Rural Prosperity

స్వచ్ఛతపై ప్ర‌చారంతో ప్రవర్తనలో మార్పు

స్వచ్ఛ్ భారత్ మిషన్‌లో భాగంగా సామాజిక, ప్రవర్తనా మార్పు కోసం స‌మాచార కార్య‌క్ర‌మాలు

Posted On: 02 OCT 2026 2:12PM

స్వచ్ఛ్ భారత్ మిషన్ (ఎస్‌బీఎం) పారిశుధ్యంలో ప్రవర్తనా మార్పున‌కు ప్రధాన స్థానం కల్పించింది. మౌలిక సదుపాయాల కల్పనను దాటి, పారిశుధ్య అలవాట్లు నిరంతరం కొనసాగేలా, సామాజిక ఆచరణ ప్రమాణాలు ఏర్పడేలా దృష్టి సారించింది. సోష‌ల్ ఆండ్ బిహేవియ‌ర్ చేంజ్ క‌మ్యూనికేష‌న్‌ (ఎస్‌బీసీసీ) సమాచార వ్యాప్తిని సంభాషణ, భాగస్వామ్యం, సమష్టి చర్యగా మార్చింది. మహాత్మా గాంధీ, ఆయన ప్రతిపాదించిన పరిశుభ్రత, తమ పనులను తామే చేసుకోవాలనే ఆదర్శాలు ఎస్‌బీఎంకు మార్గదర్శక సూత్రాలుగా నిలిచాయి. సామాజిక సంస్థలు, స్వచ్ఛాగ్రహీల వంటి క్షేత్రస్థాయి కార్యకర్తలు వ్యక్తిగత పారిశుధ్య అలవాట్లను సమాజమంతా అనుసరించే ఉమ్మడి ఆచరణలుగా మార్చేందుకు తోడ్పడ్డారు. వివిధ సమాచార మాధ్యమాలు ఇళ్లలో, సమాజంలో, బహిరంగ ప్రదేశాల్లో, డిజిటల్ వేదికల్లో స్వచ్ఛత సందేశాలను బలంగా చాటాయి. మహిళలు, పిల్లలు పారిశుధ్య ప్రయోజనాలను పొందడంతోపాటు, ఆ అలవాట్లను వ్యాప్తి చేయడంలో, కొనసాగించడంలో చురుకైన పాత్ర పోషించారు. అలవాట్లను బలోపేతం చేయడం, గుర్తింపు, ప్రోత్సాహకాలు, ప్రజల భాగస్వామ్యంతో పర్యవేక్షణ వంటి చర్యలు స్వచ్ఛతను ప్రచార కార్యక్రమం నుంచి సమాజం నిరంతరం అనుసరించే ప్రవర్తనగా మార్చేందుకు తోడ్పడ్డాయి.

స్వచ్ఛ్ భారత్‌కు ప్రవర్తనాపరమైన పునాదులు
పారిశుధ్యాన్ని ప్రవర్తన, భాగస్వామ్యం, సమష్టి బాధ్యతకు సంబంధించిన అంశంగా స్వచ్ఛ్ భారత్ మిషన్ (ఎస్‌బీఎం) పరిగణించింది. మౌలిక సదుపాయాలతోనే పారిశుధ్య ఫలితాలు దీర్ఘకాలం కొనసాగవని ఈ మిషన్ గుర్తించింది. అందుకే ఎస్‌బీఎం తన అమలు విధానంలో ప్రవర్తనా మార్పు ప్ర‌చారానికి ప్రధాన స్థానం కల్పించింది. ఎస్‌బీఎం-జీ కింద దృష్టి మరుగుదొడ్ల నిర్మాణానికే పరిమితం కాదు. సురక్షితమైన, దీర్ఘకాలం కొనసాగించగల పారిశుధ్య పద్ధతులను అనుసరించేలా సమాజాన్ని ప్రోత్సహిస్తుంది. అదేవిధంగా, ఎస్‌బీఎం-యూ కింద దృష్టి వ్యర్థాల శుద్ధికే పరిమితం కాదు. వ్యర్థాలు ఉత్పత్తయ్యే చోటే వాటిని వేరు చేయడాన్ని ప్రజల అలవాటుగా మార్చడం, పట్టణాల్లో సంపూర్ణ పారిశుధ్యం, బహిరంగ ప్రదేశాల్లో పరిశుభ్రత సాధించడంపై దృష్టి సారిస్తుంది. అందువల్ల సమాచారం, విద్య, కమ్యూనికేషన్ (ఐఈసీ) వ్యూహాలు, పారిశుధ్య అలవాట్ల బలోపేతం, పర్యవేక్షణ ఎస్‌బీఎం అమలు వ్యూహంలో అంతర్భాగాలుగా ఉన్నాయి. పారిశుధ్య సదుపాయాలను నిర్మించే దశ నుంచి పారిశుధ్య అలవాట్లను నిలబెట్టే దిశగా ఎస్‌బీఎం ఎదిగింది. ఈ పరిణామంలో సోష‌ల్ ఆండ్ బిహేవియ‌ర్‌ కమ్యూనికేషన్ (ఎస్‌బీసీసీ) ప్రధాన స్థానంలో నిలుస్తోంది.

స్వచ్ఛ్ భారత్ మిషన్ (ఎస్‌బీఎం)
2014 అక్టోబర్ 2న ప్రారంభమైన ఎస్‌బీఎం, ప్రభుత్వ నేతృత్వంలో సాగుతున్న భారతదేశపు అతిపెద్ద పారిశుధ్య ఉద్యమాల్లో ఒకటిగా నిలిచింది. ఈ మిషన్ రెండు విభాగాల ద్వారా పనిచేస్తోంది: ఎస్‌బీఎం-గ్రామీణ్, ఎస్‌బీఎం-అర్బన్. ఎస్‌బీఎం-జీ గ్రామీణ పారిశుధ్యం, మరుగుదొడ్ల అందుబాటు, వినియోగం, వ్యర్థాల నిర్వహణపై దృష్టి సారిస్తుంది. ఎస్‌బీఎం-యూ పట్టణ పారిశుధ్యం, వ్యర్థాల నిర్వహణ, పరిశుభ్రమైన బహిరంగ ప్రదేశాలపై దృష్టి పెడుతుంది.



సమాచార వ్యాప్తి నుంచి ప్రవర్తనా మార్పు వైపు
సోష‌ల్ ఆండ్ బిహేవియ‌ర్‌ కమ్యూనికేషన్ (ఎస్‌బీసీసీ) సానుకూల సామాజిక మార్పున‌కు తోడ్పడేలా సమాచార ప్రసారాన్ని ఉపయోగిస్తుంది. అవగాహన, దృక్పథాలు, సామాజిక ఆచరణ ప్రమాణాలు, అలవాట్లపై ప్రభావం చూపేందుకు వివిధ విధానాలను సమన్వయం చేస్తుంది. వ్యక్తుల మధ్య ప్రత్యక్ష సంభాషణ, సమాజ సమీకరణ, ప్రజా మాధ్యమాలు వీటిలో ఉన్నాయి. సామాజిక మాధ్యమాలు, వినోదం, మద్దతు కూడగట్టడం, వ్యూహాత్మక భాగస్వామ్యాలు కూడా ఇందులో భాగమే.

ఎస్‌బీఎం కింద ఎస్‌బీసీసీ కేవలం సమాచార వ్యాప్తికే పరిమితం కాదు. దృక్పథాలు, సామాజిక ఆచరణ ప్రమాణాలు, రోజువారీ అలవాట్లను ప్రభావితం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎస్‌బీఎంలో ఈ విధానం వ్యక్తుల మధ్య ప్రత్యక్ష సంభాషణ, సమాజ సమీకరణ, అవగాహన కల్పన, సమష్టి చర్యలను సమన్వయం చేస్తుంది. బహిరంగ మలవిసర్జన, వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన సామాజిక ఆచరణలను మార్చడం దీని దీర్ఘకాలిక లక్ష్యం. ప్రజల ప్రవర్తనపై వారి సామాజిక పరిసరాలు ప్రభావం చూపుతాయని ఇది గుర్తిస్తుంది. కుటుంబాలు, ఇరుగుపొరుగువారు, సామాజిక బృందాలు, స్థానిక సంస్థలు, ప్రజలు విశ్వసించే నాయకులు కొన్ని అలవాట్లను బలోపేతం చేయవచ్చు లేదా నిరుత్సాహపరచవచ్చు. అందువల్ల కమ్యూనికేషన్ పరస్పర సంబంధాలు, సమష్టి భాగస్వామ్యం ద్వారా పనిచేస్తుంది.



మహాత్మా గాంధీ: ఎస్‌బీఎంలో ఎస్‌బీసీసీకి నైతిక ఆధారం
పరిశుభ్రత, పారిశుధ్యానికి మహాత్మా గాంధీ ఇచ్చిన ప్రాధాన్యం ఎస్‌బీఎం కమ్యూనికేషన్ వ్యూహానికి బలమైన పునాదిని అందించింది. 2019లో గాంధీ 150వ జయంతి నాటికి స్వచ్ఛ్ భారత్‌ను సాధించేందుకు 2014 అక్టోబర్ 2న ఈ మిషన్ ప్రారంభమైంది. ఎస్‌బీఎం లోగో మహాత్మా గాంధీ కళ్లద్దాలను ప్రతిబింబిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా పరిశుభ్రత పట్ల ఉన్న భావనను ప్రతిబింబించడంలో, మిషన్‌కు ప్రత్యేక గుర్తింపు కల్పించడంలో ఇది తోడ్పడింది. ప్రజలు ఈ మిషన్‌తో సులభంగా, త్వరగా అనుబంధం ఏర్పరచుకునేందుకు కూడా సహాయపడింది. ఈ కృషి ఫలితంగా, 2019 అక్టోబర్ 2న గ్రామీణ భారతదేశాన్ని బహిరంగ మలవిసర్జన రహిత ప్రాంతంగా (ఓడీఎఫ్) ప్రకటించారు.

మహాత్మా గాంధీ సత్యాగ్రహ ఉద్యమ సమయంలో చంపారన్ నుంచి పరిశుభ్రత ప్రచారాన్ని ప్రారంభించారు. సంపూర్ణ పారిశుధ్యం, నివారించగల దుమ్ము లేకుండా ఉండే గ్రామ వీధులు, దారులతో కూడిన గ్రామమే ఆదర్శ గ్రామమని ఆయన భావించారు. తన “ఆశ్రమ్ అబ్జర్వెన్సెస్ ఇన్ యాక్షన్” పుస్తకంలో పారిశుధ్య సేవ అత్యవసరమైన, పవిత్రమైన సేవ అని గాంధీ రాశారు. ఈ పని కోసం బయటి కార్మికులను నియమించకూడదని ఆయన సేవాగ్రామ్ ఆశ్రమం నొక్కిచెప్పింది. సభ్యులే వంతులవారీగా ఆశ్రమ ప్రాంగణాన్ని శుభ్రం చేసేవారు. ఆశ్రమవాసులు చేతులు కడుక్కొని, శుభ్రమైన చేతి రుమాలుతో తుడుచుకోవాలని ఆశ్రమ నియమాలు నిర్దేశించాయి. ప్రజల్లో బాధ్యతా భావాన్ని పెంపొందించేందుకు, ప్రవర్తనా మార్పులో భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు ఎస్‌బీఎం సందేశాలు ఈ వారసత్వాన్ని ఆధారంగా చేసుకున్నాయి.

ఈ అనుబంధం ప్రవర్తనా మార్పు ఉద్యమంలోని భాషను, ప్రతీకలను కూడా ప్రభావితం చేసింది. ‘స్వచ్ఛాగ్రహీ’ అనే పదాన్ని గాంధీ సత్యాగ్రహ సంప్రదాయం నుంచి ఉద్దేశపూర్వకంగా స్వీకరించారు. పౌరులు, పారిశుధ్య స్వచ్ఛంద కార్యకర్తలను సమష్టి స్వచ్ఛాగ్రహంలో భాగస్వాములుగా నిలిపారు. అందువల్ల ఎస్‌బీఎం మహాత్మా గాంధీని కేవలం స్మరించుకోవాల్సిన మహనీయుడిగానే గౌరవించలేదు. పరిశుభ్రతను సమష్టి చర్య, పౌర బాధ్యత, నిరంతర ప్రవర్తనా మార్పుతో అనుసంధానించే కమ్యూనికేషన్‌కు ప్రధాన ఆధారంగా స్వీకరించింది.



ఇంటి ముంగిటికి ప్రవర్తనా మార్పు: వ్యక్తిగత అలవాట్లలో మార్పు
ఎస్‌బీఎం ఎస్‌బీసీసీ సూత్రాలను సమాజ స్థాయిలో ప్రత్యక్ష భాగస్వామ్యంగా మలిచింది. పారిశుధ్య అలవాట్లను ప్రభావితం చేయడంలో వ్యక్తుల మధ్య ప్రత్యక్ష సంభాషణ (ఐపీసీ) ముఖ్యమైన మార్గంగా నిలిచింది. ఏకపక్ష సందేశాలకు భిన్నంగా, ఐపీసీ సమాచారాన్ని అందించేవారికి, సమాజ సభ్యులకు మధ్య సంభాషణకు అవకాశం కల్పిస్తుంది. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఆందోళనలు, అభిప్రాయాలు, ఆచరణలో ఎదురయ్యే అడ్డంకులపై చర్చించేందుకు వీలు కల్పిస్తుంది. ఐపీసీని సులభతరం చేసేందుకు ప్రభుత్వం క్షేత్రస్థాయి సిబ్బంది, స్వచ్ఛాగ్రహీలు, సామాజిక నాయకులు, స్వయం సహాయక సంఘాలు (ఎస్‌హెచ్‌జీలు), ఇప్పటికే ఉన్న సామాజిక సంబంధాల వ్యవస్థపై ఆధారపడింది. ఇంటింటి సందర్శనలు, ముఖాముఖి కౌన్సెలింగ్, చిన్న బృందాల సమావేశాలు, సహచరుల మధ్య సంభాషణలు, ఇళ్లలో, ఆరోగ్య కేంద్రాల్లో, సామాజిక వేదికల్లో, మతపరమైన సమావేశాల్లో చర్చలు ఈ పద్ధతుల్లో భాగంగా ఉన్నాయి.

ఎస్‌బీఎం-జీ కింద స్వచ్ఛాగ్రహీలు క్షేత్రస్థాయి కార్యకర్తలుగా, ప్రజల్లో ప్రేరణ కలిగించేవారిగా నిలిచారు. వారి పాత్ర మరుగుదొడ్ల నిర్మాణాన్ని ప్రోత్సహించడానికే పరిమితం కాలేదు. సురక్షితమైన పారిశుధ్య అలవాట్లను స్వీకరించేందుకు, కొనసాగించేందుకు కుటుంబాలకు తోడ్పడ్డారు. సమాజాన్ని సున్నితంగా ప్రోత్సహించడం, మార్పుకు ప్రేరణ కల్పించడం, ఇంటింటి సందర్శనలు, పారిశుధ్యంపై చర్చలను స్వచ్ఛాగ్రహీలు నిర్వహించారు. సమాజ సమీకరణకు తోడ్పడి, నిగ్రానీ సమితులను బలోపేతం చేశారు. వ్యక్తులు, కుటుంబాల్లో పారిశుధ్య అలవాట్లను మరింత బలోపేతం చేసేందుకు ఓడీఎఫ్ ప్రకటన తర్వాత కూడా వారి కృషి కొనసాగింది.



నిగ్రానీ సమితుల ద్వారా సమాజం నేతృత్వంలో చేప‌ట్టే పర్యవేక్షణకూ వ్యక్తుల మధ్య ప్రత్యక్ష సంభాషణ విస్తరించింది. ఓడీఎఫ్ స్థితిని సాధించేందుకు, కొనసాగించేందుకు ఈ సమితులను బలోపేతం చేశారు. గ్రామాల్లో ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం పర్యవేక్షణ వీటి కార్యకలాపాల్లో భాగంగా ఉండేది. సాధారణంగా బహిరంగ మలవిసర్జన జరిగే ప్రదేశాలపై నిగ్రానీ కార్యకలాపాలు ప్రత్యేక దృష్టి పెట్టాయి. సమాజంలో నిరంతరం అందుబాటులో ఉండటం, తదుపరి చర్యలను కొనసాగించడం ద్వారా పారిశుధ్య సందేశాలను బలోపేతం చేశాయి. క్రమం తప్పని నిగ్రానీ కార్యక్రమాలు, గ్రామ సమావేశాలు, రాత్రి చౌపాల్‌లు ఓడీఎఫ్ అలవాట్లను కొనసాగించేందుకు తోడ్పడ్డాయి. సమాజ పర్యవేక్షణలో భాగంగా క్షేత్రస్థాయిలో నిఘా నిర్వహించేందుకు స్వచ్ఛాగ్రహీలకు టార్చ్, విజిల్‌తో కూడిన పరికరాల కిట్‌ను అందించారు.

ఈ విధానం పారిశుధ్యాన్ని వ్యక్తిగత అలవాటు నుంచి సమాజమంతా అనుసరించే ఉమ్మడి ఆచరణగా మార్చింది. ప్రవర్తనా మార్పును బలోపేతం చేయడంలో, కొనసాగించడంలో సమాజమే చురుకైన భాగస్వామిగా మారింది.

వ్యక్తిగత సంభాషణల నుంచి సమష్టి చర్య వైపు
వ్యక్తుల మధ్య ప్రత్యక్ష సంభాషణ కుటుంబ, సమాజ స్థాయిలో చర్చలకు అవకాశాలు కల్పించింది. ఉమ్మడి పారిశుధ్య సమస్యలపై చర్చించేందుకు, సమష్టి పరిష్కారాలను గుర్తించేందుకు ప్రజలను ఒకచోట చేర్చడం ద్వారా సమాజ సమీకరణ ఈ ప్రక్రియను మరింత ముందుకు తీసుకెళ్లింది. ఎస్‌బీఎం కింద ప్రజల రోజువారీ పారిశుధ్య అలవాట్లను ప్రభావితం చేసే నిర్ణయాల్లో సమాజం భాగస్వామ్యం పొందేందుకు వేదికలను అందించింది. గ్రామ సభలు, చౌపాల్‌లు, సామాజిక సమావేశాలు, ఇతర స్థానిక వేదికలు పారిశుధ్య సమస్యలపై చర్చలకు అవకాశం కల్పించాయి. ఉమ్మడి ప్రాధాన్యాలపై ఏకాభిప్రాయం ఏర్పరచుకునేందుకు సమాజానికి తోడ్పడ్డాయి.



సమాజ సమీకరణ వివిధ వర్గాలను కూడా పారిశుధ్య చర్చల్లో భాగస్వాములను చేసింది. సామాజిక నాయకులు, పంచాయతీరాజ్ సంస్థలు, స్వచ్ఛంద కార్యకర్తలు, మత పెద్దలు, మహిళా బృందాలు స్థానిక చర్చలు, కార్యక్రమాలను నిర్వహించేందుకు తోడ్పడగలిగాయి. ఈ విధానం వ్యక్తిగత ప్రవర్తనను సమష్టి బాధ్యతతో అనుసంధానించింది. సురక్షిత పారిశుధ్య అలవాట్లను అనుసరించే కుటుంబం సమాజం చేపట్టే విస్తృత కృషిలో భాగమైంది. స్థానిక సమస్యలను గుర్తించేందుకు, అనుభవాలను పంచుకునేందుకు, ఆశించిన అలవాట్లపై ఏకాభిప్రాయం ఏర్పరచుకునేందుకు సామాజిక చర్చలు అవకాశాలు కల్పించాయి. చలో చంపారన్, స్వచ్ఛ్ శక్తి, స్వచ్ఛ్ సుందర్ శౌచాలయ్, స్వచ్ఛతా హీ సేవా, స్వచ్ఛ్ సుందర్ సాముదాయిక్ శౌచాలయ్, స్వచ్ఛ్ భారత్ దివస్, స్వచ్ఛతా మహోత్సవ్, స్వచ్ఛతా పఖ్వాడా వంటి ప్రచార కార్యక్రమాల్లో కూడా ఈ విధానం ప్రతిఫలించింది. పారిశుధ్యం, పరిశుభ్రత కోసం సమష్టి భాగస్వామ్యానికి ఈ కార్యక్రమాలు వేదికలుగా నిలిచాయి.

 



స్థానిక ప్రదర్శనా మాధ్యమాలు, బహిరంగ ప్రచారం ద్వారా సమాజ సమీకరణ మరింత బలపడింది. ఈ మాధ్యమాలు పారిశుధ్య సందేశాలను వ్యక్తిగత సంభాషణల పరిధి నుంచి ప్రజలు తరచూ గుమికూడే ప్రదేశాలకు తీసుకెళ్లాయి. తోలుబొమ్మలాటలు, ఇంద్రజాల ప్రదర్శనలు, నాటకాలు, వీధి నాటకాలు (నుక్కడ్ నాటక్) స్థానిక, సంప్రదాయ ప్రదర్శనా మాధ్యమాలకు కొన్ని ఉదాహరణలు. పారిశుధ్య సందేశాలను అందించేందుకు బహిరంగ మాధ్యమాలు ప్రకటనల బోర్డులు, అనుమతి ఉన్న ప్రభుత్వ గోడలపై చిత్రాలు వంటి ప్రజా ప్రదేశాలను ఉపయోగిస్తాయి. స్థానిక ప్రత్యేకతను ప్రతిబింబిస్తూ, నగర సుందరీకరణకు తోడ్పడుతూ స్వచ్ఛత సందేశాలను చాటేందుకు గోడ చిత్రాలు, గ్రాఫిటీ కళను ప్రత్యేకంగా ఉపయోగించారు. ఈ రూపాల ప్రాధాన్యం సందేశాలు కనిపించేలా చేయడానికే పరిమితం కాదు. స్వచ్ఛతను రోజువారీ సామాజిక పరిసరాల్లో భాగం చేయడంలోనూ ఉంది. సామాజిక కార్యక్రమం, వీధి ప్రదర్శన లేదా బహిరంగ సమావేశంలో కనిపించే పారిశుధ్య సందేశం ఇళ్లలో, స్థానిక బృందాల్లో జరుగుతున్న చర్చలను బలోపేతం చేయగలదు.

ప్రజలకు మరింత విస్తృతంగా చేరువయ్యేందుకు డిజిటల్ సాధనాలను ఉపయోగించడం ఎస్‌బీఎం-యూ కింద ప్రధాన ప్రాధాన్యాల్లో ఒకటిగా నిలిచింది. ఉదాహరణకు, 3,300కు పైగా నగరాల్లోని 67,000కు పైగా ప్రజా మరుగుదొడ్ల సముదాయాల వివరాలను గూగుల్ మ్యాప్స్‌లో చేర్చారు. దీంతో అన్ని వర్గాల ప్రజలకు పారిశుధ్య సదుపాయాలను గుర్తించడం, చేరుకోవడం మరింత సులభమైంది. పరిశుభ్రతకు సంబంధించిన ఏ అంశంపైనైనా పౌరులు తమ ఫిర్యాదులను నమోదు చేసుకునేందుకు స్వచ్ఛతా యాప్ ఏకీకృత డిజిటల్ ఫిర్యాదు పరిష్కార వేదికను అందించింది.

స్వచ్ఛత సందేశాలను మాస్ మీడియా మరో స్థాయిలో బలోపేతం చేసింది. టెలివిజన్, రేడియో, పత్రికలు, ఆన్‌లైన్ మాధ్యమాలు వీటిలో ఉన్నాయి. కమ్యూనిటీ రేడియో స్వచ్ఛతకు సంబంధించిన చర్చలు, అనుభవ వాక్యాలు, కథనాలు, ప్రజా ప్రయోజన ప్రకటనలను ప్రసారం చేసింది. ప్రధాన సందేశాలను వ్యాప్తి చేయడంలో, ఆన్‌లైన్ సంబంధాల వ్యవస్థలను, సమూహాలను నిర్మించడంలో ట్విట్టర్, ఫేస్‌బుక్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలు కీలక పాత్ర పోషించాయి. సామూహిక ఎస్‌ఎంఎస్‌లు, వాట్సాప్, పాడ్‌కాస్ట్‌ల ద్వారా మొబైల్ ఫోన్ సేవలు అవగాహన కల్పనకు తోడ్పడ్డాయి.



ఎస్‌బీఎం-యూలో డిజిటల్ భాగస్వామ్యానికి స్వచ్ఛ్ టాక్స్ ఒక ఉదాహరణగా నిలుస్తోంది. స్వచ్ఛతకు సంబంధించిన క్షేత్రస్థాయి అనుభవాలు, ఉత్తమ పద్ధతులను పంచుకునేందుకు, సహచరులు పరస్పరం నేర్చుకునేందుకు నిర్వహించే వెబినార్‌ల శ్రేణి ఇది. ఇటువంటి వేదికలు చర్చను సాధారణ పారిశుధ్య అంశాల నుంచి ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ, చక్రీయ ఆర్థిక వ్యవస్థ ప్రోత్సాహం వంటి అంశాలకు విస్తరిస్తాయి.
ఐపీసీ నుంచి సమాజ సమీకరణ వైపు సాగడం ప్రవర్తనా మార్పు పరిధి విస్తరించడాన్ని సూచిస్తుంది. ఎస్‌బీఎంలో ఎస్‌బీసీసీ విధానానికి ఈ పురోగతి ముఖ్యమైనది. ఒక వ్యక్తికి సందేశం చేరినంత మాత్రాన కమ్యూనికేషన్ ముగియదు. ప్రజలు దానిపై చర్చించినప్పుడు, తమ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా మలచుకున్నప్పుడు, సమష్టి చర్యలో పాల్గొన్నప్పుడు దానికి మరింత ప్రాధాన్యం లభిస్తుంది. ఈ ప్రక్రియలో భాగస్వామ్యమే ఒక కమ్యూనికేషన్ రూపంగా మారుతుంది.

ఎస్‌బీసీసీకి మాధ్యమాలుగా ప్రముఖుల ప్రచారం, ప్రజాదరణ పొందిన సంస్కృతి
స్వచ్ఛ్ భారత్ తన ఎస్‌బీసీసీ కృషిని బలోపేతం చేసేందుకు ప్రముఖుల ప్రజాదరణను కూడా ఉపయోగించుకుంది. 2016లో అమితాబ్ బచ్చన్, సచిన్ టెండూల్కర్ ఎస్‌బీఎం-జీ జాతీయ శ్రవ్యదృశ్య ప్రచార కార్యక్రమాల్లో కనిపించారు. కమ్యూనికేషన్‌ను మరింత ప్రజాకేంద్రంగా మలచేందుకు, ప్రవర్తనా మార్పు, పౌర భాగస్వామ్యానికి తోడ్పడేందుకు ఈ కార్యక్రమాలను రూపొందించారు. క్షేత్రస్థాయి కార్యకర్తలు, పారిశుధ్యంలో విశేష కృషి చేసినవారిని ప్రోత్సహించేందుకు వారిద్దరూ స్వచ్ఛ్ భారత్ కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. అనంతరం 2017లో అమితాబ్ బచ్చన్ ‘దర్వాజా బంద్’ ప్రచార కార్యక్రమానికి నాయకత్వం వహించారు. మరుగుదొడ్లు ఉన్నప్పటికీ బహిరంగ మలవిసర్జన కొనసాగిస్తున్న ప్రజల్లో వాటి వినియోగాన్ని ఈ కార్యక్రమం ప్రోత్సహించింది. ఇందులో అనుష్క శర్మ కూడా పాల్గొన్నారు. తమ గ్రామాల్లో పారిశుధ్య సమస్యల పరిష్కారానికి నాయకత్వం వహించాలని ఆమె మహిళలను ప్రోత్సహించారు. స్వచ్ఛాగ్రహీలు క్షేత్రస్థాయిలో చేపట్టే ఐఈసీ, వ్యక్తుల మధ్య ప్రత్యక్ష సంభాషణకు తోడుగా ఈ కార్యక్రమం ప్రజా మాధ్యమాలను ఉపయోగించింది.

పారిశుధ్యానికి సంబంధించిన సామాజిక ఆచరణలను చర్చించేందుకు సినిమా కూడా ఒక మాధ్యమంగా మారింది. అక్షయ్ కుమార్, భూమి పెడ్నేకర్ నటించిన ‘టాయిలెట్ – ఏక్ ప్రేమ్ కథా’ పారిశుధ్యం, మరుగుదొడ్ల వినియోగాన్ని ప్రధాన స్రవంతి ప్రజాదరణ సంస్కృతిలోకి తీసుకువచ్చింది. 2018లో రెండు గుంతల మరుగుదొడ్డి సాంకేతికతను ప్రోత్సహించే ఎస్‌బీఎం-జీ ప్రచార కార్యక్రమంలో అక్షయ్ కుమార్, భూమి పెడ్నేకర్ పాల్గొన్నారు. రాష్ట్ర, జిల్లా ఎస్‌బీఎం-జీ బృందాలు గ్రామాల్లో వాణిజ్యేతర ప్రదర్శనలు నిర్వహించేందుకు కూడా ఈ సినిమాను అందుబాటులో ఉంచారు. మరుగుదొడ్డి గుంతలను ఖాళీ చేయడం పట్ల ఉన్న సామాజిక అపోహలను తొలగించేందుకు, మరుగుదొడ్ల నిరంతర వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కూడా ఈ కార్యక్రమం ప్రముఖుల ప్రభావాన్ని ఉపయోగించుకుంది. “జహా సోచ్, వహా శౌచాలయ” నినాదాన్ని ప్రచారం చేసే వీడియోలో విద్యా బాలన్ కనిపించారు. మరుగుదొడ్ల వినియోగంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ఆ వీడియో నొక్కిచెప్పింది. గ్రామీణ కుటుంబాల్లో మహిళల నేతృత్వంలో మరుగుదొడ్ల నిర్మాణ కార్యక్రమాలను కూడా ప్రోత్సహించింది. ఈ విధంగా, ప్రజాదరణ పొందిన మాధ్యమాలు ఎస్‌బీసీసీకి అదనపు మార్గంగా పనిచేశాయి. ప్రభుత్వ ప్రచార కార్యక్రమాల్లోని పారిశుధ్య సందేశాలను టెలివిజన్, సినిమా, ప్రజా చర్చల్లోకి తీసుకెళ్లాయి.

మహిళలు, పిల్లలు: స్వచ్ఛతకు రూపమిస్తూ, ప్రయోజనాలు పొందుతూ
పారిశుధ్యం రోజువారీ అనుభవాలను మార్చడంతోపాటు భాగస్వామ్యానికి కొత్త అవకాశాలను సృష్టించగలదు. మహిళల విషయంలో సురక్షా, సువిధా, స్వాభిమాన్ ఈ మార్పులోని మూడు ముఖ్యమైన కోణాలను సూచిస్తాయి. భద్రత, సౌకర్యం, ఆత్మగౌరవం పారిశుధ్యాన్ని మహిళల రోజువారీ జీవితాలతో అనుసంధానిస్తాయి. మహిళలు వెల్లడించిన అనుభవాల్లో ఈ ప్రభావం కనిపిస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి సహకారంతో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, మలవిసర్జన సమయంలో ఎవరైనా గాయపరుస్తారేమో లేదా జంతువులు హాని చేస్తాయేమో అన్న భయం ఇక లేదని 93 శాతం మంది మహిళలు తెలిపారు. గంట వరకు సమయం ఆదా అవుతోందని, కిలోమీటరు వరకు ప్రయాణించాల్సిన అవసరం తప్పిందని 91 శాతం మంది చెప్పారు. పారిశుధ్య అవసరాలను సర్దుబాటు చేసుకునేందుకు ఆహారం లేదా నీటి వినియోగాన్ని ఇక పరిమితం చేసుకోవడం లేదని కూడా 93 శాతం మంది తెలిపారు.

బిహార్‌లో ప్రజలు మరుగుదొడ్లను ‘ఇజ్జత్‌ఘర్‌లు’ అని పిలవడం ప్రారంభించారు. మహిళల గౌరవంతో వాటికి ఉన్న అనుబంధాన్ని ఈ పేరు సూచిస్తుంది. ఈ విధంగా మరుగుదొడ్ల నిర్మాణం ఒక ప్రధాన సామాజిక అసమానతను పరిష్కరించేందుకు తోడ్పడింది. ఆర్థిక, సామాజిక సాధికారతకు కారణంగా మారుతోంది. మహిళలు సామాజిక కార్యకర్తలుగా పారిశుధ్యానికి తమ వంతు సహకారం అందించారు. పారిశుధ్య సమాచారాన్ని చేరవేసే సామాజిక సంబంధాల వ్యవస్థలో మహిళా బృందాలు, ఎస్‌హెచ్‌జీలు భాగంగా ఉన్నాయి. ఇది పారిశుధ్య కమ్యూనికేషన్‌ను ఇప్పటికే ఉన్న సామాజిక సంస్థలు, సంబంధాల వ్యవస్థతో అనుసంధానిస్తుంది.



పారిశుధ్య కమ్యూనికేషన్‌కు, రోజువారీ ప్రవర్తనకు మధ్య పిల్లలు మరో ముఖ్యమైన వారధిగా నిలుస్తారు. పారిశుధ్య అలవాట్లపై చర్చించేందుకు, వాటిని ఆచరణలో చూపించేందుకు, బలోపేతం చేసేందుకు పాఠశాలలు వేదికలుగా మారగలవు. ఎస్‌బీఎం విద్యార్థులను భాగస్వాములుగా, మార్పుకు దోహదపడేవారిగా గుర్తిస్తుంది. పాఠ్యాంశాల్లో పారిశుధ్యాన్ని చేర్చడం, అవగాహన కార్యక్రమాలు, శ్రమదానం, మొబైల్ వ్యాన్‌ల ద్వారా విద్య, వ్యర్థాల నిర్వహణ కేంద్రాల సందర్శనలు వంటి పాఠశాల ఆధారిత విధానాలపై ఎస్‌బీఎం దృష్టి సారించింది. నేర్చుకోవడాన్ని భాగస్వామ్యం, వినోదంతో కలిపే రూపాల ద్వారా కూడా సందేశాలు పిల్లలకు చేరాయి. విద్యా వీడియోలు, ఫ్లిప్‌చార్ట్‌లు, చిన్న బృందాల భాగస్వామ్యానికి ఉపయోగపడే ఇతర సామగ్రి వీటిలో ఉన్నాయి. పారిశుధ్య సందేశాలను అందించేందుకు తోలుబొమ్మలాటలు, ఇంద్రజాల ప్రదర్శనలు, నాటకాలు, వీధి నాటకాలు వంటి స్థానిక, సంప్రదాయ రూపాలను కూడా ఇది గుర్తిస్తుంది.

పారిశుధ్య ప్రవర్తనా మార్పులోని ద్విముఖ స్వభావాన్ని మహిళలు, పిల్లలు కలిపి ప్రతిబింబిస్తారు. మెరుగైన స్వచ్ఛత ప్రయోజనాలను పొందుతూనే కుటుంబాలు, పాఠశాలలు, సమాజం ద్వారా దాని వ్యాప్తికి తోడ్పడుతున్నారు. మహిళా బృందాలు సామాజిక సంబంధాల వ్యవస్థను బలోపేతం చేయవచ్చు. పిల్లలు పారిశుధ్య సందేశాలను ఇళ్లలోకి, రోజువారీ పరస్పర సంభాషణల్లోకి తీసుకెళ్లవచ్చు. అందువల్ల స్వచ్ఛత కేవలం మౌలిక సదుపాయాలు లేదా వ్యక్తిగత అలవాట్లకు సంబంధించిన అంశంగానే కాకుండా, తరతరాలుగా కొనసాగే ఉమ్మడి సామాజిక ప్రవర్తనగా మారుతుంది.

పురస్కారాలు, గుర్తింపులతో ఆశించిన స్వచ్ఛత అలవాట్ల బలోపేతం
స్వచ్ఛతను కొనసాగించేందుకు ప్రారంభ అవగాహన, సమీకరణకు మించి అలవాట్లను బలోపేతం చేయాలి. ఎస్‌బీఎం విధానం ధ్రువీకరణ, గుర్తింపు, సున్నితమైన ప్రోత్సాహం, సామాజిక ప్రోత్సాహకాలను సమన్వయం చేస్తుంది. ఈ పద్ధతులు భాగస్వామ్యాన్ని నిలబెట్టేందుకు, ఆశించిన పారిశుధ్య అలవాట్లను నిరంతరం అనుసరించేలా ప్రోత్సహించేందుకు తోడ్పడతాయి.

నగరాలు, గ్రామాలకు ధ్రువీకరణ ఇచ్చే విధానాలు పారిశుధ్యం, పరిశుభ్రత ఫలితాలకు కొలవగల ప్రమాణాలను అందిస్తాయి. ఎస్‌బీఎం కింద ఓడీఎఫ్, ఓడీఎఫ్+, ఓడీఎఫ్++, వాటర్+, స్టార్ రేటింగ్ విధానాలు పౌరుల భాగస్వామ్యంతో ఈ ఫలితాలకు ఏకరీతి ప్రమాణాలను ఏర్పరచేందుకు తోడ్పడ్డాయి. ఓడీఎఫ్ విధానం పౌరులందరికీ మరుగుదొడ్లు అందుబాటులో ఉండేలా చూడటంపై దృష్టి పెడుతుంది. ఓడీఎఫ్+ ఈ దృష్టిని సక్రమంగా పనిచేసే, ఉపయోగించేందుకు అనువైన సామూహిక, ప్రజా మరుగుదొడ్లకు విస్తరిస్తుంది. వాటి సరైన నిర్వహణ, సంరక్షణ నిరంతర మరుగుదొడ్ల వినియోగానికి తోడ్పడతాయి. తిరిగి బహిరంగ మలవిసర్జనకు వెళ్లకుండా నివారించేందుకు సహాయపడతాయి. ఓడీఎఫ్++ మల వ్యర్థాల సురక్షిత నిల్వ, తొలగింపు, రవాణా, శుద్ధిపై దృష్టి సారిస్తుంది. శుద్ధి చేయని మల వ్యర్థాలు బహిరంగ కాలువలు, జలవనరులు లేదా పొలాల్లోకి చేరకుండా నిరోధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. వాటర్+ ఈ దృష్టిని శుద్ధి చేయని మలమూత్ర సంబంధిత మురుగునీరు, ఇతర గృహ వినియోగ మురుగునీటికి విస్తరిస్తుంది. శుద్ధి చేసిన మురుగునీటిలో కొంత భాగాన్ని తిరిగి ఉపయోగించడాన్ని కూడా ప్రోత్సహిస్తుంది. ఘన వ్యర్థాల నిర్వహణలో, గార్బేజ్ ఫ్రీ సిటీస్‌కు సంబంధించిన స్టార్ రేటింగ్ విధానం నగర వ్యర్థాల నిర్వహణ స్థితిని అంచనా వేసేందుకు ఒకే కొలమానాన్ని అందిస్తుంది. ఇంటింటి వ్యర్థాల సేకరణ, ఉత్పత్తి స్థానంలోనే వ్యర్థాలను వేరు చేయడం దీని ప్రమాణాల్లో ఉన్నాయి. వ్యర్థాలను శాస్త్రీయంగా శుద్ధి చేయడం, దీర్ఘకాలంగా పేరుకుపోయిన చెత్త నిల్వ ప్రాంతాలను పునరుద్ధరించడం కూడా ఇందులో భాగమే. ఈ విధానాలన్నీ కలిపి స్వచ్ఛత ఫలితాలను అంచనా వేసేందుకు ప్రమాణాలను ఏర్పరుస్తాయి.

 


సమాజంలో సానుకూల ప్రవర్తనకు ప్రాధాన్యం కల్పించడం ద్వారా గుర్తింపు భాగస్వామ్యాన్ని బలోపేతం చేయగలదు. ఉత్తమ పనితీరు కనబరిచే సిబ్బంది, సహచరులకు నాయకత్వం వహించేవారు, స్థానికంగా విశేష కృషి చేసినవారికి సహచరుల గుర్తింపు, ప్రభుత్వం నుంచి ప్రశంసా పత్రాల ద్వారా ఎస్‌బీఎం పురస్కారాలు అందించి, సత్కరిస్తుంది. గుర్తింపు ఇతరులు అనుసరించాలనుకునే ఆదర్శాలను కూడా సృష్టించగలదు. అందువల్ల ఈ విధానం వ్యక్తిగత సహకారాన్ని సమష్టి గుర్తింపు, సామాజిక భాగస్వామ్యంతో అనుసంధానిస్తుంది.



స్థానికంగా ఎదురయ్యే నిర్దిష్ట పారిశుధ్య, వ్యర్థాల నిర్వహణ సమస్యల ఆధారంగా కూడా ప్రోత్సాహకాలను రూపొందించవచ్చు. జమ్మూ కశ్మీర్‌లోని పంచాయత్ హల్కా హిల్లర్‌కు చెందిన ఒక ఉదాహరణను స్వచ్ఛతా క్రానికల్స్ నమోదు చేసింది. ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించేలా సమాజాన్ని ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం “గివ్ పాలిథీన్ గెట్ గోల్డ్” కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. స్థానిక ప్రాంతాలను పాలిథీన్ వ్యర్థాల రహితంగా మార్చాలనే లక్ష్యంతో సాగిన ఈ కార్యక్రమానికి యువత, మహిళలు మద్దతు ఇచ్చారు. నిర్దేశిత పరిమాణాల్లో సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలకు బదులుగా రెండు బంగారు నాణేలను ప్రోత్సాహకంగా ప్రకటించారు. చర్యకు ప్రేరేపించేందుకు ఈ కార్యక్రమం అవగాహన, సామాజిక భాగస్వామ్యం, ప్రోత్సాహకాన్ని సమన్వయం చేసింది. కుటుంబాలకు వ‌స్త్ర‌ సంచుల పంపిణీ, సామూహిక శ్రమదాన కార్యక్రమాలు కూడా ఇందులో భాగంగా ఉన్నాయి.

ఈ విధంగా స్వచ్ఛత అలవాట్ల బలోపేతం వివిధ స్థాయుల్లో జరుగుతుంది. నిర్దేశిత విధానాలు ప్రమాణాలను ఏర్పరుస్తాయి, సున్నితమైన ప్రోత్సాహం ఆశించిన చర్యలకు ప్రేరణ కల్పిస్తుంది, గుర్తింపు నిరంతర భాగస్వామ్యాన్ని గౌరవిస్తుంది, సామాజిక ప్రోత్సాహకాలు స్థానికంగా బాధ్యతా భావాన్ని పెంపొందించగలవు. స్వచ్ఛతను ప్రచార కార్యక్రమాల ఆధారంగా జరిగే చర్య నుంచి నిరంతరం కొనసాగే అలవాటుగా మార్చేందుకు ఈ పద్ధతులు తోడ్పడతాయి.

స్వచ్ఛతను కొనసాగించేందుకు ప్రవర్తనపై పర్యవేక్షణ
స్వచ్ఛతను కొనసాగించేందుకు పురోగతిని అంచనా వేసే, తదుపరి చర్యలు అవసరమైన అంశాలను గుర్తించే వ్యవస్థలు అవసరం. అందువల్ల పర్యవేక్షణ మౌలిక సదుపాయాలను కొలవడానికే పరిమితం కాదు. పౌరుల భాగస్వామ్యం, స్థానిక అంచనా, నిరంతర మెరుగుదలకు కూడా అవకాశాలు కల్పిస్తుంది.

స్వచ్ఛ్ సర్వేక్షణ్ ప్రపంచంలోనే అతిపెద్ద పట్టణ పారిశుధ్య సర్వేగా ఎదిగింది. పారిశుధ్యం, పరిశుభ్రత ప్రమాణాల ఆధారంగా నగరాలు, రాష్ట్రాలను అంచనా వేస్తుంది. ఎస్‌బీఎం-యూ కింద ఈ సర్వే ముఖ్యమైన పాలనా సాధనంగా కూడా పరిణామం చెందింది. నగరాలు, రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహిస్తూ స్వచ్ఛ్ సర్వేక్షణ్ మార్పుకు ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. స్థానిక పాలనా వ్యవస్థలు తమ పారిశుధ్య పనితీరును మెరుగుపరచుకునేందుకు ఇది ప్రేరణ కల్పిస్తుంది. ఈ సర్వే ద్వారా పౌరుల భాగస్వామ్యం కూడా గణనీయంగా పెరిగింది. 2016లో మొదటి విడత సర్వేలో సుమారు లక్ష మంది పౌరులు తమ అభిప్రాయాలను అందించారు. 2021లో ఆరో విడత నాటికి ఈ సంఖ్య దాదాపు ఐదు కోట్లకు పెరిగింది. అందువల్ల ఈ సర్వే పారిశుధ్య ఫలితాల అంచనాకు మించిన ప్రయోజనాన్ని అందిస్తుంది. పౌరులు, స్థానిక ప్రభుత్వాలు, పారిశుధ్య వ్యవస్థల మధ్య క్రమబద్ధమైన అనుసంధాన వేదికను సృష్టిస్తుంది.

సమాజ స్థాయిలో పర్యవేక్షణ ప్రవర్తనా మార్పు దీర్ఘకాలం కొనసాగేందుకు కూడా తోడ్పడుతుంది. ఓడీఎఫ్ ప్రకటన తర్వాత నిగ్రానీ సమితులు, సామాజిక నాయకులు, పంచాయతీ ప్రతినిధులు నిరంతరం భాగస్వాములుగా కొనసాగేలా ఎస్‌బీఎం-జీ మార్గదర్శకాలు నిర్దేశిస్తున్నాయి.

కొనసాగుతున్న స్వచ్ఛత ప్రస్థానం
స్వచ్ఛ్ భారత్ మిషన్ (ఎస్‌బీఎం) ప్రస్థానం పారిశుధ్య అలవాట్లు, కమ్యూనికేషన్ విధానాలు రెండింటిలోనూ క్రమంగా చోటుచేసుకున్న పరిణామాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రారంభంలో అవగాహన కల్పించడం, గృహ మరుగుదొడ్లకు డిమాండ్ సృష్టించడంపై ప్రధాన దృష్టి పెట్టారు. ఆ తర్వాత వాటి క్రమమైన వినియోగాన్ని ప్రోత్సహించడం, బహిరంగ మలవిసర్జనను నిర్మూలించడం కోసం కృషి చేశారు. ఈ విజయాలను స్థిరపరుస్తున్న క్రమంలో, ఓడీఎఫ్ స్థితిని కొనసాగించడం, ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణను బలోపేతం చేయడం వైపు దృష్టి విస్తరించింది. ఈ ప్రాధాన్యాలకు అనుగుణంగా కమ్యూనికేషన్ కూడా పరిణామం చెందింది. అవగాహన కల్పన నుంచి మరింత లోతైన అనుబంధం, సమష్టి భాగస్వామ్యం వైపు సాగింది.

ఈ అనుభవాలన్నీ కలిపి ఒక స్థిరమైన పురోగమన దిశను ప్రతిబింబిస్తాయి. సమాచారం నుంచి అనుబంధం వైపు, అనుబంధం నుంచి భాగస్వామ్యం వైపు, భాగస్వామ్యం నుంచి సమాజం నిరంతరం బాధ్యత వహించే స్థితి వైపు ఈ ప్రయాణం సాగింది. ఫలితంగా, ఎస్‌బీఎంలో కమ్యూనికేషన్ పారిశుధ్య వ్యవస్థలో అంతర్భాగంగా మారింది. ప్రజలను మౌలిక సదుపాయాలు, సంస్థలు, సమష్టి చర్యతో అనుసంధానిస్తోంది. స్వచ్ఛత సందేశాన్ని చేరవేయడం మాత్రమే దీని విస్తృత లక్ష్యం కాదు. సమాజ రోజువారీ జీవితంలో భాగంగా నిరంతరం కొనసాగే ఆచరణగా స్వచ్ఛతను పెంపొందించడం దీని లక్ష్యం.

 

References

Ministry of Jal Shakti

https://swachhbharatmission.ddws.gov.in/

https://www.youtube.com/watch?v=5PUCdLSN0dY

https://sbmurban.org/swachh-bharat-mission-progress

https://sbm.gov.in/sbmgdashboard/statesdashboard.aspx

https://swachhbharatmission.ddws.gov.in/communication-material

https://www.pib.gov.in/newsite/printrelease.aspx?lang=1&reg=3&relid=163260

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1533609&reg=48&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1533609&reg=48&lang=2

https://static.pib.gov.in/WriteReadData/specificdocs/documents/2021/sep/doc202191721.pdf

https://www.pib.gov.in/PressNoteDetails.aspx?NoteId=160036&ModuleId=3&reg=3&lang=1

https://swachhbharatmission.ddws.gov.in/sites/default/files/Technical-Notes/IEC_Manual_English.pdf

https://swachhbharatmission.ddws.gov.in/sites/default/files/Guidelines/SBMG-IEC-Guidelines.pdf

https://swachhbharatmission.ddws.gov.in/sites/default/files/Guidelines/Swachhagrahi_Guidelines_2018.pdf

https://swachhbharatmission.ddws.gov.in/sites/default/files/communication-material/Voices_of_Change_Sarpanches_at_the_Forefront.pdf

https://swachhbharatmission.ddws.gov.in/sites/default/files/communication-material/Swachhata-Chronicles-Transformative-Tales-from-India.pdf

https://swachhbharatmission.ddws.gov.in/sites/default/files/Technical-Notes/Voices-from-the-States-29-April-2023.pdf

https://swachhbharatmission.ddws.gov.in/sites/default/files/Studies-and-surveys/Safety-security-and-dignity-of-women.pdf

Ministry of Housing and Urban Affairs

https://sbmurban.org/

https://sbmurban.org/swachh-talk

https://sbmurban.org/storage/app/media/pdf/Swachh-Survekshan-2025-26-Toolkit.pdf

https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=1909611&reg=48&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1846448&reg=48&lang=2

https://sbmurban.org/storage/app/media/pdf/National-Behaviour-Change-Communication-Framework.pdf

Prime Minister's Office

https://archive.pib.gov.in/newsite/erelcontent.aspx?relid=178574

PIB Special Services Features

https://www.pib.gov.in/newsite/printrelease.aspx?relid=171247&reg=48&lang=2

United Nations

https://www.sbcguidance.org/understand/social-and-behaviour-change-communication

PIB Backgrounders

https://www.pib.gov.in/PressNoteDetails.aspx?NoteId=160036&ModuleId=3&reg=3&lang=2

Click here for pdf file

***

(Explainer ID: 160327) आगंतुक पटल : 8
Provide suggestions / comments
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali , Assamese , Punjabi , Tamil , Kannada , Malayalam