Technology

మ‌న‌సుల్ని లీనం చేసే ఇమ‌ర్సివ్‌ సాంకేతిక‌త‌లు

Posted On: 26 OCT 2026 11:37AM

భౌతిక, వర్చువల్ ప్రపంచాల కలయిక

భారత్‌లో విద్య, పరిశ్రమలు, సృజనాత్మక రంగాల్లో మ‌న‌సుల్ని లీనం చేసే ఇమర్సివ్ సాంకేతికతల వినియోగం విస్తరిస్తోంది. ముంబైలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ (ఐఐసీటీ) వంటి కార్యక్రమాల ద్వారా యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, ఎక్స్‌టెండెడ్ రియాలిటీ (ఏవీజీసీ-ఎక్స్‌ఆర్) రంగానికి అవసరమైన వ్యవస్థను సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రోత్సహిస్తోంది. నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా ఏర్పాటైన ఐఐసీటీ, సృజనాత్మక విద్య, నైపుణ్యాలు, ఆవిష్కరణలను బలోపేతం చేసేందుకు గూగుల్, మెటా, అడోబ్, నెట్‌ఫ్లిక్స్ సహా అంతర్జాతీయ సాంకేతిక సంస్థలతో కలిసి పనిచేస్తోంది. ఈ వ్యవస్థకు మరింత తోడ్పాటుగా, దేశవ్యాప్తంగా 15,000 మాధ్యమిక పాఠశాలలు, 500 కళాశాలల్లో ఏవీజీసీ కంటెంట్ క్రియేటర్ ల్యాబ్‌ల కోసం 2026–27 కేంద్ర బడ్జెట్‌లో ₹250 కోట్లను కేటాయించారు.

డిజిటల్ నుంచి ఇమర్సివ్ దిశగా: భారత్ తదుపరి ముందడుగు

 


గత దశాబ్దంలో భారత్ బలమైన డిజిటల్ వ్యవస్థను నిర్మించింది. రోజువారీ జీవితంలో సాంకేతికతను వినియోగించే తీరును ఇది మార్చివేసింది. యూపీఐ, ఆధార్, డిజిలాకర్, ఉమంగ్, భాషిణి వంటి వేదికలు సేవలు, సమాచారాన్ని మరింత మందికి అందుబాటులోకి తెచ్చాయి. డిజిటల్ వేదికల వినియోగం విస్తరిస్తున్న నేపథ్యంలో, వినియోగదారులు మరింత చురుగ్గా పాల్గొనేలా, దృశ్యరూపంలో స్వయంగా అనుభూతి చెందేలా వాటిని తీర్చిదిద్దడం తదుపరి అవకాశం. కృత్రిమ మేధ (ఏఐ), వేగవంతమైన కనెక్టివిటీ, కంప్యూటింగ్‌లో సాధిస్తున్న పురోగతి, డిజిటల్ సేవలను కేవలం పొందడం నుంచి వాటిని అనుభూతి చెందే దిశగా మార్పుకు వీలు కల్పిస్తోంది.

భౌతిక ప్రపంచంలో పొందే అనుభూతికి దగ్గరగా డిజిటల్ కంటెంట్‌ను అందించే ఇమర్సివ్ సాంకేతికతలు ఈ కొత్త దశను తీర్చిదిద్దుతున్నాయి. వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, మిక్స్‌డ్ రియాలిటీ, 360 డిగ్రీల అనుభవాలు వినియోగదారులు పరస్పర చర్యల్లో పాల్గొనే వాతావరణాలను సృష్టించగలవు. డిజిటల్ కంటెంట్‌తో కొత్త విధాల్లో మమేకమయ్యేందుకు వీలు కల్పించగలవు. వర్చువల్ సిమ్యులేషన్ల ద్వారా విద్యలో, ప్రత్యక్ష అనుభూతినిచ్చే శిక్షణ ద్వారా ఆరోగ్య సంరక్షణలో, వర్చువల్ సందర్శనల ద్వారా పర్యాటకంలో మార్పులు తీసుకురాగలవు. సంస్కృతి, గేమింగ్, వినోదం, చిల్లర వ్యాపారం, ఇతర రంగాల్లోనూ మరింత ఆకట్టుకునే అనుభవాలను అందించగలవు. తద్వారా సాధారణంగా తెరలకే పరిమితమయ్యే వినియోగాన్ని దాటి, భారత్‌లోని ప్రస్తుత డిజిటల్ వ్యవస్థ ప్రభావాన్ని మరింత విస్తరించగలవు.

భారత్‌లో వేగంగా వృద్ధి చెందుతున్న ఇమర్సివ్ సాంకేతిక మార్కెట్ ఈ అవకాశాల విస్తృతిని ప్రతిబింబిస్తోంది. 2023లో ఈ మార్కెట్ 1,259.5 మిలియన్ అమెరికా డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. 29.8 శాతం సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్)తో 2030 నాటికి 7,818.7 మిలియన్ అమెరికా డాలర్లకు చేరుకుంటుందని అంచనా. డిజిటల్ వ్యవస్థ, విస్తరిస్తున్న మధ్యతరగతి, పెరుగుతున్న ఈ-కామర్స్ వినియోగం అండగా, ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అత్యంత వేగంగా వృద్ధి చెందే ప్రాంతీయ మార్కెట్‌గా భారత్ అవతరిస్తుందని అంచనా. పెద్ద మార్కెట్ స్థాయిని దాటి, ఇమర్సివ్ సాంకేతికతలకు అంతర్జాతీయ కేంద్రంగా ఎదిగేందుకు ఈ వృద్ధి భారత్‌కు అవకాశం కల్పిస్తోంది. పరిశోధన, స్టార్టప్‌లు, ప్రతిభ, కంటెంట్, స్వదేశీ సాంకేతికతల్లో సామర్థ్యాలను పెంచుకోవడం ద్వారా తదుపరి తరం ఇమర్సివ్ అనుభవాలను తీర్చిదిద్దడంలో భారత్ కీలక పాత్ర పోషించగలదు. అంతర్జాతీయ డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో తన స్థానాన్ని బలోపేతం చేసుకోగలదు.

 


సృజనాత్మక మేధస్సు, శాస్త్ర ప్రగతికి ఊతం, సామర్థ్యాన్ని పెంచే సాంకేతికతలు
భారత ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కాంక్లేవ్ రెండో సదస్సు ఎస్టిక్-2026ను 2026 అక్టోబర్ 27–29 తేదీల్లో న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించనున్నారు. “సృజనాత్మక మేధస్సు, శాస్త్ర ప్రగతికి ఊతం, సామర్థ్యాన్ని పెంచే సాంకేతికతలు” ప్రధాన అంశంగా ఈ కార్యక్రమం జరగనుంది. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్‌ఐఆర్) నిర్వహించే ఎస్టిక్-2026, కొత్తగా అభివృద్ధి చెందుతున్న శాస్త్ర, సాంకేతిక రంగాలను ముందుకు తీసుకెళ్లేందుకు మంత్రిత్వ శాఖలు, పరిశోధకులు, ఆవిష్కర్తలు, పరిశ్రమల ప్రముఖులు, డీప్-టెక్ స్టార్టప్‌లు, అంతర్జాతీయ నిపుణులను ఒక వేదికపైకి తీసుకురానుంది. ఇమర్సివ్ టెక్: జనరేటివ్ ఎక్స్‌ఆర్, స్పేషియల్ కంప్యూటింగ్ సహా 12 ప్రధాన అంశాలకు ఈ సదస్సులో చోటు ఉంటుంది. ప్లీనరీ సమావేశాలు, సాంకేతిక చర్చలు, ప్రదర్శనలు నిర్వహించనున్నారు.

 


ఇమర్సివ్ సాంకేతికతల అర్థం
వినియోగదారులు చురుగ్గా పాల్గొనేలా చేస్తూ, వారిని ఆకట్టుకునే, వాస్తవానికి దగ్గరగా ఉండే డిజిటల్ అనుభవాలను సృష్టించే కొత్త సాంకేతికతల సమాహారమే ఇమర్సివ్ సాంకేతికతలు. ఇవి భౌతిక, డిజిటల్ ప్రపంచాలను కలపగలవు. మరింత సహజంగా, స్వయంగా అనుభూతి చెందుతున్నట్లుగా డిజిటల్ కంటెంట్‌తో పరస్పర చర్యల్లో పాల్గొనేందుకు వీలు కల్పిస్తాయి. వినియోగదారులు డిజిటల్ వస్తువులతో పరస్పర చర్యలు చేపట్టవచ్చు, అనుకరణ ద్వారా సృష్టించిన పరిస్థితులకు స్పందించవచ్చు. సాధారణ డిజిటల్ మాధ్యమాలతో పోలిస్తే, ఈ సాంకేతికతలు పలు ఇంద్రియాలను అనుభవంలో భాగం చేసి, అక్కడే ఉన్నామనే భావనను మరింత బలంగా కలిగించగలవు. ఉదాహరణకు, విద్యార్థి కేవలం తెరపై బొమ్మలు చూడటానికే పరిమితం కాకుండా, వర్చువల్ ప్రయోగశాలను అన్వేషించవచ్చు. అలాగే, పర్యాటకుడు వారసత్వ ప్రదేశానికి స్వయంగా వెళ్లే ముందు దాన్ని వర్చువల్‌గా సందర్శించవచ్చు. వర్చువల్ రియాలిటీ (వీఆర్), ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్), మిక్స్‌డ్ రియాలిటీ (ఎంఆర్) ఇమర్సివ్ సాంకేతికతల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన మూడు రూపాలు. వీటన్నింటినీ కలిపి సాధారణంగా ఎక్స్‌టెండెడ్ రియాలిటీ (ఎక్స్‌ఆర్)గా పేర్కొంటారు.

ఎక్స్‌టెండెడ్ రియాలిటీ (ఎక్స్‌ఆర్)
కంప్యూటర్ వ్యవస్థలు, శరీరంపై ధరించే పరికరాల ద్వారా వాస్తవ, డిజిటల్ పరిసరాలను కలిపే సాంకేతికతలను ఎక్స్‌టెండెడ్ రియాలిటీ (ఎక్స్‌ఆర్) అంటారు. మనుషులు, డిజిటల్ కంటెంట్ మధ్య వివిధ స్థాయుల్లో పరస్పర చర్యలకు ఇది అవకాశం కల్పిస్తుంది. వర్చువల్ రియాలిటీ (వీఆర్), ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్), మిక్స్‌డ్ రియాలిటీ (ఎంఆర్) ఎక్స్‌ఆర్ పరిధిలోకి వస్తాయి.

* వర్చువల్ రియాలిటీ (వీఆర్) వినియోగదారుల చుట్టూ పూర్తిగా డిజిటల్ వాతావరణాన్ని సృష్టిస్తుంది. అక్కడే ఉన్నామనే బలమైన అనుభూతిని కలిగించేందుకు ప్రధానంగా దృశ్యాలు, శబ్దాలను ఉపయోగిస్తుంది. ప్రత్యేక పరికరాల సాయంతో వినియోగదారులు ఈ అనుకరణ వాతావరణాన్ని అన్వేషించవచ్చు. అందులో పరస్పర సంభాష‌ణ‌ల్లో పాల్గొనవచ్చు.

* ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్) వినియోగదారుల చుట్టూ ఉన్న భౌతిక పరిసరాలకు డిజిటల్ సమాచారాన్ని జోడిస్తుంది. వాస్తవ పరిసరాలు కనిపిస్తూనే, దృశ్యాలు, శబ్దాల ద్వారా అనుభూతిని అందించగలదు. ఉదాహరణకు, భౌతిక పరిసరాలపై దిశానిర్దేశాలు, సమాచారం, డిజిటల్ వస్తువులను ఏఆర్ చూపించగలదు.

* మిక్స్‌డ్ రియాలిటీ (ఎంఆర్) పరస్పర చర్యలకు వీలున్న వాతావరణంలో భౌతిక, డిజిటల్ ప్రపంచాలను కలుపుతుంది. దృశ్యాలు, శబ్దాల ద్వారా అనుభూతిని అందిస్తూ, డిజిటల్ వస్తువులు భౌతిక పరిసరాలతో కలిసి స్పందించేలా చేస్తుంది. డిజిటల్ వస్తువులు వాస్తవ పరిసరాల్లో భాగమైనట్లుగా వినియోగదారులు వాటిని చూడవచ్చు, వాటితో పరస్పర చర్యలు చేపట్టవచ్చు.

360 డిగ్రీల వీడియో, హ్యాప్టిక్ సాంకేతికత వంటి ఇతర అనుబంధ సాంకేతికతలు కూడా విస్తృత ఇమర్సివ్ సాంకేతిక వ్యవస్థలో భాగమే. 360 డిగ్రీల వీడియో ఒక దృశ్యాన్ని అన్ని దిశల్లో చూసేందుకు వీలు కల్పిస్తుంది. వినియోగదారులు తాము చూసే దిశను మార్చుకుంటూ, రికార్డు చేసిన పరిసరాల్లోని వివిధ భాగాలను పరిశీలించవచ్చు. హ్యాప్టిక్ సాంకేతికత కంపనాలు, ఒత్తిడి, ఇతర శారీరక అనుభూతుల ద్వారా స్పర్శ ఆధారిత ప్రతిస్పందనను అందిస్తుంది. వర్చువల్ లేదా పరస్పర చర్యలతో కూడిన అనుభవాల్లో భౌతిక అనుభూతులను అనుకరించడం ద్వారా, డిజిటల్ పరస్పర చర్యలు మరింత వాస్తవంగా అనిపించేలా చేయగలదు.

అనుభూతుల్లోకి అడుగులు: ఇమర్సివ్ సాంకేతికతను భారత్ ఎలా వినియోగిస్తోంది
విద్య

గ్రామీణ పాఠశాలల కోసం ఏఆర్/వీఆర్ ఆధారిత అభ్యసన పరిష్కారాలను ఐఐటీ మద్రాస్ పరిశోధకులు అభివృద్ధి చేస్తున్నారు. మాధ్యమిక పాఠశాల విద్యార్థులకు బోధన, అభ్యసనాన్ని మెరుగుపరిచేందుకు ఈ కార్యక్రమం డిజిటల్ సాంకేతికతలను ఉపయోగిస్తోంది. చరిత్ర, సాంఘిక శాస్త్రం, విజ్ఞానశాస్త్రం, భాషలు వంటి అంశాలను విద్యార్థులు పరస్పర చర్యలతో కూడిన అనుభవాల ద్వారా అన్వేషించేందుకు, వీఆర్ ఆధారిత ఇమర్సివ్ అభ్యసన వాతావరణాలను సృష్టించడం దీని లక్ష్యం.

ఈ సాంకేతికతలు తరగతి గదిలో అభ్యసనాన్ని మరింత ఆసక్తికరంగా మార్చగలవు. ఉదాహరణకు, ఏఆర్ ఆధారిత మొబైల్ యాప్ కదిలే ఫొటోలు, ఇంటరాక్టివ్ మ్యాపులు, భద్రపరిచిన చారిత్రక పత్రాల ద్వారా 500 ఏళ్ల భారత చరిత్రను కళ్లముందుకు తీసుకురాగలదు. అలాగే, వీఆర్ సిమ్యులేషన్లు విద్యార్థులు సౌర వ్యవస్థను అన్వేషించేందుకు, మూడు కొలతల నమూనాల ద్వారా మానవ శరీరాన్ని అధ్యయనం చేసేందుకు వీలు కల్పించగలవు. రూపం లేని భావనలను సులభంగా ఊహించి, అర్థం చేసుకునేలా చేయడం ద్వారా ఈ విధానాలు అభ్యసనాన్ని మెరుగుపరచగలవు, ఉన్నత విద్యకు సిద్ధమయ్యేందుకు విద్యార్థులకు తోడ్పడగలవు.

వారసత్వం, పర్యాటకం
భారత సాంస్కృతిక వారసత్వాన్ని మరింత అందుబాటులోకి తెచ్చేందుకు, ఆకట్టుకునేలా పరిచయం చేసేందుకు ప్రభుత్వం ఎక్స్‌టెండెడ్ రియాలిటీ (ఎక్స్‌ఆర్), ఇతర డిజిటల్ సాంకేతికతలను ఉపయోగిస్తోంది. సందర్శకుల అనుభవాలను మెరుగుపరిచేందుకు, మ్యూజియంల సేకరణల సమాచారాన్ని భద్రపరిచేందుకు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ డిజిటల్ సాధనాలను వినియోగిస్తోంది. వాటిలో జతన్ సాఫ్ట్‌వేర్ ఒకటి. మ్యూజియం వస్తువులు, వాటి వివరాలను డిజిటలీకరించేందుకు ఇది తోడ్పడుతుంది. ఇప్పటివరకు ఎనిమిది జాతీయ స్థాయి మ్యూజియంలు, భారత పురావస్తు సర్వే (ఏఎస్‌ఐ) పరిధిలోని రెండు మ్యూజియంలను జతన్ సాయంతో డిజిటలీకరించారు. వాటి సేకరణలు మ్యూజియమ్స్ ఆఫ్ ఇండియా డిజిటల్ భాండాగారంలో అందుబాటులో ఉన్నాయి. తద్వారా ప్రజలు భారత వారసత్వాన్ని ఆన్‌లైన్‌లో అన్వేషించవచ్చు.

ఈ డిజిటల్ పునాదిపై మ్యూజియంలు సందర్శకుల కోసం పరస్పర చర్యలతో కూడిన అనుభవాలను కూడా ప్రవేశపెడుతున్నాయి. గ్యాలరీ సందర్శనలను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు కోల్‌కతాలోని ఇండియన్ మ్యూజియం ఏఐ ఆధారిత ఇంటరాక్టివ్ సదుపాయాలు, ఏఆర్ సాధనాలను ప్రవేశపెట్టింది. డిజిటల్ సాంకేతికత ద్వారా సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించే వర్చువల్ ప్రదర్శన కోసం గూగుల్ ఆర్ట్స్ & కల్చర్‌తో కూడా కలిసి పనిచేసింది. అలాగే, కర్ణాటకలోని హంపి, బిహార్‌లోని నలందా ఏఎస్‌ఐ మ్యూజియంలు తమ సేకరణలను మొబైల్ ఆధారిత వర్చువల్ సందర్శనల ద్వారా పరిచయం చేస్తున్నాయి. మ్యూజియం వస్తువులను డిజిటల్‌గా అన్వేషించేందుకు ఈ కార్యక్రమాలు తోడ్పడుతున్నాయి. సాంస్కృతిక అనుభవాలను మరింత ఆకట్టుకునేలా చేస్తూ, మ్యూజియం ప్రాంగణం వెలుపల కూడా అందుబాటులోకి తెస్తున్నాయి.

పాలన, మౌలిక సదుపాయాలు
భారత్‌లో మౌలిక సదుపాయాల ప్రణాళిక, నిర్వహణ తీరును కూడా ఇమర్సివ్ సాంకేతికతలు ప్రభావితం చేస్తున్నాయి. మౌలిక సదుపాయాల ప్రణాళికను మెరుగుపరిచేందుకు డిజిటల్ ట్విన్ సాంకేతికతను 5జీ, ఐఓటీ, ఏఐతో అనుసంధానిస్తూ టెలికమ్యూనికేషన్ల విభాగం "సంగమ్: డిజిటల్ ట్విన్" కార్యక్రమాన్ని ప్రారంభించింది. వారణాసి అర్బన్ 3డీ స్పేషియల్ ప్లానింగ్ ప్రాజెక్టులో కనిపిస్తున్నట్లుగా, డిజిటల్ ట్విన్ మ్యాపింగ్ ఇప్పటికే పట్టణ ప్రణాళికకు తోడ్పడుతోంది. పట్టణ ప్రణాళిక, నిర్వహణను మెరుగుపరిచేందుకు డిజిటల్ ప్రతిరూపాలను రూపొందిస్తూ, ప్రధాన పట్టణ కేంద్రాల కోసం 2035 నాటికి నేషనల్ డిజిటల్ ట్విన్‌ను నిర్మించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది.

డిజిటల్ ట్విన్ అంటే ఏమిటి?
వాస్తవ ప్రపంచంలోని వస్తువు, వ్యవస్థ లేదా ప్రదేశానికి వర్చువల్ నమూనాయే డిజిటల్ ట్విన్. వాస్తవ ప్రపంచం నుంచి సేకరించిన డేటాతో పరిస్థితులు, పనితీరును ఇది ప్రతిబింబిస్తుంది. పరిస్థితులను పర్యవేక్షించేందుకు, సాధ్యమైన మార్పులను డిజిటల్‌గా పరీక్షించేందుకు వినియోగదారులకు తోడ్పడుతుంది. ఉదాహరణకు, యంత్రానికి సంబంధించిన డిజిటల్ ట్విన్ తలెత్తే అవకాశం ఉన్న లోపాలను గుర్తించేందుకు ఉపయోగపడగలదు. అలాగే, నగర నమూనా మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అమలుకు ముందే వాటి సంభావ్య ప్రభావాన్ని అంచనా వేసేందుకు ప్రణాళిక నిపుణులకు తోడ్పడగలదు. ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2025లో టెలికమ్యూనికేషన్ల విభాగం (డీఓటీ) ప్రదర్శించిన మొబిలిటీ డిజిటల్ ట్విన్ దీనికి ఒక ఉదాహరణ. ప్రజలు వివిధ ప్రాంతాల్లో ఎలా ప్రయాణిస్తున్నారు, ఎలా సంచరిస్తున్నారో విశ్లేషించేందుకు టెలికాం ద్వారా లభించే రాకపోకల డేటాను ఇది ఉపయోగిస్తుంది. ఢిల్లీలోని వసంత్ కుంజ్, సెంట్రల్ విస్టాలో నిర్వహించిన ప్రదర్శనలు రోజువారీ ప్రయాణాల తీరును పరిశీలించాయి, మెట్రో స్టేషన్ల సేవా పరిధిని అంచనా వేసేందుకు తోడ్పడ్డాయి. అయోధ్యలో పర్యాటకుల రాకపోకలు, వారు వినియోగించే ప్రయాణ సాధనాలు, బస చేసే తీరును అధ్యయనం చేసేందుకు ఈ డేటాను ఉపయోగించారు. రవాణా అనుసంధానాలకు ప్రణాళికలు రూపొందించేందుకు, పర్యాటక మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు, ప్రాజెక్టులను ఖరారు చేసే ముందు మరింత సమాచారంతో నిర్ణయాలు తీసుకునేందుకు ఈ వివరాలు అధికారులకు ఉపయోగపడగలవు.

సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ, వినోదం
భారత మీడియా, వినోద రంగంలో ఇమర్సివ్ సాంకేతికత ప్రాధాన్యం పెరుగుతోంది. దీనికి ఏవీజీసీ-ఎక్స్‌ఆర్ విధానంతో సన్నిహిత అనుబంధం ఉంది. ఒక స్వతంత్ర నివేదిక ప్రకారం, భారత గేమింగ్ రంగం 2024లో $3.8 బిలియన్ల నుంచి 2028–29 ఆర్థిక సంవత్సరం నాటికి $9.2 బిలియన్లకు పెరుగుతుందని అంచనా. కొత్తగా ఎదుగుతున్న ఈ ఆర్థిక వ్యవస్థ విస్తృతిని ఇది ప్రతిబింబిస్తోంది. వేవ్స్ సదస్సు వంటి జాతీయ వేదికలు భారత సృజనాత్మక, ఇమర్సివ్ మీడియా సామర్థ్యాలను అంతర్జాతీయ ప్రేక్షకులకు మరింతగా పరిచయం చేస్తున్నాయి.

ఇమర్సివ్ సాంకేతికతలకు ఊతం: భారత్‌లో ప్రధాన కార్యక్రమాలు
ప్రభుత్వ విస్తృత ఏవీజీసీ-ఎక్స్‌ఆర్ విధానం ద్వారా ఇమర్సివ్ సాంకేతికతకు మద్దతు లభిస్తోంది. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, ఎక్స్‌టెండెడ్ రియాలిటీ ఈ విధానం పరిధిలోకి వస్తాయి. భారత్‌లో ఇమర్సివ్ సాంకేతికతకు విధానపరమైన మద్దతు ప్రత్యేక పథకంగా కాకుండా, విస్తృతమైన, సమగ్ర ప్రోత్సాహంలో భాగంగా లభిస్తోంది.

ఏవీజీసీ-ఎక్స్‌ఆర్ ప్రమోషన్ టాస్క్‌ఫోర్స్
ఏవీజీసీ ప్రమోషన్ టాస్క్‌ఫోర్స్‌ను సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (ఎంఐబీ) 2022 ఏప్రిల్‌లో ఏర్పాటు చేసింది. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ (ఏవీజీసీ) పరిశ్రమ, విద్యారంగం, ప్రభుత్వ ప్రతినిధులను ఇది ఒక వేదికపైకి తీసుకొస్తుంది. ఈ రంగం వృద్ధి, అభివృద్ధికి సమన్వయంతో కృషి చేసేందుకు టాస్క్‌ఫోర్స్ వేదికగా పనిచేస్తుంది. దీని విధులకు మూడు ప్రధాన సూత్రాలు మార్గనిర్దేశం చేస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల సహకారం, మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయం, రంగం అభివృద్ధికి సమగ్ర విధానం వీటిలో ఉన్నాయి.

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ (ఐఐసీటీ)
టాస్క్‌ఫోర్స్ సిఫార్సుతో ఏవీజీసీ-ఎక్స్‌ఆర్ రంగానికి నైపుణ్యమున్న మానవ వనరులను అందించేందుకు ప్రభుత్వం నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (ఎన్‌సీఓఈ)ను ఏర్పాటు చేసింది. 2025లో ఏర్పాటైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ (ఐఐసీటీ)గా ఈ కేంద్రం రూపుదిద్దుకుంది. 2026 మార్చి నాటికి ఏవీజీసీ-ఎక్స్‌ఆర్ రంగంలోని వివిధ విభాగాల్లో ఐఐసీటీ 18 కోర్సులను ప్రవేశపెట్టింది. వీటిలో 135 మందికిపైగా విద్యార్థులు చేరారు.

జెనెసిస్ (జెన్-నెక్స్ట్ సపోర్ట్ ఫర్ ఇన్నోవేటివ్ స్టార్టప్స్)
టైర్-2, టైర్-3 నగరాల్లో స్టార్టప్ వ్యవస్థకు ఊతమిచ్చేందుకు జెనెసిస్ పథకాన్ని మైటీ ఆమోదించింది. 2022లో ప్రారంభమైన ఈ పథకం ఐదేళ్లలో సుమారు 1,600 సాంకేతిక స్టార్టప్‌లకు మద్దతు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏఆర్, వీఆర్, స్పేషియల్ కంప్యూటింగ్ వంటి ఇమర్సివ్ సాంకేతికతల్లో పనిచేసే స్టార్టప్‌లు కూడా వీటిలో ఉన్నాయి. మైటీ స్టార్టప్ హబ్ ద్వారా ప్రస్తుతం 84 ఏఆర్/వీఆర్ స్టార్టప్‌లకు ఈ పథకం మద్దతు ఇస్తోంది. దేశవ్యాప్తంగా 106 ఇంక్యుబేటర్లకు కూడా తోడ్పడుతోంది.

ఏవీజీసీ కంటెంట్ క్రియేటర్ ల్యాబ్‌లు
2026–27 కేంద్ర బడ్జెట్‌లో 15,000 మాధ్యమిక పాఠశాలలు, 500 కళాశాలల్లో యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ (ఏవీజీసీ) కంటెంట్ క్రియేటర్ ల్యాబ్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం ₹250 కోట్లను కేటాయించింది. ఈ కార్యక్రమం ప్రణాళిక, సమన్వయం, అమలుకు ముంబైలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ (ఐఐసీటీ) నోడల్ సంస్థగా పనిచేస్తుంది. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, డిజిటల్ కంటెంట్ తయారీలో విద్యార్థులకు ఆచరణాత్మక నైపుణ్యాలను అందించడం ఈ ల్యాబ్‌ల లక్ష్యం. సృజనాత్మక ఆలోచనలను అభివృద్ధి చేసేందుకు, పరిశ్రమలో ఉపయోగించే సాధనాలు, సాంకేతికతలతో స్వయంగా పనిచేస్తూ అనుభవం పొందేందుకు ఇవి అవకాశాలు కల్పిస్తాయి. యువ ప్రతిభను పెంపొందించి, భారత్‌లో వృద్ధి చెందుతున్న సృజనాత్మక ఆర్థిక వ్యవస్థలో కొత్తగా రూపుదిద్దుకుంటున్న వృత్తులకు విద్యార్థులను సిద్ధం చేయడం ఈ కార్యక్రమం లక్ష్యం.

వేవ్‌ఎక్స్
మీడియా-టెక్ స్టార్టప్‌ల కోసం ఎంఐబీ ప్రారంభించిన ప్రత్యేక యాక్సిలరేటర్, ఇంక్యుబేటర్ వేవ్‌ఎక్స్. ఏవీజీసీ-ఎక్స్‌ఆర్, కొత్తగా అభివృద్ధి చెందుతున్న ఇతర మీడియా సాంకేతికతల్లో పనిచేసే స్టార్టప్‌లకు ఇది మద్దతు ఇస్తుంది. స్టార్టప్‌లు తమ సాంకేతికతలను బలోపేతం చేసుకునేందుకు, మార్కెట్‌లో ప్రవేశపెట్టేందుకు సిద్ధమైన పరిష్కారాలను అభివృద్ధి చేసేందుకు, అంతర్జాతీయ అవకాశాలను అన్వేషించేందుకు తోడ్పడటం వేవ్‌ఎక్స్ లక్ష్యం.

భారత్‌లో ఏవీజీసీ-ఎక్స్‌ఆర్ వృద్ధిలో ముందున్న రాష్ట్రాలు
* కర్ణాటక ఏవీజీసీ-ఎక్స్‌ఆర్ పాలసీ 3.0, ఏవీజీసీ-ఎక్స్‌ఆర్ కంపెనీలకు నైపుణ్యాభివృద్ధి, మౌలిక సదుపాయాలు, నిర్మాణ గ్రాంట్లు, ఆర్థిక ప్రోత్సాహకాలను అందిస్తుంది. ఏవీజీసీ, అనుబంధ రంగాల్లో పనిచేసే కంపెనీల్లో పెట్టుబడుల కోసం ₹20 కోట్ల మూలనిధితో కిట్‌వెన్ ఏవీజీసీ ఫండ్‌ను కూడా రాష్ట్రం నిర్వహిస్తోంది.

* మహారాష్ట్ర ఏవీజీసీ-ఎక్స్‌ఆర్ పాలసీ 2025కు ₹3,268 కోట్ల ఆర్థిక ప్రణాళిక, 2050 వరకు విస్తరించే దీర్ఘకాల దృష్టి ఉన్నాయి. ప్రభుత్వ మద్దతు, మౌలిక సదుపాయాల ద్వారా రాష్ట్ర ఏవీజీసీ-ఎక్స్‌ఆర్ వ్యవస్థను విస్తరించేందుకు ఈ పాలసీ ప్రత్యేక విధానాన్ని అందిస్తుంది.

* హైదరాబాద్‌లోని ఇమేజ్ టవర్ కేంద్రంగా, యానిమేషన్, వీఎఫ్‌ఎక్స్, గేమింగ్, కామిక్స్ కోసం తెలంగాణ 2016 ఇమేజ్ పాలసీ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ వ్యవస్థలో 150కిపైగా ఏవీజీసీ/వీఎఫ్‌ఎక్స్ కంపెనీలు, 140కిపైగా గేమింగ్, యానిమేషన్ కంపెనీలు, 30,000 ప్రత్యక్ష ఉద్యోగాలు ఉన్నాయి. సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్‌టీపీఐ)-ఇమేజ్ ద్వారా 100 స్టార్టప్‌లను చేర్చారు. నిర్మాణ మౌలిక సదుపాయాలు, శిక్షణ, అంతర్జాతీయ క్లౌడ్ సేవల వినియోగ సౌకర్యం ఈ వ్యవస్థకు మద్దతుగా ఉన్నాయి.

* తమిళనాడు ఏవీజీసీ-ఎక్స్‌ఆర్ పాలసీ 2026, 2030 నాటికి 200కిపైగా స్టార్టప్‌లు, సుమారు 2 లక్షల ఉద్యోగాలు, భారత ఏవీజీసీ-ఎక్స్‌ఆర్ మార్కెట్‌లో 20% వరకు వాటాను లక్ష్యంగా పెట్టుకుంది. రాబోయే మూడేళ్లలో చెన్నైలోని "ఎల్కాట్ వియాన్ ఏవీజీసీ-ఎక్స్‌ఆర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్”ను ప్రధాన కేంద్రంగా, కోయంబత్తూరు, మదురై, తిరుచిరాపల్లి, సేలం, తిరునెల్వేలి ప్రాంతాల్లో అనుబంధ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి కూడా ఈ పాలసీ మద్దతు అందిస్తుంది.

* ప్రత్యేక నైపుణ్యాలున్న మానవ వనరులను తీర్చిదిద్దడంపై కేరళ ఏవీజీసీ-ఎక్స్‌ఆర్ పాలసీ 2024 ప్రధానంగా దృష్టి సారిస్తోంది. పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన ఉద్యోగ పాత్రలు, అధ్యాపకుల నైపుణ్యాభివృద్ధి, పాఠశాలల నుంచి ఉన్నత విద్య వరకు వీఆర్, ఏఆర్, గేమింగ్, వీఎఫ్‌ఎక్స్, డిజిటల్ ఆర్ట్ అంశాలతో ఏవీజీసీ-ఎక్స్‌ఆర్ కోర్సులను ఇది ప్రతిపాదిస్తోంది. 2029 నాటికి ఏవీజీసీ-ఎక్స్‌ఆర్ పరిశ్రమలో 50,000 కొత్త ఉద్యోగాలను సృష్టించాలని ఈ మిషన్ లక్ష్యంగా పెట్టుకుంది. వృద్ధి చెందే విజ్ఞానాధారిత ఆర్థిక వ్యవస్థను నిర్మించాలన్న కేరళ నిబద్ధతను ఈ లక్ష్యం మరింత బలపరుస్తోంది.

* మధ్యప్రదేశ్ ఏవీజీసీ-ఎక్స్‌ఆర్ పాలసీ 2025, పెట్టుబడి ప్రోత్సాహకాలతోపాటు సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్, ఏవీజీసీ-ఎక్స్‌ఆర్ ల్యాబ్‌లు, నిర్దిష్ట అవసరాలకు అనుగుణమైన నైపుణ్య శిక్షణను కలిపి అందిస్తుంది. మూలధన పెట్టుబడులు, ఉపాధి కల్పన, ఉత్పత్తి వ్యయాలు, నాణ్యత ధ్రువీకరణ, మేధోసంపత్తి (ఐపీ) సృష్టికి కూడా ఈ పాలసీ మద్దతు ఇస్తుంది.

* నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం, ప్రతిపాదిత ఇంటర్నేషనల్ ఫిల్మ్ సిటీ సమీపంలోని జేవర్‌లో ఉత్తరప్రదేశ్ ఏవీజీసీ-ఎక్స్‌ఆర్ పార్కును అభివృద్ధి చేస్తోంది. యానిమేషన్, వీఎఫ్‌ఎక్స్, గేమింగ్, మోషన్ క్యాప్చర్, వర్చువల్ ప్రొడక్షన్, ఎక్స్‌ఆర్ సదుపాయాలను ఈ పార్కులో ఒకేచోట అందిస్తారు. పెట్టుబడులను ఆకర్షించడం, స్టార్టప్‌లకు మద్దతు ఇవ్వడం, నైపుణ్యంతో కూడిన ఉపాధిని సృష్టించడం, రాష్ట్ర డిజిటల్ సృజనాత్మక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం దీని లక్ష్యాలు.

* యానిమేషన్, వీఎఫ్‌ఎక్స్, గేమింగ్, కామిక్స్, ఇమర్సివ్ సాంకేతిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు రాజస్థాన్ 2024–25 రాష్ట్ర బడ్జెట్‌లో ఏవీజీసీ-ఎక్స్‌ఆర్ పాలసీ 2024ను ప్రకటించింది. అర్హత ఉన్న యానిమేషన్/వీఎఫ్‌ఎక్స్/ఏఆర్/వీఆర్ ప్రాజెక్టులకు ₹50 లక్షల వరకు, అర్హత ఉన్న గేమ్ అభివృద్ధికి ₹1 కోటి నిర్మాణ ప్రోత్సాహకాలను ఈ పాలసీ అందిస్తుంది.

* ప్రభుత్వ ప్రత్యేక కార్యక్రమాల ద్వారా కీలక ఏవీజీసీ-ఎక్స్‌ఆర్ కేంద్రంగా ఎదిగేందుకు గుజరాత్ చురుగ్గా కృషి చేస్తోంది. మౌలిక సదుపాయాలు, నైపుణ్య శిక్షణ, స్టార్టప్‌లకు మద్దతు ఇచ్చే సమగ్ర ఏవీజీసీ-ఎక్స్‌ఆర్ పాలసీ రూపకల్పనలో రాష్ట్రం గణనీయమైన పురోగతి సాధించింది. యానిమేషన్, వీఎఫ్‌ఎక్స్, గేమింగ్ కోర్సులను అందించే 16 విద్యాసంస్థలతో రాష్ట్రానికి ఇప్పటికే బలమైన విద్యా పునాది ఉంది. వీటి ద్వారా రంగానికి అవసరమైన ప్రతిభావంతులు అందుబాటులోకి వస్తున్నారు.

భవిష్యత్ కార్యాచరణ
ఇమర్సివ్ సాంకేతికతలు కొత్త వినోద మాధ్యమానికే పరిమితం కావు. భారత సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ, విద్యావ్యవస్థ, సాంస్కృతిక పరిరక్షణకు ఇవి వ్యూహాత్మక సాధనాలు. జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో సమన్వయంతో ఏవీజీసీ-ఎక్స్‌ఆర్ వ్యవస్థను బలోపేతం చేస్తున్న భారత్, ఇమర్సివ్ కంటెంట్, ఆవిష్కరణలకు అంతర్జాతీయ కేంద్రంగా ఎదిగేందుకు అనుకూల స్థితిలో ఉంది. సాంకేతిక సామర్థ్యంతో, స్వావలంబనతో కొత్తగా ఎదుగుతున్న రంగాల్లో భారత్ ముందుండాలన్న వికసిత్ భారత్ 2047 లక్ష్యానికి సృజనాత్మకత, అత్యాధునిక సాంకేతికతల ఈ కలయిక అనుగుణంగా ఉంది.

 

References:

Ministry of Information & Broadcasting

Ministry of Culture

Ministry of Communications

Others

Click here to see pdf 

***

(Explainer ID: 160594) आगंतुक पटल : 9
Provide suggestions / comments
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali , Assamese , Tamil