Technology
భారత్‌లో అడిటివ్ మానుఫ్యాక్చరింగ్
తదుపరి తరం డిజిటల్ తయారీతో భారతదేశ భవిష్యత్తు నిర్మాణం
Posted On:
07 OCT 2026 12:14PM
డిజిటల్ ఫైల్ తయారీ ప్రక్రియను నియంత్రించే త్రీడీ ప్రింటింగ్ సాంకేతికత అడిటివ్ మాన్యుఫ్యాక్చరింగ్ (ఏఎం) ద్వారా డిజిటల్ విప్లవంలో భారత్ పోటీదారుగా ఎదుగుతోంది. భారత్‌లో ఏఎం వ్యవస్థ నిర్మాణానికి 2022లో నేషనల్ స్ట్రాటజీ ఫర్ అడిటివ్ మానుఫ్యాక్చరింగ్ (ఎన్ఎస్ఏఎం) ప్రవేశపెట్టారు. ఈ వ్యూహం కింద ఇప్పటివరకు 1,54,000 మందికి పైగా శిక్షణ ఇచ్చి, 56 ఏఎం అంకుర సంస్థలకు మద్దతు అందించారు. ప్రస్తుతం ఎన్ఎస్ఏఎం 2.0 దశకు ఈ వ్యూహం అడుగుపెడుతోంది. ఎన్ఎస్ఏఎం 1.0 కంటే మరింత భారీ మార్కెట్‌ను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఆత్మనిర్భర్ భారత్, వికసిత భారత్ నిర్మాణంలో ఏఎంను కీలక పునాదిగా తీర్చిదిద్దుతోంది.
కొత్త వేగం అందుకుంటున్న భారత సాంకేతిక ప్రస్థానం
గత దశాబ్దంలో భారత్ కేవలం సాంకేతికతను ఉపయోగించే దేశం నుంచి దాన్ని అభివృద్ధి చేసే దేశంగా మారింది. దేశ జనాభా స్థాయిలో డిజిటల్ వ్యవస్థలను భారత్ ఎలా నిర్మించగలదో డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు ఇప్పటికే ప్రపంచానికి చూపించాయి. ఇప్పుడు అదే విశ్వాసం డిజిటల్ ప్రపంచం నుంచి భౌతిక ప్రపంచానికి విస్తరిస్తోంది. వస్తువులను భారత్ రూపొందించే, నిర్మించే, తయారు చేసే విధానంలోకి ప్రవేశిస్తోంది. ఇక్కడే అడిటివ్ తయారీ కీలకంగా మారుతుంది. డిజిటల్ డిజైన్లను నిశ్శబ్దంగా వాస్తవ భౌతిక వస్తువులుగా మారుస్తున్న సరికొత్త సాంకేతికత, ఆవిష్కరణ ఇది.
భారత్ తయారీ ప్రస్థానంలో సరికొత్త ఇంజినీరింగ్ రంగాల్లో ఒకటిగా అడిటివ్ తయారీ ఎదుగుతోంది. ప్రపంచ ఏఎం యంత్రాల మార్కెట్ 2035 నాటికి 149 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుతుందని అంచనా. ఏఎం–ఎలక్ట్రానిక్స్ సరఫరా వ్యవస్థ 18 బిలియన్ డాలర్ల నుంచి 112 బిలియన్ డాలర్లకు పెరిగే అవకాశం ఉంది. పాలిమర్లు, లోహాలు, మిశ్రమ పదార్థాలు, సిరామిక్స్, సెమీకండక్టర్ స్థాయి సామగ్రితో పనిచేసే ఏఎం వేదికల తయారీలో పోటీ సామర్థ్యం కలిగిన దేశంగా ఎదిగేందుకు భారత్‌కు ఇది నిజమైన అవకాశాన్ని అందిస్తోంది.
సృజనాత్మక మేధస్సు.. విజ్ఞానానికి ప్రేరణ.. సాంకేతికతలకు సాధికారత

భారత్ ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కాన్‌క్లేవ్ రెండో విడత ‘ఎస్టిక్–2026’ను 2026 అక్టోబర్ 27 నుంచి 29 వరకు నిర్వహించనున్నారు. ‘సృజనాత్మక మేధస్సు, విజ్ఞానానికి ప్రేరణ, సాంకేతికతలకు సాధికారత’ అనే ఇతివృత్తంతో న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసర్చ్ (సీఎస్‌ఐఆర్) నిర్వహించే ఎస్టిక్–2026 వర్ధమాన శాస్త్ర, సాంకేతిక రంగాలను ముందుకు తీసుకెళ్తుంది. విస్తృత మార్పులు తీసుకురాగల సంకలన తయారీ, ఇతర వర్ధమాన సాంకేతికతలు ఇందులో భాగంగా ఉంటాయి. ఈ సదస్సు వ్యూహాత్మక సహకారాలకు ఊతమిస్తూ వికసిత భారత్–2047 దార్శనికతకు మద్దతు ఇస్తుంది. 12 ఇతివృత్త రంగాలతో నిర్వహించే ఈ కార్యక్రమంలో సమగ్ర సమావేశాలు, సాంకేతిక చర్చలు, ప్రదర్శనలు ఉంటాయి.
అడిటివ్ తయారీ సాంకేతికత అంటే..
ఏఎం మరో సాధారణ తయారీ సాధనం మాత్రమే కాదు. వస్తువును నిర్మించేందుకు అవసరమైన సామగ్రిని పొరలవారీగా అమర్చే ప్రక్రియను, కొన్ని సందర్భాల్లో దాని కూర్పును కూడా డిజిటల్ ఫైల్ పూర్తిగా నియంత్రించే డిజిటల్ ఇంజినీరింగ్ విధానం ఇది. కంప్యూటింగ్, ఎలక్ట్రానిక్స్, డిజైన్ సాఫ్ట్‌వేర్, మెటీరియల్ సైన్స్‌ను ఇది ఒకే వేదికపైకి తీసుకొస్తుంది. ప్రతి ఏఎం వస్తువు డిజిటల్ ఫైల్‌తోనే మొదలవుతుంది. అందువల్ల కంప్యూటర్ ఆధారిత డిజైన్ (క్యాడ్), కృత్రిమ మేధ, నమూనాల గుర్తింపు వంటి సాధనాలతో ఈ సాంకేతికతకు సన్నిహిత సంబంధం ఉంది. ఒక పదార్థాన్ని కోసి వస్తువును రూపొందించడానికి బదులుగా పొరలవారీగా నిర్మించడం అనే సరళమైన, శక్తిమంతమైన ఆలోచనపై ఏఎం పనిచేస్తుంది. డిజిటల్ డిజైన్ దశలవారీగా భౌతిక వస్తువుగా మారే విధానం ఇలా ఉంటుంది:

- వర్చువల్ డిజైన్: క్యాడ్ (కంప్యూటర్ ఆధారిత డిజైన్) ఫైల్‌లో రూపొందించిన డిజిటల్ నమూనాతో ఈ ప్రక్రియ మొదలవుతుంది. దీన్ని మొదటి నుంచి రూపొందించవచ్చు. త్రీడీ స్కానర్‌తో సేకరించవచ్చు. ప్రస్తుతం మొబైల్ ఫోన్ చిత్రాల ఆధారంగా ఏఐ సాయంతో కూడా తయారు చేయవచ్చు.
- ఎస్‌టీఎల్ ఫైల్: ఎస్‌టీఎల్ (స్టాండర్డ్ టెసలేషన్ లాంగ్వేజ్) ఫైల్ త్రిభుజాకార ఉపరితలాల సమాహారంగా త్రీడీ నమూనాను సూచిస్తుంది. ఏఎం కోసం నమూనాలను సిద్ధం చేయడంలో సాధారణంగా ఉపయోగించే ఫైల్ ఫార్మాట్లలో ఇది ఒకటి. ఏ వస్తువును నిర్మించాలో ఈ ఫైల్ యంత్రానికి నిర్దేశిస్తుంది.
- స్లైసింగ్: స్లైసింగ్ సాఫ్ట్‌వేర్ డిజిటల్ నమూనాను వందలు లేదా వేల సంఖ్యలో అడ్డ పొరలుగా విభజిస్తుంది. ఆ తర్వాత పొరలవారీగా ఎలా ముద్రించాలో యంత్రానికి సూచిస్తుంది.
- ప్రింటింగ్: పొరలుగా విభజించిన ఫైల్‌ను ఏఎం యంత్రంలోకి పంపిస్తారు. యంత్రం ప్రతి పొరకు సంబంధించిన సమాచారాన్ని చదివి దశలవారీగా వస్తువును నిర్మిస్తుంది.
- అడిటివ్ ప్రక్రియ: వస్తువు తుది ఆకారం పొందే వరకు వరుసగా సామగ్రి పొరలను అమర్చడం ద్వారా ఏఎం వస్తువును నిర్మిస్తారు. సామగ్రి అమరిక, కూర్పు నియంత్రణలో డిజిటల్ తయారీ సాంకేతికత అత్యంత కచ్చితత్వాన్ని సాధించింది. డిజిటల్ సూచనలు లేకపోతే ముద్రణ ప్రక్రియ వస్తువును సరిగ్గా నిర్మించలేదు. ప్రస్తుతం మార్కెట్, పరిశోధన, అభివృద్ధి దశల్లో 40కి పైగా ఇటువంటి ప్రక్రియలు ఉన్నాయి.
- తుది వస్తువు: ప్రింటర్ వరుస సామగ్రి పొరలను కలిపి ఒక సంపూర్ణ త్రిమితీయ వస్తువుగా రూపొందిస్తుంది. ముద్రణ పూర్తయిన తర్వాత మార్కెట్‌కు అనువుగా తీర్చిదిద్దేందుకు తదుపరి శుద్ధి ప్రక్రియ చేపడతారు.
అడిటివ్ తయారీలో ఉపయోగించే పదార్థాలు
విస్తృత అప్లికేషన్లలో కింది పదార్థాల విభాగాలు అడిటివ్ తయారీలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాయి.
- థర్మోప్లాస్టిక్స్: అడిటివ్ తయారీలో అత్యధికంగా ఉపయోగించే పదార్థాల్లో థర్మోప్లాస్టిక్ పాలిమర్లు ప్రధానమైనవి. అక్రిలోనైట్రైల్ బ్యూటాడైన్ స్టైరిన్ (ఏబీఎస్), పాలీకార్బోనేట్ (పీసీ), పాలీలాక్టిక్ యాసిడ్ (పీఎల్ఏ) వివిధ అవసరాలకు ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తాయి. నీటిలో కరిగే పాలీవినైల్ ఆల్కహాల్‌ను (పీవీఏ) సాధారణంగా తాత్కాలిక సహాయక నిర్మాణాల తయారీకి ఉపయోగిస్తారు. తర్వాత వాటిని కరిగించి తొలగిస్తారు.
- లోహాలు: అడిటివ్ తయారీలో బంగారం, వెండి వంటి విలువైన లోహాల నుంచి స్టెయిన్‌లెస్ స్టీల్, టైటానియం వంటి వ్యూహాత్మక లోహాల వరకు వివిధ లోహాలు, మిశ్రమాలను ఉపయోగిస్తారు.
- సిరామిక్స్: జిర్కోనియా, అల్యూమినా, ట్రైకాల్షియం ఫాస్ఫేట్ వంటి అనేక రకాల సిరామిక్స్‌ను అడిటివ్ తయారీలో ఉపయోగిస్తారు. పొడి గాజు, అతికించే పదార్థాన్ని ప్రత్యామ్నాయ పొరలుగా అమర్చి వేడి చేయడం ద్వారా పూర్తిగా కొత్త తరహా గాజు ఉత్పత్తులను కూడా అభివృద్ధి చేస్తారు.
- జీవ పదార్థాలు: కొత్త ఎముక పెరుగుతున్నప్పుడు ఎముక నిర్మాణాలకు మద్దతు ఇచ్చేందుకు సిలికాన్, కాల్షియం ఫాస్ఫేట్, జింక్ వంటి గట్టి పదార్థాలను ఏఎం అప్లికేషన్లలో ఉపయోగిస్తారు. రక్తనాళాలు, మూత్రాశయాలు, ఇతర మానవ అవయవాలను రూపొందించేందుకు మూలకణాలతో తయారు చేసిన బయో–ఇంక్‌లపై పరిశోధకులు అధ్యయనం చేస్తున్నారు. జీవ పదార్థాలు, సజీవ కణాలను ఉపయోగించి కాలేయ కణజాలం, మూత్రపిండాలు, గుండె వంటి మానవ అవయవాలను కూడా త్రీడీ ప్రింటింగ్ ద్వారా రూపొందిస్తున్నారు.
భారత ఆర్థిక వ్యవస్థలో కీలక రంగాలకు కొత్త రూపు
ఏఎం ఇప్పుడు ప్రయోగశాలలు, నమూనాలకే పరిమితం కాదు. ప్రభుత్వం, ప్రైవేటు సంస్థల మద్దతుతో క్షేత్రస్థాయిలో అమలవుతున్న ప్రాజెక్టుల ద్వారా భారత ఆర్థిక వ్యవస్థ, వ్యూహాత్మక రంగాల్లో ఇప్పటికే వినియోగంలోకి వస్తోంది.
అంతరిక్షం, వైమానిక రంగం
తక్కువ బరువుతో కూడిన పరికరాలను వేగంగా నిర్మించేందుకు భారత్ అంతరిక్ష కార్యక్రమం అడిటివ్ తయారీని స్వీకరిస్తోంది. ఐఐటీ మద్రాస్‌లో ఏర్పాటైన అంకుర సంస్థ అగ్నికుల్ కాస్మోస్ 2024 మేలో ‘అగ్నిబాణ్–సార్టెడ్’ను ప్రయోగించింది. ఇందులో ఒకే భాగంగా ఏఎం ద్వారా ముద్రించిన సెమీ–క్రయోజెనిక్ రాకెట్ ఇంజిన్‌ను ఉపయోగించారు. సంక్లిష్టమైన ఇంజిన్ డిజైన్లను రూపొందించడంతోపాటు దేశీయంగా అంతరిక్ష పరికరాలను వేగంగా అభివృద్ధి చేసేందుకు సంకలన తయారీ ఎలా తోడ్పడగలదో ఈ ప్రయోగం నిరూపించింది. ఏఎం సాయంతో కీలక ఇంజిన్ భాగాలను అభివృద్ధి చేయడంపై పరిశోధన చేస్తున్న ఇటువంటి అంకుర సంస్థలకు ఎన్ఎస్ఏఎం మద్దతు ఇస్తోంది.
రక్షణ
వేగంగా, విపత్తులను తట్టుకునే నిర్మాణాల కోసం సాయుధ దళాలు ఏఎం వైపు మొగ్గు చూపుతున్నాయి. కేవలం 12 వారాల్లో నిర్మించిన తొలి ఏఎం ముద్రిత రెండంతస్తుల నివాస భవనాన్ని భారత సైన్యం అహ్మదాబాద్‌లో ప్రారంభించింది. ఆ తర్వాత లద్దాఖ్ వంటి కార్యాచరణ ప్రాంతాల్లో ముందుగా తయారు చేసే రక్షణ నిర్మాణాలకు కూడా ఈ సాంకేతికతను విస్తరించింది. నిర్వహణ, మరమ్మతు, పునరుద్ధరణ (ఎంఆర్ఓ) అవసరాలకు వర్క్‌షాప్ స్థాయి సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు మూడు రక్షణ దళాలకూ ఎన్ఎస్ఏఎం మద్దతు అందిస్తోంది.

ఆరోగ్య సంరక్షణ
దిగుమతి చేసుకునే వైద్య సాంకేతికతలకు దేశీయ ప్రత్యామ్నాయాలను ఏఎం ద్వారా భారత్ అభివృద్ధి చేస్తోంది. ఏఎం ఆధారిత వైద్య పరికరాల తయారీకి ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (మెయిటీ) మద్దతు అందించింది. ఎన్ఎస్ఏఎం కింద సహజ పట్టు ఆధారిత ఇంప్లాంట్లను ఏఎం ద్వారా తయారు చేస్తున్న ఆస్టియోఫోర్జ్ వంటి అంకుర సంస్థలకు కూడా సహాయం చేస్తోంది. దేశీయ బయోసిరామిక్ పదార్థాలతో త్రీడీ ప్రింటింగ్ ద్వారా తయారు చేసే ఎముక గ్రాఫ్ట్‌లకు సాంకేతిక అభివృద్ధి మండలి మద్దతు ఇస్తోంది. రోగి ప్రత్యేక అవసరాలు, శరీర నిర్మాణానికి అనుగుణంగా ఈ సాంకేతికతతో గ్రాఫ్ట్‌లను తయారు చేయవచ్చు. దిగుమతులను తగ్గించి, దేశీయ వైద్య పరికరాల తయారీని బలోపేతం చేయడంతోపాటు వ్యక్తిగత అవసరాలకు అనువైన ఆరోగ్య సంరక్షణకు ఇది మద్దతు ఇస్తుంది.
ఎలక్ట్రానిక్స్
ఎలక్ట్రానిక్స్ స్థాయి తయారీలో దేశీయ సామర్థ్యాన్ని భారత్‌లోని ఏఎం కేంద్రాల నెట్‌వర్క్ నిర్మిస్తోంది. బ్యాటరీలు, యాంటెన్నాలు, వేరిస్టర్లు, కెపాసిటర్లు సహా అనేక ఎలక్ట్రానిక్ భాగాలను ఏఎం ద్వారా ముద్రించవచ్చని ఎన్ఎస్ఏఎం విజయవంతంగా ప్రదర్శించింది. ప్రపంచంలోనే తొలిసారిగా ఏఎం ముద్రణ ద్వారా ఫోటోనిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ బ్లాక్‌లను భారత విజ్ఞాన సంస్థ (ఐఐఎస్‌సీ) రూపొందించింది.
నిర్మాణ రంగం
వేగవంతమైన, మరింత సుస్థిర నిర్మాణానికి త్రీడీ ప్రింటింగ్‌ను సాధ్యమైన పరిష్కారంగా భారత్ పరిశీలిస్తోంది. నిర్మాణ ప్రాంతంలోనే పనిచేసే ‘కెల్విన్ 6కే ప్రో’ త్రీడీ నిర్మాణ ప్రింటర్ తక్కువ కర్బన ఉద్గారాలు కలిగిన జియోపాలిమర్ పదార్థంతో 2,500 చదరపు అడుగుల ఇళ్లను 30 రోజులలోపు నిర్మించగల సామర్థ్యాన్ని ప్రదర్శించింది. సామగ్రి, రవాణా వ్యయాన్ని తగ్గించి, కర్బన ఉద్గారాలను నియంత్రించడంతోపాటు నిర్మాణ సామర్థ్యాన్ని మెరుగుపరిచే అవకాశం ఈ సాంకేతికతకు ఉంది. సిమెంట్ ఆధారిత నిర్మాణంతో పోలిస్తే సామగ్రి, రవాణా వ్యయాన్ని 30 శాతం వరకు, ఉద్గారాలను 90 శాతం వరకు తగ్గించే అవకాశం ఉందని తొలి అప్లికేషన్లు సూచిస్తున్నాయి.
పెరుగుతున్న ఈ వేగం వెనుక ప్రభుత్వ స్పష్టమైన ప్రోత్సాహం ఉంది. గత కొన్నేళ్లలో కేంద్ర ప్రభుత్వం విడివిడి ప్రయోగాత్మక ప్రాజెక్టుల నుంచి సంకలన తయారీ కోసం వ్యవస్థీకృత మిషన్ విధానానికి మారింది. ప్రత్యేక నిధులు, సంస్థలు, జాతీయ వ్యూహం దీనికి మద్దతు ఇస్తున్నాయి. సౌరశక్తి నిల్వ కోసం కాంక్రీట్ ఆధారిత సూపర్ కెపాసిటర్లను ఎన్ఎస్ఏఎం ప్రస్తుతం అభివృద్ధి చేస్తోంది.
ప్రభుత్వ విధాన కార్యక్రమాలు: భారత ఏఎం వ్యవస్థ నిర్మాణం

ఏఎంను వ్యూహాత్మక, తదుపరి తరం తయారీ సాంకేతికతగా గుర్తించిన భారత ప్రభుత్వం వ్యవస్థీకృత జాతీయ వాతావరణాన్ని నిర్మిస్తోంది. జాతీయ సంకలన తయారీ వ్యూహం (ఎన్ఎస్ఏఎం) ఈ ప్రయత్నానికి ప్రధాన ఆధారం. విస్తరిస్తున్న జాతీయ వేదికలు, సంస్థలు, కార్యక్రమాలు ఈ వ్యవస్థను బలోపేతం చేస్తున్నాయి.
నేషనల్ స్ట్రాటజీ ఫర్ అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ (ఎన్ఎస్ఏఎం)
ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ 2022 ఫిబ్రవరిలో నేషనల్ స్ట్రాటజీ ఫర్ అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ (ఎన్ఎస్ఏఎం) విడుదల చేసింది. త్రీడీ ప్రింటింగ్, సంకలన తయారీకి సంబంధించిన భారత్ మార్గదర్శక విధాన చట్రంగా ఎన్ఎస్ఏఎం పనిచేస్తోంది. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్‌కు అనుగుణంగా స్పష్టమైన, కాలపరిమితి కలిగిన జాతీయ లక్ష్యాలను ఈ వ్యూహం నిర్దేశించింది. కేంద్రం, రాష్ట్రాలు, పరిశ్రమలు, విద్యా సంస్థల సహకారంతో ఈ లక్ష్యాలను సాధించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
ప్రపంచ అడిటివ్ తయారీ మార్కెట్‌లో 5 శాతం వాటా సాధించి, భారత్ స్థూల దేశీయోత్పత్తికి దాదాపు ఒక బిలియన్ అమెరికన్ డాలర్లను జోడించాలని జాతీయ వ్యూహం లక్ష్యంగా పెట్టుకుంది. సామగ్రి, యంత్రాలు, ప్రక్రియలు, సాఫ్ట్‌వేర్ రంగాల్లో భారత్ అవసరాలకు అనుగుణమైన 50 సంకలన తయారీ సాంకేతికతలను అభివృద్ధి చేయాలని కూడా నిర్దేశించింది.

కొత్తగా 100 అడిటివ్ తయారీ అంకుర సంస్థలను ప్రోత్సహించి, 500 ఉత్పత్తులను అభివృద్ధి చేయాలని వ్యూహం లక్ష్యంగా పెట్టుకుంది. అడిటివ్ తయారీ రంగానికి లక్ష మంది నైపుణ్యం కలిగిన కార్మికులకు శిక్షణ ఇవ్వాలని కూడా భావిస్తోంది. ఇప్పటికే ఉన్న, కొత్తగా ఎదుగుతున్న పది తయారీ రంగాల్లో సంకలన తయారీ సామర్థ్యాలను నిర్మించడం మరో లక్ష్యం.
ఈ లక్ష్యాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ఏడు ప్రత్యేక అభివృద్ధి, వినియోగ కేంద్రాలను ఏర్పాటు చేసింది. పరిశోధన & అభివృద్ధి, నైపుణ్య శిక్షణ, సాంకేతికతపై ప్రత్యక్ష అనుభవానికి ఈ కేంద్రాలు మద్దతు ఇస్తాయి.
మీకు తెలుసా?

అటల్ టింకరింగ్ ల్యాబ్స్ (ఏటీఎల్‌లు) ద్వారా పాఠశాల స్థాయిలోనే త్రీడీ ప్రింటింగ్ నైపుణ్యాలను భారత ప్రభుత్వం పెంపొందిస్తోంది. త్రీడీ ప్రింటర్లు, రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) సహా స్వయంగా తయారు చేసుకునే కిట్లతో 1,200–1,500 చదరపు అడుగుల ప్రత్యేక ఆవిష్కరణల కార్యస్థలాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతి ప్రయోగశాలకు ₹20 లక్షల గ్రాంటు అందుతుంది. ఆరో తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు చిన్న వయసులోనే సంకలన తయారీపై ప్రత్యక్ష అనుభవం లభిస్తోంది. తద్వారా తరగతి గది నుంచే భారత్ భవిష్యత్ ఏఎం నిపుణులను తీర్చిదిద్దుతున్నారు.
ఎన్ఎస్ఏఎం కింద పురోగతి
ప్రారంభించి నాలుగేళ్లు దాటిన తర్వాత జాతీయ అడిటివ్ తయారీ వ్యూహం స్థిరమైన, కొలవగల పురోగతి సాధించింది. నైపుణ్యాభివృద్ధి, ఔత్సాహికత, సాంకేతిక అభివృద్ధి, వివిధ రంగాల్లో అనువర్తనాల ద్వారా ప్రభుత్వ మద్దతు పొందిన కార్యక్రమాలు భారత్ అడిటివ్ తయారీ వ్యవస్థను బలోపేతం చేశాయి.
అడిటివ్ తయారీకి సంబంధించిన నైపుణ్యాల్లో 1,54,000 మందికి పైగా శిక్షణ పొందారు. దీంతో నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి క్రమంగా విస్తరిస్తోంది. 56 అడిటివ్ తయారీ అంకుర సంస్థలకు కూడా మద్దతు లభించింది. తద్వారా భారత్ ఆవిష్కరణ, ఔత్సాహిక పునాది మరింత బలపడింది. జాతీయ కేంద్రాల నెట్‌వర్క్ ద్వారా సామగ్రి, యంత్రాలు, అడిటివ్ తయారీ కోసం డిజైన్ (డీఎఫ్ఏఎం), ముద్రిత ఉత్పత్తులకు సంబంధించిన భారత్ ప్రత్యేక 65 సాంకేతికతలను అభివృద్ధి చేశారు. వైమానిక రంగం, వైద్య పరికరాలు, ఎలక్ట్రానిక్స్, ఇంధనం, ఆహార శుద్ధి, ఫోటోనిక్స్ రంగాల్లో ఉత్పత్తులు, నమూనాల అభివృద్ధికి ఈ సామర్థ్యాలు తోడ్పడుతున్నాయి.
ఎన్ఎస్ఏఎం 2.0
ఏఎం మార్కెట్ వృద్ధిని వేగవంతం చేయాలన్న భారత్ ఆకాంక్షకు మద్దతు ఇచ్చేలా ఎన్ఎస్ఏఎం 2.0కు రూపకల్పన చేస్తున్నారు. మేధోసంపత్తి హక్కుల సృష్టిని వేగవంతం చేయడం, డిజిటల్ అనుసంధానం ద్వారా ఏఎం నెట్‌వర్క్‌ను విస్తరించడం, వాణిజ్య వినియోగానికి ప్రపంచ స్థాయి పోటీ సామర్థ్యం కలిగిన అడిటివ్ తయారీ సాంకేతికతలను అభివృద్ధి చేయడం తదుపరి దశ ప్రణాళికలో ఉన్నాయి. క్లస్టర్ల ద్వారా యంత్రాలు, సామగ్రిని చౌకగా అందుబాటులోకి తీసుకురావడంతోపాటు సంకలన తయారీ ఎలక్ట్రానిక్స్ విలువ గొలుసును బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
అడిటివ్ తయారీ అంకుర సంస్థల పునాదిని విస్తరించడం, భారత రక్షణ రంగానికి విస్తృత మద్దతు అందించడం, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల ఆధారిత ప్రయోగాత్మక కార్యక్రమాలను ప్రోత్సహించేందుకు ఎన్ఎస్ఏఎం 2.0 ప్రణాళిక రూపొందిస్తోంది. ప్రమాణాలు, సంయుక్త పరిశోధన, సాంకేతిక భాగస్వామ్యాల ద్వారా అంతర్జాతీయ సహకారాన్ని మరింత పెంచాలని ప్రతిపాదిస్తోంది. ఈ ప్రాధాన్యాలు భారత్ సాంకేతిక సామర్థ్యాలను బలోపేతం చేసి ఆర్థిక, పారిశ్రామిక, సామాజిక అనువర్తనాల్లో సంకలన తయారీని ప్రధాన స్రవంతిలోకి తీసుకురాగలవు.
జాతీయ అడిటివ్ తయారీ సదస్సు
జాతీయ అడిటివ్ తయారీ సదస్సు (ఎన్ఏఎంఎస్) భారత్ ఏఎం వ్యవస్థను ముందుకు తీసుకెళ్లే జాతీయ వేదిక. విధాన రూపకర్తలు, శాస్త్రవేత్తలు, పరిశ్రమలు, అంకుర సంస్థలు, విద్యా సంస్థలు, ఇతర ఏఎం భాగస్వాములను ఒకే వేదికపైకి తీసుకొస్తుంది. విధానాలు, పరిశోధన, ఆవిష్కరణ, పరిశ్రమల మధ్య సమన్వయ పురోగతిని ఈ వేదిక ప్రోత్సహిస్తుంది.
రెండో ఎన్ఏఎంఎస్ సదస్సును కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ 2026 మార్చి 13న న్యూఢిల్లీలో నిర్వహించింది. భారత్ ఏఎం వ్యవస్థలో సహకారాన్ని ఎన్ఏఎంఎస్–2026 బలోపేతం చేసింది. వ్యవస్థ భాగస్వామ్యాలను మరింత విస్తరించేందుకు అవగాహన ఒప్పందాలను పరస్పరం మార్చుకున్నారు. కొత్త ఏఎం ఉత్పత్తులను కూడా ప్రారంభించారు. ఎన్ఎస్ఏఎం 2.0, రక్షణ రంగంలో వినియోగం, పరిశ్రమల దృక్పథాలు, కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ మద్దతు గల పరిశోధన & అభివృద్ధి కేంద్రాలపై చర్చా కార్యక్రమాలు నిర్వహించారు. ఏఎం అనువర్తనాలపై వివిధ మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయాన్ని కూడా ఈ సదస్సు మరింత పటిష్ఠం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమలు, ప్రముఖ పరిశోధనా సంస్థలు ఈ వేదికను మరింత బలోపేతం చేశాయి. భారత ఆర్థిక వ్యవస్థలోని విభిన్న రంగాల్లో ఏఎం ప్రాధాన్యం పెరుగుతున్నట్లు ఈ ప్రయత్నాలు తెలియజేస్తున్నాయి.
వికసిత భారత్ దిశగా
భారత్ పరిశోధన ప్రయోగశాలల నుంచి కర్మాగారాలు, రక్షణ సంస్థలు, ఆసుపత్రుల వరకు ఏఎం క్రమంగా విస్తరిస్తోంది. ప్రభుత్వం నిర్దిష్టంగా రూపొందించిన విధానాల మద్దతుతో దేశీయ తయారీని బలోపేతం చేస్తూ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తోంది. దేశీయ సాంకేతిక సామర్థ్యాల పెంపు ద్వారా ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతకు కూడా మద్దతు ఇస్తోంది. అడిటివ్ తయారీ వ్యవస్థను భారత్ విస్తరిస్తున్న కొద్దీ నైపుణ్య ఉపాధి అవకాశాలు పెరిగి, సాంకేతిక పునాది మరింత బలపడుతోంది. డిజిటల్ ఉత్పత్తి, అధునాతన ఆటోమేషన్, వికేంద్రీకృత, సౌకర్యవంతమైన తయారీ ద్వారా పరిశ్రమ 5.0కు కూడా ఈ సాంకేతికత మద్దతు ఇస్తుంది. వనరుల సమర్థ వినియోగం, స్థానిక ఉత్పత్తి, సుస్థిర పరిష్కారాల ద్వారా సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు దీని అప్లికేషన్లు మరింత దోహదపడగలవు. ఈ ప్రయత్నాలన్నీ వికసిత భారత్ దిశగా దేశ ప్రయాణంలో ఏఎంను వర్ధమాన సహాయక రంగంగా నిలుపుతున్నాయి.
References:
NCAM
Atal Innovation Mission
Ministry of Electronics & IT
NIST
Others
Additive Manufacturing in India
***
(Explainer ID: 160350)
आगंतुक पटल : 5
Provide suggestions / comments