Infrastructure
కీలక ఖనిజాల ప్రాసెసింగ్‌ను ప్రోత్సహించేందుకు మూలధన వ్యయ(క్యాపెక్స్) సహాయ పథకం
దేశీయంగా లిథియం, నికెల్ ప్రాసెసింగ్‌కు ₹2,814 కోట్లతో ఊతం
Posted On:
05 NOV 2026 1:53PM
₹2,814 కోట్ల కేటాయింపుతో క్యాపెక్స్ సపోర్ట్ స్కీమ్ టు ప్రమోట్ క్రిటికల్ మినరల్ ప్రాసెసింగ్(కీలక ఖనిజాల ప్రాసెసింగ్‌ను ప్రోత్సహించేందుకు మూలధన వ్యయ సహాయ పథకం)కు ఇటీవల ఆమోదం లభించింది. ఈ పథకం 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు అమల్లో ఉంటుంది. లిథియం, నికెల్ ప్రాసెసింగ్ ప్లాంట్లను చెరో రెండు ఏర్పాటు చేసేందుకు 30% మూలధన రాయితీ అందిస్తుంది. పోటీ పద్ధతిలో రెండు దశల్లో లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ప్రాజెక్టులు నిర్దేశించిన దశలకు చేరుకున్న మేరకు సాయాన్ని విడుదల చేస్తారు. ఈ పథకం ద్వారా సుమారు ₹10,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా. దిగుమతులపై ఆధారపడటాన్ని ఈ పథకం తగ్గిస్తుంది. సరఫరా గొలుసుల అంతరాయాలను తట్టుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది. విద్యుత్ వాహనాలు, బ్యాటరీల ద్వారా విద్యుత్ నిల్వ, ఎలక్ట్రానిక్స్, రక్షణ, ప్రత్యేక రకాల ఉక్కు తయారీ రంగాలకు తోడ్పడుతుంది.
కీలక ఖనిజాల ప్రాసెసింగ్‌లో భారత్ సామర్థ్యం పెంపు
ఆర్థిక అభివృద్ధికి, జాతీయ భద్రతకు కీలక ఖనిజాలు అవసరం. స్వచ్ఛ ఇంధన సాంకేతికతలు, అధునాతన ఎలక్ట్రానిక్స్, రవాణా, టెలికమ్యూనికేషన్లు, రక్షణ రంగాలకు ఇవి ఉపయోగపడతాయి. తక్కువ కార్బన్ ఉద్గారాలతో నడిచే ఆర్థిక వ్యవస్థ వైపు ప్రపంచం సాగాలంటే ఈ ఖనిజాలు అందుబాటులో ఉండటం కీలకం. వీటి ప్రాసెసింగ్ కొద్ది దేశాల్లోనే ఎక్కువగా జరుగుతోంది. దీంతో ప్రపంచ సరఫరా గొలుసులు భౌగోళిక రాజకీయ పరిణామాలతో తలెత్తే అంతరాయాలు, ధరల హెచ్చుతగ్గులు, సరఫరాపై ఆంక్షల ముప్పును ఎదుర్కొంటున్నాయి. అందుకే దేశాలు తమ జాతీయ ప్రాధాన్యాలకు అనుగుణంగా కీలక ఖనిజాలను గుర్తించి, వాటి సరఫరాకు భరోసా కల్పించే చర్యలు చేపడుతున్నాయి.
లిథియం, నికెల్, కోబాల్ట్, గ్రాఫైట్, అరుదైన భూ మూలకాలు సహా 24 కీలక ఖనిజాలను భారత్ గుర్తించింది. 2070 నాటికి నికర ఉద్గారాలను సున్నాకు తీసుకురావాలన్న దేశ లక్ష్యం ఈ ఖనిజాల ప్రాధాన్యాన్ని మరింత పెంచుతోంది. అయితే, కీలక ఖనిజాల నుంచి శుద్ధి చేసి పొందే మధ్యంతర ఉత్పత్తులు, అధిక స్వచ్ఛత గల పదార్థాల కోసం భారత్ ప్రధానంగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. దేశీయ ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని పెంచి, విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు క్యాపెక్స్ సపోర్ట్ స్కీమ్ టు ప్రమోట్ క్రిటికల్ మినరల్ ప్రాసెసింగ్‌కు కేంద్ర మంత్రివర్గం 04 నవంబర్ 2026న ఆమోదం తెలిపింది.
క్యాపెక్స్ సపోర్ట్ స్కీమ్ టు ప్రమోట్ క్రిటికల్ మినరల్ ప్రాసెసింగ్
దేశంలో కీలక ఖనిజాల ప్రాసెసింగ్ సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు ఈ పథకం ద్వారా మూలధన వ్యయం (క్యాపెక్స్) కోసం ప్రత్యేక సాయం అందిస్తారు. పథకం ప్రధాన లక్ష్యాలు:
- దేశీయ ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని పెంచడం: అధిక స్వచ్ఛత గల లిథియం, నికెల్ ఉత్పత్తులను తయారు చేసే ప్రాసెసింగ్ ప్లాంట్ల ఏర్పాటుకు తోడ్పడటం. లిథియం ప్లాంట్లు ముడి ఖనిజాలు, సాంద్రీకృత ఖనిజ పదార్థాలను (ఉప్పు ద్రావణాలు మినహా) ప్రాసెస్ చేసి, బ్యాటరీల తయారీకి తగిన నాణ్యత గల ఉత్పత్తులుగా మారుస్తాయి. నికెల్ ప్లాంట్లు క్లాస్-1 నికెల్ లేదా బ్యాటరీ గ్రేడ్ నికెల్ సల్ఫేట్‌ను ఉత్పత్తి చేయడంతో పాటు కోబాల్ట్‌ను కూడా వేరు చేసి సేకరిస్తాయి. క్యాపెక్స్ సాయం భారీ ప్రారంభ ఖర్చుల భారాన్ని తగ్గించి, ప్రాజెక్టులు ఆర్థికంగా లాభసాటిగా నడిచేందుకు తోడ్పడుతుంది.
- విలువ గొలుసును పటిష్టం చేయడం: ప్రాసెసింగ్ దశలో ఉన్న లోటును భర్తీ చేసి, లిథియం, నికెల్ విలువ గొలుసును బలోపేతం చేయడం.
ఆర్థిక కేటాయింపులు, సాయం
ఈ పథకానికి మొత్తం ₹2,814 కోట్లు కేటాయించారు. 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు ఐదేళ్లు పథకం అమల్లో ఉంటుంది. నాలుగు ప్రాసెసింగ్ ప్లాంట్ల ఏర్పాటుకు రాయితీకి అర్హమైన పెట్టుబడిలో 30% మూలధన రాయితీ ఇస్తారు. వీటిలో ఒక్కొక్కటి కనీసం 30 వేల టన్నుల సామర్థ్యం గల రెండు లిథియం ప్లాంట్లు, ఒక్కొక్కటి కనీసం 50 వేల టన్నుల సామర్థ్యం గల రెండు నికెల్ ప్లాంట్లు ఉంటాయి.

లిథియం ప్రాసెసింగ్‌కు ఒక్కో లబ్ధిదారుకు గరిష్ఠంగా ₹500 కోట్లు, నికెల్ ప్రాసెసింగ్‌కు ఒక్కో లబ్ధిదారుకు గరిష్ఠంగా ₹900 కోట్లు అందిస్తారు. లిథియం ప్రాసెసింగ్‌కు ₹1,000 కోట్లు, నికెల్ ప్రాసెసింగ్‌కు ₹1,800 కోట్లు కలిపి మొత్తం ₹2,800 కోట్లు కేటాయించారు. పరిపాలనా ఖర్చుల కోసం మరో ₹14 కోట్లు కేటాయించారు. ఇది మొత్తం కేటాయింపులో 0.5%. భారత ప్రభుత్వం పథకానికి అవసరమైన నిధులన్నింటినీ బడ్జెట్ ద్వారా సమకూరుస్తుంది.
లబ్ధిదారుల ఎంపిక, ప్రోత్సాహకాల విడుదల
ఈ పథకం కింద లబ్ధిదారులను పోటీ పద్ధతిలో ఎంపిక చేస్తారు. ఆ తర్వాత ప్రాజెక్టులు నిర్దేశించిన దశలకు చేరుకున్న మేరకు విడతల వారీగా సాయం విడుదల చేస్తారు.
రెండు దశల్లో ఎంపిక
- దశ 1 – సాంకేతిక అర్హత: దరఖాస్తులన్నింటినీ సాంకేతిక ప్రమాణాల ఆధారంగా పరిశీలిస్తారు. అర్హత సాధించిన దరఖాస్తుదారులకే తదుపరి దశలో అవకాశం ఉంటుంది.
- దశ 2 – ఆర్థిక బిడ్లు: అర్హత సాధించిన దరఖాస్తుదారులు ఆర్థిక బిడ్లు సమర్పిస్తారు. ఎంపికలో అత్యల్ప వ్యయ ప్రమాణాన్ని పాటిస్తారు. అంటే క్యాపెక్స్ సాయం అతి తక్కువగా కోరిన బిడ్లను ఎంపిక చేస్తారు.
ఒక్కో ఖనిజానికి ఇద్దరు లబ్ధిదారుల చొప్పున మొత్తం నలుగురిని ఎంపిక చేస్తారు.
ప్రాజెక్టు పురోగతి ఆధారంగా రాయితీ విడుదల
ప్రోత్సాహకాలను మూడు విడతల్లో విడుదల చేస్తారు. ప్రతి విడత విడుదలకు పెట్టుబడి, వాటా మూలధనం (ఈక్విటీ) విషయంలో నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలి.
|
విడత
|
పూర్తి చేయాల్సిన దశ
|
అప్పటివరకు విడుదల చేసే మొత్తం రాయితీ (బిడ్‌లో పేర్కొన్న మొత్తంలో %)
|
|
1
|
వెచ్చిస్తామని పేర్కొన్న మూలధన వ్యయంలో 25% ఖర్చు చేయాలి, నిర్దేశించిన కనీస ఈక్విటీ మొత్తంలో కనీసం 15% సమకూర్చాలి
|
25%
|
|
2
|
వెచ్చిస్తామని పేర్కొన్న మూలధన వ్యయంలో 50% ఖర్చు చేయాలి, నిర్దేశించిన కనీస ఈక్విటీ మొత్తంలో కనీసం 50% సమకూర్చాలి
|
50%
|
|
3
|
ప్లాంట్‌లో కార్యకలాపాలు ప్రారంభించాలి, నిర్దేశించిన కనీస ఈక్విటీ మొత్తాన్ని 100% సమకూర్చాలి
|
100%
|
ప్లాంట్ల ప్రారంభానికి గడువు
లెటర్ ఆఫ్ అవార్డ్ (ఎల్ఓఏ) జారీ చేసిన తేదీ నుంచి మూడేళ్లలోగా లబ్ధిదారులు ప్లాంట్‌లో కార్యకలాపాలు ప్రారంభించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎల్ఓఏ జారీ చేసిన తేదీ నుంచి ఐదేళ్లలోగా కార్యకలాపాలు ప్రారంభించాలి. మూడేళ్లు దాటితే ఇంకా విడుదల చేయాల్సిన క్యాపెక్స్ సాయాన్ని ఐదో ఏడాది వరకు క్రమంగా తగ్గించే విధానం వర్తిస్తుంది.
పథకం పాలనా వ్యవస్థ
పథకాన్ని పర్యవేక్షించేందుకు మూడు స్థాయిల పాలనా వ్యవస్థ ఉంటుంది. పథకం సమర్థంగా అమలయ్యేలా చూడటం, పురోగతిని పర్యవేక్షించడం, అవసరమైన మార్గనిర్దేశం చేయడం ఈ వ్యవస్థ బాధ్యత.
|
స్థాయి
|
సంస్థ
|
ప్రధాన పాత్ర
|
|
అత్యున్నత స్థాయి
|
గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి అధ్యక్షతన పాలక మండలి (జీసీ)
|
వ్యూహాత్మక దిశానిర్దేశం చేస్తుంది, పురోగతిని సమీక్షిస్తుంది. లబ్ధిదారుల తుది ఎంపిక చేసి, క్యాపెక్స్ సాయాన్ని మంజూరు చేస్తుంది. కేంద్ర గనుల శాఖ మంత్రి ఆమోదానికి లోబడి, పథకం మార్గదర్శకాల సవరణలకు ఆమోదం తెలిపే అధికారం కూడా మండలికి ఉంటుంది.
|
|
మూల్యాంకనం
|
సాంకేతిక, ఆర్థిక కమిటీ (టీఎఫ్సీ)
|
దరఖాస్తులను సాంకేతిక, ఆర్థిక ప్రమాణాల ఆధారంగా పరిశీలిస్తుంది. లబ్ధిదారుల ఎంపికపై పాలక మండలికి సిఫార్సులు చేస్తుంది. పరిశోధన, అభివృద్ధి (ఆర్&డీ) సంస్థలు, సాంకేతిక సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలకు (పీఎస్‌యూలు) చెందిన సాంకేతిక, ఆర్థిక నిపుణులు ఇందులో ఉంటారు.
|
|
అమలు
|
ప్రాజెక్టు నిర్వహణ సంస్థ (పీఎంఏ)
|
కార్యాలయ పనులు, నిర్వహణ, అమలులో అవసరమైన సహకారం అందిస్తుంది. గనుల మంత్రిత్వ శాఖ అప్పగించే ఇతర పనులను చేపడుతుంది.
|
దేశీయ ప్రాసెసింగ్ ప్రాధాన్యం
కీలక ఖనిజాల సరఫరాకు భరోసా కల్పించడంలో, స్వావలంబన సాధించడంలో దేశీయ ప్రాసెసింగ్ సామర్థ్యం కీలకం. ఈ సామర్థ్యాన్ని పెంచాల్సిన ప్రధాన కారణాలు:
- వ్యూహాత్మక ప్రాధాన్యం: స్వచ్ఛ ఇంధనాల వైపు మారడానికి అవసరమైన సాంకేతికతలు, రక్షణ, విమానయాన, అంతరిక్ష రంగాలు, ప్రత్యేక రకాల ఉక్కు తయారీకి పటిష్ఠమైన దేశీయ విలువ గొలుసులు అవసరం. దేశీయ ప్రాసెసింగ్ విదేశీ సరఫరాలో అంతరాయాల ముప్పును తగ్గించి, స్వావలంబనకు తోడ్పడుతుంది. అందుబాటు ఖర్చుతో ఉపయోగించగల సాంకేతికతలు, మధ్యంతర సమ్మేళనాలు, సాంకేతిక నైపుణ్యం భారత్‌కు పరిమితంగా లభిస్తున్న సమస్యను అధిగమించడానికీ ఇది తోడ్పడుతుంది.
- దేశంలో బలమైన డిమాండ్: డిమాండ్ అంచనాలను బట్టి దేశీయ ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరం స్పష్టమవుతోంది. దేశంలోనే ఖనిజాలకు వీలైనంత ఎక్కువ విలువను జోడించడానికి, దిగుమతుల స్థానంలో దేశీయ ఉత్పత్తులను వినియోగించడానికి ఈ సామర్థ్యం కీలకం.
- పెట్టుబడులకు అడ్డంకులు: ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో దేశీయ ప్రాసెసింగ్ ప్రాజెక్టులు లాభసాటిగా లేవు. వీటికి అధునాతన పరికరాలు, ఖనిజాలను పలు దశల్లో అవసరమైన రూపంలోకి మార్చే వ్యవస్థలు, కఠినమైన పర్యావరణ పరిరక్షణ చర్యలు అవసరం. దీంతో మూలధన ఖర్చులు పెరుగుతాయి. ముడి పదార్థాలు, తగిన సాంకేతిక పరిజ్ఞానం కూడా పరిమితంగానే లభిస్తున్నాయి. ప్రత్యేక సాయం లేకపోతే పరిశ్రమలకు ఇలాంటి ప్లాంట్ల ఏర్పాటు కష్టమవుతుంది.
అంచనా ఫలితాలు
పథకం ద్వారా ఆర్థిక, వ్యూహాత్మక ప్రయోజనాలు కలుగుతాయని అంచనా:
- పెట్టుబడులు, సామర్థ్యం: ప్రాసెసింగ్ రంగంలో ఈ పథకం సుమారు ₹10,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తుందని అంచనా. 2030 నాటికి ఉంటుందని అంచనా వేసిన డిమాండ్‌ను తీర్చేందుకు 60 వేల టన్నుల లిథియం, 100 వేల టన్నుల నికెల్ ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని ఏర్పాటు చేయడానికి ఈ పథకం తోడ్పడుతుంది.
- దేశంలోనే విలువ జోడింపు: ముడి ఖనిజాలు, సాంద్రీకృత ఖనిజ పదార్థాలు, మధ్యంతర ఉత్పత్తులను భారత్‌లోనే ప్రాసెస్ చేసి అధిక స్వచ్ఛత గల ఉత్పత్తులుగా మారుస్తారు. దీంతో విలువ గొలుసులో భారత్ వాటా పెరుగుతుంది.
- సరఫరాకు భరోసా: ప్రాసెసింగ్ కొద్ది దేశాల్లోనే కేంద్రీకృతం కావడం, ఎగుమతులపై ఆంక్షలు విధించే అవకాశం వల్ల భారత్‌కు ఎదురయ్యే ముప్పును ఈ పథకం తగ్గిస్తుందని అంచనా.
- దిగుమతి వ్యయం తగ్గింపు: అధిక స్వచ్ఛత గల మధ్యంతర ఉత్పత్తులను దేశంలోనే తయారు చేయడం ద్వారా దిగుమతుల అవసరం తగ్గుతుందని అంచనా. ఫలితంగా దిగుమతుల ఖర్చు, విదేశీ మారకద్రవ్య వ్యయం తగ్గుతాయి.
- తదుపరి దశ తయారీకి తోడ్పాటు: శుద్ధి చేసిన ఉత్పత్తులు బ్యాటరీలకు అవసరమైన పదార్థాలు, బ్యాటరీ సెల్స్, ప్రత్యేక రకాల ఉక్కు తయారీకి ఉపయోగపడతాయి. దీంతో ఈ తయారీ రంగాల్లో ఇప్పటికే అమలవుతున్న పథకాలకు ఊతం లభిస్తుంది.
- ఉపాధి కల్పన: కీలక ఖనిజాల ప్రాసెసింగ్‌లో ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని అంచనా. తుది ఉత్పత్తుల తయారీ పెరిగితే మరిన్ని ఉపాధి అవకాశాలు రావచ్చు.
భారత్‌లో కీలక ఖనిజాల రంగం బలోపేతం
కీలక ఖనిజాల విలువ గొలుసులో ఇప్పటికే అమలవుతున్న పలు కార్యక్రమాలకు ఈ పథకం తోడవుతుంది. మొత్తంగా ఈ కార్యక్రమాలు ఇప్పుడు ఖనిజాల అన్వేషణ, తవ్వకం, రీసైక్లింగ్, ప్రాసెసింగ్ దశలన్నింటికీ తోడ్పడుతున్నాయి.
- నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ (ఎన్సీఎంఎం): 2025 జనవరిలో ప్రారంభించిన ఈ మిషన్ కీలక ఖనిజాల దీర్ఘకాలిక సరఫరాకు భరోసా కల్పిస్తుంది, మొత్తం విలువ గొలుసును బలోపేతం చేస్తుంది. ఈ మిషన్ కింద ₹1,500 కోట్ల రీసైక్లింగ్ పథకానికి కేంద్ర మంత్రివర్గం 2025 సెప్టెంబర్ 3న ఆమోదం తెలిపింది. ఎలక్ట్రానిక్ వ్యర్థాలు, వాడకం ముగిసిన లిథియం-అయాన్ బ్యాటరీలు, ఇతర స్క్రాప్ వంటి వనరుల నుంచి కీలక ఖనిజాలను తిరిగి సేకరించడాన్ని ఈ పథకం ప్రోత్సహిస్తుంది.
- అన్వేషణ, తవ్వకం: ఖనిజ బ్లాకుల వేలం క్రమంగా ఊపందుకుంది. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం 64 కీలక, వ్యూహాత్మక ఖనిజ బ్లాకులు, 11 అన్వేషణ లైసెన్స్ బ్లాకులను వేలం వేసింది.
భవిష్యత్ దిశ
భారత్‌లో కీలక ఖనిజాల విలువ గొలుసులో ఉన్న ముఖ్యమైన లోటును క్యాపెక్స్ సపోర్ట్ స్కీమ్ టు ప్రమోట్ క్రిటికల్ మినరల్ ప్రాసెసింగ్ భర్తీ చేస్తుంది. లిథియం, నికెల్ ప్రాసెసింగ్‌కు సాయం అందించడం ద్వారా దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది, అంతరాయాలను తట్టుకునేలా సరఫరా గొలుసును పటిష్ఠం చేస్తుంది. నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్‌తో పాటు ఈ పథకం ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో కీలక ముందడుగు.
References
Cabinet
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2332476®=48&lang=2
Ministry of Mines
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2277041®=3&lang=1
PIB Backgrounder
https://static.pib.gov.in/WriteReadData/specificdocs/documents/2025/sep/doc202596629501.pdf
Click here to see pdf
***
(Explainer ID: 160730)
आगंतुक पटल : 8
Provide suggestions / comments