Infrastructure

భారత రసాయన, పెట్రోర‌సాయ‌నాల‌ రంగం: పారిశ్రామిక వృద్ధికి పునాది

Posted On: 07 NOV 2026 10:27AM

భారత్‌లో రసాయన, పెట్రోరసాయన పరిశ్రమ తయారీ కార్యకలాపాలను విస్తరిస్తోంది. పెట్టుబడి అవకాశాలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ సంబంధాలు విస్తరిస్తున్నాయి. ప్రత్యేక పారిశ్రామిక పార్కులు, సమగ్ర మౌలిక వసతుల ద్వారా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం, పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. పరిశోధనకు నిధులు, ప్రత్యేక సంస్థలు, నైపుణ్యాభివృద్ధి ద్వారా అధునాతన పారిశ్రామిక వినియోగాలకు అవసరమైన నైపుణ్యాన్ని పెంచుతున్నారు. నాణ్యత ప్రమాణాలు, పని ప్రదేశాల్లో భద్రతా చర్యలు బాధ్యతాయుత పారిశ్రామిక పద్ధతులను బలోపేతం చేస్తున్నాయి. ఈ ప్రయత్నాలు ఉత్పత్తులకు మరింత విలువ జోడించేందుకు, సాంకేతిక సామర్థ్యాన్ని పెంచేందుకు, ప్రపంచ రసాయన మార్కెట్లలో ఈ రంగం పాత్రను బలోపేతం చేసేందుకు తోడ్పడుతున్నాయి.

వ్యూహాత్మక ప్రాధాన్యం గల పరిశ్రమ
భారత్‌లో రసాయన, పెట్రోరసాయన పరిశ్రమ తయారీ, వ్యవసాయం, పారిశ్రామిక అభివృద్ధికి కీలక ఆధారం. ఔషధాలు, వస్త్రాలు, నిర్మాణం, వాహనాలు, ఎలక్ట్రానిక్స్, వినియోగ వస్తువులు సహా పలు రంగాలు ఈ పరిశ్రమ ఉత్పత్తులను ఉపయోగిస్తున్నాయి. రసాయనాల ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలో ఆరో స్థానంలో, ఆసియాలో నాలుగో స్థానంలో ఉంది. ఈ రంగం ప్రస్తుత విలువ సుమారు 220 బిలియన్ అమెరికా డాలర్లు. 2030 నాటికి 300 బిలియన్ డాలర్లకు, 2040 నాటికి 1 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా.

ప్రత్యేక రసాయన ఉత్పత్తుల విభాగాల్లోనూ భారత్‌కు ప్రముఖ స్థానం ఉంది. డైల‌ తయారీ, ఎగుమతుల్లో ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది. వ్యవసాయ రసాయనాల ఎగుమతుల్లో మూడో స్థానంలో ఉంది. ఈ రంగంలో సుమారు 13,000 భారీ యూనిట్లు, 4.45 లక్షల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు (ఎంఎస్‌ఎంఈలు) ఉన్నాయి. రసాయన తయారీ, పరిశోధన, పారిశ్రామిక మౌలిక వసతుల అభివృద్ధికి పలు కార్యక్రమాలు తోడ్పడుతున్నాయి. ప్రత్యేక రసాయన పార్కులు, నిధులు పొందే అవకాశాలు, నాణ్యతను పెంచేందుకు, పెట్టుబడులను ప్రోత్సహించేందుకు చేపట్టిన చర్యలు వీటిలో ఉన్నాయి. ప్రపంచ విలువ గొలుసుల్లో భారత్ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం ఈ ప్రయత్నాల ఉద్దేశం.

ఇండియా కెమ్ 2026: పరిశ్రమలు, పెట్టుబడులు, ప్రపంచ మార్కెట్ల అనుసంధానం
14వ ఇండియా కెమ్ 2026ను 2026 అక్టోబర్ 22 నుంచి 24 వరకు ముంబయిలో నిర్వహించారు. రసాయన, పెట్రోరసాయన రంగంలో పెట్టుబడులను ఆకర్షించడం, నిలకడైన వృద్ధిని ప్రోత్సహించడం ఈ మూడు రోజుల కార్యక్రమం లక్ష్యం. “అడ్వాంటేజ్ భారత్: ఎదుగుతున్న అంతర్జాతీయ రసాయన కేంద్రం” అనే ఇతివృత్తం భారత్ పారిశ్రామిక సామర్థ్యాన్ని, అంతర్జాతీయ సహకార అవకాశాలను చాటింది. 5,000 మందికి పైగా సందర్శకులు హాజరైన ఈ కార్యక్రమం దేశాల వారీ వేదికలు, సీఈఓ ఫోరం, ఆయా రంగాలకు ప్రత్యేకంగా నిర్వహించిన రౌండ్‌టేబుల్ చర్చల ద్వారా పరిశ్రమ ప్రముఖులు, వ్యాపార సంస్థలను ఒకచోటికి తీసుకొచ్చింది. ప్రదర్శనలో సాంకేతికతలు, పరికరాలు, పెట్టుబడి అవకాశాలను చూపించారు. తొలిసారిగా నిర్వహించిన ఇండియా కెమ్ యూత్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ పరిశోధన ఆధారంగా ఆచరణలో ఉపయోగపడే పరిష్కారాలను రూపొందించేందుకు విద్యార్థులను ప్రోత్సహించింది.

తయారీ సామర్థ్యం, పారిశ్రామిక మౌలిక వసతుల బలోపేతం
దేశీయ తయారీని బలోపేతం చేయడానికి పెట్టుబడులు, పారిశ్రామిక మౌలిక వసతులు, అనుకూల విధానాలు అవసరం. చాలా రసాయన ఉపరంగాల్లో ఆటోమేటిక్ రూట్ ద్వారా 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) భారత్ అనుమతిస్తోంది. ఈ మార్గంలో భారత్ వెలుపల నివసించే వ్యక్తి పెట్టుబడి పెట్టేందుకు ప్రభుత్వ ముందస్తు అనుమతి అవసరం లేదు. 2014–2026 మధ్య వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ₹1,04,895 కోట్లకు చేరాయి. 2004–2014 మధ్య నమోదైన ₹45,240 కోట్ల కంటే ఇది రెట్టింపునకు పైగా.



ప్రధాన రసాయనాలు, పెట్రోరసాయనాల ఉత్పత్తి 2015–16లో 45,638 వేల మెట్రిక్ టన్నుల (ఎంటీ) నుంచి 2024–25లో 58,617 వేల మెట్రిక్ టన్నులకు పెరిగింది. ఉత్పత్తిలో ఈ వృద్ధి పారిశ్రామిక సామర్థ్యాన్ని విస్తరించేందుకు, ప్రత్యేక తయారీ కేంద్రాలను అభివృద్ధి చేసేందుకు, రంగం అంతటా మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు చేపట్టిన కార్యక్రమాలకు ఊతమిస్తోంది.

పెట్రోలియం, రసాయనాలు, పెట్రోరసాయనాల పెట్టుబడి ప్రాంతాలు
పెట్రోలియం, రసాయనాలు, పెట్రోరసాయనాల పెట్టుబడి ప్రాంతాల (పీసీపీఐఆర్‌లు) ఏర్పాటు ఉద్దేశం ఈ రంగాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడం. ఒక్కో పీసీపీఐఆర్ నిర్దిష్ట హద్దులతో గుర్తించిన సుమారు 250 చదరపు కిలోమీటర్ల పెట్టుబడి ప్రాంతం. అందులో దాదాపు 40% విస్తీర్ణాన్ని ప్రాసెసింగ్ కార్యకలాపాలకు కేటాయిస్తారు. ఈ ప్రాంతాల్లో పరిశ్రమలను సమూహాలుగా ఏర్పాటు చేసి, ఉమ్మడి మౌలిక వసతులు, ప్రాథమిక సదుపాయాలు, సహాయక సేవలు అందిస్తారు. రహదారులు, రైలు మార్గాలు, ఓడరేవులు, ఉమ్మడి పారిశ్రామిక వ్యర్థజల శుద్ధి కేంద్రాలు, మురుగునీటి పారవేత కేంద్రాలు, నీటి సరఫరా, ఆవిరి ఉత్పత్తి యూనిట్లు వీటిలో ఉన్నాయి. ఈ మౌలిక వసతులు వ్యాపారాలు స్థాపించేందుకు, పోటీపడేందుకు అనుకూల వాతావరణాన్ని కల్పిస్తాయి.
- భారత్‌లో మూడు పీసీపీఐఆర్‌లు పనిచేస్తున్నాయి: గుజరాత్‌లోని దహేజ్, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం–కాకినాడ, ఒడిశాలోని పారాదీప్.
- ఈ మూడు ప్రాంతాలు కలిపి ₹3.4 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి.
- 3.7 లక్షల ఉద్యోగాలను కల్పించాయి, 2,200కు పైగా రసాయన తయారీ యూనిట్ల ఏర్పాటుకు తోడ్పడ్డాయి.
- ఈ ఉమ్మడి పారిశ్రామిక వ్యవస్థ మరిన్ని పెట్టుబడులకు, ఉత్పత్తులకు మరింత విలువ జోడించేందుకు పునాది వేస్తోంది.

భవ్య రసాయన్: ప్రత్యేక రసాయన పార్కులు
2026 జూలైలో ఆమోదం పొందిన భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన రసాయన్ (భవ్య రసాయన్) పథకం కింద మూడు ప్రత్యేక రసాయన పార్కులను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక్కో పార్కు కనీసం 8 చదరపు కిలోమీటర్ల (2,000 ఎకరాల) విస్తీర్ణంలో ఉంటుంది. సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం కనీసం ₹500 కోట్లు సమకూరిస్తే, కేంద్రం ఒక్కో పార్కుకు ₹1,000 కోట్ల వరకు గ్రాంటు ఇస్తుంది. పథకానికి మొత్తం ₹3,030 కోట్లు కేటాయించారు. ఇందులో ఉమ్మడి మౌలిక వసతులు, ప్రాథమిక సదుపాయాలకు ₹3,000 కోట్లు, పరిపాలనా వ్యయానికి ₹30 కోట్లు కేటాయించారు. 2026–27 ఆర్థిక సంవత్సరం నుంచి 2030–31 ఆర్థిక సంవత్సరం వరకు ఐదేళ్లపాటు ఈ పథకం అమల్లో ఉంటుంది.

ఈ పార్కుల్లో రసాయన పరిశ్రమలు వెంటనే కార్యకలాపాలు ప్రారంభించేందుకు వీలుగా మౌలిక వసతులు (ప్లగ్ అండ్ ప్లే) సిద్ధంగా ఉంటాయి. దీంతో వనరుల వినియోగం మెరుగవుతుంది. సరకు రవాణా, నిల్వ ఖర్చులు తగ్గుతాయి. పర్యావరణానికి అనుకూలమైన సదుపాయాలతో నిలకడైన పారిశ్రామిక అభివృద్ధికీ ఈ పార్కులు తోడ్పడతాయి. ఉమ్మడి పారిశ్రామిక వ్యర్థజల శుద్ధి కేంద్రాలు, నిల్వ, పారవేత సదుపాయాలు, ప్రమాదకర వ్యర్థాల నిర్వహణ వ్యవస్థ వంటి కేంద్రీకృత సదుపాయాలు ఇందులో ఉంటాయి. ఈ పథకం పెట్టుబడులను ఆకర్షిస్తుందని, దేశీయ ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరిస్తుందని, అంతర్జాతీయంగా పోటీపడే సామర్థ్యాన్ని పెంచుతుందని అంచనా.

ప్లాస్టిక్ పార్కులు: తదుపరి దశ ప్రాసెసింగ్‌కు ఊతం
స్కీమ్ ఫర్ సెటింగ్ అప్ ఆఫ్ ప్లాస్టిక్ పార్క్స్ దేశీయ ప్లాస్టిక్ పరిశ్రమలో తదుపరి దశ ప్రాసెసింగ్‌కు తోడ్పడుతుంది. పాలిమర్ (ఒక పెట్రోరసాయనం) వినియోగ సామర్థ్యాన్ని పెంచడం, దాన్ని ప్రాసెస్ చేసి దేశీయ ఉత్పత్తులకు మరింత విలువ జోడించడంపై పథకం దృష్టి పెడుతోంది. ప్లాస్టిక్‌కు సంబంధించిన వ్యాపారాలు, పరిశ్రమల కోసం కేటాయించిన పారిశ్రామిక ప్రాంతాలే ప్లాస్టిక్ పార్కులు. ప్లాస్టిక్ ప్రాసెసింగ్ సంస్థల సామర్థ్యాలను ఒకచోటికి తీసుకొచ్చి, అవి పరస్పరం తోడ్పడేలా చేయడం వీటి లక్ష్యం. దీంతో పెట్టుబడులు, ఉత్పత్తి, ఎగుమతులు పెరుగుతాయి, ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. ఈ పథకం కింద ఒక్కో ప్రాజెక్టుకు రూ. 40 కోట్ల గరిష్ఠ పరిమితికి లోబడి, ప్రాజెక్టు వ్యయంలో 50% వరకు ప్రభుత్వం గ్రాంటుగా ఇస్తుంది. మిగిలిన వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం లేదా దాని సంస్థలు, లబ్ధి పొందే పరిశ్రమలు తదితరాలు భరిస్తాయి.

వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్ కార్యక్రమాల ద్వారా పర్యావరణానికి అనుకూలమైన వృద్ధిని కూడా ఈ పార్కులు ప్రోత్సహిస్తున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణకు, రసాయన పరిశ్రమ బలోపేతానికి భారత్ చేస్తున్న కృషిలో ఇవి ముఖ్యమైన భాగం. దేశవ్యాప్తంగా పది ప్లాస్టిక్ పార్కులకు ఆమోదం ఇచ్చారు. వాటిలో 4 పార్కుల్లో మౌలిక వసతుల పనులు 100% పూర్తయ్యాయి. వీటిలో 3 పార్కుల పనులు 2025–26లో పూర్తయ్యాయి.

 



పరిశోధన, ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధి
వివిధ పరిశ్రమల్లో రసాయనాల వినియోగం విస్తరిస్తున్న కొద్దీ ప్రత్యేక పరిజ్ఞానం, సాంకేతిక నైపుణ్యం అవసరం పెరుగుతోంది. రంగానికి సంబంధించిన పరిశోధన, ప్రత్యేక సాంకేతిక విద్య, పరిశ్రమ అవసరాలకు తగిన నైపుణ్య శిక్షణ ద్వారా పలు కార్యక్రమాలు ఈ ప్రయత్నాలకు ఊతమిస్తున్నాయి.

కెమికల్ ప్రమోషన్ అండ్ డెవలప్‌మెంట్ స్కీమ్
కెమికల్ ప్రమోషన్ అండ్ డెవలప్‌మెంట్ స్కీమ్ (సీపీడీఎస్) కొత్త పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం, దాన్ని పంచుకోవడం, పరిశోధనను ప్రోత్సహించడం ద్వారా రసాయన, పెట్రోరసాయన పరిశ్రమ వృద్ధికి తోడ్పడుతుంది. రంగానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని పెంచేందుకు అధ్యయనాలు, సర్వేలు, డేటాబేస్‌లు, ప్రచార సామగ్రి రూపకల్పనకు సాయం అందిస్తుంది. ఈ రంగాలకు విశేషంగా తోడ్పడిన వారిని గుర్తించడం ద్వారా పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది. వర్క్‌షాప్‌లు, సదస్సులు, అధ్యయనాలు, అనుబంధ కార్యకలాపాల కోసం సంస్థలు, పరిశ్రమ సంఘాలు, ఇతర సంస్థలకు సహాయ గ్రాంట్లు (సాధారణ విభాగం) అందిస్తుంది.
- 2016 నుంచి ప్రభుత్వ రంగ సంస్థ హెచ్‌ఐఎల్ (ఇండియా) లిమిటెడ్ సీపీడీఎస్ కింద రైతులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
- ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెస్టిసైడ్ ఫార్ములేషన్ టెక్నాలజీ (ఐపీఎఫ్‌టీ) కూడా 2022–23 నుంచి ఈ కార్యక్రమాల నిర్వహణ ప్రారంభించింది. పురుగుమందులను సురక్షితంగా, విచక్షణతో వాడేందుకు, సమగ్ర చీడపీడల నిర్వహణ పద్ధతులను పాటించేందుకు ఈ కార్యక్రమాలు రైతులను ప్రోత్సహిస్తున్నాయి.
- ఆహార ధాన్యాలు, వంట నూనెలు, పండ్లు, కూరగాయల్లో పురుగుమందుల అవశేషాలను సాధ్యమైనంతగా తగ్గించడం ఈ పద్ధతుల లక్ష్యం. ఆగస్టు 2026 నాటికి దేశవ్యాప్తంగా నిర్వహించిన 250కి పైగా కార్యక్రమాల ద్వారా లక్ష మందికి పైగా రైతులు ప్రయోజనం పొందారు.

రీసెర్చ్, డెవలప్‌మెంట్ అండ్ ఇన్నోవేషన్ స్కీమ్
పరిశోధన, ఆవిష్కరణల్లో ప్రైవేటు రంగ పెట్టుబడులకు ఊతమిచ్చేందుకు 2025 నవంబర్‌లో రీసెర్చ్, డెవలప్‌మెంట్ అండ్ ఇన్నోవేషన్ (ఆర్‌డీఐ) స్కీమ్‌ను ప్రారంభించారు. దీనికి ₹1 లక్ష కోట్ల నిధి ఉంది. గణనీయమైన మార్పు తీసుకొచ్చే ప్రాజెక్టులకు అనుకూల షరతులతో దీర్ఘకాలిక నిధులు, రీఫైనాన్సింగ్ సదుపాయం కల్పిస్తుంది. అధునాతన సాంకేతికతలను వేగంగా వినియోగంలోకి తేవడం, పరిశ్రమలు పోటీపడే సామర్థ్యాన్ని పెంచడం, కీలకమైన, కొత్తగా ఎదుగుతున్న సాంకేతిక రంగాల్లో స్వావలంబనను ప్రోత్సహించడం ఈ పథకం లక్ష్యం.

8 అక్టోబర్ 2026 నుంచి అధునాతన రసాయనాలు, పెట్రోరసాయనాలు, పదార్థ సాంకేతికతలను పథకం కింద నిధులు పొందేందుకు అర్హమైన అదనపు సాంకేతిక విభాగంగా చేర్చారు. దీంతో ఈ రంగంలో పరిశోధన, ఆవిష్కరణలు బలోపేతమవుతాయి. అధునాతన పారిశ్రామిక వినియోగాలకు అవసరమైన దేశీయ సాంకేతికతల అభివృద్ధికి ఇది తోడ్పడుతుంది.

సిపెట్: సాంకేతిక విద్య, నైపుణ్యాలు, పరిశ్రమలకు తోడ్పాటు
సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ (సిపెట్) కేంద్ర ప్రభుత్వం నిధులు అందించే ఉన్నత సాంకేతిక విద్యాసంస్థ. భారత్‌లో పెట్రోరసాయన, అనుబంధ పరిశ్రమల అభివృద్ధికి నైపుణ్యాభివృద్ధి, సాంకేతిక తోడ్పాటు, విద్య, పరిశోధన (స్టార్) కార్యక్రమాలను చేపడుతోంది. పలు కేంద్రాలు, ప్రయోగశాలలతో సిపెట్ విస్తరించింది. నైపుణ్య శిక్షణ, సాంకేతిక తోడ్పాటు కేంద్రం (సీఎస్‌టీఎస్), ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ కేంద్రం (పీడబ్ల్యూఎంసీ), స్కూల్ ఆఫ్ అడ్వాన్స్ రీసెర్చ్ ఇన్ పెట్రోకెమికల్స్ (ఎస్‌ఏఆర్‌పీ) వీటిలో ఉన్నాయి. అడ్వాన్స్ రీసెర్చ్ స్కూల్ ఫర్ టెక్నాలజీ అండ్ ప్రొడక్ట్ సిమ్యులేషన్ (ఏఆర్‌ఎస్‌టీపీఎస్), అడ్వాన్స్ పాలిమర్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ రీసెర్చ్ లేబొరేటరీ (ఏపీడీడీఆర్‌ఎల్) వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి.
- సిపెట్ పరిధిలో ఇప్పుడు 51 కేంద్రాలు ఉన్నాయి. వాటిలో 19 కేంద్రాలను 2014 నుంచి ఏర్పాటు చేశారు. మూడు కేంద్రాలు ప్రత్యేకంగా ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణపై పనిచేస్తున్నాయి.
- సంస్థ దాదాపు 6.72 లక్షల మందికి వృత్తి నైపుణ్య శిక్షణ ఇచ్చింది. వారిలో 5.21 లక్షలకు పైగా మందికి 2014–24 మధ్య శిక్షణ అందించింది. అదే కాలంలో 8.53 లక్షల సాంకేతిక సహాయ సేవల పనులను పూర్తి చేసింది.

సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్
ప్రస్తుతం ఉన్న సాంకేతికతలను మెరుగుపరచడానికి, పరిశోధనను బలోపేతం చేయడానికి, కొత్త వినియోగాలను అభివృద్ధి చేయడానికి సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేశారు. 18 కేంద్రాలు 85 పేటెంట్ దరఖాస్తులు దాఖలు చేశాయి, 600కు పైగా పరిశోధనా పత్రాలను ప్రచురించాయి, 105 కొత్త సాంకేతికతలు, ఉత్పత్తులను అభివృద్ధి చేశాయి. దేశీయ సామర్థ్యాలను పెంచడంలో, పారిశ్రామిక ఆవిష్కరణలకు ఊతమివ్వడంలో పరిశోధనా సంస్థల పాత్రను ఈ విజయాలు చాటుతున్నాయి.

నాణ్యత, భద్రత, రసాయనాల బాధ్యతాయుత వినియోగం
రసాయన, పెట్రోరసాయన రంగం బాధ్యతాయుతంగా ఎదగాలంటే నాణ్యత ప్రమాణాలు, పని ప్రదేశాల్లో భద్రత అవసరం. నియంత్రణ చర్యలు ఉత్పత్తుల నాణ్యతను కాపాడేందుకు తోడ్పడతాయి. ప్రమాదకర రసాయనాలను సురక్షితంగా నిర్వహించేందుకు పరిశ్రమల సిబ్బందికి ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు.

నాణ్యత నియంత్రణ ఉత్తర్వులు
వినియోగదారులను రక్షించడానికి, నాణ్యమైన తయారీని ప్రోత్సహించడానికి, నాసిరకం దిగుమతులను అరికట్టడానికి నాణ్యత నియంత్రణ ఉత్తర్వులు (క్యూసీఓలు) జారీ చేశారు. ఆగస్టు 2026 నాటికి 37 క్యూసీఓలు అమల్లో ఉన్నాయి. వీటితో నిర్దిష్ట రసాయన, పెట్రోరసాయన ఉత్పత్తులకు ప్రమాణాలు తప్పనిసరి అయ్యాయి. దేశీయ తయారీదారులు, దిగుమతిదారులు భారత ప్రమాణాల బ్యూరో (బీఐఎస్) నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలను పాటించాలి.

పని ప్రదేశాల్లో భద్రత, ప్రమాదకర రసాయనాల నిర్వహణ
భారీ ప్రమాదాల ముప్పున్న యూనిట్ల (ఎంఏహెచ్) సిబ్బంది కోసం వికసిత్ భారత్@2047 యాక్షన్ ప్లాన్ కింద దేశవ్యాప్త శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. “పని ప్రదేశాల్లో ప్రమాదకర రసాయనాలను సురక్షితంగా నిర్వహించడం, వాటితో ముడిపడిన ముప్పును తగ్గించడం”పై ఈ కార్యక్రమం దృష్టి పెడుతోంది. 5 ఏళ్లలో మొత్తం 2,393 ఎంఏహెచ్ యూనిట్లకు శిక్షణ అందేలా కార్యక్రమాన్ని రూపొందించారు. ప్రతి శిక్షణ కార్యక్రమానికి 50 ఎంఏహెచ్ యూనిట్ల నుంచి ఇద్దరు చొప్పున 100 మంది ఉద్యోగులు హాజరవుతారు.

ఆగస్టు 2026 నాటికి దేశవ్యాప్తంగా 21 శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. 1,376 పారిశ్రామిక యూనిట్లు వీటిలో పాల్గొన్నాయి. 2,441 మంది సిబ్బంది శిక్షణ పొందారు. పని ప్రదేశాల్లో ప్రమాదాలను ఎదుర్కొనే సన్నద్ధతను పెంచడం, ప్రమాదకర రసాయనాల నిర్వహణపై అవగాహనను మెరుగుపరచడం ఈ కార్యక్రమ లక్ష్యం.

సమగ్రత, పోటీతత్వం దిశగా పరిశ్రమ
భారత్ రసాయన, పెట్రోరసాయన పరిశ్రమ పరిధిలో పలు రకాల తయారీ కార్యకలాపాలు, పారిశ్రామిక వినియోగాలు, తదుపరి దశలో తయారయ్యే ఉత్పత్తులు ఉన్నాయి. ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించడం, ప్రత్యేక పారిశ్రామిక సదుపాయాలను ఏర్పాటు చేయడం, పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని కల్పించడం ఈ రంగ అభివృద్ధిలో భాగం. తయారీతో పాటు పరిశోధన కార్యక్రమాలు, సాంకేతిక సంస్థలు పరిజ్ఞానాన్ని పెంచేందుకు, సాంకేతికతను మెరుగుపరిచేందుకు, సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు తోడ్పడుతున్నాయి. నాణ్యత ప్రమాణాలు ఉత్పత్తులు నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చూస్తాయి. ప్రమాదకర రసాయనాల నిర్వహణ పని ప్రదేశాల్లో భద్రతను పెంచుతుంది. ఇండియా కెమ్ 2026 దేశీయంగా జరుగుతున్న ఈ అభివృద్ధిని అంతర్జాతీయ భాగస్వామ్యం, పరిశ్రమల భాగస్వామ్యం, సహకార అవకాశాలతో అనుసంధానించింది. ఈ రంగం పారిశ్రామిక అభివృద్ధికి, అంతర్జాతీయ సంబంధాల విస్తరణకు ఎంత విస్తృతంగా కృషి జరుగుతోందో ఈ చర్యలు చాటుతున్నాయి.

 

References

Ministry of Chemicals and Fertilizers: Department of Chemicals and Petrochemicals

 

https://chemicals.gov.in/

 

https://chemicals.gov.in/sites/default/files/Reports/annual_report_2025-26_Eng_1.pdf

 

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2246357&reg=48&lang=2

 

https://www.pib.gov.in/PressReleseDetailm.aspx?PRID=2325901&reg=48&lang=2

 

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2294832&reg=3&lang=1

 

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2323590&reg=48&lang=2

 

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2120876&reg=3&lang=2

 

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2220980&reg=3&lang=1

 

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2288866&lang=1&reg=48

 

https://www.pib.gov.in/PressReleaseDetail.aspx?PRID=2327972&reg=48&lang=1

 

https://www.pib.gov.in/PressReleaseDetail.aspx?PRID=2326667&reg=6&lang=1

 

Please See PDF

PIB Research

***

 

(Explainer ID: 160761) आगंतुक पटल : 51
Provide suggestions / comments
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali , Assamese , Punjabi , Kannada , Malayalam