Social Welfare
ఖేలో ఇండియా ఆట వస్తువుల తయారీ పథకం
ప్రపంచ స్థాయిలో పోటీపడే ఆట వస్తువుల తయారీ వ్యవస్థ నిర్మాణం
Posted On:
28 OCT 2026 6:44PM
2026-27 నుంచి 2033-34 ఆర్థిక సంవత్సరాల వరకు ₹1,856.67 కోట్ల వ్యయంతో అమలు చేసే ఖేలో ఇండియా ఆట వస్తువుల తయారీ పథకానికి కేంద్ర మంత్రివర్గం 2026 అక్టోబర్ 28న ఆమోదం తెలిపింది. ప్రత్యేక క్రీడా వస్తువుల తయారీ జోన్లు తయారీదారులు, సరఫరాదారులు, పరీక్ష కేంద్రాలు, డిజైన్ కేంద్రాలను ఒకేచోటకు తీసుకురానున్నాయి. ప్రధాన పెట్టుబడులకు సహాయం, టర్నోవర్ ఆధారిత ఉత్పత్తి ప్రోత్సాహానికి కలిపి కేటాయించిన ₹1,130 కోట్లు కొత్త పెట్టుబడులను ఆకర్షించి, ఉత్పత్తిని పెంచేందుకు తోడ్పడనున్నాయి. అంతర్జాతీయ క్రీడా సమాఖ్యల నుంచి ధ్రువపత్రాలు పొందేందుకు, వాటిని పునరుద్ధరించుకునేందుకు తయారీదారులకు మరో ₹105 కోట్లతో సహాయం అందించనున్నారు. సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్, స్టార్టప్‌లకు సహాయం, నైపుణ్య శిక్షణ, ఎగుమతుల ప్రోత్సాహం కూడా ఈ పథకంలో భాగంగా ఉన్నాయి. అత్యంత నాణ్యమైన క్రీడా వస్తువులకు భారత్‌ను ప్రపంచ కేంద్రంగా తీర్చిదిద్దడం ఈ పథకం లక్ష్యం.
పరిచయం
క్రీడారంగంలో భారత్ నిర్దేశించుకున్న లక్ష్యాలు ఆటస్థలాలు, శిక్షణ కేంద్రాల నుంచి తయారీ, వ్యాపార రంగాల వరకు అవకాశాలను కల్పిస్తున్నాయి. ఖేలో ఇండియా, ఖేలో భారత్ నీతి 2025 వంటి కార్యక్రమాలు క్రీడల్లో భాగస్వామ్యాన్ని, ప్రతిభాభివృద్ధిని, క్రీడా మౌలిక వసతులను బలోపేతం చేస్తున్నాయి. నాణ్యమైన పరికరాలను సరఫరా చేయడంతోపాటు నైపుణ్యాలు, ఉపాధి, ఎగుమతులకు అవకాశాలు కల్పించడం ద్వారా బలమైన క్రీడా వస్తువుల పరిశ్రమ ఈ లక్ష్యసాధనకు తోడ్పడగలదు.
జలంధర్ (పంజాబ్), మీరఠ్ (ఉత్తరప్రదేశ్) వంటి స్థిరపడిన తయారీ క్లస్టర్లు, నైపుణ్యం కలిగిన కార్మికులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు నిర్వహించే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల (ఎంఎస్‌ఎంఈల) విస్తృత వ్యవస్థ భారత్ క్రీడా వస్తువుల తయారీ రంగానికి బలమైన పునాదిగా ఉన్నాయి. మొత్తం ఉత్పత్తిలో దాదాపు 90% వాటా చిన్న, సూక్ష్మ సంస్థలదే. దీంతో స్థానిక వ్యాపారాలు, ఉపాధికి ఈ రంగం ముఖ్యమైన వేదికగా నిలుస్తోంది. 2024లో సుమారు 140 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువ కలిగిన ప్రపంచ క్రీడా పరికరాల మార్కెట్, 2036 నాటికి సుమారు 283 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుతుందని అంచనా. అంతర్జాతీయ మార్కెట్‌లో తమ ఉనికిని విస్తరించుకునేందుకు భారత తయారీదారులకు ఇది విస్తృత అవకాశాలను కల్పిస్తోంది.
ఈ బలాలను మరింత పెంచేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం, 2026-27 నుంచి 2033-34 ఆర్థిక సంవత్సరాల వరకు మొత్తం ₹1,856.67 కోట్ల వ్యయంతో ఖేలో ఇండియా స్పోర్ట్స్ గూడ్స్ మాన్యుఫ్యాక్చరింగ్ స్కీమ్‌కు ఆమోదం తెలిపింది. 2026-27 కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన ఈ పథకం పెట్టుబడులు, సాంకేతికత, ఆవిష్కరణలు, నైపుణ్యాలు, మార్కెట్ అభివృద్ధికి సహాయాన్ని సమన్వయం చేస్తుంది. క్రీడా వస్తువుల రూపకల్పన, అభివృద్ధి, తయారీలో భారత్‌ను ప్రపంచ స్థాయిలో పోటీపడే కేంద్రంగా తీర్చిదిద్దడం దీని లక్ష్యం. “అత్యంత నాణ్యమైన, సరసమైన ధరల క్రీడా వస్తువులకు ప్రపంచ కేంద్రంగా ఎదిగే సామర్థ్యం భారత్‌కు ఉంది” అని 2026-27 బడ్జెట్ ప్రసంగం పేర్కొంది.
పథకం కింద ప్రధాన చర్యలు
మౌలిక వసతులు, పెట్టుబడుల నుంచి పరిశోధన, నైపుణ్యాలు, ధ్రువీకరణ, మార్కెట్ అభివృద్ధి వరకు క్రీడా వస్తువుల తయారీ విలువ గొలుసు అంతటా ఈ పథకం సహాయం అందిస్తుంది. ఇందులో రెండు భాగాలున్నాయి: తయారీకి మద్దతుగా ప్రోత్సాహకాలు, విస్తృత తయారీ వ్యవస్థను నిర్మించే చర్యలు.
* సమీకృత తయారీ జోన్ల అభివృద్ధి: సమీకృత ఆట వస్తువుల తయారీ జోన్లు (ఎస్‌జీఎంజెడ్‌లు) తయారీదారులు, సరఫరాదారులు, పరీక్ష కేంద్రాలు, డిజైన్, నమూనా తయారీ కేంద్రాలు, అనుబంధ సంస్థలను ఒకేచోటకు తీసుకురానున్నాయి. భవ్య పథకం, ఎన్‌ఐసీడీసీ పారిశ్రామిక పార్కులతో సమన్వయం ద్వారా అభివృద్ధి చేసే ఈ జోన్లు పరిశ్రమల మధ్య అనుసంధానాన్ని బలోపేతం చేసి, తయారీ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఒక్కొక్కటి 300 ఎకరాలకు పైగా విస్తీర్ణంతో ఇలాంటి నాలుగు సమీకృత జోన్లు ఏర్పాటయ్యే అవకాశం ఉంది.
* పెట్టుబడుల ఆకర్షణ, ఉత్పత్తి విస్తరణ: కలిపి ₹1,130 కోట్ల కేటాయింపుతో రెండు అంశాలు తయారీ వృద్ధికి తోడ్పడనున్నాయి. ప్రధాన పెట్టుబడిదారులకు సహాయం కింద కనీసం ₹100 కోట్లు పెట్టుబడి పెట్టే ప్రధాన పెట్టుబడిదారుల మూలధన వ్యయంలో 20% మేర సహాయం అందిస్తారు. క్రీడా వస్తువుల తయారీ జోన్లలో తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసేలా ప్రముఖ దేశీయ, అంతర్జాతీయ తయారీదారులు, బ్రాండ్లు, రిటైల్ సంస్థల సముదాయాలను ఇది ప్రోత్సహిస్తుంది. టర్నోవర్ ఆధారిత సహాయం కింద ₹10 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ పెట్టుబడి పెట్టే తయారీదారులకు 15% వరకు ప్రోత్సాహకాలు అందిస్తారు. ఉత్పత్తిని పెంచడం, తయారీ సామర్థ్యాన్ని విస్తరించడం దీని ఉద్దేశం.
* ఇప్పటికే ఉన్న క్లస్టర్ల ఆధునీకరణ, ఎంఎస్‌ఎంఈలకు సహాయం: రాష్ట్రాలతో వ్యయాన్ని పంచుకునే విధానంలో ఇప్పటికే ఉన్న క్రీడా వస్తువుల తయారీ క్లస్టర్లలో ఉమ్మడి సదుపాయాలు, మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు సహాయం అందిస్తారు. చిన్న సంస్థలు తమ తయారీ సామర్థ్యాలను పెంచుకునేందుకు ఇది తోడ్పడుతుంది.
* అంతర్జాతీయ ధ్రువీకరణకు సహాయం: అంతర్జాతీయ క్రీడా సమాఖ్యల నుంచి ధ్రువపత్రాలు పొందేందుకు, వాటిని పునరుద్ధరించుకునేందుకు తయారీదారులకు ₹105 కోట్ల కేటాయింపుతో సహాయం అందిస్తారు. తొలిసారి ధ్రువీకరణ పొందేందుకు అయ్యే వ్యయంలో 70%, పునరుద్ధరణ వ్యయంలో 50% మేర సహాయం అందుతుంది. అంతర్జాతీయంగా ఆమోదం పొందిన నాణ్యత, పనితీరు ప్రమాణాలను ఇది ప్రోత్సహించి, ప్రపంచ మార్కెట్లలో ప్రవేశాన్ని సులభతరం చేస్తుంది.
* పరిశోధన, స్టార్టప్‌ల ఆవిష్కరణలకు ప్రోత్సాహం: ప్రముఖ విద్యా, పరిశోధన సంస్థల్లో ఏర్పాటు చేసే సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ క్రీడా పరికరాలు, పదార్థ విజ్ఞాన శాస్త్రం, రక్షణ సామగ్రి, అధునాతన తయారీ సాంకేతికతలపై పరిశోధనలకు తోడ్పడతాయి. అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్‌తో సమన్వయం ద్వారా పరిశోధనలకు సంయుక్తంగా నిధులు సమకూర్చడాన్ని ప్రోత్సహిస్తారు. డీపీఐఐటీలో నమోదైన క్రీడారంగ స్టార్టప్‌లు ₹20 లక్షల వరకు గ్రాంట్లు పొందేందుకు అర్హత కలిగి ఉంటాయి. స్టార్టప్ ఇండియాకు అనుగుణంగా అందించే ఈ సహాయం కొత్త సాంకేతికతలు, ప్రక్రియలు, ఉత్పత్తుల అభివృద్ధి, పరీక్షలు, పనితీరు నిర్ధారణ, వాణిజ్యీకరణకు తోడ్పడుతుంది.

* పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాల అభివృద్ధి: మారుతున్న మానవ వనరుల అవసరాలను తీర్చేందుకు నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ, సంబంధిత పరిశ్రమ వర్గాల సహకారంతో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తారు.
* భారత క్రీడా వస్తువులకు ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సాహం: ఇండియా స్పోర్ట్స్ ఎక్స్‌పో, బ్రాండ్ ఇండియా ప్రచారంతోపాటు ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ మిషన్ సహకారంతో బ్రాండింగ్, ప్రచారం, మార్కెట్ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు. ఇవి భారత క్రీడా వస్తువులకు మరింత గుర్తింపు కల్పించి, అంతర్జాతీయ మార్కెట్లలో విస్తృత ప్రవేశానికి తోడ్పడతాయి.
భారత్ క్రీడా వస్తువుల తయారీ పునాదిని బలోపేతం చేయడం
ప్రస్తుతం భారత్ క్రీడా వస్తువుల పరిశ్రమ
భారత్ క్రీడా వస్తువుల పరిశ్రమ స్థిరపడిన తయారీ నైపుణ్యాలు, చిన్న సంస్థల విస్తృత వ్యవస్థ కలయికగా ఉంది. దీని బలాలు విడివిడి ఉత్పత్తులకే పరిమితం కావు. దేశీయ, అంతర్జాతీయ కొనుగోలుదారుల అవసరాలను తీర్చే తయారీదారులు, సరఫరాదారులు, గృహాధారిత యూనిట్ల క్లస్టర్ల వరకు విస్తరించి ఉన్నాయి.
* స్థిరపడిన తయారీ వ్యవస్థ: జలంధర్, మీరఠ్‌లలో కలిపి 250కి పైగా ఎగుమతి యూనిట్లు, దేశీయ మార్కెట్‌కు సరఫరా చేసే 1,000కి పైగా యూనిట్లు, 4,000కు పైగా సూక్ష్మ సంస్థలు, దాదాపు 20,000 గృహాధారిత యూనిట్లు ఉన్నాయి. సైకిళ్ల తయారీకి లుధియానా, క్రీడా అనుబంధ సామగ్రి, దుస్తులకు దిల్లీ, ముంబయి ఇతర ముఖ్య కేంద్రాలుగా ఉన్నాయి.
* ఎంఎస్‌ఎంఈల బలమైన భాగస్వామ్యం: దాదాపు 90% ఉత్పత్తిని చిన్న, సూక్ష్మ సంస్థలే చేపడుతున్నాయి. అందువల్ల క్రీడా వస్తువుల తయారీ వృద్ధికి వ్యవస్థాపకత, స్థానిక జీవనోపాధులు, ఉపాధితో సన్నిహిత సంబంధం ఉంది.
* అంతర్జాతీయ మార్కెట్‌లో ఉనికి కలిగిన ఉత్పత్తులు: క్రికెట్ బ్యాట్లు, రక్షణ సామగ్రి, గాలి నింపే బంతులు, జిమ్‌లు, అథ్లెటిక్స్ శిక్షణకు అవసరమైన పరికరాలను భారత్ తయారు చేస్తోంది. భారత్ క్రీడా పరికరాల ఎగుమతుల్లో సగానికి పైగా యునైటెడ్ కింగ్‌డమ్, అమెరికా, ఆస్ట్రేలియాకు వెళ్తున్నాయి. దీంతో ప్రధాన విదేశీ మార్కెట్లతో స్థిరమైన సంబంధాలు ఏర్పడ్డాయి.
* పట్టున్న విభాగాలు: ప్రపంచ క్రికెట్ బ్యాట్ల మార్కెట్‌లో భారత్‌లోని బ్రాండ్లు, తయారీదారులకు కలిపి సుమారు 75 నుంచి 80% వాటా ఉంది. క్రికెట్ హెల్మెట్ల మార్కెట్‌లో భారత్ వాటా సుమారు 30 నుంచి 35% ఉంటుందని అంచనా.
* అనుబంధ పరిశ్రమల్లో అవకాశాలు: క్రీడా పరికరాల ఉత్పత్తికి రబ్బరు, పాలిమర్లు, మిశ్రమ పదార్థాలు, కలప, లోహాల రంగాల్లోని సామర్థ్యాలు ఉపయోగపడుతున్నాయి. ఉమ్మడిగా వినియోగించే పదార్థాలు, యంత్రాలు, నైపుణ్యాలు ఉత్పత్తులను వైవిధ్యపరిచేందుకు, వివిధ పరిశ్రమల్లో సరఫరాదారుల వ్యవస్థలను బలోపేతం చేసేందుకు అవకాశాలు కల్పిస్తున్నాయి.
* దేశీయ, అంతర్జాతీయ డిమాండ్‌ను తీర్చే అవకాశం: భారత్ దేశీయ క్రీడా వస్తువుల మార్కెట్ విలువ 2.5 బిలియన్ అమెరికన్ డాలర్లుగా అంచనా. ఇందులో పరికరాల మార్కెట్ విలువ సుమారు 0.5 బిలియన్ అమెరికన్ డాలర్లు. ప్రపంచవ్యాప్తంగా క్రీడా పరికరాల ఎగుమతులు 2024లో సుమారు 52 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరాయి. ప్రస్తుతం 275 మిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉన్న భారత్ క్రీడా పరికరాల ఎగుమతులను మరింత విస్తరించేందుకు ఇది అవకాశాలను అందిస్తోంది.
* దీర్ఘకాలంలో విస్తృత అవకాశాలు: భారత్ క్రీడా పరికరాల ఎగుమతులు 2036 నాటికి సుమారు 8.1 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరే అవకాశం ఉంది. తద్వారా అదనంగా దాదాపు 54 లక్షల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉంది.
* ప్రధాన క్రీడా పోటీల దశాబ్దం: 2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్, 2030లో అహ్మదాబాద్‌లో జరిగే కామన్వెల్త్ క్రీడలు, 2032 బ్రిస్బేన్ ఒలింపిక్స్, 2036 ఒలింపిక్ క్రీడల ఆతిథ్యం కోసం బిడ్ దాఖలు చేయాలన్న భారత్ ప్రణాళిక క్రీడా పరికరాలకు పదేళ్లపాటు డిమాండ్‌ను సృష్టిస్తున్నాయి.
ఈ బలాలన్నీ ఉత్పత్తి విస్తరణకు, అధిక విలువ కలిగిన పరికరాల అభివృద్ధికి, అంతర్జాతీయ మార్కెట్‌లో ఉనికిని పెంచుకునేందుకు పునాదిగా నిలుస్తున్నాయి. సాంకేతికత, పరీక్షలు, ధ్రువీకరణ, పరిశ్రమ భాగస్వామ్యాలు ఈ అవకాశాలను తయారీ వృద్ధిగా మలిచేందుకు తోడ్పడగలవు.

కొత్త పథకం ద్వారా ఈ బలాలను మరింత పెంచడం
ఖేలో ఇండియా స్పోర్ట్స్ గూడ్స్ మాన్యుఫ్యాక్చరింగ్ స్కీమ్ తయారీ విలువ గొలుసు అంతటా సహాయాన్ని సమన్వయం చేస్తుంది. ఈ పథకంలోని చర్యలు కింది ప్రాధాన్య అంశాలపై దృష్టి సారిస్తాయి:
* దేశీయ తయారీ బలోపేతం: సమీకృత తయారీ జోన్లు, పెట్టుబడి, ఉత్పత్తికి సహాయం తయారీ సామర్థ్య విస్తరణను ప్రోత్సహిస్తాయి. సరఫరాదారుల వ్యవస్థలను బలోపేతం చేసి, దేశీయంగా విలువ జోడింపును పెంచి, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తాయి.
* ఎంఎస్‌ఎంఈల వృద్ధి: ఇప్పటికే ఉన్న క్లస్టర్ల ఆధునీకరణ, ఉమ్మడి సదుపాయాలు, మౌలిక వసతుల అభివృద్ధి చిన్న సంస్థలకు తోడ్పడతాయి.
* మెరుగైన నాణ్యత, ఆవిష్కరణలు: పరిశోధన కేంద్రాలు, సాంకేతిక అభివృద్ధి, స్టార్టప్‌లకు సహాయం, అంతర్జాతీయ ధ్రువీకరణ ఉత్పత్తుల అభివృద్ధి, నాణ్యతను బలోపేతం చేస్తాయి.
* నైపుణ్యాలు, ఉపాధి: పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన శిక్షణ నైపుణ్యం కలిగిన సిబ్బందిని తీర్చిదిద్దేందుకు, విలువ గొలుసు అంతటా ఉపాధికి తోడ్పడుతుంది.
* ప్రపంచ స్థాయిలో పోటీ సామర్థ్యం పెంపు: బ్రాండింగ్, ప్రచారం, మార్కెట్ అభివృద్ధి భారత క్రీడా వస్తువులను అంతర్జాతీయ కొనుగోలుదారులకు చేరువ చేస్తాయి.
* భారత్ క్రీడా లక్ష్యాలకు తోడ్పాటు: అంతర్జాతీయ ధ్రువీకరణ కలిగిన అత్యంత నాణ్యమైన పరికరాలు క్రీడారంగానికి, క్రీడాకారుల అభివృద్ధి కార్యక్రమాలకు తోడ్పడతాయి. ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా ప్రయత్నాలకు ఇవి అనుబంధంగా నిలుస్తాయి.
జాతీయ పథకాలు, కార్యక్రమాలతో సమన్వయం
తయారీ మౌలిక వసతులను పరిశోధన, నైపుణ్యాలు, ఎగుమతి అవకాశాలతో అనుసంధానించేందుకు ఈ పథకం ఇప్పటికే ఉన్న జాతీయ కార్యక్రమాలను ఉపయోగించుకుంటుంది. భారత్ క్రీడా వ్యవస్థను బలోపేతం చేయాలన్న విస్తృత లక్ష్యానికి కూడా ఇది తోడ్పడుతుంది.
తయారీ మౌలిక వసతులు
* భవ్య: భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన ₹33,660 కోట్ల కేటాయింపుతో 100 ప్లగ్-అండ్-ప్లే పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు అవకాశం కల్పిస్తుంది. వెంటనే వినియోగించుకునేలా సిద్ధంగా ఉన్న ఫ్యాక్టరీ షెడ్లు, పరీక్ష ప్రయోగశాలలు, గిడ్డంగులు వంటి సదుపాయాలు తయారీదారులకు అవసరమైన మౌలిక వసతులను అందిస్తాయి. భవ్య పథకం కింద మౌలిక వసతులతో సమన్వయం ద్వారా క్రీడా వస్తువుల తయారీ జోన్లను అభివృద్ధి చేస్తారు.
* నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌ఐసీడీసీ): తయారీదారులకు భూమి, రహదారులు, విద్యుత్తు, నీరు, రవాణా అనుసంధానాలతో పారిశ్రామిక నగరాలను అభివృద్ధి చేసేందుకు ఎన్‌ఐసీడీసీ తోడ్పడుతుంది. దీని పారిశ్రామిక కారిడార్ కార్యక్రమం 13 రాష్ట్రాల్లోని 20 పారిశ్రామిక స్మార్ట్ నగరాలను కలిగి ఉంది. వీటిలో 2026 సెప్టెంబర్ నాటికి నాలుగు పూర్తయ్యాయి. తయారీదారులు, సరఫరాదారులు, సహాయక సదుపాయాలను ఒకేచోటకు తీసుకువచ్చే తయారీ జోన్ల అభివృద్ధికి క్రీడా వస్తువుల పథకం ఎన్‌ఐసీడీసీ పారిశ్రామిక పార్కుల్లోని మౌలిక వసతులను ఉపయోగించుకుంటుంది.
పరిశోధన, ఆవిష్కరణలు
* అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్: విద్యాసంస్థలు, పరిశోధన సంస్థలు, పరిశ్రమల మధ్య పరిశోధన, సహకారానికి ఏఎన్‌ఆర్‌ఎఫ్ తోడ్పడుతుంది. పరికరాలు, పదార్థాలు, రక్షణ సామగ్రి, తయారీ సాంకేతికతలపై పనిచేసే సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు పథకం అందించే సహాయంతోపాటు, ఏఎన్‌ఆర్‌ఎఫ్‌తో సమన్వయం క్రీడా వస్తువుల రంగంలో పరిశోధన & అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది.
* స్టార్టప్ ఇండియా: ప్రారంభ దశ నిధులు, పెట్టుబడులు, రుణ హామీల ద్వారా స్టార్టప్ ఇండియా కొత్త సంస్థలకు సహాయం అందిస్తుంది. ఆలోచనలు ఆచరణయోగ్యమైన వ్యాపారాలుగా ఎదిగేందుకు తోడ్పడుతుంది. 2026 మార్చి 31 నాటికి భారత్‌లో 2.23 లక్షలకు పైగా గుర్తింపు పొందిన స్టార్టప్‌లు ఉన్నాయి. ఇవి 23.36 లక్షలకు పైగా ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టించాయి. క్రీడా వస్తువుల పథకంలో స్టార్టప్‌లకు ప్రత్యేకంగా అందించే సహాయం ఈ విస్తృత వ్యవస్థతో సమన్వయం అవుతుంది. పరికరాలు, పదార్థాలు, తయారీ ప్రక్రియల్లో అభివృద్ధి, పరీక్షల నుంచి పనితీరు నిర్ధారణ, వాణిజ్యీకరణ వరకు ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది.
ఎగుమతుల ప్రోత్సాహం
* ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ మిషన్: 2025-26 నుంచి 2030-31 వరకు ₹25,060 కోట్ల వ్యయంతో అమలయ్యే ఈ మిషన్ ఎగుమతులకు ఆర్థిక సహాయం, నాణ్యత ప్రమాణాల అనుసరణ, సరకు రవాణా, మార్కెట్లలో ప్రవేశానికి సహాయాన్ని సమన్వయం చేస్తుంది. ముఖ్యంగా ఎంఎస్‌ఎంఈలు, తొలిసారి ఎగుమతులు చేసే వారికి తోడ్పడుతుంది. ఇందులోని నిర్యాత్ ప్రోత్సాహన్, నిర్యాత్ దిశ అనే రెండు భాగాలు ఎగుమతిదారులు ఆర్థిక సహాయం పొందేందుకు, అంతర్జాతీయ ప్రమాణాలను అందుకునేందుకు సహాయపడతాయి. వాణిజ్య ప్రదర్శనలు, కొనుగోలుదారులు-విక్రేతల సమావేశాలు, గిడ్డంగుల సదుపాయాల ద్వారా విదేశీ కొనుగోలుదారులతో అనుసంధానానికి తోడ్పడతాయి. బ్రాండింగ్, ప్రచారం, మార్కెట్ అభివృద్ధికి క్రీడా వస్తువుల పథకం ఈ విస్తృత వ్యవస్థను ఉపయోగించుకుంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో భారత తయారీదారులు తమ ఉనికిని బలోపేతం చేసుకునేందుకు సహాయపడుతుంది.
క్రీడాభివృద్ధి
* ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా: ఖేలో ఇండియా క్రీడల్లో భాగస్వామ్యం, ప్రతిభాభివృద్ధి, శిక్షణ, క్రీడా మౌలిక వసతులకు తోడ్పడుతుంది. ఫిట్ ఇండియా శారీరక దృఢత్వం, చురుకైన జీవనశైలిని ప్రోత్సహిస్తుంది. భారత్ క్రీడారంగానికి, క్రీడాకారుల అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన అత్యంత నాణ్యమైన, అంతర్జాతీయ ధ్రువీకరణ కలిగిన క్రీడా వస్తువుల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం ద్వారా తయారీ పథకం ఈ ప్రయత్నాలకు తోడ్పడుతుంది.
ఖేలో ఇండియా పథకం
* 2017లో ప్రారంభం: రాజీవ్ గాంధీ ఖేల్ అభియాన్, అర్బన్ స్పోర్ట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్, నేషనల్ స్పోర్ట్స్ టాలెంట్ సెర్చ్ స్కీమ్‌లను క్రీడాభివృద్ధికి సంబంధించిన ఒకే కార్యాచరణ పరిధిలోకి తీసుకువచ్చింది.
* ఐదు మూలస్తంభాలు: ప్రతిభను గుర్తించేందుకు శిక్షణ కేంద్రాలు; కోచ్‌లు, సహాయక సిబ్బంది సామర్థ్యాల పెంపు; క్రీడా విజ్ఞానం, సాంకేతికత; పోటీలు, లీగ్‌లు; క్రీడా మౌలిక వసతులు.
* 2026 జూలై నాటికి విస్తృతి: ₹3,176 కోట్ల పెట్టుబడితో 349 క్రీడా మౌలిక వసతుల ప్రాజెక్టులకు ఆమోదం; 1,067 ఖేలో ఇండియా కేంద్రాలు; 267 అకాడమీలకు సహాయం; 2,745 మంది ఖేలో ఇండియా క్రీడాకారులకు శిక్షణ, పరికరాలు, వైద్య సంరక్షణ, నెలవారీ భత్యం రూపంలో సహాయం.
విధానపరమైన అనుసంధానం
* ఖేలో భారత్ నీతి 2025: వ్యవస్థాపకత, పెట్టుబడులు, క్రీడారంగ స్టార్టప్‌లతో సహా ఆర్థిక వృద్ధికి చోదకశక్తిగా క్రీడలను ఈ విధానం గుర్తిస్తుంది. క్రీడాభివృద్ధిని ఉత్పత్తి, ఆవిష్కరణలు, ఉపాధి, ఎగుమతి అవకాశాలతో అనుసంధానించడం ద్వారా తయారీ పథకం ఈ విధానానికి తోడ్పడుతుంది.
ఖేలో భారత్ నీతి 2025
* జాతీయ క్రీడా విధానం: వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా దేశ నిర్మాణం, ఆర్థిక వృద్ధి, సామాజిక సమ్మిళితత్వానికి క్రీడలను సాధనంగా ఉపయోగిస్తుంది.
* క్షేత్రస్థాయి నుంచి అత్యున్నత స్థాయి వరకు: చిన్న వయసులోనే ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం, పోటీ లీగ్‌లు, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధి.
* అందరికీ క్రీడలు: జాతీయ విద్యా విధానం 2020 కింద పాఠశాల పాఠ్యప్రణాళికలో క్రీడలకు స్థానం, మహిళలు, అట్టడుగు వర్గాలు, గిరిజన సమాజాలు, దివ్యాంగుల విస్తృత భాగస్వామ్యం.
ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకాలు: తయారీ వృద్ధికి తోడ్పాటు
ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్‌ఐ) పథకాలు 14 రంగాల్లో ఉత్పత్తి, అమ్మకాల పెరుగుదలకు ప్రోత్సాహకాలు అందిస్తాయి. పెట్టుబడులు, పోటీ సామర్థ్యమున్న తయారీని ప్రోత్సహిస్తాయి.
2026 జూన్ నాటికి ఈ పథకాలు:
- ₹2.6 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి.
- ₹23.8 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తి, అమ్మకాలకు దోహదపడ్డాయి.
- ₹15.5 లక్షల కోట్లకు పైగా ఎగుమతులకు తోడ్పడ్డాయి.
- 14.6 లక్షల ఉద్యోగాలను సృష్టించాయి.
* మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, వికసిత్ భారత్@2047: దేశీయ తయారీని విస్తరించడం, విలువ జోడింపును పెంచడం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం ద్వారా ఈ పథకం మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్‌కు తోడ్పడుతుంది. పెట్టుబడులు, ఉపాధి, ఎగుమతులపై దృష్టి సారించడం ద్వారా వికసిత్ భారత్@2047 లక్ష్యసాధనకు కూడా దోహదపడుతుంది.
ఆట వస్తువులకు ప్రపంచ కేంద్రంగా ఎదిగే దిశగా..
ఆట వస్తువుల రూపకల్పన, అభివృద్ధి, తయారీలో భారత్‌ను ప్రపంచ స్థాయిలో పోటీపడే కేంద్రంగా ఈ పథకం తీర్చిదిద్దుతుందని భావిస్తున్నారు. తయారీని బలోపేతం చేయడం, ఆవిష్కరణలను ప్రోత్సహించడం, ప్రపంచ మార్కెట్లలో ప్రవేశ అవకాశాలను విస్తరించడం ద్వారా వృద్ధి, ఉపాధి, ఎగుమతులకు కొత్త అవకాశాలను కల్పిస్తుంది. ప్రముఖ క్రీడా దేశంగా ఎదగాలన్న భారత్ ఆకాంక్షకు తోడ్పడుతుంది.
References
PIB Backgrounders
https://www.pib.gov.in/PressNoteDetails.aspx?NoteId=154856&ModuleId=3®=48&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2232079®=3&lang=1
https://www.pib.gov.in/PressNoteDetails.aspx?NoteId=159409&ModuleId=3®=48&lang=1
https://www.pib.gov.in/PressNoteDetails.aspx?id=160146&NoteId=160146&ModuleId=3®=3&lang=1
NITI Aayog
https://www.niti.gov.in/sites/default/files/2026-03/Realising-the-Export-Potential-of-India-Sports-Equipment-Manufacturing-Sector.pdf
Cabinet
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2241785®=48&lang=2
https://www.pib.gov.in/PressReleaseDetail.aspx?PRID=2329481®=48&lang=1
Ministry of Finance
https://www.indiabudget.gov.in/doc/budget_speech.pdf
Ministry of Commerce and Industry
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2253019®=48&lang=2
https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=2308465®=48&lang=2
Anusandhan National Research Foundation
https://www.anrf.gov.in/about-anrf
Click here to see pdf
***
(Explainer ID: 160622)
आगंतुक पटल : 19
Provide suggestions / comments