Technology
భారత్‌లో క్లౌడ్ వ్యవస్థ
సురక్షితమైన, విస్తరణకు అనువైన కంప్యూటింగ్‌కు డిజిటల్ పునాది
Posted On:
29 OCT 2026 2:13PM
భారత్‌లో వేగవంతమైన డిజిటలీకరణతో సురక్షితమైన, అవసరాలకు అనుగుణంగా విస్తరించగల, నమ్మకమైన క్లౌడ్ మౌలిక సదుపాయాలకు డిమాండ్ పెరుగుతోంది. డిజిటల్ పాలన, ప్రజాసేవల అందజేతకు క్లౌడ్ కంప్యూటింగ్ ముఖ్యమైన పునాదిగా మారుతోంది. మేఘ్‌రాజ్ వంటి కార్యక్రమాలు, స్వదేశీ డేటా సెంటర్ల సామర్థ్య విస్తరణ ద్వారా భారత్ దేశీయ క్లౌడ్ సామర్థ్యాలను పెంచుకుంటోంది. విధానపరమైన చర్యలు, సంస్థాగత వ్యవస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాలు దేశంలోని వివిధ రంగాల్లో క్లౌడ్ వినియోగాన్ని మరింత ప్రోత్సహిస్తున్నాయి.
డేటా సార్వభౌమత్వానికి క్లౌడ్ పునాది
భారత్‌లో డిజిటల్ రంగ అభివృద్ధితో పాలన, వాణిజ్యం, కమ్యూనికేషన్, ప్రజాసేవల్లో గతంలో ఎన్నడూ లేనంత పరిమాణంలో డేటా ఉత్పత్తవుతోంది. 2026 మార్చిలో దేశ ఇంటర్నెట్ చందాదారుల సంఖ్య 1,092.79 మిలియన్లకు చేరుకుంది. పెరుగుతున్న డిజిటల్ వినియోగంతో డేటా వినియోగం కూడా అధికమవుతోంది. నెలకు ఒక్కో చందాదారుడి సగటు వైర్‌లెస్ డేటా వినియోగం 25.51 జీబీకి చేరుకుంది. మొత్తం వైర్‌లెస్ డేటా వినియోగం 2025–26 ఆర్థిక సంవత్సరంలో 285,376 పెటాబైట్లకు పెరిగింది. డిజిటల్ చెల్లింపులు లావాదేవీల రికార్డులను, ఆన్‌లైన్ ప్రజాసేవలు డిజిటల్ రికార్డులను సృష్టిస్తున్నాయి. కృత్రిమ మేధ అప్లికేషన్లు భారీ పరిమాణంలో సమాచారాన్ని ఉత్పత్తి చేసి, ప్రాసెస్ చేస్తున్నాయి. పెరుగుతున్న ఈ డేటాను సమర్థంగా నిల్వ చేయడానికి, ప్రాసెస్ చేయడానికి, నిర్వహించడానికి సురక్షితమైన, అవసరాలకు అనుగుణంగా విస్తరించగల, నమ్మకమైన మౌలిక సదుపాయాలు అవసరం.
ఈ అవసరాలను తీర్చేందుకు కేవలం నిల్వ స్థలం సరిపోదు. సమాచారాన్ని ప్రాసెస్ చేయడానికి, అప్లికేషన్లను నడిపేందుకు, డిజిటల్ సేవలను నమ్మకంగా అందించేందుకు సంస్థలకు కంప్యూటింగ్ శక్తి కూడా అవసరం. భౌతిక సర్వర్లు, ఇతర పరికరాలను సొంతంగా నిర్వహించడం వ్యయభారంగా మారవచ్చు, వాటిని విస్తరించడం కూడా కష్టమవచ్చు. అవసరమైనప్పుడు ఇంటర్నెట్ ద్వారా కంప్యూటింగ్ వనరులను అందిస్తూ క్లౌడ్ కంప్యూటింగ్ ఈ సమస్యకు పరిష్కారం చూపుతుంది. అయితే క్లౌడ్ సేవలపై ఆధారపడటం పెరుగుతున్నకొద్దీ, సున్నితమైన సమాచారాన్ని రక్షించడం, దాని నిల్వ, ప్రాసెసింగ్‌పై నియంత్రణను కొనసాగించడం మరింత ముఖ్యమవుతోంది. దేశీయ క్లౌడ్ అభివృద్ధి కీలక డిజిటల్ వనరులపై జాతీయ నియంత్రణను బలోపేతం చేయడం ద్వారా డేటా సార్వభౌమత్వానికి తోడ్పడగలదు.
డేటా నిల్వ, సర్వర్లు, సాఫ్ట్‌వేర్, ప్రాసెసింగ్ సామర్థ్యాలతో సహా కంప్యూటింగ్ వనరులను ఇంటర్నెట్ ద్వారా పొందేందుకు క్లౌడ్ కంప్యూటింగ్ వినియోగదారులకు వీలు కల్పిస్తుంది. సొంత సర్వర్లను కొనుగోలు చేసి నిర్వహించడానికి బదులు, సంస్థలు అవసరాలకు అనుగుణంగా ఈ వనరులను ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకు, గూగుల్ డ్రైవ్‌లో వినియోగదారులు పత్రాలను ఆన్‌లైన్‌లో నిల్వ చేసి, వివిధ పరికరాల ద్వారా వాటిని పొందవచ్చు. అలాగే, ఒక ప్రభుత్వ విభాగం అవసరమైన పరికరాలన్నింటినీ సొంతంగా నిర్వహించడానికి బదులు, తన అప్లికేషన్లు, డేటాబేస్‌లను క్లౌడ్ వేదికపై ఉంచవచ్చు. తగిన భద్రతా చర్యలు, పాలనా వ్యవస్థలతో కూడిన దేశీయ క్లౌడ్ మౌలిక సదుపాయాలు సున్నితమైన సమాచారంపై నియంత్రణను బలోపేతం చేయగలవు. నమ్మకమైన ప్రజాసేవలు, కృత్రిమ మేధ అభివృద్ధి, భారత సాంకేతిక స్వావలంబనకు కూడా తోడ్పడగలవు.
భారత్‌లో క్లౌడ్ సేవల సంస్థల వ్యవస్థ
2026 సెప్టెంబర్ నాటికి భారత్‌లో 30 క్లౌడ్ సేవల సంస్థలు (సీఎస్‌పీలు) అధికారిక ఎంపిక జాబితాలో ఉన్నాయి. ముంబై, నవీ ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ-ఎన్‌సీఆర్, జామ్‌నగర్ తదితర ప్రాంతాల్లో వీటికి మౌలిక సదుపాయాలు ఉన్నాయి. ఎంపిక చేసిన సంస్థల్లో జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్), ఐటీఐ లిమిటెడ్, రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, అదానీకనెక్స్ ప్రైవేట్ లిమిటెడ్, యొట్టా డేటా సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి భారతీయ కంపెనీలు ఉన్నాయి. అంతర్జాతీయ సంస్థల్లో గూగుల్ క్లౌడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఒరాకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తదితర సంస్థలు ఉన్నాయి.
క్లౌడ్ కంప్యూటింగ్ ప్రధాన ప్రయోజనాలు

డిజిటల్ మౌలిక సదుపాయాలను మరింత అందుబాటులోకి తీసుకురావడం, అవసరాలకు అనుగుణంగా మార్చుకోవడం, సమర్థంగా ఉపయోగించుకోవడం ద్వారా క్లౌడ్ కంప్యూటింగ్ పలు ప్రయోజనాలను అందిస్తుంది. భౌతిక సర్వర్ల కొనుగోలు, నిర్వహణ అవసరాన్ని పరిమితం చేస్తూ ఖర్చులను తగ్గిస్తుంది.
డేటాను నిల్వ చేసే, డిజిటల్ సేవలను నడిపే కంప్యూటర్లను ఉంచే ప్రత్యేక గదిని సర్వర్ గది అంటారు. ఉదాహరణకు, ఒక పాఠశాల సొంత కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలపై పెట్టుబడి పెట్టడానికి బదులు, విద్యార్థుల రికార్డులను క్లౌడ్ వేదికపై నిల్వ చేయవచ్చు.
మౌలిక సదుపాయాల ఏర్పాటుకు ఎక్కువ సమయం వెచ్చించకుండానే సంస్థలు సేవలను ప్రారంభించే వీలు కల్పిస్తూ, డిజిటల్ సేవలు, అప్లికేషన్లను వేగంగా అందుబాటులోకి తీసుకురావడానికి ఇది తోడ్పడుతుంది. ఉదాహరణకు, ఒక ఆసుపత్రి సొంత సర్వర్లను ఏర్పాటు చేసుకోకుండానే ఆన్‌లైన్ అపాయింట్‌మెంట్ వ్యవస్థను ప్రవేశపెట్టవచ్చు.
క్లౌడ్ వేదికలు సులభంగా విస్తరించుకునే సౌలభ్యాన్ని కూడా అందిస్తాయి. డిమాండ్‌కు అనుగుణంగా కంప్యూటింగ్ వనరులను సర్దుబాటు చేసుకునేందుకు సంస్థలకు వీలు కల్పిస్తాయి. ఉదాహరణకు, ఆన్‌లైన్ పరీక్షల పోర్టల్ రిజిస్ట్రేషన్ సమయంలో తన వనరులను పెంచుకొని, ఆ తర్వాత తగ్గించుకోవచ్చు.
వేర్వేరు ప్రాంతాల్లోని వినియోగదారులు సమాచారాన్ని పొందేందుకు, పంచుకునేందుకు వీలు కల్పించడం ద్వారా క్లౌడ్ కంప్యూటింగ్ మెరుగైన సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. ఉదాహరణకు, విశ్వవిద్యాలయ విద్యార్థులు పరిశోధనా ప్రాజెక్టుల్లో కలిసి పనిచేయవచ్చు, అధ్యయన సామగ్రిని పంచుకోవచ్చు, పత్రాలను ఆన్‌లైన్‌లో సవరించవచ్చు.

క్లౌడ్ వేదికలు డేటా బ్యాకప్, పునరుద్ధరణను బలోపేతం చేస్తాయి. పొరపాటున డేటాను తొలగించడం, పరికరాలు విఫలం కావడం లేదా ఇతర అంతరాయాల తర్వాత సమాచారాన్ని తిరిగి పొందేందుకు సహాయపడతాయి. ఉదాహరణకు, వ్యవస్థ విఫలమైన తర్వాత ఒక ఆసుపత్రి బ్యాకప్ తీసుకున్న రోగుల రికార్డులను పునరుద్ధరించుకోవచ్చు.
అనుకోని అంతరాయాల తర్వాత సంస్థలు కార్యకలాపాలను త్వరగా పునఃప్రారంభించేందుకు సహాయపడుతూ, ఈ సామర్థ్యాలు సేవల కొనసాగింపును కూడా బలోపేతం చేస్తాయి. ఉదాహరణకు, ప్రధాన మౌలిక సదుపాయాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవ బ్యాకప్ వ్యవస్థలకు మారవచ్చు.
డిజిటల్ రికార్డుల నిల్వ, క్రమబద్ధీకరణ, తిరిగి పొందే ప్రక్రియలను సులభతరం చేయడం ద్వారా క్లౌడ్ కంప్యూటింగ్ సమర్థమైన డేటా నిర్వహణకు కూడా తోడ్పడుతుంది. ఉదాహరణకు, ఒక ఈ-కామర్స్ వ్యాపార సంస్థ ఉత్పత్తుల సమాచారం, వినియోగదారుల ఆర్డర్లు, సరుకుల నిల్వల వివరాలను ఒకే క్లౌడ్ ఆధారిత వ్యవస్థ ద్వారా నిర్వహించవచ్చు.
డిజిటల్ ఇండియా భాషిణి వేదిక క్లౌడ్‌కు మార్పు
డిజిటల్ సేవలను మెరుగుపరుస్తూనే డేటా సార్వభౌమత్వానికి స్వదేశీ క్లౌడ్ మౌలిక సదుపాయాలు ఎలా తోడ్పడగలవో డిజిటల్ ఇండియా భాషిణి వేదిక చూపిస్తోంది. యొట్టా డేటా సర్వీసెస్ నిర్వహించే భారతీయ క్లౌడ్‌కు భాషిణి మారినట్లు ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ 2026 ఫిబ్రవరిలో తెలిపింది. భాషా డేటాసెట్లు, ఏఐ నమూనాలు, పౌరులతో పరస్పర చర్యలు భారత అధికార పరిధిలోనే ఉండేలా ఈ మార్పు చేస్తుంది. ఈ అమలుతో పనితీరులో 40% వరకు మెరుగుదల, ఖర్చుల్లో 20–30% ఆదా, 99.99% సమయం సేవల అందుబాటును సాధించినట్లు నివేదించారు.
మహా కుంభ్ 2025 సమయంలో 11కుపైగా భారతీయ భాషల్లో తక్షణ అనువాదం, వాయిస్ ఆధారిత సహాయాన్ని భాషిణి అందించింది. భాషా అడ్డంకులున్నప్పటికీ యాత్రికులు సమాచారం పొందేందుకు దీని బహుభాషా సేవలు తోడ్పడ్డాయి.
సృజనాత్మక మేధస్సు, శాస్త్ర ప్రగతికి ఊతం, సామర్థ్యాన్ని పెంచే సాంకేతికతలు

భారత ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కాంక్లేవ్ రెండో సదస్సు ఎస్టిక్-2026, 2026 అక్టోబర్ 27–29 తేదీల్లో న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతోంది. ఈ సదస్సు ప్రధాన అంశం “సృజనాత్మక మేధస్సు, శాస్త్ర ప్రగతికి ఊతం, సామర్థ్యాన్ని పెంచే సాంకేతికతలు.” కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్‌ఐఆర్) నిర్వహిస్తున్న ఎస్టిక్-2026, క్లౌడ్ కంప్యూటింగ్, ఇతర కొత్త సాంకేతికతలతో సహా శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందుతున్న విభాగాలను ముందుకు తీసుకెళ్తోంది. వ్యూహాత్మక భాగస్వామ్యాలకు ఊతమిస్తూ, వికసిత్ భారత్ 2047 లక్ష్యానికి తోడ్పడుతోంది. 12 ప్రధాన అంశాలతో కూడిన ఈ సదస్సులో ప్లీనరీ సమావేశాలు, సాంకేతిక చర్చలు, ప్రదర్శనలు ఉన్నాయి.
క్లౌడ్ కంప్యూటింగ్ ప్రాథమిక అంశాలు
క్లౌడ్ నమూనాల రకాలు

క్లౌడ్ మౌలిక సదుపాయాలు ఎక్కడ పనిచేస్తాయి, ఎవరు వాటిని ఉపయోగించవచ్చు, ఒక సంస్థకు ఎంత నియంత్రణ ఉంటుంది అనే అంశాలను క్లౌడ్ నమూనాలు నిర్ణయిస్తాయి. సాధారణంగా చర్చించే మూడు నమూనాలు పబ్లిక్, ప్రైవేట్, హైబ్రిడ్ క్లౌడ్.
పబ్లిక్ క్లౌడ్‌లో మూడో పక్ష సేవల సంస్థ అందించే మౌలిక సదుపాయాలను పలువురు వినియోగదారులు పంచుకుంటారు. ఉదాహరణకు, ఒక వ్యాపార/వీడియో-స్ట్రీమింగ్ సంస్థ ఉమ్మడి సర్వర్ల ద్వారా మిలియన్ల మంది ప్రేక్షకులకు సేవలు అందిస్తుంది.
ప్రైవేట్ క్లౌడ్‌లో మౌలిక సదుపాయాలను ఒకే సంస్థకు ప్రత్యేకంగా కేటాయిస్తారు. ఉదాహరణకు, భద్రతపై ఎక్కువ నియంత్రణతో సున్నితమైన పాలనా రికార్డులను నిర్వహించేందుకు ఒక రాష్ట్ర ఖజానా కార్యాలయం చెల్లింపులు, ఖాతాల డేటాను ప్రైవేట్ క్లౌడ్‌లో ఉంచుతుంది.
హైబ్రిడ్ క్లౌడ్ పబ్లిక్, ప్రైవేట్ క్లౌడ్ వ్యవస్థలను కలుపుతుంది. ఉదాహరణకు, ఒక నగరపాలక సంస్థ తన ఆస్తి పన్ను చెల్లింపుల పోర్టల్‌ను పబ్లిక్ క్లౌడ్‌లో, పౌరుల రికార్డులను ప్రైవేట్ క్లౌడ్‌లో ఉంచుతుంది. సంస్థ భద్రత, ఖర్చు, నిర్వహణ అవసరాలపై ఈ ఎంపిక ఆధారపడి ఉంటుంది.
వివిధ క్లౌడ్ సేవలు
డిజిటల్ మౌలిక సదుపాయాలను అద్దెకు తీసుకోవడం నుంచి సిద్ధంగా ఉన్న అప్లికేషన్లను ఉపయోగించడం వరకు, క్లౌడ్ సేవలు వివిధ స్థాయుల్లో కంప్యూటింగ్ మద్దతును అందిస్తాయి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ (ఐఏఏఎస్), ప్లాట్‌ఫామ్ యాజ్ ఎ సర్వీస్ (పీఏఏఎస్), సాఫ్ట్‌వేర్ యాజ్ ఎ సర్వీస్ (ఎస్‌ఏఏఎస్), సర్వర్‌లెస్ కంప్యూటింగ్ అనే నాలుగు సాధారణ విభాగాలు ఉన్నాయి. ఒకదానిపై మరొకటి ఆధారపడి నిర్మితమవుతాయి కాబట్టి, వీటిని కొన్నిసార్లు క్లౌడ్ కంప్యూటింగ్ "స్టాక్" అని కూడా అంటారు.
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ (ఐఏఏఎస్) భౌతిక పరికరాలను కొనుగోలు చేయడానికి బదులు వర్చువల్ సర్వర్లు, నిల్వ, నెట్‌వర్క్‌లు వంటి కంప్యూటింగ్ వనరులను అద్దెకు తీసుకునేందుకు వినియోగదారులకు వీలు కల్పిస్తుంది. ఉదాహరణకు, ఒక ఆన్‌లైన్ విక్రయ సంస్థ తన వెబ్‌సైట్‌ను నిర్వహించేందుకు క్లౌడ్ సర్వర్లను అద్దెకు తీసుకోవచ్చు. పండుగల అమ్మకాల సమయంలో సందర్శకుల రద్దీ పెరిగితే, దానికి అనుగుణంగా కంప్యూటింగ్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు.
ప్లాట్‌ఫామ్ యాజ్ ఎ సర్వీస్ (పీఏఏఎస్) మౌలిక సదుపాయాలను నిర్వహించాల్సిన అవసరం లేకుండా అప్లికేషన్లను రూపొందించడానికి, పరీక్షించడానికి, అందుబాటులోకి తీసుకురావడానికి డెవలపర్లకు సాధనాలను అందిస్తుంది. ఉదాహరణకు, మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్‌ను అభివృద్ధి చేసే బృందం తన సాఫ్ట్‌వేర్‌ను రూపొందించేందుకు, పరీక్షించేందుకు క్లౌడ్ వేదికను ఉపయోగించవచ్చు.
సాఫ్ట్‌వేర్ యాజ్ ఎ సర్వీస్ (ఎస్‌ఏఏఎస్) ఇంటర్నెట్ ద్వారా నేరుగా ఉపయోగించేందుకు సిద్ధంగా ఉన్న సాఫ్ట్‌వేర్‌ను అందిస్తుంది. నవీకరణలు, నిర్వహణ బాధ్యతలను సేవల సంస్థ చేపడుతుంది. వీడియో కాన్ఫరెన్సింగ్ కోసం జూమ్, వినియోగదారుల సంబంధాల నిర్వహణ కోసం సేల్స్‌ఫోర్స్, ఆన్‌లైన్‌లో ఫైళ్ల నిల్వ, భాగస్వామ్యం కోసం డ్రాప్‌బాక్స్ ఇందుకు ఉదాహరణలు.
సర్వర్‌లెస్ కంప్యూటింగ్ సర్వర్లను నేరుగా నిర్వహించకుండానే నిర్దిష్ట పనులను నిర్వహించేందుకు డెవలపర్లకు వీలు కల్పిస్తుంది. క్లౌడ్ సేవల సంస్థ మౌలిక సదుపాయాలను నిర్వహిస్తూ, అవసరమైనప్పుడు వనరులను కేటాయిస్తుంది. ఉదాహరణకు, వినియోగదారుడు కొనుగోలు పూర్తి చేసినప్పుడు ఆన్‌లైన్ షాపింగ్ వేదిక ఆర్డర్‌ను స్వయంచాలకంగా ప్రాసెస్ చేయవచ్చు. పేరు అలా ఉన్నప్పటికీ సర్వర్‌లెస్ కంప్యూటింగ్‌లోనూ సర్వర్లను ఉపయోగిస్తారు; డెవలపర్ తరఫున సేవల సంస్థ వాటిని నిర్వహిస్తుంది.

స్వదేశీ క్లౌడ్ వ్యవస్థ అమలులో భారత పురోగతి
డిజిటల్ పాలన, డేటా నిర్వహణ, కొత్త సాంకేతికతలకు తోడ్పడేందుకు భారత్ దేశీయ క్లౌడ్ వ్యవస్థను బలోపేతం చేస్తోంది. ప్రభుత్వం ఉమ్మడి మౌలిక సదుపాయాలను విస్తరిస్తూ, నమ్మకమైన క్లౌడ్ సేవలను అమలు చేస్తూ, స్వదేశీ కంప్యూటింగ్ సామర్థ్యాలను ప్రోత్సహిస్తోంది.
మేఘ్‌రాజ్, మేఘ్‌రాజ్ 2.0: భారత ప్రభుత్వ క్లౌడ్ వ్యవస్థ
ఈ-పాలనను వేగవంతం చేసేందుకు, ప్రభుత్వ ఐసీటీ వ్యయాన్ని సమర్థంగా నిర్వహించేందుకు భారత ప్రభుత్వ క్లౌడ్ వ్యవస్థ మేఘ్‌రాజ్‌ను మైటీ 2014లో ప్రారంభించింది. ఈ నేషనల్ క్లౌడ్ కంప్యూటింగ్ ఇనిషియేటివ్ రెండో తరం రూపమే మేఘ్‌రాజ్ 2.0. దేశ డిజిటల్ ఇండియా మిషన్‌కు ఇది సురక్షిత డిజిటల్ పునాదిగా పనిచేస్తుంది. వివిధ ప్రదేశాల్లో విస్తరించిన క్లౌడ్ నిర్మాణం ద్వారా అనువైన ఐఏఏఎస్, పీఏఏఎస్, ఎస్‌ఏఏఎస్ నమూనాలను అందిస్తూ, ప్రభుత్వ విభాగాలు అవసరమైనప్పుడు డిజిటల్ అప్లికేషన్లను వేగంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వీలు కల్పిస్తుంది.
గత దశాబ్దంలో ఈ వ్యవస్థ భారీగా విస్తరించింది. 2026 సెప్టెంబర్ నాటికి దీనిని వినియోగించే ప్రభుత్వ విభాగాల సంఖ్య 2,330కి పెరిగింది. ప్రస్తుతం డిజిలాకర్, మైగవ్, నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్‌తోపాటు తపాలా శాఖ అడ్వాన్స్‌డ్ పోస్టల్ టెక్నాలజీ (ఏపీటీ) వంటి భారత డిజిటల్ వేదికలకు అవసరమైన అత్యంత సురక్షితమైన, ఏఐ వినియోగానికి సిద్ధమైన హోస్టింగ్‌ను మేఘ్‌రాజ్ 2.0 అందిస్తోంది.
భారత క్లౌడ్ వ్యవస్థకు కీలకంగా డేటా సెంటర్లు
క్లౌడ్ కంప్యూటింగ్‌ను నడిపించే సర్వర్లు, నిల్వ వ్యవస్థలకు డేటా సెంటర్లు వేదికగా ఉంటాయి. డిజిటల్ సేవలు, ఏఐ కంప్యూటింగ్‌కు పెరుగుతున్న డిమాండ్‌తో భారత డేటా సెంటర్ల రంగం వేగం పుంజుకుంటోంది. 2026 ఆగస్టు నాటికి భారత డేటా సెంటర్ల సామర్థ్యం 1.57 గిగావాట్లకు చేరుకుంది. ఇది 2030 నాటికి దాదాపు 8 గిగావాట్లకు పెరుగుతుందని అంచనా. ఈ రంగం ప్రధానంగా ముంబై, నవీ ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ-ఎన్‌సీఆర్, జామ్‌నగర్‌లలో కేంద్రీకృతమై ఉంది. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్‌లోనూ కొత్త డేటా సెంటర్ హబ్‌లు ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. పెరుగుతున్న ఈ డిమాండ్‌ను తీర్చేందుకు భారీ మూలధనం అవసరం. ఈ రంగంలో సుమారు 70 బిలియన్ అమెరికా డాలర్ల పెట్టుబడులు అమలు దశలో ఉండగా, అదనంగా 90 బిలియన్ అమెరికా డాలర్ల ప్రాజెక్టులను ప్రకటించారు. ఈ పెట్టుబడులు కంప్యూటింగ్ సామర్థ్యాన్ని పెంచి, భారత దేశీయ క్లౌడ్ సామర్థ్యాలను విస్తరిస్తాయని అంచనా.
డేటా సెంటర్ నెట్‌వర్క్ బలోపేతం
భారత డేటా సెంటర్ మౌలిక సదుపాయాల్లో నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్‌ఐసీ) కీలక భాగంగా ఉంది. దేశవ్యాప్తంగా 4 జాతీయ డేటా సెంటర్లు, 24 మినీ డేటా సెంటర్లను నిర్వహిస్తోంది. ఈ కేంద్రాలు ప్రభుత్వ విభాగాలకు ఉమ్మడి హోస్టింగ్, కో-లొకేషన్, క్లౌడ్ సేవలను అందిస్తున్నాయి. ఎన్‌ఐసీ రాష్ట్ర కేంద్రాల్లోని మినీ డేటా సెంటర్లు వికేంద్రీకృతమైనప్పటికీ ఒకే ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాల ద్వారా రాష్ట్ర స్థాయి ఈ-పాలన అవసరాలను కూడా తీరుస్తున్నాయి.
ఇండియా ఏఐ మిషన్ — అందరికీ చేరువగా ఏఐ కంప్యూటింగ్
ఏఐ అప్లికేషన్లను అమలు చేసేందుకు అవసరమైన కంప్యూటింగ్ వనరులను క్లౌడ్ మౌలిక సదుపాయాలు పరిశోధకులు, స్టార్టప్‌లకు అందిస్తాయి. ₹10,371.92 కోట్ల వ్యయంతో ఆమోదించిన ఇండియా ఏఐ మిషన్, కంప్యూటింగ్ వనరులను మరింత మందికి అందుబాటులోకి తెస్తోంది. ఉమ్మడి ఏఐ కంప్యూటింగ్ సదుపాయం కోసం 45,000కుపైగా గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లను (జీపీయూలు) చేర్చారు. ఏఐ అభివృద్ధికి భారత స్టార్టప్‌లు, విద్యాసంస్థలకు అందుబాటు ధరల్లో కంప్యూటింగ్ శక్తిని ఈ వనరులు అందిస్తున్నాయి. ప్రత్యేక పరికరాలపై పెట్టుబడి పెట్టాల్సిన అవసరాన్ని తగ్గిస్తున్నాయి.
క్లౌడ్ కంప్యూటింగ్‌లో నైపుణ్యాభివృద్ధి, సామర్థ్యాల పెంపు కార్యక్రమాలు
భారత్‌లో విస్తరిస్తున్న డిజిటల్ మౌలిక సదుపాయాల నిర్వహణకు నైపుణ్యమున్న సిబ్బందిని తీర్చిదిద్దడం అవసరం. మైటీ–నాస్కామ్ 2021లో ప్రారంభించిన ఫ్యూచర్‌స్కిల్స్ ప్రైమ్ ప్రోగ్రామ్ కొత్త సాంకేతికతల్లో నైపుణ్యాలను ప్రోత్సహిస్తోంది. 2026 ఆగస్టు నాటికి 34 లక్షల మంది అభ్యర్థులు రిజిస్టర్ చేసుకోగా, 23 లక్షలకుపైగా మంది కోర్సుల్లో చేరారు లేదా శిక్షణ పొందారు. ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా విశ్లేషణలో పరిశ్రమ అవసరాలపై దృష్టి పెట్టిన శిక్షణకు యూరోపియన్ కమిషన్ ప్యాక్ట్ ఫర్ స్కిల్స్ రిపోర్ట్ 2024లో ఈ కార్యక్రమం ప్రపంచ స్థాయిలో మూడో స్థానంలో నిలిచింది. దీనికి అనుబంధంగా, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎన్‌ఐఈఎల్‌ఐటీ) 56 కేంద్రాలు, 750 అనుబంధ సంస్థలు, 9,000కుపైగా సహాయక కేంద్రాలను నిర్వహిస్తోంది. క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐ, సైబర్ భద్రత, బ్లాక్‌చెయిన్, ఐఓటీల్లో వృత్తి నిపుణులకు శిక్షణ అందిస్తోంది.
ఈ ప్రతిభా సంపదను మరింతగా ప్రతిబింబిస్తూ, భారత్‌లో 2.25 మిలియన్ల క్లౌడ్-నేటివ్ డెవలపర్లు ఉన్నారని క్లౌడ్ నేటివ్ కంప్యూటింగ్ ఫౌండేషన్ (సీఎన్‌సీఎఫ్) 2026 నివేదిక అంచనా వేసింది. భారత డెవలపర్లలో 44% మంది పబ్లిక్, ప్రైవేట్ క్లౌడ్ వ్యవస్థలను కలిపే హైబ్రిడ్ క్లౌడ్‌ను ఉపయోగిస్తున్నారని కూడా నివేదిక తెలిపింది. అభివృద్ధి చెందుతున్న భారత క్లౌడ్ వ్యవస్థ నిర్వహణకు ఈ నైపుణ్యమున్న సిబ్బంది తోడ్పడగలరు.
భారత్‌లో క్లౌడ్ వినియోగాన్ని ప్రోత్సహిస్తున్న విధానపరమైన చర్యలు
సమన్వయ విధాన కార్యక్రమాలు, లక్షిత పెట్టుబడుల ద్వారా అంతర్జాతీయంగా పోటీపడగల డిజిటల్ మౌలిక సదుపాయాలను నిర్మించడం భారత క్లౌడ్ వ్యూహానికి కేంద్రబిందువుగా ఉంది. కొత్త సాంకేతికతలు, డేటా ఆధారిత సేవలకు క్లౌడ్, డేటా సెంటర్లు కీలకమని గుర్తిస్తూ, భారత డిజిటల్ సామర్థ్యాలను ముందుకు తీసుకెళ్లడంలో వాటి పాత్రను 2026–27 కేంద్ర బడ్జెట్ ప్రస్తావించింది. భారత దీర్ఘకాలిక డిజిటల్ సామర్థ్యాన్ని పెంచుతూనే క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐ, హైపర్‌స్కేల్ డేటా సెంటర్లలో పెట్టుబడులను ఆకర్షించడం ఈ చర్యల లక్ష్యం.

మీకు తెలుసా?
డేటా ఎంత సున్నితమైనది, ఎంత కీలకమైనది అనే అంశాల ఆధారంగా క్లౌడ్ మౌలిక సదుపాయాలను ఎంచుకునేందుకు మంత్రిత్వ శాఖలు, విభాగాలకు క్రమబద్ధమైన మార్గదర్శకత్వాన్ని అందించే క్లౌడ్ సెలెక్షన్ ఫ్రేమ్‌వర్క్‌ను మైటీ 2026 మార్చిలో విడుదల చేసింది. జాతీయ భద్రతా అంశాలకు అనుగుణమైన డేటా వర్గీకరణ విధానాన్ని ఇది ప్రవేశపెడుతుంది. ఎన్‌ఐసీ, రాష్ట్ర డేటా సెంటర్ల ద్వారా అందే ప్రభుత్వ మద్దతున్న క్లౌడ్ సేవల వినియోగానికి ప్రాధాన్యమిస్తుంది. ఎంపిక జాబితాలోని క్లౌడ్ సేవల సంస్థలతో హైబ్రిడ్ అమలు నమూనాలను అనుసరించేందుకు వీలు కల్పిస్తుంది.
దీంతో పాటు డిజిటల్ వ్యక్తిగత డేటా రక్షణ (డీపీడీపీ) చట్టం-2023 వ్యక్తిగత డేటా ప్రాసెసింగ్‌కు రక్షణలు కల్పిస్తుంది, దేశ సరిహద్దులు దాటి డేటా బదిలీకి షరతులను నిర్దేశిస్తుంది. డేటా నిల్వ చేసే ప్రదేశం, సరిహద్దులు దాటి డేటా బదిలీపై పరిమితులకు సంబంధించిన నిబంధనల్లో ప్రతిబింబిస్తున్నట్లుగా, స్థానిక డేటా సెంటర్లు, క్లౌడ్ సేవల వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది. వినియోగదారుల స్పష్టమైన సమ్మతి, డేటా ఫిడ్యూషియరీల జవాబుదారీతనం, డేటా ప్రాసెసింగ్‌పై కఠినమైన బాధ్యతలకు సంబంధించిన నిబంధనల ద్వారా డేటాపై మెరుగైన నియంత్రణకు, నిబంధనల పాటింపునకు కూడా భరోసా కల్పిస్తుంది.
సురక్షితమైన, ప్రామాణిక డిజిటల్ పాలనకు మార్గదర్శకత్వం
కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో ఈ-పాలన ప్రాజెక్టులకు నేషనల్ ఈ-గవర్నెన్స్ డివిజన్ (ఎన్‌ఈజీడీ) సాంకేతిక, సలహా సహాయాన్ని అందిస్తుంది. ప్రాజెక్టుల సాంకేతిక నిర్మాణం, భద్రత, ప్రమాణాలు, ఉమ్మడి మౌలిక సదుపాయాల వినియోగంతో సహా సాంకేతిక మదింపు దీని బాధ్యతల్లో భాగం. ఈ సహకార వ్యవస్థ భారత పాలనా వ్యవస్థ అంతటా క్లౌడ్ సేవలను ముందుకు తీసుకెళ్తూ, డిజిటల్ ఇండియా, ఈ-పాలన ప్రాధాన్యాలకు ఊతమిస్తోంది.
భారత క్లౌడ్ వ్యవస్థ భవిష్యత్ మార్గం
భారత క్లౌడ్ వ్యవస్థ వేగంగా విస్తరిస్తోంది. దేశ క్లౌడ్ డేటా సామర్థ్యం 2030 నాటికి దాదాపు 4-5 రెట్లు పెరుగుతుందని అంచనా. డిజిటల్ పాలన, ప్రజాసేవల అందజేత, సాంకేతిక ఆధారిత వేదికల్లో క్లౌడ్ మౌలిక సదుపాయాలపై పెరుగుతున్న ఆధారపడటం కంప్యూటింగ్ వనరులకు డిమాండ్‌ను పెంచుతోంది. డేటా సెంటర్లలో పెట్టుబడులు దేశీయ సామర్థ్యాన్ని పెంచుతుండగా, ప్రత్యేక నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు క్లౌడ్ ఆధారిత సాంకేతికతలను నిర్వహించగల సిబ్బందిని తీర్చిదిద్దుతున్నాయి. ఈ చర్యలన్నీ కలిసి ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూ, భారత దీర్ఘకాలిక డిజిటల్ పరివర్తనకు క్లౌడ్ కంప్యూటింగ్‌ను కీలక పునాదిగా నిలబెడుతున్నాయి.
References
Rajya Sabha
Ministry of Electronics and IT
Ministry of Communications
Ministry of Skill Development & Entrepreneurship
NITI Aayog
PIB Headquarters
Network Readiness Index Report 2025
NASSCOM
Click to see pdf
***
(Explainer ID: 160646)
आगंतुक पटल : 9
Provide suggestions / comments