Infrastructure
భారత్ మారిటైమ్ ఇన్సూరెన్స్ పూల్
భారత సముద్ర సార్వభౌమత్వానికి బలం
Posted On:
27 SEP 2026 11:40AM
భారత వాణిజ్యంలో సముద్ర మార్గాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. దేశ సరకు రవాణా, ఇంధన సరఫరాలో అధిక భాగం సముద్ర మార్గాల ద్వారానే సాగుతోంది. భారత పతాకంతో నడిచే నౌకలు, భారతీయ సంస్థల యాజమాన్యం, నిర్వహణ లేదా నియంత్రణలో ఉండే నౌకలు, భారత్‌కు వచ్చే లేదా భారత్ నుంచి బయలుదేరే సరకు నౌకలకు సంబంధించిన హల్ & మెషినరీ నష్టాలకు భారత్ మారిటైమ్ ఇన్సూరెన్స్ పూల్ (బీఎంఐపీ) బీమా రక్షణ అందిస్తుంది. ₹13,906.50 కోట్ల(150 కోట్ల అమెరికన్ డాలర్ల) వరకు బీమా సామర్థ్యంతో దీన్ని 2026 మేలో ప్రారంభించారు. నౌక ప్రధాన నిర్మాణం, యంత్రాలు, సరకు, రక్షణ, నష్టపరిహారం, యుద్ధ ముప్పులకు దేశీయ బీమా రక్షణ కల్పిస్తోంది. విదేశీ బీమా సంస్థలపై ఆధారపడటాన్ని తగ్గిస్తూ అంతర్జాతీయ అంతరాయాల సమయంలోనూ అందుబాటు ధరలో నిరంతర బీమా సేవలను నిర్ధారిస్తోంది. దేశీయ బీమా సంస్థలు పాలసీలు జారీ చేస్తాయి. సభ్య సంస్థలు అంగీకరించిన సామర్థ్యం ఆధారంగా నష్టభయాన్ని ఉమ్మడిగా పునర్‌బీమా చేస్తాయి. 10 కోట్ల అమెరికన్ డాలర్ల వరకు క్లెయిమ్‌లను నిల్వ నిధులతో పరిష్కరిస్తారు. అంతకంటే పెద్ద క్లెయిమ్‌లకు ప్రభుత్వ హామీని ఉపయోగిస్తారు. ప్రారంభమైనప్పటి నుంచి తీరప్రాంత నౌకలకు యుద్ధ ముప్పు, రక్షణ, నష్టపరిహార పాలసీలను బీఎంఐపీ జారీ చేసింది. బీమా ప్రీమియంలను తగ్గించి, భారత సముద్ర సార్వభౌమత్వాన్ని బలోపేతం చేసింది.
స్థూల దృష్టి
ప్రపంచంలోని ప్రముఖ వాణిజ్య దేశాల్లో భారత్ ఒకటి. దేశ వాణిజ్యంలో అధిక భాగం సముద్ర మార్గాల ద్వారా సాగుతోంది. సముద్రం భారత్‌కు రవాణా మార్గం మాత్రమే కాదు; వాణిజ్యానికి వెన్నెముక. ఇది ఇంధన భద్రతకు మద్దతు ఇస్తూ జాతీయ ఆర్థిక వ్యవస్థలోని విభిన్న రంగాల వృద్ధికి తోడ్పడుతోంది. ముడి చమురు దిగుమతుల నుంచి వస్తు ఎగుమతుల వరకు భారత ఆర్థిక వ్యవస్థలో దాదాపు ప్రతి రంగానికీ సముద్ర అనుసంధానం ఆధారంగా నిలుస్తోంది. తీరప్రాంత నౌకాయానం, అంతర్గత జలమార్గాలు ఈ రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ వాణిజ్యంలో స్థిరత్వం, సామర్థ్యాన్ని పెంచుతున్నాయి.
భారత సముద్ర వాణిజ్యం విస్తరించినా, కీలక సముద్ర బీమా సేవలకు విదేశీ సంస్థలపైనే అధికంగా ఆధారపడాల్సి వస్తోంది. రక్షణ, నష్టపరిహార(పీ&ఐ) ప్రీమియంల రూపంలో ఏటా 4.5 కోట్ల నుంచి 6 కోట్ల అమెరికన్ డాలర్లు విదేశాలకు వెళ్తున్నాయి. వీటితో పాటు ఇతర సముద్ర బీమా చెల్లింపులు కూడా విదేశీ సంస్థలకు చేరుతున్నాయి.
దేశీయ సముద్ర బీమా సామర్థ్యంలో ఉన్న ఈ వ్యూహాత్మక లోటును పూరించేందుకు సార్వభౌమ పరిష్కారంగా భారత్ సముద్ర బీమా సమూహాన్ని రూపొందించారు. 2026 ఏప్రిల్ 18న దీనికి ఆమోదం లభించగా, మే 12న అధికారికంగా ప్రారంభించారు. ₹13,906.50 కోట్ల(150 కోట్ల అమెరికన్ డాలర్ల) సామర్థ్యంతో ఏర్పాటైన దేశ తొలి సముద్ర బీమా సమూహం ఇది. ₹12,980 కోట్ల(140 కోట్ల అమెరికన్ డాలర్ల) ప్రభుత్వ హామీ దీనికి ఉంది. అధిక విలువ కలిగిన భారత నౌకలకు భారతీయ కంపెనీలు తొలిసారిగా స్వతంత్రంగా బీమా అందిస్తున్నాయి. నౌక ప్రధాన నిర్మాణం & యంత్రాలు, అధిక ముప్పు ప్రాంతాల్లో యుద్ధ ప్రమాదాల నుంచి సరకు రక్షణ, రక్షణ & నష్టపరిహారం దీని పరిధిలో ఉన్నాయి.
భారత సముద్ర రంగం: సముద్రాలతో కూడిన దేశం
దేశవ్యాప్తంగా విభిన్న రకాల సరకు రవాణాను నిర్వహించే 12 ప్రధాన, 217 ఇతర నౌకాశ్రయాలు భారత్‌లో ఉన్నాయి. ప్రధాన, ఇతర నౌకాశ్రయాలు 2025–26లో 166.8 కోట్ల మెట్రిక్ టన్నుల సరకు రవాణాను నిర్వహించాయి. ఆర్థిక వృద్ధి, వాణిజ్య విస్తరణతో ఈ పరిమాణం పెరుగుతోంది.
- భారత తీరప్రాంతం దాదాపు 11,098 కిలోమీటర్ల మేర విస్తరించింది. ప్రపంచంలోని పొడవైన తీరప్రాంతాల్లో ఇది ఒకటి. సహజ నౌకాశ్రయాలు, పోర్టుల ఏర్పాటుకు అనువైన ప్రాంతాలు ఇందులో ఉన్నాయి.
- ప్రత్యేక ఆర్థిక మండలి 24 లక్షల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించింది. సముద్ర వనరులు, చేపల వేటపై భారత్‌కు సార్వభౌమ హక్కులను ఇది కల్పిస్తోంది.
- అంతర్గత జలమార్గాలు 14,500 కిలోమీటర్లకు పైగా ఉన్నాయి. నదులు, కాలువలు, వెనుక జలాల ద్వారా తక్కువ వ్యయంతో సరకు రవాణాకు ఇవి అవకాశం కల్పిస్తున్నాయి.
- తీర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సముద్ర సరిహద్దు ఉంది. దీంతో అక్కడి జనాభా, పరిశ్రమలు సముద్ర వాణిజ్య ప్రయోజనాలను పొందగలుగుతున్నాయి.
- మత్స్యకారులు, నౌకాశ్రయ కార్మికులు, నావికులు, నౌకా నిర్మాణ సిబ్బంది సహా మూడు కోట్ల మందికి పైగా సముద్ర ఆధారిత జీవనోపాధి లభిస్తోంది.
భారత్‌కు బీఎంఐ పూల్ అవసరం ఏంటి?
భారత పతాకంతో నడిచే నౌకల సంఖ్య 2026 మధ్య నాటికి 1,609కు చేరింది. వాటి మొత్తం సామర్థ్యం 1.433 కోట్ల స్థూల టన్నులుగా ఉంది. 2015తో పోలిస్తే నౌకల టన్నుల సామర్థ్యం దాదాపు 36 శాతం పెరిగింది. భారత వాణిజ్య విలువలో 95 శాతం, పరిమాణంలో 70 శాతం సముద్ర మార్గాల ద్వారానే సాగుతోంది.

- సముద్ర బీమా: కనిపించని జీవనాడి
ప్రపంచ వాణిజ్యానికి సముద్ర బీమా తప్పనిసరి. హల్ & మెషినరీ పాలసీలు నౌకలను రక్షిస్తాయి. సరకు బీమా వస్తువులకు రక్షణ కల్పిస్తుంది. కాలుష్యం, సిబ్బందికి గాయాలు వంటి బాధ్యతలను రక్షణ & నష్టపరిహార బీమా కవర్ చేస్తుంది. సముద్ర దోపిడీ, ఘర్షణల నుంచి యుద్ధ ముప్పు బీమా రక్షణ ఇస్తుంది. ఈ బీమా విధానాలన్నీ భారత నౌకాయాన ఆర్థిక వ్యవస్థకు చట్టపరమైన, వాణిజ్యపరమైన అవసరాలు.
- విదేశీ రక్షణ & నష్టపరిహార క్లబ్‌లపై అధికంగా ఆధారపడటం
అంతర్జాతీయ రక్షణ & నష్టపరిహార క్లబ్‌ల సమూహంలో 13 ప్రధాన క్లబ్‌లు ఉన్నాయి. ప్రపంచంలోని భారీ నౌకల్లో దాదాపు 90 శాతం నౌకలకు సరకు నష్టం, కాలుష్యం, ఢీకొనడం, సిబ్బందికి గాయాలు వంటి ముప్పుల నుంచి ఇవి బీమా అందిస్తున్నాయి.
బీమా విలువ శ్రేణిలో భారత్ విదేశీ సంస్థలపై ఆధారపడుతోంది. భారత నౌక యజమానులు పశ్చిమ దేశాల్లో ప్రధానంగా పనిచేసే 13 అంతర్జాతీయ రక్షణ & నష్టపరిహార క్లబ్‌లపైనే దాదాపు పూర్తిగా ఆధారపడుతున్నారు. ఈ పరిస్థితి ఆకస్మికంగా బీమా రక్షణను ఉపసంహరించడం లేదా రాజకీయ ప్రభావంతో నిర్ణయాలు తీసుకోవడం వంటి ముప్పులకు భారత్‌ను గురిచేస్తోంది. దేశీయ ప్రత్యామ్నాయం అవసరాన్ని ఇది స్పష్టం చేస్తోంది.
- భౌగోళిక రాజకీయ అనిశ్చితి, వాణిజ్య అంతరాయాలు
ఎర్ర సముద్రంలో ఘర్షణలు, హోర్ముజ్ జలసంధి సమీపంలో ఉద్రిక్తతలు కీలక సముద్ర మార్గాలకు అంతరాయం కలిగించాయి. ముడి చమురులో అధిక భాగాన్ని సముద్ర మార్గంలో దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో నిరంతర బీమా రక్షణపై భారత ఇంధన భద్రత ఆధారపడి ఉంది. ఈ సమయంలో విదేశీ బీమా సంస్థలు ప్రీమియంలను పెంచాయి లేదా బీమా రక్షణ నిలిపివేశాయి. దీంతో నౌక యజమానుల వ్యయం భారీగా పెరిగి, దేశీయ భద్రతా వ్యవస్థ అవసరం ఏర్పడింది.
దేశీయ నైపుణ్యాల కొరత
సముద్ర బీమా పూచీకత్తు, క్లెయిమ్‌ల నిర్వహణలో సంస్థాగత నైపుణ్యం గతంలో భారత్‌కు తగినంతగా లేదు. ప్రపంచస్థాయి దేశీయ బీమా రంగానికి పునాది వేస్తూ ఈ నైపుణ్యాన్ని బీఎంఐపీ దేశీయంగా అభివృద్ధి చేస్తోంది. లండన్, స్విట్జర్లాండ్ వంటి విదేశీ కేంద్రాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తోంది.
నౌకలు, సరకు కోసం అందుబాటు ధరలో సార్వభౌమ బీమా రక్షణను భారత్ మారిటైమ్ ఇన్సూరెన్స్ పూల్ (బీఎంఐపీ) నిర్ధారిస్తూ అంతర్జాతీయ ముప్పులను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచుతోంది.
బీఎంఐ పూల్: రూపకల్పన, నిర్మాణం, రక్షణ పరిధి
వాణిజ్య మార్గాల్లో నౌకలు, సరకు రక్షణ కోసం ఈ సమూహం సముద్ర బీమా అందిస్తుంది. భారీ సముద్ర ముప్పులను నిర్వహించేందుకు బీమా సంస్థల ఉమ్మడి భాగస్వామ్యం, క్రమబద్ధమైన పాలనా వ్యవస్థతో పనిచేస్తుంది.
- ప్రభుత్వ హామీ: ₹12,980 కోట్ల(140 కోట్ల అమెరికన్ డాలర్ల) ప్రభుత్వ మద్దతు ఆర్థిక బలాన్ని కల్పిస్తుంది. భారీ నష్టాలు సంభవించినా చెల్లింపులు చేసే సామర్థ్యాన్ని ఈ హామీ అందిస్తుంది.
- పూచీకత్తు సామర్థ్యం: ప్రభుత్వ హామీతో ₹13,906.50 కోట్ల(150 కోట్ల అమెరికన్ డాలర్ల) విలువైన ముప్పులకు ఈ సమూహం బీమా అందించగలదు. భారీ సముద్ర నష్టాలకు రక్షణ కల్పించే సామర్థ్యాన్ని ఇది పెంచుతోంది.
- ముప్పుల రక్షణ: నౌక ప్రధాన నిర్మాణం & యంత్రాలు, సరకు, రక్షణ & నష్టపరిహారం(పీ & ఐ), యుద్ధ ముప్పులు ఇందులో ఉన్నాయి.
- నౌకల అర్హత: భారత పతాకంతో నడిచే నౌకలు, భారతీయ సంస్థల యాజమాన్యం, నిర్వహణ లేదా నియంత్రణలో ఉండే నౌకలు, భారత్‌కు వచ్చే లేదా భారత్ నుంచి బయలుదేరే సరకు నౌకలు అర్హత పొందుతాయి.
- కాలవ్యవధి: ఈ సమూహం పదేళ్లపాటు పనిచేస్తుంది. దీన్ని 15 ఏళ్ల వరకు పొడిగించవచ్చు.
- ఉమ్మడి పాలసీల జారీ: సమూహంలో సభ్యులుగా ఉన్న దేశీయ బీమా సంస్థలు తమ ఉమ్మడి పూచీకత్తు సామర్థ్యాన్ని ఉపయోగించి పాలసీలు జారీ చేస్తాయి. ఈ పాలసీల కింద ఉన్న ముప్పులను సభ్య సంస్థలు తాము అంగీకరించిన సామర్థ్యానికి అనుగుణంగా ఉమ్మడిగా పునర్‌బీమా చేస్తాయి.
- క్లెయిమ్‌ల నిర్వహణ: 10 కోట్ల అమెరికన్ డాలర్ల వరకు క్లెయిమ్‌లను నిల్వ నిధులు, పునర్‌బీమా ద్వారా తిరిగి పొందిన మొత్తాలతో చెల్లిస్తారు. అంతకంటే పెద్ద క్లెయిమ్‌లకు సమూహ నిల్వ నిధులన్నీ పూర్తిగా వినియోగించిన తర్వాతే ప్రభుత్వ హామీ అమల్లోకి వస్తుంది.
- నిర్వహణ: జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సమూహ నిర్వాహక సంస్థగా రోజువారీ కార్యకలాపాలను నిర్వహిస్తుంది. పనితీరు నివేదికలు సమర్పిస్తూ సమర్థవంతమైన నిర్వహణకు సహకరిస్తుంది.
- పాలన: సమూహ కార్యకలాపాలను పాలక మండలి పర్యవేక్షించి, నియంత్రిస్తుంది. నిబంధనల అమలు, సజావుగా పనితీరును నిర్ధారిస్తుంది.
- పూచీకత్తు క్రమశిక్షణ: ముప్పులను సరైన, స్థిరమైన విధానంలో అంచనా వేసేందుకు పూచీకత్తు కమిటీ పనిచేస్తుంది. దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వానికి మద్దతు ఇస్తుంది.

బీమా రక్షణ రకాలు, పరిధి
సముద్ర రంగంలోని అన్ని రకాల ముప్పులకు సమగ్ర రక్షణ అందించేలా బీఎంఐపీని రూపొందించారు. మార్గం లేదా ముప్పు స్వభావంతో సంబంధం లేకుండా భారత వాణిజ్యంలో పాల్గొనే నౌక లేదా సరకు దేశీయ బీమా రక్షణ లేకుండా ఉండకుండా చూస్తుంది.
- నౌక ప్రధాన నిర్మాణం & యంత్రాలకు యుద్ధ ముప్పు రక్షణ: నౌక ప్రధాన భాగం, నౌక ప్రయాణానికి శక్తినిచ్చే యంత్ర వ్యవస్థలు, అమర్చిన పరికరాలకు జరిగే నష్టం నుంచి రక్షణ కల్పిస్తుంది. భారత వాణిజ్య నౌకాదళ మూలధన విలువకు దేశీయ బీమాతో భద్రత లభిస్తుంది.
- సరకు యుద్ధ ముప్పు రక్షణ: అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో రవాణా చేసే వస్తువులు నష్టపోవడం లేదా దెబ్బతినడం నుంచి రక్షణ ఇస్తుంది. అధిక ముప్పు లేదా ఘర్షణ ప్రభావిత సముద్ర మార్గాల్లోనూ భారత ఎగుమతిదారులు, దిగుమతిదారులకు ప్రయోజనం లభిస్తుంది.
- రక్షణ & నష్టపరిహార బీమా: కాలుష్యం, చమురు కాలుష్య తొలగింపు, ధ్వంసమైన నౌకల తొలగింపు, సిబ్బందికి గాయాలు, సరకు నష్టం వంటి బాధ్యతలకు రక్షణ కల్పిస్తుంది. గతంలో విదేశీ క్లబ్‌ల ద్వారా మాత్రమే లభించిన ఈ బీమాను భారత నౌక యజమానులు ఇప్పుడు దేశీయంగా పొందగలుగుతున్నారు.
- యుద్ధ ప్రమాదాల బీమా: సాయుధ ఘర్షణలు, సముద్ర దోపిడీ, ఉగ్రవాదం, శత్రు శక్తులు నౌకలను స్వాధీనం చేసుకోవడం వల్ల వచ్చే నష్టాలకు బీమా అందిస్తుంది. ఎర్ర సముద్రం, హోర్ముజ్ జలసంధి వంటి సున్నితమైన మార్గాలు, ఇతర అధిక ముప్పు ప్రాంతాల గుండా సాగే భారత వాణిజ్యానికి ఈ రక్షణ కీలకం.
ఫలితాలు, ప్రభావం
2026 మేలో భారత్ సముద్ర బీమా సమూహం ప్రారంభం దేశ సముద్ర బీమా రంగంలో కీలక మైలురాయి. కార్యకలాపాలు ప్రారంభమైనప్పటి నుంచి భారత సముద్ర రంగ భాగస్వాములకు నిరంతర యుద్ధ ముప్పు బీమాను బీఎంఐపీ నిర్ధారించింది. పశ్చిమాసియా ఘర్షణ తీవ్రస్థాయిలో ఉన్నప్పటితో పోలిస్తే యుద్ధ ముప్పు బీమా ప్రీమియంలు దాదాపు 35 నుంచి 40 శాతం తగ్గాయి. 2026 సెప్టెంబర్ 7 నాటికి సమూహం 3,000 సరకు యుద్ధ ముప్పు పాలసీలు, 92 నౌక యుద్ధ ముప్పు పాలసీలు, మూడు రక్షణ & నష్టపరిహార పాలసీలను జారీ చేసింది.
బలమైన ప్రారంభం: తొలి ఫలితాలు
- భారత్ తొలి రక్షణ & నష్టపరిహార పాలసీ: బీఎంఐపీ కింద దేశ తొలి రక్షణ & నష్టపరిహార బీమా పాలసీని 2026 జులై 30న షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌కు జారీ చేశారు. న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ జారీ చేసిన ఈ పాలసీ మూడో పక్ష బాధ్యతల నుంచి ఆర్థిక రక్షణ కల్పిస్తుంది.
- తొలి నౌక నిర్మాణం & యంత్రాల యుద్ధ ముప్పు పాలసీ: ఘర్షణ ప్రాంతాల గుండా ప్రయాణించే నౌకకు 2026 మే 12న సమూహం తొలి పాలసీని జారీ చేసింది. మెస్సర్స్ హోగర్ ఆఫ్‌షోర్ అండ్ మెరైన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు న్యూ ఇండియా అస్యూరెన్స్ ఈ పాలసీని అందించింది. అంటే భారత నౌక ఇప్పుడు యుద్ధ ముప్పుల నుంచి దేశీయ బీమా రక్షణతో ప్రయాణిస్తోంది.
- భారత్‌కు వచ్చే వస్తువులకు రక్షణ: మెస్సర్స్ వేదాంత స్టెరిలైట్ కాపర్ లిమిటెడ్‌కు సముద్ర సరకు యుద్ధ ముప్పు పాలసీని జారీ చేశారు. భారత్‌కు దిగుమతి చేసే కేబుల్ వైర్లకు ఇది రక్షణ కల్పిస్తుంది. భారీ పారిశ్రామిక దిగుమతిదారులకు కూడా ఈ సమూహం సేవలు అందించగలదని ఇది చాటుతోంది. భారత పరిశ్రమలకు అవసరమైన సరఫరా వ్యవస్థలకు సురక్షితమైన బీమా రక్షణను నిర్ధారిస్తోంది.
- నౌకాయాన సంస్థలకు మించి: చక్కెర తయారీ సంస్థ బలరాంపూర్ చినీ మిల్స్ లిమిటెడ్‌కు కూడా పాలసీ జారీ చేశారు. ఈ సమూహం నౌక యజమానులకే పరిమితం కాదని ఇది రుజువు చేస్తోంది. సముద్ర మార్గంలో వస్తువులను రవాణా చేసే వ్యవసాయ సంస్థలు, కర్మాగారాలు, సరకు వ్యాపారులు కూడా బీమా పొందవచ్చు. తద్వారా విస్తృత భారత ఆర్థిక వ్యవస్థకు ఈ సమూహం సేవలు అందిస్తోంది.
- పాలన, వ్యవస్థలు సిద్ధం: ప్రారంభం నుంచి పాలక మండలి, పూచీకత్తు కమిటీని ఏర్పాటు చేశారు. జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(జీఐసీ రీ) సమూహ నిర్వహణ బాధ్యతలు చేపట్టింది. పూచీకత్తు, క్లెయిమ్‌లు, నియంత్రణ నిబంధనలకు సంబంధించిన వ్యవస్థలను కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పూర్తి వాణిజ్య స్థాయిలో కార్యకలాపాలు సాగుతున్నాయి.
భవిష్యత్తు మార్గం
సముద్ర రంగంలో భారత ఆర్థిక స్వాతంత్య్రానికి భారత్ మారిటైమ్ ఇన్సూరెన్స్ పూల్ కీలక అడుగు. విశ్వసనీయ కార్యకలాపాలు, పోటీ ధరలు, నమ్మదగిన క్లెయిమ్‌ల పరిష్కారాన్ని భాగస్వాములకు అందించడం దీని ప్రధాన బాధ్యత. మానవ వనరులు, చట్టపరమైన వ్యవస్థలు, పునర్‌బీమా భాగస్వామ్యాలను బలోపేతం చేయడంపై మధ్యకాలిక దృష్టి ఉంటుంది. ప్రభుత్వ హామీపై ఆధారపడటాన్ని కనిష్ఠ స్థాయిలో ఉంచుతూ ఈ ప్రయత్నాలు స్థిరత్వాన్ని పెంచుతాయి.
దీర్ఘకాలంలో హిందూ మహాసముద్ర ప్రాంతంలో సముద్ర బీమాకు ప్రధాన కేంద్రంగా ఈ సమూహం ఎదగనుంది. ఆర్థిక సేవలు అందించే దేశంగా, సముద్ర ముప్పుల ప్రమాణాలను రూపొందించే శక్తిగా భారత్‌కు గుర్తింపు లభిస్తుంది. నౌకా నిర్మాణం విస్తరిస్తూ నౌకాశ్రయాల్లో సరకు రవాణా పెరిగే కొద్దీ భారత సముద్ర లక్ష్యాలకు అనుగుణంగా ఈ సమూహం కూడా అభివృద్ధి చెందుతుంది. దీని సామర్థ్యం, బీమా పరిధి భారత సముద్ర మౌలిక సదుపాయాలకు దీర్ఘకాలిక మూలస్తంభంగా నిలుస్తాయి.
References:
Ministry of Ports, Shipping and Waterways:
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2253432®=3&lang=1
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2260712®=3&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2244786®=3&lang=1
https://shipmin.gov.in/sites/default/files/Maritime%20Amrit%20Kaal%20Vision%202047%20%28MAKV%202047%29_compressed.pdf
https://sansad.in/getFile/lsapps/loksabhaquestions/annex/188/AU927_Q1ssYz.pdf?source=lsapps
Ministry of Finance:
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2260413®=3&lang=1
https://x.com/DFS_India/status/2045461170069594537
Directorate General of Shipping:
https://dgma.gov.in/download/1781517244_6a2fcbbc219f8_bmip-note.pdf
https://dgma.gov.in/nautical-wing/insurance
Inland Waterways Authority of India:
https://iwai.nic.in/
Cabinet:
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2253242®=3&lang=1
Click here for hindi PDF file.
***
(Explainer ID: 160208)
आगंतुक पटल : 2
Provide suggestions / comments