• Sitemap
Infrastructure

హరిత రహదారులు

సుస్థిర రహదారి మౌలిక సదుపాయాల దిశగా భారత్ ప్రయాణం

Posted On: 28 SEP 2026 6:35PM

మొక్కల పెంపకం, వాతావరణ మార్పులను తట్టుకునే డిజైన్, వనరులను సమర్థంగా వినియోగించే నిర్మాణ పద్ధతులతో భారత్ చేపట్టిన హరిత రహదారుల విధానం దేశ రహదారి మౌలిక సదుపాయాల రూపురేఖలను మారుస్తోంది. గత ఐదేళ్లలో దాదాపు 1.32 లక్షల కిలోమీటర్ల జాతీయ రహదారుల వెంట 3.61 కోట్లకు పైగా మొక్కలు నాటారు. మియావాకి అడవుల నుంచి పునర్వినియోగ నిర్మాణ సామగ్రి, దేశీయ బయో-బిటుమెన్ సాంకేతికత వరకు పర్యావరణహిత విధానాలు రహదారుల అభివృద్ధిలో కీలకంగా మారుతున్నాయి. జాతీయ రహదారుల హరిత విస్తీర్ణ సూచిక ద్వారా ఉపగ్రహ ఆధారిత పర్యవేక్షణ చేపట్టడంతో పచ్చదనంపై శాస్త్రీయ అంచనా మరింత బలోపేతమవుతోంది. సామాజిక భాగస్వామ్య కార్యక్రమాలు, పాలినేట‌ర్‌ కారిడార్లు ఈ ప్రయత్నాలకు విస్తృత పర్యావరణ కోణాన్ని జోడిస్తున్నాయి.

రహదారుల నిర్మాణం.. పచ్చదనం పెంపు
భారత్‌లో రహదారులు ఇప్పుడు కేవలం ప్రయాణ మార్గాలు మాత్రమే కావు. దేశ మౌలిక సదుపాయాల విస్తృత పరివర్తనలో అవి కీలక భాగంగా మారుతున్నాయి. రహదారి మౌలిక సదుపాయాలు విస్తరిస్తున్న కొద్దీ సమర్థమైన, దృఢమైన, పర్యావరణ బాధ్యతతో కూడిన మార్గాల నిర్మాణంపై దృష్టి పెరుగుతోంది.

గత దశాబ్దంలో భారత్ జాతీయ రహదారుల నెట్‌వర్క్ దాదాపు 61 శాతం పెరిగింది. 2014లో 91,287 కిలోమీటర్లుగా ఉన్న ఈ నెట్‌వర్క్ 2026 మార్చి నాటికి 1,46,572 కిలోమీటర్లకు చేరింది. వేగవంతమైన ఈ అభివృద్ధితో అనుసంధానం మెరుగై, మార్కెట్లకు మ‌రింత చేరువై, ప్రజలు, వస్తువుల రవాణా మరింత వేగం పుంజుకుంది. రహదారి మౌలిక సదుపాయాలు విస్తరిస్తున్న కొద్దీ సమర్థమైన, దృఢమైన, పర్యావరణ బాధ్యతతో కూడిన మార్గాల నిర్మాణంపై దృష్టి పెరుగుతోంది. జాతీయ రహదారుల వెంట భారీ స్థాయిలో మొక్కలు నాటడం, పునర్వినియోగ, వ్యర్థ ఆధారిత సామగ్రిని ఉపయోగించడం, ఇంధన సామర్థ్య నిర్మాణ పద్ధతులు అనుసరించడం, ఉపగ్రహాల సాయంతో హరిత విస్తీర్ణాన్ని పర్యవేక్షించడం వంటి చర్యలు మరింత సుస్థిరమైన రహదారి నెట్‌వర్క్‌కు దోహదం చేస్తున్నాయి.



హరిత రహదారుల విధానం-2015: విధాన పరిణామం
భారత్ జాతీయ రహదారుల నెట్‌వర్క్‌ను పచ్చదనంతో తీర్చిదిద్దే కార్యక్రమానికి ‘హరిత రహదారులు–మొక్కల పెంపకం, మొక్కల మార్పిడి, సుందరీకరణ, నిర్వహణ విధానం-2015’ మార్గనిర్దేశం చేస్తోంది. ఈ విధానాన్ని కింది లక్ష్యాలతో రూపొందించారు:
- జాతీయ రహదారుల వెంట మొక్కల పెంపకానికి విధాన చట్రాన్ని రూపొందించడం.
- చెట్లు, పొదలు వాయు కాలుష్య కారకాలను సహజంగా గ్రహిస్తాయి కాబట్టి వాయు కాలుష్యం, దుమ్ము ప్రభావాన్ని తగ్గించడం.
- రహదారి ప‌క్క‌న ఉండే వాలుల్లో నేల కోతను అరికట్టడం.
- గాలులు, సూర్యకిరణాల ప్రభావాన్ని నియంత్రించడం.
- స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించడం.
ఈ విధానం అమలులో పలు భాగస్వామ్య వర్గాలు పాలుపంచుకుంటున్నాయి. అనుమతి పొందిన పనుల పరిధికి అనుగుణంగా స్వయం సహాయక సంఘాలు, ప్రైవేటు సంస్థలు, రాష్ట్ర అటవీ శాఖలు, అటవీ సంస్థలు, కాంట్రాక్టర్లు మొక్కల పెంపక కార్యక్రమాలు చేపడుతున్నారు. నేష‌న‌ల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్ఏఐ) ప్రాంతీయ కార్యాలయాలు, ఇతర సంస్థల ద్వారా సమగ్ర పర్యవేక్షణ కోసం ప్రత్యేక మొక్కల పెంపక విభాగాన్ని ఏర్పాటు చేశారు.

హరిత మార్గాల దిశగా: మొక్కల పెంపకం, అడవుల అభివృద్ధి
జాతీయ రహదారుల వెంట ఎన్ని మొక్కలు నాటారు, వాటిలో ఎన్ని బతికాయి, వాటి పెరుగుదల ఎలా ఉంది, రహదారి మార్గాల్లో అవి ఎలా విస్తరించాయి అనే అంశాల ఆధారంగా పచ్చదనాన్ని అంచనా వేస్తున్నారు. 2026 జులై నాటికి గత ఐదేళ్లలో దాదాపు 1.32 లక్షల కిలోమీటర్ల జాతీయ రహదారుల వెంట 3.61 కోట్లకు పైగా మొక్కలు నాటారు. మొక్కలు నాటడంతోనే పరిమితం కాకుండా విస్తృత పర్యావరణ నిర్వహణ దిశగా ఈ విధానం రూపాంతరం చెందింది. గతంలో క్షేత్రస్థాయి సిబ్బంది ప్రత్యక్ష పరిశీలనలపైనే మొక్కల పర్యవేక్షణ ప్రధానంగా ఆధారపడేది. ప్రస్తుతం డ్రోన్లు, ఉపగ్రహ ఆధారిత పర్యవేక్షణ కూడా అందుబాటులోకి వచ్చింది. హరిత విస్తీర్ణాన్ని పెంచేందుకు మియావాకి పద్ధతిలో మొక్కల పెంపకాన్ని సైతం ప్రవేశపెట్టారు. రహదారి అభివృద్ధి కోసం చెట్లను తొలగించాల్సి వచ్చిన ప్రాంతాల్లో పరిహార అటవీకరణ, చెట్ల మార్పిడి కార్యక్రమాలు చేపడుతున్నారు.



మొక్కల పెంపకం, సుందరీకరణ జాతీయ రహదారుల అభివృద్ధి, ప్రాజెక్టుల పూర్తిలో అంతర్భాగంగా మారాయి. 2026 సెప్టెంబర్‌లో ఎన్‌హెచ్ఏఐ జారీ చేసిన మార్గదర్శకాలు ఈ విధానానికి మరింత బలం చేకూర్చాయి. మొక్కల పెంపకానికి కేటాయించిన అందుబాటులోని ‘రైట్ ఆఫ్ వే’ (ఆర్‌ఓడబ్ల్యూ) విస్తీర్ణంలో కనీసం 80 శాతం మేర మొక్కలు నాటితేనే తాత్కాలిక పూర్తిస్థాయి ధ్రువీకరణకు అనుగుణంగా ఆ పనులను పరిగణిస్తారు. రహదారి మౌలిక సదుపాయాల నిర్మాణం, నిర్వహణ, మరమ్మతుల కోసం చట్టబద్ధంగా కేటాయించే భూభాగాన్ని ఆర్‌ఓడబ్ల్యూ అంటారు. అధికారుల తనిఖీ సమయంలో నాటిన మొక్కల్లో కనీసం 90 శాతం జీవించి ఉండాలి. నిర్వహణ కాలంలోనూ ఇదే ప్రమాణం వర్తిస్తుంది. జీవించని మొక్కల స్థానంలో సకాలంలో కొత్త మొక్కలు నాటేందుకు నిబంధనలు ఉన్నాయి.

ఉత్తమ విధానాలను ప్రోత్సహించేందుకు ఎన్‌హెచ్ఏఐ 2025లో హరిత రహదారుల ప్రతిభా పురస్కారాలను ప్రవేశపెట్టింది. 2026 పురస్కారాల్లో మొక్కల మనుగడకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. జాతుల వైవిధ్యం, స్థానిక జాతుల వినియోగం, ప్రాంతానికి అనుగుణమైన ప్రణాళికలు, రక్షణ చర్యలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు.
* రహదారి పక్కన మొక్కల పెంపకం విభాగంలో ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్‌హెచ్-16పై చిలకలూరిపేట బైపాస్‌ను ఆరు వరుసలుగా విస్తరించిన ప్రాజెక్టు ప్రథమ బహుమతి సాధించింది.
* మధ్య విభాజకాల్లో మొక్కల పెంపకం విభాగంలో ఎన్‌హెచ్-163పై హైదరాబాద్–యాదగిరి మార్గాన్ని నాలుగు వరుసలుగా విస్తరించిన ప్రాజెక్టుకు ప్రథమ బహుమతి లభించింది.
* భూభాగాల్లో మొక్కల పెంపకం విభాగంలో నాగ్‌పూర్‌లోని ఎన్‌హెచ్-44పై జామ్తా క్లోవర్ లీఫ్ ఆక్సిజన్ బర్డ్ పార్క్ ప్రథమ బహుమతి అందుకుంది.

రహదారిలోని ప్రతి భాగాన్నీ పచ్చదనాన్ని పెంచేందుకు, పరిసర భూభాగాన్ని మెరుగుపరిచేందుకు ఒక అవకాశంగా మార్చవచ్చని పురస్కారాలు పొందిన ఈ కార్యక్రమాలు చాటుతున్నాయి.

మియావాకి విధానంలో పరిమిత స్థలంలో దట్టమైన అడవులను పెంచుతారు. ‘పాట్ ప్లాంటేషన్ పద్ధతి’గా కూడా పిలిచే ఈ విధానంలో చెట్లు, పొదలను దగ్గరదగ్గరగా నాటుతారు. దీంతో అవి వేగంగా పెరిగి, తక్కువ కాలంలోనే అడవిని పోలిన పర్యావరణ వ్యవస్థ ఏర్పడుతుంది. ఈ పద్ధతిలో మొక్కలు సాధారణం కంటే 10 రెట్లు వేగంగా పెరుగుతాయి. అందువల్ల స్థలం తక్కువగా ఉండే పట్టణ ప్రాంతాల్లో పచ్చదన విస్తరణకు ఇది ఎంతో అనుకూలం.

జాతీయ రహదారులు–హరిత విస్తీర్ణ సూచీ (ఎన్‌హెచ్-జీసీఐ)
సుస్థిర రహదారి అభివృద్ధిలో మరో కీలక మైలురాయిగా ‘జాతీయ రహదారుల హరిత విస్తీర్ణ సూచీ (ఎన్‌హెచ్-జీసీఐ) 2025–26’ తొలి వార్షిక నివేదిక విడుదలైంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పరిధిలోని నేష‌న‌ల్ రిమోట్ సెన్సింగ్ సెంట‌ర్‌ (ఎన్‌ఆర్‌ఎస్‌సీ) సహకారంతో ఈ నివేదిక రూపొందింది. జాతీయ రహదారుల వెంట ఆర్‌ఓడబ్ల్యూ పరిధిలో ఉన్న హరిత విస్తీర్ణంపై దేశంలోనే తొలిసారిగా శాస్త్రీయ, పరిమాణాత్మక అంచనాను ఈ నివేదిక అందించింది. 24 రాష్ట్రాల్లో ఆప‌రేష‌న్ ఆండ్ మెయిన్‌టెనెన్స్ (ఓ & ఎం) దశలో ఉన్న దాదాపు 30 వేల కిలోమీటర్ల జాతీయ రహదారులను ఈ అధ్యయనంలో పరిశీలించారు. రుతుపవనాల రాకకు ముందు, ఆ తర్వాత నమోదు చేసిన పరిశీలనలను ఇందులో చేర్చారు. అధునాతన అంతరిక్ష సాంకేతికతల సాయంతో రహదారుల పక్కన మొక్కల పెంపకాన్ని పర్యవేక్షించేందుకు, మెరుగుపరిచేందుకు విశ్వసనీయ ప్రాథమిక ప్రమాణాన్ని రూపొందించారు. జాతీయ రహదారుల వెంట హరిత విస్తీర్ణంలో గణనీయమైన వ్యత్యాసాలు ఉన్నట్లు అంచనా వెల్లడించింది. మొక్కల నిర్వహణను మెరుగుపరిచేందుకు పోలికలు, ర్యాంకులు, లక్ష్య ఆధారిత జోక్యాలకు ఈ ఫలితాలు వీలు కల్పిస్తాయి.

 

A highway with trees and bushesAI-generated content may be incorrect.



భారత్ రహదారి రంగం శిలాజ ఇంధన ఆధారిత సామగ్రి నుంచి జీవ ఆధారిత, పునరుత్పాదక పరిష్కారాల దిశగా అడుగులు వేస్తోంది. వ్యవసాయ అవశేషాలను పైరోలిసిస్ ప్రక్రియకు గురిచేసి తయారు చేసిన బయో-బిటుమెన్ సాంకేతికత బదిలీతో 2026 జనవరిలో కీలక శాస్త్రీయ పురోగతి నమోదైంది. విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థల్లోని శాస్త్రీయ ఫలితాలు, పరిజ్ఞానం, మేధోసంపత్తిని ప్రభుత్వ, ప్రైవేటు వినియోగదారులకు చేరవేసే ప్రక్రియను సాంకేతికత బదిలీ (టీటీ) అంటారు.

‘పైరోలిసిస్ ద్వారా బయో-బిటుమెన్: వ్యవసాయ అవశేషాల నుంచి రహదారుల వరకు’ పేరుతో ఈ సాంకేతికతను న్యూఢిల్లీలోని సీఎస్‌ఐఆర్–కేంద్ర రహదారి పరిశోధనా సంస్థ (సీఎస్‌ఐఆర్–సీఆర్‌ఆర్‌ఐ), డెహ్రాడూన్‌లోని సీఎస్‌ఐఆర్–భారత పెట్రోలియం సంస్థ (సీఎస్‌ఐఆర్–ఐఐపీ) సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. రహదారుల నిర్మాణంలో ఉపయోగించే సేంద్రీయ ద్రవాలు, హైడ్రోకార్బన్ల మిశ్రమమే బిటుమెన్. రహదారి నిర్మాణ పరిశ్రమలో దీన్ని ‘నల్ల బంగారం’గా పిలుస్తారు. ప్రస్తుతం భారత్ తన బిటుమెన్ అవసరాల్లో దాదాపు 50 శాతాన్ని దిగుమతుల ద్వారా సమకూర్చుకుంటోంది. బయో-బిటుమెన్ వంటి ఆవిష్కరణలతో దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడంతోపాటు దేశీయ ఉత్పత్తి సామర్థ్యాన్ని బలోపేతం చేయవచ్చు.



ఈ ప్రక్రియలో పంట కోత తర్వాత మిగిలే వరి గడ్డిని ముడిసరుకుగా తీసుకుని పైరోలిసిస్ ద్వారా బయో-ఆయిల్ తయారు చేస్తారు.

ఆ తర్వాత బయో-ఆయిల్‌ను సంప్రదాయ బిటుమెన్‌తో కలిపి బయో-బిటుమెన్ మిశ్రమాన్ని తయారు చేస్తారు. బయోమాస్ పైరోలిసిస్ సాంకేతికతతో రహదారులకు అవసరమైన బయో-బైండర్లు, ఇంధన సామర్థ్య వాయు ఇంధనం, జీవ పురుగుమందుల భాగాలు, అధిక నాణ్యతగల కార్బన్ వంటి పలు విలువైన ఉత్పత్తులు లభిస్తాయి. బ్యాటరీలు, నీటి శుద్ధి, అధునాతన సామగ్రి తయారీలో వీటిని ఉపయోగించవచ్చు. తద్వారా భవిష్యత్తుకు ఉద్గార రహిత, తక్కువ వ్యయ పరిష్కారం అందుబాటులోకి వస్తుంది.

మేఘాలయలోని జోరాబాట్–షిల్లాంగ్ ఎక్స్‌ప్రెస్‌వే (ఎన్‌హెచ్-40)పై బయో-బిటుమెన్‌తో 100 మీటర్ల ప్రయోగాత్మక రహదారిని విజయవంతంగా నిర్మించారు. ఈ సాంకేతికత వ్యవసాయ అవశేషాల నిర్వహణకూ తోడ్పడుతుంది. జాతీయ రహదారుల నిర్మాణ ప్రమాణాల్లో దీన్ని చేర్చేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. దీంతో ఒకే ఏడాదిలో బయో-బిటుమెన్ సాంకేతికతను పారిశ్రామిక, వాణిజ్య స్థాయికి విస్తరించిన తొలి దేశంగా భారత్ నిలిచింది.

రహదారి నిర్మాణంలో పునర్వినియోగ సామగ్రి, పారిశ్రామిక ఉప ఉత్పత్తుల వినియోగం పెరగడంలోనూ ప్రత్యామ్నాయ పదార్థాల దిశగా మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఉప ఉత్పత్తిగా వచ్చే ఫ్లై యాష్, పాండ్ యాష్‌ను రహదారి కట్టలు, నిర్మాణ పనుల్లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగా తిరిగి సేకరించిన ఆస్ఫాల్ట్ పేవ్‌మెంట్ (ఆర్ఏపీ), నిర్మాణ–కూల్చివేత వ్యర్థాలు (సీ అండ్ డీ), పునర్వినియోగ కంకరను అనువైన రహదారి పనుల్లో వాడుతున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలు, స్లాగ్, క్రంబ్ రబ్బర్, బయో-బిటుమెన్, ఇతర పునర్వినియోగ లేదా పారిశ్రామిక ఉప ఉత్పత్తుల వినియోగాన్నీ ప్రోత్సహిస్తున్నారు. ఈ విధానాలు వనరుల సామర్థ్యాన్ని మెరుగుపరచి, సహజ వనరులను పరిరక్షించడంతోపాటు రహదారి నిర్మాణంతో తలెత్తే పర్యావరణ సమస్యల పరిష్కారానికి తోడ్పడుతున్నాయి.

సామాజిక భాగస్వామ్యం, ప్రజల్లో అవగాహన
హరిత రహదారుల కార్యక్రమాల ప్రభావం క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనిపిస్తోంది. మొక్కల పెంపకాన్ని జీవవైవిధ్యం, సామాజిక భాగస్వామ్యంతో అనుసంధానిస్తున్నారు. రహదారి ప్రదేశాలను విస్తృత పర్యావరణ కార్యక్రమాలకు వేదికలుగా ఎలా మార్చవచ్చో వివిధ రాష్ట్రాల అనుభవాలు తెలియజేస్తున్నాయి.

రహదారి పచ్చదనాన్ని పాలినేట‌ర్‌ కారిడార్లుగా మార్చడం
రహదారుల వెంట హరిత మార్గాలు నీడ, సుందరీకరణకే పరిమితం కాకుండా మరిన్ని ప్రయోజనాలు అందించగలవు. ఢిల్లీ–అమృత్‌సర్–కత్రా ఎక్స్‌ప్రెస్‌వేలో గుర్తించిన కొన్ని ప్రాంతాల్లో ‘ట్రీస్ ఫర్ బీస్’ ప్రచారం కింద పరాగసంపర్క జీవుల(పాలినేట‌ర్‌) కారిడార్లను అభివృద్ధి చేస్తున్నారు. అన్ని కాలాల్లో తేనె, పుప్పొడి లభించేలా పుష్పించే, స్థానిక పరిస్థితులకు అనువైన మొక్కల జాతులను ఈ కార్యక్రమంలో వినియోగిస్తున్నారు. తద్వారా తేనెటీగలు, ఇతర పరాగసంపర్క జీవులకు నిరంతర ఆవాసం ఏర్పడుతుంది.

పచ్చదనాన్ని కాపాడటం
ఆంధ్రప్రదేశ్ జాతీయ రహదారుల నెట్‌వర్క్ వెంట మొక్కల పెంపకం నిరంతరంగా సాగుతోంది. 2010 నుంచి 2025 మధ్య రహదారి పక్కన, మధ్య విభాజకాల్లో దాదాపు 18 లక్షల మొక్కలు నాటారు. వాతావరణ మార్పుల ప్రతికూల ప్రభావాన్ని తగ్గించేందుకు, రహదారి వినియోగదారులకు సురక్షిత ప్రయాణాన్ని కల్పించేందుకు ఈ మొక్కలను సంరక్షిస్తున్నారు.

2026–27లో రాష్ట్రవ్యాప్తంగా రహదారి పక్కన, మధ్య విభాజకాల్లో మరో 3.86 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించారు. 2026 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమం కింద ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దాదాపు 3,200 మొక్కలు నాటారు.

రహదారుల వెంట మొక్కలు నాటే స్థాయి నుంచి ప్రజల సహకారంతో దీర్ఘకాలం కొనసాగే హరిత మార్గాలను పెంపొందించే దిశగా మార్పు వచ్చినట్లు ఈ ప్రయత్నాలు తెలియజేస్తున్నాయి.

రేపటి రహదారుల నిర్మాణం
భారీ స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పన, పర్యావరణ పరిరక్షణ కలిసే కీలక దశలో భారత్ రహదారి రంగం ప్రస్తుతం నిలిచింది. క్షేత్రస్థాయి మొక్కల పెంపకం నుంచి దేశీయ బయో-బిటుమెన్ వరకు ప్రతి కార్యక్రమంలోనూ ఒకే సందేశం కనిపిస్తోంది. పచ్చదనాన్ని త్యాగం చేయకుండానే అభివృద్ధిని సాధించవచ్చు. భారత్ విస్తృత జాతీయ ప్రాధాన్యాల్లో హరిత రహదారుల ప్రస్థానం అంతర్భాగంగా ఉంది. వాతావరణ కార్యాచరణ, స్వావలంబన, సమ్మిళిత వృద్ధి ఇందులో భాగంగా ఉన్నాయి. సుస్థిర, సాంకేతిక ఆధారిత మౌలిక సదుపాయాల ద్వారా ‘వికసిత భారత్’ దార్శనికతకు ఇది మరింత బలం చేకూరుస్తోంది. భారత్ రహదారుల నెట్‌వర్క్ విస్తరిస్తున్న కొద్దీ దాని వెంట పచ్చదనం కూడా పెరుగుతోంది.

 

 References

Ministry of Road Transport & Highways / NHAI

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2272639&reg=48&lang=2

https://www.pib.gov.in/newsite/PrintRelease.aspx?relid=128298&reg=3&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2291229&reg=3&lang=1

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1794693&reg=48&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2145745&reg=48&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2226651&reg=1&lang=1

https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=2042496&reg=48&lang=2

https://www.pib.gov.in/Pressreleaseshare.aspx?PRID=2145745&reg=3&lang=2

https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=2086035

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2039982&reg=48&lang=2

https://nhai.gov.in/nhai/sites/default/files/mix_file/NRSC_NH-GCI_FinalReport_09Dec2025.pdf

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2237080&reg=3&lang=1

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2269433&reg=48&lang=2

https://nhai.gov.in/nhai/sites/default/files/mix_file/NRSC_NH-GCI_FinalReport_09Dec2025.pdf

Ministry of Science & Technology / CSIR

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2212118&lang=1&reg=1

Ministry of Agriculture & Farmers Welfare

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2246872&reg=20&lang=1

Click here to see pdf 

***

(Explainer ID: 160228) आगंतुक पटल : 16
Provide suggestions / comments
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , हिन्दी , Bengali , Kannada , Malayalam