Social Welfare

బాల్ వివాహ్ ముక్త్ భారత్

బాల్య వివాహాలు లేని భారత్ దిశ‌గా రెండేళ్ల సమష్టి కృషి

Posted On: 06 NOV 2026 5:39PM

భార‌త్‌లో బాల్య వివాహాలు ఇప్పటికీ కొనసాగుతున్న సామాజిక సమస్య. ఇవి బాలికల ఆరోగ్యం, చదువు, భవిష్యత్తు అవకాశాలపై ప్రభావం చూపుతున్నాయి. అయితే 20-24 ఏళ్ల మహిళల్లో 18 ఏళ్లు నిండకముందే వివాహమైన వారి వాటా ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్-5 (2019-21)లో 23.3 శాతం నుంచి ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్-6 (2023-24)లో 20.1 శాతానికి తగ్గింది. 27 నవంబర్ 2024న ప్రారంభించిన బాల్ వివాహ్ ముక్త్ భారత్ కార్యక్రమం చట్టపరమైన రక్షణ, ప్రజల్లో అవగాహన, సమాజ భాగస్వామ్యం ద్వారా బాల్య వివాహాల నివారణకు జరుగుతున్న కృషిని బలోపేతం చేస్తోంది. 6.85 లక్షల అవగాహన కార్యక్రమాలను నిర్వహించి, 12.47 కోట్ల మందికి చేరువయ్యారు. 42.01 లక్షల ప్రతిజ్ఞలు నమోదయ్యాయి. రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న ఈ కార్యక్రమం 2030 నాటికి బాల్య వివాహాలు లేని భారత్‌ను సాధించాలన్న జాతీయ లక్ష్యం దిశగా ముందుకు సాగుతోంది.

 

బాల్య వివాహాలు లేని భారత్ దిశగా

చట్టం నిషేధించినప్పటికీ బాల్య వివాహాలు భారత్‌లో ఇప్పటికీ సామాజిక సమస్యగానే కొనసాగుతున్నాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్-6), 2023-24 ప్రకారం 20-24 ఏళ్ల మహిళల్లో 20.1 శాతం మందికి 18 ఏళ్లు నిండకముందే వివాహమైంది. ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్-5 (2019-21)లో ఈ వాటా 23.3 శాతం. అంటే 3.2 శాతం పాయింట్లు తగ్గింది.

 

బాల్య వివాహాల వల్ల బాలికలు తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. ముఖ్యంగా చిన్న వయసులోనే గర్భం దాల్చడం వల్ల ఆరోగ్యానికి ముప్పు పెరుగుతుంది. గృహ హింసకు గురయ్యే ప్రమాదం పెరుగుతుంది, చదువుకు ఆటంకం కలుగుతుంది. పేదరికం, లింగ అసమానతలు కొనసాగడానికి కూడా ఈ ఆచారం కారణమవుతోంది.

 

అందుకే భారత్ ఈ సమస్యను పలు స్థాయిల్లో ఎదుర్కొంటోంది: బాల్య వివాహాలను నిషేధించి, ఉల్లంఘనలకు శిక్షలు విధించే చట్టం, బాలికల పట్ల సమాజ దృక్పథాన్ని మార్చే పథకం, ఈ రెండింటినీ స్థానిక ప్రజల కార్యాచరణతో అనుసంధానిస్తూ 2024 నవంబర్ నుంచి కొనసాగుతున్న బాల్ వివాహ్ ముక్త్ భారత్ (బీవీఎంబీ) జాతీయ కార్యక్రమం ఇందులో భాగం.

 

ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్, 2006 (పీసీఎంఏ)

బాల్య వివాహాలపై చర్యలు తీసుకోవడానికి ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్, 2006 చట్టబద్ధమైన ఆధారాన్ని ఇస్తోంది. ఇది చైల్డ్ మ్యారేజ్ రెస్ట్రెయింట్ యాక్ట్, 1929 (శారదా యాక్ట్) స్థానంలో వచ్చింది. బాల్య వివాహాలను కట్టడి చేయడం నుంచి వాటిని నిషేధించే దిశగా చట్టపరమైన విధానాన్ని మార్చింది. బాధితులకు మరింత రక్షణ, ఉపశమనం కల్పించింది.

 

“బాలలు”గా ఎవరిని పరిగణిస్తారు:

21 ఏళ్లు నిండని పురుషుడిని బాలుడిగా, 18 ఏళ్లు నిండని మహిళను బాలికగా పరిగణిస్తారు. వివాహం చేసుకునే ఇద్దరిలో ఏ ఒక్కరికైనా వారికి వర్తించే కనీస వయసు నిండకపోతే, అది బాల్య వివాహం.

 

వివాహ చెల్లుబాటు:

వివాహ సమయంలో బాలుడు లేదా బాలికగా ఉన్న వ్యక్తి కోరితే ఆ వివాహాన్ని రద్దు చేయవచ్చు. ఇందుకోసం చట్టపరంగా మేజర్ అయిన నాటి నుంచి సాధారణంగా రెండేళ్లలోపు జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేయవచ్చు. బాలలను అక్రమంగా రవాణా చేయడం, బలవంతంగా లేదా మోసం చేసి తీసుకెళ్లడం, అనైతిక ప్రయోజనాలకు ఉపయోగించడం వంటి నిర్దిష్ట పరిస్థితుల్లో ఆ వివాహం చెల్లదు.

 

నేరాలు, శిక్షలు:

ఈ చట్టం కింద నేరాలకు సంబంధించి పోలీసులు వారెంట్ లేకుండానే అరెస్టు చేయవచ్చు. ఈ కేసుల్లో బెయిల్ హక్కుగా లభించదు. బాలికను వివాహం చేసుకునే వయోజన పురుషుడికి, బాల్య వివాహాన్ని జరిపించే, వివాహ తంతు నిర్వహించే, సహకరించే, ప్రోత్సహించే లేదా హాజరయ్యే వ్యక్తులకు (తల్లిదండ్రులు, సంరక్షకులు సహా) రెండేళ్ల వరకు కఠిన జైలు శిక్ష లేదా ₹1 లక్ష వరకు జరిమానా లేదా రెండూ విధించవచ్చు. నేరానికి పాల్పడిన మహిళలకు జైలు శిక్ష విధించరు.

 

నిషేధ ఉత్తర్వుల ద్వారా నివారణ:

జరగబోయే బాల్య వివాహాన్ని అడ్డుకునేందుకు నిషేధ ఉత్తర్వులు జారీ చేసే అధికారం న్యాయ మేజిస్ట్రేట్లకు ఉంది. ముఖ్యంగా సామూహిక వివాహాలు జరిగే సందర్భాల్లో, అక్షయ తృతీయ వంటి పండుగల సమయంలో బాల్య వివాహాలను అడ్డుకోవడంలో జిల్లా మేజిస్ట్రేట్లు, బాల్య వివాహ నిరోధక అధికారులు కీలకపాత్ర పోషిస్తారు. సకాలంలో జోక్యం చేసుకోవడం, అవగాహన కల్పించడం, స్థానిక అధికారులతో సమన్వయం చేసుకోవడం ద్వారా నివారణ చర్యలు చేపడతారు.

 

బాల్య వివాహ నిరోధక అధికారులు (సీఎంపీఓలు):

అధికారిక గెజిట్‌లో నోటిఫికేషన్ జారీ చేసి సీఎంపీఓలను నియమించే అధికారాన్ని చట్టంలోని సెక్షన్ 16 రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తుంది. బాల్య వివాహాలు జరగకుండా అడ్డుకోవడం, కేసు నడిపేందుకు సాక్ష్యాధారాలు సేకరించడం, వ్యక్తులకు, స్థానిక ప్రజలకు కౌన్సెలింగ్ ఇవ్వడం, అవగాహన కల్పించడం, సమాజంలో చైతన్యం పెంచడం, నిర్దిష్ట వ్యవధుల్లో నివేదికలు, గణాంకాలు సమర్పించడం వారి చట్టబద్ధమైన బాధ్యతలు. చట్టాన్ని సమర్థంగా అమలు చేయాలంటే ఉల్లంఘన జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడంతో పాటు, నివారణ కోసం ముందుగానే ప్రజలకు చేరువ కావడం, స్థానికంగా ప్రజలు అప్రమత్తంగా ఉండటం, వివాహం జరగకముందే సత్వరం జోక్యం చేసుకోవడం అవసరం.

 

సుప్రీంకోర్టు కార్యాచరణ విధానం: సొసైటీ ఫర్ ఎన్‌లైటెన్‌మెంట్ అండ్ వాలంటరీ యాక్షన్ & మరొకరు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా & ఇతరులు (డబ్ల్యూ.పీ. (సీ) నెం. 1234 ఆఫ్ 2017) కేసులో 18 అక్టోబర్ 2024న ఇచ్చిన తీర్పులో గౌరవ సుప్రీంకోర్టు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సమగ్ర కార్యాచరణ విధానాన్ని నిర్దేశించింది. జిల్లా, ఉప జిల్లా స్థాయిల్లో ప్రత్యేకంగా పూర్తికాల సీఎంపీఓలను నియమించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పింది. సమన్వయం, పర్యవేక్షణ, ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక విభాగాలు, వివిధ రంగాల భాగస్వామ్యంతో అవగాహన కార్యక్రమాలు, కీలక బాధ్యతలు నిర్వర్తించే సిబ్బందికి శిక్షణ అవసరమని పేర్కొంది. సాంకేతికత సాయంతో ఘటనల సమాచారాన్ని అందించడం, బాల్య వివాహాల ముప్పు ఉన్న ప్రాంతాల వివరాలతో డేటాబేస్‌లు రూపొందించడం ప్రాధాన్యమని స్పష్టం చేసింది.

 

శిక్ష విధించడంపై ఉన్న దృష్టిని నివారణ, రక్షణ, సాధికారత వైపు ఈ తీర్పు స్పష్టంగా మళ్లించింది. అయితే బాల్య వివాహాలు కొనసాగడానికి కారణమైన సామాజిక ధోరణులను చట్టం ఒక్కటే మార్చలేదు. అందుకే బాలికల విద్య, సాధికారత కీలకం.

 

బేటీ బచావో బేటీ పఢావో (బీబీబీపీ)

బాల్య వివాహాలను చట్టం నిషేధిస్తే, బేటీ బచావో బేటీ పఢావో (బీబీబీపీ) వాటికి దారితీసే సామాజిక ధోరణులను మార్చేందుకు కృషి చేస్తోంది. పిల్లల లింగ నిష్పత్తిని మెరుగుపరచడానికి, జీవితంలోని అన్ని దశల్లో బాలికలు, మహిళల సాధికారతను పెంచడానికి 22 జనవరి 2015న బీబీబీపీని ప్రారంభించారు.

 

మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రధాన సమన్వయ శాఖగా వివిధ రంగాల భాగస్వామ్యంతో బీబీబీపీని నిర్వహిస్తోంది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, విద్యా మంత్రిత్వ శాఖ, నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ, మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నాయి. మిషన్ శక్తిలో భాగంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ప్రజల్లో అవగాహన కల్పించడం, బాలికల సంక్షేమానికి మద్దతు కూడగట్టడం, స్థానిక ప్రజలను భాగస్వామ్యం చేయడం, ప్రవర్తనలో మార్పు తీసుకురావడంపై ఈ పథకం దృష్టి పెడుతోంది. బాలికల మనుగడ, రక్షణ, విద్యకు కూడా తోడ్పడుతోంది.

 

బాల్య వివాహాల నివారణకు ఈ లక్ష్యాలతో దగ్గరి సంబంధం ఉంది. బాలికల విద్యను ప్రోత్సహించడం, మధ్యలో చదువు మానేసే సమస్యను పరిష్కరించడం, వివక్షకు దారితీసే సామాజిక ధోరణులను ప్రశ్నించడం, బాలికలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కుటుంబాలను ప్రోత్సహించడం వంటి చర్యలు చిన్న వయసులో పెళ్లిళ్లను నివారించేందుకు, కౌమార దశలోని బాలికలకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు తోడ్పడతాయి.

 

ఈ పునాదిపై బీవీఎంబీ బాల్య వివాహాల నివారణకు చేపట్టే ఆచరణాత్మక చర్యలపై మరింత దృష్టి పెడుతోంది. చట్టపరమైన చర్యలను, స్థానిక ప్రజల ప్రయత్నాలను సమన్వయం చేస్తోంది. చట్టం, పథకం, సమాజం చేపట్టే చర్యలు కలిసిరావడంతో ఈ జాతీయ కార్యక్రమం రూపుదిద్దుకుంది.

 

బాల్య వివాహాలకు ముగింపు పలికేందుకు సమష్టి సంకల్పం

చట్టపరమైన వ్యవస్థను, బీబీబీపీలో స్థానిక ప్రజల భాగస్వామ్యానికి ఇచ్చిన ప్రాధాన్యాన్ని ఆధారంగా తీసుకుని, బాల్య వివాహాలు లేని భారత్‌ను సాధించాలన్న లక్ష్యంతో మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎండబ్ల్యూసీడీ) 27 నవంబర్ 2024న బీవీఎంబీ జాతీయ కార్యక్రమాన్ని ప్రారంభించింది.

 

ఈ కార్యక్రమం ప్రభుత్వ సంస్థలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పాలనా యంత్రాంగాలు, స్థానిక సంస్థలు, విద్యాసంస్థలు, క్షేత్రస్థాయి సిబ్బంది, పౌర సమాజ సంస్థలు, మత పెద్దలు, యువత, పౌరులను ఒకే జాతీయ సంకల్పం కింద ఏకం చేసింది. స్థానికంగా బాల్య వివాహాలను అడ్డుకునే చర్యలను బలోపేతం చేయడం, సీఎంపీఓలు ప్రజలకు మరింత అందుబాటులో ఉండేలా చూడటం, బాల్య వివాహ ఘటనలపై మరింత సమాచారం అందేలా చేయడం, ముప్పు ఉన్న బాలికలకు అండగా నిలవడం ఈ కార్యక్రమ లక్ష్యాలు.

 

సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్‌డీజీ) కింద నిర్దేశించిన లక్ష్యం 5.3కు అనుగుణంగా బాల్య వివాహాల శాతాన్ని తగ్గించి, 2030 నాటికి బాల్య వివాహాలు లేని భారత్‌ను సాధించడం ఈ కార్యక్రమ లక్ష్యం. కార్యక్రమానికి అవసరమైన నిధులన్నీ సమకూర్చేందుకు ఎండబ్ల్యూసీడీ కట్టుబడి ఉంది. ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్-5 గణాంకాల ప్రకారం బాల్య వివాహాల శాతం జాతీయ సగటుతో సమానంగా లేదా అంతకంటే ఎక్కువగా ఉన్న 257 జిల్లాలను గుర్తించి, వాటికి ప్రాధాన్యం ఇస్తోంది.

 

బీవీఎంబీ పోర్టల్: కార్యాచరణలో పౌరుల భాగస్వామ్యం

కార్యక్రమానికి ప్రధాన డిజిటల్ వేదికగా బీవీఎంబీ పోర్టల్‌ను రూపొందించారు. బీవీఎంబీని సమర్థంగా అమలు చేయడానికి, పర్యవేక్షించడానికి, ప్రజలకు చేరువ చేయడానికి ఇది కేంద్రీకృత వేదికగా పనిచేస్తోంది.

 

బాల్య వివాహ నిరోధక అధికారుల (సీఎంపీఓలు) వివరాలను ప్రజలు పోర్టల్‌లో తెలుసుకోవచ్చు. బాల్య వివాహ ఘటనల సమాచారాన్ని అందించవచ్చు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, క్షేత్రస్థాయి సిబ్బంది అవగాహన కార్యక్రమాలు, స్థానిక ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు చేపట్టిన చర్యల వివరాలను కూడా ఇందులో నమోదు చేయవచ్చు.

 

పౌరులు, సంస్థలు, ప్రజాప్రతినిధులు బీవీఎంబీ ప్రతిజ్ఞ చేయడానికి కూడా పోర్టల్‌లో అవకాశం ఉంది. మైగవ్ ద్వారా కూడా ప్రతిజ్ఞ చేయవచ్చు. ఈ విధంగా పౌరులు సమాచారం తెలుసుకోవడానికి, ఘటనల గురించి తెలియజేయడానికి పోర్టల్ ఉపయోగపడుతోంది. దేశవ్యాప్తంగా కార్యక్రమం అమలు, పురోగతిని పర్యవేక్షించే వ్యవస్థగానూ పనిచేస్తోంది.

 

100 రోజుల ప్రత్యేక అవగాహన కార్యక్రమం

కార్యక్రమం తొలి ఏడాది ముగిసిన సందర్భంగా దేశవ్యాప్త కృషిని ముమ్మరం చేసేందుకు ఎండబ్ల్యూసీడీ 4 డిసెంబర్ 2025న న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో 100 రోజుల ప్ర‌త్యేక ప్ర‌చార కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించింది. అదే సమయంలో దేశవ్యాప్తంగా ఒకేసారి ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు.

 

27 నవంబర్ 2025 నుంచి 8 మార్చి 2026 వరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేశారు. మూడు దశల్లో తొలుత సాధారణ అవగాహన కల్పనపై, తర్వాత నిర్దిష్ట సంస్థల భాగస్వామ్యంపై, చివరగా స్థానిక ప్రజల సమష్టి సంకల్పంపై దృష్టి పెట్టారు.

దశ, కాలం

లక్ష్య వర్గం

ప్రధాన కార్యక్రమాలు

దశ 1: 27 నవంబర్ నుంచి 31 డిసెంబర్ 2025 వరకు

పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు

అవగాహన, చైతన్య సదస్సులు, వాదోపవాదాలు, వ్యాసరచన పోటీలు, పరస్పర చర్చలతో కూడిన కార్యక్రమాలు, ప్రతిజ్ఞ కార్యక్రమాలు

దశ 2: 1 నుంచి 31 జనవరి 2026 వరకు

మత సంస్థలు, మత పెద్దలు, స్థానిక సమాజంపై ప్రభావం చూపే వ్యక్తులు, వివాహాలకు సేవలందించేవారు

ఆలయాలు, మసీదులు, ఇతర ప్రార్థనా స్థలాల నిర్వాహకులతో సంప్రదింపులు; కేటరర్లు, టెంట్ హౌస్ నిర్వాహకులు, డీజేలు, ఇతర సేవలందించే వారిని చేరుకోవడం; సమాచార, విద్య, ప్రచార (ఐఈసీ) సామగ్రి ప్రదర్శన

దశ 3: 1 ఫిబ్రవరి నుంచి 8 మార్చి 2026 వరకు

గ్రామ పంచాయతీలు, పురపాలక వార్డులు

స్థానిక ప్రజలను భాగస్వామ్యం చేయడం, పంచాయతీ/వార్డు పరిధిని బాల్య వివాహాలు లేని ప్రాంతంగా ప్రకటించే తీర్మానాలకు సహకారం అందించడం

కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగాలు, సంస్థలు, స్థానిక భాగస్వాముల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేశారు. సీఎంపీఓల పాత్రను బలోపేతం చేయడం, స్థానిక సంస్థలను భాగస్వామ్యం చేయడం, బాల్య వివాహాలను అడ్డుకోవడంలో స్థానిక ప్రజలు చురుగ్గా పాల్గొనేలా చూడటంపై దృష్టి పెట్టారు.

 

అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, ప్రజలకు చేరువ కావాలని, పంచాయతీరాజ్ సంస్థలు, పట్టణ స్థానిక సంస్థలను భాగస్వామ్యం చేయాలని, జిల్లా, క్షేత్రస్థాయిల్లో పర్యవేక్షణను పటిష్టం చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ప్రోత్సహించారు.

 

బాల్ వివాహ్ ముక్త్ భారత్: ప్రధాన విజయాలు

నిరంతర అవగాహన కార్యక్రమాలు, సంస్థల భాగస్వామ్యం, స్థానిక ప్రజల చొరవ, నివారణ చర్యల ద్వారా బాల్య వివాహాల నిర్మూలనకు దేశవ్యాప్తంగా జరుగుతున్న కృషిని బలోపేతం చేయడంలో బీవీఎంబీ తోడ్పడింది. కార్యక్రమం సాధించిన ప్రధాన ఫలితాలు:

1. విస్తృత అవగాహన, ప్రజలకు చేరువ

- దేశవ్యాప్తంగా 6.85 లక్షల అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు.

- అవగాహన, ప్రజల భాగస్వామ్య కార్యక్రమాల ద్వారా 12.47 కోట్ల మందికి చేరువయ్యారు.

- విద్యాసంస్థలు, విద్యార్థులు, మత పెద్దలు, వివాహాలకు సేవలందించేవారు, పంచాయతీరాజ్ సంస్థలు, పట్టణ స్థానిక సంస్థలు, స్థానిక ప్రజలను ఒక పద్ధతి ప్రకారం భాగస్వామ్యం చేసేందుకు 100 రోజుల అవగాహన కార్యక్రమం వీలు కల్పించింది.

 

2. సంస్థాగత వ్యవస్థ బలోపేతం

- బీవీఎంబీ పోర్టల్‌లో 71,882 మంది బాల్య వివాహ నిరోధక అధికారుల (సీఎంపీఓలు) వివరాలు ఉన్నాయి.

- గ్రామ పంచాయతీ స్థాయిలో 59,686 మందికి సీఎంపీఓ బాధ్యతలు అప్పగించారు. దీంతో బాల్య వివాహాల నివారణ వ్యవస్థ క్షేత్రస్థాయికి మరింత విస్తరించింది.

- సీఎంపీఓల వివరాలను తెలుసుకోవడానికి, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు, నివారణ చర్యలను పర్యవేక్షించడానికి పోర్టల్ ఒకే వేదికగా పనిచేస్తోంది.

 

3. పెరిగిన పౌరుల భాగస్వామ్యం

- బీవీఎంబీ పోర్టల్, మైగవ్ ద్వారా మొత్తం 42.01 లక్షల ప్రతిజ్ఞలు నమోదయ్యాయి. వీటిలో 40.96 లక్షల ప్రతిజ్ఞలు బీవీఎంబీ పోర్టల్‌లో, 1.05 లక్షల ప్రతిజ్ఞలు మైగవ్‌లో నమోదయ్యాయి.

- బాల్య వివాహాలు లేని భారత్ సాధనకు తమ నిబద్ధతను చాటేందుకు ప్రతిజ్ఞ కార్యక్రమం పౌరులు, సంస్థలు, ప్రజాప్రతినిధులకు అవకాశం కల్పించింది.

 

4. ఘటనలపై సమాచారం, నివారణ చర్యలు

- బీవీఎంబీ పోర్టల్‌లో 4,536 బాల్య వివాహ ఘటనలు నమోదయ్యాయి.

- అక్షయ తృతీయ సహా బాల్య వివాహాల ముప్పు ఎక్కువగా ఉండే సమయాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లా యంత్రాంగాలు, సీఎంపీఓలు, చట్టాన్ని అమలు చేసే సంస్థలు, స్థానిక భాగస్వాములు సకాలంలో జోక్యం చేసుకుని, సమన్వయంతో బాల్య వివాహాలను అడ్డుకునేందుకు కృషి చేశారు.

 

కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగాలు, క్షేత్రస్థాయి సంస్థల సమన్వయంతో బాల్య వివాహాల నిర్మూలనకు ప్రభుత్వ వ్యవస్థలన్నీ, సమాజంలోని అన్ని వర్గాలు కలిసి పనిచేసే విధానం బలోపేతమైంది.

 

సీఎంపీఓల వివరాలను ప్రాంతాల వారీగా నమోదు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచడం, ఘటనల సమాచారాన్ని స్వీకరించడం, అవగాహన కార్యక్రమాలను నమోదు చేయడం, స్థానిక ప్రజల భాగస్వామ్యాన్ని పర్యవేక్షించడం, ఆన్‌లైన్‌లో ప్రతిజ్ఞ చేయడం వంటి సదుపాయాలను పోర్టల్ అందిస్తోంది. ఇవి పారదర్శకతకు, సకాలంలో సమాచారం అందించడానికి, ఆధారాలతో పర్యవేక్షించడానికి, తదుపరి చర్యలు తీసుకోవడానికి తోడ్పడుతున్నాయి.

 

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పురోగతి

 

 

జాతీయ స్థాయిలో బాల్య వివాహాల శాతం ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్-5 (2019-21)లో 23.3 శాతం నుంచి ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్-6 (2023-24)లో 20.1 శాతానికి తగ్గింది. ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్-5తో పోలిస్తే చాలా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ శాతం తగ్గింది. దాద్రా, నగర్ హవేలీ, దమన్, దీయూ కేంద్రపాలిత ప్రాంతంలో అత్యధికంగా 10.1 శాతం పాయింట్లు తగ్గింది. తర్వాతి స్థానాల్లో అండమాన్, నికోబార్ దీవులు (7.4 శాతం పాయింట్లు), అస్సాం (6.5 శాతం పాయింట్లు), బిహార్ (6.2 శాతం పాయింట్లు), త్రిపుర (6.1 శాతం పాయింట్లు) ఉన్నాయి. కర్ణాటక, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, మిజోరం, కేరళం సహా 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో బాల్య వివాహాల శాతం జాతీయ సగటు కంటే తక్కువగా ఉంది.

 

బాల్ వివాహ్ ముక్త్ భారత్‌కు రెండేళ్లు

బీవీఎంబీ ప్రారంభించి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా 27 నవంబర్ 2026న జాతీయ స్థాయిలో కార్యక్రమం నిర్వహిస్తారు. చట్టాన్ని అమలు చేసే వ్యవస్థ బలోపేతం కావడం, ప్రజల భాగస్వామ్యం విస్తరించడం, మరిన్ని గణాంకాలు అందుబాటులోకి రావడం నేపథ్యంలో సాధించిన పురోగతిని సమీక్షించేందుకు ఇది అవకాశం కల్పిస్తుంది. సీఎంపీఓలు, క్షేత్రస్థాయి భాగస్వాముల కృషిని గుర్తించడానికి, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అనుసరిస్తున్న పద్ధతుల్లో ఇతర ప్రాంతాలకూ ఉపయోగపడేవాటిని పంచుకోవడానికి, నివారణపై జాతీయ సంకల్పాన్ని పునరుద్ఘాటించడానికి ఈ కార్యక్రమం వేదికగా నిలుస్తుంది.

 

ప్రత్యేకంగా సీఎంపీఓలను నియమించే వ్యవస్థను పటిష్టం చేయడం, పోర్టల్‌లోని సమాచారం నాణ్యంగా, సంపూర్ణంగా ఉండేలా చూడటం, అవగాహన కార్యక్రమాలు, ప్రతిజ్ఞల్లో భాగస్వామ్యాన్ని విస్తరించడంపై దృష్టి కొనసాగుతోంది. సకాలంలో సమాచారం అందేలా చూడటం, బాల్య వివాహాలను అడ్డుకునేందుకు వెంటనే జోక్యం చేసుకోవడం కూడా ఇందులో భాగం. పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థలు, విద్యాసంస్థలు, కుటుంబాలు, మత పెద్దలు, యువత, పౌర సమాజం మరింత చురుగ్గా పాల్గొనేలా కృషి చేస్తున్నారు.

 

బాల్య వివాహాల శాతం తగ్గుతోందని ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్ గణాంకాలు చూపుతున్నాయి. అయితే అన్ని రాష్ట్రాల్లో తగ్గుదల ఒకేలా లేదు. అందుకే ఈ కృషిని కొనసాగించాలి. ఇది 2030 నాటికి బాల్య వివాహాలు లేని భారత్‌ను సాధించాలన్న జాతీయ లక్ష్యానికి, ఎస్‌డీజీ లక్ష్యం 5.3కు అనుగుణంగా సాగుతోంది.

 

References

Ministry of Women and Child Development

Click here for pdf file. 

****

(Explainer ID: 160748) आगंतुक पटल : 61
Provide suggestions / comments
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali , Assamese , Punjabi , Kannada