Others

బ్యూరో ఆఫ్ ఇండియ‌న్ స్టాండ‌ర్డ్స్‌ హాల్‌మార్కింగ్

వినియోగదారుల నమ్మకానికి ముద్ర

Posted On: 05 NOV 2026 2:00PM

బంగారు, వెండి ఆభరణాల స్వచ్ఛతకు హాల్‌మార్కింగ్ భరోసా ఇస్తుంది. కొనుగోలు చేసేటప్పుడు వివరాలు తెలుసుకుని సరైన నిర్ణయం తీసుకునేందుకు వినియోగదారులకు తోడ్పడుతుంది. నిర్దేశిత ప్రమాణాలు, వస్తువుల వివరాలను గుర్తించేందుకు డిజిటల్ రికార్డులు, నిబంధనల అమలుపై తనిఖీల ద్వారా బ్యూరో ఆఫ్ ఇండియ‌న్ స్టాండ‌ర్డ్స్‌ (బీఐఎస్) ఈ వ్యవస్థను పర్యవేక్షిస్తుంది. 2021లో బంగారు ఆభరణాలకు హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరి చేసినప్పటి నుంచి 15 అక్టోబర్ 2026 వరకు 65 కోట్లకు పైగా బంగారు వస్తువులకు హాల్‌మార్క్ ప్రత్యేక గుర్తింపు (హెచ్‌యూఐడీ) సంఖ్యలు కేటాయించారు. ఇదే కాలంలో బీఐఎస్ వద్ద నమోదు చేసుకున్న ఆభరణాల వ్యాపారుల సంఖ్య 43,153 నుంచి 2,36,624కు పెరిగింది. వెండికి హాల్‌మార్కింగ్ ఐచ్ఛికమే. అయితే హాల్‌మార్క్ వేసే ప్రతి వెండి వస్తువుపై 1 సెప్టెంబర్ 2025 నుంచి హెచ్‌యూఐడీ కోడ్‌ను తప్పనిసరి చేశారు. 90 లక్షలకు పైగా వెండి వస్తువులపై హెచ్‌యూఐడీతో హాల్‌మార్క్ వేశారు. బీఐఎస్ కేర్ యాప్‌లో డిజిటల్ ధ్రువీకరణ సదుపాయం, బీఐఎస్ నిరంతర పర్యవేక్షణ వినియోగదారులు ఆభరణాల వివరాలను సరిచూసుకోవడానికి తోడ్పడుతున్నాయి. ఇవి మార్కెట్‌లో పారదర్శకతను పెంచుతున్నాయి.

బంగారం కొనుగోలులో వినియోగదారులకు భరోసా అవసరం
తరతరాలుగా భారతీయ కుటుంబాల్లో బంగారానికి ప్రత్యేక స్థానం ఉంది. బంగారాన్ని వారు ఇష్టంగా దాచుకుంటారు. విలువ నిలిచే ఆస్తిగానూ చూస్తారు. ద్రవ్యోల్బణం నుంచి ఆర్థిక రక్షణ పొందేందుకు కుటుంబాలు తరచూ బంగారం కొంటాయి. అత్యవసర ఖర్చుల కోసం ఆభరణాలను తాకట్టు పెట్టి రుణాలు తీసుకుంటాయి. అయితే బంగారు ఆభరణాల స్వచ్ఛతను గుర్తించడం ఎప్పుడూ సులువు కాదు.

బంగారం చాలా మెత్తగా ఉండటంతో వాడకంలో త్వరగా అరిగిపోతుంది. అందుకే ఆభరణాలు తయారు చేసేటప్పుడు బంగారంలో ఇతర లోహాలు కలుపుతారు. ఈ ప్రక్రియ అవసరమే అయినా, కల్తీకి, స్వచ్ఛతపై వినియోగదారులను తప్పుదారి పట్టించేందుకు అవకాశం ఉంటుంది. అనేక భాగాలను జతచేసి తయారు చేసిన సంక్లిష్టమైన ఆభరణాల్లో లేదా బంగారు పూత ఉన్న వస్తువుల్లో అసలు బంగారం ఎంత ఉందో తెలుసుకోవడం మరింత కష్టం. ఇలాంటి పద్ధతుల నుంచి వినియోగదారులను రక్షించాల్సిన అవసరాన్ని గుర్తించిన ప్రభుత్వం, బంగారు ఉత్పత్తులకు ప్రమాణాలు నిర్దేశించేందుకు, దేశంలో హాల్‌మార్కింగ్ ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపట్టింది.

హాల్‌మార్కింగ్ అంటే ఏమిటి?
విలువైన లోహాలతో తయారైన వస్తువుల స్వచ్ఛత నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉందని ధ్రువీకరించే విధానమే హాల్‌మార్కింగ్. వినియోగదారుల రక్షణకు ఇది ముఖ్యమైన చర్య. కొనుగోలు చేసేటప్పుడు వివరాలు తెలుసుకుని నిర్ణయం తీసుకునేందుకు ఇది తోడ్పడుతుంది. తక్కువ స్వచ్ఛత గల వస్తువుకు అధిక స్వచ్ఛత గల వస్తువు ధర చెల్లించే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

హాల్‌మార్కింగ్ స్కీమ్: స్వచ్ఛంద విధానం నుంచి విస్తృత అమలు వరకు
భారత బంగారం మార్కెట్‌లో నియంత్రణ వ్యవస్థ లేకపోవడంతో 2000లో స్వచ్ఛంద హాల్‌మార్కింగ్ స్కీమ్‌ను ప్రారంభించారు. దేశంలో ఈ పథకాన్ని నిర్వహించే ఏకైక సంస్థగా బ్యూరో ఆఫ్ ఇండియ‌న్ స్టాండ‌ర్డ్స్‌ను (బీఐఎస్) గుర్తించారు. వినియోగదారులు మోసపోకుండా పథకాన్ని అమలు చేసే బాధ్యతను బీఐఎస్‌కు అప్పగించారు. ఎగుమతుల్లో పోటీపడే సామర్థ్యాన్ని పెంచడం, బంగారు ఆభరణాలకు ప్రపంచంలోని ప్రముఖ మార్కెట్లలో ఒకటిగా భారత్ ఎదిగేందుకు తోడ్పడటం కూడా బీఐఎస్‌కు అప్పగించిన బాధ్యతల్లో ఉన్నాయి.

వెండి వస్తువులకు హాల్‌మార్కింగ్ స్కీమ్‌ను 2005లో ప్రారంభించారు. ప్రస్తుతం భారత్‌లో బంగారం, వెండి రెండూ ఈ పథకం పరిధిలో ఉన్నాయి.

256 జిల్లాల్లో బంగారు ఆభరణాలకు 23 జూన్ 2021 నుంచి హాల్‌మార్కింగ్ తప్పనిసరి చేశారు. స్వచ్ఛత పరీక్ష, హాల్‌మార్కింగ్ కేంద్రాల విస్తరణతో ఇప్పుడు 392 జిల్లాలకు ఈ విధానం వర్తిస్తోంది. ఐఎస్ 1417 ప్రమాణం ప్రకారం బంగారానికి ఏడు క్యారెట్ స్థాయిల్లో హాల్‌మార్కింగ్ వర్తిస్తుంది. కుండలీకరణాల్లోని సంఖ్యలు వెయ్యి భాగాల్లో స్వచ్ఛమైన బంగారం వాటాను సూచిస్తాయి: 9కే (375), 14కే (585), 18కే (750), 20కే (833), 22కే (916), 23కే (958), 24కేఎస్ (995).

వెండికి హాల్‌మార్కింగ్ ఐచ్ఛికమే. అయితే బీఐఎస్ పథకం కింద హాల్‌మార్క్ వేసే ప్రతి వెండి వస్తువుపై 1 సెప్టెంబర్ 2025 నుంచి హాల్‌మార్క్ ప్రత్యేక గుర్తింపు (హెచ్‌యూఐడీ) కోడ్ తప్పనిసరి. హాల్‌మార్క్ ఉన్న ప్రతి ఆభరణంపై వేసే ఈ ప్రత్యేక కోడ్‌లో అక్షరాలు, అంకెలు కలిపి మొత్తం ఆరు గుర్తులు ఉంటాయి. దీని ద్వారా ఆభరణం వివరాలను గుర్తించవచ్చు. సవరించిన ఐఎస్ 2112:2025 ప్రమాణం ప్రకారం వెండి ఆభరణాలు, కళాకృతులకు ఎనిమిది స్వచ్ఛత స్థాయిల్లో (వెయ్యి భాగాల లెక్కన) హాల్‌మార్క్ వేయవచ్చు: 800 (800.0), 835 (835.0), 900 (900.0), 925 (925.0), 958 (958.0), 970 (970.0), 990 (990.0), 999 (999.0).

హాల్‌మార్క్ ఉన్న ఆభరణాలను గుర్తించే విధానం
హాల్‌మార్క్ ఉన్న ఆభరణాలు లేదా కళాకృతులు కొనేటప్పుడు మూడు ముఖ్యమైన గుర్తులను చూడాలి:

బంగారు ఆభరణాలు/కళాకృతులు:
- బీఐఎస్ స్టాండ‌ర్డ్ మార్క్‌:
దీనిపై బీఐఎస్ లోగో ఉంటుంది.
- ప్యూరిటీ/ఫిట్‌నెస్ మార్క్‌: ఆభరణం స్వచ్ఛతను సూచిస్తుంది. ఉదాహరణకు 22కే916.
- హెచ్‌యూఐడీ (హాల్‌మార్క్ ప్రత్యేక గుర్తింపు) కోడ్: ఆభరణానికి కేటాయించే ఆరు డిజిట్ల‌ ప్రత్యేక గుర్తింపు కోడ్.

వెండి ఆభరణాలు/కళాకృతులు:
- బీఐఎస్ స్టాండ‌ర్డ్ మార్క్‌
పై ‘సిల్వర్’ అనే పదం ఉంటుంది.
- ప్యూరిటీ/ఫిట్‌నెస్ మార్క్‌ – వెండి స్వచ్ఛతను సూచిస్తుంది. ఉదాహరణకు, 925.
- హెచ్‌యూఐడీ (హాల్‌మార్క్ ప్రత్యేక గుర్తింపు) కోడ్: వెండి వస్తువుకు కేటాయించే ఆరు డిజిట్ల‌ ప్రత్యేక గుర్తింపు కోడ్.

ఈ మూడు గుర్తులూ కలిపి కొనుగోలు చేసిన ఆభరణంపై మరింత భరోసా ఇస్తాయి. స్వచ్ఛతపై భరోసా తోడైతేనే ఆభరణం అందానికి నిజమైన విలువ ఉంటుంది.

 


ఆచరణలో హాల్‌మార్కింగ్: అభ్యర్థన నుంచి ధ్రువీకరణ వరకు
ఆభరణాల వ్యాపారుల నమోదు, స్వచ్ఛత పరీక్ష, డిజిటల్ గుర్తింపు, నిబంధనల అమలుపై పర్యవేక్షణతో కూడిన హాల్‌మార్కింగ్ విధానాన్ని బీఐఎస్ ఏర్పాటు చేసింది.

 


1. నమోదు, పరీక్షా కేంద్రాలు
హాల్‌మార్క్ ఉన్న ఆభరణాలను విక్రయించాలనుకునే వ్యాపారులు ముందుగా బీఐఎస్ వద్ద నమోదు చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ (ఎన్‌ఎస్‌డబ్ల్యూఎస్) పోర్టల్ https://www.nsws.gov.in/ ఉంది. దీన్ని నేరుగా లేదా బీఐఎస్ పోర్టల్ https://www.manakonline.in ద్వారా తెరవవచ్చు. నమోదు తక్షణమే పూర్తవుతుంది. రుసుము లేదు, నమోదు జీవితకాలం చెల్లుతుంది.

ఆ తర్వాత వ్యాపారులు తమ ఆభరణాలను బీఐఎస్ గుర్తింపు పొందిన స్వచ్ఛత పరీక్ష, హాల్‌మార్కింగ్ కేంద్రానికి (ఏహెచ్‌సీ) అందజేయాలి. ఈ కేంద్రాల్లోనే ఆభరణాలను పరీక్షిస్తారు. మౌలిక వసతులు, పరీక్షా సదుపాయాలు, సిబ్బంది అర్హతలను పరిశీలించిన తర్వాత బీఐఎస్ ఈ కేంద్రాలకు గుర్తింపు ఇస్తుంది.

2. డిజిటల్ పోర్టల్ ద్వారా హాల్‌మార్కింగ్ అభ్యర్థనలు
హాల్‌మార్కింగ్ కోసం ఆభరణాలను సమర్పించే వ్యాపారులు పోర్టల్‌లో అభ్యర్థన నమోదు చేయాలని, ఆభరణాలను ఏహెచ్‌సీలకు పంపేందుకు అందులోని సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని బీఐఎస్ సూచిస్తోంది. బీఐఎస్ వద్ద నమోదు చేసుకున్న వ్యాపారులు మానక్ ఆన్‌లైన్ పోర్టల్‌లో లాగిన్ అయి, హాల్‌మార్కింగ్ విభాగంలో అభ్యర్థనను ప్రారంభించవచ్చు. ఆభరణాల రకం, సంఖ్య, బరువు, తాము ప్రకటించిన స్వచ్ఛత స్థాయి, ఎంచుకున్న ఏహెచ్‌సీ వివరాలను నమోదు చేసి అభ్యర్థనను పంపాలి.

పోర్టల్‌ను ఉపయోగించకుండా నేరుగా ఆభరణాలను సమర్పించే వ్యాపారుల తరఫున ఏహెచ్‌సీ సిబ్బంది అభ్యర్థన నమోదు చేయవచ్చు. ఈ డిజిటల్ విధానంలో పంపిన ప్రతి సరుకు వివరాలు రికార్డులోకి వస్తాయి. హాల్‌మార్కింగ్‌లో ప్రతి దశలోనూ ఆ సరుకు జాడను తెలుసుకునేందుకు ఇది తోడ్పడుతుంది.

3. పరీక్షలు, హెచ్‌యూఐడీ కేటాయింపు
ఆభరణాలు స్వచ్ఛత పరీక్ష, హాల్‌మార్కింగ్ కేంద్రానికి (ఏహెచ్‌సీ) చేరిన తర్వాత నిర్దేశిత పరికరాలు, విధానాలతో వాటి బరువు, స్వచ్ఛతను పరీక్షిస్తారు.

హాల్‌మార్కింగ్‌లో ఉపయోగించే తూకం యంత్రాలు, ఎక్స్‌రే ఫ్లోరెసెన్స్ (ఎక్స్‌ఆర్‌ఎఫ్) యంత్రాలు, లేజర్‌తో ముద్ర వేసే యంత్రాలు సహా పరికరాలన్నింటి నుంచి కేంద్రీకృత సాఫ్ట్‌వేర్‌కు సమాచారం నేరుగా చేరే సదుపాయం ఉండాలి. దీనివల్ల ప్రక్రియకు సంబంధించిన వివరాలు ఎలక్ట్రానిక్ రూపంలో నమోదవుతాయి. సిబ్బంది స్వయంగా వివరాలను నమోదు చేయాల్సిన అవసరం తగ్గుతుంది.

సిబ్బంది స్వయంగా వివరాలను నమోదు చేసే అవకాశాన్ని తొలగించేందుకు 01 సెప్టెంబర్ 2024 నుంచి ఎక్స్‌ఆర్‌ఎఫ్ యంత్రాలను ఏపీఐ ద్వారా సాఫ్ట్‌వేర్‌కు అనుసంధానించారు. తూకం యంత్రాలు చూపే బరువును నేరుగా నమోదు చేసేందుకు తూకం వ్యవస్థలనూ అనుసంధానించారు.

పరీక్ష తర్వాత బీఐఎస్ సర్వర్ ప్రతి ఆభరణానికీ అక్షరాలు, అంకెలతో కూడిన ఆరు డిజిట్ల‌ ప్రత్యేక హెచ్‌యూఐడీ కోడ్‌ను రూపొందిస్తుంది. ఆ కోడ్‌తో పాటు బీఐఎస్ ప్రమాణ ముద్ర, సంబంధిత స్వచ్ఛత ముద్రను ఆభరణంపై వేస్తారు.

ఏహెచ్‌సీలు ఆభరణం ఫొటోతో పాటు హెచ్‌యూఐడీ సహా దానిపై వేసిన హాల్‌మార్క్ ఫొటో కూడా తీయాలి. 08 జూన్ 2026న అమల్లోకి తెచ్చిన విధానం ప్రకారం ఈ ఫొటోలు, ఆభరణం బరువు వివరాలను నేరుగా మానక్ ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తారు.

4. డిజిటల్ పర్యవేక్షణ, ఆభరణాల జాడ
ఏహెచ్‌సీల్లో చేపట్టే పనుల తేదీ, సమయాన్ని నమోదు చేసేందుకు బీఐఎస్ పోర్టల్‌లో సదుపాయం కల్పించింది. ఈ వివరాల ద్వారా పనులు జరుగుతున్నప్పుడే వాటిని పర్యవేక్షించవచ్చు. ఆభరణాలు కేంద్రానికి చేరినప్పటి నుంచి హాల్‌మార్క్ వేసి పంపే వరకు ఎంత సమయం పట్టిందో తెలుసుకోవచ్చు. లేజర్‌తో ముద్ర వేసే ముందే ఆభరణాలను పరీక్షించారో లేదో కూడా పరిశీలించవచ్చు.

బరువు వివరాలు స్వయంచాలకంగా నమోదు కావడం, ట్రాన్స్‌ఫర్ హెచ్‌యూఐడీ వంటి డిజిటల్ సదుపాయాలతో హాల్‌మార్కింగ్ సరఫరా గొలుసులో మొదటి నుంచి చివరి దశ వరకు వస్తువుల జాడను తెలుసుకోవడం మరింత సులువవుతుంది. బంగారు ఆభరణాలు ఒక వ్యాపారి నుంచి మరో వ్యాపారికి లేదా ఒక విక్రయ కేంద్రం నుంచి మరో కేంద్రానికి మారినప్పుడు వాటి ప్రత్యేక హెచ్‌యూఐడీని బీఐఎస్ వేదిక ద్వారా డిజిటల్ పద్ధతిలో బదిలీ చేసేందుకు ట్రాన్స్‌ఫర్ హెచ్‌యూఐడీ సదుపాయం వీలు కల్పిస్తుంది. 1 జూన్ 2026న అమల్లోకి వచ్చిన తొలి దశలో, కార్పొరేట్ ఆభరణాల సంస్థల మధ్య లేదా ఏ ఆభరణాల వ్యాపారి నుంచైనా కార్పొరేట్ సంస్థకు బంగారాన్ని తరలించినప్పుడు హెచ్‌యూఐడీని బదిలీ చేసే సదుపాయం ఉంది. ఒకే వస్తువుకు మళ్లీ హాల్‌మార్క్ వేయడం లేదా మోసపూరితంగా హాల్‌మార్క్ వేయడాన్ని నిరోధించేందుకు ఇది తోడ్పడుతుంది.

5. నిబంధనల అమలుపై పర్యవేక్షణ: ప్రత్యక్ష తనిఖీలు
బీఐఎస్ చేపట్టే ప్రత్యక్ష పర్యవేక్షణ, నిబంధనల అమలుపై తనిఖీలకు డిజిటల్ పర్యవేక్షణ తోడ్పడుతుంది. బీఐఎస్ క్రమం తప్పకుండా ఆభరణాల విక్రయ కేంద్రాలను సందర్శిస్తుంది. హాల్‌మార్క్ ఉన్న వస్తువుల్లో కొన్ని నమూనాలను యాదృచ్ఛికంగా తీసుకుని, అవి సంబంధిత భారత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో పరీక్షిస్తుంది. ఏహెచ్‌సీలు నిర్దేశించిన షరతులను పాటిస్తూనే ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు క్రమం తప్పకుండా ఆడిట్లు నిర్వహిస్తుంది.

హాల్‌మార్క్‌ల దుర్వినియోగంపై అందే ఫిర్యాదులు/సమాచారం ఆధారంగా బీఐఎస్ దాడులు సహా నిబంధనల అమలుకు పలు చర్యలు చేపడుతుంది. ఈ చర్యలు వినియోగదారులను రక్షించడానికి, హాల్‌మార్కింగ్ వ్యవస్థపై నమ్మకాన్ని పెంచడానికి తోడ్పడతాయి. ఇలాంటి ఉల్లంఘనలకు సంబంధించి 2025-26లో ఆభరణాల వ్యాపారులపై 30కి పైగా చర్యలు చేపట్టింది.

6. కొనుగోలుకు ముందే సరిచూసుకోండి: బీఐఎస్ కేర్ యాప్

 


బీఐఎస్ కేర్ యాప్ ద్వారా వినియోగదారులు హాల్‌మార్క్ ఉన్న బంగారు, వెండి ఆభరణాల వివరాలను డిజిటల్ పద్ధతిలో స్వయంగా సరిచూసుకోవచ్చు. హాల్‌మార్క్ ఉన్న వస్తువుకు కేటాయించిన ప్రత్యేక హెచ్‌యూఐడీ సంఖ్యను యాప్‌లో నమోదు చేసి దాని వివరాలను ధ్రువీకరించుకోవచ్చు.

వస్తువు స్వచ్ఛత, ఉత్పత్తి రకం, ఆభరణాల వ్యాపారి, స్వచ్ఛత పరీక్ష, హాల్‌మార్కింగ్ కేంద్రం వివరాలను యాప్ చూపిస్తుంది. 08 జూన్ 2026న డిజిటల్ సదుపాయాలను మెరుగుపరిచిన తర్వాత వస్తువు ఫొటో, దానిపై వేసిన హాల్‌మార్క్ ఫొటో, స్వయంచాలకంగా నమోదైన బరువు వివరాలను కూడా యాప్‌లో చూడవచ్చు. దీంతో కొనుగోలు పూర్తి చేసే ముందు వస్తువును అధికారిక రికార్డులతో పోల్చి చూసుకోవచ్చు. బీఐఎస్ కేర్ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లో ఉచితంగా అందుబాటులో ఉంది. ఇందులో 12 భాషలకు మద్దతు ఉంది.

డిజిటల్ రికార్డుల ద్వారా వస్తువుల జాడను తెలుసుకునే సదుపాయం, పరికరాల అనుసంధానం, ప్రత్యక్ష పర్యవేక్షణ కలిసి హాల్‌మార్కింగ్ వ్యవస్థలో అన్ని దశల్లో జవాబుదారీతనాన్ని పెంచుతున్నాయి.

హాల్‌మార్కింగ్: విస్తరిస్తున్న పరిధి, పెరుగుతున్న అవగాహన
నమోదైన ఆభరణాల వ్యాపారులు, స్వచ్ఛత పరీక్ష, హాల్‌మార్కింగ్ కేంద్రాల సంఖ్య పెరగడంతో బీఐఎస్ హాల్‌మార్కింగ్ పరిధిని విస్తరించింది. దీనితో పాటు వినియోగదారుల అవగాహన కార్యక్రమాలనూ చేపట్టింది.

2021లో బంగారు ఆభరణాలకు హాల్‌మార్కింగ్ తప్పనిసరి చేసినప్పటి నుంచి 15 అక్టోబర్ 2026 వరకు 65 కోట్లకు పైగా బంగారు వస్తువులపై హెచ్‌యూఐడీతో హాల్‌మార్క్ వేశారు. ఇదే కాలంలో బీఐఎస్ వద్ద నమోదై కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఆభరణాల వ్యాపారుల సంఖ్య 43,153 నుంచి 2,36,624కు పెరిగింది. గుర్తింపు పొందిన స్వచ్ఛత పరీక్ష, హాల్‌మార్కింగ్ కేంద్రాల (ఏహెచ్‌సీలు) సంఖ్య 948 నుంచి 1,565కు చేరింది.

స్వచ్ఛంద హాల్‌మార్కింగ్ పథకం కింద సమర్పించే వెండి వస్తువులకు 01 సెప్టెంబర్ 2025న హెచ్‌యూఐడీ ఆధారిత ముద్రను ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి 90 లక్షలకు పైగా వెండి వస్తువులపై హెచ్‌యూఐడీతో హాల్‌మార్క్ వేశారు.



వినియోగదారుల్లో అవగాహన పెంచడం ఈ ప్రయత్నంలో ముఖ్యమైన భాగం. 01 ఏప్రిల్ నుంచి 31 అక్టోబర్ 2026 వరకు బీఐఎస్ ప్రాంతీయ కార్యాలయాలు, శాఖ కార్యాలయాలు దేశవ్యాప్తంగా 1,582 వినియోగదారుల అవగాహన కార్యక్రమాలను నిర్వహించాయి. తప్పనిసరి ధ్రువీకరణ పరిధిలోని ప్రమాణాలపై అవగాహన, హాల్‌మార్కింగ్‌పై అవగాహన, గ్రామ పంచాయతీలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు తదితరాలు ఇందులో ఉన్నాయి.

మరింత నమ్మకం, పారదర్శకత దిశగా
విలువైన లోహాల స్వచ్ఛతను ధ్రువీకరించడం ద్వారా ఆభరణాలు కొనేటప్పుడు వినియోగదారులకు అవసరమైన భరోసాను హాల్‌మార్కింగ్ అందిస్తుంది. ఏళ్లుగా మరిన్ని ప్రాంతాలకు విస్తరించడం, సాంకేతికత వినియోగం, ఆభరణాల జాడను తెలుసుకునే మెరుగైన సదుపాయాలతో ఈ వ్యవస్థ బలోపేతమైంది. ప్రత్యేక గుర్తింపు కోడ్‌ల ద్వారా ఆభరణాల వివరాలను ధ్రువీకరించుకోవచ్చు. ప్రత్యక్ష పర్యవేక్షణ, నిబంధనల అమలుపై తనిఖీలు జవాబుదారీతనాన్ని పెంచుతున్నాయి. హాల్‌మార్క్ ఉన్న వస్తువులను గుర్తించి, కొనుగోలుపై సరైన నిర్ణయం తీసుకునేందుకు వినియోగదారుల అవగాహన కార్యక్రమాలు తోడ్పడుతున్నాయి. సాంకేతికతను ఉపయోగిస్తూ, పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచుతూ బీఐఎస్ ప్రతి హాల్‌మార్క్‌ను నమ్మకానికి గుర్తుగా నిలబెడుతోంది.

 

References

Ministry of Consumer Affairs, Food and Public Distribution

https://www.bis.gov.in/wp-content/uploads/2020/12/brief-on-Hallmarking.pdf

https://www.bis.gov.in/hallmarking-overview/?lang=en

https://www.bis.gov.in/case-studies/bis-hallmark-green-tests-for-yellow-metal/?utm_

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2239540&reg=48&lang=2

https://www.bis.gov.in/hallmarking-overview/hallmarking-faqs/hallmarking-faq/?lang=en

https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=1904262&reg=48&lang=2

https://www.bis.gov.in/wp-content/uploads/2026/07/GuidelinesForAHCs.pdf

https://www.bis.gov.in/wp-content/uploads/2026/06/Guidelines-for-recognition-operation-of-AHCs.pdf

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2088051&lang=2&reg=48

https://sansad.in/getFile/annex/271/AU2602_qHfqdj.pdf?source=pqars

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2211859&reg=48&lang=2

PIB Releases/Backgrounders

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1912343&reg=48&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2284432&lang=2&reg=48

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2207673&reg=3&lang=1

Click here to see pdf

***

(Explainer ID: 160729) आगंतुक पटल : 5
Provide suggestions / comments
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali , Kannada