఇతర సంబంధిత సంస్థలు/సంఘాలు/బృందాలు నషా ముక్తి మిత్ర్‌లుగా (ఎన్‌ఎంఎం) పాల్గొనేలా ప్రోత్సహించడం.
- వ్యసన బాధితుల సమగ్ర పునరావాస కేంద్రాలు (ఐఆర్‌సీఏలు), జిల్లా వ్యసన విముక్తి కేంద్రాలు (డీడీఏసీలు), వ్యసన చికిత్స కేంద్రాలు (ఏటీఎఫ్‌లు), ఇతర చికిత్స సదుపాయాల లభ్యత, పనితీరును సమీక్షించడం. చికిత్స కోసం చేరికలు, కోలుకుంటున్న తీరు, తిరిగి వ్యసనానికి లోనుకాకుండా తీసుకునే చర్యలు, ఇతర చికిత్స కేంద్రాలకు పంపే వ్యవస్థలను పర్యవేక్షించడం.
- చికిత్స సేవల అందుబాటు, నాణ్యతలో లోపాలను పరిష్కరించడం.
- ముప్పు ఎక్కువగా ఉన్న జిల్లాలను గుర్తించి, ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలకు ఆమోదం ఇవ్వడం.
- కొత్తగా సమస్య తీవ్రమవుతున్న ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టేలా ఆదేశించడం.
- ఉపాధ్యాయులు, కౌన్సెలర్లు, ఆరోగ్య సిబ్బంది, చట్టాన్ని అమలు చేసే సిబ్బంది, స్థానిక వాలంటీర్ల కోసం నిర్వహించిన శిక్షణ కార్యక్రమాలను సమీక్షించడం.
- నిర్దేశిత పనితీరు సూచికలతో పోల్చి జిల్లాల పనితీరును సమీక్షించడం.
- ఎన్‌ఎంబీఏ పోర్టల్‌లో సకాలంలో నివేదికలు అందించేలా చూడటం.
- నిరంతరం లక్ష్యాలకు దిగువన పనితీరు కనబరుస్తున్న జిల్లాల్లో దిద్దుబాటు చర్యలకు ఆదేశించడం.
- నివారణ, చికిత్స, పునరావాస కార్యకలాపాలకు కేంద్ర, రాష్ట్ర వనరులను సమర్థంగా వినియోగించుకునేలా తోడ్పడటం.
- స్వచ్ఛంద సంస్థలు, విద్యాసంస్థలు, పౌర సమాజ సంస్థలతో భాగస్వామ్యాలను ప్రోత్సహించడం.
- అధ్యక్షుల అనుమతితో ఇతర అంశాలను పరిశీలించడం.

2. జిల్లా స్థాయి మాదకద్రవ్యాల డిమాండ్ తగ్గింపు కమిటీ
- రాష్ట్ర లక్ష్యాలకు అనుగుణంగా జిల్లా మాదకద్రవ్యాల డిమాండ్ తగ్గింపు ప్రణాళికను రూపొందించి, అమలు చేయడం.
- జిల్లాలో ముప్పు ఉన్న ప్రజావర్గాలను, సమస్య ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించడం.
- పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, పని ప్రదేశాలు, స్థానిక ప్రజల్లో అవగాహన కార్యక్రమాలను సమన్వయం చేయడం.
- శాఖలు, భాగస్వామ్య సంస్థల ద్వారా ఎన్‌ఎంబీఏ కార్యకలాపాలు క్రమం తప్పకుండా జరిగేలా చూడటం.
- చికిత్స అవసరమైనవారిని తగిన కేంద్రాలకు పంపేందుకు పాఠశాలలు, స్థానిక ప్రజలు, ఆరోగ్య సంస్థలు, చికిత్స కేంద్రాల మధ్య అనుసంధానాన్ని బలోపేతం చేయడం.
- కౌన్సెలింగ్, కుటుంబ సహాయ సేవలు అందేలా తోడ్పడటం.
- డీడీఏసీలు, ఐఆర్‌సీఏలు, ఏటీఎఫ్‌లు, ఇతర చికిత్స కేంద్రాల పనితీరును పర్యవేక్షించడం.
- చికిత్స చేరికలు, చికిత్స పూర్తి చేస్తున్నవారి శాతం, తదుపరి సేవలు, పునరావాస ఫలితాలను సమీక్షించడం.
- కౌన్సెలింగ్, డీటాక్సిఫికేషన్, పునరావాస సేవలు అందుబాటులో ఉండేలా చూడటం.
- కింది కేంద్రాల్లో తప్పనిసరిగా తనిఖీలు నిర్వహించడం:
  - ✓ డీడీఏసీలు
  - ✓ ఐఆర్‌సీఏలు
  - ✓ వ్యసన చికిత్స కేంద్రాలు
  - ✓ నివారణ కార్యక్రమాలు చేపడుతున్న విద్యాసంస్థలు
- సేవల నాణ్యత, లబ్ధిదారుల రికార్డులు, మౌలిక వసతుల ప్రమాణాలను పరిశీలించడం.
- గ్రామాలు, వార్డులు, పట్టణ నివాస ప్రాంతాల్లో అవగాహన, నివారణ కార్యక్రమాలను ప్రోత్సహించడం.
- పంచాయతీరాజ్ సంస్థలు, పట్టణ స్థానిక సంస్థలు, స్వయం సహాయక బృందాలు, మతపరమైన సంస్థల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం.
- ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాలు, చికిత్స, పునరావాసానికి సంబంధించిన జిల్లా స్థాయి గణాంకాలను ధ్రువీకరించడం.
- ఎన్‌ఎంబీఏ పోర్టల్ ద్వారా సకాలంలో నివేదికలు సమర్పించేలా చూడటం.
- వాలంటీర్ల నమోదు, బాధ్యతల కేటాయింపు, క్రమం తప్పకుండా చేపట్టే కార్యకలాపాలను సమీక్షించడం. గుర్తించిన ముప్పు ఉన్న వర్గాలకు క్రమం తప్పకుండా చేరువయ్యేలా చూడటం.
- కోలుకున్నవారికి నైపుణ్య శిక్షణ, జీవనోపాధి మద్దతు అందించేందుకు స్కిల్ డెవలప్‌మెంట్ మిషన్లు, సంబంధిత శాఖలతో సమన్వయం చేయడం.
- జిల్లాలో వ్యసనం నుంచి కోలుకున్నవారి నైపుణ్యాభివృద్ధి, పునరావాస కార్యక్రమాల పురోగతిని సమీక్షించి, పర్యవేక్షించడం.
- అధ్యక్షుల అనుమతితో ఇతర అంశాలను పరిశీలించడం.

3. బ్లాక్ స్థాయి మాదకద్రవ్యాల డిమాండ్ తగ్గింపు కమిటీ
- ఎన్‌ఎంబీఏ కార్యకలాపాలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించడం.
- గ్రామాలు, వార్డులు, పాఠశాలలు, కళాశాలలు, స్థానిక ప్రజల్లో అవగాహన, నివారణ కార్యక్రమాల అమలును పర్యవేక్షించడం.
- జిల్లా కమిటీ కేటాయించిన నెలవారీ లక్ష్యాలను సాధించేలా చూడటం.
- మత్తు పదార్థాల దుర్వినియోగ ముప్పు ఉన్న గ్రామాలు, పట్టణ ప్రాంతాలు, సంస్థలు, ప్రజావర్గాలను ప్రాంతాల వారీగా గుర్తించడం.
- స్థానిక ముప్పు కారకాలు, అవసరమైన చర్యలకు సంబంధించిన తాజా రికార్డులను నిర్వహించడం.
- కింది కేంద్రాల్లో నెలవారీ తనిఖీలు నిర్వహించడం:
  - ✓ డీడీఏసీ, ఏటీఎఫ్, ఐఆర్‌సీఏ, ఓడీఐసీ వంటి వ్యసన విముక్తి, చికిత్స కేంద్రాలు
  - ✓ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న విద్యాసంస్థలు
- నివేదించిన కార్యక్రమాలు నిజంగా జరిగాయో లేదో, వాటి నాణ్యతను పరిశీలించడం.
- పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థలు, ఉపాధ్యాయులు, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, స్వయం సహాయక బృందాలు, యువజన సంఘాలు, స్థానిక నాయకులను భాగస్వామ్యం చేయడం.
- మాదకద్రవ్య వ్యతిరేక కార్యక్రమాలను తమ బాధ్యతగా స్థానిక ప్రజలు స్వీకరించేలా ప్రోత్సహించడం.
- చికిత్స, పునరావాస సేవలు అవసరమైన వ్యక్తులను తగిన కేంద్రాలకు పంపేందుకు తోడ్పడటం.
- కోలుకుంటున్నవారికి తదుపరి సేవలు అందించేందుకు, వారు తిరిగి సమాజంలో కలిసేందుకు సహకరించడం.
- వాలంటీర్ల నమోదు, బాధ్యతల కేటాయింపు, క్రమం తప్పకుండా చేపట్టే కార్యకలాపాలను సమీక్షించడం. గుర్తించిన ముప్పు ఉన్న వర్గాలకు క్రమం తప్పకుండా చేరువయ్యేలా చూడటం.
- నెలవారీ అమలు, తనిఖీ నివేదికలను జిల్లా కమిటీకి సమర్పించడం.
- జిల్లా స్థాయి సహాయం అవసరమైన కేసులను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడం.
- జిల్లా, రాష్ట్ర కమిటీలు ఇచ్చిన ఆదేశాలను సంస్థలు, భాగస్వాములు పాటిస్తున్నారో లేదో పర్యవేక్షించడం.
- తనిఖీల్లో గుర్తించిన సమస్యలను సకాలంలో పరిష్కరించేలా చూడటం.
- నైపుణ్యాభివృద్ధి అవసరమైన, వ్యసనం నుంచి కోలుకున్న వ్యక్తులను గుర్తించడం.
- అందుబాటులో ఉన్న నైపుణ్యాభివృద్ధి పథకాల్లో కోలుకున్నవారు నమోదు చేసుకునేందుకు, వాటితో అనుసంధానం పొందేందుకు తోడ్పడటం.
- లబ్ధిదారుల భాగస్వామ్యాన్ని పర్యవేక్షించి, జిల్లా స్థాయి కమిటీకి క్రమం తప్పకుండా పురోగతి వివరాలు అందించడం.
- అధ్యక్షుల అనుమతితో ఇతర అంశాలను పరిశీలించడం.
రాష్ట్ర, జిల్లా, బ్లాక్ స్థాయి కమిటీలను క్రమం తప్పకుండా సమావేశపరచాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ప్రోత్సహిస్తున్నారు. నెలవారీ సమావేశాలు, చింతన్ శివిర్‌లు (రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, ఇతర భాగస్వాములతో సంప్రదింపుల సమావేశాలు), జాతీయ సదస్సుల ద్వారా మంత్రిత్వ శాఖ అమలును సమీక్షిస్తోంది.

కార్యక్రమాల నిర్వహణకు మంత్రిత్వ శాఖ ఒక్కో జిల్లాకు ఆర్థిక సంవత్సరంలో రూ. 10 లక్షల సహాయ గ్రాంటు అందిస్తుంది. నిధుల వినియోగ ధ్రువపత్రాలు, పురోగతి నివేదికల ఆధారంగా తర్వాతి విడతలను విడుదల చేస్తుంది. క్షేత్రస్థాయిలో పంచాయతీరాజ్ సంస్థలు, స్థానిక నాయకులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు ఈ పనిని చేపడుతున్నారు. నేషనల్ సర్వీస్ స్కీమ్, మేరా యువ భారత్ (మై భారత్) వాలంటీర్లు కూడా వారితో కలిసి పనిచేస్తున్నారు.

2026-27 కేంద్ర బడ్జెట్‌లో ఎన్‌ఏపీడీడీఆర్‌కు రూ. 333 కోట్లు కేటాయించారు. 2025-26 సవరించిన అంచనా రూ. 420 కోట్లు కాగా, 2024-25లో రూ. 268.32 కోట్లు ఖర్చు చేశారు.



ఆధ్యాత్మికతతో బలం: ఆధ్యాత్మిక సంస్థలతో అవగాహన ఒప్పందాలు
సమాజంలో ప్రజలపై ప్రభావం చూపగల ఆధ్యాత్మిక, మతపరమైన సంస్థలను నషా ముక్త్ భారత్ అభియాన్‌లో ప్రధాన భాగస్వాములుగా గుర్తించారు. మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించేందుకు వాటి విస్తృత సంబంధాలను వినియోగించుకోవాలని సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ (ఎంఓఎస్‌జేఈ) పలు సంస్థలతో అవగాహన ఒప్పందాలు (ఎంఓయూలు) చేసుకుంది. బ్రహ్మ కుమారీస్, ది ఆర్ట్ ఆఫ్ లివింగ్, సంత్ నిరంకారీ మిషన్, ఆల్ వరల్డ్ గాయత్రీ పరివార్, ఇస్కాన్, శ్రీ రామ్ చంద్ర మిషన్, యూనివర్సిటీ ఆఫ్ పతంజలి, శివానంద యోగా వేదాంత ధన్వంతరి ఆశ్రమ్, అధ్యాత్మ్ విజ్ఞాన్ సత్సంగ్ కేంద్ర, చిన్మయ మిషన్, దివ్య జ్యోతి జాగృతి సంస్థాన్, హరే కృష్ణ మూవ్‌మెంట్, బాస్కోనెట్ (డాన్ బాస్కో) వీటిలో ఉన్నాయి. సామాజిక కార్యక్రమాలు, పాఠశాలల్లో అవగాహన సమావేశాలు, బైక్ ర్యాలీలు, పోటీలు, సంచార వాహనాలు, అవగాహన పరుగులు, కౌన్సెలింగ్, ధ్యాన కార్యక్రమాల ద్వారా ఈ సంస్థలు దేశవ్యాప్తంగా 7.72+ కోట్ల మందికి చేరువయ్యాయి. మరిన్ని సంస్థలతో ఒప్పందాల ప్రక్రియ కొనసాగుతోంది.

ఆరో ఏడాది: లక్ష్యాలు, సాధనాలు, గణాంకాలు
2025 ఆగస్టు తర్వాత మంత్రిత్వ శాఖ ఆరు అంశాల్లో ఫలితాల ఆధారిత లక్ష్యాలను నిర్దేశించింది. నషా ముక్తి మిత్ర్‌లకు శిక్షణ, సామర్థ్య పెంపు; ఆధారాలతో రూపొందించిన సమాచార, విద్య, ప్రచార సామగ్రి; ముప్పు ఉన్న వర్గాలకు ప్రత్యేక చర్యలు; కొత్త మతపరమైన, ఆధ్యాత్మిక భాగస్వాములు; సంబంధిత మంత్రిత్వ శాఖలతో సమన్వయం; నాణ్యమైన వ్యసన విముక్తి, చికిత్స, పునరావాసం, దూరవైద్య సేవలు ఈ ఆరు అంశాలు.

ఎన్‌ఎంబీఏ 2.0 యాప్
అభియాన్ కార్యకలాపాల గణాంకాలను సేకరించి, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో ఎన్‌ఎంబీఏ డ్యాష్‌బోర్డ్‌లో చూపించేందుకు తొలి ఎన్‌ఎంబీఏ మొబైల్ యాప్‌ను రూపొందించారు. అభియాన్ సమాచారం, ప్రజలకు చేరువైన వివరాలతో డ్యాష్‌బోర్డ్, ఎన్‌ఎంఎం నమోదు, ఈ-ప్రతిజ్ఞ సదుపాయాలను ఎన్‌ఎంబీఏ వెబ్‌సైట్‌లో అందించారు.

మెరుగుపరిచిన ఎన్‌ఎంబీఏ 2.0 యాప్‌ను 24 ఏప్రిల్ 2026న చండీగఢ్‌లో జరిగిన చింతన్ శివిర్‌లో ప్రారంభించారు. పౌరులు ఇందులో ఈ-ప్రతిజ్ఞ చేయవచ్చు, అవగాహన సామగ్రిని చదవవచ్చు, హెల్ప్‌లైన్‌లను సంప్రదించవచ్చు, సమీప వ్యసన విముక్తి కేంద్రాన్ని గుర్తించవచ్చు.

చికిత్సపై పర్యవేక్షణ
ఎన్‌ఏపీడీడీఆర్ నిర్వహణ సమాచార వ్యవస్థ మద్దతు పొందే కేంద్రాల్లోని ప్రతి లబ్ధిదారుని వివరాలను నమోదు చేస్తుంది. నమోదు, వైద్య అంచనా, మత్తు పదార్థాల వినియోగ తీరు, వ్యాధి నిర్ధారణ, చికిత్స, తదుపరి సేవల వివరాలు ఇందులో ఉంటాయి. ప్రాజెక్టు పర్యవేక్షణ విభాగం ఆకస్మిక సందర్శనల ద్వారా కేంద్రాలను తనిఖీ చేస్తుంది. తనిఖీ నివేదిక సంతృప్తికరంగా ఉంటేనే ప్రాజెక్టు కొనసాగింపు, గ్రాంటు విడుదలకు అనుమతి లభిస్తుంది. గ్రాంటు పొందే ప్రతి సంస్థ నీతి ఆయోగ్ ఎన్‌జీఓ దర్పణ్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. సంబంధిత రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం సిఫార్సు కూడా అవసరం. నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ ద్వారా సహాయ గ్రాంట్లు పొందే సంస్థలకు నాణ్యత గుర్తింపు ఇచ్చే ప్రక్రియ కొనసాగుతోంది.

ప్రత్యేక చర్యలకు గణాంకాల ఆధారం
“భారత్‌లో మత్తు పదార్థాల వినియోగ స్థాయి” పేరుతో నిర్వహించిన తొలి జాతీయ సర్వే ఫలితాలను 2019లో ప్రచురించారు. జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో మత్తు పదార్థాల వినియోగంపై అంచనాలను ఈ సర్వే అందించింది. మొత్తం 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 186 జిల్లాల్లో సుమారు 2 లక్షల కుటుంబాలను సర్వే చేశారు. 10 నుంచి 75 ఏళ్ల మధ్య వయసున్న 4.73 లక్షలకు పైగా మందిని ఇంటర్వ్యూ చేశారు. రెండో పద్ధతిలో సర్వేలో పాల్గొన్నవారి పరిచయాల ద్వారా మరికొందరిని ఎంపిక చేసి, 123 జిల్లాల్లో అక్రమ మాదకద్రవ్యాలపై ఆధారపడే 70,000 మందికి పైగా వ్యక్తులను చేరుకున్నారు. ఎన్‌డీడీటీసీకి అప్పగించిన రెండో జాతీయ సర్వే తొలిసారిగా జిల్లా స్థాయి అంచనాలను అందించనుంది. దీని ఫలితాలు 2027లో వెలువడతాయని అంచనా.

పాఠశాలలు, హెల్ప్‌లైన్
6 నుంచి 11 తరగతుల విద్యార్థుల కోసం మంత్రిత్వ శాఖ జీవన నైపుణ్య మాడ్యూల్‌లను రూపొందించింది. జీవన నైపుణ్యాలు, మాదకద్రవ్యాలపై అవగాహనను బోధించేందుకు, తల్లిదండ్రులకు చేరువయ్యేందుకు ఇవి ఉపాధ్యాయులకు తోడ్పడతాయి. జాతీయ ఉచిత హెల్ప్‌లైన్ 1 మార్చి 2017 నుంచి పనిచేస్తోంది. తొలుత 1800-11-0031గా ఉన్న ఈ సేవ ఇప్పుడు 14446 నంబరుతో అందుబాటులో ఉంది. ఇది నిరంతరం ఫోన్ ద్వారా కౌన్సెలింగ్ అందిస్తుంది. కాల్ చేసినవారిని సమీపంలోని ప్రభుత్వ మద్దతు పొందే చికిత్స కేంద్రానికి అనుసంధానిస్తుంది. ఇప్పటివరకు 5.10 లక్షల కాల్స్ అందాయి. ఈ సేవను మరో రెండు జాతీయ హెల్ప్‌లైన్‌లతో అనుసంధానించారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నిర్వహించే మానస్ ఉచిత హెల్ప్‌లైన్ 1933 నిరంతరం అందుబాటులో ఉంటుంది. కాల్, ఎస్‌ఎంఎస్, చాట్‌బాట్, ఈమెయిల్ లేదా వెబ్ ద్వారా మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారాన్ని పౌరులు తెలియజేయవచ్చు. 10 అక్టోబర్ 2022న ప్రారంభించిన నేషనల్ టెలీ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ కింద టెలీ-మానస్ మానసిక ఆరోగ్య కౌన్సెలింగ్, సంరక్షణ సేవలను మరింత మందికి చేరువ చేస్తోంది.

నషా ముక్తి మిత్రులుగా పౌరులు
యువత భాగస్వామ్యం నషా ముక్త్ భారత్ అభియాన్‌కు కొత్త ఆలోచనలు, ఉత్సాహం, సృజనాత్మకతను అందించి, విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించింది. క్షేత్రస్థాయి భాగస్వామ్యాన్ని పెంచేందుకు నషా ముక్తి మిత్ర్ (ఎన్‌ఎంఎం) కార్యక్రమాన్ని ప్రారంభించారు. మాదకద్రవ్యాల డిమాండ్ తగ్గింపు ప్రయత్నాల్లో పౌరులు చురుగ్గా పాల్గొనేందుకు ఇది అవకాశం కల్పిస్తుంది. మాదకద్రవ్యాల డిమాండ్‌ను తగ్గించి, మత్తు పదార్థాలు లేని సమాజాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి స్వచ్ఛందంగా మద్దతు ఇచ్చేందుకు వీరు నమోదు చేసుకుంటారు. ఏ పౌరుడైనా ఎన్‌ఎంబీఏ పోర్టల్ ద్వారా నషా ముక్తి మిత్ర్‌గా నమోదు చేసుకోవచ్చు. వారి భాగస్వామ్య స్థాయిని బట్టి ధ్రువపత్రం, ఎన్‌ఎంబీఏ బ్యాడ్జ్ పొందవచ్చు. ఎన్‌ఎంఎంలు:
- మత్తు పదార్థాల దుర్వినియోగ దుష్పరిణామాలపై అవగాహన కల్పిస్తారు.
- ప్రజలు, ముఖ్యంగా యువత మాదకద్రవ్యాలు, వ్యసనానికి దారితీసే ఇతర పదార్థాలకు దూరంగా ఉండేలా ప్రోత్సహిస్తారు.
- మత్తు పదార్థాల వినియోగంతో ప్రభావితమైన వ్యక్తులు లేదా కుటుంబాలకు తగిన కౌన్సెలింగ్, చికిత్స, పునరావాస సేవలు అందేలా అనుసంధానిస్తారు.
- ఎన్‌ఎంబీఏ అవగాహన కార్యక్రమాలు, ప్రచార కార్యక్రమాలు, ప్రతిజ్ఞలు, ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాల్లో పాల్గొంటారు, వాటిని నిర్వహిస్తారు.
- మత్తు పదార్థాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా స్థానికంగా మార్పు తీసుకొచ్చేందుకు పనిచేస్తారు.
- తమ ప్రాంతాల్లో ప్రతిజ్ఞ, ఎన్‌ఎంబీఏ లోగో, మస్కట్, హెల్ప్‌లైన్ 14446ను ప్రచారం చేస్తారు.
10 నవంబర్ 2026 నాటికి 2 లక్షలకు పైగా మిత్ర్‌లు నమోదు చేసుకున్నట్లు మంత్రిత్వ శాఖ అభియాన్ పేజీలో నమోదైంది. 17 జూన్ 2026న ప్రారంభించిన వ్యక్తిగత డ్యాష్‌బోర్డ్ ద్వారా ప్రతి మిత్ర్ తన కార్యకలాపాలను గమనించవచ్చు, సమాచార, విద్య, ప్రచార సామగ్రిని పొందవచ్చు, ఎన్‌ఎంబీఏ ఈ-ప్రతిజ్ఞ చేయవచ్చు.

 


“నషా ముక్త్ భారత్ అభియాన్, వికసిత్ భారత్ కీ పెహచాన్” ఇతివృత్తంతో 17 నుంచి 26 జూన్ 2026 వరకు నషా ముక్త్ భారత్ సప్తాహ్ నిర్వహించారు. ప్రతిజ్ఞ కార్యక్రమాలు, ర్యాలీలు, పోటీలు, వీధి నాటకాలు, యోగా కార్యక్రమాల్లో 1.31 కోట్ల మంది పాల్గొన్నారు. శాఖ, ఆల్ వరల్డ్ గాయత్రీ పరివార్ మధ్య అవగాహన ఒప్పందాన్ని పొడిగిస్తూ హరిద్వార్‌లో ముగింపు కార్యక్రమం నిర్వహించారు. 10 నవంబర్ 2026 నాటికి 46.73 లక్షలకు పైగా ప్రతిజ్ఞలు నమోదైనట్లు మంత్రిత్వ శాఖ అభియాన్ పేజీ తెలిపింది.

అభియాన్‌లో చేరండి
ఈ-ప్రతిజ్ఞ చేయండి లేదా ఎన్‌ఎంబీఏ 2.0 యాప్‌లో ప్రతిజ్ఞ చేయండి. నషా ముక్తి మిత్ర్‌గా నమోదు చేసుకోండి. మీకు లేదా కుటుంబ సభ్యులకు సహాయం అవసరమైతే జాతీయ వ్యసన విముక్తి హెల్ప్‌లైన్ 14446కు కాల్ చేయండి.

చికిత్స, కోలుకోవడం
ఎన్‌ఏపీడీడీఆర్ కింద మంత్రిత్వ శాఖ ఐదు రకాల కేంద్రాల వ్యవస్థకు మద్దతు ఇస్తోంది. వ్యసన బాధితుల సమగ్ర పునరావాస కేంద్రాలు (ఐఆర్‌సీఏలు) 344, ఔట్‌రీచ్ అండ్ డ్రాప్-ఇన్ సెంటర్లు (ఓడీఐసీలు) 71, కమ్యూనిటీ-బేస్డ్ పీర్-లెడ్ ఇంటర్వెన్షన్ కేంద్రాలు (సీపీఎల్‌ఐలు) 45, జిల్లా వ్యసన విముక్తి కేంద్రాలు (డీడీఏసీలు) 198, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వ్యసన చికిత్స కేంద్రాలు (ఏటీఎఫ్‌లు) 155 ఉన్నాయి.
- ఐఆర్‌సీఏలు కేంద్రంలో చేర్చుకుని చికిత్స, కౌన్సెలింగ్, పునరావాస సేవలు అందిస్తాయి. ఓడీఐసీలు పరీక్షలు, అంచనా, కౌన్సెలింగ్ నిర్వహించి, అవసరమైనవారిని చికిత్సకు పంపుతాయి. ముప్పు ఉన్న కౌమారదశ పిల్లల్లో ముందస్తు నివారణ కోసం సీపీఎల్‌ఐలు యువ వాలంటీర్ల ద్వారా పనిచేస్తాయి.
- జిల్లా కేంద్రాల్లో ఐఆర్‌సీఏ, ఓడీఐసీ, సీపీఎల్‌ఐ సేవలను డీడీఏసీలు ఒకే చోట అందిస్తాయి.
- ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏటీఎఫ్‌లను ఎయిమ్స్‌కు చెందిన ఎన్‌డీడీటీసీ ద్వారా ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో 150 కేంద్రాల బాధ్యతను ఆ సంస్థకు అప్పగించారు. ఈశాన్య రాష్ట్రాల్లో తేజ్‌పూర్‌లోని లోకోప్రియ గోపీనాథ్ బోర్డోలోయ్ రీజినల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ ద్వారా ఏర్పాటు చేస్తున్నారు.
10 నవంబర్ 2026 నాటికి 39.91 లక్షల మందికి చికిత్స, పునరావాసం అందించినట్లు మంత్రిత్వ శాఖ అభియాన్ పేజీలో నమోదైంది. మద్దతు పొందే కేంద్రాల్లో చికిత్స, కౌన్సెలింగ్ కోసం వచ్చినవారి సంఖ్య 2020-21లో 2.08 లక్షల నుంచి 2025-26లో 9.11 లక్షలకు పైగా పెరిగింది. వ్యసనం నుంచి కోలుకున్న 6.68 లక్షలకు పైగా వ్యక్తులు ఎన్‌ఎంబీఏ ఈ-ప్రతిజ్ఞ చేశారు.

 



గువాహటి ఎయిమ్స్‌లో కోలుకున్న వ్యక్తి
అస్సాంలోని కామరూప్ మెట్రోపాలిటన్ జిల్లాకు చెందిన 31 ఏళ్ల పట్టభద్రుడు అమిత్ (పేరు మార్చారు) హెరాయిన్ అధిక మోతాదులో తీసుకోవడంతో గువాహటి ఎయిమ్స్ అత్యవసర విభాగానికి వచ్చారు. అక్కడ ఆయనకు ఓపియాయిడ్ ప్రత్యామ్నాయ చికిత్స ప్రారంభించారు. హెపటైటిస్ సీకి చికిత్స అందించారు. కుటుంబ సహకారంతో తిరిగి వ్యసనానికి లోనుకాకుండా నివారించే చికిత్స కూడా చేశారు. డిశ్చార్జి తర్వాత ఆసుపత్రిలోని వ్యసన చికిత్స కేంద్రం ఆయన సంరక్షణను కొనసాగించింది. కోలుకున్న రెండు నుంచి మూడు నెలల్లో ఆయనకు పని దొరికింది. ఏడాదికి పైగా మత్తు పదార్థాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం వైద్య పర్యవేక్షణలో ఆయనకు ఇచ్చే మందులను తగ్గిస్తున్నారు.

జమ్మూ కశ్మీర్: ఇతర ప్రాంతాలకూ అనుసరణీయ నమూనా
02 నవంబర్ 2026 నాటికి జమ్మూ కశ్మీర్‌లో ఈ కార్యక్రమం 1.26 కోట్లకు పైగా ప్రజలకు చేరింది. వీరిలో 72.26 లక్షల మంది యువత, 54.04 లక్షల మంది మహిళలు ఉన్నారు. 11,152 మంది నషా ముక్తి మిత్ర్‌లుగా చేరారు. ఈ కేంద్రపాలిత ప్రాంతంలో ఒక వ్యసన బాధితుల సమగ్ర పునరావాస కేంద్రం, 3 ఓడీఐసీలు, 2 సీపీఎల్‌ఐలు, 6 డీడీఏసీలు, 21 ఏటీఎఫ్‌లకు మంత్రిత్వ శాఖ మద్దతు ఇస్తోంది. ఈ ప్రాంతం నుంచి హెల్ప్‌లైన్‌కు 11,000కు పైగా కాల్స్ వచ్చాయి.

22 అక్టోబర్ 2026న కేంద్రపాలిత ప్రాంత సాంఘిక సంక్షేమ పథకాలను సమీక్షించిన సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ కార్యదర్శి, ప్రభుత్వ వ్యవస్థలన్నీ సమన్వయంతో చేపడుతున్న మాదకద్రవ్య వ్యతిరేక కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అనుసరించేందుకు అనువైన నమూనాగా పేర్కొన్నారు. నషా ముక్త్ జే&కే 100 డేస్ అభియాన్ కింద వ్యసన చికిత్స కేంద్రాలు 66,500కు పైగా బయటి రోగులకు సేవలు అందించాయి. ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి చికిత్స, పునరావాసం, తిరిగి సమాజంలో కలవడం, దీర్ఘకాలిక పర్యవేక్షణ వరకు వ్యక్తికి తోడుగా ఉండే “సర్కిల్ ఆఫ్ కేర్” విధానాన్ని శ్రీనగర్ ప్రభుత్వ వైద్య కళాశాల ప్రదర్శించింది. ప్రతిపాదిత రిహాబిలిటేషన్ అండ్ సోషియో-ఎకనామిక్ రీఇంటిగ్రేషన్ స్కీమ్ ఫర్ డ్రగ్ అబ్యూజ్ విక్టిమ్స్, 2026 మూడేళ్ల కోలుకునే కార్యాచరణ విధానాన్ని నిర్దేశిస్తోంది.

భ‌విష్య‌త్ మార్గం

 


మత్తు పదార్థాల వినియోగ విస్తృతి, తీరుపై రెండో జాతీయ సర్వే తొలిసారిగా జిల్లా స్థాయి అంచనాలను అందించనుంది. దీని ఫలితాలు 2027లో వెలువడతాయని అంచనా. రాష్ట్ర ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, సహాయ గ్రాంట్లు పొందే సంస్థలు, నిపుణులు, ఆరోగ్యం, విద్య, జైళ్లకు సంబంధించిన మంత్రిత్వ శాఖలు, విభాగాలతో చింతన్ శివిర్‌లు, ప్రాంతీయ సంప్రదింపుల అనంతరం ఎన్‌ఏపీడీడీఆర్‌ను పునర్వ్యవస్థీకరిస్తున్నారు. నిపుణుల కమిటీ దాని మార్గదర్శకాలను సవరిస్తోంది.

2026 సెప్టెంబర్‌లో జరిగిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మాదకద్రవ్య నిరోధక కార్యాచరణ బృందాల అధిపతుల మూడో జాతీయ సదస్సులో కేంద్ర హోం మంత్రి మాట్లాడారు. దేశమంతా సమష్టిగా 31 డిసెంబర్ 2029 నాటికి మాదకద్రవ్యాల వ్యాపారాన్ని నిర్మూలిస్తుందని చెప్పారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధనలో యువత రక్షణకు ప్రాధాన్యమిచ్చారు. ఈ సంకల్పంలో డిమాండ్ తగ్గింపుపై అభియాన్ పనిచేస్తోంది: అవగాహన గల సమాజం, ముందస్తు నివారణ, అందుబాటులో చికిత్స, గౌరవంగా తిరిగి సమాజంలో కలిసే అవకాశం దీనికి ఆధారాలు.

ఆరేళ్లలో అభియాన్ 272 జిల్లాల్లోని కార్యక్రమం నుంచి 35 కోట్ల మంది ప్రజల ఉద్యమంగా ఎదిగింది. 2 లక్షలకు పైగా ఎన్‌ఎంఎంలు నమోదు చేసుకున్నారు. దేశవ్యాప్తంగా ఐదు రకాల కేంద్రాలతో చికిత్స వ్యవస్థ విస్తరించింది. సహాయం అవసరమైన వారెవరైనా ముందుగా సంప్రదించగల మార్గంగా హెల్ప్‌లైన్ 14446 అందుబాటులో ఉంది.

 

References

Ministry of Social Justice and Empowerment:

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2326763

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2247770

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2282425

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2191297

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2281067

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2293976

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2273549

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2237623

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2255464

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2291282

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2155555

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2261469

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2291288

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2307945

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2274105

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2278199

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2295740

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2327570

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2326852

https://www.pib.gov.in/newsite/PrintRelease.aspx?relid=188688

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2285464

https://www.dosje.gov.in/organisation/nasha-mukt-bharat-abhiyaan/

https://www.dosje.gov.in/schemes-and-services/national-action-plan-for-drug-demand-reduction/

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1897001

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2334758

 

Ministry of Home Affairs:

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2146784

 

Ministry of Women and Child Development:

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2247567

 

Ministry of Finance:

https://www.indiabudget.gov.in/doc/eb/sbe93.pdf

Click here to see pdf

***

(Explainer ID: 160784) आगंतुक पटल : 45
Provide suggestions / comments
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Assamese , Kannada