Social Welfare

క్షయ రహిత దేశం దిశగా భార‌త్‌

పురోగతి, ఆవిష్క‌ర‌ణ‌, సమాజ భాగస్వామ్యం

Posted On: 13 OCT 2026 4:37PM

క్షయవ్యాధిపై భారత‌దేశ‌ పోరాటం కీలక మైలురాళ్లను సాధించింది. 2015 నుంచి 2024 మధ్య ప్రపంచవ్యాప్తంగా ఏటా కొత్త కేసులు 12 శాతం తగ్గగా, భారత్‌లో 21 శాతం తగ్గాయి. ప్రపంచస్థాయిలో 78 శాతంగా ఉన్న చికిత్స పరిధి భారత్‌లో 92 శాతానికి చేరింది. ముమ్మరంగా సాగుతున్న టీబీ ముక్త్ భారత్ అభియాన్ కింద ఇప్పటివరకు 28.1 కోట్లకుపైగా పరీక్షలు నిర్వహించారు. 20 లక్షలకుపైగా మందికి టీబీ నివారణ చికిత్స (టీపీటీ) అందించారు. కొత్తగా 5.7 లక్షల మంది నిక్షయ్ మిత్రలు చేరగా, 46,118 గ్రామ పంచాయతీలు క్షయ రహిత గ్రామాలుగా ధ్రువీకరణ పొందాయి. చేతితో మోసుకెళ్లే యూనిట్ల ద్వారా ఎక్స్‌రే పరీక్షలు 34 రెట్లు పెరగడం, ‘ఖుషి’ ఏఐ చాట్‌బాట్‌తో కూడిన టీబీ ముక్త్ భారత్ యాప్ ప్రారంభం, ఔషధ నిరోధక టీబీ బాధితుల కోసం తక్కువ వ్యవధితో కూడిన సురక్షిత బీపీఏఎల్‌ఎం చికిత్స విధానం ప్రవేశపెట్టడం జాతీయ స్థాయి చర్యలను మరింత వేగవంతం చేశాయి. ఈ చికిత్స విధానంలో బెడాక్విలిన్, ప్రిటోమనిడ్, లైనెజోలిడ్, మోక్సిఫ్లోక్సాసిన్ మందులు ఉన్నాయి. వీటితో పాటు ఏఐ ఆధారిత అధునాతన ప్రాథమిక నిర్ధారణ సాధనాలను అందుబాటులోకి తెచ్చారు. ఈ పురోగతిని కొనసాగిస్తూ జోష్(జాయింట్ స్క్వాడ్ ఫర్ హెల్త్) ప్రచారం యువత, ప్రజలను సమీకరిస్తోంది. టీబీపై అవగాహన, ముందస్తు గుర్తింపు, సకాలంలో చికిత్స, మందుల క్రమబద్ధ వినియోగాన్ని ప్రోత్సహిస్తూ, వ్యాధి పట్ల సామాజిక అపోహలను తొలగించేందుకు కృషి చేస్తోంది. ప్రజా భాగస్వామ్యం, సమష్టి చర్యలను బలోపేతం చేస్తూ క్షయ రహిత భారత్ లక్ష్యాన్ని ప్ర‌జా ఉద్య‌మంగా ముందుకు తీసుకెళ్తోంది.

 

పరిచయం

భారత్ క్షయవ్యాధి నిర్మూలన దిశగా వేగంగా ముందుకు సాగుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన ప్రపంచ క్షయవ్యాధి నివేదిక-2025 ప్రకారం.. 2015 నుంచి 2024 మధ్య భారత్‌లో ఏటా కొత్తగా వెలుగుచూసే టీబీ కేసులు 21 శాతం తగ్గాయి. ఇదే కాలంలో ప్రపంచస్థాయి తగ్గుదల 12 శాతంగా ఉంది. భారత్‌లో చికిత్స పరిధి 92 శాతం కాగా, ప్రపంచ సగటు 78 శాతంగా ఉంది.

ప్రపంచంలో టీబీ భారం ఎక్కువగా ఉన్న ఇతర దేశాల కంటే భారత్ వేగంగా కేసులను తగ్గించింది. ఇదే కాలంలో క్షయవ్యాధి మరణాలు 28 శాతం తగ్గాయి. వ్యాధి గుర్తింపు, పరీక్షలు, చికిత్స కోసం భారత ప్రభుత్వం అనుసరిస్తున్న లక్ష్య నిర్దేశిత బహుముఖ విధానం ఈ సానుకూల మార్పునకు కీలకంగా నిలిచింది. అధునాతన సాంకేతికత, స్థానిక ఆరోగ్య సేవల విస్తరణ, ప్రజా భాగస్వామ్యం, అందుబాటు ధరల్లో చికిత్స సౌకర్యాలు విస్తృతంగా వ్యాపించే ఈ ప్రాణాంతక వ్యాధిని నిర్మూలించే దిశగా భారత్‌ను నడిపిస్తున్నాయి.

 

టీబీ నిర్మూలనకు ప్రజలను సమీకరించే జోష్ ప్రచారం

టీబీ నిర్మూలన ప్రయత్నాలను మరింత వేగవంతం చేసేందుకు 2026 అక్టోబర్ 13న జోష్(జాయింట్ స్క్వాడ్ ఫర్ హెల్త్) బృందాలతో దేశవ్యాప్త సామాజిక మాధ్యమ ప్రచారం నిర్వహించారు. తొలి దశలో 11 రాష్ట్రాల్లోని 55 జిల్లాల్లో దీనిని అమలు చేశారు. ప్రతి జోష్ బృందంలో మై భారత్ వాలంటీర్లు, జాతీయ క్యాడెట్ దళం క్యాడెట్లు, ఒక నిర్దేశిత క్లాస్-1 అధికారి ఉంటారు. సకాలంలో పరీక్షలు చేయించుకోవడం, చికిత్స తీసుకోవడంపై వీరు అవగాహన కల్పిస్తారు.

 క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు యువతను ఈ వ్యవస్థ సమీకరిస్తుంది. టీబీపై అవగాహన, ముందస్తు గుర్తింపు, చికిత్సను క్రమం తప్పకుండా కొనసాగించడం, అపోహలులేని సమాజ నిర్మాణానికి మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ విభాగాలు, ఆరోగ్య సంస్థలు, మై భారత్ వాలంటీర్లు, యువజన సంస్థలు, విద్యార్థులు, పౌరులు సహకరించాలని కోరారు. యువత ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాలను తెలియజేసే పోస్టులు, ఛాయాచిత్రాలు, వీడియోలు, స్ఫూర్తిదాయక కథనాల ద్వారా ప్రచారాన్ని విస్తరించాలని సూచించారు.

 

 

 టీబీ ముక్త్ అభియాన్‌పై పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులతో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యశాలలు నిర్వహించింది. ఈ ప్రచారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజల భాగస్వామ్యం కీలకమని గుర్తించింది. పరీక్షలు, ముందస్తు గుర్తింపు ప్రాధాన్యాన్ని తెలియజేస్తూ, ప్రజా భాగస్వామ్యాన్ని పెంచే తదుపరి అడుగుగా జోష్ ప్రచారం నిలుస్తోంది. చురుకైన పరీక్షలను విస్తరించడం, లక్షణాలు కనిపించని బాధితులను గుర్తించడం కోసం రోగ నిర్ధారణ, చికిత్సతో పాటు ప్రజల సహకారం అవసరమని ఈ ప్రచారం స్పష్టం చేస్తోంది.

ముఖ్యంగా బలహీన, అట్టడుగు వర్గాల్లో ప్రజా భాగస్వామ్యం, అవగాహన పెంపు ఎంతో అవసరం. పరీక్షలు, చికిత్సపై ఉన్న భయాన్ని తొలగించి, ప్రజల్లో సరైన అవగాహన పెంచేందుకు ఇది దోహదపడుతుంది. సంస్థాగత సహకారం, ప్రజల సమీకరణ ద్వారా టీబీ ముక్త్ భారత్‌ను సాకారం చేయాలని ఈ ప్రచారం లక్ష్యంగా పెట్టుకుంది.

 

టీబీ, దాని లక్షణాలు

క్షయవ్యాధి అంటే ఏమిటి?

మైకోబ్యాక్టీరియం ట్యూబర్‌క్యులోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల క్షయవ్యాధి (టీబీ) వస్తుంది. సాధారణంగా ఇది ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది. మెదడు, మూత్రపిండాలు, వెన్నెముక వంటి ఇతర శరీర భాగాలకు కూడా ఈ వ్యాధి సోకవచ్చు.

 ఈ బ్యాక్టీరియా సోకిన కొందరు అనారోగ్యానికి గురవుతారు. మరికొందరిలో ఎలాంటి అనారోగ్య లక్షణాలూ కనిపించవు. క్రియారహిత టీబీ లేదా గుప్త టీబీ ఇన్‌ఫెక్షన్ కూడా ఉండవచ్చు. క్రియాశీల టీబీ ఉన్నవారిలా క్రియారహిత టీబీ బాధితులు ఇతరులకు వ్యాధిని వ్యాప్తి చేయకపోవచ్చు. అయితే, వారిలో ఎప్పుడైనా క్రియాశీల టీబీ మొదలై అనారోగ్యానికి దారితీయవచ్చు. శిశువులు, చిన్నారులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఇన్‌ఫెక్షన్ సోకినప్పుడు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సరైన చికిత్స లేకపోతే క్రియాశీల టీబీ ప్రాణాంతకంగా మారవచ్చు.

 

టీబీ లక్షణాలు

క్రియాశీల టీబీ లక్షణాలు సాధారణంగా బ్యాక్టీరియా ప్రభావిత శరీర భాగాన్ని బట్టి మారుతాయి. అయితే అన్ని రకాల టీబీలోనూ కొన్ని సాధారణ లక్షణాలు కనిపిస్తాయి.

 క్రియాశీల టీబీ లేదా లక్షణాలతో కూడిన టీబీ ఉన్నవారు ఇతరులకు బ్యాక్టీరియాను వ్యాప్తి చేయవచ్చు. వారు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు లేదా మాట్లాడినప్పుడు బ్యాక్టీరియాతో కూడిన సూక్ష్మ తుంపర్లు గాలిలోకి చేరతాయి. ముఖ్యంగా గాలి సరిగా ప్రసరించని ప్రదేశాల్లో సమీపంలో ఉన్నవారు వాటిని పీల్చుకోవడం ద్వారా వ్యాధి బారినపడే ప్రమాదం ఉంటుంది.

క్షయవ్యాధి గాలి ద్వారా వ్యాపించినప్పటికీ, కింది చర్యల ద్వారా సోకదు:

- కరచాలనం చేయడం

- ప్రజా మరుగుదొడ్లను ఉపయోగించడం

- ఆహారం, పాత్రలను పంచుకోవడం

- సాధారణ సామాజిక సంబంధాలు

ఊపిరితిత్తుల టీబీ బాధితులు తగిన మందులు కనీసం రెండు వారాలు తీసుకున్న తర్వాత సాధారణంగా ఇతరులకు వ్యాధిని వ్యాప్తి చేసే స్థితి నుంచి బయటపడతారు. ఊపిరితిత్తులు కాకుండా ఇతర శరీర భాగాల్లో టీబీ ఉన్నవారు సాధారణంగా ఇతరులకు వ్యాధిని వ్యాప్తి చేయరు.

 

లక్షణాలు కనిపిస్తే ఏం చేయాలి?

జాతీయ టీబీ నిర్మూలన కార్యక్రమం దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, అనేక ప్రైవేటు వైద్య కేంద్రాల్లో ఉచిత పరీక్షలు, చికిత్స సేవలను అందిస్తోంది. మీలో లేదా మీకు తెలిసిన వారిలో టీబీ లక్షణాలు కనిపిస్తే:

- సూచనల కోసం నిక్షయ్ సంపర్క్ టీబీ, హెపటైటిస్ టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ 1800-11-6666కు ఫోన్ చేయండి. సమీప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించండి. ప్రభుత్వ కార్యక్రమాల కింద టీబీ నిర్ధారణ, చికిత్సను ఉచితంగా అందిస్తారు.

- లక్షణాలు, సమీప ఆరోగ్య కేంద్రాల సమాచారం కోసం ఆండ్రాయిడ్ ఫోన్‌లో టీబీ ఆరోగ్య సాథీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. టీబీ పరీక్షలు, చికిత్స అందించే సమీప కేంద్రాలను గుర్తించేందుకు ఈ యాప్ సహాయపడుతుంది. మందుల దుష్ప్రభావాలు, టీబీ బాధితులకు అవసరమైన పోషకాహారంపై కూడా సూచనలు అందిస్తుంది.

 

భారత్‌లో టీబీ నిర్మూలనకు వ్యూహాత్మక ప్రణాళిక

ప్రతి ఒక్కరికీ ఆరోగ్యకరమైన జీవితం, శ్రేయస్సు కల్పించాలనే సుస్థిర అభివృద్ధి లక్ష్యం-3కు అనుగుణంగా క్షయవ్యాధి నిర్మూలనకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. 2020 జూన్‌లో ప్రకటించిన ‘భారత్‌లో టీబీ నిర్మూలనకు జాతీయ వ్యూహాత్మక ప్రణాళిక 2020–25’ నాలుగు స్తంభాల ఆధారంగా పనిచేస్తుంది. అవి వ్యవస్థ నిర్మాణం, నివారణ, గుర్తింపు, చికిత్స. ముందస్తు నిర్ధారణ, వ్యాధి వ్యాప్తి తగ్గింపు, తగిన మందులు, చికిత్స విధానాలతో బాధితులకు వైద్యం, రోగులకు సహాయక వ్యవస్థల ఏర్పాటు ఈ ప్రణాళికలో ప్రధాన అంశాలు.

 

జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమం

భారత ప్రభుత్వం 2020లో సవరించిన జాతీయ క్షయవ్యాధి నియంత్రణ కార్యక్రమం (ఆర్‌ఎన్‌టీసీపీ) పేరును జాతీయ టీబీ నిర్మూలన కార్యక్రమం (ఎన్‌టీఈపీ)గా మార్చింది. ప్రపంచం నిర్దేశించుకున్న 2030 లక్ష్యానికి ముందే క్షయవ్యాధిని నిర్మూలించాలనే భారత్ సంకల్పానికి ఈ మార్పు ప్రతీకగా నిలుస్తోంది. గుర్తింపు–చికిత్స–నివారణ–వ్యవస్థ నిర్మాణం అనే జాతీయ వ్యూహాత్మక ప్రణాళిక నాలుగు స్తంభాల ఆధారంగా ఎన్‌టీఈపీ పనిచేస్తుంది. ఈ కార్యక్రమంలోని ముఖ్య కార్యకలాపాలు:

- నాణ్యమైన పరీక్షల ద్వారా టీబీ బాధితులను ముందుగానే గుర్తించడం, బలహీన వర్గాల్లో గుర్తించని కేసులను వెలికితీసేందుకు ప్రజల వద్దకే వెళ్లి పరీక్షలు నిర్వహించడం.

- ఔషధ నిరోధక టీబీతో సహా అన్ని రకాల టీబీకి నాణ్యత ప్రమాణాలు పాటించే మందులు, చికిత్స విధానాలతో సత్వర వైద్యం అందించడం.

- ప్రైవేటు రంగంలో వైద్యం పొందుతున్న రోగులను కార్యక్రమంలో భాగస్వాములను చేయడం.

- ప్రత్యక్ష ప్రయోజన బదిలీ, నిక్షయ్ మిత్ర కార్యక్రమం ద్వారా రోగి కేంద్రిత చికిత్స సహాయం, పోషకాహార మద్దతు అందించడం.

- బాధితులతో సన్నిహితంగా మెలిగిన కుటుంబ సభ్యులు, చిన్నారులు, హెచ్‌ఐవీతో జీవిస్తున్నవారు, అధిక ముప్పు లేదా బలహీన వర్గాలకు చెందినవారిని గుర్తించి టీబీ నివారణ చికిత్స అందించడం.

- గాలి ద్వారా వ్యాపించే ఇన్‌ఫెక్షన్ల నియంత్రణ చర్యలు చేపట్టడం.

- వ్యాధికి దారితీసే సామాజిక కారణాలను పరిష్కరించేందుకు వివిధ రంగాల సమన్వయంతో స్పందించడం.

ఎన్‌టీఈపీ కింద ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోంది.

 

ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్

జాతీయ టీబీ నిర్మూలన కార్యక్రమంలో మరో కీలక భాగంగా ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్‌ను 2022 సెప్టెంబర్ 9న ప్రారంభించారు. అన్ని వర్గాల ప్రజలను ప్ర‌జా ఉద్య‌మంగా ఏకం చేసి, టీబీ నిర్మూలన దిశగా దేశ పురోగతిని వేగవంతం చేయడం ఈ కార్యక్రమ లక్ష్యం. ముఖ్య ఉద్దేశాలు:

- మెరుగైన చికిత్స ఫలితాల కోసం టీబీ బాధితులకు అదనపు సహాయం అందించడం

- ప్రజా భాగస్వామ్యాన్ని పెంచడం

- కార్పొరేట్ సామాజిక బాధ్యతను వినియోగించుకోవడం

 

నిక్షయ్ పోషణ్ యోజన, నిక్షయ్ మిత్ర కార్యక్రమం

చికిత్స మందుల దుష్ప్రభావాలను ఎదుర్కొనేందుకు టీబీ బాధితులు అధిక ప్రొటీన్లు కలిగిన ఆహారం తీసుకోవాలి. 2018లో ప్రారంభించిన నిక్షయ్ పోషణ్ యోజన కింద నమోదైన ప్రతి టీబీ బాధితుడికి నెలకు ₹1,000 ఆర్థిక సహాయం అందిస్తున్నారు. 2018 ఏప్రిల్‌లో ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి 1.38 కోట్ల మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి ₹4,454.68 కోట్లను నేరుగా జమ చేశారు.

 టీబీ చికిత్స కనీసం ఆరు నెలలు, కొన్ని సందర్భాల్లో అంతకంటే ఎక్కువ కాలం కొనసాగుతుంది. ఈ చికిత్స కాలంలో బాధితులకు సహాయం అందించే వ్యక్తే నిక్షయ్ మిత్ర లేదా ‘టీబీ మిత్ర’. వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు, మతపరమైన లేదా సామాజిక బృందాలు, ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రముఖులు నిక్షయ్ మిత్రలుగా స్వచ్ఛంద సేవలు అందించవచ్చు.

 రోగుల సొంత ఖర్చులను తగ్గించేందుకు టీబీ మిత్రలు క్రమం తప్పకుండా ఆహార బుట్టలను అందిస్తారు. బాధితులను తరచుగా సంప్రదిస్తూ మానసిక, సామాజిక సహాయం చేయవచ్చు. వ్యాధి నుంచి కోలుకున్న తర్వాత జీవితాన్ని తిరిగి నిర్మించుకునేందుకు ఉపాధిపరమైన సహకారం కూడా అందించవచ్చు.

2025 నవంబర్ 12 నాటికి:

- నిక్షయ్ మిత్రలుగా చేరిన 6,77,541 మంది వ్యక్తులు, సంస్థలు టీబీ బాధితులకు 45 లక్షలకుపైగా ఆహార బుట్టలను పంపిణీ చేశాయి.

- 2 లక్షలకుపైగా మై భారత్ వాలంటీర్లు నిక్షయ్ మిత్రలుగా సేవలందించేందుకు ముందుకొచ్చారు. యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ చేపట్టిన మై భారత్ కార్యక్రమం 15–29 ఏళ్ల యువతను వివిధ ప్రభుత్వ విభాగాలు, ప్రైవేటు సంస్థలు, పౌర సమాజ భాగస్వామ్యాలతో అనుసంధానిస్తుంది. వాస్తవ జీవిత సవాళ్లు, సమస్యలకు పరిష్కారాలు కనుగొనేందుకు ఈ అనుసంధానం ఉపయోగపడుతుంది.

 

100 రోజుల టీబీ ముక్త్ భారత్ అభియాన్

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ 2024 డిసెంబర్ 7న దేశంలో అత్యంత విస్తృతంగా చేపట్టిన టీబీ నిర్మూలన కార్యక్రమాల్లో ఒకటైన 100 రోజుల టీబీ ముక్త్ భారత్ అభియాన్‌ను ప్రారంభించింది. 33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని అధిక ప్రాధాన్యం కలిగిన 347 జిల్లాల్లో ఈ కార్యక్రమం చేపట్టారు. టీబీని ముందుగానే గుర్తించేందుకు వ్యాధి ముప్పు ఉన్న ప్రాంతాలు, వర్గాలను గుర్తించి, అధిక ముప్పు కలిగిన ప్రజలకు పద్ధతి ప్రకారం పరీక్షలు నిర్వహించారు. ఈ జనాందోళన్‌లో 30 వేలకుపైగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు, 24 సంబంధిత మంత్రిత్వ శాఖలు, నిక్షయ్ మిత్రలు చురుగ్గా పాల్గొన్నారు. సమాజంలోని అన్ని వర్గాలు, ప్రభుత్వంలోని అన్ని విభాగాల సమన్వయ విధానాన్ని ఇది ప్రతిబింబించింది. టీబీ ముక్త్ భారత్ అభియాన్ వ్యూహాలను ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని జిల్లాలకు విస్తరించారు.

 2026 జూన్ నాటికి ముమ్మర ప్రచారం కీలక మైలురాళ్లను అధిగమించింది. 28.1 కోట్లకుపైగా ప్రజలకు పరీక్షలు నిర్వహించారు. 20 లక్షల మందికి టీబీ నివారణ చికిత్స అందించారు. కొత్తగా 5.7 లక్షల మంది నిక్షయ్ మిత్రలు చేరారు.

2026 మార్చిలో ప్రారంభమైన రెండో దశలో అధిక ముప్పు కలిగిన 1.2 లక్షల గ్రామాలు, వార్డుల్లో 1.7 లక్షలకుపైగా ఆయుష్మాన్ ఆరోగ్య శిబిరాలు నిర్వహించారు. 32 లక్షల మంది విద్యార్థులు, 1.9 లక్షల మంది మై భారత్ వాలంటీర్లు చురుగ్గా పాల్గొన్నారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ కింద చికిత్స విజయశాతం 90 శాతానికి చేరి, 88 శాతంగా ఉన్న ప్రపంచ సగటును అధిగమించింది.

 

కొత్త కార్యక్రమాలు

ఔషధ నిరోధక టీబీ బాధితుల కోసం తక్కువ వ్యవధితో కూడిన, సురక్షితమైన, అత్యంత ప్రభావవంతమైన బీపీఏఎల్‌ఎం చికిత్స విధానాన్ని కార్యక్రమంలో ప్రవేశపెట్టారు. ఇందులో బెడాక్విలిన్, ప్రిటోమనిడ్, లైనెజోలిడ్, మోక్సిఫ్లోక్సాసిన్ మందులు ఉంటాయి. దీని ద్వారా చికిత్స కాలం ఆరు నెలలకు తగ్గుతుంది. ఇప్పటికే 15 వేలకుపైగా ఎండీఆర్/ఆర్‌ఆర్-టీబీ బాధితులకు ఈ చికిత్సను ప్రారంభించారు.

 

టీబీ నివారణ చికిత్స: వ్యాధిని నయం చేయడం ఎంత ముఖ్యమో నివారించడం కూడా అంతే ముఖ్యమని గుర్తిస్తూ, టీబీ ఇన్‌ఫెక్షన్ క్రియాశీల వ్యాధిగా మారకుండా అర్హులైన వారికి టీబీ నివారణ చికిత్స (టీపీటీ) అందిస్తున్నారు. లక్ష్య నిర్దేశిత, వినూత్న విధానాల ద్వారా బాధితుల కుటుంబ సభ్యులు, హెచ్‌ఐవీతో జీవిస్తున్నవారికి టీపీటీ అందిస్తూ కార్యక్రమం రక్షణ కల్పిస్తోంది. చురుకైన, విస్తృత కేసుల గుర్తింపు ప్రచారాలతో ఈ చర్యను అనుసంధానించి, ఇతర బలహీన వర్గాలకు కూడా విస్తరించారు.

 

ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు

విస్తృత ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా పనిచేసే ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ప్రజలందరికీ అందుబాటు ధరల్లో సమగ్ర వైద్య సేవలను అందించే సామాజిక ఆరోగ్య కేంద్రాలు. 2026 అక్టోబర్ 13 నాటికి భారత్‌లో 1,87,250 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ఉన్నాయి. వీటిలో ఉప ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆయుష్ కేంద్రాలు, పట్టణ ఆరోగ్య, వెల్‌నెస్ కేంద్రాలు ఉన్నాయి. ఆయుష్ పరిధిలో ఆయుర్వేదం, యోగా, ప్రకృతి వైద్యం, యునాని, సిద్ధ, హోమియోపతి వైద్య విధానాలు ఉన్నాయి. టీబీ లక్షణాలు కనిపించినవారు ఈ కేంద్రాలకు వెళ్లి పరీక్షలు చేయించుకోవచ్చు.

 హిమాచల్‌ప్రదేశ్‌లోని కులూ జిల్లా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంలో మహిళలకు టీబీ, ఇతర వ్యాధుల పరీక్షలు నిర్వహిస్తున్న ఆరోగ్య సిబ్బంది(2025 సెప్టెంబర్ 20), కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ.

 

సాంకేతిక మౌలిక సదుపాయాలు

టీబీని ముందుగానే గుర్తించి చికిత్స అందించేందుకు దేశంలో 9,800కుపైగా వేగవంతమైన మాలిక్యులర్ పరీక్ష కేంద్రాలు, 107 కల్చర్, ఔషధ సున్నితత్వ పరీక్ష ప్రయోగశాలలు ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద పరీక్షల నెట్‌వర్క్‌గా ఇది నిలిచింది. ఇతర సాంకేతిక సాధనాలు:

- ప్రజల వద్దకే వెళ్లి పరీక్షలు నిర్వహించేందుకు ఏఐ సదుపాయం కలిగిన 500కుపైగా చేతితో మోసుకెళ్లగల ఛాతీ ఎక్స్‌రే యూనిట్లు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మరో 1,500 యూనిట్లను సరఫరా చేస్తున్నారు.

- పోషకాహార సహాయాన్ని ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ద్వారా అందించేందుకు నిక్షయ్ డిజిటల్ వేదిక తోడ్పడుతోంది.

- దేశవ్యాప్తంగా చేతితో మోసుకెళ్లగల ఎక్స్‌రే యూనిట్లను భారీగా వినియోగించడంతో ఎక్స్‌రే పరీక్షలు 34 రెట్లు పెరిగాయి.

- టీబీ ముక్త్ భారత్ యాప్, ‘ఖుషి’ చాట్‌బాట్: పురోగతిని తెలుసుకోవడం, లక్షణాలపై ప్రజలకు సూచనలు ఇవ్వడం, సమీప పరీక్ష కేంద్రాలను గుర్తించడం కోసం ఏఐ ఆధారిత చాట్‌బాట్‌తో అనుసంధానించిన డిజిటల్ వేదికను కొత్తగా ప్రారంభించారు.

- సామర్థ్యాల పెంపు: జాతీయ ఆరోగ్య మిషన్ కింద రేడియోగ్రాఫర్ పోస్టులను మంత్రిత్వ శాఖ పెంచింది. ట్రూనాట్, సీబీనాట్ పరీక్ష యంత్రాల సంఖ్యను కూడా విస్తరించింది.

 

మారుమూల కశ్మీర్‌లో టీబీ కేసుల గుర్తింపు

హిమాలయాల్లో 2,400 మీటర్ల ఎత్తున ఉన్న బందిపొరా జిల్లా గురేజ్ లోయ శీతాకాలంలో ఇతర ప్రాంతాలతో సంబంధాలు కోల్పోతుంది. ఈ మారుమూల ప్రాంతంలో ఎన్‌టీఈపీ కశ్మీర్ బృందం విస్తృత టీబీ పరీక్షల కార్యక్రమాన్ని చేపట్టింది. అధునాతన పరీక్ష యంత్రాలు, పోర్టబుల్ ఎక్స్‌రే పరికరాలతో కూడిన మొబైల్ పరీక్ష వాహనాలను ఉపయోగించి మూడు రోజుల్లో 1,250 మందికి పరీక్షలు నిర్వహించింది. తదుపరి పరీక్షలు అవసరమైన 250కుపైగా అనుమానిత టీబీ కేసులను గుర్తించింది. భారత సైన్యం, స్థానిక ఆరోగ్య సిబ్బంది, గ్రామ ప్రతినిధులు, మత పెద్దలతో అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించింది. 2025 నాటికి ‘క్షయ రహిత కశ్మీర్’ లక్ష్యాన్ని సాధించాలనే జమ్మూ కశ్మీర్ నిబద్ధతకు ఈ కృషి నిదర్శనం.

 

ఏఐ ఆధారిత కార్యక్రమాలు

ఆరోగ్య సేవల్లో సాంకేతికతను అనుసంధానించి, వైద్య సేవలను వేగంగా ప్రజలకు చేరువ చేసేందుకు ప్రభుత్వం కృత్రిమ మేధ వ్యవస్థలను ఉపయోగిస్తోంది. టీబీ గుర్తింపు, నిర్ధారణ, చికిత్సలో అమలు చేస్తున్న కార్యక్రమాలు:

ఆరోగ్య అంశం

ఏఐ పరిష్కారం/కార్యక్రమం

ప్రక్రియ, సాంకేతికత

చికిత్స అనుభవం, వైద్య/నిర్వహణ ప్రభావం

టీబీ పరీక్షలు

కాఫ్ అగైనెస్ట్ టీబీ–క్యాట్‌బీ

శబ్ద ఆధారిత ఏఐ: స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా రోగి దగ్గును మూడు సెకన్లపాటు రికార్డు చేసి, టీబీని సూచించే ధ్వని తరంగాల నమూనాలను విశ్లేషిస్తుంది.

1.62 లక్షలకుపైగా మందికి పరీక్షలు నిర్వహించారు. సంప్రదాయ పద్ధతులతో పోలిస్తే 12–16 శాతం అదనపు కేసులను గుర్తించారు.

టీబీ నిర్వహణ

ప్రతికూల ఫలితాల అంచనా

అంచనా విశ్లేషణ: చికిత్స విఫలమయ్యే ముప్పు ఎక్కువగా ఉన్న రోగులను ఏఐ గుర్తిస్తుంది. అనంతరం వారికి అవసరమైన చికిత్సను ప్రారంభిస్తారు.

దేశవ్యాప్త అమలు తర్వాత ప్రతికూల ఫలితాలు 27 శాతం తగ్గినట్లు నివేదికలు తెలిపాయి.

టీబీ ప్రాథమిక నిర్ధారణ

డీప్‌సీఎక్స్‌ఆర్–ఛాతీ ఎక్స్‌రే

రేడియాలజీ ఏఐ: అనుమానిత టీబీ కేసుల్లో గడ్డలు లేదా ఊపిరితిత్తుల కుహరాలను గుర్తించేందుకు డిజిటల్ ఎక్స్‌రేలను స్వయంచాలకంగా విశ్లేషిస్తుంది.

8 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు చేస్తున్నారు. నిపుణుల కొరతను అధిగమించేందుకు ప్రభుత్వానికి ఉచితంగా అందుబాటులో ఉంచారు.

టీబీ నిర్మూలన దిశగా భారత్

భారత్‌లో టీబీ కేసులు స్థిరంగా తగ్గుతుండటం నిరంతర నిబద్ధత, ప్రజా భాగస్వామ్యం, బలమైన ప్రజారోగ్య కార్యక్రమాలు స్పష్టమైన మార్పును తీసుకురాగలవని చాటుతోంది. నిరంతర అప్రమత్తత, వైద్య సేవల విస్తరణ, సమష్టి బాధ్యతతో క్షయ రహిత భారత్ కేవలం లక్ష్యంగానే కాకుండా, సాధించగల వాస్తవంగా మారే భవిష్యత్తుకు దేశం చేరువవుతోంది. టీబీపై అవగాహన పెంచడం, వ్యాధి నిర్మూలన కోసం ప్రజలను సమీకరించడం జోష్ సామాజిక మాధ్యమ ప్రచార ప్రధాన లక్ష్యం. అన్ని స్థాయుల్లోని ఆరోగ్య సంస్థలు, యువత, ప్రజలను భాగస్వాములను చేసే ఈ కార్యక్రమాల ద్వారా విస్తృతంగా వ్యాపించే ప్రమాదకర వ్యాధిని నిర్మూలించేందుకు భారత్ సన్నద్ధమవుతోంది. తద్వారా వికసిత భారత్-2047 నిర్మాణానికి మార్గం సుగమం చేస్తోంది.

References

Ministry of Health and Family Welfare

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2189415

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2275402&reg=1&lang=1

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2114549

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1808582

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2184456

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2081662

https://mohfw.gov.in/?q=en/basicpage-

https://tbcindia.mohfw.gov.in/national-strategic-plan-to-end-tb-in-india-2020-25/

https://dghs.mohfw.gov.in/national-tuberculosis-elimination-programme.php

https://tbcindia.mohfw.gov.in/concept-note/

https://aam.mohfw.gov.in/

https://tbcindia.mohfw.gov.in/wp-content/uploads/2024/10/TB-Report_for-Web_08_10-2024-1.pdf

https://mohfw.gov.in/?q=/press-info/7783

https://www.mohfw.gov.in/?q=en/pressrelease-217

https://tbcindia.mohfw.gov.in/wp-content/uploads/2023/05/4193711960Social-action-plan-2013-Final-7th-Jan-14.pdf

https://tbcindia.mohfw.gov.in/wp-content/uploads/2023/05/4773363959TOG-Chapter-1-Introduction.pdf

PIB Backgrounder

        https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2244661&reg=3&lang=1

Click to see pdf

***

(Explainer ID: 160482) आगंतुक पटल : 51
Provide suggestions / comments
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Assamese , Bengali , Kannada , Malayalam