Rural Prosperity

ప్రధానమంత్రి వికసిత్ గ్రామ్ స్వరాజ్ యోజన

క్షేత్రస్థాయిలో పాలన బలోపేతం

Posted On: 28 OCT 2026 6:34PM

ప్రధానమంత్రి వికసిత్ గ్రామ్ స్వరాజ్ యోజన 2026-27 నుంచి 2030-31 వరకు మొత్తం ₹7,395.55 కోట్ల వ్యయంతో అమలు చేసేందుకు ఆమోదం పొందిన కేంద్ర ప్రాయోజిత పథకం. అర్హత కలిగిన సంప్రదాయ గ్రామీణ స్థానిక పాలనా సంస్థలతో సహా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇది వర్తిస్తుంది. సమీకృత, ప్రజల భాగస్వామ్యంతో కూడిన అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనకు కేంద్రాలుగా గ్రామ పంచాయతీలను బలోపేతం చేయడం ఈ పథకం లక్ష్యం. వార్షిక లక్ష్యాల్లో 2.55 లక్షలకు పైగా గ్రామాభివృద్ధి ప్రణాళికలు, 2.55 లక్షలకు పైగా ఆన్‌లైన్ ఆడిట్ ప్రణాళికలు ఉన్నాయి. సమన్వయంతో చేపట్టే ప్రతి అవగాహన కార్యక్రమం ద్వారా కనీసం కోటి మంది పౌరులకు చేరువ కావడం లక్ష్యం. క్షేత్రస్థాయి పాలనను మెరుగుపరిచేందుకు డిజిటల్ అనుసంధానం, సామర్థ్యాల పెంపు, ఆర్థిక జవాబుదారీతనాన్ని ప్రధాన సాధనాలుగా ఈ పథకం నిర్దేశించింది.

 

వికసిత్ గ్రామ్ స్వరాజ్ సాధనకు రూపరేఖలు

ప్రధానమంత్రి వికసిత్ గ్రామ్ స్వరాజ్ యోజనకు కేంద్ర మంత్రివర్గం 2026 అక్టోబర్ 28న ఆమోదం తెలిపింది. గ్రామీణ స్థానిక పాలనలో పరివర్తన తీసుకువచ్చేందుకు ఉద్దేశించిన కేంద్ర ప్రాయోజిత పథకం ఇది. క్షేత్రస్థాయి అభివృద్ధిని వికసిత్ భారత్ జాతీయ లక్ష్యంతో ఈ కార్యక్రమం అనుసంధానిస్తుంది. పంచాయతీలను సాధికారత, స్వావలంబన, జవాబుదారీతనం, ఉత్తమ పనితీరు కలిగిన స్థానిక స్వపరిపాలనా సంస్థలుగా తీర్చిదిద్దడం దీని లక్ష్యం.

 

పీఎం వికసిత్ గ్రామ్ స్వరాజ్ యోజన సంక్షిప్త వివరాలు

అంశం

వివరాలు

అమలు కాలం

2026-27 నుంచి 2030-31 వరకు

మొత్తం ఆర్థిక కేటాయింపు

₹7,395.55 కోట్లు

కేంద్ర ప్రభుత్వ వాటా

₹4,869.48 కోట్లు

రాష్ట్ర ప్రభుత్వాల వాటా

₹2,526.07 కోట్లు

ప్రత్యక్ష లబ్ధిదారులు

ఎన్నికైన ప్రజాప్రతినిధులు, పంచాయతీ సిబ్బంది, ఇతర భాగస్వాములు కలిపి సుమారు 32 లక్షల మంది

పథకం పరిధిలోని సంస్థలు

2.55 లక్షలకు పైగా పంచాయతీలు, సంప్రదాయ స్థానిక సంస్థలు

భౌగోళిక పరిధి

అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు. పంచాయతీలు లేని, రాజ్యాంగంలోని తొమ్మిదో భాగం పరిధిలోకి రాని ప్రాంతాల్లోని సంప్రదాయ గ్రామీణ స్థానిక పాలనా సంస్థలు కూడా ఇందులో భాగమే.

స‌మూల మార్పున‌కు నిధులు

పీఎం వికసిత్ గ్రామ్ స్వరాజ్ యోజన మొత్తం వ్యయం ₹7,395.55 కోట్లు. కేంద్ర ప్రభుత్వం ₹4,869.48 కోట్లు సమకూరుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ₹2,526.07 కోట్లు సమకూరుస్తాయి. ఈ పథకం అమలు కాలం పదహారో ఆర్థిక సంఘం కాలవ్యవధితో సరిపోతుంది. 2026-27 నుంచి 2030-31 వరకు గ్రామీణ స్థానిక సంస్థలకు సుమారు ₹4.35 లక్షల కోట్ల గ్రాంట్లను ఈ సంఘం సిఫార్సు చేసింది. ఈ వనరులను పంచాయతీలు మరింత సమర్థంగా వినియోగించుకునేందుకు ఈ పథకం తోడ్పడుతుంది. జాతీయ ప్రాధాన్యాలు, ప్రభుత్వ పథకాలు, అందుబాటులో ఉన్న నిధులు, స్థానిక ఆకాంక్షలను అనుసంధానిస్తుంది.

 

క్షేత్రస్థాయి మార్పున‌కు ఆరు మూలస్తంభాలు

పీఎం వికసిత్ గ్రామ్ స్వరాజ్ యోజన ఆరు సమగ్ర మూలస్తంభాలపై దృష్టి సారిస్తుంది. ఇవి స్థానిక అడ్డంకులను గుర్తించే ప్రక్రియను బలోపేతం చేస్తాయి. స్థానిక ప్రణాళికల రూపకల్పన, పాలనా సామర్థ్యాలను మెరుగుపరుస్తాయి. డిజిటల్ అనుసంధానాన్ని ప్రోత్సహించి, క్షేత్రస్థాయిలో వనరుల పారదర్శక వినియోగాన్ని నిర్ధారిస్తాయి.

 

1. స్థానిక పాలనకు కేంద్రాలుగా గ్రామ పంచాయతీలు: స్థానిక అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనలో పీఎం వికసిత్ గ్రామ్ స్వరాజ్ యోజన గ్రామ పంచాయతీలకు కేంద్రస్థానం కల్పిస్తుంది. గ్రామ ప్రాధాన్యాలు, ప్రభుత్వ కార్యక్రమాలు, అందుబాటులో ఉన్న వనరులను పంచాయతీలు సమన్వయం చేస్తాయి. ఈ విధానం జాతీయ అభివృద్ధి లక్ష్యాలను గ్రామీణ ప్రజల అవసరాలు, ఆకాంక్షలతో అనుసంధానిస్తుంది.

 

2. గ్రామ పంచాయతీ స్థాయిలో సమగ్ర ప్రణాళికల రూపకల్పన: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల ప్రణాళికల రూపకల్పన ప్రక్రియలను ఈ పథకం ఉమ్మడి డిజిటల్ వేదికపైకి తీసుకువస్తుంది. సమగ్ర గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికల (జీపీడీపీల) రూపకల్పనకు ఇది తోడ్పడుతుంది. లోటుపాట్లను గుర్తించేందుకు, కార్యక్రమాలను సమన్వయం చేసుకునేందుకు, అందుబాటులో ఉన్న వనరులను సమర్థంగా వినియోగించుకునేందుకు ఈ సమీకృత విధానం శాఖలకు సహాయపడుతుంది. విడివిడి పథకాల అమలుకు ఇప్పటికే ఉన్న శాఖాపరమైన ఏర్పాట్లు కొనసాగుతాయి.

 

3. డిజిటల్ పాలన: ఈ-గ్రామ్‌స్వరాజ్, ఇప్పటికే ఉన్న ఈ-పంచాయత్ వ్యవస్థల ఆధారంగా పీఎం వికసిత్ గ్రామ్ స్వరాజ్ యోజన ఉమ్మడి డిజిటల్ వేదికపై సమాచారాన్ని సమీకరిస్తుంది. ప్రభుత్వ పథకాలు, లబ్ధిదారులు, ప్రయోజనాలు, సామూహిక ఆస్తులు, అందుబాటులో ఉన్న వనరుల సమాచారం ఈ వేదికలో ఉంటుంది. అభివృద్ధిలో లోటుపాట్లను గుర్తించేందుకు, ప్రణాళికల రూపకల్పన, సమన్వయం, పర్యవేక్షణను మెరుగుపరుచుకునేందుకు పంచాయతీలకు ఇది సహాయపడుతుంది. వివిధ రాష్ట్రాల్లోని గ్రామ పంచాయతీలు పరస్పరం పరిజ్ఞానాన్ని పంచుకునేందుకు కూడా ఈ వేదిక తోడ్పడుతుంది.

 

ఈ-గ్రామ్‌స్వరాజ్

2020లో ప్రారంభించిన ఈ-గ్రామ్‌స్వరాజ్, పంచాయతీరాజ్ సంస్థల (పీఆర్‌ఐల) కోసం రూపొందించిన పనుల ఆధారిత సమగ్ర అప్లికేషన్. ప్రణాళికల రూపకల్పన, బడ్జెట్ తయారీ, లెక్కల నిర్వహణ, పర్యవేక్షణ, ఆస్తుల నిర్వహణ తదితర పంచాయతీ కార్యకలాపాలన్నింటినీ, ఆన్‌లైన్ చెల్లింపులతో సహా, ఇది ఒకే డిజిటల్ వేదికపై అందిస్తుంది. ఈ-గ్రామ్‌స్వరాజ్‌ను వివిధ ప్రభుత్వ డిజిటల్ వేదికలతో అనుసంధానించారు. వీటిలో ఆన్‌లైన్ చెల్లింపులు, ఆర్థిక నిర్వహణ కోసం పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (పీఎఫ్‌ఎంఎస్), కొనుగోళ్ల కోసం గవర్నమెంట్ ఈ-మార్కెట్‌ప్లేస్ (జెమ్), కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత బహుభాషా సేవల కోసం భాషిణి, భారత్‌నెట్ అనుసంధాన పర్యవేక్షణ కోసం బీఎస్‌ఎన్‌ఎల్, వాతావరణ సంబంధిత సమాచారం కోసం భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఉన్నాయి.

 

4. జాతీయ ప్రాధాన్యాలను స్థానిక అవసరాలతో అనుసంధానించడం: ప్రభుత్వ కార్యక్రమాలను సులభంగా అర్థమయ్యే భాషలో వివరించేందుకు ఇప్పటికే ఉన్న శిక్షణ, డిజిటల్, ప్రజలను చేరుకునే వేదికలను ఈ పథకం ఉపయోగించుకుంటుంది. గ్రామసభలు, పంచాయతీ వేదికలు ప్రజల్లో అవగాహనతో కూడిన చర్చలను ప్రోత్సహించి, తద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని (జన్ భాగీదారీ) పెంపొందిస్తాయి. ఏఐ ఆధారంగా 17 భారతీయ భాషల్లో పరస్పర సంభాషణకు వీలు కల్పించడం ద్వారా పంచమ్ ఈ ప్రయత్నానికి తోడ్పడుతుంది. జాతీయ ప్రాధాన్యాలను స్థానిక అవసరాలు, గ్రామాభివృద్ధి లక్ష్యాలతో అనుసంధానించేందుకు ఈ వేదికలు సహాయపడతాయి.

 

పంచమ్ - పంచాయత్ అసిస్టెన్స్ అండ్ మెసేజింగ్ చాట్‌బాట్

2026 జనవరిలో ప్రారంభించిన పంచమ్.. పంచాయతీల ప్రజాప్రతినిధులు, అధికారులు, పౌరులతో నేరుగా, సకాలంలో, పరస్పర డిజిటల్ సంభాషణకు వీలు కల్పించే వాట్సాప్ ఆధారిత సాధనం. పథకాల తాజా సమాచారం, శిక్షణ అంశాలు, సర్వేలు, పంచాయతీ సేవల సమాచారాన్ని పంచమ్ సులభంగా అందుబాటులోకి తెస్తుంది. తద్వారా క్షేత్రస్థాయిలో పారదర్శకంగా, సమర్థంగా సేవలు అందించేందుకు తోడ్పడుతుంది.

 

5. ఈ విధానాన్ని ఆచరణలో పెట్టేందుకు సామర్థ్యాల పెంపు: పీఎం వికసిత్ గ్రామ్ స్వరాజ్ యోజన.. ప్రజాప్రతినిధులు, పంచాయతీ సిబ్బంది సామర్థ్యాలను పెంచుతుంది. ఇంటిగ్రేటెడ్ గవర్నమెంట్ ఆన్‌లైన్ ట్రైనింగ్, నేషనల్ అకాడమీ ఫర్ కెపాసిటీ బిల్డింగ్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ద్వారా ఈ శిక్షణ నిర్వహిస్తారు. స్థానిక ప్రజాప్రతినిధులకు ప్రత్యేక శిక్షణ (ఉదాహరణకు, ఇంజినీరింగ్ అంచనాల తయారీ), సాధారణ శిక్షణ అందిస్తారు. డిజిటల్ వేదికలను సమర్థంగా వినియోగించడం, పథకాలు, వనరుల సమాచారాన్ని అర్థం చేసుకోవడం, సమగ్ర ప్రణాళికలు రూపొందించడం, పౌరులతో సంభాషించడం వంటి అంశాల్లో సామర్థ్యాల పెంపు తోడ్పడుతుంది. స్థానిక చర్చలను అభివృద్ధి ప్రణాళికలుగా మలిచి, తదుపరి చర్యలు చేపట్టేందుకు ఈ సామర్థ్యాలు పంచాయతీలకు సహాయపడతాయి.

 

6. అందుబాటులో ఉన్న వనరుల పారదర్శక, సమర్థ వినియోగం: ఆర్థిక సంఘం గ్రాంట్లు, ఇతర నిధులను సమర్థంగా వినియోగించుకునేందుకు పంచాయతీల సామర్థ్యాన్ని ఈ పథకం పెంచుతుంది. సొంత వనరుల నుంచి ఆదాయాన్ని (ఓఎస్‌ఆర్) సమీకరించుకునేందుకు కూడా తోడ్పడుతుంది. ఆన్‌లైన్ లెక్కల నిర్వహణ, ఆడిటింగ్, వివరాలను ప్రజలకు వెల్లడించడం వంటి చ‌ర్య‌లు ఆర్థిక జవాబుదారీతనాన్ని మెరుగుపరుస్తాయి. ఈ చర్యలు వనరుల పారదర్శక వినియోగాన్ని ప్రోత్సహించి, పంచాయతీలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు తోడ్పడతాయి.

 

లక్ష్యాలను ఫలితాలుగా మలచడం

ప్రణాళికల రూపకల్పన, పౌరుల అవగాహన, సామర్థ్యాల పెంపు, ఆర్థిక జవాబుదారీతనానికి సంబంధించి పీఎం వికసిత్ గ్రామ్ స్వరాజ్ యోజన వార్షిక లక్ష్యాలను నిర్దేశిస్తుంది:

 

* ఈ-గ్రామ్‌స్వరాజ్ పోర్టల్‌లో ఏటా 2.55 లక్షలకు పైగా జీపీడీపీల తయారీకి ఈ పథకం తోడ్పడుతుంది. ఈ ప్రణాళికలు గ్రామ ప్రాధాన్యాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల కార్యక్రమాలు, అందుబాటులో ఉన్న వనరులను సమన్వయం చేస్తాయి. సమన్వయంతో నిర్వహించే అవగాహన ప్రచార కార్యక్రమాలు ప్రభుత్వ పథకాలు, జాతీయ కార్యక్రమాలపై ప్రజల అవగాహనను మెరుగుపరుస్తాయి.

 

* ప్రతి విడత అవగాహన కార్యక్రమం ద్వారా కనీసం కోటి మంది పౌరులను చేరుకోవడం లక్ష్యం. డిజిటల్ వేదికలు, ప్రజలను చేరుకునే కార్యక్రమాలు, గ్రామసభలు, పంచాయతీ వేదికలు పౌరుల భాగస్వామ్యానికి తోడ్పడతాయి. సంబంధిత ప్రభుత్వ పథకాలు, జాతీయ కార్యక్రమాలపై అవగాహనను మెరుగుపరచడం ఈ అవగాహన కార్యక్రమాల లక్ష్యం. తద్వారా స్థానికంగా వాటి ప్రభావంపై అవగాహనతో కూడిన చర్చలను ప్రోత్సహిస్తాయి.

 

* పాలనా వ్యవస్థలో భాగస్వాములైన సుమారు 32 లక్షల మందికి ఏటా సహాయం అందిస్తారు. వీరిలో ఎన్నికైన ప్రజాప్రతినిధులు, పంచాయతీ సిబ్బంది, ఇతర భాగస్వాములు ఉంటారు. వీరికి సామర్థ్యాభివృద్ధి శిక్షణ, డిజిటల్ వ్యవస్థల వినియోగంలో అవసరమైన మార్గదర్శకత్వం అందిస్తారు. ఈ చర్యలు ప్రణాళికల రూపకల్పన, పౌరులతో సమాచార మార్పిడి, వనరుల నిర్వహణను బలోపేతం చేస్తాయి. స్థానికంగా ప్రాధాన్యమున్న సుస్థిరాభివృద్ధి లక్ష్యాల (ఎస్‌డీజీల) సాధనలో పురోగతికి తోడ్పడతాయి.

 

* ఏటా కనీసం 2.55 లక్షల ఆన్‌లైన్ ఆడిట్ ప్రణాళికలకు ఈ పథకం సహాయం అందిస్తుంది. సంబంధిత ఆడిట్‌లు ఆడిట్‌ఆన్‌లైన్ ద్వారా సకాలంలో పూర్తవుతాయని భావిస్తున్నారు. మెరుగైన లెక్కల నిర్వహణ, వివరాలను ప్రజలకు వెల్లడించడం అందుబాటులో ఉన్న నిధుల విషయంలో జవాబుదారీతనాన్ని బలోపేతం చేస్తాయి.

 

ఆడిట్‌ఆన్‌లైన్

పంచాయతీల ఆర్థిక నిర్వహణ, పారదర్శకతను మరింత బలోపేతం చేసేందుకు పంచాయతీరాజ్ ఖాతాలను ఆన్‌లైన్‌లో ఆడిట్ చేయడానికి 2020లో ఆడిట్‌ఆన్‌లైన్ అప్లికేషన్‌ను ప్రారంభించారు. ప్రతి రాష్ట్రంలోని ఆడిట్ చట్టం/నిబంధనలకు అనుగుణంగా ఈ అప్లికేషన్‌ను సర్దుబాటు చేసుకోవచ్చు.

 

పథకం అమలు విధానం

ఇప్పటికే ఉన్న ప్రభుత్వ సంస్థలు, వ్యవస్థల ద్వారా పీఎం వికసిత్ గ్రామ్ స్వరాజ్ యోజన అమలవుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల పాలనా యంత్రాంగాలు వార్షిక కార్యాచరణ ప్రణాళికలను సమర్పిస్తాయి. పథకం కింద చేపట్టే కార్యక్రమాలు, ప్రాధాన్యాలు, అవసరాలను ఈ ప్రణాళికల్లో పేర్కొంటాయి. ఇందుకోసం నియమించిన కేంద్ర సాధికార కమిటీ ఈ ప్రణాళికలను మదింపు చేసి, ఆమోదిస్తుంది. వర్తించే విధివిధానాలు, నిబంధనల ప్రకారం ఈ ప్రక్రియ సాగుతుంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు/కేంద్రపాలిత ప్రాంతాల పాలనా యంత్రాంగాలు తమ తమ బాధ్యతల పరిధిలో కార్యక్రమాలను చేపడతాయి. వివిధ పరిపాలనా స్థాయుల మధ్య సమన్వయం పథకం అమలుకు తోడ్పడుతుంది. సాంకేతిక సహాయం, పర్యవేక్షణ, సమీక్ష అమలుకు సహాయపడతాయి. ఇప్పటికే ఉన్న సంస్థాగత, డిజిటల్, సామర్థ్యాభివృద్ధి, సమాచార వ్యవస్థలు క్షేత్రస్థాయిలో సేవలు అందించడాన్ని సులభతరం చేస్తాయి.

 

శాశ్వత పోస్టుల ఏర్పాటుకు ఈ పథకంలో అవకాశం కల్పించలేదు. అయితే, అవసరాల ఆధారంగా రాష్ట్ర, జిల్లా, బ్లాక్ స్థాయుల్లో ఒప్పంద ప్రాతిపదికన సిబ్బందిని నియమించుకునే అవకాశం ఉంది. ఈ సిబ్బంది సాంకేతిక సహాయం అందించి, పథకం లక్ష్యాల సాధనకు తోడ్పడతారు.

 

పటిష్ట‌ స్థానిక పాలనతో గ్రామాల సాధికారత

ప్రధానమంత్రి వికసిత్ గ్రామ్ స్వరాజ్ యోజన గ్రామీణ పాలనను మరింత సమర్థంగా, జవాబుదారీతనంతో నిర్వహించేలా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రణాళికల రూపకల్పన, డిజిటల్ వ్యవస్థలు, ప్రజల భాగస్వామ్యం, ఆర్థిక నిర్వహణను ఇది సమన్వయం చేస్తుంది. గ్రామీణాభివృద్ధికి వనరులు, జాతీయ కార్యక్రమాలు విస్తరిస్తున్న నేపథ్యంలో క్షేత్రస్థాయి సంస్థలను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని తీర్చే దిశగా ఈ పథకం పనిచేస్తుంది. స్థానిక పాలనను మరింత సమన్వయంతో, పారదర్శకంగా, ప్రజల ప్రాధాన్యాలకు స్పందించేలా తీర్చిదిద్దడం దీని లక్ష్యం. సమ్మిళిత గ్రామీణాభివృద్ధికి కీలక చోదకశక్తులుగా క్షేత్రస్థాయి సంస్థలను బలోపేతం చేయడం ద్వారా విస్తృతమైన వికసిత్ భారత్ లక్ష్యసాధనకు తోడ్పడాలని ఈ విధానం లక్ష్యంగా పెట్టుకుంది.

 

References

Ministry of Panchayati Raj

https://x.com/mopr_goi/status/2014634258313445622

https://www.pib.gov.in/PressReleaseDetail.aspx?PRID=2329491&reg=3&lang=1

https://www.pib.gov.in/Pressreleaseshare.aspx?PRID=1845366&reg=48&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2297553&reg=48&lang=2

https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=1907878&reg=48&lang=2

 

Click here to see pdf

 

***

(Explainer ID: 160631) आगंतुक पटल : 19
Provide suggestions / comments
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali , Assamese , Kannada