Technology

విస్తరిస్తున్న భారత సూపర్‌కంప్యూటింగ్ వ్యవస్థ

Posted On: 04 OCT 2026 5:53PM

భారత సూపర్‌కంప్యూటింగ్ ప్రస్థానం 1990ల మొద‌ట్లో పరమ్ 8000 నుంచి ప్రారంభ‌మై, 2015లో ప్రారంభించిన నేషనల్ సూపర్‌కంప్యూటింగ్ మిషన్ (ఎన్‌ఎస్‌ఎం) కింద జాతీయ స్థాయి వ్యవస్థగా ఎదిగింది. 2026 సెప్టెంబర్ నాటికి మొత్తం 68 పీఎఫ్ సామర్థ్యంతో పనిచేస్తున్న 40 సూపర్‌కంప్యూటర్ల ద్వారా ఎన్‌ఎస్‌ఎం అధిక సామర్థ్య కంప్యూటింగ్ (హెచ్‌పీసీ) అందుబాటును విస్తరిస్తోంది. కంప్యూటేషనల్ బయాలజీ, వాతావరణ అంచనా, వాతావరణ నమూనాల రూపకల్పన, విపత్తుల నిర్వహణ, భారీ డేటా విశ్లేషణ, ఖగోళ భౌతికశాస్త్రంలో అనువర్తనాలకు మద్దతు ఇస్తూనే, ఈ మిషన్ స్వదేశీ సర్వర్లు, సాఫ్ట్‌వేర్, శీతలీకరణ, నెట్‌వర్కింగ్ సాంకేతికతలను కూడా అభివృద్ధి చేసింది.



భారత సూపర్‌కంప్యూటింగ్ సామర్థ్యాల నిర్మాణం
పంట దిగుబడులను అంచనా వేయడం, వ్యాధుల వ్యాప్తిని గుర్తించడం నుంచి ఔషధాల ఆవిష్కరణను వేగవంతం చేయడం, నదీ వరదల వల్ల ప్రభావితమయ్యే ప్రాంతాలను అంచనా వేయడం వరకు అధిక సామర్థ్య కంప్యూటింగ్ రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసే సామాజిక అనువర్తనాలకు తోడ్పడుతోంది. భారీ డేటా సమాహారాలను ప్రాసెస్ చేయడంలో, వాతావరణం, అంతరిక్షం, ఆరోగ్య సంరక్షణ, ఇంజినీరింగ్ రంగాల్లో సంక్లిష్ట అనుకరణలను నిర్వహించడంలో ఈ వ్యవస్థలు సహాయపడతాయి. వేగవంతమైన విశ్లేషణకు వీలు కల్పించి, మరింత సంక్లిష్టమవుతున్న శాస్త్రీయ సవాళ్లను పరిష్కరించేందుకు పరిశోధకులకు తోడ్పడతాయి. శాస్త్రీయ ఆవిష్కరణలు, సాంకేతిక నవకల్పనలను వేగవంతం చేయడానికి అధిక సామర్థ్య కంప్యూటింగ్ అత్యవసరంగా మారుతోంది.


 


సంక్లిష్ట గణనలను అసాధారణ వేగంతో ప్రాసెస్ చేసేందుకు రూపొందించిన అధిక సామర్థ్య కంప్యూటింగ్ వ్యవస్థలే సూపర్‌కంప్యూటర్లు. అనేక గణనలను ఒకేసారి నిర్వహించేందుకు ఇవి పెద్ద సంఖ్యలో ప్రాసెసర్లను సమన్వయం చేస్తాయి. దీంతో పరిశోధకులు భారీ డేటా సమాహారాలను సమర్థంగా విశ్లేషించగలరు, అధునాతన అనుకరణలను నిర్వహించగలరు. అందువల్ల సూపర్‌కంప్యూటర్లు అధునాతన శాస్త్రీయ పరిశోధన, వ్యూహాత్మక అనువర్తనాలకు కీలకమైన మౌలిక సదుపాయాలను అందిస్తాయి.

 



భారతదేశంలో విస్తరిస్తున్న డిజిటల్ వ్యవస్థ అధునాతన కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలకు డిమాండ్‌ను పెంచుతోంది. ప్రపంచ డేటాలో దాదాపు 20% భారతదేశంలోనే ఉత్పత్తవుతోంది. కృత్రిమ మేధస్సు, వాతావరణ అంచనా, అంతరిక్ష పరిశోధన వంటి అనువర్తనాలకు గణనీయమైన కంప్యూటింగ్ సామర్థ్యాలు అవసరం. అందుకే ప్రభుత్వం పరిశోధన సంస్థల్లో సూపర్‌కంప్యూటింగ్ అందుబాటును విస్తరిస్తోంది. ఈ కృషి స్వదేశీ సామర్థ్యాలను బలోపేతం చేస్తూ, ఆత్మనిర్భర్ భారత్ దృక్పథానికి తోడ్పడుతోంది.

సృజనాత్మక మేధస్సు, శాస్త్ర పురోగతికి ప్రేరణ, సాంకేతికతలకు సాధికారత
భారత ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కాన్‌క్లేవ్ రెండో విడ‌త‌ ఎస్టిక్-2026ను 2026 అక్టోబర్ 27–29 తేదీల్లో నిర్వహిస్తారు. “సృజనాత్మక మేధస్సు, శాస్త్ర పురోగతికి ప్రేరణ, సాంకేతికతలకు సాధికారత” ఇతివృత్తంతో న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్‌ఐఆర్) నిర్వహించే ఎస్టిక్-2026 అభివృద్ధి చెందుతున్న శాస్త్ర, సాంకేతిక రంగాలను ముందుకు తీసుకెళ్తుంది. వీటిలో సూపర్‌కంప్యూటింగ్, ఇతర నూతన సాంకేతికతలు ఉన్నాయి. ఈ సదస్సు వ్యూహాత్మక సహకారాలకు ఊతమిచ్చి, వికసిత్ భారత్ 2047 దృక్పథానికి తోడ్పడుతుంది. 12 ఇతివృత్త రంగాలతో కూడిన ఈ కార్యక్రమంలో ప్రధాన సమావేశాలు, సాంకేతిక చర్చలు, ప్రదర్శనలు ఉంటాయి.

నేషనల్ సూపర్‌కంప్యూటింగ్ మిషన్ వెనుక వ్యూహం
దేశ కంప్యూటింగ్ సామర్థ్యాలను బలోపేతం చేసేందుకు భారత్ 2015 ఏప్రిల్‌లో నేషనల్ సూపర్‌కంప్యూటింగ్ మిషన్‌ను (ఎన్‌ఎస్‌ఎం) ప్రారంభించింది. సుమారు ₹4,500 కోట్ల వ్యయ కేటాయింపుతో ఈ మిషన్ ప్రారంభమైంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డీఎస్‌టీ), మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మెయిటీ) సంయుక్తంగా దీనికి దిశానిర్దేశం చేస్తున్నాయి.

సూపర్‌కంప్యూటింగ్‌లో స్వావలంబన సాధించడం, భారత అధిక సామర్థ్య కంప్యూటింగ్ సామర్థ్యాలను బలోపేతం చేయడం ఈ మిషన్ లక్ష్యాలు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పరిశోధన, అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి సూపర్‌కంప్యూటింగ్ వినియోగాన్ని ఇది ప్రోత్సహిస్తుంది. సామాజిక అవసరాలకు ఉపయోగపడే పరిష్కారాల అభివృద్ధికి కూడా మద్దతు ఇస్తుంది. అంతర్జాతీయంగా పోటీపడగల సూపర్‌కంప్యూటింగ్ వ్యవస్థను భారతదేశంలో నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకుంది.

పుణెలోని సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీ-డాక్), బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ) ఈ మిషన్‌ను అమలు చేస్తున్నాయి. స్వదేశీ సూపర్‌కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలను సృష్టించేందుకు ఎన్‌ఎస్‌ఎం ‘నిర్మాణ విధానం’ అనుసరిస్తోంది. ఇందులో అసెంబ్లింగ్, తయారీ, రూపకల్పనతోపాటు తయారీకి మద్దతు అనే మూడు దశలు సమాంతరంగా కొనసాగుతాయి. కంప్యూటింగ్ మౌలిక సదుపాయాల విస్తరణను స్వదేశీ సామర్థ్యాల అభివృద్ధితో ఈ విధానం సమన్వయం చేస్తుంది.

సూపర్‌కంప్యూటర్ల గురించి ఆసక్తికర విషయాలు
* సాధారణ కంప్యూటర్లకు భిన్నంగా, అత్యంత వేగంతో భారీ పరిమాణంలో డేటాను ప్రాసెస్ చేసేందుకు సూపర్‌కంప్యూటర్లను రూపొందిస్తారు. ఒకేసారి కలిసి పనిచేసే అనేక ప్రాసెసర్లు లేదా కంప్యూటింగ్ నోడ్‌లను ఇవి ఉపయోగిస్తాయి. దీంతో సంప్రదాయ కంప్యూటర్ల కంటే ఎంతో వేగంగా సంక్లిష్ట సమస్యలను పరిష్కరించగలవు. ఈ నోడ్‌ల మధ్య ఉండే వేగవంతమైన అనుసంధానాలు భారీ స్థాయి కంప్యుటేష‌న్ల‌ సమయంలో డేటాను సమర్థంగా పరస్పరం పంపుకునేందుకు వీలు కల్పిస్తాయి.
* సూపర్‌కంప్యూటింగ్‌లో సమాంతర ప్రాసెసింగ్‌ను ఉపయోగించవచ్చు కాబట్టి సూపర్‌కంప్యూటర్లను కొన్నిసార్లు సమాంతర కంప్యూటర్లు అని కూడా పిలుస్తారు. ఒక నిర్దిష్ట సమయంలో ఒకే గణనను పరిష్కరించేందుకు అనేక సీపీయూలు కలిసి పనిచేయడమే సమాంతర ప్రాసెసింగ్.
* సూపర్‌కంప్యూటర్ సామర్థ్యాన్ని ఫ్లాప్స్‌లో (ఫ్లోటింగ్ పాయింట్ ఆపరేషన్స్ పర్ సెకండ్) కొలుస్తారు. ఒక సెకనులో అది ఎన్ని గణనలు నిర్వహించగలదో ఇది తెలియజేస్తుంది. ఒక టెరాఫ్లాప్స్ (టీఎఫ్) అంటే సెకనుకు ఒక ట్రిలియన్, అంటే లక్ష కోట్ల గణనలు. ఒక పెటాఫ్లాప్స్ (పీఎఫ్) అంటే సెకనుకు ఒక క్వాడ్రిలియన్, అంటే వెయ్యి లక్షల కోట్ల కాల్‌కులేష‌న్లు.
* 2026లో ప్రపంచంలో అత్యంత వేగవంతమైన సూపర్‌కంప్యూటర్ సుమారు 2.19 ఎక్సాఫ్లాప్స్ సామర్థ్యాన్ని సాధిస్తోంది. ఇది సెకనుకు సుమారు 2.19 క్వింటిలియన్ కాల్‌కులేష‌న్లు నిర్వహించగలదు.

మిషన్ ప్రస్తుత స్థితి
సూపర్‌కంప్యూటింగ్‌లో స్వావలంబన సాధించడంపై దృష్టి సారిస్తూ ఎన్‌ఎస్‌ఎం కింద భారత్ ఒక సమగ్ర వ్యవస్థను ఏర్పాటు చేసింది. సూపర్‌కంప్యూటర్ల రూపకల్పన, అభివృద్ధి, తయారీ, సిస్టమ్ సాఫ్ట్‌వేర్, ప్రత్యేక అనువర్తనాలు ఇందులో ఉన్నాయి. పెరుగుతున్న ఈ స్వదేశీ సామర్థ్యం దిగుమతి సాంకేతికతలపై ఆధారపడటాన్ని తగ్గించగలదు. భారత దేశీయ అధిక సామర్థ్య కంప్యూటింగ్ వ్యవస్థను కూడా బలోపేతం చేస్తుంది.

 



దేశవ్యాప్తంగా వివిధ విద్యా, పరిశోధన సంస్థల్లో మొత్తం 123 పీఎఫ్‌కు మించిన సామర్థ్యంతో 50 సూపర్‌కంప్యూటర్లను ఏర్పాటు చేయాలని ఎన్‌ఎస్‌ఎం ప్రణాళిక రూపొందించింది. ప్రాసెసింగ్ సామర్థ్యాల ఆధారంగా ఈ వ్యవస్థలు వివిధ రకాల గణన అవసరాలను తీరుస్తాయి.

పరమ్ శ్రేణి పరిణామం
సీ-డాక్ అభివృద్ధి చేసి, 1991లో ఆవిష్కరించిన పరమ్ 8000 ఒక గిగాఫ్లాప్ వేగంతో స్వదేశీ సూపర్‌కంప్యూటింగ్‌లో భారత ప్రవేశానికి నాంది పలికింది. ఇది పరమ్ శ్రేణికి పునాది వేసింది. అధిక గణన సామర్థ్యం అవసరమయ్యే అనువర్తనాలకు మద్దతు ఇస్తూ, 54 టెరాఫ్లాప్స్ సామర్థ్యం కలిగిన పరమ్ యువ వంటి మరింత శక్తిమంతమైన వ్యవస్థలతో ఈ శ్రేణి అభివృద్ధి చెందింది. వాయుమండల పరిస్థితులను అంచనా వేసే వాతావరణ సూచన, ద్రవాల ప్రవాహాన్ని అధ్యయనం చేసే కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ తదితర అనువర్తనాలకు ఇది తోడ్పడింది. అనంతరం ఈ శ్రేణి దేశీయ పరిశోధనతోపాటు విదేశాల్లో ఏర్పాటు చేసేందుకు కూడా భారత సూపర్‌కంప్యూటింగ్ సామర్థ్యాలను విస్తరించింది.

విస్తరిస్తున్న కంప్యూటింగ్ సామర్థ్యం
2026 సెప్టెంబర్ నాటికి భారత్ మొత్తం 68 పీఎఫ్ సామర్థ్యంతో 40 సూపర్‌కంప్యూటర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. వీటిలో 1 పీఎఫ్‌కు మించిన సామర్థ్యం కలిగిన 13 అత్యున్నత స్థాయి వ్యవస్థలు ఉన్నాయి. అదనంగా, 500 టీఎఫ్ నుంచి 1 పీఎఫ్ మధ్య సామర్థ్యం కలిగిన 12 మధ్యస్థాయి వ్యవస్థలు ఉన్నాయి. మరో 15 వ్యవస్థల సామర్థ్యం 500 టీఎఫ్ కంటే తక్కువగా ఉంది. ఈ యంత్రాలను దేశీయంగా నిర్మించి, దేశవ్యాప్తంగా వినియోగంలోకి తీసుకువచ్చారు. మౌలిక సదుపాయాలు, అనువర్తనాలు, పరిశోధన, అభివృద్ధి, మానవ వనరుల అభివృద్ధిని ఈ మిషన్ నిరంతరం ముందుకు తీసుకెళ్తోంది.

సుస్థిర అభివృద్ధికి సూపర్‌కంప్యూటింగ్
జాతీయ అభివృద్ధికి సంబంధించిన రంగాల్లో అధునాతన కంప్యూటింగ్‌ను ఉపయోగించడం ద్వారా ఎన్‌ఎస్‌ఎం యునైటెడ్ నేషన్స్ నిర్దేశించిన 11 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు (ఎస్‌డీజీలు) తోడ్పడుతోంది. వరదల అంచనా, అడవి మంటల నిర్వహణ, వాతావరణ నమూనాల రూపకల్పన ద్వారా దీని అనువర్తనాలు వాతావరణ పరిరక్షణ చర్యలకు మద్దతు ఇస్తున్నాయి. హెచ్‌పీసీ శిక్షణ ద్వారా విద్య, నైపుణ్యాభివృద్ధిని బలోపేతం చేస్తున్నాయి. ఆవిష్కరణలు, స్వదేశీ సాంకేతికత, ఆర్థిక వృద్ధి, విద్యా సంస్థలు, పరిశ్రమలు, పరిశోధన సంస్థల మధ్య సహకారాన్ని కూడా ఈ మిషన్ ప్రోత్సహిస్తోంది.

ఎన్‌ఎస్‌ఎం కింద జాతీయ అవసరాలకు సూపర్‌కంప్యూటింగ్ అప్లికేష‌న్లు
ఎన్‌ఎస్‌ఎం కింద ఏర్పాటు చేసిన సూపర్‌కంప్యూటర్లు భారీ స్థాయి అప్లికేష‌న్లు, వేగవంతమైన డేటా ప్రాసెసింగ్‌కు మద్దతు ఇస్తున్నాయి. వివిధ రంగాల్లో జాతీయ అవసరాలకు ఉపయోగపడే అనువర్తనాలను సాధ్యం చేస్తున్నాయి.
1. జీనోమిక్స్, ఔషధ ఆవిష్కరణ వేదిక: ఔషధాలను గుర్తించేందుకు, పరీక్షించేందుకు తోడ్పడేలా ఇది భారీ అణు సమాహారాలను అధ్యయనం చేస్తుంది. కొవిడ్-19 సమయంలో ఇప్పటికే ఉన్న ఔషధాలను పరిశీలించేందుకు, గుండెకు సంబంధించిన ముప్పు వంటి దుష్ప్రభావాలను అంచనా వేసేందుకు కూడా దీనిని ఉపయోగించారు.
2. పట్టణ పర్యావరణ నిర్ణయ సహాయక వ్యవస్థ: వాతావరణం, వాయు కాలుష్యాన్ని పరిశీలించేందుకు ఇది వివరణాత్మక నమూనాలను ఉపయోగిస్తుంది. భారీ వర్షాలు, కాలుష్యాన్ని అంచనా వేస్తుంది. దీంతో నగరాలు ముందస్తుగా సిద్ధమై, నష్టాన్ని తగ్గించుకోవచ్చు.
3. సీస్మిక్ ఇమేజింగ్ సాధనాల సమాహారం: భూగర్భ నిర్మాణాలను చిత్రీకరించేందుకు అధునాతన అల్గారిథమ్‌లను ఉపయోగిస్తూ చమురు, సహజ వాయువు అన్వేషణను మెరుగుపరచడం దీని లక్ష్యం. దీని పనితీరు వాణిజ్య సీస్మిక్ ఇమేజింగ్ సాధనాలతో సమానంగా ఉంటుంది.
4. నదీ పరీవాహక ప్రాంతాల్లో వరదల అంచనాకు ముందస్తు హెచ్చరిక వ్యవస్థ: రెండు రోజుల ముందుగానే వరదలను అంచనా వేసేందుకు ఇది డేటా విశ్లేషణ, అంచనా నమూనాలను ఉపయోగిస్తుంది. ప్రజలు, మౌలిక సదుపాయాలను రక్షించేందుకు మహానది పరీవాహక ప్రాంతంలో దీనిని ఉపయోగిస్తున్నారు.
5. అడవి మంటల వ్యాప్తి నమూనా: అడవి మంటలు ఎలా వ్యాపిస్తాయో అంచనా వేసేందుకు ఉపగ్రహ రిమోట్ సెన్సింగ్‌ను గణన నమూనాలతో ఇది సమన్వయం చేస్తుంది. హెచ్‌పీసీ వ్యవస్థను ఉపయోగించి సిక్కిం హిమాలయాల వంటి ప్రాంతాల్లో దీనిని పరీక్షించారు.
6. మెటీరియ‌ల్ సైన్స్‌, కంప్యూటేషనల్ కెమిస్ట్రీ అప్లికేష‌న్లు: పరమాణువులు, అణువులు, మిశ్రమ లోహాల అనుకరణలను నిర్వహించేందుకు ఇవి సాధనాల సమాహారాన్ని అందిస్తాయి. వాటి ప్రవర్తనను అధ్యయనం చేసేందుకు ఇవి తోడ్పడతాయి.
భారతదేశంలో విస్తరిస్తున్న హెచ్‌పీసీ మౌలిక సదుపాయాలు పరిశోధనను ఎలా బలోపేతం చేస్తున్నాయో ఈ అనువర్తనాలు తెలియజేస్తున్నాయి. ఆధారాలతో నిర్ణయాలు తీసుకునేందుకు మద్దతు ఇస్తూ, ఆరోగ్యం, పర్యావరణం, ఇంధనం, అధునాతన శాస్త్ర రంగాల్లో సంక్లిష్ట సవాళ్లను పరిష్కరిస్తున్నాయి.

విజయాలు: ఎన్‌ఎస్‌ఎం కింద అభివృద్ధి చేసిన స్వదేశీ భాగాలు
సూపర్‌కంప్యూటింగ్‌లో స్వావలంబన సాధించాలనే స్పష్టమైన లక్ష్యంతో ఎన్‌ఎస్‌ఎం కింద సమగ్ర వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇతర అంశాలతోపాటు కీలక సూపర్‌కంప్యూటింగ్ ఉపభాగాల రూపకల్పన, అభివృద్ధి, తయారీ ఇందులో ఉన్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి:

 

1. రుద్ర సర్వర్ల శ్రేణి: ఇది సూపర్‌కంప్యూటింగ్‌లో కీలక భాగం. సంక్లిష్ట గణనలు, అనుకరణలు, కృత్రిమ మేధస్సు పనులను నిర్వహించేందుకు అవసరమైన ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని అందిస్తుంది. సీ-డాక్ దీనిని స్వదేశీయంగా రూపొందించి, అభివృద్ధి చేసింది. తయారీ కోసం ఈ సాంకేతికతను భారత ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ సర్వీసెస్ (ఈఎంఎస్) భాగస్వాములకు బదిలీ చేసింది.

పరమ్ రుద్ర శ్రేణి: స్వదేశీ సూపర్‌కంప్యూటింగ్‌లో ముందడుగు
స్వదేశీయంగా రూపొందించి, తయారు చేసిన రుద్ర సర్వర్లు, స్వదేశీ సిస్టమ్ సాఫ్ట్‌వేర్ సమాహారంతో నిర్మించిన పరమ్ రుద్ర సూపర్‌కంప్యూటర్ల అభివృద్ధి ఎన్‌ఎస్‌ఎంలో ఒక ప్రధాన మైలురాయిగా నిలిచింది. ఖగోళ శాస్త్రం, పదార్థ శాస్త్రం, పరమాణు భౌతికశాస్త్రం, భూ శాస్త్రాల్లో అధునాతన పరిశోధన వంటి విస్తృత అనువర్తనాలకు ఇవి మద్దతు ఇస్తాయి. 2026 సెప్టెంబర్ నాటికి పరమ్ రుద్ర సూపర్‌కంప్యూటర్లలో 6,000 రుద్ర సర్వర్లను ఏర్పాటు చేశారు. మరో 1,500 సర్వర్లు తయారీ దశలో ఉన్నాయి.

2. హైస్పీడ్ ఇంటర్‌కనెక్ట్ నెట్‌వర్క్: కంప్యూటర్ నోడ్‌ల మధ్య వేగవంతమైన సమాచార మార్పిడికి 100 జీబీపీఎస్, 200 జీబీపీఎస్ వేగాలతో నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేసి, పరీక్షించారు. ఇది కంప్యూటింగ్ నోడ్‌ల మధ్య డేటా బదిలీ, సమాచార మార్పిడిని మెరుగుపరుస్తూ భారత సూపర్‌కంప్యూటింగ్ సామర్థ్యాలను బలోపేతం చేస్తుంది.
3. స్వదేశీ శీతలీకరణ సాంకేతికత: శీతలీకరణ సాంకేతికతను స్వదేశీయంగా అభివృద్ధి చేసి, ప్రదర్శించారు. ప్రస్తుతం ఇది వినియోగంలోకి తీసుకువచ్చే దశలో ఉంది. అధిక సామర్థ్య కంప్యూటింగ్ వ్యవస్థల నిర్వహణ ఉష్ణోగ్రతను నియంత్రించేందుకు, విద్యుత్ వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచేందుకు ఇది ముఖ్యమైనది.
4. అధిక సామర్థ్య కంప్యూటింగ్ (హెచ్‌పీసీ) సిస్టమ్ సాఫ్ట్‌వేర్: సూపర్‌కంప్యూటింగ్ వ్యవస్థల సమర్థమైన పనితీరు, నిర్వహణకు తోడ్పడేందుకు పూర్తిస్థాయి హెచ్‌పీసీ సిస్టమ్ సాఫ్ట్‌వేర్ సమాహారాన్ని అభివృద్ధి చేసి, వాటితో అనుసంధానించారు.
5. పరమ్ శావక్: ఇది ఒకే పెట్టెలో అందుబాటులో ఉండే సూపర్‌కంప్యూటింగ్ వ్యవస్థ. ఇంజినీరింగ్ కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులు, పరిశోధకుల హెచ్‌పీసీ, కృత్రిమ మేధస్సు గణన అవసరాలను తీర్చేందుకు దీనిని భారతదేశంలోనే రూపొందించి, అభివృద్ధి చేసి, తయారు చేశారు.
6. జాతీయ అవసరాలకు హెచ్‌పీసీ  అప్లికేష‌న్లు: జీనోమిక్స్, ఔషధ ఆవిష్కరణ వంటి రంగాల్లో హెచ్‌పీసీ అనువర్తనాలను అభివృద్ధి చేసి, వినియోగంలోకి తీసుకువచ్చారు. ఇండియా మెటియరోలాజికల్ డిపార్ట్‌మెంట్ (ఐఎండీ), సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ), సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ), మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వంటి సంస్థలకు ఈ అనువర్తనాలు మద్దతు ఇస్తున్నాయి.

ప్రధాన కంప్యూటింగ్ మౌలిక సదుపాయాల నుంచి జాతీయ అవసరాలను తీర్చే అప్లికేష‌న్ల‌ వరకు, దేశంలోనే అధునాతన కంప్యూటింగ్ సాంకేతికతలను అభివృద్ధి చేసి, ఉపయోగించగల భారత సామర్థ్యాన్ని ఎన్‌ఎస్‌ఎం విస్తరిస్తోంది.

భారతదేశంలో అధిక సామర్థ్య కంప్యూటింగ్‌కు నైపుణ్యం కలిగిన మానవ వనరుల అభివృద్ధి
సూపర్‌కంప్యూటింగ్ మౌలిక సదుపాయాల అందుబాటు విస్తరిస్తున్న నేపథ్యంలో, ఈ వనరులను సమర్థంగా ఉపయోగించేందుకు అవసరమైన నైపుణ్యాలను కూడా ఎన్‌ఎస్‌ఎం అభివృద్ధి చేస్తోంది. 400కు పైగా సంస్థల్లో 2,900 మందికి పైగా పీహెచ్‌డీ పరిశోధకులతో సహా 16,000 మందికి పైగా పరిశోధకులకు ఎన్‌ఎస్‌ఎం మౌలిక సదుపాయాలు మద్దతు అందించాయి. 2026 సెప్టెంబర్ నాటికి ఈ వ్యవస్థలు 1.5 కోట్లకు పైగా గణన పనులను పూర్తి చేశాయి. సూపర్‌కంప్యూటర్‌కు అప్పగించే సంక్లిష్ట పని లేదా అనుకరణను గణన పని అంటారు. ఈ వ్యవస్థలు 1,990కి పైగా పరిశోధన ప్రచురణలకు తోడ్పడ్డాయి.

నైపుణ్యం కలిగిన వినియోగదారుల సంఖ్యను మరింత పెంచేందుకు ఈ మిషన్ వివిధ శిక్షణ, అభ్యాస కార్యక్రమాలను అభివృద్ధి చేసింది:
* హెచ్‌పీసీ, డీప్ లెర్నింగ్ అవగాహన కార్యక్రమాలు: విద్యార్థులు, పరిశోధకులు, అధ్యాపకులకు అధిక సామర్థ్య కంప్యూటింగ్ (హెచ్‌పీసీ), డీప్ లెర్నింగ్ (డీఎల్) పరిచయం చేసేందుకు ఎన్‌ఎస్‌ఎం సంస్థలతో కలిసి దేశవ్యాప్తంగా కార్యశాలలు నిర్వహిస్తున్నారు.
* హ్యాకథాన్‌లు, బూట్‌క్యాంప్‌లు: హెచ్‌పీసీ, డీఎల్ హ్యాకథాన్‌లు, బూట్‌క్యాంప్‌లు ప్రత్యక్ష ఆచరణ అనుభవాన్ని అందిస్తాయి. హెచ్‌పీసీ, కృత్రిమ మేధస్సు (ఏఐ), జనరేటివ్ ఏఐ రంగాల్లో సమస్యల పరిష్కారాన్ని ప్రోత్సహిస్తాయి.
* అధ్యాపకుల అభివృద్ధి, నాణ్యత మెరుగుదల కార్యక్రమాలు: ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) సహకారంతో కంప్యూటర్ సైన్స్‌యేతర విభాగాల అధ్యాపకులతో సహా బోధనా సిబ్బందికి హెచ్‌పీసీ, ఏఐ, మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), డీఎల్‌లో శిక్షణ అందిస్తున్నారు.
* ఎడ్యూహెచ్‌పీసీ కార్యశాల: దేశవ్యాప్తంగా వివిధ సంస్థల అధ్యాపకులకు హెచ్‌పీసీలో సమగ్ర శిక్షణ అందించేందుకు ఏటా కార్యశాల నిర్వహిస్తున్నారు.
* హై పర్ఫార్మెన్స్ సైంటిఫిక్ కంప్యూటింగ్ కోర్సు: నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్‌హాన్స్‌డ్ లెర్నింగ్ (ఎన్‌పీటీఈఎల్) కింద స్వయం వేదికపై అందించే క్రమబద్ధమైన కోర్సు హెచ్‌పీసీలో బలమైన పునాది ఏర్పరచుకునేందుకు అభ్యాసకులకు తోడ్పడుతుంది.
* హెచ్‌పీసీ శిక్షా పోర్టల్: హెచ్‌పీసీ వనరులు, రికార్డు చేసిన ఉపన్యాసాలు, అభ్యాస సామగ్రిని ఈ పోర్టల్ అందుబాటులో ఉంచుతుంది. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆచరణాత్మక అనుభవాన్ని పొందగలరు.
* ఎన్‌ఎస్‌ఎం యూజర్స్ ఫోరమ్: వివిధ ఎన్‌ఎస్‌ఎం కేంద్రాల్లోని వినియోగదారులు సాంకేతిక సమస్యలపై చర్చించేందుకు, సందేహాలను పరిష్కరించుకునేందుకు, జ్ఞానం, ఉత్తమ పద్ధతులను పంచుకునేందుకు ఈ ఫోరమ్ వేదికను అందిస్తుంది.

ఈ కార్యక్రమాలు ప్రత్యేక కంప్యూటింగ్ సంస్థలకు మించి హెచ్‌పీసీ నైపుణ్యాలను విస్తరిస్తున్నాయి. అధునాతన కంప్యూటింగ్‌ను ఉపయోగించగల విస్తృత మానవ వనరులను అభివృద్ధి చేస్తున్నాయి.

నేషనల్ నాలెడ్జ్ నెట్‌వర్క్ (ఎన్‌కేఎన్)
నేషనల్ సూపర్‌కంప్యూటింగ్ మిషన్ కింద భారత సూపర్‌కంప్యూటింగ్ వ్యవస్థకు ఎన్‌కేఎన్ వెన్నెముకగా పనిచేస్తోంది. విద్యా, పరిశోధన సంస్థల్లోని సూపర్‌కంప్యూటింగ్ సదుపాయాలను వేగవంతమైన జాతీయ నెట్‌వర్క్ ద్వారా అనుసంధానిస్తుంది. దీంతో పరిశోధకులు, సంస్థలు అధునాతన కంప్యూటింగ్ వనరులను ఉపయోగించుకోవచ్చు, భౌగోళిక హద్దులకు అతీతంగా సహకరించుకోవచ్చు. గణన వనరులు, పరిశోధన సామర్థ్యాలు, శాస్త్రీయ జ్ఞానాన్ని పంచుకోవడాన్ని ఈ నెట్‌వర్క్ బలోపేతం చేస్తుంది. ఈ అనుసంధాన మౌలిక సదుపాయాల ద్వారా దేశవ్యాప్తంగా అధిక సామర్థ్య కంప్యూటింగ్ అందుబాటును మిషన్ విస్తరిస్తోంది.

భ‌విష్య‌త్‌ మార్గం
కంప్యూటింగ్ సామర్థ్యాన్ని విస్తరించడం, దేశంలోనే మరింత అధునాతన సాంకేతికతలను అభివృద్ధి చేయడం, పరిశోధకులు, విద్యా సంస్థలు, పరిశ్రమలకు అధిక సామర్థ్య కంప్యూటింగ్ (హెచ్‌పీసీ) మరింత అందుబాటులోకి తీసుకురావడం ద్వారా భారత సూపర్‌కంప్యూటింగ్ వ్యవస్థ గణనీయంగా వృద్ధి చెందనుంది. వేగవంతమైన, విద్యుత్‌ను సమర్థంగా వినియోగించే, విశ్వసనీయ వ్యవస్థల నిర్మాణం, భారత హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ సామర్థ్యాల బలోపేతం, నైపుణ్యం కలిగిన నిపుణుల అభివృద్ధిపై మిషన్ దృష్టి సారిస్తుంది. కృత్రిమ మేధస్సు (ఏఐ), హెచ్‌పీసీని మరింత సమగ్రంగా అనుసంధానించడం వాతావరణం, దీర్ఘకాలిక వాతావరణ పరిస్థితులు, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, ఇంధనం, ఔషధ ఆవిష్కరణ, ఇంజినీరింగ్, శాస్త్రీయ పరిశోధన వంటి రంగాల్లో ముఖ్యమైన సవాళ్లను పరిష్కరించేందుకు తోడ్పడుతుంది. ప్రభుత్వం, విద్యా సంస్థలు, పరిశ్రమలు, స్టార్టప్‌లు, పరిశోధన సంస్థలను ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా అధునాతన కంప్యూటింగ్‌ను ఆచరణాత్మక పరిష్కారాలుగా భారత్ మలచగలదు. ఆవిష్కరణలు, ఆర్థిక వృద్ధిని ముందుకు తీసుకెళ్లగలదు. సురక్షితమైన, సుస్థిరమైన, స్వావలంబనతో కూడిన సూపర్‌కంప్యూటింగ్ వ్యవస్థను నిర్మించగలదు.

 

 

References

Department of Science and Technology

 

Ministry of Electronics & IT

Centre for Development of Advanced Computing

Click here to see pdf

 

****

(Explainer ID: 160340) आगंतुक पटल : 15
Provide suggestions / comments
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali , Assamese , Tamil , Kannada , Malayalam