Farmer's Welfare
ఖేత్ బచావో అభియాన్ - రబీ 2026
“నేల ఆరోగ్యం, సుస్థిర వ్యవసాయం”
Posted On:
02 NOV 2026 11:01AM
ఖేత్ బచావో అభియాన్ (కేబీఏ)-రబీ 2026 అనేది దేశవ్యాప్తంగా 2026 అక్టోబర్ 22 నుంచి నవంబర్ 30 వరకు కొనసాగుతున్న కార్యక్రమం. సుమారు 50 లక్షల మంది రైతులకు చేరువ కావాలన్న లక్ష్యంతో 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, 700కుపైగా జిల్లాలు, 50,000 గ్రామాల్లో నేల ఆరోగ్యం, సమతుల ఎరువుల వినియోగం, సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోంది. సమతుల పోషక నిర్వహణ, ప్రకృతి వ్యవసాయం, పంట అవశేషాల నిర్వహణ, పంటల్లో వైవిధ్యం, వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయం ఈ కార్యక్రమ ప్రధాన ప్రాధాన్యాలు. కేవీకేలు, ఆత్మ భాగస్వామ్యంతో 4,150 బృందాలు, 12,000 మందికిపైగా శాస్త్రవేత్తలు, ఆత్మ సిబ్బంది సహకారంతో కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రణాళిక రూపొందించారు. 50,000 క్షేత్రస్థాయి ప్రదర్శనలు, క్రమబద్ధమైన 11,750 శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడం దీని లక్ష్యం. సామాజిక మాధ్యమాల ద్వారా 1.5 కోట్ల మంది రైతులకు సమాచారం చేరవేయాలని, మొత్తం డిజిటల్ పద్ధతిలో 2.5 కోట్ల మందికి చేరువ కావాలని కార్యక్రమం లక్ష్యంగా పెట్టుకుంది.
వ్యవసాయానికి పునాది నేలలోనే
వ్యవసాయ ఉత్పాదకత, ఆహార భద్రత, గ్రామీణ జీవనోపాధులకు నేల ఆరోగ్యమే పునాది. భారత శ్రామికుల్లో 46 శాతానికిపైగా వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్న నేపథ్యంలో ఆహార వ్యవస్థలు, ఆర్థిక స్థిరత్వంపై నేల ఆరోగ్యం ప్రభావం చూపుతుంది. ఆరోగ్యకరమైన నేలలు అధిక పంట దిగుబడులకు తోడ్పడి, బయటి నుంచి సమకూర్చుకునే సాగు ఉత్పాదకాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తాయి.
నేల ఆరోగ్య ప్రాధాన్యాన్ని గుర్తిస్తూ, ఖేత్ బచావో అభియాన్ (కేబీఏ) - రబీ 2026 “స్వస్థ్ ధరా, సమృద్ధ్ కిసాన్” కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా 2026 అక్టోబర్ 22 నుంచి నవంబర్ 30 వరకు నిర్వహించాలని ప్రణాళిక రూపొందించారు. సమతుల్యంగా, అవసరానికి అనుగుణంగా ఎరువుల వినియోగం, సుస్థిర పోషక నిర్వహణను ప్రోత్సహించేందుకు వ్యవసాయ శాఖలు, పరిశోధనా సంస్థలు, క్షేత్రస్థాయి సిబ్బంది సమన్వయంతో పనిచేసే విధానాన్ని ఇది అనుసరిస్తుంది. సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, వ్యవసాయ వనరులను అవసరానికి అనుగుణంగా వినియోగించేలా చేయడం దీని లక్ష్యాలు. ప్రకృతి వ్యవసాయం, నీటి సంరక్షణ, సహజ వనరుల సమర్థ వినియోగాన్ని కూడా ప్రోత్సహిస్తుంది. పోషకాలను సమతుల్యంగా అందించకపోవడం, నేలలో సేంద్రియ పదార్థం తగ్గడం, పెరుగుతున్న సాగు ఖర్చులు, సహజ వనరుల క్షీణత వంటి సమస్యలపై ఇది దృష్టి సారిస్తుంది.
సామర్థ్యాల పెంపు, వ్యవసాయ యాంత్రీకరణ, రీజెనరేటివ్ వ్యవసాయ పద్ధతులతో సహా మెరుగైన వ్యవసాయ సాంకేతికతల ప్రదర్శనలకు కూడా ఈ కార్యక్రమాలు ప్రాధాన్యమిస్తాయి (నేల ఆరోగ్యాన్ని పునరుద్ధరించడం, జీవవైవిధ్యాన్ని పెంచడంపై దృష్టి సారించే వ్యవసాయ పద్ధతులు).
ఈ కార్యక్రమం 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, 700కుపైగా జిల్లాలు, 50,000 గ్రామాలను కవర్ చేస్తుంది. సమన్వయ కార్యకలాపాల ద్వారా సుమారు 50 లక్షల మంది రైతులకు చేరువ కావడం దీని లక్ష్యం. విస్తృతంగా రైతులకు సమాచారం అందించేందుకు, సమతుల పోషక నిర్వహణను ప్రోత్సహించేందుకు ఎరువుల వినియోగం అధికంగా ఉన్న 100 జిల్లాలకు ప్రాధాన్యమివ్వాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించారు.
విస్తృత పరిధి, క్షేత్రస్థాయి కార్యకలాపాల ద్వారా రైతులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ సంస్థలను ఒక వేదికపైకి తీసుకురావాలని ఈ కార్యక్రమం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సమన్వయ కృషి రైతులు తగిన సమాచారంతో సాగు నిర్ణయాలు తీసుకునేందుకు, సుస్థిర వ్యవసాయ పద్ధతులను మరింతగా అనుసరించేందుకు తోడ్పడుతుందని అంచనా.
ఖేత్ బచావో అభియాన్
(2026 జూన్ 1 నుంచి 30 వరకు)
నేల ఆరోగ్యం, సమతుల ఎరువుల వినియోగం, సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించేందుకు నెల రోజుల కార్యక్రమంగా ఖేత్ బచావో అభియాన్‌ను 2026 జూన్ 1న దేశవ్యాప్తంగా ప్రారంభించారు. క్షేత్రస్థాయిలో నేరుగా రైతులతో మమేకమయ్యేందుకు 1,657 బహుళ విభాగాల బృందాలను రంగంలోకి దించారు. ఈ కార్యక్రమం విస్తృతంగా ప్రజలకు చేరువైంది. 92.44 లక్షల మంది రైతుల కోసం 1.34 లక్షలకుపైగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. పచ్చిరొట్ట ఎరువులు, జీవ ఎరువులపై 6,685 శిక్షణ కార్యక్రమాల ద్వారా 4.94 లక్షల మంది రైతులు ప్రయోజనం పొందారు. అదనంగా, 3,167 క్షేత్రస్థాయి ప్రదర్శనలు, 4,779 ముఖాముఖి కార్యక్రమాలు ఆచరణాత్మకంగా నేర్చుకునే అవకాశాలను కల్పించాయి. ఎరువులు, ఇతర సాగు ఉత్పాదకాల వ్యాపారులు పాల్గొన్న సమ్మేళనాలతో సహా మరో 4,916 జన్ప్రతినిధి సమ్మేళనాలు క్షేత్రస్థాయి భాగస్వామ్యాన్ని బలోపేతం చేశాయి. మొత్తంగా ఈ కార్యక్రమం సుమారు 1.07 కోట్ల మంది రైతులు, ఇతర సంబంధిత వర్గాలకు నేరుగా చేరువైంది. సామాజిక మాధ్యమాల ద్వారా సుమారు 4.5 కోట్ల మంది పౌరులకు సమాచారం చేరింది.
ఖేత్ బచావో అభియాన్ - రబీ 2026 ప్రధాన లక్ష్యాలు
సాగు ఉత్పాదకాల సమర్థ వినియోగాన్ని మెరుగుపరిచే, వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయానికి తోడ్పడే స్థానిక, శాస్త్రీయ పద్ధతులను రైతులు అనుసరించేలా ప్రోత్సహించడం ఈ కార్యక్రమం లక్ష్యం.
- సమతుల పోషక నిర్వహణ: సాధారణ ఎరువుల సిఫార్సుల (జీఎఫ్ఆర్) ఆధారిత పోషక నిర్వహణను, ఎరువుల వినియోగంలో 4ఆర్ సూత్రాన్ని(సరైన వనరు, సరైన మోతాదు, సరైన సమయం, సరైన ప్రదేశం) ప్రోత్సహించడం. రబీ పంటల అవసరాలకు అనుగుణంగా ఎరువులను సమతుల్యంగా, సమర్థంగా వినియోగించేందుకు ఈ పద్ధతి తోడ్పడుతుంది.
- ప్రకృతి వ్యవసాయం: అవగాహన కార్యక్రమాలు, సామర్థ్యాల పెంపు, ప్రదర్శనలు, రైతులు పరస్పరం నేర్చుకోవడం ద్వారా ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరించేలా ప్రోత్సహించడం.
- సమగ్ర పోషక నిర్వహణ (ఐఎన్ఎం): అవగాహన, సామర్థ్యాల పెంపు, ప్రదర్శనల ద్వారా ఐఎన్ఎం, తగిన సేంద్రియ, జీవసంబంధిత ఉత్పాదకాల వినియోగాన్ని ప్రోత్సహించడం.
- పంట అవశేషాల నిర్వహణ: సమాచారం, విద్య, కమ్యూనికేషన్ (ఐఈసీ) కార్యకలాపాల ద్వారా పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లలో పంట అవశేషాల సుస్థిర నిర్వహణను ప్రోత్సహించడం, వాటిని కాల్చడాన్ని నిరుత్సాహపరచడం.
- పంటల్లో వైవిధ్యం: అవగాహన, సామర్థ్యాల పెంపు, ప్రదర్శనల ద్వారా నూనెగింజలు, పప్పుధాన్యాల ఉత్పత్తిని బలోపేతం చేయడం, పంటల్లో వైవిధ్యాన్ని ప్రోత్సహించడం, వరి సాగు తర్వాత ఖాళీగా ఉండే భూములను ఉత్పాదకంగా వినియోగించేలా చేయడం.
- వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయం: వాతావరణ మార్పులను తట్టుకునే పంటలు, వనరుల నిర్వహణకు తోడ్పడేందుకు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్లలోని కరువు ప్రభావిత ప్రాంతాల్లో స్థానిక పరిస్థితులకు అనుగుణమైన అత్యవసర కార్యాచరణ ప్రణాళికలను అమలు చేయడం.
- వ్యవసాయ పథకాలపై అవగాహన: వ్యవసాయానికి సంబంధించిన ప్రభుత్వ పథకాలు, వాటి ప్రయోజనాలపై అవగాహన కల్పించడం.
- సమగ్ర చీడపీడల నిర్వహణ, పురుగుమందుల బాధ్యతాయుత వినియోగం: పురుగుమందుల నాణ్యత, సురక్షిత వినియోగంపై అవగాహన కల్పించడం, సమగ్ర చీడపీడల నిర్వహణను (ఐపీఎం) ప్రోత్సహించడం, అవసరం మేరకు, లేబుల్‌పై సూచనలకు అనుగుణంగా పురుగుమందులను సురక్షితంగా ఉపయోగించేలా చేయడం, విచక్షణారహిత వినియోగాన్ని నిరుత్సాహపరచడం.

నేల ఆరోగ్యానికి జీలుగ, పెసర తోడ్పాటు
బిహార్‌లోని తూర్పు చంపారన్ వరి సాగు ప్రాంతాల్లో ఎరువుల వినియోగాన్ని నియంత్రించుకుంటూనే భూసారాన్ని కాపాడుకోవడం రైతులకు ముఖ్యమైన అంశం. నేలలో సేంద్రియ కర్బనం తగ్గడం, సూక్ష్మపోషక లోపాలు ఈ సవాలును మరింత పెంచుతున్నాయి. ఖేత్ బచావో అభియాన్-2026 కింద బిహార్‌లోని మోతీహారిలో ఉన్న ఐసీఏఆర్-మహాత్మా గాంధీ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎంజీఐఎఫ్ఆర్ఐ), పచ్చిరొట్ట ఎరువులు, జీవసంబంధ నత్రజని స్థిరీకరణ నేల ఆరోగ్యానికి ఎలా తోడ్పడతాయో వివరించింది.

బిహార్‌లోని తూర్పు చంపారన్ జిల్లా రక్సౌల్ బ్లాక్ పంటోకా పంచాయతీలో నిర్వహించిన రైతు అవగాహన కార్యక్రమంలో, సిఫార్సు చేసిన ఎరువుల మోతాదులతోపాటు పశువుల ఎరువు, కంపోస్టు, జీవ ఎరువులు, పంట అవశేషాలను కలిపి ఉపయోగించాలని రైతులను ప్రోత్సహించారు. వరి నారుమడి నిర్వహణ, పంట అవశేషాలను కాల్చడానికి ప్రత్యామ్నాయాలైన కంపోస్టు తయారీ, మల్చింగ్, వర్మీకంపోస్టు తయారీపై చర్చించారు.
వరి ఆధారిత పంటల విధానాల్లో జీలుగ (సెస్బానియా జాతి), వేసవి పెసర వినియోగాన్ని కూడా శాస్త్రవేత్తలు నొక్కిచెప్పారు. జీలుగ హెక్టారుకు సుమారు 50–60 కిలోగ్రాముల నత్రజనిని అందించగలదు. ఇది 110–130 కిలోగ్రాముల యూరియాకు సమానం. వేసవి పెసర హెక్టారుకు 25–30 కిలోగ్రాముల నత్రజనిని అందించగలదు. ఇది 55–65 కిలోగ్రాముల యూరియాకు సమానం. నేలలో సేంద్రియ పదార్థం, జీవక్రియలను మెరుగుపరుస్తూనే ఎరువుల అవసరాన్ని తగ్గించేందుకు ఈ పంటలు సహాయపడగలవు.
ఈ కార్యక్రమంలో 41 మంది మహిళలు సహా 62 మంది రైతులు పాల్గొన్నారు. పచ్చిరొట్ట ఎరువులు, సమతుల పోషక నిర్వహణను అనుసరించేందుకు పాల్గొన్నవారు ఆసక్తి వ్యక్తం చేశారు.
కార్యక్రమాన్ని రైతులకు చేరువ చేయడంలో సంస్థల పాత్రలు, బాధ్యతలు
- రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంత వ్యవసాయ శాఖ: కార్యక్రమ ప్రణాళిక, అమలు, అవసరమైన ఆదేశాల జారీ, సన్నాహక సమావేశాల నిర్వహణ, జిల్లా స్థాయి షెడ్యూళ్ల ఆమోదం, క్షేత్రస్థాయి సిబ్బంది, సమన్వయ భాగస్వాములను సమీకరించడం, పథకాలు, సేవలను పొందేందుకు తోడ్పడటం, నివేదికలను క్రోడీకరించడం దీని బాధ్యతలు.
- అగ్రికల్చరల్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీలు (ఆత్మ), జిల్లా వ్యవసాయ పాలనా యంత్రాంగం: జిల్లా, బ్లాక్, గ్రామ స్థాయిల్లో కార్యక్రమాల సమన్వయం, సూక్ష్మ ప్రణాళికల తయారీ, రైతులు, సామాజిక సంస్థలను సమీకరించడం, వేదికలు, పొలాలకు ప్రవేశం, ఐఈసీ సామగ్రి, నిర్వహణ ఏర్పాట్లకు సహకరించడం, హాజరు, కార్యకలాపాల రికార్డులను నిర్వహించడం వీటి బాధ్యతలు.
- ఐసీఏఆర్ సంస్థలు, అగ్రికల్చరల్ టెక్నాలజీ అప్లికేషన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ (అటారీలు), కృషి విజ్ఞాన కేంద్రాలు (కేవీకేలు), వ్యవసాయ విశ్వవిద్యాలయాలు (విజ్ఞాన భాగస్వాములు): శాస్త్రీయ సాంకేతిక మార్గదర్శకత్వం, స్థానిక పరిస్థితులకు అనుగుణమైన సిఫార్సులను అందించడం, విషయ నిపుణులను నామినేట్ చేయడం, శిక్షణకు తోడ్పడటం, కోరినప్పుడు ప్రదర్శనలు, రైతు-శాస్త్రవేత్తల ముఖాముఖి కార్యక్రమాలను నిర్వహించడం, సాంకేతిక ఐఈసీ సామగ్రి, సూచనలను రూపొందించడం లేదా ధ్రువీకరించడం, పరిశోధన ఆధారాలను పంచుకోవడం, నేర్చుకున్న అంశాలను నమోదు చేయడం వీటి బాధ్యతలు. ప్రత్యేకంగా అధికారమిస్తే తప్ప రాష్ట్ర స్థాయి అమలు, పాలనా నియంత్రణ, నిబంధనల అమలు లేదా వ్యయ బాధ్యతలు వీటి పరిధిలోకి రావు.
కేవీకేలు, ఆత్మ భాగస్వామ్యంతో 4,150 బృందాలను ఈ కార్యక్రమం ప్రతిపాదిస్తోంది. 12,000 మందికిపైగా శాస్త్రవేత్తలు, ఆత్మ సిబ్బంది దీని అమలుకు సహకరిస్తారని అంచనా. ఆత్మ, ఐసీఏఆర్ ద్వారా సుమారు కోటి మంది పాల్గొనేలా చేయడం ఈ కార్యక్రమం లక్ష్యం.

- ఇతర రాష్ట్ర శాఖలు, ఏజెన్సీలు: ఉద్యానవనాలు, నేల, నీటి సంరక్షణ, నీటిపారుదల, పశుసంవర్ధక, గ్రామీణాభివృద్ధి, సహకార, పంచాయతీరాజ్, పర్యావరణం, వ్యవసాయ మార్కెటింగ్, అనుబంధ రంగాలకు బాధ్యత వహించే శాఖలు, ఏజెన్సీలు సమన్వయంతో పాల్గొని, తమ బాధ్యతలకు అనుగుణంగా కార్యక్రమాలకు మద్దతు, సహకారం అందిస్తాయి.
- రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (ఎఫ్పీఓలు), స్వయంసహాయక సంఘాలు (ఎస్‌హెచ్‌జీలు), ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు (పీఏసీఎస్), కస్టమ్ హైరింగ్ సెంటర్లు (సీహెచ్‌సీలు), అభ్యుదయ రైతులు: స్థానిక సమీకరణ, రైతులు పరస్పరం నేర్చుకోవడం, ప్రదర్శనల సందర్శన, ధ్రువీకరించిన సూచనలను రైతులకు చేరవేయడానికి తోడ్పడతారు.
- మీడియా, సమాచార భాగస్వాములు: రైతులతో పంచుకునే సాగు సమాచారంలో కచ్చితత్వం, ధ్రువీకరణకు భరోసా కల్పిస్తూ, స్థానిక మీడియా, కమ్యూనిటీ రేడియో, వాట్సప్, కిసాన్ సారథి, ఇతర అనువైన సమాచార వేదికల ద్వారా ఆమోదించిన కార్యక్రమ సందేశాలను వ్యాప్తి చేసేందుకు తోడ్పడతారు.
రైతులకు అవగాహన కల్పన, సమాచారం చేరవేత
మెరుగైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని బలోపేతం చేయడం, కార్యక్రమ సందేశాలను మరింత మంది రైతులకు చేరవేయడం కోసం రైతుల అవగాహన, సామర్థ్యాల పెంపు, క్షేత్రస్థాయి ప్రదర్శనలు, ఆచరణాత్మక అవగాహన సందర్శనలు, డిజిటల్ సమాచార వ్యాప్తిని ఈ కార్యక్రమం అనుసంధానిస్తుంది.

వివిధ కార్యకలాపాలపై అవగాహన కల్పన
సాధారణ ఎరువుల సిఫార్సుల ఆధారిత పోషక నిర్వహణ, ప్రకృతి వ్యవసాయం, సమగ్ర పోషక నిర్వహణ (ఐఎన్ఎం), పంట అవశేషాల నిర్వహణ (సీఆర్ఎం), నూనెగింజలు, పప్పుధాన్యాల ఉత్పత్తికి మెరుగైన సాంకేతికతలపై రైతుల అవగాహన, పరిజ్ఞానాన్ని పెంచడం ఈ కార్యక్రమం లక్ష్యం. కరువు ప్రభావిత జిల్లాల్లో అత్యవసర కార్యాచరణ ప్రణాళికల అమలుకు ప్రామాణిక నిర్వహణ విధానాలు (ఎస్ఓపీలు), వ్యవసాయానికి సంబంధించిన ముఖ్య ప్రభుత్వ పథకాల సమాచారాన్ని కూడా అందిస్తుంది.
- 950 ఐసీఏఆర్ సంస్థల బృందాల్లో ప్రతి బృందానికి వారానికి మూడు గ్రామ సందర్శనలను కేటాయించారు. 700 కేవీకే బృందాలు వారానికి నాలుగు సందర్శనలు చేపట్టాలని నిర్దేశించారు. ప్రతి సందర్శనలో 100 మంది రైతులు పాల్గొనేలా లక్ష్యం పెట్టుకున్నారు.
- ఐదు వారాల్లో 5,650 అవగాహన కార్యక్రమాల ద్వారా అంచనాగా 28.25 లక్షల మంది రైతులకు చేరువ కావాలని కార్యక్రమం లక్ష్యంగా పెట్టుకుంది.
రైతుల సామర్థ్యాల పెంపు
సమగ్ర పోషక నిర్వహణ (ఐఎన్ఎం), పంట అవశేషాల నిర్వహణ (సీఆర్ఎం), ప్రకృతి వ్యవసాయం, మెరుగైన నూనెగింజలు, పప్పుధాన్యాల ఉత్పత్తి పద్ధతులు, సమగ్ర చీడపీడల నిర్వహణ (ఐపీఎం), ఇతర సంబంధిత అంశాల్లో రైతుల పరిజ్ఞానం, సాంకేతిక సామర్థ్యాలను బలోపేతం చేసేలా శిక్షణ కార్యక్రమాలను రూపొందించారు.
- 950 ఐసీఏఆర్ సంస్థల బృందాల్లో ప్రతి బృందం వారానికి ఒక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్దేశించారు. 700 కేవీకే బృందాలకు వారానికి రెండు కార్యక్రమాలను కేటాయించారు. ప్రతి కార్యక్రమంలో 40 మంది పాల్గొనేలా లక్ష్యం పెట్టుకున్నారు.
- ఐదు వారాల్లో 11,750 శిక్షణ కార్యక్రమాల ద్వారా అంచనాగా 4.70 లక్షల మంది రైతులకు చేరువ కావాలని కార్యక్రమం లక్ష్యంగా పెట్టుకుంది.
రైతుల పొలాల్లో ప్రదర్శనలు
మెరుగైన వ్యవసాయ సాంకేతికతల సామర్థ్యం, ప్రయోజనాలను వివరించేందుకు ఐసీఏఆర్ సంస్థలు, కృషి విజ్ఞాన కేంద్రాలు (కేవీకేలు) ఎంపిక చేసిన రైతుల పొలాల్లో క్షేత్రస్థాయి ప్రదర్శనలను నిర్వహిస్తాయి. శాస్త్రీయ విధానాలను అంచనా వేసి, వాటి ఫలితాలను ప్రస్తుత సాగు పద్ధతులతో పోల్చుకునేందుకు ఈ ప్రదర్శనలు రైతులకు వీలు కల్పిస్తాయి. గ్రీన్ అమ్మోనియా, పంట అవశేషాల నిర్వహణ (సీఆర్ఎం), సమగ్ర పోషక నిర్వహణ (ఐఎన్ఎం), సమగ్ర చీడపీడల నిర్వహణ (ఐపీఎం), ప్రకృతి వ్యవసాయం, నూనెగింజలు, పప్పుధాన్యాల్లో సమగ్ర పంట నిర్వహణ (ఐసీఎం), జీవ ఎరువులు, సేంద్రియ, జీవసంబంధిత ఉత్పాదకాలు ప్రధాన అంశాలుగా ఉంటాయి.
- 50,000 క్షేత్రస్థాయి ప్రదర్శనలను నిర్వహించాలని కార్యక్రమం లక్ష్యంగా పెట్టుకుంది. వీటిలో కేవీకేల ద్వారా 40,000, ఐసీఏఆర్ సంస్థల ద్వారా 10,000 ప్రదర్శనలు ఉంటాయి.
- ప్రతి ప్రదర్శనలో 20 మంది రైతుల భాగస్వామ్యంతో అంచనాగా 10 లక్షల మంది రైతులకు చేరువ కావడం లక్ష్యం.
క్షేత్రస్థాయి పర్యటనలు, పంటకోత కార్యక్రమాలు, అవగాహన సందర్శనలు
క్షేత్రస్థాయి పర్యటనలు, పంటకోత కార్యక్రమాలు, ప్రదర్శన ప్రదేశాలకు అవగాహన సందర్శనలు ఈ కార్యక్రమంలోని “చూసి నమ్మడం” విధానంలో కీలక భాగం. మెరుగైన వ్యవసాయ సాంకేతికతలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు, వాటి ఆచరణాత్మక వినియోగాలను అర్థం చేసుకునేందుకు, క్షేత్రస్థాయి పరిస్థితుల్లో ప్రయోజనాలను అంచనా వేసేందుకు ఈ కార్యకలాపాలు రైతులకు అవకాశాలు కల్పిస్తాయి.
- 1,650 బృందాల్లో ప్రతి బృందానికి పంట కాలంలో మూడు క్షేత్ర లేదా పంటకోత దినోత్సవాలు, రెండు అవగాహన సందర్శనలను నిర్వహించే బాధ్యత కేటాయించారు. ప్రతి కార్యక్రమంలో సుమారు 125 మంది రైతులు పాల్గొనేలా లక్ష్యం పెట్టుకున్నారు.
- ఈ కార్యకలాపాలన్నింటి ద్వారా సుమారు 10 లక్షల మంది రైతులకు చేరువ కావాలని అంచనా.
సామాజిక మాధ్యమాల ద్వారా సమాచారం చేరవేత
మెరుగైన వ్యవసాయ పద్ధతులు, సాంకేతిక సూచనలు, కార్యక్రమ సంబంధిత కార్యకలాపాల సమాచారాన్ని వ్యాప్తి చేసేందుకు డిజిటల్ వేదికలు ముఖ్య మార్గంగా పనిచేస్తాయి. తద్వారా క్షేత్రస్థాయి కార్యకలాపాల పరిధిని దాటి కార్యక్రమ సమాచారాన్ని మరింత మందికి చేరవేస్తాయి.
- నిర్వాహక బృందాలు వాట్సప్, ఫేస్బుక్, ఎక్స్, ఇతర అనువైన డిజిటల్ వేదికల ద్వారా రోజువారీ వివరాలను పంచుకుంటాయి.
- సామాజిక మాధ్యమాల ద్వారా 1.5 కోట్ల మంది రైతులకు సమాచారం చేరవేయాలని, మొత్తం డిజిటల్ చేరువను 2.5 కోట్లకు విస్తరించాలని కార్యక్రమం లక్ష్యంగా పెట్టుకుంది.
పథకాలు, సేవలతో రైతుల అనుసంధానం
ముఖ్యమైన వ్యవసాయ పథకాలు, సేవలు, పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం ప్రత్యేక చర్యలు చేపడుతుంది. పీఎం-కిసాన్, పురుగుమందుల సమతుల వినియోగం, సాయిల్ హెల్త్ కార్డులు, వర్తించే ఎరువుల విక్రయ విధానం, వాణిజ్య ఒప్పందాల ద్వారా లభించే అవకాశమున్న ప్రయోజనాలు వీటిలో ఉన్నాయి. రైతుల ఐడీల సృష్టి, నవీకరణకు కూడా తోడ్పడుతూ, ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) కింద పంట బీమా రక్షణపై సమాచారాన్ని అందిస్తుంది. అదనంగా, కిసాన్ క్రెడిట్ కార్డ్ (కేసీసీ) పథకాన్ని అర్హులందరికీ అందించే కార్యక్రమాలు, రైతులకు సంస్థాగత రుణాలు అందుబాటులోకి తెచ్చేందుకు తోడ్పడతాయి.

ప్రభుత్వ సహాయక వ్యవస్థలపై రైతుల అవగాహనను బలోపేతం చేయడం, అత్యవసర వ్యవసాయ సేవలు, అధికారిక రుణాలు, నష్టాల ముప్పును తగ్గించే సాధనాలను మరింత అందుబాటులోకి తేవడం ఈ చర్యల ఉమ్మడి లక్ష్యం. తద్వారా వ్యవసాయ జీవనోపాధులకు సంస్థాగత, ఆర్థిక పునాదులను బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.
సుస్థిర వ్యవసాయ పునాదుల బలోపేతం
వ్యవసాయ అభివృద్ధిలో నేల ఆరోగ్యం, సుస్థిర వనరుల నిర్వహణకు కేంద్రస్థానం కల్పించడం ఖేత్ బచావో అభియాన్-రబీ 2026 లక్ష్యం. శాస్త్రీయ సంస్థలు, ప్రభుత్వ శాఖలు, వ్యవసాయ విస్తరణ వ్యవస్థలు, రైతు సమాజాల సమన్వయం ద్వారా శాస్త్రీయ పరిజ్ఞానాన్ని స్థానిక పరిస్థితులకు అనుగుణమైన వ్యవసాయ పద్ధతులుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. మెరుగైన సాగు పద్ధతులను ప్రోత్సహించేందుకు దీని సమగ్ర విధానం రైతుల అవగాహన, సామర్థ్యాల పెంపు, క్షేత్రస్థాయి ప్రదర్శనలు, డిజిటల్ సమాచార వ్యాప్తిని అనుసంధానిస్తుంది. సమతుల పోషక నిర్వహణ, ప్రకృతి వ్యవసాయం, సాగు ఉత్పాదకాల సమర్థ వినియోగంతోపాటు పంటల్లో వైవిధ్యం, అవశేషాల నిర్వహణ, సమగ్ర చీడపీడల నిర్వహణ, వాతావరణ మార్పులను తట్టుకునే సామర్థ్యానికి ప్రాధాన్యమిస్తుంది. సంస్థాగత సమన్వయం, రైతుల భాగస్వామ్యంపై దృష్టి సారించడం ద్వారా క్షేత్రస్థాయి వ్యవసాయ విస్తరణ వ్యవస్థలు, వ్యవసాయ సేవల అందుబాటును కూడా బలోపేతం చేస్తుంది.
వనరులను సమర్థంగా వినియోగించే సాగు వ్యవస్థలు, ఆరోగ్యకరమైన నేలలు, సవాళ్లను తట్టుకునే వ్యవసాయ జీవనోపాధులకు ఈ చర్యలు తోడ్పడుతూ, వికసిత్ భారత్ విస్తృత లక్ష్యానికి దోహదం చేస్తాయి. అదనంగా, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల (ఎస్డీజీలు) సాధనలో, ముఖ్యంగా ఆకలి నిర్మూలన (ఎస్డీజీ 2), వాతావరణ చర్యల (ఎస్డీజీ 13) దిశగా పురోగతికి ఈ కార్యక్రమం తోడ్పడుతుంది.
References
Ministry of Agriculture and Farmers Welfare
https://www.pib.gov.in/PressNoteDetails.aspx?NoteId=159311&ModuleId=3®=48&lang=1
https://www.manage.gov.in/publications/eBooks/DAESI_%20Vol%20I_Study%20Material.pdf
https://vikalp.kisansarathi.in/#home
https://www.pib.gov.in/PressReleaseDetail.aspx?PRID=2302428®=48&lang=1
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2326112®=48&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2266794&lang=1®=1
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2288740®=48&lang=2
https://icar.gov.in/en/icar-mgifri-motihari-takes-khet-bachao-abhiyan-indias-frontier-villages-promotes-soil-health-and
Indian Council of Agricultural Research
https://icar.org.in/sites/default/files/2026-10/Khet-Bachaao-Abhiyaan-2026.pdf
https://icar.org.in/sites/default/files/Circulars/ICAR%20Insights%20Outcomes%20Booklet%20%28English%29.pdf
https://icar.org.in/sites/default/files/Circulars/Farmers%20Innovations_2025___English.pdf
Click to see pdf
***
(Explainer ID: 160672)
आगंतुक पटल : 6
Provide suggestions / comments