Technology

అగ్రి-వోల్టాయిక్స్

భారత వ్యవసాయానికి విద్యుత్.. సుస్థిర భవిష్యత్తుకు బాటలు

Posted On: 23 OCT 2026 11:32AM

వ్యవసాయం, పునరుత్పాదక ఇంధన అనుసంధానంతో సాగుభూమిని మరింత ఉత్పాదకంగా మార్చే వినూత్న విధానం అందుబాటులోకి వచ్చింది. ఒకే భూమిలో పంటల సాగు, సౌర విద్యుత్ ఉత్పత్తిని అగ్రివోల్టాయిక్స్ అనుసంధానిస్తుంది. రైతులు తమ ఆదాయ మార్గాలను విస్తరించుకోవడంతో పాటు భారత స్వచ్ఛ ఇంధన పరివర్తనకు తోడ్పడే అవకాశం కల్పిస్తుంది. ఆహార ఉత్పత్తి, సౌర విద్యుత్‌ను కలిపి అందించే ఈ విధానం, భూమిని సమర్థంగా వినియోగించుకోవడం, వ్యవసాయం సవాళ్లను తట్టుకునే సామర్థ్యాన్ని పెంచడం, గ్రామీణ ప్రాంతాల్లో సుస్థిర ఆర్థిక పురోగతికి అవకాశాలను అందిస్తోంది.

వ్యవసాయ క్షేత్రాలకు సౌర విద్యుత్, మరింత స్వచ్ఛమైన భవిష్యత్తు


భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తోంది. దేశ జనాభాలో దాదాపు 46.1 శాతం మందికి జీవనోపాధికి ప్రధాన వనరుగా ఉంది. వ్యవసాయం, అనుబంధ రంగాల స్థూల విలువ జోడింపు (జీవీఏ) 2025-26లో రూ.52.08 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా. ఈ కీలక రంగం స్థిరంగా కొనసాగాలంటే సాగునీటి సరఫరా, ఇతర వ్యవసాయ పనులకు నమ్మకమైన, తక్కువ ఖర్చుతో కూడిన విద్యుత్ అవసరం. భారత స్వచ్ఛ ఇంధన పరివర్తనను ముందుకు తీసుకెళ్తూనే, ఈ రోజువారీ అవసరాలను తీర్చేందుకు సౌర విద్యుత్ సహాయపడుతుంది.

భారత్‌లో విస్తారంగా ఉన్న వ్యవసాయ భూమి, సాగుతో సౌర విద్యుత్‌ను అనుసంధానించేందుకు గణనీయమైన అవకాశాలను అందిస్తోంది. భూ వినియోగ గణాంకాలు 2023-24 ప్రకారం.. దేశంలో నమోదైన భూ విస్తీర్ణం 306.96 మిలియన్ హెక్టార్లు. ఇందులో దాదాపు 55 శాతం వ్యవసాయ భూమి. నికర సాగు విస్తీర్ణం 138.99 మిలియన్ హెక్టార్లు కాగా, స్థూల పంటల సాగు విస్తీర్ణం 217.88 మిలియన్ హెక్టార్లుగా ఉంది. ఈ విస్తారమైన భూమిలో వ్యవసాయ ఉత్పత్తితో పాటు సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. రైతులు సాగునీటి పంపులను నడిపేందుకు సౌర విద్యుత్‌ను ఉపయోగించవచ్చు. సంప్రదాయ విద్యుత్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకోవచ్చు. మిగులు విద్యుత్‌ను గ్రిడ్‌కు అందించడం ద్వారా అదనపు ఆదాయం పొందే అవకాశమూ ఉంది. ఉదాహరణకు, సౌర విద్యుత్‌తో నడిచే సాగునీటి పంపులు పంటలకు నీరందించేందుకు పగటిపూట విద్యుత్‌ను అందిస్తాయి. డీజిల్ పంపులపై ఆధారపడటాన్ని కూడా తగ్గిస్తాయి.

ఒకే భూమిలో పంటల సాగు, సౌర విద్యుత్ ఉత్పత్తిని కలిపి చేపట్టడం ద్వారా అగ్రివోల్టాయిక్స్ ఈ అనుసంధానాన్ని మరింత ముందుకు తీసుకెళ్తుంది. పంటలపైన లేదా పంట వరుసల మధ్య అమర్చిన సౌర పలకలతో వ్యవసాయాన్ని కొనసాగిస్తూనే విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. పంట, సౌర పలకల రూపకల్పన, స్థానిక పరిస్థితులను బట్టి కొంత నీడ ఏర్పడటం వల్ల నేలలో తేమ నష్టం కూడా తగ్గవచ్చు. ఈ విధానం భూ వినియోగ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు రైతుల ఆదాయ మార్గాలను విస్తరిస్తుంది. ఆహార, ఇంధన భద్రతను బలోపేతం చేస్తుంది. పరిశోధన, క్షేత్రస్థాయి ప్రదర్శనలు, విధానాల రూపకల్పన ద్వారా విభిన్న వ్యవసాయ పరిస్థితులకు అగ్రివోల్టాయిక్స్‌ను అనుగుణంగా మార్చే మార్గాలను భారత్ అన్వేషిస్తోంది. రైతుల జీవనోపాధులను దేశ విస్తృత పునరుత్పాదక ఇంధన లక్ష్యాలతో అనుసంధానించేందుకు ఇది ఆశాజనక మార్గాన్ని అందిస్తోంది.

 



“పవరింగ్ ది గ్లోబల్ సౌత్” అనే అంశంతో న్యూఢిల్లీలో 2026 అక్టోబర్ 21–23 తేదీల్లో నిర్వహిస్తున్న 7వ అగ్రివోల్టాయిక్స్ వరల్డ్ కాన్ఫరెన్స్, సౌర విద్యుత్, వ్యవసాయ అనుసంధానాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు అంతర్జాతీయ వేదికగా నిలుస్తోంది. పరిశ్రమలు, పరిశోధన, విధాన రూపకల్పన, ఆర్థిక రంగాలకు చెందిన వర్గాలను ఒకచోటకు తీసుకొస్తున్న ఈ సమావేశం, అగ్రివోల్టాయిక్స్‌లో కొత్త అవకాశాలపై దృష్టి సారిస్తోంది. భూమిని సమర్థంగా వినియోగించుకోవడం, వ్యవసాయ సుస్థిరతను బలోపేతం చేయడం, తక్కువ కార్బన్ ఉద్గారాలు కలిగిన ఆర్థిక వ్యవస్థ దిశగా మార్పునకు తోడ్పడటం దీని లక్ష్యాలు.

అగ్రివోల్టాయిక్స్: వ్యవసాయం, పునరుత్పాదక ఇంధనానికి అనుసంధానం
అగ్రిసోలార్ లేదా డ్యూయల్-యూజ్ సోలార్‌గా కూడా పిలిచే అగ్రివోల్టాయిక్స్, భూ వినియోగ సామర్థ్యాన్ని గరిష్ఠంగా పెంచుతుంది. పంటలకు నీడను అందిస్తుంది. రైతులకు అదనపు ప్రయోజనాలను కల్పిస్తుంది.

అగ్రివోల్టాయిక్ వ్యవస్థల రూపకల్పన, పనితీరు
స్థానిక సాగు పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ మౌలిక వసతులు, సౌర విద్యుత్ వ్యవస్థలను అగ్రివోల్టాయిక్ వ్యవస్థ అనుసంధానిస్తుంది. ఈ సాంకేతికతలో పలు కీలక అంశాలు ఉన్నాయి:

 



* ఎత్తైన సౌర నిర్మాణాలు: సౌర పలకలను నేరుగా నేలపై అమర్చడానికి బదులుగా, కింద ఉన్న పంటలకు సూర్యరశ్మి, వర్షం అందేంత ఎత్తులో నిర్మాణాలపై అమర్చుతారు. వ్యవసాయం కోసం ఎత్తులో అమర్చే ఈ సౌర పలకల కింద రైతులు తమ పరికరాలను ఎలాంటి ఇబ్బంది లేకుండా తరలించవచ్చు.

* కొంత నీడ: సౌర పలకలు నీడను అందించడం వల్ల పంటలకు తీవ్రమైన వేడి నుంచి రక్షణ లభిస్తుంది. నేల నుంచి నీరు ఆవిరయ్యే ప్రక్రియ తగ్గుతుంది. ముఖ్యంగా వేడి లేదా పొడి ప్రాంతాల్లో మొక్కలు పెరిగేందుకు చల్లని, మరింత స్థిరమైన వాతావరణం ఏర్పడుతుంది.

* ఒకే భూమిలో రెండు రకాల ఉత్పత్తి: పంటల సాగు లేదా పశుపోషణతో సౌర విద్యుత్ ఉత్పత్తిని అనుసంధానించడం ద్వారా అగ్రివోల్టాయిక్స్ భూ వినియోగాన్ని మెరుగుపరుస్తుంది. వ్యవసాయ పనులకు విద్యుత్‌ను అందిస్తుంది. మిగులు విద్యుత్‌ను గ్రిడ్‌కు విక్రయించడం ద్వారా అదనపు ఆదాయ మార్గాన్ని కల్పిస్తుంది.

భారత్‌లో అగ్రివోల్టాయిక్స్ అభివృద్ధి
2025 ఆగస్టు నాటికి భారత్‌లో 37.54 మెగావాట్ల స్థాపిత సామర్థ్యంతో 36 అగ్రివోల్టాయిక్స్ ప్రాజెక్టులు పనిచేస్తున్నాయి. మరో 10 ప్రయోగాత్మక ప్రాజెక్టులు అభివృద్ధి దశలో ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు విభిన్న వ్యవసాయ, వాతావరణ పరిస్థితులున్న ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. ఎత్తైన నిర్మాణాలు, మధ్య ఖాళీలను వినియోగించే అమరికలు, సూర్యుని గమనాన్ని అనుసరించే ట్రాకింగ్ వ్యవస్థలు ఇందులో ఉన్నాయి. వ్యవసాయ ఉత్పత్తితో సౌర విద్యుత్ ఉత్పత్తిని అనుసంధానించడంలో అభివృద్ధి చెందుతున్న భారత విధానాన్ని ఇవి ప్రతిబింబిస్తున్నాయి.

భారత్‌లో అగ్రివోల్టాయిక్స్ అవకాశాలు
భారత్‌లో అగ్రివోల్టాయిక్స్‌కు గణనీయమైన అవకాశాలు ఉన్నాయి. దేశ అగ్రివోల్టాయిక్స్ సామర్థ్యం 3,000 గిగావాట్ల నుంచి దాదాపు 14,000 గిగావాట్ల వరకు ఉండవచ్చని అంచనాలు సూచిస్తున్నాయి. వ్యవసాయం, పునరుత్పాదక ఇంధన అనుసంధానంలో అవకాశాల విస్తృతిని ఇది చాటుతోంది. అగ్రివోల్టాయిక్ వ్యవస్థలు రైతుల ఆదాయ మార్గాలను కూడా విస్తరించగలవు. కొన్ని సందర్భాల్లో వార్షిక ఆదాయం ఎకరాకు దాదాపు ₹60,000 నుంచి ₹1 లక్షకు పైగా పెరిగే అవకాశం ఉంది.

 

 



అగ్రివోల్టాయిక్స్ అభివృద్ధికి అవకాశాలు
* భూమి అనుకూలత:
పర్యావరణ, సాగు, సాంకేతిక ప్రమాణాల ఆధారంగా వడపోత నిర్వహించిన తర్వాత, జీఐఎస్ ఆధారిత జాతీయ పరిశీలన అగ్రిపీవీకి అనువైన 47.35 మిలియన్ హెక్టార్ల “పరిమితుల ఆధారంగా ఎంపిక చేసిన సాగుభూమి”ని గుర్తించింది. ఇది జాగ్రత్తగా అంచనా వేసిన, వాతావరణ సవాళ్లను తట్టుకోగల భూవనరుల విస్తీర్ణాన్ని సూచిస్తుంది.

* పంటల అనుకూలత: సౌర విద్యుత్ వ్యవస్థలతో పాటు సాగు చేసేందుకు పండ్లు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు, ఔషధ మొక్కలు ఆశాజనక అవకాశాలను అందిస్తున్నాయి.

* అధిక అవకాశాలున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ ఉన్నాయి. దేశ అంచనా అగ్రిపీవీ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో ఈ రాష్ట్రాల ఉమ్మడి వాటా దాదాపు 50 శాతం. సాగుభూమి లభ్యత, సౌర వనరులు, వ్యవసాయ-వాతావరణ పరిస్థితుల అనుకూల కలయిక ఇందుకు కారణం.

* ఒడిశా, తమిళనాడు, కేరళ, తెలంగాణ, బిహార్, పశ్చిమ బెంగాల్‌లో మధ్యస్థ స్థాయి అవకాశాలు ఉన్నాయి.

* భారీ స్థాయిలో ఈ వ్యవస్థలను ఏర్పాటు చేసేందుకు అవసరమైన సూర్యరశ్మి, భూమి లభ్యత, ఉద్యాన పంటల సాగు స్థాయి దక్షిణ, పశ్చిమ, మధ్య ప్రాంతాల్లో అత్యంత అనుకూలంగా ఉన్నాయి.

అగ్రివోల్టాయిక్స్ అభివృద్ధికి ప్రభుత్వ కార్యక్రమాలు
దేశవ్యాప్తంగా అగ్రివోల్టాయిక్స్ వినియోగం, విస్తరణను ముందుకు తీసుకెళ్లేందుకు భారత ప్రభుత్వం విధానాలు, పరిశోధన, సాంకేతిక అభివృద్ధి, అమలుకు సంబంధించిన పలు చర్యలు చేపట్టింది.

* ప్రధాన‌మంత్రి కిసాన్ ఊర్జా సురక్షా ఏవం ఉత్థాన్ మహాభియాన్ (పీఎం కుసుమ్): 2019 ఫిబ్రవరిలో ప్రారంభించిన ఈ పథకం వ్యవసాయంలో సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది. డీజిల్‌పై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. రైతులు తమ ఆదాయ మార్గాలను విస్తరించుకునేందుకు అవకాశాలు కల్పిస్తుంది. దాదాపు ₹34,422 కోట్ల కేంద్ర ఆర్థిక సహాయాన్ని ఈ పథకంలో నిర్దేశించారు. వికేంద్రీకృత సౌర విద్యుత్ ఉత్పత్తి, వ్యవసాయ పంపులను సౌర విద్యుత్‌తో నడిపేందుకు కూడా వీలు కల్పిస్తుంది. తద్వారా వ్యవసాయంతో సౌర విద్యుత్ అనుసంధానాన్ని అభివృద్ధి చేసేందుకు మార్గాలను సృష్టిస్తోంది.

* అగ్రివోల్టాయిక్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్‌కు చెందిన ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ సహకారంతో అగ్రివోల్టాయిక్స్ పరిశోధన, ప్రదర్శన, సామర్థ్యాల పెంపు కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను (సీఓఈ) ఏర్పాటు చేసింది. ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో 100 కిలోవాట్ల అగ్రివోల్టాయిక్ వ్యవస్థతో సహా ప్రయోగాత్మక ప్రాజెక్టులను చేపట్టింది.


ఇండియా అగ్రివోల్టాయిక్స్ అలయన్స్


నేషనల్ సోలార్ ఎనర్జీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఎస్‌ఈఎఫ్‌ఐ) ఆధ్వర్యంలోని ఇండియా అగ్రివోల్టాయిక్స్ అలయన్స్ (ఐఏఏ).. సౌర విద్యుత్ ఉత్పత్తి, వ్యవసాయం కోసం భూమిని రెండు విధాలుగా వినియోగించడాన్ని ప్రోత్సహించే వివిధ భాగస్వామ్య వర్గాల వేదిక. 2023లో ప్రారంభమైన ఈ అలయన్స్ సభ్యుల సంఖ్య 40కి పైగా పెరిగింది. అనుకూల విధానాల కోసం కృషి చేయడం, పరిశోధన, క్షేత్రస్థాయి అమలు ద్వారా అగ్రివోల్టాయిక్స్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, పరిశ్రమలకు సంబంధించిన వర్గాలతో కలిసి పనిచేస్తోంది. అవసరమైన సమాచార వనరులను అభివృద్ధి చేస్తుంది. ప్రయోగాత్మక ప్రాజెక్టులను ప్రోత్సహిస్తుంది. భూమి ఉత్పాదకతను పెంచడం, రైతుల ఆదాయ మార్గాలను విస్తరించడం, గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ అందుబాటును బలోపేతం చేసేందుకు విస్తరించగల వ్యాపార నమూనాలకు మద్దతు ఇస్తుంది.

రాష్ట్రాల ప్రత్యేక కార్యక్రమాలు
పలు రాష్ట్రాలు ప్రాంతీయ అవసరాలకు అనుగుణమైన పథకాల ద్వారా వ్యవసాయంలో సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాయి.

* ముఖ్యమంత్రి సౌర్ కృషి వాహినీ యోజన 2.0, మహారాష్ట్ర: వ్యవసాయ వినియోగదారులకు విద్యుత్ సరఫరాకు తోడ్పడేందుకు సుమారు 35,000 ఎకరాల ప్రభుత్వ, ప్రైవేటు భూముల్లో 16,000 మెగావాట్ల సౌర ప్రాజెక్టుల ద్వారా సౌర విద్యుత్ ఉత్పత్తిని ఈ పథకం ప్రోత్సహిస్తోంది.

* కిసాన్ సూర్యోదయ యోజన, గుజరాత్: వ్యవసాయ కార్యకలాపాలకు పగటిపూట విద్యుత్ సరఫరా ద్వారా రైతుల విద్యుత్ అవసరాలను తీర్చేందుకు సౌర విద్యుత్ వినియోగాన్ని విస్తరిస్తోంది. సౌర, ఇతర సంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను దశలవారీగా అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ప్రతిరోజూ ఉదయం 5:00 నుంచి రాత్రి 9:00 వరకు గరిష్ఠంగా 16 గంటల విద్యుత్ సరఫరాకు ప్రణాళిక రూపొందించారు.

* సూర్య రైతా పథకం, కర్ణాటక: సౌర విద్యుత్‌తో నడిచే సాగునీటి పంపులను ఈ పథకం ప్రోత్సహిస్తుంది. మిగులు విద్యుత్ ద్వారా రైతులు ఆదాయం పొందేందుకు వీలు కల్పిస్తుంది. డీజిల్ పంపులపై ఆధారపడటాన్ని తగ్గిస్తూనే, పంటలకు నీరందించేందుకు అవసరమైన విద్యుత్‌ను రైతులు పొందడంలో సౌర పంపులు సహాయపడతాయి.

భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి విధానపరమైన చర్యలు, ప్రత్యేక కార్యక్రమాల ద్వారా వ్యవసాయంలో సౌర విద్యుత్ వినియోగాన్ని ముందుకు తీసుకెళ్తోంది. సౌర విద్యుత్ ఉత్పత్తి, వ్యవసాయ ఉత్పత్తిని ఒకే ప్రదేశంలో చేపట్టేందుకు అవకాశాలు కల్పిస్తూ, ఈ ప్రయత్నాలు భారత అగ్రివోల్టాయిక్స్ రంగానికి రూపునిస్తున్నాయి.

వ్యవసాయం, స్వచ్ఛ ఇంధన అనుసంధానంతో సమృద్ధికి బాటలు
పర్యావరణ సుస్థిరతను ముందుకు తీసుకెళ్తూనే వ్యవసాయ జీవనోపాధులను బలోపేతం చేసేందుకు అగ్రివోల్టాయిక్స్ భారత్‌కు అవకాశం అందిస్తోంది. ఆహార ఉత్పత్తితో పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిని అనుసంధానించడం ద్వారా భూమిని మరింత సమర్థంగా వినియోగించుకోవచ్చు. అనుకూల పరిస్థితుల్లో నీటిని సంరక్షించవచ్చు. ఆర్థిక సవాళ్లను తట్టుకునే సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. పీఎం-కుసుమ్‌తో పాటు అగ్రివోల్టాయిక్స్ విస్తరణకు ప్రతిపాదించిన చర్యలు, గ్రామీణాభివృద్ధిని స్వచ్ఛ ఇంధన లక్ష్యాలతో అనుసంధానించేందుకు భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రతిబింబిస్తున్నాయి. అమలు విస్తరిస్తున్న కొద్దీ వ్యవసాయ ఉత్పాదకత, విద్యుత్ అవసరాల మధ్య సమతుల్యం సాధించేందుకు స్థానికంగా అనువైన రూపకల్పనలు, శాస్త్రీయ పరిశోధన, రైతుల భాగస్వామ్యం కీలకం. సవాళ్లను మరింత సమర్థంగా తట్టుకునే, సుస్థిరమైన భారత భవిష్యత్తు నిర్మాణానికి ఈ విధానం తోడ్పడగలదు.

 

References

 

Ministry of New and Renewable Energy

 

 

Department of Agriculture and Farmers Welfare

 

Government of Maharashtra

 

Government of Gujarat

 

Government of Karnataka

 

The Energy and Resources Institute(TERI)

 

India Agrivoltaics Alliance

 

India Brand Equity Foundation

 

US Department of Energy

Agri-Voltaics

***

(Explainer ID: 160569) आगंतुक पटल : 15
Provide suggestions / comments
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali , Assamese