Infrastructure
ప్రధానమంత్రి గతిశక్తికి ఐదేళ్లు: భారతదేశ మౌలిక సదుపాయాల ప్రణాళికలో సమూల మార్పు
Posted On:
12 OCT 2026 1:43PM
ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ (పీఎంజీఎస్–ఎన్‌ఎంపీ) జాతీయ మౌలిక సదుపాయాల మ్యాపింగ్ వేదిక నుంచి విస్తృత ప్రణాళికా వ్యవస్థగా రూపాంతరం చెందింది. సమగ్ర ప్రణాళిక, ప్రాజెక్టుల సమన్వయానికి సహకరించే జీఐఎస్ ఆధారిత వేదిక ద్వారా కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాలు, మౌలిక సదుపాయాల నెట్‌వర్క్‌లను ఒకే వేదికపైకి తీసుకొచ్చింది. ప్రస్తుతం 58 కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలతో పాటు మొత్తం 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు దీని పరిధిలో ఉన్నాయి.
వికసిత భారత్‌కు చోదకశక్తిగా మౌలిక సదుపాయాలు
వివిధ రంగాలు, రవాణా మార్గాల మధ్య సమన్వయం అవసరమయ్యే స్థాయిలో భారత్ మౌలిక సదుపాయాలను నిర్మిస్తోంది. రహదారులు, రైల్వేలు, ఓడరేవులు, విమానాశ్రయాలు, జలమార్గాలు, ప్రజావసరాల వ్యవస్థలు తరచూ ఒకే ప్రాంతంలో కలుస్తాయి. ఈ నెట్‌వర్క్‌లను సమన్వయంతో ప్రణాళిక చేయడం వల్ల వ్యయం, సమయం ఆదా అవుతాయి. ప్రాజెక్టుల మధ్య సమన్వయం మెరుగవుతుంది. ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాలను మరింత సమర్థంగా ఉపయోగించుకోవచ్చు. విభిన్న మౌలిక సదుపాయాల నెట్‌వర్క్‌లను ఉమ్మడి ప్రణాళికా చట్రంలోకి తీసుకువచ్చే విధానం అవసరమైంది.
ఈ అవసరాన్ని తీర్చేందుకు ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్‌ను 2021 అక్టోబర్ 13న ప్రారంభించారు. వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన సమాచారాన్ని ఒకే జియోగ్రాఫిక్ ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్ (జీఐఎస్) ఆధారిత వేదికపైకి తీసుకొచ్చారు. మౌలిక సదుపాయాలు, భౌగోళిక లక్షణాలు, ఆర్థిక మండళ్లు, ఇతర సంబంధిత సమాచారాన్ని ఒకేచోట పరిశీలించే అవకాశాన్ని ప్రధానమంత్రి గతిశక్తి ప్రణాళికా నిపుణులకు కల్పిస్తోంది. తద్వారా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు సమాచార ఆధారిత ప్రణాళిక, నిర్ణయాలు తీసుకోవడానికి సహకరిస్తోంది. ఐదేళ్లలో ఈ విధానం దేశవ్యాప్త ప్రణాళికా వ్యవస్థగా విస్తరించింది.
ప్రధానమంత్రి గతిశక్తి ఒక సంక్షిప్త అవలోకనం
మౌలిక సదుపాయాల ప్రణాళికను మరింత సమగ్రంగా, సమర్థంగా, సమన్వయంతో చేపట్టేందుకు ఆరు సూత్రాలు ప్రధానమంత్రి గతిశక్తికి మార్గనిర్దేశం చేస్తున్నాయి. సమగ్ర అభివృద్ధి, బహుళ రవాణా మౌలిక సదుపాయాలు, చివరి అంచె అనుసంధానం, వేగవంతమైన భూసేకరణ, అనుమతుల సంఖ్య తగ్గింపు, పర్యావరణ ప్రభావాన్ని పరిమితం చేయడం వీటిలో ఉన్నాయి.

ప్రధానమంత్రి గతిశక్తి ముఖ్యాంశాలు:
మీకు తెలుసా?
ప్రధానమంత్రి గతిశక్తిలో వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన భారతమాల, సాగరమాల, అంతర్గత జలమార్గాలు, డ్రై/ల్యాండ్ పోర్టులు, ఉడాన్ వంటి మౌలిక సదుపాయాల పథకాలను అనుసంధానించారు.
- ఏడు మౌలిక సదుపాయాల చోదక రంగాలు: రహదారులు, రైల్వేలు, ఓడరేవులు, జలమార్గాలు, విమానాశ్రయాలు, సామూహిక రవాణా, లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలు ఈ ప్రణాళికలో ప్రధాన రంగాలుగా ఉన్నాయి.
- ప్రభుత్వ విభాగాల సమగ్ర ప్రణాళిక: జాతీయ మాస్టర్ ప్లాన్ పరిధిలో 58 కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, మొత్తం 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. వివిధ రంగాలకు చెందిన మౌలిక సదుపాయాల ప్రతిపాదనలను సమగ్రంగా ప్రణాళిక చేయడానికి, మదింపు చేపట్టడానికి ఇది వీలు కల్పిస్తోంది.
- సమగ్ర డిజిటల్ ప్రణాళిక: మౌలిక సదుపాయాలు, భౌగోళిక సమాచారాన్ని ఎన్‌ఎంపీ ఒకే జీఐఎస్ ఆధారిత వేదికపైకి తీసుకొస్తోంది. ప్రాంతాల వారీ ప్రణాళిక, నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సహాయపడుతోంది.
- విస్తృత సమాచార అందుబాటు: ప్రధానమంత్రి గతిశక్తి ప్రజా వేదిక ద్వారా ఆమోదం పొందిన 230 సమాచార సముదాయాలను పొందవచ్చు. ప్రాంతాల అనుకూలత విశ్లేషణ, అనుసంధాన మ్యాపింగ్, మార్గ ప్రణాళిక, నిబంధనల అమలు తనిఖీలకు ఈ సమాచారం ఉపయోగపడుతుంది.
- సమాచారం: 2026 అక్టోబర్ 12 నాటికి 23,493కుపైగా డేటా లేయర్స్ మౌలిక సదుపాయాలు, ఇతర సంబంధిత వివరాలను ఉమ్మడి జీఐఎస్ ఆధారిత వేదికపై అందిస్తున్నాయి.
ఐటీఎల్‌ఏ: సమగ్ర రవాణా ప్రణాళికకు మరింత బలం
ప్రధానమంత్రి గతిశక్తికి అనుబంధంగా ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్‌పోర్ట్ & లాజిస్టిక్స్ అథారిటీ (ఐటీఎల్‌ఏ) ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదం తెలిపింది. దీర్ఘకాలిక రవాణా ప్రణాళిక, సమన్వయంపై ఈ సంస్థ ప్రధానంగా దృష్టి సారిస్తుంది.
పది సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలపరిమితితో జాతీయ రవాణా మాస్టర్ ప్లాన్‌ను ఐటీఎల్‌ఏ రూపొందిస్తుంది. రంగాల వారీ ప్రణాళికలు, వార్షిక రవాణా ప్రణాళికలను సమీక్షిస్తుంది. ₹500 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ విలువైన ప్రాజెక్టులకు సాంకేతిక మదింపు చేపడుతుంది. వాటి అమలును కూడా పర్యవేక్షిస్తుంది. ఫాస్టాగ్, వాహన్, జీఎస్‌టీఎన్ ఈ-వే బిల్లుల వంటి వనరుల సమాచారాన్ని అనుసంధానించి నేషనల్ ట్రాన్స్‌పోర్ట్ డేటా రిపాజిటరీ (ఎన్‌టీడీఆర్) రూపొందిస్తుంది.
గతిశక్తి పనితీరు: సమన్వయం నుంచి ప్రాజెక్టు ప్రణాళిక వరకు
ప్రధానమంత్రి గతిశక్తి మూడు అంచెల సంస్థాగత వ్యవస్థతో పనిచేస్తోంది.
- కార్యదర్శుల సాధికార బృందం (ఈజీఓఎస్): కేబినెట్ కార్యదర్శి అధ్యక్షతన పనిచేసే ఈ బృందం ప్రధానమంత్రి గతిశక్తి అమలును పర్యవేక్షిస్తుంది. మాస్టర్ ప్లాన్‌లో మార్పులను సమీక్షించి, పరిశీలించి, ఆమోదిస్తుంది.
- నెట్‌వర్క్ ప్లానింగ్ గ్రూప్ (ఎన్‌పీజీ): మౌలిక సదుపాయాల మంత్రిత్వ శాఖలు, విభాగాల్లోని నెట్‌వర్క్ ప్లానింగ్ డివిజన్ల అధిపతులను ఎన్‌పీజీ ఒకే వేదికపైకి తీసుకొస్తుంది. మౌలిక సదుపాయాల ప్రతిపాదనలను పరిశీలించి, ఏకీకృత ప్రణాళిక, సమన్వయం, వనరుల గరిష్ఠ వినియోగానికి చర్యలు తీసుకుంటుంది. ప్రాజెక్టు ప్రణాళిక కోసం జాతీయ మాస్టర్ ప్లాన్ కింద చోటుచేసుకునే పరిణామాలను కూడా పర్యవేక్షిస్తుంది.
- టెక్నికల్ సపోర్ట్ యూనిట్ (టీఎస్‌యూ): వివిధ రంగాలు, అంశాల్లో నిపుణులతో కూడిన ఈ విభాగం మదింపు ప్రక్రియకు సహకరిస్తుంది. ప్రధానమంత్రి గతిశక్తి సచివాలయంగా విధులు నిర్వర్తించే లాజిస్టిక్స్ విభాగానికి అవసరమైన సహాయం అందిస్తుంది.
2026 ఆగస్టు 11 నాటికి సుమారు ₹18.66 లక్షల కోట్ల అంచనా వ్యయంతో కూడిన 396 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ఎన్‌పీజీ మదింపు చేసింది. వీటిలో 256 ప్రాజెక్టులకు అనుమతులు లభించగా, 198 ప్రాజెక్టులు అమలు దశలో ఉన్నాయి. భౌగోళిక సమాచారం, ఉపగ్రహ చిత్రాలు, విశ్లేషణ సాధనాలను ప్రణాళికా నిపుణులకు అందించే డిజిటల్ వేదిక ఈ సంస్థాగత వ్యవస్థకు సహకరిస్తోంది.


గతిశక్తి విశ్వవిద్యాలయం: సమగ్ర మౌలిక సదుపాయాల ప్రణాళికకు నైపుణ్యాల పెంపు
రవాణా, లాజిస్టిక్స్ రంగాలపైనే ప్రత్యేకంగా దృష్టి సారించిన దేశంలోనే తొలి విశ్వవిద్యాలయం గతిశక్తి విశ్వవిద్యాలయం (జీఎస్‌వీ). 2022లో ఏర్పాటైన ఈ విశ్వవిద్యాలయం రవాణా సంబంధిత విభాగాల్లో విద్య, అధికారులకు శిక్షణ, పరిశోధనను ఒకే వేదికపైకి తీసుకొచ్చింది.
ప్రత్యేక విద్య, శిక్షణ, పరిశోధన ద్వారా ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్, జాతీయ లాజిస్టిక్స్ విధానం-2022కు జీఎస్‌వీ సహకరిస్తోంది. ఈ రెండు కార్యక్రమాలకు సంబంధించిన కోర్సులను రూపొందించి, నిర్వహించే నోడల్ సంస్థగా వ్యవహరిస్తోంది. ఉత్తమ విధానాలను పంచుకోవడం, లాజిస్టిక్స్ రంగంలో పరిశోధన, నవకల్పనలను ప్రోత్సహించడం కోసం విజ్ఞాన కేంద్రాలను ఏర్పాటు చేయాలని కూడా ఈ భాగస్వామ్యం ప్రతిపాదిస్తోంది. 2026 జులై నాటికి ప్రధానమంత్రి గతిశక్తి కోసం రూపొందించిన కోర్సుల ద్వారా 2.4 లక్షలకుపైగా అధికారులకు విశ్వవిద్యాలయం శిక్షణ ఇచ్చింది. సముద్ర రవాణా, వంతెనలు, సొరంగాల ఇంజినీరింగ్, రక్షణ లాజిస్టిక్స్ వంటి ప్రత్యేక విభాగాలతో పాటు సమగ్ర రవాణా ప్రణాళికకు అవసరమైన అనువర్తిత పరిశోధనపై కూడా దృష్టిని విస్తరిస్తోంది.
సమాచారం నుంచి నిర్ణయాల వరకు: ప్రణాళికా నిపుణులకు డిజిటల్ వ్యవస్థ సహకారం
మౌలిక సదుపాయాలు, భౌగోళిక లక్షణాలు, జనాభాకు సంబంధించిన జీఐఎస్ ఆధారిత సమాచారాన్ని ఎన్‌ఎంపీ ఒకే వేదికపైకి తీసుకొస్తోంది. సమగ్ర మౌలిక సదుపాయాల ప్రణాళికకు తోడ్పడేలా ఆర్థిక మండళ్లను బహుళ రవాణా అనుసంధాన మౌలిక సదుపాయాలతో కలిపి మ్యాపింగ్ చేస్తున్నారు. ప్రాజెక్టుల ప్రణాళిక సమయంలో విభిన్న మౌలిక సదుపాయాల నెట్‌వర్క్‌లు, సంబంధిత భౌగోళిక సమాచారాన్ని ఒకేచోట పరిశీలించే అవకాశం ప్రణాళికా నిపుణులకు లభిస్తోంది.
సమాచారాన్ని నవీకరించడం, అనుసంధానించడం కోసం ప్రత్యేక వ్యవస్థలతో పాటు ప్రాంతాల వారీ ప్రణాళిక, విశ్లేషణ సాధనాలను ఈ వేదిక అందిస్తోంది. ప్రాజెక్టు సమాచారాన్ని చేర్చడం, ప్రాంతాల మధ్య దూరాన్ని కొలవడం, గో/నో-గో ప్రాంతాలను గుర్తించడం, అనుమతులు పొందడం వంటి కార్యక్రమాలకు ఇది సహకరిస్తుంది. అభివృద్ధి కార్యకలాపాలపై పరిమితులు ఉండే ప్రాంతాలను గో/నో-గో ప్రాంతాలుగా పేర్కొంటారు.
మౌలిక సదుపాయాలు, కీలక కేంద్రాల మ్యాపింగ్
బహుళ రవాణా అనుసంధాన మౌలిక సదుపాయాలతో పాటు ఆర్థిక, సామాజిక, లాజిస్టిక్స్ కేంద్రాలను ప్రధానమంత్రి గతిశక్తి ఎన్‌ఎంపీ మ్యాపింగ్ చేస్తోంది. తద్వారా మౌలిక సదుపాయాల అనుసంధానాలు, పరిసర ప్రాంతాల అభివృద్ధి పరిస్థితులను ప్రణాళికా ప్రక్రియలో భాగం చేస్తోంది. ఆర్థిక మండళ్లు, అభివృద్ధి ప్రాజెక్టులకు అవసరమైన మౌలిక సదుపాయాల అనుసంధానాలను గుర్తించేందుకు ఈ వేదిక సహకరిస్తుంది. ప్రజలు, వస్తువులు, సేవల నిరంతర రవాణాకు ఆటంకం కలిగించే అనుసంధాన లోపాలను కూడా గుర్తిస్తుంది.
సమగ్ర మౌలిక సదుపాయాల ప్రణాళికకు సహకరించేలా వస్త్ర, ఔషధ పరిశ్రమల సమూహాలు, రక్షణ కారిడార్లు, ఎలక్ట్రానిక్ పార్కులు, పారిశ్రామిక కారిడార్లు, మత్స్య పరిశ్రమల సమూహాలు, వ్యవసాయ మండళ్ల వంటి ఆర్థిక ప్రాంతాలను మ్యాపింగ్ చేస్తున్నారు.
ఉదాహరణ: బిహార్‌లోని ఖగారియా-పూర్ణియా కారిడార్: ఆధునికీకరించిన ఈ కారిడార్‌ను వస్త్ర పరిశ్రమల సమూహం, మెగా ఫుడ్ పార్కులు, మత్స్య/సముద్ర ఉత్పత్తుల పార్కులతో కూడిన ఐదు ప్రధానమంత్రి గతిశక్తి ఆర్థిక కేంద్రాలకు అనుసంధానించేలా ప్రణాళిక రూపొందించారు. వీటితో పాటు 11 లాజిస్టిక్స్ కేంద్రాలకు కూడా అనుసంధానం కల్పిస్తారు. ఈ అనుసంధానం ద్వారా ప్రాంతవ్యాప్తంగా వస్తువులు, ప్రయాణికుల రవాణా వేగవంతం కానుంది.
లాజిస్టిక్స్ వ్యవస్థల అనుసంధానం
యూనిఫైడ్ లాజిస్టిక్స్ ఇంటర్‌ఫేస్ ప్లాట్‌ఫామ్ (యూలిప్) ఏపీఐ ఆధారంగా ప్రభుత్వ లాజిస్టిక్స్ వ్యవస్థలను అనుసంధానిస్తుంది. లాజిస్టిక్స్ డేటా బ్యాంక్ (ఎల్‌డీబీ) ఎగ్జిమ్ కంటైనర్ల రవాణాను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే సౌకర్యం కల్పిస్తోంది. ఈ రెండు వ్యవస్థలు లాజిస్టిక్స్ రంగంలో డిజిటల్ సమాచార మార్పిడి, కార్యకలాపాల పర్యవేక్షణను బలోపేతం చేస్తున్నాయి. 2026 జులై నాటికి 142 ఏపీఐల ద్వారా 12 కేంద్ర మంత్రిత్వ శాఖలకు చెందిన 46 ప్రభుత్వ వ్యవస్థలను యూలిప్ అనుసంధానించింది.
విస్తృత వినియోగదారులకు భౌగోళిక సమాచారం
డిజిటల్ వ్యవస్థను ప్రభుత్వ వినియోగదారుల పరిధి దాటి విస్తరించారు. భాస్కరాచార్య నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్స్ అండ్ జియో-ఇన్ఫర్మాటిక్స్ (బిసాగ్-ఎన్) రూపొందించిన క్వెరీ-బేస్డ్ అనలిటిక్స్ మెకానిజం ద్వారా 2025 అక్టోబర్‌లో ప్రధానమంత్రి గతిశక్తి ఎన్‌ఎంపీ వేదికను ప్రైవేటు రంగానికి అందుబాటులోకి తీసుకొచ్చారు. మౌలిక సదుపాయాల ప్రణాళిక, పెట్టుబడి నిర్ణయాల కోసం ఎంపిక చేసిన సున్నితేతర సమాచార సముదాయాలను నియంత్రిత పద్ధతిలో పొందవచ్చు.
భౌతిక, సామాజిక మౌలిక సదుపాయాలకు సంబంధించిన 230 ఆమోదిత సమాచార సముదాయాలను ప్రస్తుతం ఈ వేదిక అందిస్తోంది. వినియోగదారులు ప్రాంతాల అనుకూలత విశ్లేషణ, అనుసంధాన మ్యాపింగ్, మార్గ ప్రణాళిక, నిబంధనల అమలు తనిఖీలు చేపట్టవచ్చు. విశ్లేషణాత్మక నివేదికలను కూడా రూపొందించుకోవచ్చు.
సమాచారం నుంచి పర్యవేక్షణ వరకు
ప్రాజెక్టుల పురోగతిని పర్యవేక్షించడం, మౌలిక సదుపాయాల సమాచారాన్ని నవీకరించడానికి కూడా డిజిటల్ వేదిక సహకరిస్తోంది. ప్రధానమంత్రి గతిశక్తి ఎన్‌ఎంపీ డ్యాష్‌బోర్డ్ వివిధ రంగాలకు సంబంధించిన నివేదికలను అందిస్తూ, పురోగతిని పర్యవేక్షించడానికి, అమలు చేయదగిన సూచనలు పొందడానికి వీలు కల్పిస్తోంది. డేటా అప్‌లోడింగ్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (డీయూఎంఎస్) వికేంద్రీకృత పద్ధతిలో సమాచార నిర్వహణ, ఎప్పటికప్పుడు నవీకరణకు అవకాశం ఇస్తోంది.
మౌలిక సదుపాయాల అభివృద్ధిపై సమాచార ఆధారిత నిర్ణయాలు, ప్రణాళిక, వనరుల గరిష్ఠ వినియోగానికి భౌగోళిక సమాచారం, ఉపగ్రహ చిత్రాలు, ఏపీఐ అనుసంధానాన్ని ఈ సమగ్ర విధానం ఉపయోగిస్తోంది.
ఆచరణలో ప్రధానమంత్రి గతిశక్తి
* పుణె-బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌వే: 699 కిలోమీటర్ల పొడవైన ఈ ఎక్స్‌ప్రెస్‌వేను 2027–28 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మహారాష్ట్ర, కర్ణాటకల్లోని పారిశ్రామిక, ఆర్థిక సమూహాలను ఇది అనుసంధానిస్తుంది. వీటిలో ఆటోమొబైల్, గృహోపకరణాల తయారీ కేంద్రాలు, ఔషధ పరిశ్రమల సమూహాలు, ప్రత్యేక ఆర్థిక మండళ్లు, రక్షణ కారిడార్లు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు 15 జాతీయ రహదారులు, 25 రాష్ట్ర రహదారులు, 6 రైల్వే స్టేషన్లను అనుసంధానిస్తూ బహుళ రవాణా సౌకర్యాన్ని కల్పిస్తుంది. ప్రధానమంత్రి గతిశక్తి ఎన్‌ఎంపీ వేదికను ఉపయోగించి అటవీ భూమితో మార్గం కలిసే పరిధిని 19 శాతం తగ్గించేలా అలైన్‌మెంట్‌ను సవరించారు. ఈ ప్రాజెక్టు ప్రయాణ సమయాన్ని 7–8 గంటలు తగ్గించనుంది. ఏటా సుమారు 16 కోట్ల లీటర్ల ఇంధనాన్ని ఆదా చేయడంతో పాటు దాదాపు 39 కోట్ల కిలోల కార్బన్ ఉద్గారాలను తగ్గించనుంది.
* జోగిఘోపా బహుళ రవాణా లాజిస్టిక్స్ పార్క్, అస్సాం: అస్సాంలోని బ్రహ్మపుత్ర ఉత్తర తీరంలో జోగిఘోపా బహుళ రవాణా లాజిస్టిక్స్ పార్క్ ఉంది. ఈశాన్య ప్రాంతంలో రోడ్డు, రైలు, అంతర్గత జలమార్గాల ద్వారా నిరంతరాయ సరకు రవాణాకు వీలు కల్పించేలా దీనిని రూపొందించారు. సమగ్ర ప్రణాళిక, డిమాండ్ విశ్లేషణ కోసం ప్రధానమంత్రి గతిశక్తిని ఉపయోగించారు. ధుబ్రి–ఫుల్‌బారి మధ్య బ్రహ్మపుత్ర నదిపై నిర్మాణంలో ఉన్న నాలుగు వరుసల వంతెన ప్రయాణ దూరాన్ని 205 కిలోమీటర్ల నుంచి 20 కిలోమీటర్లకు, ప్రయాణ సమయాన్ని సుమారు ఏడు గంటల నుంచి 30 నిమిషాలకు తగ్గించేలా ప్రణాళిక రూపొందించారు.
* హరిత ఇంధన కారిడార్-లద్దాఖ్ నుంచి హరియాణా వరకు: ప్రధానమంత్రి గతిశక్తి కింద ఎన్‌పీజీ సిఫారసు చేసిన ఈ ప్రాజెక్టు 5 గిగావాట్ల ప్రసార వ్యవస్థ ద్వారా 13 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌ను తరలించి, గ్రిడ్‌లో అనుసంధానించేందుకు వీలు కల్పిస్తుంది. లద్దాఖ్‌లోని పాంగ్ నుంచి హరియాణాలోని కైతల్ వరకు 480 కిలోమీటర్ల హెచ్‌వీడీసీ ప్రసార మార్గం ఇందులో భాగంగా ఉంటుంది. రెండు చివర్లలో 5 గిగావాట్ల హెచ్‌వీడీసీ టెర్మినళ్లను ఏర్పాటు చేస్తారు. హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్ మీదుగా ప్రయాణించే ఈ ప్రసార వ్యవస్థ కైతల్ వద్ద జాతీయ గ్రిడ్‌తో అనుసంధానం అవుతుంది. 2029–30 ఆర్థిక సంవత్సరం నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
అనుసంధానిత మౌలిక సదుపాయాల భవిష్యత్తు నిర్మాణం
ప్రారంభించిన ఐదేళ్ల తర్వాత ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ మౌలిక సదుపాయాల ప్రణాళికా కార్యక్రమం నుంచి విస్తృత డిజిటల్ ప్రణాళికా వ్యవస్థగా రూపాంతరం చెందింది. కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాలు, జిల్లాలు, కొత్త మౌలిక సదుపాయాల రంగాలకు దీని విస్తరణతో భారత్‌లో తదుపరి తరం మౌలిక సదుపాయాల ప్రణాళికకు మరింత సమగ్ర విధానం రూపుదిద్దుకుంటోంది.
References
Prime Minister's Office
https://www.pib.gov.in/Pressreleaseshare.aspx?PRID=1763576&lang=2®=48
Cabinet Committee on Economic Affairs (CCEA)
https://www.pib.gov.in/PressReleseDetailm.aspx?PRID=1968732&lang=2®=48
Ministry of Commerce and Industry
https://pmgatishakti.gov.in/pmgatishakti/login
https://pmgatishakti.gov.in/pmgatishakti/about_pmgati
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2178521®=48&lang=2
https://static.pib.gov.in/WriteReadData/specificdocs/documents/2023/apr/doc2023427188001.pdf
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1964364&lang=2®=48
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2297818®=48&lang=1
https://static.pib.gov.in/WriteReadData/specificdocs/documents/2022/nov/doc20221124135401.pdf
https://www.pib.gov.in/Pressreleaseshare.aspx?PRID=1988824&lang=2®=48
https://www.dpiit.gov.in/offerings/schemes-and-services/details/pm-gati-shakti-kjNyATMtQWa
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2178521®=48&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2178500&lang=1®=3
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2297818&lang=2®=48
https://pmgatishakti.gov.in/pmgatishakti/downloadfilenew/--srv--NMP_Files--1741588112582_PMGatiShakti_Compendium%20Vol-1.pdf
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1910456&lang=2®=48
Ministry of Road Transport & Highways
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2111288&lang=1®=1
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2268357&lang=1®=48
Ministry of Railways
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2031049®=48&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2286394&lang=1®=48
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2206603&lang=1®=1
Gati Shakti Vishwavidyalaya
https://gsv.ac.in/
https://gsv.ac.in/vice-chancellor/
Ministry of Electronics & IT
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2301687&lang=1®=3
PIB Archive
https://www.pib.gov.in/PressNoteDetails.aspx?ModuleId=3&NoteId=153274&lang=1®=3
https://www.pib.gov.in/FactsheetDetails.aspx?id=151083&NoteId=151083&ModuleId=16®=48&lang=2
Click here to see pdf
PIB Research
***
(Explainer ID: 160649)
आगंतुक पटल : 38
Provide suggestions / comments