Social Welfare

అటల్ వయో అభ్యుదయ్ యోజన భారతదేశ‌ సిల్వర్ ఎకానమీకి ఊతం

Posted On: 27 OCT 2026 11:07AM

భారత్‌లో వృద్ధుల జనాభా క్రమంగా పెరుగుతోంది. దీంతో వృద్ధాప్యంలో ఆరోగ్యం, భద్రత, గౌరవానికి భరోసా కల్పించడం ప్రభుత్వ విధానాల్లో ముఖ్య ప్రాధాన్యంగా మారింది. వృద్ధుల జీవన నాణ్యతను మెరుగుపరిచేందుకు సంస్థాగత సంరక్షణ, ఆరోగ్య సేవలు, సహాయక పరికరాలు, నైపుణ్యాభివృద్ధి, చురుకైన వృద్ధాప్య జీవనం, సాంకేతిక పరిష్కారాలను కలిపే సమగ్ర వ్యవస్థను అటల్ వయో అభ్యుదయ్ యోజన (ఏవీవైఏవై) అందిస్తోంది.

వృద్ధుల సంరక్షణ ఆవశ్యకత
భారత్‌లో జనాభా స్వరూపం క్రమంగా మారుతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం.. దేశంలో 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న వృద్ధుల సంఖ్య 10.38 కోట్లు. వీరిలో పురుషులు 5.11 కోట్లు, మహిళలు 5.27 కోట్లు. వృద్ధుల్లో గణనీయమైన శాతం మంది రోజువారీ పనులు చేసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని లాంగిట్యూడినల్ ఏజింగ్ స్టడీ ఇన్ ఇండియా (ఎల్‌ఏఎస్‌ఐ) వెల్లడించింది. వ్యవస్థీకృతమైన, నమ్మకమైన సంరక్షణ వ్యవస్థల అవసరం పెరుగుతోందని ఇది స్పష్టం చేస్తోంది. అదే సమయంలో పెరుగుతున్న పట్టణీకరణ, వలసలు, చిన్న కుటుంబాల పెరుగుదలతో భారత వృద్ధులకు సంప్రదాయంగా అందుతున్న కుటుంబ తోడ్పాటు బలహీనపడుతోంది.

2021లో ప్రారంభమైన అటల్ వయో అభ్యుదయ్ యోజన (ఏవీవైఏవై).. అంతకుముందున్న నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ సీనియర్ సిటిజన్స్ (ఎన్‌ఏపీఎస్‌ఆర్‌సీ)ను తనలో కలుపుకొని విస్తరించింది. వృద్ధుల సంక్షేమానికి సంబంధించిన పలు కార్యక్రమాలను ఒకే సమగ్ర పథకం కిందకు తీసుకొచ్చింది. రోజువారీ పనులు చేసుకునేందుకు అవసరమైన తోడ్పాటును అందించడం, వృద్ధులు చురుకైన జీవితం గడిపేలా ప్రోత్సహించడం ఈ పథకం లక్ష్యాలు. ఇందుకోసం ఆశ్రయం, ఆహారం, ఆరోగ్య సేవలు, వినోద సదుపాయాలను అందిస్తుంది. ప్రభుత్వాలు, ప్రభుత్వేతర సంస్థలు, స్థానిక సంస్థలు, ప్రజల సామర్థ్యాలను పెంచడం ద్వారా చురుకైన, ఉత్పాదక వృద్ధాప్య జీవనాన్ని కూడా ప్రోత్సహిస్తుంది. "వృద్ధాప్యంలో గౌరవప్రదమైన జీవనం", "సొంత పరిసరాల్లోనే వృద్ధాప్య జీవనం” పట్ల ప్రభుత్వ దృఢ నిబద్ధతను ఈ పథకం ప్రతిబింబిస్తుంది. వృద్ధులు జీవితకాలంలో చేసిన కృషిని గౌరవిస్తూ, వారికి మర్యాదపూర్వకమైన, సాధికారతనిచ్చే సంరక్షణ అందేలా చూడటమే గౌరవప్రదమైన వృద్ధాప్య జీవనం. సహాయక సంరక్షణ కేంద్రాలకు తరలివెళ్లకుండా, తమ ఇళ్లు, తమ పరిసరాల్లోనే వృద్ధులు సురక్షితంగా జీవించేందుకు సొంత పరిసరాల్లో వృద్ధాప్య జీవనం అనే విధానం తోడ్పడుతుంది. అవసరాలకు అనుగుణంగా ఇళ్లలో మార్పులు చేయడం, ప్రత్యేక స్థానిక సహాయక వ్యవస్థలను వినియోగించడం ద్వారా ఇది సాధ్యమవుతుంది.

ఏవీవైఏవై లక్ష్యాలు
2036 నాటికి భారత్‌లో వృద్ధుల జనాభా 23 కోట్లకు చేరుకుంటుందని అంచనా. వృద్ధుల కోసం సమగ్ర సహాయక వ్యవస్థ అవసరం పెరుగుతోందని ఇది స్పష్టం చేస్తోంది. సంస్థాగత వ్యవస్థలను బలోపేతం చేయడం, స్థానిక సమాజం ఆధారిత తోడ్పాటును ప్రోత్సహించడం ద్వారా ఈ జనాభా మార్పును ఎదుర్కోవాలని ప్రభుత్వం ఏవీవైఏవై ద్వారా లక్ష్యంగా పెట్టుకుంది. వృద్ధులు గౌరవప్రదమైన, సంతృప్తికరమైన, అర్థవంతమైన జీవితాలను గడిపేందుకు ఇది వీలు కల్పిస్తుంది. తన నిరంతర నిబద్ధతకు నిదర్శనంగా, 2026–27 ఆర్థిక సంవత్సరంలో 2026 సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసికానికి ఏవీవైఏవైలోని ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఫర్ సీనియర్ సిటిజన్స్ (ఐపీఎస్‌ఆర్‌సీ) విభాగం కింద 755 ప్రాజెక్టులకు ప్రభుత్వం ₹77.98 కోట్లను సహాయ గ్రాంట్లుగా విడుదల చేసింది.

 


ఏవీవైఏవై అమలుకు సంస్థాగత వ్యవస్థ
ఏవీవైఏవై సంస్థాగత వ్యవస్థ ఇలా ఉంది:
1. నోడల్ మంత్రిత్వ శాఖ
* సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ (ఎంఓఎస్‌జేఈ) ఈ పథకానికి నోడల్ మంత్రిత్వ శాఖగా పనిచేస్తుంది. సామాజిక న్యాయం, సాధికారత విభాగం ద్వారా ఏవీవైఏవై విధాన రూపకల్పన, నిధులు, పర్యవేక్షణ, మొత్తం అమలు బాధ్యతలను నిర్వహిస్తుంది.
2. రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు
* స్టేట్ యాక్షన్ ప్లాన్ ఫర్ సీనియర్ సిటిజన్స్ (ఎస్‌ఏపీఎస్‌ఆర్‌సీ) విభాగం కింద రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ అవసరాలకు అనుగుణంగా వృద్ధుల సంక్షేమ కార్యాచరణ ప్రణాళికలను రూపొందించి అమలు చేస్తాయి.
* ఈ ప్రణాళికల రూపకల్పన, అమలుకు మంత్రిత్వ శాఖ ఆర్థిక సహాయం అందిస్తుంది.
3. జిల్లా స్థాయి కమిటీలు: కేంద్రం, రాష్ట్రాలు మొత్తం వ్యవస్థకు రూపకల్పన చేస్తుండగా, నిరుపేద లబ్ధిదారుల ఎంపిక, క్షేత్రస్థాయిలో వసతి గృహాల పర్యవేక్షణను జిల్లా కలెక్టర్/మేజిస్ట్రేట్ అధ్యక్షతన ఉన్న జిల్లా కమిటీలు చేపడతాయి.

పర్యవేక్షణ, మదింపు, జవాబుదారీతనం
అటల్ వయో అభ్యుదయ్ యోజన (ఏవీవైఏవై)లోని అన్ని విభాగాల్లో పారదర్శకత, సమర్థత, ఫలితాల ఆధారిత అమలుకు భరోసా కల్పించేలా పర్యవేక్షణ, మదింపు, జవాబుదారీతన వ్యవస్థను రూపొందించారు.

* ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఫర్ సీనియర్ సిటిజన్స్ (ఐపీఎస్‌ఆర్‌సీ) కింద ప్రాజెక్టులు వాస్తవంగా అమలవుతున్నాయా, సక్రమంగా పనిచేస్తున్నాయా అని నిర్ధారించేందుకు ప్రాజెక్టు పర్యవేక్షణ విభాగం (పీఎంయూ) నిర్ణీత వ్యవధుల్లో క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహిస్తుంది.

* అమలు చేసే ప్రభుత్వేతర సంస్థలు సమర్పించాల్సినవి:
- నిర్ణీత వ్యవధుల్లో ప్రగతి నివేదికలు
- నిధుల వినియోగ ధ్రువపత్రాలు (యూసీలు)
- ఆడిట్ చేసిన ఆర్థిక నివేదికలు

* ఈ-అనుదాన్ పోర్టల్ ద్వారా ప్రాజెక్టులను పర్యవేక్షిస్తారు. నివాసితుల వివరాలతో అనుసంధానించిన, తాకాల్సిన అవసరం లేని క్లౌడ్ ఆధారిత బయోమెట్రిక్ హాజరు వ్యవస్థలను అమలు సంస్థలు ఉపయోగించాలి.

* పారదర్శకత కోసం సంస్థలు తమ వెబ్‌సైట్లలో లేదా పోర్టల్‌లో ప్రత్యక్ష సీసీటీవీ దృశ్యాలను కూడా అందించాలి.

ఏవీవైఏవై ప్రధాన విభాగాలు
వృద్ధుల విభిన్న అవసరాలను తీర్చేందుకు రూపొందించిన పలు సమగ్ర విభాగాల ద్వారా అటల్ వయో అభ్యుదయ్ యోజన (ఏవీవైఏవై) పనిచేస్తుంది.

ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఫర్ సీనియర్ సిటిజన్స్ (ఐపీఎస్‌ఆర్‌సీ)
ఐపీఎస్‌ఆర్‌సీ ప్రధాన అమలు విభాగంగా పనిచేస్తుంది. వృద్ధాశ్రమాలు, నిరంతర సంరక్షణ గృహాలు, సంచార వైద్య యూనిట్లు, ఫిజియోథెరపీ క్లినిక్‌లు, ప్రాంతీయ వనరుల, శిక్షణ కేంద్రాల నిర్వహణకు ప్రభుత్వేతర సంస్థలు (ఎన్‌జీఓలు), పంచాయతీరాజ్ సంస్థలు, స్థానిక సంస్థలకు నేరుగా సహాయ గ్రాంట్లను అందిస్తుంది. ప్రస్తుతం ఐపీఎస్‌ఆర్‌సీ కింద 764 వృద్ధుల వసతి గృహాలు, 13 నిరంతర సంరక్షణ గృహాలు, 17 సంచార వైద్య యూనిట్లు, 3 ఫిజియోథెరపీ క్లినిక్‌లకు మద్దతు లభిస్తోంది. ఇక్కడ సంచార వైద్య యూనిట్లు (ఎంఎంయూలు), ఫిజియోథెరపీ క్లినిక్‌లు ఇప్పటికే కొనసాగుతున్న ప్రాజెక్టులు. నిరుపేద వృద్ధులకు ఆశ్రయం కల్పించేందుకు వృద్ధుల వసతి గృహాల ఏర్పాటు, నిర్వహణపైనే పథకం ప్రస్తుత విస్తరణ ప్రధానంగా దృష్టి సారిస్తోంది. ఈ సదుపాయాల ఏర్పాటు, నిర్వహణకు ప్రభుత్వేతర సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు సహా అర్హత ఉన్న సంస్థలకు సహాయ గ్రాంట్ల రూపంలో నిధులు విడుదల చేస్తారు.

స్టేట్ యాక్షన్ ప్లాన్ ఫర్ సీనియర్ సిటిజన్స్ (ఎస్‌ఏపీఎస్‌ఆర్‌సీ)
ఈ విభాగం రాష్ట్ర స్థాయి వ్యూహం, సామర్థ్యాల పెంపుపై దృష్టి సారిస్తుంది. వృద్ధుల సంరక్షణలో శిక్షణ పొందిన సిబ్బందిని తీర్చిదిద్దేందుకు, కంటిశుక్లాల శస్త్రచికిత్సల ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించేందుకు, రాష్ట్రాల అవసరాలకు అనుగుణమైన ఇతర సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసేందుకు రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు గ్రాంట్లు అందిస్తుంది. స్థానిక ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు రాష్ట్రాలు తమకు కేటాయించిన నిధుల్లో 20% వరకు ఈ రాష్ట్ర ప్రత్యేక కార్యక్రమాలకు వినియోగించవచ్చు. రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు తమ సొంత వ్యూహాలు, కార్యక్రమాలను చేర్చుకోవచ్చు. అయితే ఏవీవైఏవై కింద ఆమోదించిన విభాగాలకు మాత్రమే నిధులు అందుతాయి. ఈ అవసరాలకు అందుబాటులో ఉన్న వనరులను పెంచేందుకు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు తమ సొంత నిధులను కూడా సమకూర్చాలని ఆశిస్తున్నారు.

రీజినల్ రిసోర్స్ అండ్ ట్రైనింగ్ సెంటర్స్ (ఆర్‌ఆర్‌టీసీలు)
ఏవీవైఏవైలో, ముఖ్యంగా ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఫర్ సీనియర్ సిటిజన్స్ (ఐపీఎస్‌ఆర్‌సీ)లో రీజినల్ రిసోర్స్ అండ్ ట్రైనింగ్ సెంటర్స్ (ఆర్‌ఆర్‌టీసీలు) కీలక సంస్థాగత సహాయక వ్యవస్థలుగా పనిచేస్తాయి. ప్రభుత్వం గుర్తించిన ఈ కేంద్రాలు వృద్ధాప్యం, వృద్ధుల సంక్షేమానికి సంబంధించిన అంశాల్లో సామర్థ్యాల పెంపు, శిక్షణ, పరిశోధన, వివరాల నమోదు, అవగాహన కల్పన, సమస్యలను సంబంధిత వర్గాల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రాంతీయ నోడల్ సంస్థలుగా పనిచేస్తాయి. డేటాబేస్‌ల అభివృద్ధి, పర్యవేక్షణ, మదింపు, ప్రాజెక్టుల తనిఖీలు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, అమలు సంస్థలతో సమన్వయం ద్వారా వాస్తవ సమాచారంపై ఆధారపడిన విధానాలు, కార్యక్రమాల అమలుకు తోడ్పడతాయి. పథకం మార్గదర్శకాల ప్రకారం.. ప్రతి ఆర్‌ఆర్‌టీసీకి ఏటా రూ.19.58 లక్షల ఆర్థిక సహాయం అందుతుంది. వృద్ధులకు సేవలను మరింత చేరువ చేసేందుకు, సామర్థ్యాలను పెంచేందుకు, సేవల అందజేతను బలోపేతం చేసేందుకు ఆర్‌ఆర్‌టీసీలుగా పనిచేసే నిర్దేశిత ప్రభుత్వేతర సంస్థలు, ఇతర సంస్థలకు మంత్రిత్వ శాఖ అదనంగా ఆర్థిక సహాయం అందిస్తుంది.

రాష్ట్రీయ వయోశ్రీ యోజన (ఆర్‌వీవై)
రాష్ట్రీయ వయోశ్రీ యోజన (ఆర్‌వీవై)ను మొదట 2017లో ప్రత్యేక కేంద్ర రంగ పథకంగా ప్రారంభించారు. తర్వాత ఏవీవైఏవైలో కీలక విభాగంగా చేర్చారు. వయసుతోపాటు వచ్చే వైకల్యం లేదా బలహీనతతో బాధపడే అర్హులైన వృద్ధులకు శారీరక విధులు దాదాపు సాధారణ స్థితికి వచ్చేందుకు తోడ్పడే సహాయక జీవన పరికరాలను ఈ పథకం కింద అందిస్తున్నారు. ఇప్పటివరకు ఈ పథకం విస్తృత స్థాయికి చేరుకుంది. శిబిరాల ద్వారా ప్రధాన‌మంత్రి దివ్యాశా వయోశ్రీ కేంద్రాల్లోని (పీఎండీ-వీకే) ఆర్టిఫిషియల్ లింబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (అలిమ్‌కో) నేరుగా వెళ్లి సేవలు పొందే కేంద్రాల ద్వారా మొత్తం 10.45 లక్షల మందికిపైగా వృద్ధులకు 55,87,653 సహాయక జీవన పరికరాలను అందించారు.



వృద్ధుల కోసం జాతీయ హెల్ప్‌లైన్
ఎల్డర్‌లైన్ పేరుతో వృద్ధుల కోసం జాతీయ హెల్ప్‌లైన్‌ను (హెల్ప్‌లైన్ నంబర్: 14567) ప్రభుత్వం 2021 అక్టోబర్‌లో ప్రారంభించింది. వృద్ధులకు సకాలంలో సహాయం అందేలా అనుసంధానిస్తూ, సమాచారం, మార్గదర్శకత్వం, మానసిక భరోసాను ఉచితంగా అందిస్తుంది. అందుబాటులో ఉండే ఒకే వేదికగా అన్ని రకాల ఫిర్యాదులను పరిష్కరిస్తుంది. క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించేందుకు జిల్లా అధికారులు, ప్రభుత్వేతర సంస్థలతో నేరుగా సమన్వయం చేసుకుంటుంది. వృద్ధులకు అత్యంత అవసరమైన చోట క్షేత్రస్థాయి సహాయాన్ని కూడా అందిస్తుంది. తన విస్తృత సేవలకు నిదర్శనంగా సమాచారం, మార్గదర్శకత్వం, మానసిక భరోసా, క్షేత్రస్థాయి సహాయం, ఇతర సేవలకు సంబంధించి చర్యలు అవసరమైన 8.66 లక్షలకుపైగా కాల్స్‌ను ఎల్డర్‌లైన్ స్వీకరించింది.



జీవన్ యాప్, శతాయు డ్యాష్‌బోర్డ్
2026 మేలో ప్రభుత్వం జాయింట్ ఎల్డర్లీ ఎంపవర్‌మెంట్ అండ్ వర్చువల్ అసిస్టెన్స్ నెట్‌వర్క్ (జీవన్) మొబైల్ యాప్, సీనియర్ హోలిస్టిక్ కేర్ అసిస్టెన్స్ అండ్ ట్రైనింగ్ ఫర్ యువర్ యుటిలిటీ (శతాయు) వృద్ధుల సంరక్షణ డ్యాష్‌బోర్డ్‌ను ప్రారంభించింది.

ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాల సమాచారం, అత్యవసర సహాయం, సహాయక సేవలను పొందే సౌకర్యం, వృద్ధుల వసతి గృహాల వివరాలు సహా వారి అవసరాలకు అనుగుణమైన పలు సదుపాయాలను ఈ యాప్ అందిస్తుంది. వృద్ధులను దృష్టిలో ఉంచుకొని రూపొందించిన ఈ వేదికలో సులభంగా ఉపయోగించే రూపకల్పన, విభాగాల మధ్య తేలికగా మారే సౌకర్యం, మెరుగైన అందుబాటు సదుపాయాలు ఉన్నాయి. ముఖ్యంగా, ఇందులో "వన్-ట్యాబ్ కాల్" సదుపాయం ఉంది. దీనితో ఒక్కసారి తాకి ముఖ్యమైన నంబర్లకు నేరుగా కాల్ చేయవచ్చు. వైద్య అవసరాలు లేదా అత్యవసర పరిస్థితుల్లో తక్షణ మార్గదర్శకత్వం, సహాయం పొందేందుకు ఇది తోడ్పడుతుంది.

వృద్ధులు, వారి కుటుంబాలు శిక్షణ పొందిన సంరక్షణ సిబ్బందిని కనుగొనేందుకు శతాయు డ్యాష్‌బోర్డ్ తోడ్పడుతుంది. జిల్లా, రాష్ట్రాల వారీగా సంరక్షణ సిబ్బంది అందుబాటును చూపిస్తూ, భారత సంఘటిత సంరక్షణ సేవల రంగాన్ని బలోపేతం చేస్తుంది. సంరక్షణ అవసరమైన వృద్ధులతో శిక్షణ పొందిన సిబ్బందిని అనుసంధానిస్తుంది. డేటాబేస్‌ను బలోపేతం చేసేందుకు 2023–24లో, అంతకుముందు శిక్షణ పొందిన సంరక్షణ సిబ్బంది స్వయంగా నమోదు చేసుకోవాలని ఆహ్వానించారు. తద్వారా శిక్షణ పొందిన సిబ్బంది సేవలను మరింత మంది వృద్ధులు పొందేందుకు వీలు కల్పించారు. డ్యాష్‌బోర్డ్ ప్రకారం.. మొత్తం సంరక్షణ సిబ్బంది సంఖ్య 30,151. వీరిలో పురుషులు 6,817 మంది, మహిళలు 23,334 మంది.

అనుభవ్ బోల్తా హై
అటల్ వయో అభ్యుదయ్ యోజన విస్తృత విధానంలో భాగంగా అనుభవ్ బోల్తా అవగాహన, విజ్ఞానాన్ని పంచుకునే కార్యక్రమంగా పనిచేస్తుంది. సీనియర్ సిటిజన్స్ పోర్టల్ ద్వారా వృద్ధులు తమ అనుభవాలు, విజయగాథలు, జీవిత పాఠాలను పంచుకునేందుకు వేదికను అందిస్తుంది. వారు అందించే స్ఫూర్తిని అందరూ నేర్చుకునేందుకు, పరస్పరం అనుబంధం పెంచుకునేందుకు విలువైన వనరుగా పరిగణిస్తుంది. తన పరిధిని విస్తరిస్తూ, కొత్తగా ప్రారంభించిన జీవన్ మొబైల్ యాప్‌లోనూ 'అనుభవ్ బోల్తా' విజ్ఞానాన్ని పంచుకునే ప్రత్యేక విభాగంగా ఉంది. వృద్ధాప్యం, ఆరోగ్యకరమైన జీవనం, చట్టపరమైన హక్కులు, సంక్షేమ పథకాలకు సంబంధించిన అంశాలపై వృద్ధులకు సమాచారం అందించే వ్యాసాలు ఇందులో ఉంటాయి. తద్వారా ఇది సేవాధారిత వేదికగా, అవగాహన పెంచే సమాచార వనరుగా పనిచేస్తుంది.

సీనియర్‌కేర్ ఏజింగ్ గ్రోత్ ఇంజిన్ (సేజ్)
వృద్ధులు ఎదుర్కొనే సవాళ్లను గుర్తించి, వినూత్న పరిష్కారాలను అందించేలా యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం లక్ష్యం. ఈక్విటీ మద్దతును అందించడం ద్వారా ఈ ఆలోచనలను స్టార్టప్‌లుగా అభివృద్ధి చేసేందుకు కూడా తోడ్పడుతుంది. వృద్ధుల అవసరాల ఆధారంగా నడిచే బలమైన “సిల్వర్ ఎకానమీ” నిర్మాణంపై దృష్టి సారిస్తూ, కొత్త ఆలోచనలను స్టార్టప్‌లుగా మార్చేందుకు, వృద్ధుల సంరక్షణ రంగంలో ఇప్పటికే పనిచేస్తున్న స్టార్టప్‌ల విస్తరణకు సేజ్ మద్దతు ఇస్తుంది. ఈ సంస్థలు వృద్ధుల అవసరాలకు అనుగుణమైన ఉత్పత్తులు, సేవలు, సాంకేతిక పరిష్కారాలను అభివృద్ధి చేస్తాయి. సేజ్ కింద ఎంపిక చేసిన స్టార్టప్‌లకు ఈక్విటీ భాగస్వామ్యం ద్వారా ₹1 కోటి వరకు ఆర్థిక సహాయం అందిస్తారు. వృద్ధుల జీవన నాణ్యతను మెరుగుపరిచే పరిష్కారాలను విస్తరించేందుకు మార్గదర్శకత్వం, మార్కెట్ అనుసంధానాలను కూడా కల్పిస్తారు.

ఈక్విటీ మద్దతు, సేజ్ పోర్టల్ ద్వారా నమ్మకమైన వృద్ధుల సంరక్షణ పరిష్కారాలను పొందేందుకు ప్రభుత్వం తోడ్పడుతూ, సిల్వర్ ఎకానమీని ప్రోత్సహిస్తోంది.

సేజ్ పోర్టల్
వృద్ధుల సంరక్షణ పరిష్కారాలను గుర్తించడం, ధ్రువీకరించడం, ఒకేచోట చేర్చేందుకు సింగిల్‌-విండో వేదికగా పనిచేసే ప్రత్యేక డిజిటల్ పోర్టల్ ఇది. ఎంపిక చేసిన విభిన్న ఉత్పత్తులు, సేవలను వృద్ధులు, సంరక్షకులు, సంబంధిత వర్గాలు పొందేందుకు ఈ పోర్టల్ వీలు కల్పిస్తుంది. వినూత్న స్టార్టప్‌లు, తుది వినియోగదారుల మధ్య వారధిగా కూడా పనిచేస్తూ, భారత్‌లో వృద్ధుల సంరక్షణకు సంబంధించిన మొత్తం వ్యవస్థను బలోపేతం చేస్తుంది.

సేజ్ పోర్టల్‌లో నమోదు: వృద్ధుల సంరక్షణ రంగంలో పనిచేసే పారిశ్రామికవేత్తలు, స్టార్టప్‌లు కంపెనీ వివరాలు, వెబ్‌సైట్/యాప్ సమాచారం, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ తదితరాలను అందించి సేజ్ పోర్టల్‌లో నమోదు చేసుకోవచ్చు, లాగిన్ వివరాలను సృష్టించుకోవచ్చు. దరఖాస్తు సమర్పించిన తర్వాత, తుది ఆమోదానికి ముందు ఐఎఫ్‌సీఐ వెంచర్ ప్రాథమిక మదింపు, సవివర పరిశీలన నిర్వహిస్తుంది. అదే సమయంలో, ధ్రువీకరణ పొందిన ఈ వృద్ధుల సంరక్షణ సేవల సంస్థలను సులభంగా గుర్తించి, సంప్రదించేందుకు వృద్ధులకు అందుబాటులో ఉండే వేదికగా పోర్టల్ తోడ్పడుతుంది.

సీనియర్ సిటిజన్ ఆపర్చునిటీస్ ఫర్ ప్రొడక్టివ్ ఎంగేజ్‌మెంట్ (స్కోప్)
సమాజ కార్యకలాపాల్లో చురుకైన భాగస్వామ్యం, జీవనోపాధి అవకాశాల ద్వారా సీనియర్ సిటిజన్ ఆపర్చునిటీస్ ఫర్ ప్రొడక్టివ్ ఎంగేజ్‌మెంట్ (స్కోప్) వృద్ధులకు సాధికారత కల్పిస్తుంది. నిలకడగా పనిచేసే, అనుభవజ్ఞులైన ఉద్యోగులను కోరుకునే వ్యాపార సంస్థలకు పలువురు వృద్ధుల అనుభవం, సమయం, శక్తి ఎంతో విలువైనవి. నిర్దిష్ట ఉద్యోగాల కోసం అనుభవమున్న వ్యక్తులను అనేక ప్రైవేటు సంస్థల మానవ వనరుల విభాగాలు చురుగ్గా అన్వేషిస్తున్న విషయాన్ని గుర్తిస్తూ, ఇరువర్గాల ప్రాధాన్యాలను ఆన్‌లైన్‌లో సరిపోల్చే వీలు కల్పించడం ద్వారా ఈ పోర్టల్ వారధిగా పనిచేస్తుంది. అనుభవజ్ఞులైన వృద్ధులను అర్థవంతమైన పాత్రలతో అనుసంధానిస్తూ, వృద్ధాప్యంలో ఉత్పాదక జీవనాన్ని ఈ కార్యక్రమం ప్రోత్సహిస్తుంది. మారుతున్న భారత సామాజిక, ఆర్థిక రంగాలకు చురుకుగా, స్వతంత్రంగా తోడ్పడేవారిగా వారిని తీర్చిదిద్దుతుంది.

పీఎం-స్పెషల్ (సిస్టమ్ ఫర్ ప్రొవిజన్ ఆఫ్ ఎల్డర్‌కేర్ ఇన్ హౌస్ అండ్ అసిస్టెడ్ లివింగ్) కింద వృద్ధుల సంరక్షణ సిబ్బందికి శిక్షణ
భారత్‌లో వృద్ధుల సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేయడంపై ఈ కార్యక్రమం దృష్టి సారిస్తుంది. సంరక్షణ సిబ్బందికి పెరుగుతున్న అవసరం, వారి అందుబాటు మధ్య అంతరాన్ని పూడ్చడం ప్రధాన లక్ష్యం. వృద్ధులకు మరింత వృత్తి నైపుణ్యంతో కూడిన సేవలను అందించడం, వృద్ధుల సంరక్షణలో నిపుణులైన సిబ్బంది బృందాన్ని రూపొందించడం దీని ఉద్దేశం. వృద్ధుల సంరక్షణ బాధ్యతలు చేపట్టే వ్యక్తులకు ఉచిత నైపుణ్య శిక్షణను కూడా అందిస్తుంది. ప్రభుత్వం నిర్దేశించిన ప్రామాణిక నిబంధనలను అనుసరిస్తూ, ఎంపిక చేసిన సంస్థల ద్వారా శిక్షణ అందిస్తారు.

గౌరవప్రదమైన వృద్ధాప్య జీవనం దిశగా
వివిధ విభాగాలతోపాటు, వృద్ధులను యువతరాలతో అనుసంధానించే కార్యక్రమాలు కూడా ఏవీవైఏవైకు తోడ్పడుతున్నాయి. ‘క్రియేటింగ్ ఇంటర్‌జెనరేషనల్ బాండింగ్’ను అమలు చేసేందుకు సామాజిక న్యాయం, సాధికారత విభాగం 2026 సెప్టెంబర్ 1న రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఆటల ఆధారంగా, వాస్తవ ఆధారాలకు అనుగుణంగా రూపొందించిన కార్యకలాపాలను పాఠశాల వ్యవస్థ ద్వారా అమలు చేస్తూ, పిల్లలు, తల్లిదండ్రులు, తాతలు, అమ్మమ్మలు, నానమ్మల మధ్య భావోద్వేగ, సాంస్కృతిక బంధాలను బలోపేతం చేయడం ఈ దేశవ్యాప్త కార్యక్రమం లక్ష్యం. ఈ భాగస్వామ్యం కింద విస్తృత స్థాయికి తీసుకెళ్లేందుకు వీలున్న రూపకల్పన, అమలు నమూనాను అభివృద్ధి చేసి 200 ప్రయోగాత్మక పాఠశాలల్లో ప్రవేశపెడతారు. కో-లెర్నింగ్ గేమ్స్, రెండు భాషల్లో రిసోర్స్ సెంటర్ వెబ్‌సైట్, ఉపాధ్యాయులకు ధ్రువీకరణ ఇందులో ఉంటాయి. ఏవీవైఏవై, ఎల్డర్‌లైన్ హెల్ప్‌లైన్ సహా మంత్రిత్వ శాఖ వృద్ధుల సంక్షేమ కార్యక్రమాలకు ఇది తోడ్పడుతుందని అంచనా. వృద్ధులు తమ జ్ఞానం, విలువలను తరువాతి తరాలకు అందించేందుకు అవకాశాలు కల్పిస్తూ, పిల్లలు తమ సంస్కృతితో అనుబంధాన్ని కొనసాగించేందుకు తోడ్పడుతుంది. పరిశోధన, రూపకల్పన, మదింపు కోసం నాలెడ్జ్ డెవలప్‌మెంట్ పార్ట్‌నర్ మద్దతుతో రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ అమలు భాగస్వాములుగా పనిచేస్తాయి.

భారత్‌లో వృద్ధుల విభిన్న అవసరాలను తీర్చే సమగ్ర వ్యవస్థగా అటల్ వయో అభ్యుదయ్ యోజన నిరంతరం అభివృద్ధి చెందుతోంది. దీర్ఘకాలిక సంరక్షణ మౌలిక సదుపాయాలు, సహాయక సంరక్షణతో కూడిన నివాస సదుపాయాలు, వృద్ధుల సహాయక వ్యవస్థలను బలోపేతం చేయడంపై ఈ పథకం దృష్టి సారిస్తోంది. భారత వృద్ధుల పట్ల మరింత సమన్వయంతో, జీవిత దశల ఆధారంగా వ్యవహరించే విధానం వైపు మార్పును ఇది ప్రతిబింబిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వేతర సంస్థలు, ప్రత్యేక నైపుణ్యమున్న సంస్థల భాగస్వామ్య నమూనా ద్వారా భారత సామాజిక భద్రతా వ్యవస్థలో ఏవీవైఏవై కీలక స్తంభంగా నిలుస్తోంది.

 

References:

Press Information Bureau

Ministry of Social Justice and Empowerment

JEEVAN App — Official FAQ (Department of Social Justice & Empowerment, GoI)

Atal Vayo Abhyuday Yojana

 

***

(Explainer ID: 160601) आगंतुक पटल : 60
Provide suggestions / comments
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali , Assamese , Tamil , Kannada , Malayalam