Technology
గ్రీన్ హైడ్రోజన్
స్వచ్ఛ ఇంధనం వైపు భారత ప్రయాణానికి కొత్త బలం
Posted On:
02 NOV 2026 4:13PM
స్వచ్ఛ ఇంధనం వైపు భారత ప్రయాణంలో గ్రీన్ హైడ్రోజన్ కీలక పునాదిగా ఎదుగుతోంది. పునరుత్పాదక విద్యుత్తుతో నీటిని విడగొట్టి దీన్ని ఉత్పత్తి చేస్తారు. ఎరువుల ఉత్పత్తి, పెట్రోలియం శుద్ధి, ఇనుము, ఉక్కు తయారీ, భారీ వాహనాల రహదారి రవాణా, నౌకాయానం వంటి రంగాల్లో ఉద్గారాలను తగ్గించేందుకు ఇది సహాయపడగలదు. దేశీయ తయారీ, ఉత్పత్తి, డిమాండ్‌కు భరోసా, నమ్మకమైన ధ్రువీకరణకు నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ (ఎన్జీహెచ్ఎం) మద్దతు ఇస్తోంది. గ్రీన్ అమ్మోనియా వేలం నుంచి భారత తొలి హైడ్రోజన్ రైలు వరకు ప్రారంభ ప్రాజెక్టులు ఆశాజనక మార్గాన్ని సూచిస్తున్నాయి.
గ్రీన్ హైడ్రోజన్ ఎందుకు?
శక్తిని నిల్వ చేసి, వివిధ అవసరాలకు అందించే మాధ్యమం హైడ్రోజన్. ఫ్యూయల్ సెల్లో ఇది ఆక్సిజన్‌తో చర్య జరిపి విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. ఉప ఉత్పత్తులుగా నీరు, వేడి మాత్రమే వెలువడతాయి. కాలుష్యకారక సమ్మేళనాలు లేదా గ్రీన్‌హౌజ్ వాయువులు వెలువడవు. ప్రకృతిలో స్వచ్ఛమైన హైడ్రోజన్ పెద్ద పరిమాణంలో లభించనప్పటికీ, నీరు లేదా సహజవాయువు వంటి సమ్మేళనాల నుంచి దాన్ని వెలికితీయవచ్చు. అందువల్ల పర్యావరణంపై దీని ప్రభావం ఉత్పత్తి విధానంపై ఆధారపడి ఉంటుంది. సంప్రదాయ పద్ధతులు శిలాజ ఇంధనాలపై ఆధారపడుతూ కార్బన్ ఉద్గారాలను విడుదల చేస్తాయి.
సౌర, పవన వనరుల నుంచి లభించే పునరుత్పాదక విద్యుత్తుతో ఉత్పత్తి చేయడం ద్వారా ఈ కార్బన్ ఉద్గారాలను గణనీయంగా తగ్గించవచ్చు. పునరుత్పాదక విద్యుత్తుతో నీటిని విడగొట్టి తయారు చేసే హైడ్రోజన్‌ను గ్రీన్ హైడ్రోజన్ అంటారు. శిలాజ ఇంధన ఆధారిత విధానాలతో పోలిస్తే ఈ ప్రక్రియలో కార్బన్ ఉద్గారాలు చాలా తక్కువగా ఉంటాయి. భారత్‌లో సమృద్ధిగా ఉన్న సౌర, పవన వనరులు దేశీయ ఉత్పత్తిని సాధ్యం చేస్తాయి. దేశ ఇంధన వనరుల్లో వైవిధ్యాన్ని పెంచి, ఇంధన భద్రతను బలోపేతం చేస్తాయి. 2070 నాటికి నెట్ జీరో ఉద్గారాలను సాధించాలన్న భారత లక్ష్యానికి కూడా తోడ్పడతాయి.
ఉద్గారాలను తగ్గించడం కష్టమైన రంగాల్లో గ్రీన్ హైడ్రోజన్‌కు అత్యంత ప్రాధాన్యం ఉంది. అధిక ఉష్ణోగ్రతలు అవసరం కావడం, రసాయన ప్రక్రియలు, శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయాలు తక్కువగా ఉండటం ఇందుకు కారణాలు. ఎరువులు, పెట్రోలియం శుద్ధి, ఇనుము, ఉక్కు, భారీ వాహనాల రహదారి రవాణా, నౌకాయానం వంటి రంగాలు వీటిలో ఉన్నాయి. ఎరువుల కర్మాగారాలు, చమురు శుద్ధి కేంద్రాలు ఇప్పటికే హైడ్రోజన్‌ను ఉపయోగిస్తున్నాయి. అందువల్ల శిలాజ ఇంధన ఆధారిత హైడ్రోజన్ స్థానంలో గ్రీన్ హైడ్రోజన్‌ను వినియోగించవచ్చు. తక్కువ ఉద్గారాలతో ఉక్కు తయారీ, ఎంపిక చేసిన రవాణా అవసరాలు, ఇంధన నిల్వకు కూడా ఇది తోడ్పడగలదు. నేరుగా విద్యుత్తుతో నిర్వహించడం కష్టమైన లేదా అంత ఆచరణ సాధ్యం కాని అవసరాల్లో ఇది ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది.
భారత్‌లో దీని విస్తృత వినియోగం దిగుమతి చేసుకునే శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించగలదు. అంతర్జాతీయ ఇంధన ధరల హెచ్చుతగ్గుల ప్రభావాన్ని కూడా తగ్గించగలదు. తయారీ రంగంలో అవకాశాలు కల్పించడం, పెట్టుబడులను ఆకర్షించడం, ఉద్యోగాలను సృష్టించడం, ఎగుమతులను విస్తరించడం ఈ రంగం ద్వారా సాధ్యమవుతుంది. విలువ గొలుసు అంతటా సామర్థ్యాలను పెంచుకోవడం దేశీయ సరఫరా వ్యవస్థలను బలోపేతం చేసి, పారిశ్రామిక ఆవిష్కరణలకు ఊతమిస్తుంది. ఈ విధంగా స్వావలంబన, సుస్థిర పారిశ్రామిక వృద్ధి, తక్కువ కార్బన్ ఉద్గారాల భవిష్యత్తుకు గ్రీన్ హైడ్రోజన్ తోడ్పడగలదు.
హైడ్రోజన్‌ను “గ్రీన్”గా నిర్ధారించేది ఏమిటి?
హైడ్రోజన్‌ను ఉపయోగించినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ విడుదల కాదు. అందువల్ల వాతావరణంపై దీని ప్రభావం ఉత్పత్తి విధానంపై ఆధారపడి ఉంటుంది. నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ (ఎంఎన్ఆర్ఈ) 2023 ఆగస్టులో భారత గ్రీన్ హైడ్రోజన్ ప్రమాణాన్ని అధికారికంగా ప్రకటించింది. వెల్-టు-గేట్ ప్రాతిపదికన, 12 నెలల సగటుగా లెక్కించినప్పుడు ప్రతి కిలోగ్రాము హైడ్రోజన్‌కు ఉద్గారాలు 2 కిలోగ్రాముల కార్బన్ డైఆక్సైడ్ సమాన పరిమాణాన్ని మించకపోతే దాన్ని గ్రీన్ హైడ్రోజన్‌గా పరిగణిస్తారు. దీంతో గ్రీన్ హైడ్రోజన్‌ను అధికారికంగా నిర్వచించిన తొలి కొద్ది దేశాల్లో భారత్ ఒకటిగా నిలిచింది.

‘పెట్టుబడి పెట్టండి. ఆవిష్కరించండి. స్ఫూర్తి నింపండి.’ అనే ఇతివృత్తంతో 2026 నవంబర్ 2–5 తేదీల్లో న్యూఢిల్లీలోని భారత్ మండపంలో భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్ & ఎక్స్పో (భారత్ ఆర్ఈ) 2026 జరుగుతోంది. నాలుగు రోజుల ఈ సదస్సులో 130కిపైగా దేశాల నుంచి 40 మందికిపైగా మంత్రులు, విధాన రూపకర్తలు, పెట్టుబడిదారులు, ఆర్థిక సంస్థలు, పరిశ్రమల ప్రముఖులు పాల్గొంటున్నారు. దేశ భాగస్వాముల హోదాలో తొమ్మిది దేశాలు పాల్గొంటాయి - ఆస్ట్రేలియా, డెన్మార్క్, యూరోపియన్ యూనియన్, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, నార్వే, స్వీడన్, యునైటెడ్ కింగ్డమ్. భారత్‌లోని 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఈ సదస్సులో తమ పునరుత్పాదక ఇంధన సామర్థ్యం, పెట్టుబడి అవకాశాలు, స్వచ్ఛ తయారీ సామర్థ్యాలను ప్రదర్శిస్తున్నాయి. సౌర, పవన శక్తి, గ్రీన్ హైడ్రోజన్, శక్తి నిల్వ, గ్రిడ్ అనుసంధానం, దేశీయ తయారీ, ఇంధన రంగంలో డిజిటలీకరణ, కృత్రిమ మేధ వినియోగం సదస్సు ప్రధాన అంశాలు. స్వచ్ఛ ఇంధన రంగంలో పెట్టుబడులు, సాంకేతిక భాగస్వామ్యాలు, పరిశ్రమల మధ్య సహకారానికి ఈ సదస్సు అంతర్జాతీయ వేదికగా నిలుస్తోంది. ఇందులో మంత్రుల స్థాయి చర్చలు, సీఈఓల రౌండ్‌టేబుల్ సమావేశాలు, పెట్టుబడిదారులతో చర్చలు, 400కుపైగా ప్రదర్శకులు పాల్గొనే ప్రదర్శన ఉన్నాయి. 9వ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అసెంబ్లీ, 4వ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ గ్రీన్ హైడ్రోజన్‌తో పాటు ఈ కార్యక్రమం జరుగుతోంది. తద్వారా స్వచ్ఛ ఇంధన రంగంలో అంతర్జాతీయ సహకారం బలోపేతమవుతోంది.

గ్రీన్ హైడ్రోజన్‌ను ఎలా ఉత్పత్తి చేస్తారు?

ప్రధానంగా నీటి (హెచ్₂ఓ) ఎలక్ట్రోలిసిస్ ద్వారా గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేస్తారు. విద్యుత్తును ఉపయోగించి ఒక సమ్మేళనాన్ని సరళమైన పదార్థాలుగా విడగొట్టే ప్రక్రియే ఎలక్ట్రోలిసిస్. ఇక్కడ పునరుత్పాదక విద్యుత్తు కనిష్ఠ ఉద్గారాలతో నీటిని హైడ్రోజన్ (హెచ్₂), ఆక్సిజన్‌గా (ఓ₂) విడగొడుతుంది.
2హెచ్₂ఓ → 2హెచ్₂ + ఓ₂
ఈ ప్రక్రియలో కీలక పరికరం ఎలక్ట్రోలైజర్. ఇందులో విద్యుత్ వనరుతో అనుసంధానించిన క్యాథోడ్, యానోడ్ అనే రెండు ఎలక్ట్రోడ్లు ఉంటాయి. ఇవి ఎలక్ట్రోలైట్లో పనిచేస్తాయి. సెల్లో అయాన్ల కదలికకు ఎలక్ట్రోలైట్ తోడ్పడుతుంది. అయాన్లు వెళ్లేందుకు వీలు కల్పిస్తూనే డయాఫ్రం వాయువులను వేరుగా ఉంచుతుంది. విద్యుత్ ప్రవహించినప్పుడు క్యాథోడ్ వద్ద హైడ్రోజన్, యానోడ్ వద్ద ఆక్సిజన్ ఏర్పడతాయి. తదుపరి వినియోగం కోసం ఈ వాయువులను విడివిడిగా సేకరిస్తారు. ఈ విధంగా పునరుత్పాదక విద్యుత్తు, నీటిని పరిశ్రమలు, రవాణా, ఇతర అవసరాలకు ఉపయోగపడే తక్కువ ఉద్గారాల ఇంధనంగా ఎలక్ట్రోలైజర్ మారుస్తుంది.
మీకు తెలుసా? మలినాలు సెల్‌లను దెబ్బతీసి, వాటి జీవితకాలాన్ని తగ్గించగలవు కాబట్టి ఎలక్ట్రోలిసిస్కు ముందు నీటిని శుద్ధి చేస్తారు. ఎంఎన్ఆర్ఈ ప్రకారం.. ప్రతి కిలోగ్రాము హైడ్రోజన్‌కు ఖనిజాలను తొలగించిన నీరు దాదాపు తొమ్మిది లీటర్లు అవసరం. తర్వాత హైడ్రోజన్‌ను కుదించే ముందు తేమ తొలగించి, శుద్ధి చేస్తారు. ఈ ప్రతి దశలో వెలువడే ఉద్గారాలను భారత గ్రీన్ హైడ్రోజన్ స్టాండర్డ్ లెక్కలోకి తీసుకుంటుంది.

గ్రీన్ హైడ్రోజన్ వినియోగాలు
* ఎరువులు: నత్రజనితో తయారయ్యే అమ్మోనియా, యూరియా వంటి నత్రజని ఎరువులకు హైడ్రోజన్ ప్రధాన ముడిపదార్థం. ప్రస్తుతం ఈ హైడ్రోజన్‌లో అధిక భాగం సహజవాయువు నుంచి లభిస్తోంది. దాని స్థానంలో గ్రీన్ హైడ్రోజన్‌ను ఉపయోగించి, చాలా తక్కువ ఉద్గారాలతో గ్రీన్ అమ్మోనియాను ఉత్పత్తి చేయవచ్చు.
* పెట్రోలియం శుద్ధి కర్మాగారాలు: పెట్రోలు, డీజిల్ నుంచి సల్ఫర్‌ను తొలగించేందుకు చమురు శుద్ధి కర్మాగారాలు హైడ్రోజన్‌ను ఉపయోగిస్తాయి. దీంతో ఈ ఇంధనాలు మరింత స్వచ్ఛంగా మండుతాయి. భారీ చమురును డీజిల్, విమాన టర్బైన్ ఇంధనం, నాఫ్తా వంటి తేలికపాటి ఇంధనాలుగా మార్చేందుకు కూడా దీన్ని ఉపయోగిస్తాయి. ఈ ఇంధనాలు రహదారి రవాణా, విమానయానం, పరిశ్రమలకు ఉపయోగపడతాయి. చమురు శుద్ధి కేంద్రాల్లో ఉపయోగించే హైడ్రోజన్‌లో ఎక్కువ భాగం శిలాజ ఇంధనాల నుంచి లభిస్తోంది కాబట్టి, గ్రీన్ హైడ్రోజన్ సరఫరా శుద్ధి ప్రక్రియ ఉద్గారాలను తగ్గించగలదు.
* ఉక్కు: సంప్రదాయ ఉక్కు తయారీలో ఇనుప ఖనిజం నుంచి ఆక్సిజన్‌ను తొలగించేందుకు బొగ్గును ఉపయోగిస్తారు. ఈ ప్రక్రియలో కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది. డైరెక్ట్ రిడ్యూస్డ్ ఐరన్ పద్ధతుల్లో ఈ పనిని బొగ్గుకు బదులు గ్రీన్ హైడ్రోజన్ చేయగలదు. అప్పుడు ఆక్సిజన్‌ను తొలగించే దశలో కార్బన్ డైఆక్సైడ్‌కు బదులు నీటి ఆవిరి వెలువడుతుంది.
* పట్టణ గ్యాస్ నెట్‌వర్క్‌లు: భద్రతా ప్రమాణాలు, మౌలిక సదుపాయాల అనుకూలతకు లోబడి గ్రీన్ హైడ్రోజన్‌ను సహజవాయువుతో పరిమిత నిష్పత్తుల్లో కలపవచ్చు. దీంతో ఇప్పటికే ఉన్న గ్యాస్ నెట్‌వర్క్‌ల ద్వారా ఇళ్లు, వ్యాపార సంస్థలు, పరిశ్రమలకు హైడ్రోజన్-సహజవాయువు మిశ్రమాన్ని సరఫరా చేయవచ్చు. ప్రస్తుత పంపిణీ మౌలిక సదుపాయాలను వినియోగించుకుంటూనే శిలాజ ఇంధన వినియోగాన్ని, సంబంధిత ఉద్గారాలను ఈ మిశ్రమం తగ్గించగలదు.
* రహదారి, రైలు రవాణా: ఫ్యూయల్ సెల్ వాహనాలు తమలోనే హైడ్రోజన్‌ను విద్యుత్తుగా మార్చుకుంటాయి. ఆ విద్యుత్తుతో ఎలక్ట్రిక్ మోటార్లు పనిచేస్తాయి. వినియోగ సమయంలో వీటి నుంచి వెలువడే ఏకైక ఉద్గారం నీటి ఆవిరి. ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన, త్వరగా ఇంధనం నింపుకోవాల్సిన బస్సులు, ట్రక్కులు, రైళ్లకు ఇది అనువుగా ఉంటుంది.
మీకు తెలుసా?
భారత తొలి స్వదేశీ హైడ్రోజన్ ఆధారిత రైలును 2026 జులై 17న జింద్-సోనిపట్ సెక్షన్లో ప్రారంభించారు. 10 కోచ్‌లతో కూడిన ఈ రైలులో సుమారు 2,600 మంది ప్రయాణించవచ్చు. జింద్‌లోని ఒక కేంద్రం దాదాపు 3,000 కిలోగ్రాముల హైడ్రోజన్‌ను నిల్వ చేస్తుంది. ఈ రైలు నుంచి నీటి ఆవిరి, వేడి మాత్రమే వెలువడతాయి.

* నౌకాయానం: గ్రీన్ హైడ్రోజన్‌ను గ్రీన్ అమ్మోనియా, గ్రీన్ మిథనాల్‌గా మార్చి నౌకలకు ఇంధనంగా ఉపయోగించవచ్చు. సుదూర సముద్ర ప్రయాణాల్లో సంప్రదాయ నౌకా ఇంధనాలకు ఇవి ప్రత్యామ్నాయాలుగా పనిచేయగలవు. వీటి వినియోగం ఇంజిన్ల అనుకూలత, భద్రతా అవసరాలు, నౌకాశ్రయ మౌలిక సదుపాయాలపై ఆధారపడి ఉంటుంది.
* ఎగుమతులు: తక్కువ ఉద్గారాల ఇంధనాలను కోరుకునే దేశాలకు గ్రీన్ హైడ్రోజన్, దాని నుంచి తయారయ్యే గ్రీన్ అమ్మోనియా, గ్రీన్ మిథనాల్ వంటి ఉత్పత్తులను భారత్ సరఫరా చేయగలదు. భారత పునరుత్పాదక ఇంధన వనరులు ఈ సరఫరాకు తోడ్పడగలవు. ఎగుమతులు పారిశ్రామిక అవకాశాలను కల్పించి, తక్కువ ఉద్గారాల ఇంధనాల్లో భారత స్థానాన్ని బలోపేతం చేయగలవు.
ప్రభుత్వ విధానంలో సమన్వయం
వివిధ రంగాల్లో గ్రీన్ హైడ్రోజన్ వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వం సమగ్ర వ్యూహాన్ని అనుసరిస్తోంది. వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, ఏజెన్సీలు, సంస్థలతో సమన్వయం చేసుకుంటోంది. ప్రతి మంత్రిత్వ శాఖకు నిర్దిష్ట పాత్ర ఉంది. ఉదాహరణకు, పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ చమురు శుద్ధి కేంద్రాలు, పట్టణ గ్యాస్ పంపిణీలో వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది; రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ స్వదేశీ గ్రీన్ అమ్మోనియా ఆధారిత ఎరువులను ప్రోత్సహిస్తోంది; రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నిబంధనలు, ప్రమాణాలు, నియమావళుల ద్వారా రవాణా రంగంలో వినియోగానికి వీలు కల్పిస్తోంది; ఉక్కు మంత్రిత్వ శాఖ ఉక్కు తయారీలో వినియోగాన్ని ముందుకు తీసుకెళ్తోంది; విదేశాంగ మంత్రిత్వ శాఖ అంతర్జాతీయ భాగస్వాములతో సహకారానికి తోడ్పడుతోంది.
భారత గ్రీన్ హైడ్రోజన్ విధాన వ్యవస్థ
ఎన్జీహెచ్ఎం: మొత్తం వ్యవస్థకు తోడ్పడే మిషన్
గ్రీన్ హైడ్రోజన్, దాని నుంచి తయారయ్యే ఉత్పత్తులకు భారత్‌ను అంతర్జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఎంఎన్ఆర్ఈ ఎన్జీహెచ్ఎంను అమలు చేస్తోంది. కేంద్ర మంత్రివర్గం 2023 జనవరిలో రూ.19,744 కోట్ల వ్యయంతో ఈ మిషన్‌కు ఆమోదం తెలిపింది. 2030 నాటికి ఏటా కనీసం 5 మిలియన్ మెట్రిక్ టన్నుల (ఎంఎంటీ) ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించడం దీని లక్ష్యం. ఎగుమతుల డిమాండ్‌తో ఇది ఏటా 10 ఎంఎంటీకి చేరవచ్చు. ఈ మిషన్‌లో కింది విభాగాలు ఉన్నాయి.
సైట్: మార్కెట్‌కు ఇరువైపులా మద్దతు
స్ట్రాటజిక్ ఇంటర్వెన్షన్స్ ఫర్ గ్రీన్ హైడ్రోజన్ ట్రాన్సిషన్ (సైట్) కార్యక్రమం ఎన్జీహెచ్ఎంలో కీలక విభాగం. 2029-30 వరకు దీనికి రూ.17,490 కోట్ల వ్యయాన్ని నిర్దేశించారు. దేశీయ ఎలక్ట్రోలైజర్ల తయారీ, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి అనే రెండు అవసరాలకు ఇది ప్రోత్సాహకాలు అందిస్తుంది. ఈ రెండూ కలిసి స్వదేశీ సామర్థ్యాన్ని బలోపేతం చేసి, ఉత్పత్తిని వేగవంతం చేస్తాయి.
ప్రధాన పురోగతి
- మొత్తం ఏటా 3,000 మెగావాట్ల ఎలక్ట్రోలైజర్ల తయారీ సామర్థ్యం కోసం 15 కంపెనీలకు ప్రోత్సాహకాలను మంజూరు చేశారు. ఇది దిగుమతి సరఫరా వ్యవస్థలపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది.
- 2026 ఫిబ్రవరి నాటికి ఏటా సుమారు 8,000 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సామర్థ్యం అందుబాటులోకి వచ్చింది.
- ఏటా 8,62,000 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సామర్థ్యానికి ప్రోత్సాహకాలను మంజూరు చేశారు.
ప్రయోగాత్మక ప్రాజెక్టులు
ఉద్గారాలను తగ్గించడం కష్టమైన రంగాల్లో శిలాజ ఇంధనాలు, ముడిపదార్థాలకు ప్రత్యామ్నాయాలను ప్రవేశపెట్టే ప్రయోగాత్మక ప్రాజెక్టులకు ఎన్జీహెచ్ఎం మద్దతు ఇస్తోంది. ఉక్కు, భారీ వాహన రవాణా, నౌకాయానం వీటిలో ఉన్నాయి. సాంకేతికత, నియంత్రణలు, మౌలిక సదుపాయాల్లో లోటుపాట్లను గుర్తించడం ఈ ప్రాజెక్టుల లక్ష్యం. సరఫరా వ్యవస్థలు, సాంకేతికతల అనుసంధానాన్ని కూడా ఇవి పరీక్షిస్తాయి. వీటి ఫలితాలు వాణిజ్య స్థాయి అమలుకు, అవసరమైన విధాన మద్దతుకు మార్గనిర్దేశం చేస్తాయి. తక్కువ కార్బన్ ఉద్గారాల ఉక్కు తయారీకి 2029-30 వరకు మిషన్ రూ.455 కోట్లను ప్రత్యేకంగా కేటాయించింది. రవాణాకు రూ.496 కోట్లు, నౌకాయానానికి రూ.115 కోట్లను 2025-26 వరకు ప్రత్యేకంగా కేటాయించింది.
ప్రధాన పురోగతి
- ఉక్కు రంగంలో ఐదు ప్రయోగాత్మక ప్రాజెక్టులను మంజూరు చేశారు. 100% హైడ్రోజన్ ఇంజెక్షన్ పరీక్షలకు రూ.84 కోట్లను మంజూరు చేశారు.
- పన్నెండు ప్రాజెక్టుల ద్వారా 70 హైడ్రోజన్ వాహనాలను ప్రవేశపెట్టనున్నారు: 27 బస్సులు, 43 ట్రక్కులు. వీటిలో ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఎఫ్‌సీఈవీలు), హైడ్రోజన్ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ (హెచ్₂-ఐసీఈ) వాహనాలు ఉన్నాయి.
- ఈ ప్రాజెక్టులు 21 మార్గాల్లో 16 హైడ్రోజన్ ఇంధన నింపే కేంద్రాలను కూడా కలిగి ఉన్నాయి. రూ.41.58 కోట్ల ఆర్థిక సహాయాన్ని విడుదల చేశారు.
- గ్రీన్ మిథనాల్ కోసం బంకరింగ్, రీఫ్యూయలింగ్ సదుపాయాలను అభివృద్ధి చేసే ప్రయోగాత్మక ప్రాజెక్టును వీ.ఓ. చిదంబరనార్ పోర్ట్ అథారిటీ అప్పగించింది. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.38.12 కోట్లు. ఇందులో ఎంఎన్ఆర్ఈ గ్రాంటు రూ.35 కోట్లు.
గ్రీన్ హైడ్రోజన్ హబ్‌లు, హైడ్రోజన్ వ్యాలీ ఇన్నోవేషన్ క్లస్టర్లు (హెచ్వీఐసీ)
హైడ్రోజన్‌ను రవాణా చేయడం కష్టం. ఈ సమస్యను పరిష్కరించేందుకు మిషన్ హబ్‌లు, హెచ్వీఐసీలను ప్రోత్సహిస్తోంది. ఈ క్లస్టర్ విధానం ఉత్పత్తి, వినియోగం, మౌలిక సదుపాయాలను ఒకచోటకు తీసుకొస్తుంది. ప్రాజెక్టుల ఆచరణ సాధ్యతను మెరుగుపరిచి, పెద్ద స్థాయిలో పనిచేయడం ద్వారా ఖర్చులను తగ్గించుకునేందుకు వీలు కల్పిస్తుంది. నిర్దేశిత హబ్‌లలోని ప్రాజెక్టులు కేంద్ర, రాష్ట్ర పథకాల ప్రయోజనాలను కూడా పొందవచ్చు. హబ్‌లు, సంబంధిత ప్రాజెక్టుల కోసం 2025–26 వరకు మిషన్‌కు రూ.400 కోట్ల వ్యయాన్ని నిర్దేశించారు. గ్రీన్ పెట్టుబడులను ఆకర్షించడం, ఆవిష్కరణలను వేగవంతం చేయడం ఈ కార్యక్రమాల లక్ష్యం.
ప్రధాన పురోగతి
- దీన్‌దయాళ్ పోర్ట్ (కాండ్లా, గుజరాత్), వీ.ఓ. చిదంబరనార్ పోర్ట్ (ట్యుటికోరిన్, తమిళనాడు), పారాదీప్ పోర్ట్‌ను (ఒడిశా) ఎంఎన్ఆర్ఈ హబ్‌లుగా గుర్తించింది.
- దేశీయంగా నిర్మించిన 1 మెగావాట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ కాండ్లా పోర్టులో 2025 జులైలో కార్యకలాపాలు ప్రారంభించింది.
- జోధ్‌పూర్, ఒడిశా, పుణె, కేరళల్లో నాలుగు హెచ్వీఐసీలను మంజూరు చేశారు.
తోడ్పాటునిచ్చే విధాన వ్యవస్థ
గ్రీన్ హైడ్రోజన్‌ను అందుబాటు ధరల్లో అందించేందుకు ప్రభుత్వ వ్యవస్థ మొత్తం సమన్వయంతో పనిచేసే విధానాన్ని మిషన్ అనుసరిస్తోంది. ప్రయోజనాలు, ప్రాజెక్టులకు సహకారం విషయంలో ఎంఎన్ఆర్ఈ కేంద్ర, రాష్ట్ర విభాగాలతో సమన్వయం చేసుకుంటుంది. అంతర్రాష్ట్ర విద్యుత్ ప్రసార ఛార్జీల మినహాయింపు, పునరుత్పాదక విద్యుత్ బ్యాంకింగ్‌కు సౌలభ్యం కల్పించడం ప్రధాన చర్యల్లో ఉన్నాయి. నిర్ణీత గడువులో ఓపెన్ యాక్సెస్, గ్రిడ్ అనుసంధానం కూడా వీటిలో భాగం. పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యం, ప్రసారం, బ్యాంకింగ్, నిల్వకు సంబంధించిన ప్రణాళికలను ప్రభుత్వం సమన్వయం చేస్తుంది. సోలార్ పార్కులు, తయారీ మండలాలు, ప్రత్యేక ఆర్థిక మండలాలను (ఎస్ఈజెడ్లు) హైడ్రోజన్ కేంద్రాలకు కూడా విస్తరించవచ్చు. అంతర్జాతీయ గ్రీన్ ఫైనాన్స్, గ్రీన్ బాండ్లు, వినూత్న నిధుల సమీకరణ మార్గాలను కూడా మిషన్ పరిశీలిస్తుంది.
ప్రధాన పురోగతి
- 2030 డిసెంబర్ 31 నాటికి కార్యకలాపాలు ప్రారంభించే గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా ప్లాంట్లకు ఇంటర్-స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ (ఐఎస్టీఎస్) ఛార్జీల నుంచి 25 ఏళ్లపాటు మినహాయింపు ఉంటుంది. రాష్ట్రాల సరిహద్దులు దాటి విద్యుత్తును రవాణా చేసేందుకు వసూలు చేసే రుసుములే ఐఎస్టీఎస్ ఛార్జీలు. ఈ మినహాయింపు విద్యుత్ ఖర్చులను తగ్గిస్తుంది.
- పునరుత్పాదక విద్యుత్తును గ్రిడ్‌కు చేర్చే లైన్లు, సబ్స్టేషన్లకు గ్రీన్ ఎనర్జీ కారిడార్ స్కీమ్ మద్దతు ఇస్తుంది. జాతీయ విద్యుత్ ప్రసార ప్రణాళిక ఉత్పత్తి, వినియోగ కేంద్రాల మధ్య అనుసంధానాలను మెరుగుపరుస్తుంది.
- ప్రత్యేక ఆర్థిక మండలాల చట్టం-2005లోని సెక్షన్ 26 కింద సుంక ప్రయోజనాలను, పూర్తిగా సొంత వినియోగం కోసమే పునరుత్పాదక ఇంధన పరికరాలను ఏర్పాటు చేసి నిర్వహించే అర్హతగల యూనిట్లకు విస్తరించారు. తమ విద్యుత్ అవసరాలను తీర్చుకునేందుకు ఎస్ఈజెడ్లలో పునరుత్పాదక ఇంధన సదుపాయాలను ఏర్పాటు చేసే ఖర్చును ఇది తగ్గించగలదు.
- పునరుత్పాదక విద్యుత్తుతో నీటి ఎలక్ట్రోలిసిస్ ద్వారా గ్రీన్ హైడ్రోజన్ లేదా గ్రీన్ అమ్మోనియాను ఉత్పత్తి చేసే స్వతంత్ర ప్లాంట్లకు పర్యావరణ ప్రభావ మదింపు నోటిఫికేషన్, 2006 కింద ముందస్తు పర్యావరణ అనుమతి నుంచి మినహాయింపు ఇచ్చారు. అర్హతగల ప్రాజెక్టుల ఆమోద ప్రక్రియను ఇది సులభతరం చేయగలదు.
- ప్రత్యేక ఆర్థిక కేంద్రం (ఎస్ఈజెడ్) లేదా ఎక్స్పోర్ట్ ఓరియెంటెడ్ యూనిట్ (ఈఓయూ) పరిధిలో ఉన్న పునరుత్పాదక ఇంధన ప్లాంట్లు, గ్రీన్ హైడ్రోజన్ లేదా దాని నుంచి తయారయ్యే ఉత్పత్తుల ప్లాంట్లకు మాత్రమే విద్యుత్తును సరఫరా చేస్తే, అప్రూవ్డ్ లిస్ట్ ఆఫ్ మోడల్స్ అండ్ మ్యానుఫ్యాక్చరర్స్ (ఏఎల్ఎంఎం), రివైజ్డ్ లిస్ట్ ఆఫ్ మోడల్స్ అండ్ మ్యానుఫ్యాక్చరర్స్ (ఆర్ఎల్ఎంఎం) నిబంధనల నుంచి మినహాయింపు పొందుతాయి. వర్తించే మినహాయింపు షరతులకు లోబడి, పునరుత్పాదక ఇంధన పరికరాల సేకరణలో అర్హతగల ప్రాజెక్టులకు ఇది ఎక్కువ వెసులుబాటు కల్పిస్తుంది.
- వర్తించే నిబంధనలకు లోబడి 15 రోజుల్లో ఓపెన్ యాక్సెస్, మిగులు పునరుత్పాదక విద్యుత్తును 30 రోజుల వరకు బ్యాంకింగ్ చేసుకునే సౌలభ్యాన్ని గ్రీన్ హైడ్రోజన్ అండ్ గ్రీన్ అమ్మోనియా పాలసీ కల్పిస్తుంది. స్థానిక పంపిణీ సంస్థకు బదులు ఇతర వనరుల నుంచి పునరుత్పాదక విద్యుత్తును కొనుగోలు చేసేందుకు ఓపెన్ యాక్సెస్ ఉత్పత్తిదారులకు వీలు కల్పిస్తుంది. మిగులు విద్యుత్తును క్రెడిట్‌గా జమ చేసుకొని, వర్తించే నియంత్రణలకు లోబడి తర్వాత వినియోగించుకోవడమే బ్యాంకింగ్.
నియంత్రణలు, ప్రమాణాలు
పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నియంత్రణలు, ప్రమాణాలను మిషన్ రూపొందిస్తోంది. రంగం వృద్ధికి వీలు కల్పించడం, అంతర్జాతీయ నిబంధనలతో సమన్వయం సాధించడం దీని లక్ష్యం.
ప్రధాన పురోగతి
- భారత గ్రీన్ హైడ్రోజన్ ప్రమాణాన్ని అధికారికంగా ప్రకటించారు. వెల్-టు-గేట్ ప్రాతిపదికన, 12 నెలల సగటుగా ప్రతి కిలోగ్రాము హైడ్రోజన్‌కు గరిష్ఠంగా 2 కిలోగ్రాముల సీఓ₂ సమాన ఉద్గారాల పరిమితిని ఇది నిర్దేశిస్తుంది. దీంతో ఉమ్మడి ప్రమాణం ఏర్పడింది.
- ప్రమాణాలకు సంబంధించిన పరీక్షా కేంద్రాలు, మౌలిక సదుపాయాలు, సంస్థాగత మద్దతుకు నిధులు అందించేందుకు పథకం మార్గదర్శకాలను విడుదల చేశారు.
- గ్రీన్ అమ్మోనియా, గ్రీన్ మిథనాల్ ప్రమాణాలను అధికారికంగా ప్రకటించారు. ఉద్గారాల పరిమితులు, అర్హత షరతులను నిర్దేశిస్తూ ఉత్పత్తి, వాణిజ్యానికి ఇవి తోడ్పడతాయి.
- ఎంఎన్ఆర్ఈ 2025 ఏప్రిల్‌లో గ్రీన్ హైడ్రోజన్ సర్టిఫికేషన్ స్కీమ్ ఆఫ్ ఇండియాను ప్రారంభించింది. పర్యవేక్షణ, నిర్ధారణ, ధ్రువీకరణ కోసం సంస్థలకు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) గుర్తింపు ఇస్తుంది.
- పారదర్శక ధ్రువీకరణ, నిబంధనల పాటింపు కోసం 2026 జూన్‌లో ప్రత్యేక పోర్టల్ అందుబాటులోకి వచ్చింది. నమ్మకమైన ధ్రువీకరణ భారత ఉత్పత్తిదారులు అంతర్జాతీయంగా విశ్వాసంతో పోటీపడేందుకు తోడ్పడుతుంది.
పరిశోధన, అభివృద్ధి
గ్రీన్ హైడ్రోజన్‌ను మరింత చౌకగా, సమర్థంగా, సురక్షితంగా, నమ్మకంగా అందించేందుకు పరిశోధన, అభివృద్ధికి (ఆర్&డీ) మిషన్ మద్దతు ఇస్తోంది. స్ట్రాటజిక్ హైడ్రోజన్ ఇన్నోవేషన్ పార్ట్నర్షిప్ (షిప్) ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య వ్యవస్థ. పరిశ్రమలు, ప్రభుత్వం నుంచి దీనికి ప్రత్యేక ఆర్&డీ నిధి ఉంది. రూ.400 కోట్ల వ్యయంతో ఆర్&డీ పథకం మార్గదర్శకాలను 2024 మార్చిలో అధికారికంగా ప్రకటించారు. 2026 జూన్ నాటికి రూ.113 కోట్ల విలువైన ప్రారంభ ఆర్&డీ రోడ్‌మ్యాప్, హైడ్రోజన్ ఉత్పత్తి, నిల్వ, భద్రతా సాంకేతికతల్లో ఆమోదించిన ప్రాజెక్టులకు మద్దతు ఇస్తోంది.
నైపుణ్యాభివృద్ధి
సమన్వయంతో కూడిన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం కొనసాగుతోంది. 2030 నాటికి విలువ గొలుసు అంతటా 6 లక్షలకుపైగా ఉద్యోగాలను సృష్టించడం మిషన్ లక్ష్యం. ఇప్పటివరకు మొత్తం 14 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో హైడ్రోజన్ సంబంధిత అర్హతల్లో 8,149 మంది అభ్యర్థులకు శిక్షణ ఇవ్వగా, 7,248 మందికి ధ్రువపత్రాలు అందించారు. ఎలక్ట్రోలైజర్లకు పునరుత్పాదక విద్యుత్తు, ఎలక్ట్రోలిసిస్, నిల్వ, రవాణా, భద్రతా ప్రమాణాలు, ఉక్కు, రవాణా, చమురు శుద్ధి వంటి తుది వినియోగాలను శిక్షణ కవర్ చేస్తుంది. ఆవిష్కరణల కోసం గ్రీన్ హైడ్రోజన్ సాంకేతికతలపై పనిచేసే స్టార్టప్‌లకు రూ.100 కోట్లను కేటాయించారు. మొత్తం రూ.22 కోట్ల నిధులతో తొలి తొమ్మిది స్టార్టప్‌లకు ఆమోదం తెలిపారు.
అంతర్జాతీయ సహకారం
సాంకేతిక అభివృద్ధి, పెట్టుబడుల సమీకరణ, ఎగుమతి మార్కెట్ల నిర్మాణం, ప్రమాణాల సమన్వయం కోసం భాగస్వామ్యాలను మిషన్ ప్రోత్సహిస్తోంది.
ప్రధాన పురోగతి
- ఎంఎన్ఆర్ఈ నేరుగా లేదా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ ద్వారా అవగాహన ఒప్పందాలు, ఉద్దేశపత్రాలు లేదా సంయుక్త ఉద్దేశ ప్రకటనలపై సంతకాలు చేసింది. ఆస్ట్రేలియా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, సౌదీ అరేబియా, యూఏఈ, ఉజ్బెకిస్తాన్ భాగస్వామ్య దేశాలు.
- నెదర్లాండ్స్‌తో పునరుత్పాదక ఇంధనంపై అవగాహన ఒప్పందం కుదిరింది.
- స్ట్రాటజిక్ క్లీన్ ఎనర్జీ పార్ట్నర్షిప్ కింద ఇండియా-యూఎస్ హైడ్రోజన్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు.
- ఇండియా-యూఎస్ న్యూ అండ్ ఎమర్జింగ్ రెన్యూవబుల్ ఎనర్జీ టెక్నాలజీ యాక్షన్ ప్లాట్ఫామ్లో (ఆర్ఈటీఏపీ) గ్రీన్ హైడ్రోజన్ ప్రధాన ప్రాధాన్య అంశంగా ఉంది.
రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు
నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌కు తోడ్పడుతూ ఆరు రాష్ట్రాలు ప్రత్యేక గ్రీన్ హైడ్రోజన్ విధానాలను అధికారికంగా ప్రకటించాయి. గుజరాత్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ ఈ ప్రత్యేక విధానాలను ప్రకటించిన రాష్ట్రాలు.
మరో నాలుగు రాష్ట్రాలు తమ ప్రత్యేక గ్రీన్ హైడ్రోజన్ విధానాలకు తుది రూపం ఇస్తున్నాయి. హరియాణా, పంజాబ్, బిహార్, కేరళం ముసాయిదా విధానాలపై పనిచేస్తున్నాయి.
ఏడు రాష్ట్రాలు తమ ప్రస్తుత పారిశ్రామిక, పునరుత్పాదక ఇంధన విధానాల్లో హైడ్రోజన్‌ను చేర్చాయి. వీటిలో హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ ఉన్నాయి.
భవిష్యత్ మార్గం
మరింత స్వచ్ఛమైన, స్వావలంబనతో కూడిన, అంతర్జాతీయంగా పోటీపడగల ఇంధన ఆర్థిక వ్యవస్థ నిర్మాణంలో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ముఖ్యమైన ముందడుగు. 2030 నాటికి ఏటా 5 మిలియన్ మెట్రిక్ టన్నుల (ఎంఎంటీ) గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని అభివృద్ధి చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మార్పు దిగుమతి చేసుకునే శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించి, దేశ దీర్ఘకాలిక ఇంధన భద్రతను బలోపేతం చేయగలదు. 2030 నాటికి శిలాజ ఇంధన దిగుమతులను మొత్తం సుమారు రూ.1 లక్ష కోట్ల మేర మిషన్ తగ్గిస్తుందని అంచనా.
ఇంధన భద్రతతోపాటు పారిశ్రామిక వృద్ధి, పెట్టుబడులు, ఉపాధికి కొత్త అవకాశాలను సృష్టించాలని మిషన్ లక్ష్యంగా పెట్టుకుంది. రూ.8 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులను సమీకరించి, తయారీ, మౌలిక సదుపాయాలు, పరిశోధన, ప్రాజెక్టుల అభివృద్ధిలో 6 లక్షలకుపైగా ఉద్యోగాలను సృష్టిస్తుందని అంచనా. లక్ష్యంగా పెట్టుకున్న పరిమాణంలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, వినియోగం ద్వారా ఏటా దాదాపు 50 ఎంఎంటీ కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను నివారించేందుకు కూడా వీలు కలగవచ్చు. ఈ ప్రయత్నాల ద్వారా పారిశ్రామిక కార్బన్ ఉద్గారాల తగ్గింపును వేగవంతం చేయడం, దేశీయ తయారీని బలోపేతం చేయడం, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, వినియోగం, ఎగుమతులకు భారత్‌ను అంతర్జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దడం ప్రభుత్వ లక్ష్యం. 2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలన్న విస్తృత దార్శనికతకు, 2070 నాటికి నెట్ జీరో ఉద్గారాలను సాధించాలన్న భారత నిబద్ధతకు ఇది తోడ్పడుతుంది.
References
Cabinet
Ministry of New and Renewable Energy (MNRE)
Ministry of Chemicals and Fertilisers
Ministry of Ports, Shipping and Waterways
Ministry of Railways
Ministry of Power
Ministry of Petroleum and Natural Gas (HPCL)
Ministry of Science and Technology (CSIR)
Parliament of India
Press Information Bureau (PIB)
Other sources
Click to see pdf
***
(Explainer ID: 160712)
आगंतुक पटल : 3
Provide suggestions / comments