• Sitemap
Social Welfare

ప్రధానమంత్రి అనుసూచిత్‌ జాతి అభ్యుదయ్‌ యోజన (పీఎం–అజయ్‌)

ప్రగతికి మార్గాల నిర్మాణం

Posted On: 28 SEP 2026 12:04PM

దేశ జనాభాలో 16.6 శాతం ఉన్న షెడ్యూల్డ్‌ కులాలు సామాజిక–ఆర్థిక పురోగతి, సమాజంలో భాగస్వామ్యం విషయంలో చారిత్రకంగా అనేక అడ్డంకులను ఎదుర్కొన్నాయి. సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, భారత అభివృద్ధి ప్రయాణంలో విస్తృత భాగస్వామ్యాన్ని నిర్ధారించాలంటే ఈ అసమానతలను పరిష్కరించడం ఎంతో అవసరం. ఈ అభివృద్ధి అంతరాలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్డ్‌ కులాల సమగ్ర అభివృద్ధి కోసం ప్రధానమంత్రి అనుసూచిత్‌ జాతి అభ్యుదయ్‌ యోజన (పీఎం–అజయ్‌)ను ప్రారంభించింది.

 

సమ్మిళిత సాధికారతకు దార్శనికత

ప్రధానమంత్రి అనుసూచిత్‌ జాతి అభ్యుదయ్‌ యోజన (పీఎం–అజయ్‌) 2021–22 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభమైన ప‌థ‌కం. ఈ ప‌థ‌కానికి కేంద్ర ప్రభుత్వం 100 శాతం నిధులు అందిస్తుంది. సమగ్ర విధానం ద్వారా షెడ్యూల్డ్‌ కులాల సామాజిక–ఆర్థిక, విద్యా సాధికారతను సాధించడం దీని లక్ష్యం. పథకాన్ని వేగంగా, నాణ్యంగా అమలు చేసేందుకు ప్రభుత్వం ‘పీఎం–అజయ్‌’ మొబైల్‌ యాప్‌, ‘పీఎం–అజయ్‌’ పోర్టల్‌ను ప్రారంభించింది.

గతంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమలైన ప్రధానమంత్రి ఆదర్శ్‌ గ్రామ్‌ యోజన (పీఎంఏజీవై), షెడ్యూల్డ్‌ కులాల ఉప ప్రణాళికకు ప్రత్యేక కేంద్ర సహాయం (ఎస్‌సీఏ టు ఎస్‌సీఎస్‌పీ), బాబూ జగ్జీవన్‌ రామ్‌ ఛాత్రవాస్‌ యోజన (బీజేఆర్‌సీవై)లను విలీనం చేసి పీఎం–అజయ్‌ను రూపొందించారు. సామాజిక న్యాయం–సాధికారత మంత్రిత్వ శాఖ ఈ పథకాన్ని అమలు చేస్తోంది. అందరికీ అభివృద్ధి ఫలాలు అందించాలనే విస్తృత లక్ష్యాన్ని ఈ కింది మూడు ప్రధాన ఉద్దేశాల ద్వారా ఆచరణలోకి తీసుకొస్తోంది:

- నైపుణ్యాభివృద్ధి, ఆదాయాన్ని అందించే పథకాలు, ఇతర కార్యక్రమాల ద్వారా అదనపు ఉపాధి అవకాశాలను సృష్టించి షెడ్యూల్డ్‌ కులాల్లో పేదరికాన్ని తగ్గించడం. జీవనోపాధి అవకాశాలను మెరుగుపరుస్తూ లబ్ధిదారులు సుస్థిర ఆదాయ కార్యకలాపాల్లో పాల్గొనేందుకు ఈ చర్యలు తోడ్పడతాయి.

- షెడ్యూల్డ్‌ కులాలు అధికంగా నివసించే ప్రాంతాల్లో తగిన మౌలిక సదుపాయాలు, అవసరమైన సేవలను కల్పించి సామాజిక–ఆర్థిక అభివృద్ధి సూచికలను మెరుగుపరచడం. కీలక అభివృద్ధి అంతరాలను తగ్గిస్తూ మెరుగైన జీవన ప్రమాణాలకు అవసరమైన ప్రాథమిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడం ఈ పథక లక్ష్యం.

- షెడ్యూల్డ్‌ కులాల్లో అక్షరాస్యత పెంచి, పాఠశాలలు, ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాలను ప్రోత్సహించడం. ముఖ్యంగా ఆకాంక్షిత జిల్లాలు, షెడ్యూల్డ్‌ కులాలు అధికంగా ఉండే మండలాలు, దేశంలోని ఇతర ప్రాంతాల్లో నాణ్యమైన విద్యాసంస్థలు, గురుకులాల్లో తగిన వసతి సదుపాయాలను కల్పించడం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధిస్తారు.

 

 

 

పీఎం–అజయ్‌ ప్రయోజనాలు ఎవరికి లభిస్తాయి?

పథకం ఎవరి కోసం రూపొందించారో వారికి ప్రయోజనాలు చేరేలా పీఎం–అజయ్‌లో స్పష్టమైన అర్హత నిబంధనలు ఉన్నాయి. ఈ కింది ప్రమాణాల ఆధారంగా పథక ప్రయోజనాలకు అర్హత నిర్ణయిస్తారు:

- సహాయక నిధుల విభాగంలో లబ్ధిదారులను ఎంపిక చేసేటప్పుడు వార్షిక ఆదాయం ₹2.50 లక్షలకు మించని కుటుంబాలు లేదా వ్యక్తులకు ప్రాధాన్యం ఇస్తారు. షెడ్యూల్డ్‌ కులాలు అధికంగా ఉండే బృందాల్లోని ఎస్సీ సభ్యులు కూడా అర్హులు.

- మౌలిక సదుపాయాల అభివృద్ధి విషయంలో షెడ్యూల్డ్‌ కులాల జనాభా 40 శాతం లేదా అంతకంటే ఎక్కువగా ఉండి, మొత్తం జనాభా కనీసం 500 ఉన్న గ్రామాలు పథకం కింద నిధులకు అర్హత పొందుతాయి.

 

ఆచరణలో పీఎం–అజయ్‌

 

అభివృద్ధిలోని పలు అంశాలను పరిష్కరించేందుకు పీఎం–అజయ్‌ను మూడు ప్రత్యేక విభాగాలతో రూపొందించారు:

 

ఆద‌ర్శ గ్రామాలుగా షెడ్యూల్డ్‌ కులాలు అధికంగా ఉన్న గ్రామాల అభివృద్ధి

మౌలిక సదుపాయాలు, సేవల్లోని కీలక అంతరాలను తొలగిస్తూ షెడ్యూల్డ్‌ కులాలు అధికంగా ఉండే గ్రామాలను ‘ఆదర్శ్ గ్రామాలు’గా మార్చడం ఈ విభాగం లక్ష్యం. ఆదర్శ్‌ గ్రామ్‌ విభాగం 47,243 గ్రామాలను పరిధిలోకి తీసుకుని, దేశవ్యాప్తంగా 47.79 లక్షల మందికి పైగా పౌరులకు ప్రయోజనం కల్పించింది. మొత్తం 46,944 అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. 27,032 గ్రామాభివృద్ధి ప్రణాళికలు(వీడీపీ) సిద్ధమయ్యాయి. 2026 సెప్టెంబర్‌ 8 నాటికి 18,093 గ్రామాలను ఆదర్శ్‌ గ్రామ్‌లుగా ప్రకటించారు. షెడ్యూల్డ్‌ కులాలు అధికంగా ఉండే గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, ప్రాథమిక సేవలు, జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్న తీరును ఈ పురోగతి తెలియజేస్తోంది.

 

 

 

‘ఆదర్శ్‌ గ్రామ్‌’లో ప్రజలకు వివిధ ప్రాథమిక సేవలు అందుబాటులో ఉంటాయి. సమాజంలోని అన్ని వర్గాల కనీస అవసరాలను పూర్తిగా తీర్చడంతో పాటు అసమానతలను సాధ్యమైనంత వరకు తగ్గిస్తారు. గౌరవప్రదమైన జీవనానికి అవసరమైన మౌలిక సదుపాయాలు, ప్రాథమిక సేవలు ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండే గ్రామాలుగా వీటిని తీర్చిదిద్దుతారు. తద్వారా ప్రతి నివాసి తన పూర్తి సామర్థ్యాన్ని సాధించేందుకు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది.

 

రాష్ట్రాలు, జిల్లాల్లో సామాజిక–ఆర్థిక ప్రాజెక్టులకు సహాయక నిధులు

షెడ్యూల్డ్‌ కులాల సామాజిక–ఆర్థిక అభ్యున్నతిని లక్ష్యంగా చేసుకున్న జిల్లా, రాష్ట్ర స్థాయి ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం అందిస్తారు. ఇందులో:

1. నైపుణ్యాభివృద్ధి, అనుబంధ మౌలిక సదుపాయాలతో కూడిన సమగ్ర జీవనోపాధి ప్రాజెక్టుల ద్వారా లక్షిత ప్రజల ఆదాయాన్ని పెంచడం.

2. షెడ్యూల్డ్‌ కులాలు అధికంగా ఉండే గ్రామాల్లో తగిన మౌలిక సదుపాయాలను కల్పించి సామాజిక–ఆర్థిక అభివృద్ధి సూచికలను మెరుగుపరచడం.

3. అవసరమైన ప్రాంతాల్లో గురుకులాలను ఏర్పాటు చేసి అక్షరాస్యత పెంచడం, పాఠశాలల్లో షెడ్యూల్డ్‌ కులాల ప్రవేశాలను ప్రోత్సహించడం.

సహాయక నిధుల విభాగం కింద 2021–22 నుంచి 2025–26 ఆర్థిక సంవత్సరాల మధ్య ₹1,730 కోట్లకు పైగా నిధులను నేరుగా రాష్ట్రాలకు విడుదల చేశారు. 2.5 లక్షలకు పైగా వ్యక్తిగత, బృంద లబ్ధిదారులకు నైపుణ్య శిక్షణ, జీవనోపాధి సహకారం అందించారు.

 

వసతిగృహాల నిర్మాణం, మరమ్మతులు

- షెడ్యూల్డ్‌ కులాల విద్యార్థులు నాణ్యమైన విద్యను పొందేలా ప్రోత్సహించేందుకు వసతిగృహాల నిర్మాణం, మరమ్మతులు చేపడుతున్నారు. దేశంలోని గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు ఇవి ఎంతో ఉపయోగకరం. 2026 సెప్టెంబర్‌ నాటికి మొత్తం 785 విద్యార్థి వసతిగృహాలు పూర్తయ్యాయి. 264 మంది విద్యార్థులకు వసతి కల్పించేలా ఒక బాలికల, ఒక బాలుర వసతిగృహం నిర్మాణానికి 2026–27 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ₹61.46 కోట్ల సహాయాన్ని కేటాయించింది.

 

సాధికారతపై పెట్టుబడి

ఏ సంక్షేమ కార్యక్రమాన్నైనా సమర్థంగా అమలు చేయాలంటే నిరంతర ఆర్థిక సహకారం అవసరం. పీఎం–అజయ్‌ నిధుల విధాన వివరాలు ఇలా ఉన్నాయి.

నిధుల వివరాలు

అంశం

వివరాలు

నిధుల విధానం

కేంద్ర ప్రభుత్వం 100 శాతం నిధులు అందించే పథకం

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వాటా

అవసరమైతే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అదనపు వనరులను సమకూర్చవచ్చు

విభాగాలవారీ కేటాయింపులు

ఎంపిక చేసిన ఆదర్శ్‌ గ్రామ్‌ గ్రామాల్లో అభివృద్ధి అంతరాలను పూరించే పనులకు 50 శాతం వరకు; కేంద్ర స్థాయిలో సాంకేతిక సహాయ బృందం, ప్రాజెక్టు అమలు విభాగాలు, రాష్ట్ర–జిల్లా స్థాయిలో ప్రాజెక్టు అమలు విభాగాల ఏర్పాటు, నిర్వహణకు 5 శాతం వరకు; కేంద్ర సంస్థల్లో వసతిగృహాల నిర్మాణం, మరమ్మతులకు 2 శాతం వరకు—ఈ నిధులను మంత్రిత్వ శాఖ నేరుగా అమలు సంస్థలకు విడుదల చేస్తుంది; మిగిలిన నిధులను జిల్లా, రాష్ట్ర స్థాయి ప్రాజెక్టుల సహాయక నిధుల కోసం కేటాయిస్తారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో షెడ్యూల్డ్‌ కులాల జనాభా, వార్షిక ప్రణాళికలో రాష్ట్ర ఎస్సీఎస్‌పీ వాటాను ఎస్సీ జనాభాతో పోల్చిన నిష్పత్తి ఆధారంగా కేటాయింపులు జరుగుతాయి.

నిర్వహణ

పథకం కింద మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు పూర్తయ్యాక వాటి సంరక్షణ, నిర్వహణ బాధ్యతలను సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు లేదా అమలు సంస్థలు చేపడతాయి.

 

సమర్థ పాలన దిశగా డిజిటల్‌ ముందడుగు

కాగితాల ఆధారిత కార్యకలాపాలు, దరఖాస్తు ప్రక్రియ నుంచి ఎప్పటికప్పుడు పనిచేసే పూర్తిస్థాయి డిజిటల్‌ విధానానికి మారడం లక్ష్యంగా ఇటీవల ‘పీఎం–అజయ్‌’ మొబైల్‌ యాప్‌, ‘పీఎం–అజయ్‌’ పోర్టల్‌ను ప్రారంభించారు.

 

 

 

పారదర్శకత, జవాబుదారీతనం, సామర్థ్యం సుపరిపాలనకు పునాదులు. డిజిటల్‌ సాంకేతికతలు ప్రభుత్వ కార్యక్రమాల ప్రణాళిక, సేవల పంపిణీ, పర్యవేక్షణ తీరును మార్చాయి. సాంకేతిక పరిజ్ఞానం ఆధారిత పాలన సమాచారాన్ని సులభంగా అందుబాటులోకి తెస్తుంది, పర్యవేక్షణను బలోపేతం చేస్తుంది, గణాంకాల ఆధారంగా నిర్ణయాలు తీసుకునేందుకు సహకరిస్తుంది. కార్యక్రమాల అమలులో సమన్వయం, పారదర్శకత, మొత్తం ప్రభావాన్ని కూడా మెరుగుపరుస్తుంది.

 

భారత వృద్ధి గాథలో తదుపరి అధ్యాయం

 

అభివృద్ధి ఫలాలు సమాజంలోని ప్రతి వర్గానికీ చేరి, అందరికీ పురోగతి అవకాశాలు కల్పించాలనే సూత్రంపై వికసిత భారత్‌@2047 ప్రయాణం ఆధారపడి ఉంది. సుస్థిర జీవనోపాధులు, నాణ్యమైన విద్య, మెరుగైన మౌలిక సదుపాయాలను ప్రోత్సహించే లక్షిత కార్యక్రమాల ద్వారా షెడ్యూల్డ్‌ కులాల సామాజిక–ఆర్థిక, విద్యా సాధికారతను ముందుకు తీసుకెళ్లడంలో పీఎం–అజయ్‌ కీలక పాత్ర పోషిస్తోంది. పథకం విస్తరిస్తున్న కొద్దీ సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, పటిష్ఠమైన పర్యవేక్షణ వ్యవస్థలు, చివరి లబ్ధిదారు వరకు సేవల పంపిణీ దీని ప్రభావం, పరిధిని మెరుగుపరుస్తున్నాయి. వ్యక్తులు, సమాజాలు తమ పూర్తి సామర్థ్యాన్ని సాధించి భారత అభివృద్ధి ప్రయాణంలో చురుగ్గా పాల్గొనేలా సాధికారత కల్పిస్తూ మరింత సమ్మిళిత, సమానత్వ, సాధికార దేశ నిర్మాణానికి పీఎం–అజయ్‌ నిరంతరం తోడ్పడుతుంది.

 

References

Ministry of Social Justice and Empowerment:

https://socialjustice.gov.in/

https://socialjustice.gov.in/schemes/104

https://socialjustice.gov.in/writereaddata/UploadFile/71441776233188.pdf

https://pmajay.dosje.gov.in/

https://pmajay.dosje.gov.in/Writereaddata/Guidelines.pdf

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2265530&reg=3&lang=1

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2285859&reg=48&lang=1

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2268689&reg=48&lang=1

https://www.indiabudget.gov.in/doc/eb/sbe93.pdf

Ministry of Finance:

https://www.indiabudget.gov.in/doc/OutcomeBudgetE2026_2027.pdf

myScheme:

https://www.myscheme.gov.in/schemes/pmajay-ag

Click here to see pdf 

 

***

(Explainer ID: 160221) आगंतुक पटल : 9
Provide suggestions / comments
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali , Kannada