Energy & Environment

భారత్‌లో జీవావ‌ర‌ణ‌ రిజర్వ్‌లు

అంతర్జాతీయ జీవావ‌ర‌ణ‌ రిజర్వ్‌ల దినోత్సవం

Posted On: 02 NOV 2026 7:07PM

జీవవైవిధ్యాన్ని కాపాడుతూనే మానవ జీవనోపాధులను నిలబెట్టడంలో ప్రకృతి కేంద్రాల‌ కీలక పాత్రను జీవావ‌ర‌ణ‌ రిజర్వ్‌ల అంతర్జాతీయ దినోత్సవం గుర్తుచేస్తుంది. భారత్‌లో అధికారికంగా ప్రకటించిన 18 జీవావ‌ర‌ణ‌ రిజర్వ్‌లు పశ్చిమ కనుమల నుంచి ఎత్తైన ప్రాంతాల్లోని ఎడారులు, సముద్ర ఆవాసాల వరకు విభిన్న పర్యావరణ వ్యవస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. వీటిలో 13 రిజర్వ్‌లకు యునెస్కో గుర్తింపు ఉంది. శాస్త్రీయ పరిశోధన, ప్రజల భాగస్వామ్యం, ప్రభుత్వ కార్యక్రమాలు వీటి సంరక్షణ ప్రయత్నాలకు తోడ్పడుతున్నాయి. పర్యావరణ పరిరక్షణ, మానవ సంక్షేమం కలిసి ఎలా కొనసాగగలవో ఇవి చూపిస్తున్నాయి.

 

జీవవైవిధ్య సంరక్షణ, సుస్థిరాభివృద్ధి మధ్య సమతుల్యత

భూభాగం, సముద్రం, ఇతర జల పర్యావరణ వ్యవస్థల్లోని జీవుల వైవిధ్యాన్ని జీవవైవిధ్యం అంటారు. కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ (సీబీడీ) ఈ వైవిధ్యంలో మూడు స్థాయిలను గుర్తిస్తుంది. ఒకే జాతిలోని తేడాలను జన్యు వైవిధ్యం అంటారు. వివిధ వరి రకాలు దీనికి ఉదాహరణ. ఒక అడవిలోని పులులు, ఏనుగులు, ఆర్కిడ్ మొక్కలు వంటి వేర్వేరు జాతుల పరిధిని జాతుల వైవిధ్యం సూచిస్తుంది. అడవులు, గడ్డి మైదానాలు, చిత్తడి నేలలు, పగడపు దిబ్బలు వంటి విభిన్న సహజ ఆవాసాలను పర్యావరణ వ్యవస్థల వైవిధ్యం కవర్ చేస్తుంది. ఈ స్థాయిలన్నీ కలిసి పర్యావరణ ప్రక్రియలను కొనసాగిస్తూ, భూమిపై జీవానికి తోడ్పడతాయి.

 

జీవవైవిధ్యాన్ని సంరక్షించేందుకు, సుస్థిరాభివృద్ధిని ప్రోత్సహించేందుకు జాతీయ ప్రభుత్వాలు గుర్తించిన ప్రాంతాలే బయోస్ఫియర్ రిజర్వ్‌లు. ఇవి సహజ ఆవాసాలను కాపాడతాయి, పర్యావరణ సమతుల్యతను కొనసాగిస్తాయి, జీవ వనరుల సుస్థిర వినియోగాన్ని ప్రోత్సహిస్తాయి. వీటి సంరక్షణ ఆహార భద్రత, నీటి లభ్యత, వాతావరణ మార్పులను తట్టుకునే సామర్థ్యం, స్థానిక ప్రజల జీవనోపాధులకు దోహదం చేస్తుంది. భవిష్యత్ తరాల ప్రయోజనాల కోసం సహజ వనరులను కూడా కాపాడుతుంది.

 

వీటి అంతర్జాతీయ ప్రాధాన్యాన్ని గుర్తిస్తూ ఏటా నవంబర్ 3న బయోస్ఫియర్ రిజర్వ్‌ల అంతర్జాతీయ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. యునెస్కో ప్రకటించిన ఈ దినోత్సవం జీవవైవిధ్య సంరక్షణ, సుస్థిరాభివృద్ధికి ఈ రిజర్వ్‌లు అందించే తోడ్పాటును ప్రముఖంగా తెలియజేస్తుంది. పర్యావరణ పరిరక్షణను మానవ సంక్షేమంతో అనుసంధానించడంలో వీటి పాత్రపై అవగాహన కల్పిస్తుంది.

 

భారత్‌కు ఈ దినోత్సవం తన సమృద్ధమైన సహజ వారసత్వాన్ని కాపాడాలన్న నిబద్ధతకు ప్రతిబింబం. ప్రపంచంలోని అత్యధిక జీవవైవిధ్యం గల 17 దేశాల్లో భారత్ ఒకటి. ప్రపంచ భూభాగంలో భారత్ వాటా కేవలం 2.4% అయినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా నమోదైన జాతుల్లో సుమారు 7–8% ఇక్కడ ఉన్నాయి. బయోస్ఫియర్ రిజర్వ్‌ల నెట్‌వర్క్ ద్వారా పర్యావరణ వ్యవస్థలు సవాళ్లను తట్టుకునే సామర్థ్యాన్ని బలోపేతం చేయడం, సుస్థిర జీవనోపాధులను ప్రోత్సహించడం భారత్ లక్ష్యం. సంరక్షణ ప్రాధాన్యాలు, స్థానిక ప్రజల అభివృద్ధి అవసరాల మధ్య సమతుల్యత సాధించాలన్న దేశ నిబద్ధతను ఈ ప్రయత్నాలు ప్రతిబింబిస్తున్నాయి.

 

జీవావ‌ర‌ణ‌ రిజర్వ్‌లు: భావనను అర్థం చేసుకుందాం

జీవవైవిధ్య సంరక్షణకు సహజ పర్యావరణ వ్యవస్థలతోపాటు వాటిపై ఆధారపడిన ప్రజలను కూడా పరిగణనలోకి తీసుకునే విధానం అవసరం. శాస్త్రీయ పరిశోధన, బాధ్యతాయుత వనరుల నిర్వహణ, వివిధ వర్గాల మధ్య సహకారం కూడా అవసరం. ఈ లక్ష్యాలను సమన్వయం చేసేందుకు అంతర్జాతీయ గుర్తింపు పొందిన వ్యవస్థను బయోస్ఫియర్ రిజర్వ్‌లు అందిస్తాయి.

 

1971లో ప్రారంభించిన యునెస్కో మ్యాన్ అండ్ ది బయోస్ఫియర్ (ఎంఏబీ) ప్రోగ్రామ్, ప్రజలు, వారి పర్యావరణం మధ్య సంబంధాలను మెరుగుపరిచే శాస్త్రీయ విధానాలను ప్రోత్సహిస్తుంది. సుస్థిరాభివృద్ధి పద్ధతులను పరీక్షించి, ప్రదర్శించే సజీవ ప్రయోగశాలలుగా బయోస్ఫియర్ రిజర్వ్‌లు పనిచేస్తాయి. ప్రకృతితో సామరస్యంగా జీవిస్తూనే జీవనోపాధులను కొనసాగించేందుకు స్థానిక ప్రజలకు తోడ్పడతాయి.

 

ఇతర రక్షిత ప్రాంతాలతో జీవావ‌ర‌ణ‌ రిజర్వ్‌లకు తేడా ఏమిటి?

జాతీయ ఉద్యానవనాలు, వన్యప్రాణి అభయారణ్యాల వంటి రక్షిత ప్రాంతాలు భారత వన్యప్రాణి పరిరక్షణ చట్టాల కింద ప్రధానంగా వన్యప్రాణులు, వాటి ఆవాసాల రక్షణపై దృష్టి సారిస్తాయి. బయోస్ఫియర్ రిజర్వ్‌లు మరింత విస్తృత విధానాన్ని అనుసరిస్తాయి. రక్షిత పర్యావరణ వ్యవస్థలను చుట్టుపక్కల ప్రజలతో అనుసంధానిస్తాయి. తద్వారా జీవవైవిధ్యం, మానవ సంక్షేమం కలిసి ఎలా కొనసాగగలవో చూపించే నమూనాగా పనిచేస్తాయి.

 

జీవావ‌ర‌ణ‌ రిజర్వ్‌ల విధులు

బయోస్ఫియర్ రిజర్వ్‌లు 3 ప్రధాన విధులను నిర్వహిస్తాయి:

- సంరక్షణ: అనుబంధ సాంస్కృతిక వైవిధ్యంతోపాటు జీవవైవిధ్యం, జన్యు వనరులు, పర్యావరణ వ్యవస్థలు, సహజ ప్రాంతాలను కాపాడటం.

- సుస్థిర ఆర్థికాభివృద్ధి: పర్యావరణ పరిమితులు, స్థానిక సాంస్కృతిక విలువలను గౌరవించే ఆర్థిక, సామాజిక కార్యకలాపాలను ప్రోత్సహించడం.

- శాస్త్రీయ తోడ్పాటు: సంరక్షణ పద్ధతులను మెరుగుపరిచేందుకు శాస్త్రీయ పరిశోధన, పర్యావరణ పర్యవేక్షణ, విద్య, శిక్షణ, జ్ఞాన మార్పిడికి మద్దతు ఇవ్వడం.

 

పరస్పరం అనుసంధానమైన మూడు ప్రాంతాలు

వివిధ స్థాయిల రక్షణ, మానవ కార్యకలాపాల మధ్య సమతుల్యతను సాధించే ప్రాంత విభజన నమూనాను బయోస్ఫియర్ రిజర్వ్‌లు అనుసరిస్తాయి. ప్రతి ప్రాంతం ప్రత్యేక ప్రయోజనాన్ని నెరవేరుస్తూనే, రిజర్వ్ మొత్తం లక్ష్యాలకు తోడ్పడుతుంది.

- కోర్ ప్రాంతం: పర్యావరణ వ్యవస్థలు, జీవవైవిధ్యానికి అత్యున్నత స్థాయి రక్షణను అందిస్తుంది. ముఖ్యమైన పర్యావరణ ప్రక్రియలను కొనసాగిస్తూనే ఆవాసాలు, జాతులు, జన్యు వైవిధ్యాన్ని సంరక్షిస్తుంది. మానవ కార్యకలాపాలను కఠినంగా పరిమితం చేస్తారు. సంరక్షణకు అనుకూలమైన పరిశోధన, పర్యవేక్షణ దీర్ఘకాలిక పరిరక్షణకు తోడ్పడతాయి.

- బఫర్ జోన్: కోర్ ప్రాంతం చుట్టూ లేదా దానికి ఆనుకొని ఉంటుంది. పర్యావరణ విద్య, శాస్త్రీయ పరిశోధన, నియంత్రిత పర్యావరణ పర్యాటకం వంటి సంరక్షణకు అనుకూలమైన కార్యకలాపాలకు వీలు కల్పిస్తుంది. పర్యావరణంపై అవగాహనను మెరుగుపరుస్తూనే కఠిన రక్షణలో ఉన్న ప్రాంతాలపై ఒత్తిడిని తగ్గించేందుకు ఈ కార్యకలాపాలు సహాయపడతాయి.

- ట్రాన్సిషన్ ప్రాంతం: నివాసాలు, జీవనోపాధులు, సుస్థిర ఆర్థిక కార్యకలాపాలకు తోడ్పడుతుంది. స్థానిక ప్రజలు బాధ్యతాయుత వ్యవసాయం, సుస్థిర అటవీ నిర్వహణ, పర్యావరణ పర్యాటకం, స్థానిక పరిస్థితులకు తగిన ఇతర కార్యకలాపాలను చేపట్టవచ్చు. సహజ వనరుల సుస్థిర వినియోగాన్ని ప్రోత్సహిస్తూనే ఈ ప్రాంతం జీవనోపాధులకు మద్దతు ఇస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా బయోస్ఫియర్ రిజర్వ్‌లలో సగటున 18% కోర్ ప్రాంతాలు, 30% బఫర్ జోన్‌లు, 52% ట్రాన్సిషన్ ప్రాంతాలు ఉన్నాయి. కఠిన రక్షణ, సుస్థిరాభివృద్ధి మధ్య సమతుల్యతను సాధించే వీటి సమగ్ర సంరక్షణ విధానాన్ని ఈ విభజన ప్రతిబింబిస్తుంది.

 

మీకు తెలుసా?

యునెస్కో బయోస్ఫియర్ రిజర్వ్‌ల నెట్‌వర్క్‌లో 145 దేశాల్లోని 797 రిజర్వ్‌లు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో నివసించే సుమారు 300 మిలియన్ల మందికి ఇవి నేరుగా ప్రయోజనం అందిస్తున్నాయి. వీటి పర్యావరణ ప్రాధాన్యం భౌగోళిక పరిధిని మించి విస్తరించి ఉంది. ప్రపంచ భూభాగంలో సుమారు 5% విస్తీర్ణాన్ని బయోస్ఫియర్ రిజర్వ్‌లు కవర్ చేస్తున్నప్పటికీ, నేలపై నివసించే వెన్నెముక గల జంతు జాతుల ప్రపంచ వైవిధ్యంలో 60%కుపైగా మనుగడకు తోడ్పడుతున్నాయి. వరల్డ్ నెట్‌వర్క్ ఆఫ్ బయోస్ఫియర్ రిజర్వ్స్ 2025-26 పటం ప్రకారం.. 2050 నాటికి సుమారు 40% బయోస్ఫియర్ రిజర్వ్‌లు మరింత తీవ్రమైన వాతావరణ ఘటనలను ఎదుర్కొనే అవకాశం ఉంది. మొత్తం రిజర్వ్‌లలో 50%కుపైగా రిజర్వ్‌ల పరిధిలో మరో అంతర్జాతీయ గుర్తింపు ఉన్న ప్రాంతాలు కూడా ఉన్నాయి.

 

భారత బయోస్ఫియర్ రిజర్వ్‌లు

జీవవైవిధ్య సంరక్షణ, సుస్థిర పర్యావరణ పద్ధతుల అభివృద్ధిపై తన నిబద్ధతను చాటుతూ, బయోస్ఫియర్ రిజర్వ్‌ల ప్రోత్సాహం, నిర్వహణలో భారత్ ముందంజలో ఉంది.

 

భారత బయోస్ఫియర్ రిజర్వ్‌ల నెట్‌వర్క్

భారత బయోస్ఫియర్ రిజర్వ్‌ల నెట్‌వర్క్ దేశంలోని విభిన్న పర్యావరణ వ్యవస్థలు, వైవిధ్యమైన పర్యావరణ వారసత్వానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (ఎంఓఈఎఫ్‌సీసీ) ప్రకారం, దేశంలో అధికారికంగా ప్రకటించిన 18 బయోస్ఫియర్ రిజర్వ్‌లు ఉన్నాయి. వీటిలో 13 యునెస్కో వరల్డ్ నెట్‌వర్క్ ఆఫ్ బయోస్ఫియర్ రిజర్వ్స్‌లో ఉన్నాయి. దక్షిణాసియాలో అంతర్జాతీయ గుర్తింపు పొందిన బయోస్ఫియర్ రిజర్వ్‌లు అత్యధికంగా ఉన్న దేశం భారత్.

 

క్రమ సంఖ్య

బయోస్ఫియర్ రిజర్వ్ పేరు

గుర్తించిన సంవత్సరం

డబ్ల్యూఎన్‌బీఆర్‌లో చేర్చిన సంవత్సరం

రాష్ట్రాలు

విస్తీర్ణం (చ.కి.మీ.)

1

నీలగిరి*

1986

2000

తమిళనాడు, కేరళ, కర్ణాటక

5,520

2

నందాదేవి*

1988

2004

ఉత్తరాఖండ్

6,407.03

3

నోక్రెక్*

1988

2009

మేఘాలయ

820

4

గల్ఫ్ ఆఫ్ మన్నార్*

1989

2001

తమిళనాడు

10,500

5

సుందర్‌బన్స్*

1989

2001

పశ్చిమ బెంగాల్

9,630

6

మానస్

1989

—

అసోం

2,837

7

గ్రేట్ నికోబార్*

1989

2013

అండమాన్, నికోబార్ దీవులు

885

8

సిమిలిపాల్*

1994

2009

ఒడిశా

5,569

9

దిబ్రూ-సైఖోవా

1997

—

అసోం

765

10

దేహాంగ్-దిబాంగ్

1998

—

అరుణాచల్ ప్రదేశ్

5,111.50

11

పచ్‌మఢీ*

1999

2009

మధ్యప్రదేశ్

4,981.72

12

ఖాంగ్‌చెండ్జోంగా*

2000

2018

సిక్కిం

2,931.12

13

అగస్త్యమలై*

2001

2016

కేరళ, తమిళనాడు

3,500

14

అచానక్‌మార్-అమర్‌కంటక్*

2005

2012

మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్

3,835.46

15

గ్రేట్ రణ్ ఆఫ్ కచ్

2008

—

గుజరాత్

12,454

16

కోల్డ్ డెజర్ట్*

2009

2025

హిమాచల్ ప్రదేశ్

7,770

17

శేషాచలం

2010

—

ఆంధ్రప్రదేశ్

4,755.58

18

పన్నా*

2011

2020

మధ్యప్రదేశ్

2,998.98

గమనిక: (*) గుర్తు యునెస్కో వరల్డ్ నెట్‌వర్క్ ఆఫ్ బయోస్ఫియర్ రిజర్వ్స్‌లో (డబ్ల్యూఎన్‌బీఆర్) చేర్చిన బయోస్ఫియర్ రిజర్వ్‌లను సూచిస్తుంది.

 

విస్తరిస్తున్న ఈ నెట్‌వర్క్‌తోపాటు పర్యావరణపరంగా ముఖ్యమైన ఈ ప్రాంతాల నిర్వహణ, సంరక్షణకు భారత్ ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. పర్యావరణ, అటవీ & వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖలోని బయోస్ఫియర్ రిజర్వ్ విభాగం, 'కన్జర్వేషన్ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్ అండ్ ఎకోసిస్టమ్స్' సమగ్ర పథకం కింద ఉప పథకమైన 'బయోడైవర్సిటీ కన్జర్వేషన్' అనే కేంద్ర ప్రాయోజిత పథకాన్ని నిర్వహిస్తోంది.

 

యునెస్కో మ్యాన్ అండ్ ది బయోస్ఫియర్ ప్రోగ్రామ్ విధానం కింద గుర్తించిన బయోస్ఫియర్ రిజర్వ్‌ల నిర్వహణ ప్రణాళికల్లో పేర్కొన్న సంరక్షణ, అభివృద్ధి కార్యకలాపాల కోసం, అవి ఉన్న రాష్ట్రాలకు ఈ విభాగం సహాయ గ్రాంట్లను అందిస్తుంది. రాష్ట్ర అటవీ శాఖలు ఈ పథకాన్ని అమలు చేస్తాయి. వ్యయ భాగస్వామ్య ప్రాతిపదికన ఇతర రాష్ట్రాలకు 60:40 (కేంద్రం: రాష్ట్రం), ఈశాన్య, హిమాలయ రాష్ట్రాలకు 90:10 (కేంద్రం: రాష్ట్రం) నిష్పత్తుల్లో మంత్రిత్వ శాఖ సహాయ గ్రాంట్లను అందిస్తుంది.

 

2022–23 నుంచి నాలుగు రిజర్వ్‌లకు ఐదేళ్ల సమగ్ర నిర్వహణ ప్రణాళికలను మంత్రిత్వ శాఖ ప్రయోగాత్మకంగా చేపట్టింది: నందాదేవి (ఉత్తరాఖండ్), పచ్‌మఢీ (మధ్యప్రదేశ్), దేహాంగ్-దిబాంగ్ (అరుణాచల్ ప్రదేశ్), అగస్త్యమలై (కేరళ & తమిళనాడు). ఈ ప్రణాళికలు రిజర్వ్‌ల అధికారులు, పరిశోధనా సంస్థలు, స్థానిక ప్రజలను ఒక వేదికపైకి తీసుకొస్తాయి. ఆవాసాల పునరుద్ధరణ, జీవవైవిధ్య పర్యవేక్షణ, శాస్త్రీయ పరిశోధన, సుస్థిర జీవనోపాధులు వీటి ప్రాధాన్యాలు.

 

భారత బయోస్ఫియర్ రిజర్వ్‌లపై ఒక చూపు

పర్వత అడవుల నుంచి మడ అడవుల డెల్టాలు, పగడపు దిబ్బలు, ఎత్తైన ప్రాంతాల్లోని ఎడారుల వరకు భారత బయోస్ఫియర్ రిజర్వ్‌లు అసాధారణ జీవ సంపదకు నిలయాలుగా ఉన్నాయి.

 

- నీలగిరి: పశ్చిమ కనుమల్లోని నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్ అంతర్జాతీయ ప్రాధాన్యమున్న జీవవైవిధ్య కేంద్రం. తమిళనాడు, కేరళ, కర్ణాటకల్లో సుమారు 5,52,000 హెక్టార్లలో విస్తరించిన ఈ ప్రాంతంలో ఉష్ణమండల సతతహరిత అడవులు, పర్వత షోలా అడవులు, గడ్డి మైదానాలు ఉన్నాయి. ఈ వైవిధ్యమైన ప్రాంతం స్థానిక ప్రత్యేక జాతులు, ముప్పు ఎదుర్కొంటున్న జాతులతో సహా సమృద్ధమైన జీవవైవిధ్యానికి తోడ్పడుతుంది. అంతరించిపోయే ముప్పులో ఉన్న సింహపు తోక కోతి, నీలగిరి తార్‌లకు ఇది ఆవాసం. ఏనుగులు, పులులు, గౌర్‌లు, సాంబార్ జింకలు, చుక్కల జింకలు కూడా ఉన్నాయి. అనేక సరీసృపాలు, ఉభయచరాలతోపాటు 100కుపైగా క్షీరద జాతులు, 550 పక్షి జాతుల మనుగడకు ఇది తోడ్పడుతోంది. నీలగిరి జిల్లాలోనే 6,000కుపైగా వృక్షజాతులు నమోదయ్యాయి. ఈ ప్రాంత అసాధారణ వృక్ష సంపదను ఇది చాటుతోంది.

 

- కోల్డ్ డెజర్ట్: హిమాచల్ ప్రదేశ్‌లోని కోల్డ్ డెజర్ట్ బయోస్ఫియర్ రిజర్వ్ 3,300–6,600 మీటర్ల ఎత్తులో 7,770 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. కఠినమైన పరిస్థితులున్న ఈ ఎత్తైన ప్రాంతం, ఇక్కడికే ప్రత్యేకమైన 30 జాతులతో సహా ప్రసరణ నాళాలున్న మొక్కల 732 జాతులకు, మంచు చిరుతలు, హిమాలయన్ ఐబెక్స్, బ్లూ షీప్‌లకు ఆవాసంగా ఉంది. ఈ ప్రాంతంలో సుమారు 12,000 మంది నివసిస్తున్నారు. పశుపోషణ, యాక్‌లు, మేకల పెంపకం, బార్లీ, బఠానీ సాగు, టిబెటన్ మూలికా వైద్యం ద్వారా సంప్రదాయ జీవనోపాధులను కొనసాగిస్తున్నారు.

 

- గల్ఫ్ ఆఫ్ మన్నార్: తమిళనాడు ఆగ్నేయ తీరానికి ఆవల ఉన్న గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్ఫియర్ రిజర్వ్.. భారత అత్యంత సమృద్ధమైన సముద్ర జీవవైవిధ్య ప్రాంతాల్లో ఒకటి. సుమారు 1.05 మిలియన్ హెక్టార్లలో విస్తరించిన ఈ ప్రాంతంలో పగడపు దిబ్బలు, సముద్రపు గడ్డి మైదానాలు, మడ అడవులు ఉన్నాయి. పరస్పరం అనుసంధానమైన ఈ పర్యావరణ వ్యవస్థలు 4,223 వృక్ష, జంతు జాతుల మనుగడకు తోడ్పడుతున్నాయి. సుమారు 47 తీర గ్రామాలున్న ప్రాంతంలో దాదాపు 25 లక్షల మంది జీవనానికి ఈ రిజర్వ్ మద్దతుగా ఉంది.

 

విజయగాథ: సంరక్షణకు కేంద్రంగా ప్రజలు

నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్‌లోని ఆదివాసీ సమాజాలు పీకేసిన లాంటానా తీగలను ఏనుగు శిల్పాలు, ఫర్నిచర్, హస్తకళా వస్తువులుగా మారుస్తున్నాయి.

 

ఆవాసాల క్షీణతపై అవగాహన పెంచుతూనే ఈ కార్యక్రమం స్థానిక జీవనోపాధులకు తోడ్పడుతోంది. 2021లో నిజమైన ఏనుగుల పరిమాణంలో రూపొందించిన 125 లాంటానా ఏనుగుల శిల్పాలను లండన్‌లో ప్రదర్శించారు. వన్యప్రాణులతో సహజీవనాన్ని ఇది ప్రోత్సహించింది. బెంగళూరు విమానాశ్రయం, బెంగళూరులోని వివిధ ప్రదేశాలు, రాష్ట్రపతి భవన్‌లోనూ ఈ శిల్పాలను ప్రదర్శించారు. తొలగించిన లాంటానాను ఆర్థికంగా ఉపయోగపడే వస్తువులుగా మార్చడం, ఆదివాసీ కళాకారులకు జీవనోపాధి అవకాశాలు కల్పించడం, ఆక్రమణశీల జాతులపై ప్రజల్లో అవగాహన పెంచడం ఈ కార్యక్రమం ద్వారా సాధ్యమవుతోంది.

 

మీకు తెలుసా?

లాంటానా కమారా ఆక్రమణశీల పొద. భారత అడవుల్లో సుమారు 300,000 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించింది. దట్టమైన పొదలుగా పెరిగి స్థానిక మొక్కలను అణచివేస్తుంది, జీవవైవిధ్యాన్ని తగ్గిస్తుంది, కార్చిచ్చుల సహజ తీరును మారుస్తుంది. ఇది విడుదల చేసే రసాయనాలు పోటీపడే ఇతర మొక్కల పెరుగుదలను అడ్డుకుంటాయి. వేగంగా తిరిగి పెరగడం వల్ల దీన్ని తొలగించడం కష్టమవుతుంది. 1916 నుంచి నిర్మూలన ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ, లాంటానా నియంత్రణ ఖర్చుతో కూడిన సవాలుగానే ఉంది.

 

భవిష్యత్ కార్యాచరణ

 

ప్రకృతి, ప్రజలు కలిసి వృద్ధి చెందే భవిష్యత్తుకు భారత బయోస్ఫియర్ రిజర్వ్‌లు ఆశాజనక నమూనాను అందిస్తున్నాయి. శాస్త్రీయ పరిశోధన, ఆవాసాల పునరుద్ధరణ, ప్రజల నేతృత్వంలోని సంరక్షణలో నిరంతర పెట్టుబడులు వీటి పర్యావరణ సంపదను కాపాడగలవు. సంప్రదాయ జ్ఞానాన్ని ఆధునిక పర్యవేక్షణతో అనుసంధానించడం ద్వారా సవాళ్లను తట్టుకునే పర్యావరణ వ్యవస్థలు, సుస్థిర జీవనోపాధులకు భారత్ తోడ్పడగలదు. ప్రభుత్వాలు, పరిశోధకులు, స్థానిక ప్రజలు, అంతర్జాతీయ సంస్థల మధ్య బలమైన భాగస్వామ్యాలు ఈ ప్రాంతాలు వృద్ధి చెందేందుకు సహాయపడతాయి. ప్రకృతిని కాపాడటం ప్రజల జీవితాలను కూడా మెరుగుపరుస్తుందని, సాంస్కృతిక వారసత్వాన్ని రక్షిస్తుందని, రాబోయే తరాలకు మరింత ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందిస్తుందని బయోస్ఫియర్ రిజర్వ్‌లు నిరూపించగలవు.

 

References

Ministry of Environment, Forest and Climate Change

United Nations Educational, Scientific and Cultural Organization

United Nations Organisations

PIB Backgrounders

Others:

 

Click to see pdf

 

 

***

(Explainer ID: 160693) आगंतुक पटल : 14
Provide suggestions / comments
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Nepali