Economy
జాతీయ వ్యాపార వ్యవస్థాపకత దినోత్సవం
Posted On:
09 NOV 2026 6:07PM
నవంబర్ 9న నిర్వహించే జాతీయ వ్యాపార వ్యవస్థాపకత దినోత్సవం వికసిత్ భారత్ @ 2047 లక్ష్య సాధనలో కొత్త వ్యాపారాల స్థాపనకు పెరుగుతున్న ప్రాధాన్యాన్ని తెలియజేస్తోంది. పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) గుర్తింపు పొందిన 2.62 లక్షలకు పైగా స్టార్టప్‌లతో భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థగా ఎదిగింది. ఈ వ్యవస్థ ఉపాధి కల్పిస్తూ, యువతకు అవకాశాలను విస్తరిస్తోంది. స్టార్టప్ ఇండియా, ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఫర్ స్టార్టప్స్, సీజీఎస్ఎస్, ఎస్ఐఎస్ఎఫ్ఎస్, అటల్ ఇన్నోవేషన్ మిషన్, పీఎంఈజీపీ వంటి ప్రభుత్వ కార్యక్రమాలు ఆవిష్కరణలకు ఊతమిస్తున్నాయి. నిధులు, నిపుణుల మార్గదర్శకత్వం పొందేందుకు, కొత్త వ్యాపారాలు స్థాపించేందుకు తోడ్పడుతున్నాయి. గుర్తింపు పొందిన స్టార్టప్‌లలో దాదాపు సగం ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో మొదలయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లోనూ కొత్త వ్యాపారాల స్థాపన ఊపందుకుంటోంది. ఈ నేపథ్యంలో భారత్ ‘అమృత్ పీఢీ’ తమ ఆలోచనలను వ్యాపారాలుగా మలుస్తూ, జీవనోపాధి అవకాశాలను మెరుగుపరుస్తూ, అందరినీ కలుపుకొనే ఆర్థిక వృద్ధికి తోడ్పడుతోంది.
జాతీయ వ్యాపార వ్యవస్థాపకత దినోత్సవం: వికసిత్ భారత్ కోసం యువతకు సాధికారత
వ్యాపారం ప్రారంభించాలనుకునేవారికి అనుకూల వాతావరణం కల్పించడంలో భారత్ గణనీయమైన పురోగతి సాధించింది. దేశ జనాభాలో దాదాపు 65% మంది 35 ఏళ్లలోపు వారే కావడంతో ఈ పురోగతికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. యువ జనాభాతో దేశానికి లభించే అవకాశాన్ని గుర్తించిన ప్రభుత్వం, వ్యాపార స్థాపన సహా వివిధ రంగాల్లో యువత సామర్థ్యాన్ని పెంచేందుకు పలు కార్యక్రమాలు చేపట్టింది.
మీకు తెలుసా?
నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖను 9 నవంబర్ 2014న ఏర్పాటు చేశారు. దేశ అభివృద్ధిలో వ్యాపార స్థాపనకు ఉన్న ప్రాధాన్యాన్ని చాటుతూ ఆ రోజును జాతీయ వ్యాపార వ్యవస్థాపకత దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.
గత దశాబ్దంలో యువత లబ్ధిదారుల స్థాయి నుంచి దేశాభివృద్ధిలో చురుకైన భాగస్వాములుగా ఎదిగింది. నేడు ‘అమృత్ పీఢీ’ వికసిత్ భారత్ @ 2047 లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లే శక్తిగా ఎదుగుతోంది. ఈ మార్పులో వ్యాపార స్థాపన కీలకం. యువత తమ ఆలోచనలను వ్యాపారాలుగా మలిచేందుకు, ఉపాధి కల్పించేందుకు, ఆర్థిక వృద్ధికి తోడ్పడేందుకు ఇది వీలు కల్పిస్తోంది.
దేశ అభివృద్ధిలో వ్యాపార స్థాపన ప్రాధాన్యాన్ని గుర్తించి, నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖను 9 నవంబర్ 2014న ఏర్పాటు చేశారు. ఆ రోజును జాతీయ వ్యాపార వ్యవస్థాపకత దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.
వ్యాపార స్థాపనలో భారత్ పురోగతికి సూచికలు
మీకు తెలుసా?
2025-26 ఆర్థిక సంవత్సరంలో 55,200కు పైగా స్టార్టప్‌లకు ప్రభుత్వం గుర్తింపు ఇచ్చింది. 2016 నుంచి ఒక్క ఆర్థిక సంవత్సరంలో గుర్తింపు పొందిన స్టార్టప్‌ల సంఖ్య ఇదే అత్యధికం!
ఉద్యోగాలు వెతుక్కునే స్థాయి నుంచి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగడం భారత్‌లో పెరుగుతున్న వ్యాపార చొరవకు నిదర్శనం.
ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థ భారత్‌ది. 2014లో 500 కంటే తక్కువగా ఉన్న స్టార్టప్‌ల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2026 నవంబర్ నాటికి డీపీఐఐటీ గుర్తింపు పొందిన స్టార్టప్‌ల సంఖ్య 2.62 లక్షలు దాటింది. భారతీయ స్టార్టప్‌లు మరింతగా ఐపీఓల ద్వారా తొలిసారిగా ప్రజలకు షేర్లను అందిస్తూ, ఉద్యోగాలు కల్పిస్తూ, ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో స్టార్టప్‌లు ఉన్నాయి. 31 మార్చి 2026 నాటికి గుర్తింపు పొందిన స్టార్టప్‌ల సంఖ్య, ప్రత్యక్ష ఉపాధి కల్పనలో మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్ ముందున్నాయి.
అక్టోబర్ 2026 వరకు స్టార్టప్‌లు 25 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించాయి. 2024-25తో పోలిస్తే 2025-26 ఆర్థిక సంవత్సరంలో గుర్తింపు పొందిన స్టార్టప్‌ల సంఖ్య 51.6% పెరిగింది. ఇదే కాలంలో ప్రత్యక్షంగా కల్పించిన ఉద్యోగాల సంఖ్య 36.1% పెరిగింది.
మార్చి 2026 నాటికి గుర్తింపు పొందిన 1.07 లక్షలకు పైగా స్టార్టప్‌లలో కనీసం ఒక మహిళా డైరెక్టర్ లేదా భాగస్వామి ఉన్నారు. గుర్తింపు పొందిన మొత్తం స్టార్టప్‌లలో వీటి వాటా దాదాపు 48%.

భారత్‌లో వ్యాపార స్థాపనకు ఊతమిస్తున్న పథకాలు
ప్రభుత్వ విధానపరమైన మద్దతు, ఆవిష్కరణలను ప్రోత్సహించే కార్యక్రమాలు, నిధులు సులువుగా పొందే సదుపాయాలు, డిజిటల్ వేదికలతో దేశవ్యాప్తంగా వ్యాపార స్థాపన విస్తరిస్తోంది.
స్టార్టప్ ఇండియా కార్యక్రమం
స్టార్టప్ ఇండియా కార్యక్రమాన్ని 2016లో ప్రారంభించారు. విధానపరమైన మద్దతుతో మొదలైన ఈ కార్యక్రమం, ఆలోచన రూపకల్పన నుంచి కార్యకలాపాల విస్తరణ వరకు అన్ని దశల్లో స్టార్టప్‌లకు తోడ్పడే సమగ్ర వేదికగా ఎదిగింది. ఆవిష్కరణల ఆధారంగా కొత్త వ్యాపారాలు వేగంగా ఎదిగేందుకు స్టార్టప్ ఇండియా ద్వారా పలు ప్రధాన పథకాలు, డిజిటల్ వేదికలు నిధులు, నిపుణుల మార్గదర్శకత్వం, విస్తరణకు అవసరమైన సాయం అందిస్తున్నాయి.
* ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఫర్ స్టార్టప్స్ (ఎఫ్ఎఫ్ఎస్): స్టార్టప్ ఇండియా యాక్షన్ ప్లాన్ కింద డీపీఐఐటీ చేపట్టిన ప్రధాన కార్యక్రమం ఇది. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సిడ్బీ) దీన్ని నిర్వహిస్తోంది. ₹10,000 కోట్ల నిధితో ఈ పథకం సెబీ వద్ద నమోదైన ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధుల (ఏఐఎఫ్‌లు) ద్వారా సాయం అందిస్తుంది. ఈ నిధులు స్టార్టప్‌లలో పెట్టుబడులు పెడతాయి. నష్టభయాన్ని స్వీకరించే దేశీయ పెట్టుబడులు స్టార్టప్‌లకు మరింత సులువుగా అందేలా చూడటం, భారత్‌లో కొత్త వ్యాపారాలకు తోడ్పడే వ్యవస్థను బలోపేతం చేయడం దీని లక్ష్యం. ప్రత్యేకంగా ₹10,000 కోట్ల నిధితో స్టార్టప్ ఇండియా ఫండ్ ఆఫ్ ఫండ్స్ 2.0కు 2026 ఏప్రిల్‌లో నోటిఫికేషన్ జారీ చేశారు. ముఖ్యంగా అత్యాధునిక సాంకేతికతల ఆధారంగా పనిచేసే స్టార్టప్‌లు, వినూత్న తయారీ రంగంలోని స్టార్టప్‌లు, తొలి వృద్ధి దశలోని స్టార్టప్‌ల కోసం వెంచర్ పెట్టుబడులు, విస్తరణకు అవసరమైన మూలధనాన్ని సమీకరించడంపై ఇది దృష్టి పెడుతోంది. అక్టోబర్ 2026 నాటికి ఈ కార్యక్రమం కింద 166 ఏఐఎఫ్‌లకు ₹12,623 కోట్లు సమకూర్చేందుకు సిడ్బీ అంగీకరించింది. ఈ నిధులు 1,475 స్టార్టప్‌లలో ₹28,254 కోట్ల పెట్టుబడులు పెట్టాయి.
* క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఫర్ స్టార్టప్స్ (సీజీఎస్ఎస్): 2023 ఏప్రిల్ నుంచి అమల్లో ఉన్న ఈ పథకం అర్హత గల ఆర్థిక సంస్థల ద్వారా అర్హులైన స్టార్టప్‌లకు పూచీకత్తు లేకుండా రుణాలు లభించేలా తోడ్పడుతుంది. మూలధన సమీకరణకు ఊతమిచ్చేందుకు 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఒక్కో రుణగ్రహీతకు హామీ పరిమితిని ₹10 కోట్ల నుంచి ₹20 కోట్లకు పెంచారు. విమానయాన, అంతరిక్ష, రక్షణ, జీవ సాంకేతికత, రైల్వేలు, పర్యాటక, ఆతిథ్య సేవలు, ఆర్థిక సేవలు తదితర 27 ప్రాధాన్య రంగాలకు వార్షిక హామీ రుసుమును 1%కు తగ్గించారు. అక్టోబర్ 2026 నాటికి 41,637 మందికి ఉపాధి కల్పిస్తున్న స్టార్టప్‌లకు ఇచ్చిన ₹1,662.71 కోట్ల విలువైన 532 రుణాలకు ఈ పథకం కింద హామీ కల్పించారు.
* స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ (ఎస్ఐఎస్ఎఫ్ఎస్): ₹945 కోట్ల నిధితో ఈ పథకం స్టార్టప్‌లకు ఆర్థిక సాయం అందిస్తుంది. ఆలోచన ఆచరణలో పనిచేస్తుందని నిరూపించడం, నమూనాలు రూపొందించడం, ఉత్పత్తులను పరీక్షించడం, మార్కెట్లో ప్రవేశించడం, ఉత్పత్తులను వాణిజ్యపరంగా అందుబాటులోకి తేవడం వంటి దశల్లో ఈ సాయం లభిస్తుంది. పథకం కార్యాచరణ, అమలు, పర్యవేక్షణను నిపుణుల సలహా కమిటీ (ఈఏసీ) చూసుకుంటుంది. ఈ పథకం కింద 32 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో 244 ఇంక్యుబేటర్ల ద్వారా 4,194 స్టార్టప్‌లకు ₹775.67 కోట్ల సాయానికి ఆమోదం ఇచ్చారు. వీటిలో మహిళల నేతృత్వంలోని 2,147 స్టార్టప్‌లు, ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు చెందిన 2,356 స్టార్టప్‌లు ఉన్నాయి.
* స్టార్టప్ ఇండియా హబ్: స్టార్టప్ ఇండియా ఆన్లైన్ హబ్ (2017) ద్వారా దేశంలోని వ్యాపార వ్యవస్థలో భాగమైన వ్యక్తులు, సంస్థలు తమకు అవసరమైన భాగస్వాములను గుర్తించి, సంప్రదించి, కలిసి పనిచేయవచ్చు. ఈ డిజిటల్ వేదిక వ్యాపారం ప్రారంభించాలనుకునేవారిని పెట్టుబడిదారులు, మార్గదర్శకులు, ఇంక్యుబేటర్లతో అనుసంధానిస్తుంది. పెట్టుబడి నిధులు, విద్యాసంస్థలు, కార్పొరేట్ సంస్థలు, ప్రభుత్వ సంస్థలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి స్టార్టప్‌లకు అవసరమైన సంబంధాలు, మద్దతు ఏర్పడేలా చేస్తుంది.
* నేషనల్ మెంటార్షిప్ పోర్టల్ (మార్గ్): మెంటార్షిప్, అడ్వైజరీ, అసిస్టెన్స్, రెజిలియన్స్ అండ్ గ్రోత్ (మార్గ్) కార్యక్రమం వ్యాపార వ్యవస్థాపకులను అనుభవజ్ఞులైన మార్గదర్శకులతో అనుసంధానిస్తుంది. దీంతో స్టార్టప్‌లకు నిపుణుల మార్గదర్శకత్వం సులువుగా లభిస్తుంది. వివిధ రంగాలకు, ప్రాంతాలకు చెందిన, వేర్వేరు దశల్లో ఉన్న స్టార్టప్‌లకు ఈ సేవలను అందించడం దీని ఉద్దేశం. ఇది వ్యాపార వ్యూహాలపై మార్గదర్శకత్వం ఇస్తుంది, వ్యాపార వృద్ధికి తోడ్పడుతుంది, దేశంలో కొత్త వ్యాపారాలకు మద్దతిచ్చే వ్యవస్థను బలోపేతం చేస్తుంది.
* స్టార్టప్ ఇండియా ఇన్వెస్టర్ కనెక్ట్ పోర్టల్: సిడ్బీ సహకారంతో రూపొందించిన ఈ పోర్టల్ (2023) స్టార్టప్‌లు, వెంచర్ క్యాపిటల్ ఫండ్లు, పెట్టుబడిదారులను అనుసంధానిస్తుంది. ముఖ్యంగా ప్రారంభ దశలోని వ్యాపారాలకు తోడ్పడుతుంది. ఒకే దరఖాస్తుతో వ్యాపార వ్యవస్థాపకులు పలువురు పెట్టుబడిదారులను సంప్రదించవచ్చు. దీంతో తమ వ్యాపార ఆలోచనలను వివరించడం, నిధుల అవకాశాలను అందిపుచ్చుకోవడం సులువవుతుంది. 9 నవంబర్ 2026 నాటికి ఈ పోర్టల్‌లో 11,582 స్టార్టప్‌లు నమోదయ్యాయి.
అటల్ ఇన్నోవేషన్ మిషన్ (ఏఐఎం)
నీతి ఆయోగ్ 2016లో ప్రారంభించిన అటల్ ఇన్నోవేషన్ మిషన్ పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, స్టార్టప్‌లు, పరిశ్రమల్లో ఆవిష్కరణలు, కొత్త వ్యాపారాల స్థాపనను ప్రోత్సహించే ప్రభుత్వ ప్రధాన కార్యక్రమం. ఆవిష్కరణ కార్యక్రమాలను రూపొందించడం, భాగస్వామ్యాలను పెంపొందించడం, భారత్ స్టార్టప్ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఏఐఎం ఒక సమగ్ర విధానాన్ని అందిస్తోంది. 2024 నవంబర్‌లో ఆమోదం పొందిన ఏఐఎం 2.0కు 2028 మార్చి వరకు ₹2,750 కోట్ల కేటాయింపు ఉంది. మరింత మందిని భాగస్వాములను చేయడం, స్టార్టప్‌లకు మద్దతు పెంచడం, ప్రాంతాల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడం ద్వారా ఇది మిషన్ పరిధిని విస్తరిస్తోంది.
ప్రధాన్ మంత్రి ముద్రా యోజన (పీఎంఎంవై)
కార్పొరేట్ సంస్థలకు చెందని వ్యవసాయేతర సూక్ష్మ, చిన్న వ్యాపారాలు ఆదాయం తెచ్చే కార్యకలాపాల కోసం పూచీకత్తు లేకుండా ₹20 లక్షల వరకు రుణాలు పొందేందుకు 2015లో ప్రవేశపెట్టిన పీఎంఎంవై తోడ్పడుతోంది. రుణగ్రహీతలకు ఎంత నిధి అవసరం, వారి వ్యాపారం ఏ దశలో ఉంది అనే అంశాల ఆధారంగా ఈ పథకం నాలుగు విభాగాల్లో రుణాలు అందిస్తుంది.
|
రుణ విభాగం
|
రుణ మొత్తం
|
|
శిశు
|
₹50,000 వరకు
|
|
కిశోర్
|
₹50,000 కంటే ఎక్కువ, ₹5 లక్షల వరకు
|
|
తరుణ్
|
₹5 లక్షల కంటే ఎక్కువ, ₹10 లక్షల వరకు
|
|
తరుణ్ ప్లస్
|
₹10 లక్షల కంటే ఎక్కువ, ₹20 లక్షల వరకు
|
తయారీ, వాణిజ్య, సేవల వ్యాపారాలకు, కోళ్ల పెంపకం, పాడి పరిశ్రమ, తేనెటీగల పెంపకం వంటి వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలకు ఈ రుణాలు ఉపయోగపడతాయి. నిర్దిష్ట కాలానికి అవసరమైన నిధులతో పాటు రోజువారీ కార్యకలాపాల నిర్వహణకు అవసరమైన మూలధనాన్నీ ఇవి అందిస్తాయి.
30 అక్టోబర్ 2026 నాటికి 2026-27 ఆర్థిక సంవత్సరంలో పీఎంఎంవై కింద ₹3.3 లక్షల కోట్లకు పైగా విలువైన 2.44 కోట్లకు పైగా రుణాలు మంజూరు చేశారు.
మైటీ స్టార్టప్ హబ్ (ఎంఎస్హెచ్)
2016లో ఏర్పాటు చేసిన మైటీ స్టార్టప్ హబ్ (ఎంఎస్హెచ్) ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (మైటీ) పరిధిలో పనిచేస్తోంది. సాంకేతికత ఆధారిత ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూ, భారత్ స్టార్టప్ వ్యవస్థను బలోపేతం చేస్తోంది. ఇంక్యుబేషన్ కేంద్రాలు, కొత్త సాంకేతికతలపై పనిచేసే సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్, మైటీ మద్దతు ఇచ్చే ఇతర కార్యక్రమాలను ఇది ఒకే వేదికపైకి తీసుకొస్తోంది. తద్వారా ఆవిష్కరణలకు, సాంకేతికత ఆధారిత ఆర్థిక వృద్ధికి ఊతమిస్తోంది. 9 నవంబర్ 2026 నాటికి దేశవ్యాప్తంగా 6,149కు పైగా స్టార్టప్‌లు, 518 ఇంక్యుబేటర్లు, 329కు పైగా ప్రయోగశాలలతో విస్తరిస్తున్న వ్యవస్థకు ఎంఎస్హెచ్ తోడ్పడుతోంది.
టెక్నాలజీ ఇంక్యుబేషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎంట్రప్రెన్యూర్స్ (టైడ్) 2.0 పథకం
ఐఓటీ, కృత్రిమ మేధ (ఏఐ), బ్లాక్‌చెయిన్, రోబోటిక్స్ వంటి కొత్త సాంకేతికతలను ఉపయోగించే సమాచార, కమ్యూనికేషన్ సాంకేతికతల (ఐసీటీ) స్టార్టప్‌లకు ఇంక్యుబేటర్లు తోడ్పడతాయి. ఆ ఇంక్యుబేటర్లను బలోపేతం చేసి, సాంకేతికత ఆధారంగా వ్యాపారాల స్థాపనను టైడ్ 2.0 స్కీమ్ (2019) ప్రోత్సహిస్తోంది. ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, ఆర్థిక సేవలను అందరికీ చేరువ చేయడం (డిజిటల్ చెల్లింపులతో సహా), మౌలిక వసతులు, రవాణా, పర్యావరణం, స్వచ్ఛ సాంకేతికత రంగాల్లో ఈ పథకం సమగ్ర మద్దతు అందిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రముఖ విద్యాసంస్థలు, జాతీయ పరిశోధనా సంస్థల్లోని 51 ఇంక్యుబేటర్ల ద్వారా పథకం అమలవుతోంది.
జెనెసిస్ (జెన్-నెక్స్ట్ సపోర్ట్ ఫర్ ఇన్నోవేటివ్ స్టార్టప్స్)
దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో సుమారు 1,600 సాంకేతిక స్టార్టప్‌ల కార్యకలాపాల విస్తరణకు తోడ్పడటమే జెనెసిస్ (జెన్-నెక్స్ట్ సపోర్ట్ ఫర్ ఇన్నోవేటివ్ స్టార్టప్స్) లక్ష్యం. 2022లో ప్రారంభించిన ఈ కార్యక్రమం అత్యాధునిక సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు, కొత్తగా ఎదుగుతున్న స్టార్టప్ వ్యవస్థలను బలోపేతం చేసేందుకు నిధులు, ఇతర మద్దతు అందిస్తోంది. ఐదేళ్ల కాలానికి ఈ కార్యక్రమానికి ₹490 కోట్ల బడ్జెట్ కేటాయింపు ఉంది. స్టార్టప్‌లు, ప్రభుత్వ సంస్థలు, విద్యారంగం, కార్పొరేట్ సంస్థల సహకారంతో భారత్‌లో సాంకేతిక స్టార్టప్ వ్యవస్థను బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఆగస్టు 2026లో జెనెసిస్ ఎంట్రప్రెన్యూర్-ఇన్-రెసిడెన్స్ (ఈఐఆర్) కోహోర్ట్ 3ను ప్రారంభించారు. వ్యాపారం ప్రారంభించాలనుకునేవారు, ఆవిష్కర్తలు, పరిశోధకులు, విద్యార్థులు, ప్రారంభ దశ స్టార్టప్ వ్యవస్థాపకులు తమ వినూత్న ఆలోచనలను సాంకేతికత ఆధారిత వ్యాపారాలుగా మలిచేందుకు తోడ్పడే జాతీయ స్థాయి కార్యక్రమం ఇది. ఎంపికైన ఆవిష్కర్తలు ₹10 లక్షల వరకు ఆర్థిక సాయంతో పాటు ఇంక్యుబేషన్, నిపుణుల మార్గదర్శకత్వం, ఉత్పత్తుల అభివృద్ధికి మద్దతు పొందవచ్చు.
నిధి (నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ డెవలపింగ్ అండ్ హార్నెసింగ్ ఇన్నోవేషన్స్)
శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని శాస్త్ర, సాంకేతిక విభాగం (డీఎస్టీ) 2016లో నిధిని ప్రారంభించింది. విజ్ఞానం, సాంకేతికత ఆధారంగా రూపుదిద్దుకున్న ఆలోచనలు, ఆవిష్కరణలను విజయవంతమైన స్టార్టప్‌లుగా తీర్చిదిద్దే సమగ్ర కార్యక్రమం ఇది. సంపద సృష్టి, ఉపాధి కల్పన ద్వారా సామాజిక, ఆర్థిక అభివృద్ధికి తోడ్పడేలా ఆవిష్కరణల ఆధారిత వ్యాపార వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. భారత్ స్టార్టప్ వ్యవస్థ బలోపేతానికి నిధి గణనీయంగా తోడ్పడింది. 12,000కు పైగా స్టార్టప్‌లు, 200కు పైగా సాంకేతిక వ్యాపార ఇంక్యుబేటర్లకు (టీబీఐలు) మద్దతు ఇచ్చింది. దీంతో 1,30,000కు పైగా ఉద్యోగాలు ఏర్పడ్డాయి. 11 అక్టోబర్ 2026 నాటికి 1,150కి పైగా మేధో సంపత్తి (ఐపీ) ఆస్తుల సృష్టికీ తోడ్పడింది.
అస్పైర్ (ఎ స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇన్నోవేషన్, రూరల్ ఇండస్ట్రీస్ అండ్ ఎంట్రప్రెన్యూర్షిప్)
గ్రామీణ ప్రాంతాలు, సేవలు తగినంతగా అందని ప్రాంతాల్లో ఆవిష్కరణలు, కొత్త వ్యాపారాల స్థాపనను అస్పైర్ ప్రోత్సహిస్తోంది. సూక్ష్మ వ్యాపారాల ఏర్పాటుకు, నైపుణ్య శిక్షణ, పునఃశిక్షణకు అవకాశాలు కల్పించేందుకు, పారిశ్రామిక సముదాయాలకు అవసరమైన సిబ్బందిని అందించేందుకు జీవనోపాధి వ్యాపార ఇంక్యుబేటర్ల (ఎల్బీఐలు) ఏర్పాటుపై దృష్టి పెడుతోంది. అక్టోబర్ 2026 నాటికి 109 ఎల్బీఐలకు ఆమోదం ఇచ్చారు. లక్ష మందికి పైగా లబ్ధిదారులకు నైపుణ్య శిక్షణ అందించారు.
ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ (పీఎంఈజీపీ)
ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ (పీఎంఈజీపీ) వ్యవసాయేతర రంగంలో కొత్త సూక్ష్మ వ్యాపారాల స్థాపనకు సాయం చేసి, స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తోంది. ఈ వ్యాపారాల ఏర్పాటు ఖర్చును భరించేందుకు బ్యాంకు రుణంతో అనుసంధానించిన మార్జిన్ మనీ రాయితీని లబ్ధిదారులకు అందిస్తుంది.
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ (ఎంఎస్ఎంఈ) పరిధిలోని ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ (కేవీఐసీ) ఈ పథకాన్ని అమలు చేస్తోంది. దీంతో పథకం మరింత మందికి చేరుతోంది, క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు సాయం సమర్థంగా అందుతోంది.
ప్రాజెక్టు వ్యయ పరిమితులు: తయారీ రంగంలో ₹50 లక్షల వరకు, సేవల రంగంలో ₹20 లక్షల వరకు వ్యయమయ్యే ప్రాజెక్టులకు ఈ పథకం సాయం అందిస్తుంది.
సాధారణ, ప్రత్యేక వర్గాలకు ఈ పథకం కింద సాయం అందిస్తారు. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ వర్గాలు, మైనారిటీలు, మహిళలు, మాజీ సైనికులు, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్ దరఖాస్తుదారులు ప్రత్యేక వర్గంలోకి వస్తారు. ఈశాన్య ప్రాంతం, కొండ ప్రాంతాలు, సరిహద్దు ప్రాంతాలు, ఆకాంక్షిత జిల్లాలకు చెందిన లబ్ధిదారులు కూడా ప్రత్యేక వర్గం పరిధిలోకి వస్తారు.
పీఎం స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి (పీఎం స్వనిధి)
2020 జూన్‌లో ప్రారంభించిన ప్రైమ్ మినిస్టర్ స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి (పీఎం స్వనిధి) వీధి వ్యాపారులకు సూక్ష్మ రుణాలు అందించే పథకం.
రుణాలు, పరపతి సదుపాయాలు: వీధి వ్యాపారుల రోజువారీ నిర్వహణ మూలధన అవసరాలను తీర్చేందుకు పూచీకత్తు లేకుండా మొదట ₹15,000, తర్వాత ₹25,000, ఆపై ₹50,000 రుణాలు అందిస్తారు. వీటికి వడ్డీ రాయితీలు, రుణ హామీలు ఉంటాయి. రెండో రుణాన్ని తిరిగి చెల్లించినవారు ₹30,000 పరిమితితో యూపీఐకి అనుసంధానించిన రూపే క్రెడిట్ కార్డుకు అర్హత పొందవచ్చు.
డిజిటల్ లావాదేవీలు: చిల్లర, టోకు డిజిటల్ లావాదేవీలపై వీధి వ్యాపారులకు ₹1,600 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
సంక్షేమ పథకాల లబ్ధి: స్వనిధి సే సమృద్ధి కింద వీధి వ్యాపారులు, వారి కుటుంబాల సామాజిక, ఆర్థిక వివరాల ఆధారంగా ఎంపిక చేసిన ఎనిమిది కేంద్ర సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా తోడ్పడుతున్నారు.
9 నవంబర్ 2026 నాటికి ఈ పథకం 80.7 లక్షలకు పైగా లబ్ధిదారులకు చేరింది. ₹20,400 కోట్లకు పైగా మంజూరు చేశారు.
స్వావలంబిని స్కీమ్
2025లో ప్రారంభించిన ఈ పథకం యువతులకు వ్యాపార ఆలోచన రూపకల్పన నుంచి సంస్థ స్థాపన వరకు తోడ్పడుతుంది. ఇందుకోసం వ్యాపార స్థాపన, నిర్వహణలో శిక్షణ, ఆర్థిక అంశాలు, మార్కెట్‌పై మార్గదర్శకత్వం, చట్టపరమైన సాయం అందిస్తుంది. ఎంపికైన యువతులు నిలకడగా నడిచే వ్యాపారాలను అభివృద్ధి చేసేందుకు 21 వారాల పాటు నిపుణుల మార్గదర్శకత్వం, ప్రత్యక్ష తోడ్పాటు అందిస్తారు. స్వావలంబిని ప్రయోగాత్మక కార్యక్రమానికి నిర్దేశించిన లక్ష్యాలను సాధించారు.

మెట్రో నగరాలకు వెలుపల వ్యాపార స్థాపన: ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, గ్రామీణ భారత్
భారత్‌లో కొత్త వ్యాపారాలు ప్రధాన మెట్రో నగరాల నుంచి ఇతర ప్రాంతాలకూ విస్తరిస్తున్నాయి. గుర్తింపు పొందిన స్టార్టప్‌లలో 52% మెట్రోయేతర నగరాల్లో మొదలయ్యాయి. ఆవిష్కరణలు మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నాయనడానికి ఇది నిదర్శనం. తక్కువ ఖర్చులు, నైపుణ్యం గల సిబ్బంది, బలమైన పారిశ్రామిక సముదాయాలు, మెరుగవుతున్న మౌలిక వసతుల కారణంగా వ్యాపార సంస్థలు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలను ఎక్కువగా ఎంచుకుంటున్నాయి. దేశమంతటా ఆవిష్కరణలు విస్తరిస్తుండటంతో ఎదుగుతున్న నగరాలు కొత్త వ్యాపారాల స్థాపనకు, తదుపరి దశ ఆర్థిక వృద్ధికి ఊతమిస్తున్నాయి. జీవనోపాధి, వ్యాపారాల అభివృద్ధి కోసం చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాలతో గ్రామీణ ప్రాంతాల్లోనూ కొత్త వ్యాపారాల స్థాపన ఊపందుకుంటోంది.
* దీన్‌దయాళ్ అంత్యోదయ యోజన–నేషనల్ రూరల్ లైవ్లీహుడ్స్ మిషన్ (డీఏవై-ఎన్ఆర్ఎల్ఎం) కింద ప్రభుత్వం ఆగస్టు 2026లో నేషనల్ క్యాంపెయిన్ ఆన్ ఎంట్రప్రెన్యూర్షిప్-2ను ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని మరో మూడు నెలలు, అంటే 21 నవంబర్ 2026 వరకు కొనసాగిస్తారు. గ్రామీణ మహిళలు వ్యాపారాలు స్థాపించి ఎదిగేందుకు తోడ్పడటం, 6 కోట్ల మంది మహిళలను లఖ్పతి దీదీలుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యానికి దోహదపడటం దీని ఉద్దేశం.
* స్టార్ట్-అప్ విలేజ్ ఎంట్రప్రెన్యూర్షిప్ ప్రోగ్రామ్ (ఎస్‌వీఈపీ) గ్రామీణ కుటుంబాలు స్థానికంగా వ్యాపారాలు ప్రారంభించి, విస్తరించేందుకు వీలు కల్పిస్తోంది. తద్వారా గ్రామీణ వ్యాపార స్థాపనను ప్రోత్సహిస్తోంది. జూన్ 2026 నాటికి దేశవ్యాప్తంగా 4.32 లక్షల గ్రామీణ వ్యాపారాలకు ఎస్‌వీఈపీ మద్దతు ఇచ్చింది. అన్ని సామాజిక వర్గాలను భాగస్వామ్యం చేయడానికి, వ్యాపారాలు ప్రారంభించే అవకాశాలు అందరికీ సమానంగా అందించడానికి ఈ కార్యక్రమం ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చింది. వ్యాపార వ్యవస్థాపకుల్లో దాదాపు 86% మంది ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఓబీసీ వర్గాలకు చెందినవారు.
ఈ కార్యక్రమాలు స్థానికంగా వ్యాపారాల స్థాపనకు ఊతమిస్తున్నాయి, జీవనోపాధి అవకాశాలను విస్తరిస్తున్నాయి. కొత్త వ్యాపారాల ద్వారా ఆర్థిక వృద్ధి మరిన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు తోడ్పడుతున్నాయి.
వికసిత్ భారత్ 2047 దిశగా దేశ ప్రయాణానికి ఊతం
భారత్ స్టార్టప్ వ్యవస్థ వేగంగా విస్తరించే దశ నుంచి నిలకడైన వృద్ధి దిశగా సాగుతోంది. దేశంలో వస్తువులు, సేవల ఉత్పత్తితో స్టార్టప్‌ల అనుసంధానం మరింత పెరుగుతోంది. 2030 నాటికి భారత్ $7.3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని అంచనా. వికసిత్ భారత్ 2047 లక్ష్యం దిశగా దేశం ముందుకు సాగుతున్న క్రమంలో ఆవిష్కరణలకు ఊతమివ్వడం, ఉపాధి కల్పించడం, ఆర్థిక వృద్ధిని బలోపేతం చేయడంలో స్టార్టప్‌లు కీలక పాత్ర పోషిస్తూనే ఉంటాయి. స్టార్టప్‌ల పెరుగుతున్న భాగస్వామ్యం దేశంలో వ్యాపార స్థాపన సామర్థ్యం పెరుగుతోందనడానికి, ఆవిష్కరణల ఆధారిత వ్యాపారాలు దీర్ఘకాలికంగా అందరినీ కలుపుకొనే అభివృద్ధికి తోడ్పడగలవనడానికి నిదర్శనం.
References
Prime Minister’s Office (PMO)
https://www.pmindia.gov.in/en/news_updates/pm-inaugurates-digital-india-week-2022-in-gandhinagar
Ministry of Labour & Employment
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2179001®=3&lang=1
Ministry of Commerce and Industry
https://www.investindia.gov.in/team-india-blogs/public-private-partnerships-driving-economic-growth
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2215334®=3&lang=1
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2127843®=48&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2253019®=48&lang=2
https://www.startupindia.gov.in/content/sih/en/credit-guarantee-scheme-for-startups.html
https://www.pib.gov.in/PressReleaseDetail.aspx?PRID=2227597®=3&lang=1
https://seedfund.startupindia.gov.in/about
https://www.pib.gov.in/Pressreleaseshare.aspx?PRID=1886031®=48&lang=2
https://investorconnect.startupindia.gov.in/
https://www.pib.gov.in/PressReleaseDetail.aspx?PRID=2328842®=6&lang=1
https://www.dpiit.gov.in/static/uploads/2025/07/93101e3d9cc67f0dea0ae0c93f6e8854.pdf
Ministry of Finance
https://www.mudra.org.in/
Ministry of Electronics and Information Technology
https://msh.meity.gov.in/assets/GENESIS_Admin%20Approval.pdf
https://msh.meity.gov.in/schemes/genesis
Ministry of Skill Development and Entrepreneurship
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2155057®=3&lang=1
World Bank
https://ppp.worldbank.org/country-profile-india
International Monetary Fund
https://www.imf.org/external/pubs/ft/fandd/2001/09/gerrard.htm
Niti Aayog
https://www.niti.gov.in/divisions/division/ppp
Others
https://x.com/rashtrapatibhvn/status/2088271329133031425
PIB Archives
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2199237®=3&lang=1
Click here to see pdf
***
(Explainer ID: 160757)
आगंतुक पटल : 19
Provide suggestions / comments