Farmer's Welfare
రబీ పంటలకు కనీస మద్దతు ధర: 2027-28 మార్కెటింగ్ సీజన్
ధరలు, కొనుగోళ్లపై భరోసా, రైతులకు మరింత అందుబాటులోకి మార్కెట్
Posted On:
29 OCT 2026 11:10AM
రైతులకు ధరలపై భరోసా కల్పించడంతోపాటు వ్యవసాయ ప్రణాళికలు, పెట్టుబడులపై అవగాహనతో నిర్ణయాలు తీసుకునేందుకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) ముఖ్యమైన సాధనంగా పనిచేస్తుంది. 2027-28 రబీ మార్కెటింగ్ సీజన్‌కు (ఆర్‌ఎంఎస్) నిర్దేశిత రబీ పంటలన్నింటికీ కనీస మద్దతు ధరల పెంపును ప్రభుత్వం 2026 సెప్టెంబర్ 30న ఆమోదించింది. ఈ సీజన్‌లో 324 లక్షల మెట్రిక్ టన్నుల పంట ఉత్పత్తులకుగాను రైతులకు సుమారు ₹90,962 కోట్లు చెల్లిస్తారని అంచనా. ఏళ్లుగా సాగుతున్న పంటల కొనుగోళ్లు, చెల్లింపుల ధోరణులు కనీస మద్దతు ధర ద్వారా అందుతున్న సహాయం విస్తృతిని తెలియజేస్తున్నాయి. ఆరు రబీ పంటల కొనుగోళ్లు 2004-05 నుంచి 2013-14 మధ్య కాలంలో 2,302 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 2014-15 నుంచి 2025-26 మధ్య కాలంలో 3,921 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగాయి. అదే విధంగా కనీస మద్దతు ధర చెల్లింపులు ₹2.65 లక్షల కోట్ల నుంచి ₹8.36 లక్షల కోట్లకు పెరిగాయి. మరోవైపు, కొనుగోళ్లు, చెల్లింపుల ప్రక్రియలను రైతులకు మరింత అందుబాటులోకి తీసుకురావడంతోపాటు పారదర్శకతను పెంచేందుకు డిజిటల్ వేదికలు తోడ్పడుతున్నాయి. ధర భరోసా, విస్తరించిన కొనుగోళ్లు, సాంకేతికత ఆధారిత సేవలు కలిసి రైతులకు మార్కెట్లను చేరువ చేస్తున్నాయి. వ్యవసాయ నిర్ణయాల్లో మరింత విశ్వాసాన్ని కల్పిస్తున్నాయి.
కనీస మద్దతు ధర: ధరల స్థిరత్వంతో రైతులకు అండ
రైతుకు వచ్చే ఆర్థిక రాబడిని వ్యవసాయ ఉత్పత్తి మాత్రమే కాకుండా పండించిన పంటకు లభించే ధర కూడా నిర్ణయిస్తుంది. సాగులో నెలల తరబడి శ్రమ, వనరులు, ఉత్పాదకాలను పెట్టుబడిగా పెట్టిన తర్వాత, చివరకు మార్కెట్ ధరే వ్యవసాయ ఆదాయాన్ని, సాగును కొనసాగించే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. చిన్న, సన్నకారు రైతులకు ప్రతికూల మార్కెట్ ధరల హెచ్చుతగ్గులు ఆదాయంలో గణనీయమైన అనిశ్చితిని కలిగించవచ్చు. భవిష్యత్ సాగుపై తీసుకునే నిర్ణయాలను కూడా ప్రభావితం చేయవచ్చు.
ఈ నేపథ్యంలో రైతులకు అండగా నిలిచే ముఖ్యమైన విధాన సాధనంగా కనీస మద్దతు ధర పనిచేస్తుంది. ముందుగా నిర్ణయించిన ధరలకు అర్హత కలిగిన వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేసే ధర భరోసా వ్యవస్థను ఇది అందిస్తుంది. వ్యవసాయ పెట్టుబడులు, ఉత్పత్తిని ప్రోత్సహిస్తూ రైతులకు గిట్టుబాటు రాబడిని కల్పిస్తుంది.
ధర విషయంలో కొంత భరోసా అందించడం ద్వారా ప్రతికూల మార్కెట్ హెచ్చుతగ్గుల ప్రభావాన్ని తగ్గించుకునేందుకు కనీస మద్దతు ధర రైతులకు సహాయపడుతుంది. మార్కెట్ ధరలు తక్కువగా ఉన్నప్పుడు అర్హత కలిగిన పంట ఉత్పత్తులను ప్రకటించిన ధరకు విక్రయించేందుకు ఎంఎస్‌పీ కొనుగోళ్లు అవకాశం కల్పిస్తాయి. ధరల అనిశ్చితిని తగ్గించడం, వ్యవసాయ ఆదాయ స్థిరత్వానికి తోడ్పడటం, తదుపరి వ్యవసాయ సీజన్లకు ప్రణాళికలు రూపొందించుకోవడాన్ని సులభతరం చేయడం ఈ వ్యవస్థ ప్రయోజనాలు. ఆశించే రాబడిపై విశ్వాసాన్ని పెంచడం ద్వారా మెరుగైన విత్తనాలు, వ్యవసాయ సాంకేతికత, ఉత్పాదకతను పెంచే ఇతర ఉత్పాదకాలపై పెట్టుబడులకు సంబంధించిన రైతుల నిర్ణయాలకు కూడా ఎంఎస్‌పీ తోడ్పడుతుంది.
మెరుగైన సాగుకు రాబడి భరోసా తోడైతే
మెరుగైన వ్యవసాయ పద్ధతులు, సంస్థాగత సహాయం, ధర భరోసా కలిసి వ్యవసాయ ఉత్పాదకతను, ఆదాయాన్ని ఎలా పెంచగలవో కర్ణాటకలోని బొంబ్రహళ్లి గ్రామానికి చెందిన 72 ఏళ్ల చిరుధాన్య రైతు శ్రీ కె. చిక్కన్న అనుభవం తెలియజేస్తుంది.

శ్రీ చిక్కన్న అనేక సంవత్సరాలుగా సంప్రదాయ వ్యవసాయ పద్ధతుల్లో స్థానిక రాగి రకాలను సాగు చేసేవారు. నీటిపారుదల సదుపాయం ఉన్నప్పటికీ ఎకరాకు దిగుబడి సుమారు 9-11 క్వింటాళ్ల స్థాయిలోనే ఉండేది.
2025 రబీ సీజన్‌లో మెరుగైన హెచ్‌ఆర్-13 రాగి రకాన్ని సాగు చేయడంతో గణనీయమైన మార్పు వచ్చింది. కుంద్రుపిలోని కుసుమగిరి ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ద్వారా ఐసీఏఆర్-ఐఐఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్) ఈ రకాన్ని సరఫరా చేసింది.
ఐసీఏఆర్-ఐఐఎంఆర్ శాస్త్రవేత్తల సాంకేతిక మార్గదర్శకత్వంతో నాట్లు వేయడం, సమతుల పోషక నిర్వహణ, ప్రకృతి వ్యవసాయ విధానాలతో సహా మెరుగైన సాగు పద్ధతులను కూడా ఆయన అనుసరించారు. ఈ చర్యలతో ఎకరాకు దిగుబడి 22-23 క్వింటాళ్లకు పెరిగింది. గత దిగుబడితో పోలిస్తే ఇది రెండింతలకు పైగా అధికం.
దిగుబడి పెరుగుదలకు తోడు, రైతు ఉత్పత్తిదారుల సంస్థ (ఎఫ్‌పీఓ) ద్వారా క్వింటాలుకు ₹4,886 కనీస మద్దతు ధరతో (2025–26 సీజన్) కొనుగోలు భరోసా లభించింది. దీంతో తన పంటకు గిట్టుబాటు ధరను పొంది, అధిక రాబడిని సాధించగలిగారు. ఫలితంగా ఆరు ఎకరాల నుంచి ఆయన ఆదాయం సుమారు ₹2.07 లక్షల నుంచి ₹6.59 లక్షలకు పెరిగింది.
మెరుగైన విత్తన రకాలు, శాస్త్రీయ సాగు పద్ధతులు, సాంకేతిక మార్గదర్శకత్వం, రైతుల సమష్టి సంస్థలు, కనీస మద్దతు ధర ఆధారిత కొనుగోళ్ల సమన్వయం వ్యవసాయ ఉత్పాదకతను, ఆర్థిక రాబడిని ఎలా పెంచగలదో శ్రీ చిక్కన్న అనుభవం తెలియజేస్తుంది.
కనీస మద్దతు ధరలను ఎలా నిర్ణయిస్తారు?
నిర్దేశిత 22 వ్యవసాయ పంటలకు ప్రభుత్వం ఏటా కనీస మద్దతు ధరలను ప్రకటిస్తుంది. వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్ (సీఏసీపీ) సిఫార్సుల ఆధారంగా ఈ ధరలను నిర్ణయిస్తారు. సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలు/విభాగాల అభిప్రాయాలను ఈ సిఫార్సుల్లో పరిగణనలోకి తీసుకుంటారు. అదనంగా, తోరియా కనీస మద్దతు ధరను రేప్‌సీడ్, ఆవాలకు ప్రకటించిన ధర ఆధారంగా, పీచు తొలగించిన కొబ్బరికాయల కనీస మద్దతు ధరను ఎండు కొబ్బరికి ప్రకటించిన ధర ఆధారంగా నిర్ణయిస్తారు.

వివిధ పంటలకు కనీస మద్దతు ధరలను సిఫార్సు చేసేటప్పుడు సీఏసీపీ పలు అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది. అవి:
- ఉత్పత్తి వ్యయం
- దేశీయ, ప్రపంచ మార్కెట్లలో పంటల డిమాండ్, సరఫరా
- దేశీయ, అంతర్జాతీయ ధరలు
- పంటల మధ్య ధరల సమతుల్యత
- వ్యవసాయ, వ్యవసాయేతర రంగాల మధ్య వాణిజ్య మార్పిడి నిష్పత్తి
- విస్తృత ఆర్థిక వ్యవస్థపై ధరల విధానం చూపగల ప్రభావం,
- ఉత్పత్తి వ్యయంపై కనీసం 50 శాతం అదనపు రాబడి.
కనీస మద్దతు ధర లెక్కింపులో ఉపయోగించే ఉత్పత్తి వ్యయంలో కూలీలు, ఎద్దులు, యంత్రాలతో పనులు చేయించేందుకు చెల్లించే ఖర్చులు, కౌలుకు తీసుకున్న భూమి, విత్తనాలు, ఎరువులు, సేంద్రియ ఎరువులు, నీటిపారుదలపై వ్యయాలను చేర్చుతారు. పంపుసెట్లను నడిపేందుకు వినియోగించే డీజిల్, విద్యుత్తు ఖర్చులు, వ్యవసాయ పనిముట్లు, భవనాలపై తరుగుదల, నిర్వహణ మూలధనంపై వడ్డీ, ఇతర ఖర్చులను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. వ్యవసాయ పనుల్లో పాల్గొనే కుటుంబ సభ్యుల కృషిని గుర్తిస్తూ, వారి శ్రమకు అంచనా వేసిన విలువను కూడా చేర్చుతారు. కనీస మద్దతు ధరల లెక్కింపునకు నిర్దేశిత 22 పంటలకు, అన్ని రాష్ట్రాల్లో ఒకే వ్యయ అంచనా సూత్రాన్ని ఏకరీతిగా వర్తింపజేస్తారు.
రబీ ఎంఎస్‌పీ 2027-28: ధరల మద్దతు, పంటల వైవిధ్యీకరణ
2027-28 మార్కెటింగ్ సీజన్‌కు నిర్దేశిత రబీ పంటలన్నింటికీ కనీస మద్దతు ధరల పెంపును ప్రభుత్వం 2026 సెప్టెంబర్ 30న ఆమోదించింది.
రబీ మార్కెటింగ్ సీజన్ 2027-28
|
క్రమ సంఖ్య
|
పంట
|
2027-28 ఎంఎస్‌పీ (₹/క్వింటాల్)
|
2027-28 ఉత్పత్తి వ్యయం (₹/క్వింటాల్)
|
వ్యయంపై అదనపు రాబడి (%)
|
2026-27 ఎంఎస్‌పీ (₹/క్వింటాల్)
|
ఎంఎస్‌పీ పెరుగుదల (₹/క్వింటాల్)
|
|
1
|
గోధుమ
|
2,610
|
1,264
|
106
|
2,585
|
25
|
|
2
|
బార్లీ
|
2,286
|
1,447
|
58
|
2,150
|
136
|
|
3
|
శనగ
|
5,958
|
3,751
|
59
|
5,875
|
83
|
|
4
|
మసూర్ పప్పు
|
7,390
|
3,854
|
92
|
7,000
|
390
|
|
5
|
రేప్‌సీడ్ & ఆవాలు
|
6,613
|
3,367
|
96
|
6,200
|
413
|
|
6
|
కుసుమ
|
7,215
|
4,810
|
50
|
6,540
|
675
|
కనీస మద్దతు ధరలో అత్యధికంగా కుసుమకు క్వింటాలుకు ₹675 పెంపును ప్రకటించారు. తర్వాత రేప్‌సీడ్ & ఆవాలకు క్వింటాలుకు ₹413, మసూర్ పప్పుకు ₹390, బార్లీకి ₹136 పెంచారు. గత సంవత్సరంతో పోలిస్తే గోధుమ, శనగ కనీస మద్దతు ధరలను కూడా పెంచారు.
ఉత్పత్తి వ్యయంపై అదనపు రాబడి పరంగా గోధుమకు అత్యధికంగా 106% లభిస్తుందని అంచనా. తర్వాత రేప్‌సీడ్, ఆవాలకు 96%, మసూర్ పప్పుకు 92%, శనగకు 59% అదనపు రాబడి లభిస్తుంది. 2027-28 రబీ మార్కెటింగ్ సీజన్‌లో 324 లక్షల మెట్రిక్ టన్నుల పంట ఉత్పత్తులకుగాను రైతులకు సుమారు ₹90,962 కోట్లు చెల్లిస్తారని అంచనా. రబీ పంటలకు పెంచిన కనీస మద్దతు ధరలు రైతులకు గిట్టుబాటు ధరలను కల్పించడంతోపాటు పంటల వైవిధ్యీకరణను ప్రోత్సహించేందుకు ఉద్దేశించినవి.

ఎంఎస్‌పీ కొనుగోళ్లలో సౌలభ్యం, పారదర్శకత
కనీస మద్దతు ధర ప్రయోజనాలు రైతులకు మరింత నేరుగా, పారదర్శకంగా, సులభంగా అందేలా కొనుగోలు ప్రక్రియ అభివృద్ధి చెందింది. ధాన్యాలు, ముతక ధాన్యాలను ప్రభుత్వం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ), నియమిత రాష్ట్ర సంస్థల ద్వారా కొనుగోలు చేస్తుంది. ప్రకటించిన కనీస మద్దతు ధర వద్ద రైతులకు ఇది ధరల మద్దతు అందిస్తుంది.
పప్పుధాన్యాలు, నూనెగింజలు, ఎండు కొబ్బరిని ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్ (పీఎం-ఆశా)లోని ప్రైస్ సపోర్ట్ స్కీమ్ (పీఎస్‌ఎస్) కింద కొనుగోలు చేస్తారు. మార్కెట్ ధరలు ప్రకటించిన కనీస మద్దతు ధర కంటే తగ్గినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోళ్లకు అభ్యర్థించవచ్చు. ఈ పథకం కింద కొనుగోళ్లు చేపట్టే ప్రధాన సంస్థలు నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (నాఫెడ్), నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌సీసీఎఫ్). దేశీయ పప్పుధాన్యాల ఉత్పత్తిని ప్రోత్సహించి, స్వావలంబనను బలోపేతం చేసేందుకు మిషన్ ఫర్ ఆత్మనిర్భరత ఇన్ పల్సెస్ కింద 2030-31 వరకు ముందుగా నమోదు చేసుకున్న రైతుల నుంచి కేంద్ర నోడల్ సంస్థల ద్వారా కందులు, మినుములు, మసూర్‌ను కొనుగోలు చేస్తారు.
కొనుగోలు సదుపాయాలు రైతులకు మరింత అందుబాటులో ఉండేలా తగిన సంఖ్యలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వాలు, కొనుగోలు సంస్థలు కొనుగోలు షెడ్యూళ్లు, కేంద్రాల చిరునామాలు, అర్హత కలిగిన పంట ఉత్పత్తులకు వర్తించే ఫెయిర్ యావరేజ్ క్వాలిటీ (ఎఫ్‌ఏక్యూ) ప్రమాణాల వివరాలను ప్రచారం చేస్తాయి.
డిజిటల్ వేదికల ద్వారా కొనుగోలు ప్రక్రియను మరింత బలోపేతం చేశారు. ప్రైస్ సపోర్ట్ స్కీమ్ కింద నాఫెడ్‌కు చెందిన ఈ-సమృద్ధి, ఎన్‌సీసీఎఫ్‌కు చెందిన ఈ-సంయుక్తి వేదికలు రైతుల నమోదు, పంటల కొనుగోలు, చెల్లింపులతో సహా ప్రధాన దశలను సులభతరం చేస్తాయి. ఆధార్, భూ రికార్డులు, బ్యాంకు ఖాతా సమాచారం, పంట వివరాలను అందించి రైతులు నమోదు చేసుకుంటారు. నమోదైన రైతులు తమకు సమీపంలోని కొనుగోలు కేంద్రాన్ని ఎంచుకోవచ్చు. అనంతరం ఆ కేంద్రానికి వెళ్లాల్సిన నిర్దిష్ట తేదీని పోర్టల్ కేటాయిస్తుంది. కనీస మద్దతు ధర చెల్లింపులను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయడం మానవ ప్రమేయం, మధ్యవర్తులపై ఆధారపడటం, చెల్లింపుల్లో జాప్యాన్ని తగ్గించేందుకు సహాయపడుతుంది.
2026 అక్టోబర్ 19 నాటికి ఈ-సంయుక్తి వేదిక 43 లక్షలకు పైగా రైతులకు సంబంధించిన కొనుగోళ్లను సులభతరం చేసింది. 37.45 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా పంట ఉత్పత్తులను కొనుగోలు చేసి, రైతుల ఖాతాల్లో ₹13,000 కోట్లకు పైగా జమ చేశారు. మరోవైపు, ఈ-సమృద్ధిలో 1.37 కోట్లకు పైగా రైతుల నమోదు, 2.25 కోట్లకు పైగా యూనిట్ల పంట ఉత్పత్తుల కొనుగోలు, రైతులకు 81 లక్షలకు పైగా చెల్లింపులు నమోదయ్యాయి.
పారదర్శకత, లబ్ధిదారుల ధ్రువీకరణను మరింత బలోపేతం చేస్తూ 2025–26 సీజన్ నుంచి పీఎస్‌ఎస్ కింద రైతుల బయోమెట్రిక్ ధ్రువీకరణను తప్పనిసరి చేశారు. కొనుగోలుకు ముందు ఆధార్ ఆధారిత పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) యంత్రాలు లేదా ముఖ గుర్తింపు ద్వారా ధ్రువీకరణ నిర్వహిస్తారు. రైతుల గుర్తింపును నిర్ధారించి, కొనుగోలు ప్రయోజనాలు నిజమైన, అర్హులైన లబ్ధిదారులకు చేరేలా ఈ చర్య తోడ్పడుతుంది.
ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్ (పీఎం-ఆశా)
2018 సెప్టెంబర్‌లో ప్రారంభించిన ఈ పథకం వినియోగదారులకు ధరల స్థిరత్వాన్ని కొనసాగిస్తూ, రైతులకు గిట్టుబాటు ధరలను కల్పిస్తుంది. ఇందులోని ప్రధాన అంశాల్లో ప్రైస్ సపోర్ట్ స్కీమ్ (పీఎస్‌ఎస్) ఒకటి. పంట కోతలు ముమ్మరంగా సాగే సమయంలో నోటిఫై చేసిన పప్పుధాన్యాలు, నూనెగింజలు, ఎండు కొబ్బరి మార్కెట్ ధరలు కనీస మద్దతు ధర కంటే తగ్గితే ఈ పథకం కార్యాచరణలోకి వస్తుంది. చెల్లుబాటయ్యే భూ రికార్డులు కలిగి, ముందుగా నమోదు చేసుకున్న రైతుల నుంచి ఫెయిర్ యావరేజ్ క్వాలిటీ (ఎఫ్‌ఏక్యూ) ప్రమాణాలకు అనుగుణమైన అర్హత కలిగిన పంట ఉత్పత్తులను నాఫెడ్, ఎన్‌సీసీఎఫ్ ద్వారా నేరుగా కొనుగోలు చేస్తారు. దీంతో మధ్యవర్తుల ప్రమేయం తొలగి, తక్కువ ధరలకు పంటలను తెగనమ్ముకోవాల్సిన పరిస్థితి నుంచి రైతులకు రక్షణ లభిస్తుంది.
పెరుగుతున్న పంటల కొనుగోళ్లు, రైతులకు మద్దతు ధర చెల్లింపులు
ఏళ్లుగా పంటల కొనుగోలు పరిమాణాలు, రైతులకు చెల్లింపులు గణనీయంగా పెరగడం వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లకు మద్దతుగా ఎంఎస్‌పీ పోషిస్తున్న పాత్రను తెలియజేస్తోంది. 2014-15 నుంచి 2025-26 మధ్య కాలంలో మొత్తం గోధుమ కొనుగోళ్లు 3,715 లక్షల మెట్రిక్ టన్నులకు చేరాయి. 2004-05 నుంచి 2013-14 మధ్య కాలంలో ఇవి 2,254 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉన్నాయి. అదే విధంగా ఆయా కాలవ్యవధుల్లో ఆరు రబీ పంటల మొత్తం కొనుగోళ్లు 2,302 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 3,921 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగాయి.
కొనుగోళ్ల పెరుగుదలతోపాటు రైతులకు కనీస మద్దతు ధర చెల్లింపులు కూడా గణనీయంగా పెరిగాయి. 2014-15 నుంచి 2025-26 మధ్య కాలంలో గోధుమ రైతులకు చెల్లింపులు ₹7.31 లక్షల కోట్లకు చేరాయి. 2004-05 నుంచి 2013-14 మధ్య కాలంలో ఇవి ₹2.56 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఆరు రబీ పంటలకు మొత్తం కనీస మద్దతు ధర చెల్లింపులు గత కాలవ్యవధిలోని ₹2.65 లక్షల కోట్ల నుంచి ₹8.36 లక్షల కోట్లకు పెరిగాయి.
2026-27 రబీ మార్కెటింగ్ సీజన్‌లో గోధుమ కొనుగోళ్లు 357.57 లక్షల మెట్రిక్ టన్నులుగా నమోదయ్యాయి. వీటి కనీస మద్దతు ధర విలువ ₹92,432.51 కోట్లు. తద్వారా 34 లక్షలకు పైగా రైతులకు ప్రయోజనం చేకూరింది. ప్రభుత్వ కొనుగోళ్ల విస్తృతిని, కనీస మద్దతు ధర ద్వారా రైతులకు అందుతున్న ఆర్థిక సహాయాన్ని ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి.
రైతులకు అండ, వ్యవసాయానికి బలం
మార్కెట్ ధరల హెచ్చుతగ్గుల నుంచి రైతులకు అండగా నిలవడం, వ్యవసాయ ప్రణాళికలు, పెట్టుబడుల్లో మరింత భరోసా కల్పించడంలో కనీస మద్దతు ధర ముఖ్యమైన విధాన సాధనంగా కొనసాగుతోంది. 2027-28 రబీ మార్కెటింగ్ సీజన్‌కు తీసుకున్న ఎంఎస్‌పీ నిర్ణయాలు ఉత్పత్తి వ్యయంపై కనీసం 50 శాతం అదనపు రాబడిని కొనసాగిస్తున్నాయి.
కొనుగోలు పరిమాణాలు, కనీస మద్దతు ధర చెల్లింపుల్లో నిరంతర పెరుగుదల రైతులకు ప్రభుత్వ మద్దతు విస్తరిస్తున్న తీరును ప్రతిబింబిస్తోంది. మరోవైపు, డిజిటల్ నమోదు, బయోమెట్రిక్ ధ్రువీకరణ, నేరుగా బ్యాంకు ఖాతాలకు చెల్లింపులు కొనుగోలు ప్రక్రియల అందుబాటును, పారదర్శకతను బలోపేతం చేస్తున్నాయి. మొత్తంగా ఈ చర్యలు ధర భరోసా, మార్కెట్ అందుబాటు, గిట్టుబాటు రాబడి మధ్య సంబంధాన్ని బలపరుస్తున్నాయి. రైతుల ఆదాయ అవకాశాలకు తోడ్పడుతూ, వ్యవసాయ రంగాన్ని మరింత పటిష్ఠం చేసేందుకు దోహదపడుతున్నాయి.
References
Cabinet Committee on Economic Affairs
https://www.pib.gov.in/PressReleasepage.aspx?PRID=2316941®=48&lang=1
Ministry of Agriculture and Farmers Welfare
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1777683®=48&lang=2
https://www.icar.gov.in/hi/node/24721?utm_
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2317665®=48&lang=2
https://sansad.in/getFile/lsapps/loksabhaquestions/annex/187/AS450_OAibYg.pdf?source=lsapps
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2246181®=1&lang=1
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2155528&lang=2®=48&utm_
https://icar.org.in/en/dr-ml-jat-honours-progressive-millet-farmer-shri-k-chikkana-icar-iimr-hyderabad
Ministry of Consumer Affairs, Food and Public Distribution
https://sansad.in/getFile/annex/271/AU2614_KTzacI.pdf?source=pqars
https://esamyukti.in/#about
Ministry of Cooperation
https://esamridhi.in/#/
PIB Backgrounders
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2177219®=3&lang=2
https://www.pib.gov.in/PressNoteDetails.aspx?NoteId=159674&ModuleId=3®=3&lang=1
Click here for pdf file.
***
(Explainer ID: 160635)
आगंतुक पटल : 39
Provide suggestions / comments