Rural Prosperity
సరస్ మేళా 2026
గ్రామీణ మహిళల వ్యాపారాలకు చేరువగా జాతీయ మార్కెట్లు
Posted On:
21 OCT 2026 11:03AM
కేంద్ర ప్రభుత్వ డీఏవై-ఎన్ఆర్ఎల్ఎం కింద నిర్వహించే సరస్ మేళాలు గ్రామీణ మహిళా వ్యాపారవేత్తలను విస్తృత మార్కెట్లు, కొనుగోలుదారులు, వ్యాపార అవకాశాలతో అనుసంధానిస్తున్నాయి. ఢిల్లీ-ఎన్సీఆర్ వెలుపల నిర్వహిస్తున్న తొలి జాతీయ సరస్ మేళాగా విజయవాడ మేళా ప్రత్యేకతను సంతరించుకుంది. 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి మహిళా వ్యాపారవేత్తలను ఒకే వేదికపైకి తీసుకొచ్చింది. సుస్థిర జీవనోపాధులను ప్రోత్సహించే డీఏవై-ఎన్ఆర్ఎల్ఎం ప్రయత్నాలను ఈ వేదిక బలోపేతం చేస్తోంది. ఆదాయ వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్న లఖ్పతి దీదీ ఆశయానికి తోడ్పడుతోంది. ప్రత్యేక పెవిలియన్లు వ్యాపార నిర్వహణపై అవగాహన, సంస్థాగత సహాయం, వ్యాపారాభివృద్ధికి అవకాశాలు కల్పిస్తున్నాయి. ఈ-సరస్ వంటి డిజిటల్ వేదికలు ప్రత్యక్ష మేళాలకు అవతల కూడా మార్కెట్ అవకాశాలను విస్తరిస్తూ, గ్రామీణ మహిళలు తమ ఉత్పత్తులను మరింత విస్తృత మార్కెట్లకు తీసుకెళ్లేందుకు సహాయపడుతున్నాయి.
గ్రామీణ వ్యాపారాలకు అవకాశాల వేదిక
భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థ సంప్రదాయ నైపుణ్యాలు, హస్తకళలు, వ్యాపార ప్రతిభతో సమృద్ధిగా ఉంది. ఈ ప్రతిభను స్థానిక ఆర్థిక కార్యకలాపాల్లో భాగం చేసేందుకు మహిళా స్వయం సహాయక సంఘాలు (ఎస్‌హెచ్‌జీలు) తోడ్పడుతున్నాయి. వీరి ఉత్పత్తుల్లో చేనేత వస్త్రాలు, హస్తకళా వస్తువులు, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు, స్థానికంగా తయారయ్యే ఇతర వస్తువులు ఉన్నాయి. అయితే ఒక ఉత్పత్తిని తయారు చేయడం మొదటి అడుగు మాత్రమే. గ్రామీణ వ్యాపారవేత్తలకు వినియోగదారులు, మార్కెట్ సమాచారం, అభివృద్ధి అవకాశాలు కూడా అవసరం. మహిళల ఆధ్వర్యంలోని వ్యాపారాలను వినియోగదారులు, కొనుగోలుదారులు, సంస్థలకు చేరువ చేయడం ద్వారా సరస్ మేళాలు ఈ అంతరాన్ని తగ్గిస్తున్నాయి. దీన్‌దయాళ్ అంత్యోదయ యోజన - నేషనల్ రూరల్ లైవ్లీహుడ్స్ మిషన్ (డీఏవై-ఎన్ఆర్ఎల్ఎం) కింద ప్రభుత్వం నిర్వహిస్తున్న సరస్ మేళాలు దాదాపు మూడు దశాబ్దాలుగా అభివృద్ధి చెందుతున్నాయి. ఇవి కేవలం ప్రదర్శనలకే పరిమితం కావడం లేదు. ఉత్పత్తులను విక్రయించేందుకు, వినియోగదారుల అభిరుచులను తెలుసుకునేందుకు, వ్యాపార సంబంధాలను ఏర్పరచుకునేందుకు, విస్తృత మార్కెట్లలో అవకాశాలను అన్వేషించేందుకు వేదికగా నిలుస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో నిర్వహిస్తున్న జాతీయ సరస్ మేళా ఈ ప్రయాణంలో కొత్త ముందడుగు. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతం వెలుపల నిర్వహిస్తున్న తొలి జాతీయ సరస్ మేళా ఇదే. విజయవాడలోని పున్నమి ఘాట్‌లో 2026 అక్టోబర్ 13 నుంచి 2026 అక్టోబర్ 31 వరకు ఈ మేళా జరుగుతోంది. 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి దాదాపు 1,500 మంది మహిళా ఎస్‌హెచ్‌జీ వ్యాపారవేత్తలు, లఖ్పతి దీదీలు 650కి పైగా స్టాళ్లలో తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు. ప్రాంతీయ వస్త్రాలు, హస్తకళలు, సహజ, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు, ఇతర గ్రామీణ ఉత్పత్తులు మేళాలో ఉన్నాయి. ఇండియా ఫుడ్ కోర్ట్, సాంస్కృతిక ప్రదర్శనలు, ప్రత్యేక శిక్షణ వేదికలు సందర్శకులకు మరింత ప్రత్యేక అనుభవాన్ని అందిస్తున్నాయి.
జాతీయ సరస్ మేళాను వివిధ ప్రాంతాల్లో నిర్వహించడం విస్తృత అభివృద్ధి విధానాన్ని ప్రతిబింబిస్తోంది: జాతీయ వేదికలను దేశవ్యాప్తంగా ఉత్పత్తిదారులు, వినియోగదారులకు చేరువ చేయడం. మహిళల ఆధ్వర్యంలోని వ్యాపారాల వృద్ధికి తోడ్పడుతూ, స్థానిక నైపుణ్యాలను కొత్త మార్కెట్లతో అనుసంధానిస్తోంది. ఇతర జాతీయ కార్యక్రమాలను కూడా మరిన్ని ప్రాంతాల్లో నిర్వహించేందుకు ఈ మేళా బాటలు వేస్తోంది. బ్రిక్స్, జీ20 సమావేశాల వంటి అంతర్జాతీయ కార్యక్రమాలను ప్రాంతీయ స్థాయిలో నిర్వహించే విధానానికి ఇది అనుగుణంగా ఉంది.
గ్రామీణ జీవనోపాధుల నుంచి మార్కెట్ అవకాశాల వరకు: డీఏవై-ఎన్ఆర్ఎల్ఎం పాత్ర
గ్రామీణ పేదరికాన్ని తగ్గించడం, మహిళల ఆర్థిక సాధికారతను ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం చేపట్టిన ప్రధాన కార్యక్రమం డీఏవై-ఎన్ఆర్ఎల్ఎం. ఎస్‌హెచ్‌జీలు, వాటి సమాఖ్యల ద్వారా పనిచేస్తూ, ఆర్థిక సేవలను అందుబాటులోకి తేవడం, సుస్థిర జీవనోపాధులకు మద్దతు ఇవ్వడం లక్ష్యంగా సాగుతోంది. మహిళలకు నైపుణ్యాలు, ఆర్థిక వనరులు, సాంకేతికత, జీవనోపాధి అవకాశాలు అందేందుకు ఈ మిషన్ సహాయపడుతుంది. ఉత్పత్తులు ఎక్కువ మందికి చేరువయ్యేలా చేయడం, బ్రాండింగ్, ప్రత్యక్ష, డిజిటల్, సంస్థాగత మార్కెట్లతో అనుసంధానం ద్వారా మహిళల ఆధ్వర్యంలోని వ్యాపారాలకు అవసరమైన మార్కెట్ వ్యవస్థను కూడా బలోపేతం చేస్తుంది.

మార్కెట్‌తో ఈ అనుసంధానం ముఖ్యమైనది. ఎందుకంటే వ్యాపార వృద్ధి ఉత్పత్తిపైనే ఆధారపడి ఉండదు. తమ చుట్టుపక్కల ప్రాంతాలకు అవతల కూడా ఉత్పత్తులను విక్రయించే అవకాశాలు మహిళలకు అవసరం. వినియోగదారుల అభిప్రాయాలు తెలుసుకోవడం, ఉత్పత్తులను మెరుగ్గా ప్రదర్శించడం, కొనుగోలుదారులతో సంబంధాలు ఏర్పరచుకోవడం వల్ల కూడా ప్రయోజనం పొందుతారు. ఈ అవసరాలు, మార్కెట్ అవకాశాల మధ్య సరస్ మేళాలు నేరుగా అనుసంధానం కల్పిస్తాయి. ఎస్‌హెచ్‌జీ వ్యాపారాలు, వినియోగదారులు, సంస్థాగత కొనుగోలుదారులు, ఇతర సంబంధిత వర్గాలను ఒకచోటకు తీసుకొస్తాయి. వ్యాపారవేత్తలు నేరుగా విక్రయాలు జరపవచ్చు. వినియోగదారుల అభిరుచులను అధ్యయనం చేయవచ్చు. మేళా ముగిసిన తర్వాత కూడా కొనసాగే భాగస్వామ్యాల అవకాశాలను అన్వేషించవచ్చు.
65 మంది లబ్ధిదారుల నుంచి జాతీయ మార్కెట్ వేదిక వరకు
సరస్ ప్రయాణం 1999లో ప్రారంభమైంది. దాదాపు 65 మంది లబ్ధిదారులతో తొలి జాతీయ సరస్ మేళాను ఢిల్లీలో నిర్వహించారు. అప్పటి నుంచి ఈ వేదిక జాతీయ, ప్రాంతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయులకు విస్తరించింది. ఇప్పటివరకు మొత్తం 117 జాతీయ సరస్ మేళాలను నిర్వహించారు. వార్షిక విక్రయాలు ₹200 కోట్లు దాటాయి. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కూడా ఏటా కనీసం రెండు రాష్ట్రస్థాయి సరస్ మేళాలను నిర్వహిస్తున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా ఏటా సగటున దాదాపు 50 మేళాలు జరుగుతున్నాయి. ప్రాంతీయ, జిల్లాస్థాయి కార్యక్రమాలు స్థానిక ఉత్పత్తిదారులకు విక్రయ అవకాశాలను చేరువ చేస్తున్నాయి. ఈ వివిధ స్థాయుల మేళాలు కొత్త మార్కెట్లను గుర్తించడం, బ్రాండింగ్, కొనుగోలుదారులు–విక్రేతల అనుసంధానం, వ్యాపారాభివృద్ధికి తోడ్పడుతున్నాయి.
లఖ్పతి దీదీ: జీవనోపాధులను మరింత సుస్థిరం చేయడం
డీఏవై-ఎన్ఆర్ఎల్ఎం కింద ఫలితాల సాధన లక్ష్యంగా చేపట్టిన జీవనోపాధి కార్యక్రమం లఖ్పతి దీదీ. ఎస్‌హెచ్‌జీలు, వాటి సమాఖ్యల ద్వారా సంఘటితమైన మహిళల వ్యవస్థ ఆధారంగా ఇది పనిచేస్తుంది. విభిన్న జీవనోపాధి అవకాశాల ద్వారా మహిళలు, వారి కుటుంబాలు స్థిరమైన ఆదాయాన్ని పొందేందుకు సహాయపడటంపై దృష్టి సారిస్తుంది. ఏడాదికి కనీసం ₹1 లక్ష ఆదాయాన్ని స్థిరంగా సంపాదించే కుటుంబానికి చెందిన ఎస్‌హెచ్‌జీ సభ్యురాలిని లఖ్పతి దీదీ అంటారు. కనీసం నాలుగు వ్యవసాయ సీజన్లు లేదా నాలుగు వ్యాపార చక్రాలు లేదా ఈ రెండింటినీ పరిగణనలోకి తీసుకుని అంచనా వేస్తారు. 2023 ఆగస్టులో ప్రభుత్వం రెండు కోట్ల లఖ్పతి దీదీలను తీర్చిదిద్దాలన్న లక్ష్యాన్ని ప్రకటించడంతో ఈ కార్యక్రమానికి జాతీయ స్థాయిలో ఊతం లభించింది. 2024-25 మధ్యంతర బడ్జెట్లో లక్ష్యాన్ని మూడు కోట్లకు పెంచారు. ఆ తర్వాత 2025 డిసెంబర్ నాటికి మూడు కోట్ల మైలురాయిని సాధించింది.
2026 ఫిబ్రవరిలో ప్రభుత్వం లఖ్పతి దీదీల లక్ష్యాన్ని ఆరు కోట్లకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ తదుపరి దశలో పెరిగిన ఆదాయాన్ని స్థిరంగా కొనసాగించడం, వ్యాపారాల వృద్ధికి సహాయపడటానికి మరింత ప్రాధాన్యం ఇస్తున్నారు. మార్కెట్ అవకాశాలు, ఉత్పత్తులకు గుర్తింపు, బ్రాండింగ్, నమ్మకమైన విక్రయ మార్గాలు ఈ ప్రయత్నంలో ముఖ్యమైనవి. జీవనోపాధి కల్పన నుంచి వ్యాపార వృద్ధి దిశగా సాగేందుకు సరస్ మేళాలు తోడ్పడుతున్నాయి. భారీ ఆర్డర్లు, సంస్థాగత విక్రయాలు, దీర్ఘకాల మార్కెట్ సంబంధాలకు కూడా అవకాశాలు కల్పించగలవు. విజయవంతమైన వ్యాపారవేత్తలు, వ్యాపార శిక్షణ, సంస్థాగత సహాయం కోసం ప్రత్యేక ప్రదేశాలను ఏర్పాటు చేయడం ద్వారా విజయవాడ మేళా ఈ అనుసంధానాన్ని ఆచరణలో చూపిస్తోంది. మహిళలు తమ అనుభవాలను పంచుకోవచ్చు. కొత్త పద్ధతులను నేర్చుకోవచ్చు. తమ వ్యాపారాలను బలోపేతం చేసుకునే మార్గాలను అన్వేషించవచ్చు.
విజయవాడ: ప్రాంతీయ స్థాయిలో జాతీయ మార్కెట్ వేదిక
విజయవాడ మేళా దేశవ్యాప్తంగా ఉన్న ఉత్పత్తులు, సంప్రదాయాలను ఒకే మార్కెట్ వేదికపైకి తీసుకొస్తోంది. సందర్శకులు పంజాబ్ ఫుల్కారీ, జమ్మూ కశ్మీర్ పష్మీనా, తెలంగాణ ఇక్కత్, తెలియా వస్త్రాలు, మిజోరాం పౌంచెయి వంటి వాటిని చూడవచ్చు. మీనాకారీ, డోక్రా, ఇత్తడి కళాకృతులు, చెక్క కళాకృతులు, సంప్రదాయ చిత్రాలు కూడా స్టాళ్లలో ఉన్నాయి.

“శక్తి - ది స్పిరిట్ ఆఫ్ లఖ్పతి దీదీ” పేరుతో ఏర్పాటు చేసిన 16 అడుగుల ప్రత్యేక నిర్మాణం ఈ మేళాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. సంప్రదాయ హస్తకళా నైపుణ్యాన్ని పరిరక్షించే మహిళల సమష్టి శక్తికి ఇది ప్రతీక. తమ నైపుణ్యాలను జీవనోపాధి, స్వాతంత్ర్యం, సమృద్ధికి మార్గాలుగా మలుచుకుంటున్న మహిళలకు గుర్తింపుగా నిలుస్తోంది.
జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డ్), జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ సంస్థ (ఎన్ఐఆర్డీపీఆర్) సహా ప్రభుత్వ భాగస్వామ్య సంస్థలు మేళాకు మద్దతు ఇస్తున్నాయి. ప్రత్యక్ష విక్రయాలతో పాటు శిక్షణ, ప్రదర్శనలు, సంస్థలతో అనుసంధానం కల్పించేలా మేళాను రూపొందించారు. సందర్శకులతో పాటు సుస్థిర వ్యాపారాలను నిర్మించాలనుకునే వ్యాపారవేత్తలకు కూడా ఈ కార్యక్రమం ఉపయోగపడాలన్నది లక్ష్యం.
ఉత్పత్తులు, నైపుణ్యాలు, అవకాశాలను అనుసంధానించే వేదికలు
విజయవాడ జాతీయ సరస్ మేళా సాధారణ ప్రదర్శన, చిల్లర విక్రయాలకు మించి వివిధ అంశాల ప్రదర్శన, అవగాహన, పరస్పర చర్చల కోసం ప్రత్యేక వేదికలను ఏర్పాటు చేస్తోంది. వ్యాపారాలను పరిచయం చేయడం, తోటి వ్యాపారవేత్తల నుంచి నేర్చుకోవడం, విజ్ఞాన మార్పిడి, ప్రభుత్వం, మార్కెట్‌కు సంబంధించిన వర్గాలతో అనుసంధానం, ప్రత్యక్ష ప్రదర్శనలు, ప్రణాళికాబద్ధమైన కొనుగోలుదారులు-విక్రేతల సమావేశాలకు ఈ వేదికలు అవకాశాలు కల్పిస్తున్నాయి.
లఖ్పతి దీదీ పెవిలియన్: వ్యాపార ప్రయాణాల నుంచి నేర్చుకోవడం
విజయవంతమైన వ్యాపారాలను నిర్మించిన మహిళలను లఖ్పతి దీదీ పెవిలియన్ పరిచయం చేస్తోంది. ఏటా ₹1 కోటికి పైగా సంపాదించే మహిళలతో సహా, సంవత్సరానికి ₹10 లక్షలకు పైగా ఆదాయం పొందే వ్యాపారవేత్తలు ఇందులో పాల్గొంటున్నారు. ఈ మహిళలు తమ ప్రయాణాలు, ఉత్పత్తులు, వ్యాపార నమూనాలు, మార్కెట్ వ్యూహాలను ఇతర ఎస్‌హెచ్‌జీ సభ్యులతో పంచుకుంటున్నారు. వ్యవసాయం, వ్యవసాయేతర జీవనోపాధులు, ఆహార ప్రాసెసింగ్, హస్తకళలు, చేనేత, సేవలతో సహా వ్యాపార వృద్ధికి ఉన్న విభిన్న మార్గాలను వారి అనుభవాలు తెలియజేస్తున్నాయి. తోటి మహిళల నుంచి నేర్చుకోవడం ద్వారా తమ నైపుణ్యాలు, పరిస్థితులకు అనువైన విధానాలను గుర్తించవచ్చు.

లెర్నింగ్ అండ్ నాలెడ్జ్ పెవిలియన్: వ్యాపార నైపుణ్యాల పెంపు
మంచి ఉత్పత్తులకు సమర్థమైన వ్యాపార పద్ధతులు అవసరం. ఎస్‌హెచ్‌జీ వ్యాపారవేత్తలు, స్టేట్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్లు (ఎస్ఆర్ఎల్ఎంలు), కొనుగోలుదారులు, ఇతర సంబంధిత వర్గాల మధ్య వర్క్‌షాప్‌లు, నిపుణుల ప్రసంగాలు, ప్రత్యేక శిక్షణ తరగతులు, అనుభవాల పంచుకునే సమావేశాల కోసం లెర్నింగ్ అండ్ నాలెడ్జ్ పెవిలియన్‌ను రూపొందించారు. ప్యాకేజింగ్, బ్రాండింగ్, వ్యాపార ప్రతిపాదనల తయారీ, ఈ-కామర్స్, సామాజిక మాధ్యమాల ద్వారా మార్కెటింగ్ వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. ప్రభుత్వ సంస్థలు, ప్రైవేటు రంగ సంస్థలతో అనుసంధానాన్ని కూడా ప్రోత్సహిస్తున్నారు. వీటిలో నాబార్డ్, ఫిక్కీ, సీఐఐ, ఐటీసీ, హిందుస్థాన్ యూనిలీవర్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఉన్నాయి. ఉత్పత్తులను మెరుగ్గా ప్రదర్శించడం, వినియోగదారులకు చేరువ కావడానికి అవసరమైన ఆచరణాత్మక సాధనాలను వ్యాపారవేత్తలు ఈ పరస్పర చర్చల ద్వారా తెలుసుకోవచ్చు.
కన్వర్జెన్స్ పెవిలియన్: మహిళలకు సహాయ వ్యవస్థల అనుసంధానం
వ్యాపారాన్ని పెంచేందుకు మార్కెట్ అవకాశాలు మాత్రమే సరిపోవు. వ్యాపారవేత్తలకు రుణాలు, నైపుణ్యాలు, సాంకేతికత, నాణ్యత ధ్రువీకరణ, ప్రభుత్వ సహాయం కూడా అవసరం. కన్వర్జెన్స్ పెవిలియన్ ఎస్‌హెచ్‌జీ వ్యాపారవేత్తలను సంబంధిత శాఖలు, ఆర్థిక సంస్థలు, అభివృద్ధి సంస్థలు, సాంకేతిక సంస్థలతో అనుసంధానిస్తోంది. వీటిలో గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సూక్ష్మ, చిన్న & మధ్యతరహా సంస్థల మంత్రిత్వ శాఖ, వస్త్ర మంత్రిత్వ శాఖ, ఓఎన్డీసీ, గవర్నమెంట్ ఈమార్కెట్ప్లేస్ (జెమ్), ట్రైఫెడ్ ఉన్నాయి. తమకు సంబంధించిన పథకాలు, సేవలు, సహాయక వ్యవస్థలను మహిళలు తెలుసుకునేందుకు ఈ పెవిలియన్‌ను ఏర్పాటు చేశారు.

డెమాన్‌స్ట్రేషన్ పెవిలియన్: ఉత్పత్తుల తయారీ ప్రక్రియ ప్రదర్శన
ఒక ఉత్పత్తి వెనుక సాధారణంగా నైపుణ్యం, సమయం, ప్రత్యేక తయారీ పద్ధతి ఉంటాయి. ఆ ప్రక్రియను సందర్శకులు నేరుగా చూసేందుకు డెమాన్‌స్ట్రేషన్ పెవిలియన్ అవకాశం కల్పిస్తోంది. మహిళా వ్యాపారవేత్తలు, కళాకారులు సంప్రదాయ, ఆధునిక ఉత్పత్తి పద్ధతులను ప్రత్యక్షంగా ప్రదర్శిస్తున్నారు. వీటిలో కుండల తయారీ, కుట్టుపనులు, అద్దాల ఎంబ్రాయిడరీ ఉన్నాయి. లఖ్పతి దీదీల ప్రత్యక్ష ప్రదర్శనలు ఆచరణలో నేర్చుకోవడానికి, విజ్ఞాన మార్పిడికి అవకాశాలు కల్పిస్తున్నాయి. చేతితో తయారు చేసే ఉత్పత్తుల వెనుక ఉన్న నైపుణ్యాన్ని సందర్శకులు అర్థం చేసుకునేందుకు కూడా ఇవి తోడ్పడుతున్నాయి. “డెమో అండ్ లైవ్ లెర్నింగ్ ఏరియా” ప్రత్యేక అనుభవాన్ని అందిస్తోంది.
ఇండియా ఫుడ్ కోర్ట్: ప్రాంతీయ రుచులు, మహిళల వ్యాపారాలు
గ్రామీణ వ్యాపారాలు వినియోగదారులకు చేరువయ్యే మరో మార్గం ఆహారం. స్వచ్ఛమైన మసాలా దినుసులతో సంప్రదాయ పద్ధతుల్లో తయారు చేసే ప్రాంతీయ వంటకాలను పరిచయం చేస్తూ ఇండియా ఫుడ్ కోర్ట్‌లో 50 ఆహార స్టాళ్లు ఉన్నాయి. 28కి పైగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 200 మందికి పైగా తొలితరం మహిళా ఆహార సేవల వ్యాపారవేత్తలను ఈ కార్యక్రమం ఒకచోటకు తీసుకొచ్చింది. సందర్శకులు గోల్ గప్పే, చాట్, కబాబ్‌ల వంటి ప్రసిద్ధ వీధి వంటకాలను రుచి చూడవచ్చు. ప్రాంతీయ వంటకాల్లో బిహార్ లిట్టీ చోఖా, హైదరాబాదీ దమ్ బిర్యానీ, అస్సాం మష్రూమ్ పిఠా, పంజాబ్ సాగ్‌తో కూడిన మక్కే దీ రోటీ ఉన్నాయి. కేరళలోని అట్టప్పాడి వనసుందరి, ఛత్తీస్‌గఢ్ చౌసేలా ఇతర ఉదాహరణలు. ప్రాంతీయ వంట సంప్రదాయాలను జాతీయ వేదికపై పరిచయం చేసేందుకు ఫుడ్ కోర్ట్ మహిళలకు అవకాశం ఇస్తోంది. మహిళల ఆధ్వర్యంలోని వ్యాపారాల విస్తృత ప్రయాణంలో ఆహార తయారీ, సేవల వ్యాపారాన్ని కూడా భాగం చేస్తోంది.
సాంస్కృతిక ప్రదర్శనలు: భారత వైవిధ్యాన్ని చాటే వేడుకలు
పాల్గొంటున్న ప్రాంతాలకు చెందిన సంప్రదాయ కళారూపాలు, హస్తకళలు, వస్త్రాలు, సంగీతం, నృత్యాలు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఉన్నాయి. సందర్శకులకు దేశవ్యాప్త సాంస్కృతిక అనుభూతిని అందిస్తున్నాయి. ప్రదర్శనలో ఉన్న అనేక ఉత్పత్తుల వెనుక ఉన్న వారసత్వాన్ని ఈ కార్యక్రమాలు చాటుతున్నాయి. పాల్గొంటున్న రాష్ట్రాలు తమ ప్రత్యేక సాంస్కృతిక గుర్తింపులను పరిచయం చేసుకునేందుకు కూడా తోడ్పడుతున్నాయి.

డిజిటల్ అనుసంధానం: ప్రత్యక్ష స్టాళ్ల నుంచి డిజిటల్ మార్కెట్లకు
సరస్ మేళాలో వ్యాపార కార్యకలాపాలకు డిజిటల్ చెల్లింపులు ముఖ్యమైన ఊతమిస్తున్నాయి. యూపీఐ లావాదేవీలు సులభమైన, పారదర్శకమైన చెల్లింపులకు తోడ్పడుతున్నాయి. ఫుడ్ కోర్ట్ ప్రధానంగా నగదు రహిత లావాదేవీలతో పనిచేస్తోంది. అదే సమయంలో వృద్ధులు, నగదు చెల్లింపులకు ప్రాధాన్యం ఇచ్చే సందర్శకుల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కూపన్ల ఆధారంగా నగదు చెల్లింపు సదుపాయాలను కూడా అందుబాటులో ఉంచారు. దీంతో అందరూ సులభంగా, అంతరాయాలు లేకుండా సేవలను వినియోగించుకోవచ్చు.
మేళా ముగిసినంత మాత్రాన మార్కెట్ అవకాశం ముగియకూడదు. మేళాకు అవతల, భౌగోళిక హద్దులను దాటి వినియోగదారులకు చేరువయ్యేందుకు డిజిటల్ మార్గాలు వ్యాపారాలకు సహాయపడగలవు. అందుకే సరస్ వ్యవస్థ ప్రత్యక్ష మేళాలతో పాటు సరస్ గ్యాలరీ, ఈ-కామర్స్ మార్గాలను అనుసంధానిస్తోంది. ఎస్‌హెచ్‌జీ వ్యాపారవేత్తలు తయారు చేసిన ఉత్పత్తులను వినియోగదారులు తెలుసుకుని, కొనుగోలు చేసేందుకు ఈ-సరస్ వేదిక ఆన్లైన్ మార్గాన్ని అందిస్తోంది. ఇది ముఖాముఖి విక్రయాలకు అవతల మార్కెట్ అవకాశాలను విస్తరిస్తోంది. మేళా ముగిసిన తర్వాత కూడా ఉత్పత్తులు వినియోగదారులకు అందుబాటులో ఉండేందుకు తోడ్పడుతుంది.
ప్రత్యేక సరస్ మేళా డిజిటల్ యాప్‌ను 2025లో ప్రవేశపెట్టారు. ఎస్‌హెచ్‌జీల నామినేషన్లు, హాజరు నిర్వహణ, మేళాకు సంబంధించిన సమాచారాన్ని పంచుకోవడానికి ఇది ఉపయోగపడుతోంది. ప్రత్యక్ష కార్యక్రమాలు, డిజిటల్ మార్గాలు కలిసి మార్కెట్‌ను చేరుకునేందుకు పరస్పరం తోడ్పడే అవకాశాలను అందిస్తున్నాయి. సరస్ మేళా వినియోగదారులు, కొనుగోలుదారులతో ప్రత్యక్ష సంబంధాన్ని కల్పిస్తోంది. మేళా ముగిసిన తర్వాత కూడా ఉత్పత్తుల పరిచయం, విక్రయాలను కొనసాగించేందుకు ఆన్లైన్ మార్గాలు సహాయపడగలవు.
ప్రాంతాలకు జాతీయ మార్కెట్ అవకాశాల విస్తరణ
విజయవాడ జాతీయ సరస్ మేళా, మార్కెట్ అవకాశాల వేదికను కొత్త ప్రాంతానికి విస్తరించడాన్ని సూచిస్తోంది. జాతీయ కార్యక్రమాలను వివిధ ప్రదేశాల్లో నిర్వహించడం ద్వారా స్థానిక వినియోగదారులు, కొనుగోలుదారులు, సంస్థాగత భాగస్వాములకు చేరువ చేయవచ్చు. వివిధ రాష్ట్రాల ఉత్పత్తిదారులు విస్తృత మార్కెట్లపై అవగాహన పొందేందుకు కూడా సహాయపడుతుంది. డీఏవై-ఎన్ఆర్ఎల్ఎం, లఖ్పతి దీదీ కార్యక్రమాల విస్తృత లక్ష్యాలకు ఈ విధానం తోడ్పడుతోంది. మహిళలకు సుస్థిర జీవనోపాధులతో పాటు ఉత్పత్తుల విలువను పెంచుకోవడం, విక్రయాలను విస్తరించుకునే మార్గాలు కూడా అవసరం. విక్రయాలు, శిక్షణ, సంస్థాగత సంబంధాలను కలిపి అందించే వేదికలు ఈ ప్రక్రియకు తోడ్పడగలవు.
2026 అక్టోబర్ 2న ప్రారంభమైన సేవా పఖ్వాడా సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన ఒక మైలురాయి కార్యక్రమం ఈ జాతీయ సరస్ మేళా (ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతం వెలుపల). సరస్ మేళాలు వోకల్ ఫర్ లోకల్, ఆత్మనిర్భర్ భారత్ ఆశయాలను కూడా ప్రోత్సహిస్తున్నాయి. గ్రామీణ ఉత్పత్తులను తెలుసుకోవడానికి, వాటి వెనుక ఉన్న మహిళా వ్యాపారవేత్తలను కలుసుకోవడానికి వినియోగదారులకు ప్రత్యక్ష అవకాశాన్ని ఇస్తున్నాయి. మహిళల ఆధ్వర్యంలోని వ్యాపారాలను బలోపేతం చేస్తూనే సంప్రదాయ నైపుణ్యాలను పరిరక్షించే అవకాశాలను సృష్టిస్తున్నాయి. జాతీయ సరస్ మేళాకు కేంద్రబిందువు ప్రతి ఉత్పత్తి, హస్తకళ, వ్యాపారం వెనుక ఉన్న మహిళలు, వారు సాగించే నైపుణ్యం నుంచి వ్యాపారానికి, వ్యాపారం నుంచి మార్కెట్‌కు, మార్కెట్ నుంచి సుస్థిర జీవనోపాధికి ప్రయాణం.
References
Ministry of Rural Development
https://www.esaras.in/
https://x.com/esarasaajeevika?lang=en
https://www.pib.gov.in/PressReleaseDetail.aspx?PRID=2322458®=48&lang=1
Ministry of Electronics & Information Technology
https://play.google.com/store/apps/details?id=com.esaras&hl=en_IN
President’s Secretariat
https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=2323813®=48&lang=2
Government of Telangana
https://www.efms.serp.telangana.gov.in/Livelihoods/SARAS/Views/SarasHome.aspx
Click to see pdf
***
(Explainer ID: 160550)
आगंतुक पटल : 39
Provide suggestions / comments