Technology
భారత్‌లో సెమీకండక్టర్ రంగానికి మరింత ఊతం
డిజైన్, తయారీ, ప్యాకేజింగ్, మెటీరియల్స్, నైపుణ్యాల్లో పెరుగుతున్న సామర్థ్యాలు
Posted On:
17 SEP 2026 12:17PM
సెమికాన్ 1.0 విజయవంతంగా అమలు చేసిన నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గం 2026 జూలై 15న రూ.1,27,500 కోట్ల కేటాయింపుతో సెమికాన్ 2.0కు ఆమోదం తెలిపింది. మొదటి దశ భారత్‌లో సెమీకండక్టర్ తయారీ వ్యవస్థకు పునాది వేయగా, సెమికాన్ 2.0 ఆరు వ్యూహాత్మక అంశాల ద్వారా తదుపరి దశను ముందుకు తీసుకెళ్తుంది. పరిశోధన, అభివృద్ధి, చిప్ డిజైన్, యంత్రాలు, మెటీరియల్స్, మరిన్ని ఫ్యాబ్‌ల ఏర్పాటు, నైపుణ్యాల అభివృద్ధి, ఏటీఎంపీ/ఓసాట్ పరిశ్రమను మరింత బలోపేతం చేయడం ఇందులో ఉన్నాయి. దీని ద్వారా భారత్‌ను ప్రపంచ స్థాయి విశ్వసనీయ సెమీకండక్టర్ కేంద్రంగా నిలిపి, వికసిత్ భారత్ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది.
నేపథ్యం
సెమీకండక్టర్లు ఆధునిక సాంకేతికతకు పునాది, ఆర్థిక శక్తికి కీలక ఆధారం. కృత్రిమ మేధస్సు (ఏఐ), టెలికమ్యూనికేషన్స్, ఎలక్ట్రిక్ మొబిలిటీ, రక్షణ, ఆధునిక తయారీ రంగాలకు ఇవి శక్తినిస్తాయి. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ), 5జీ/6జీ, డేటా సెంటర్లు, స్వయం నియంత్రిత వాహనాలు వంటి సాంకేతికతలు చిప్‌లకు డిమాండ్‌ను మరింత పెంచుతున్నాయి. వీటి లభ్యత, సాంకేతిక సామర్థ్యాలు ఆవిష్కరణలు, పోటీతత్వం, జాతీయ సాంకేతిక సామర్థ్యాన్ని మరింతగా ప్రభావితం చేయనున్నాయి.

ప్రపంచ సెమీకండక్టర్ మార్కెట్ వేగంగా విస్తరిస్తుండటం ఈ రంగం ప్రాధాన్యాన్ని తెలియజేస్తోంది. 2014 నుంచి 2024 మధ్య ప్రపంచ సెమీకండక్టర్ మార్కెట్ సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్) 6.5 శాతంగా నమోదైంది. రానున్న 5–10 ఏళ్లలో ఇది 8.5 శాతం వృద్ధి చెందుతుందని అంచనా. అయితే ఇటీవల చోటుచేసుకున్న అంతరాయాలు పరస్పరం అనుసంధానమైన ప్రపంచ సెమీకండక్టర్ సరఫరా వ్యవస్థలో ఉన్న బలహీనతలను బయటపెట్టాయి. భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు సరఫరాపై ఆధారపడటంతో ఉన్న ముప్పులను మరింత స్పష్టంచేశాయి. దీంతో ప్రధాన ఆర్థిక వ్యవస్థలు తమ సాంకేతిక, ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకునేందుకు దేశీయ సెమీకండక్టర్ సామర్థ్యాలను బలోపేతం చేస్తున్నాయి.
భారత్‌లోనూ సెమీకండక్టర్లకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. 2030 ఆర్థిక సంవత్సరం నాటికి ఇది 110 బిలియన్ అమెరికన్ డాలర్లకు, 2035 నాటికి 200 బిలియన్ అమెరికన్ డాలర్లకు మించి చేరుతుందని అంచనా. అదే సమయంలో దేశీయ తయారీ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. 2017–18 నుంచి 2024–25 ఆర్థిక సంవత్సరాల మధ్య భారత్ సెమీకండక్టర్ ఉత్పత్తుల దిగుమతులపై దాదాపు 150 బిలియన్ అమెరికన్ డాలర్లు ఖర్చు చేసింది. ఈ కాలంలో దిగుమతులు 23 శాతం సమ్మిళిత వార్షిక వృద్ధి రేటుతో పెరిగాయి. ఇదే ధోరణి కొనసాగితే 2035 నాటికి వార్షిక దిగుమతులు 240 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరే అవకాశం ఉంది. అందువల్ల సమగ్ర సెమీకండక్టర్ వ్యవస్థను నిర్మించడం జాతీయంగా అత్యవసర ప్రాధాన్యంగా మారింది. స్వావలంబన, భద్రత, నైపుణ్యాలు, సాంకేతిక పోటీతత్వాన్ని పెంచేందుకు భారత ప్రభుత్వం ఈ వ్యవస్థను బలోపేతం చేస్తోంది.
సెమికాన్ 2026: భారత్ సెమీకండక్టర్ వ్యవస్థకు ఊతం

సెమీకండక్టర్లు ఆధునిక ఎలక్ట్రానిక్ వ్యవస్థలకు కేంద్ర బిందువుగా ఉన్నాయి. అందువల్ల సాంకేతిక స్థిరత్వం, ఆర్థిక భద్రత, జాతీయ స్వావలంబనకు బలమైన సెమీకండక్టర్ వ్యవస్థ ఎంతో అవసరం. ఈ వ్యూహాత్మక ప్రాధాన్యాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం విధానపరమైన మద్దతు, మౌలిక వసతులు, అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా సెమీకండక్టర్ వ్యవస్థను బలోపేతం చేస్తోంది. “సిలికాన్ టు సిస్టమ్స్: బిల్డింగ్ ది ఎకోసిస్టమ్” అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్న సెమికాన్ ఇండియా 2026ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 సెప్టెంబర్ 17న న్యూఢిల్లీలోని యశోభూమిలో ప్రారంభించారు. సెమికాన్ 2026 సెప్టెంబర్ 17 నుంచి 19 వరకు జరుగుతోంది. ఇందులో ప్రపంచ పరిశ్రమల ప్రముఖులు, విధాన నిర్ణేతలు, పెట్టుబడిదారులు, విద్యావేత్తలు, స్టార్టప్‌లు పాల్గొంటున్నారు. మొత్తం సెమీకండక్టర్ విలువ శ్రేణిలో భారత్ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లేందుకు, ఈ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఇది వేదికగా నిలుస్తోంది.
సెమీకండక్టర్ అంటే ఏమిటి?
విద్యుత్ వాహకతను నియంత్రించగల పదార్థాన్ని సెమీకండక్టర్ అంటారు. రాగి వంటి వాహకాలు విద్యుత్ ప్రవాహాన్ని సులభంగా అనుమతిస్తాయి, ఇన్సులేటర్లు మాత్రం విద్యుత్ ప్రవాహాన్ని తీవ్రంగా అడ్డుకుంటాయి. సెమీకండక్టర్ పదార్థాలను విద్యుత్ సంకేతాలను మార్చడం, పెంచడం, గుర్తించడం లేదా నియంత్రించడం కోసం రూపొందించవచ్చు. ట్రాన్సిస్టర్ ఒక సూక్ష్మ ఎలక్ట్రానిక్ స్విచ్. ఆధునిక ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లలో చిన్న చిప్‌పై లక్షల నుంచి బిలియన్ల వరకు ట్రాన్సిస్టర్లు, ఇతర భాగాలను అమర్చుతారు. ఇవి సమన్వయంతో పనిచేయడం వల్ల కంప్యూటింగ్, కమ్యూనికేషన్స్, సెన్సింగ్, మెమరీ, పవర్ మేనేజ్‌మెంట్ సాధ్యమవుతాయి.
ఆధునిక ఎలక్ట్రానిక్ పరికరాల్లో చాలా వరకు సెమీకండక్టర్లపై ఆధారపడతాయి. స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు, వైద్య పరికరాలు, ఆటోమొబైల్స్, రక్షణ వ్యవస్థలు, ఉపగ్రహాలు, డేటా సెంటర్లు సెమీకండక్టర్ ఆధారిత భాగాలను ఉపయోగిస్తున్నాయి. సరళంగా చెప్పాలంటే, ఆధునిక ఎలక్ట్రానిక్స్‌కు సెమీకండక్టర్లు పునాది రాళ్ల వంటివి.
సిలికాన్ నుంచి సెమీకండక్టర్ చిప్ వరకు
సిలికాన్ అత్యధికంగా ఉపయోగించే సెమీకండక్టర్ పదార్థం. ఇసుకలో విస్తారంగా లభించే సిలికా నుంచి సిలికాన్‌ను పొందుతారు. చిప్ తయారీ ప్రక్రియ అత్యంత శుద్ధి చేసిన సిలికాన్‌తో ప్రారంభమవుతుంది. దీన్ని స్థూపాకార ఇంగాట్లుగా తయారు చేస్తారు. ఈ ఇంగాట్లను పలుచని వేఫర్లుగా కోసి, పాలిష్ చేస్తారు. ఫ్యాబ్రికేషన్ ప్లాంట్లలో వేఫర్లపై వందలాది నియంత్రిత ప్రక్రియలు నిర్వహిస్తారు. వీటిలో డిపాజిషన్, ఫోటోలిథోగ్రఫీ, ఎచింగ్, అయాన్ ఇంప్లాంటేషన్ వంటి ప్రక్రియలు ఉన్నాయి.

ఈ ప్రక్రియలన్నీ కలిసి బిలియన్ల ట్రాన్సిస్టర్లు, ఇతర భాగాలను రూపొందించే సంక్లిష్ట నిర్మాణాలను సృష్టిస్తాయి. ఫోటోలిథోగ్రఫీలో కాంతిని ఉపయోగించి నమూనాలను వేఫర్‌పైకి బదిలీ చేస్తారు. ఈ నమూనాలు చివరికి ట్రాన్సిస్టర్లు, ఇంటర్‌కనెక్ట్‌లు, చిప్‌లోని ఇతర భాగాల నిర్మాణాన్ని నిర్ణయిస్తాయి. ట్రాన్సిస్టర్లు చిప్‌పై ఉండే సూక్ష్మ ఎలక్ట్రానిక్ స్విచ్‌లు. ఇవి విద్యుత్ ప్రవాహాన్ని నియంత్రిస్తాయి. సంక్లిష్టమైన ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లను రూపొందించేందుకు ఈ ప్రక్రియను అనేక పొరల్లో పునరావృతం చేస్తారు.
తయారైన సెమీకండక్టర్ పరికరాలకు ఆ తర్వాత అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్ అండ్ ప్యాకేజింగ్ (ఏటీఎంపీ) లేదా అవుట్‌సోర్స్‌డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ (ఓసాట్) ప్రక్రియలు నిర్వహిస్తారు. ప్యాకేజింగ్ చిప్‌కు రక్షణ కల్పించడంతో పాటు ఇతర ఎలక్ట్రానిక్ భాగాలతో అనుసంధానం చేసేందుకు వీలు కల్పిస్తుంది. తయారైన పరికరాలు అవసరమైన పనితీరు, నాణ్యత ప్రమాణాలను అందుకుంటున్నాయో లేదో పరీక్షల ద్వారా నిర్ధారిస్తారు.
సెమీకండక్టర్ నోడ్ అంటే
సెమీకండక్టర్ నోడ్ ఒక తయారీ సాంకేతికత తరాన్ని సూచిస్తుంది. గతంలో 90 ఎన్ఎం, 45 ఎన్ఎం, 28 ఎన్ఎం వంటి పేర్లు కొన్ని నిర్దిష్ట భౌతిక పరిమాణాలను సూచించేవి. ప్రస్తుతం నోడ్ పేర్లు ప్రధానంగా ఒక తయారీ ప్రక్రియ తరాన్ని సూచించే సంక్షిప్త రూపాలుగా ఉపయోగిస్తున్నారు. చిన్న నోడ్ ద్వారా ఎక్కువ ట్రాన్సిస్టర్లను తక్కువ స్థలంలో అమర్చడం, మెరుగైన పనితీరు లేదా తక్కువ విద్యుత్ వినియోగం సాధ్యమవుతుంది. అయితే ఫలితం సర్క్యూట్ డిజైన్, పదార్థాలు, ప్యాకేజింగ్, ఉపయోగించే రంగం వంటి అంశాలపై కూడా ఆధారపడి ఉంటుంది. అధునాతన నోడ్‌లు అధిక పనితీరు కలిగిన కంప్యూటింగ్, ఆధునిక ప్రాసెసర్లకు ఉపయోగపడటంతో ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఆటోమొబైల్స్, పారిశ్రామిక ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్స్, పవర్ సిస్టమ్స్, అనేక వినియోగదారుల ఉత్పత్తులకు మెచ్యూర్ నోడ్‌లు ఇప్పటికీ ఎంతో అవసరం. భారత్ ప్రస్తుతం ఇప్పటికే ఉన్న నోడ్‌ల నుంచి మరింత అధునాతన సెమీకండక్టర్ సాంకేతికతల దిశగా సామర్థ్యాలను అభివృద్ధి చేస్తోంది.

సెమీకండక్టర్లు ఎందుకు కీలకం: వ్యూహాత్మక దృష్టికోణం

సెమీకండక్టర్లు ఆర్థిక వృద్ధి, సాంకేతిక నాయకత్వం, జాతీయ భద్రతకు వ్యూహాత్మక వనరుగా మారాయి. ప్రస్తుతం తైవాన్, దక్షిణ కొరియా, జపాన్, చైనా, అమెరికా ప్రపంచ సెమీకండక్టర్ తయారీలో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ప్రపంచ చిప్ ఉత్పత్తిలో తైవాన్ ఒక్కటే 60 శాతానికి పైగా, అధునాతన చిప్‌లలో దాదాపు 90 శాతం వాటాను కలిగి ఉంది. ఈ కేంద్రీకరణ భద్రమైన, విభిన్నమైన, స్థిరమైన సెమీకండక్టర్ సరఫరా వ్యవస్థల అవసరాన్ని స్పష్టం చేసింది. భారత్‌కు దేశీయ సెమీకండక్టర్ సామర్థ్యాలు కేవలం పారిశ్రామిక అవకాశమే కాదు. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, జాతీయ భద్రతను బలోపేతం చేయడం, అధిక విలువ కలిగిన ఉద్యోగాలను సృష్టించడం కూడా వీటి ద్వారా సాధ్యమవుతుంది. అలాగే సాంకేతిక స్వావలంబనను పెంచి, వ్యూహాత్మక రంగాల్లో ఉన్న బలహీనతలను తగ్గించవచ్చు. ప్రపంచ సెమీకండక్టర్ విలువ శ్రేణిని ఏ ఒక్క దేశం పూర్తిగా నియంత్రించడం లేదు. చిప్ డిజైన్, ఫ్యాబ్రికేషన్, పరికరాలు, మెటీరియల్స్, మెమరీ, ప్యాకేజింగ్ వంటి రంగాల్లో వివిధ దేశాలు ముందంజలో ఉన్నాయి. ఈ ప్రత్యేకత సామర్థ్యాన్ని పెంచినప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో అధిక కేంద్రీకరణకు దారితీస్తుంది. అందువల్ల భారత్ విధానం దేశీయ సామర్థ్యాన్ని బలోపేతం చేయడంతో పాటు విశ్వసనీయ భాగస్వామ్యాలపై కూడా దృష్టి పెడుతోంది.
భారత వ్యూహాత్మక కార్యక్రమాలకు సెమీకండక్టర్లే శక్తి
* సెమీకండక్టర్ ల్యాబొరేటరీ (ఎస్సీఎల్), మొహాలి అంతరిక్షంలోని తీవ్రమైన పరిస్థితులను తట్టుకునేలా రూపొందించిన ఉపగ్రహాలు, ప్రయోగ వాహనాల కోసం ఫ్లైట్-గ్రేడ్ చిప్‌లను అభివృద్ధి చేస్తోంది.
* చంద్రయాన్-3 ల్యాండర్‌లో భారతదేశంలో తయారైన కెమెరా చిప్‌ను ఉపయోగించారు. ఇది ల్యాండర్ ఇమేజింగ్ వ్యవస్థలకు మద్దతు ఇచ్చింది.
* ఎస్సీఎల్‌కు చెందిన విక్రమ్ ప్రాసెసర్‌ను ఉపగ్రహ ప్రయోగ వాహనాలు, రాకెట్లలో ఉపయోగిస్తున్నారు.
* సూర్యుడిపై అధ్యయనం కోసం భారత్ చేపట్టిన ఆదిత్య-ఎల్1 మిషన్‌లో ఎస్సీఎల్ అభివృద్ధి చేసిన రేడియేషన్-హార్డెండ్ ఏడీసీ చిప్‌లను ఉపయోగిస్తున్నారు.
భారత్‌లో అభివృద్ధి చెందుతున్న సెమీకండక్టర్ వ్యవస్థ
భారత్ సెమీకండక్టర్ ప్రయాణం వ్యూహాత్మక సామర్థ్యాల నిర్మాణం నుంచి విస్తృత దేశీయ వ్యవస్థను రూపొందించే దిశగా సాగింది. సెమీకండక్టర్ ల్యాబొరేటరీ (ఎస్సీఎల్) వంటి ప్రారంభ సంస్థలు పునాది వేయగా, ఇటీవలి విధానపరమైన చర్యలు పెట్టుబడులు, ఆవిష్కరణలు, నైపుణ్యాల అభివృద్ధికి వేగం పెంచాయి. ఈ చర్యలు సెమీకండక్టర్ విలువ శ్రేణిలోని వివిధ దశల్లో భారత్ భాగస్వామ్యం అయ్యేలా చేస్తున్నాయి.
సెమికాన్ 1.0: పునాది నిర్మాణం
భారత ప్రభుత్వం 2021 డిసెంబర్‌లో సెమికాన్ 1.0కు రూ.76,000 కోట్ల కేటాయింపుతో ఆమోదం తెలిపింది. దేశీయ సెమీకండక్టర్, డిస్‌ప్లే తయారీ వ్యవస్థను ఏర్పాటు చేయడం దీని లక్ష్యం. సెమీకండక్టర్ ఫ్యాబ్‌లు, డిస్‌ప్లే ఫ్యాబ్‌ల ఏర్పాటు కోసం ప్రత్యేక పథకాలను ఈ కార్యక్రమం పరిచయం చేసింది. కాంపౌండ్ సెమీకండక్టర్లు, సిలికాన్ ఫోటోనిక్స్, సెన్సర్లు, సెమీకండక్టర్ ఏటీఎంపీ/ఓసాట్ సదుపాయాల ఏర్పాటు కోసం కూడా పథకాలను ప్రవేశపెట్టింది. అదనంగా, డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ (డీఎల్‌ఐ) పథకం భారత్ సెమీకండక్టర్ డిజైన్ సామర్థ్యాలను బలోపేతం చేసింది. ఈ పథకాలన్నీ కలిసి చిప్ డిజైన్, ఫ్యాబ్రికేషన్, ప్యాకేజింగ్, సంబంధిత సాంకేతికతలకు పునాది వేశాయి.
సెమికాన్ 1.0: కీలక విజయాలు
* 12 సెమీకండక్టర్ తయారీ యూనిట్లకు ఆమోదం లభించింది. వీటి మొత్తం పెట్టుబడి రూ.1.64 లక్షల కోట్లకు పైగా ఉంది.
* వీటిలో ఒక సిలికాన్ ఫ్యాబ్, ఒక సిలికాన్ కార్బైడ్ ఫ్యాబ్, ఒక గ్యాలియం నైట్రైడ్ మైక్రో ఎల్‌ఈడీ డిస్‌ప్లే ఫ్యాబ్, తొమ్మిది ఏటీఎంపీ/ఓసాట్ యూనిట్లు ఉన్నాయి.
* ఈ యూనిట్లు గుజరాత్, అసోం, ఉత్తరప్రదేశ్, ఒడిశా, పంజాబ్, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. ఐదు యూనిట్లు వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించాయి.
* 24 చిప్ డిజైన్ ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. వీటి మొత్తం విలువ దాదాపు రూ.900 కోట్లు.
* దేశవ్యాప్తంగా 500 సంస్థలకు చెందిన లక్ష మందికి పైగా ఇంజినీర్లకు, 400 విద్యా సంస్థలు, 100 స్టార్టప్‌లతో సహా, అధునాతన చిప్ డిజైన్ సాధనాలను ఉపయోగించే అవకాశం కల్పించారు.
* మన సంస్థలు కలిసి 300కు పైగా చిప్ డిజైన్లను అభివృద్ధి చేశాయి.
అమెరికా, జపాన్, యూరోపియన్ యూనియన్, సింగపూర్, నెదర్లాండ్స్ సహా పలు భాగస్వాములతో భారత్ సెమీకండక్టర్ సహకారాన్ని ఏర్పాటు చేసుకుంది.
* 2026 జనవరి 12 నుంచి 13 వరకు జర్మన్ ఛాన్సలర్ భారత్ పర్యటన సందర్భంగా భారత్-జర్మనీ సెమీకండక్టర్ ఎకోసిస్టమ్ భాగస్వామ్యంపై సంయుక్త ప్రకటనపై భారత్ సంతకం చేసింది. అలాగే 2026 ఫిబ్రవరిలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో పాక్స్ సిలికాలో భారత్ చేరింది.
* ప్రపంచంలోని సెమీకండక్టర్ రంగానికి చెందిన గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లలో దాదాపు 7 శాతం భారత్‌లో ఉన్నాయి. ప్రపంచ సెమీకండక్టర్ చిప్ డిజైన్ వర్క్‌ఫోర్స్‌లో దాదాపు 20 శాతం మంది భారత్‌లో పనిచేస్తున్నారు.
సెమికాన్ 2.0: సంపూర్ణ వ్యవస్థ నిర్మాణం
సెమికాన్ 1.0 వేసిన పునాదిపై 2026 జూలైలో భారత ప్రభుత్వం సెమికాన్ 2.0కు రూ.1,27,500 కోట్ల మొత్తం కేటాయింపుతో ఆమోదం తెలిపింది. భారత్ సెమీకండక్టర్ రంగానికి నిరంతర, దీర్ఘకాలిక మద్దతు అందించడం ఈ కార్యక్రమం లక్ష్యం. సెమికాన్ 1.0 ద్వారా ఏర్పడిన సామర్థ్యాలను మరింత లోతుగా అభివృద్ధి చేసి, ప్రపంచ స్థాయి పోటీతత్వం కలిగిన సెమీకండక్టర్ వ్యవస్థ వృద్ధికి వేగం పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సెమికాన్ 1.0 ప్రధానంగా ఫ్యాబ్‌లు, ఏటీఎంపీ/ఓసాట్ ప్లాంట్లపై దృష్టి పెట్టింది. సెమికాన్ 2.0లో యంత్రాలు, మెటీరియల్స్, డిజైన్, పరిశోధన, నైపుణ్యాలను కూడా చేర్చారు. రెండు దశలు కలిసి ముడి పదార్థాల నుంచి తుది చిప్‌ల వరకు మొత్తం విలువ శ్రేణిని కలుపుతున్నాయి.
సెమికాన్ 2.0 ఆరు ప్రధాన అంశాలపై ఆధారపడి ఉంది. అవి డిజైన్, యంత్రాలు-మెటీరియల్స్, కొత్త ఫ్యాబ్‌ల ఏర్పాటు, మరింత అధునాతన ప్యాకేజింగ్, పరిశోధన, నైపుణ్యాల అభివృద్ధి. దేశంలో మొత్తం చిప్ విలువ శ్రేణిని నిర్మించడం, చివరి దశలకే పరిమితం కాకపోవడం దీని ప్రధాన ఉద్దేశం. ఈ ప్రయత్నం ద్వారా సరఫరా వ్యవస్థ స్థిరత్వం, వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి, అధిక విలువ కలిగిన ఉద్యోగాల దిశగా భారత్ ముందుకు సాగుతోంది.

కీలక సహాయక విధాన వ్యవస్థ
తయారీ, మౌలిక వసతులు, పెట్టుబడులు, పరిశోధన, నైపుణ్యాల అభివృద్ధి వంటి రంగాలను కలుపుతూ ప్రగతిశీల విధాన వ్యవస్థ భారత్ సెమీకండక్టర్ లక్ష్యాలకు మద్దతు ఇస్తోంది. ఈ చర్యలు ఎలక్ట్రానిక్స్ విలువ శ్రేణిని క్రమంగా బలోపేతం చేసి, సెమీకండక్టర్ రంగంలో స్వావలంబనకు పునాది కల్పిస్తున్నాయి.
* నేషనల్ పాలసీ ఆన్ ఎలక్ట్రానిక్స్ (ఎన్‌పీఈ) 2019 – చిప్‌సెట్లతో సహా కీలక భాగాలను కలుపుతూ ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ (ఈఎస్‌డీఎం)కు సమగ్ర విధాన చట్రాన్ని ఏర్పాటు చేసింది.
* స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అండ్ సెమీకండక్టర్స్ (స్పెక్స్) (2020) – దేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు భాగాలు, సబ్-అసెంబ్లీలు, సెమీకండక్టర్ల దేశీయ తయారీకి మూలధన వ్యయంతో అనుసంధానమైన ప్రోత్సాహకాలను అందిస్తుంది.
* మోడిఫైడ్ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ స్కీమ్ (ఈఎంసీ 2.0) (2020) – ఎలక్ట్రానిక్స్ తయారీకి ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, ఉమ్మడి సదుపాయాలు, ప్లగ్-అండ్-ప్లే సదుపాయాలకు మద్దతు ఇస్తుంది.
* ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్‌ఐ) స్కీమ్ ఫర్ లార్జ్ స్కేల్ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ (2020) – మొబైల్ ఫోన్లు, భాగాల తయారీలో దేశీయ ఉత్పత్తిని పెంచి, భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఉత్పత్తితో అనుసంధానమైన ప్రోత్సాహకాలను అందిస్తుంది.
* ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్‌ఐ) స్కీమ్ 2.0 ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) హార్డ్‌వేర్ (2023) – ఐటీ హార్డ్‌వేర్ దేశీయ తయారీని పెంచి, దాని విలువ శ్రేణిలో భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఉద్దేశించింది. ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, ఆల్-ఇన్-వన్ పర్సనల్ కంప్యూటర్లు, సర్వర్ల దేశీయ తయారీని ప్రోత్సహిస్తుంది.
* ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మాన్యుఫ్యాక్చరింగ్ స్కీమ్ (2025) – 2026–27 బడ్జెట్‌లో రూ.40,000 కోట్లకు పెంచిన కేటాయింపుతో, మొత్తం విలువ శ్రేణిలో పెట్టుబడులను ఆకర్షించి, దేశీయ విలువ జోడింపును పెంచేలా బలమైన కాంపోనెంట్ తయారీ వ్యవస్థను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
* మొబైల్ ఫోన్ మాన్యుఫ్యాక్చరింగ్ స్కీమ్ (2026) – దేశీయ విలువ జోడింపును పెంచడం, మొబైల్ తయారీ సరఫరా శ్రేణిని విస్తరించడం, దేశీయ తయారీ సామర్థ్యాలను బలోపేతం చేయడం, భారతీయ మొబైల్ బ్రాండ్లకు మద్దతు ఇవ్వడం ద్వారా ప్రపంచ పోటీతత్వాన్ని పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.
* రీసెర్చ్, డెవలప్‌మెంట్ అండ్ ఇన్నోవేషన్ స్కీమ్ – సెమికాన్ 2.0 కింద అర్హత కలిగిన పరిశోధనా ప్రాజెక్టులకు మద్దతు ఇస్తూ దేశీయ సెమీకండక్టర్ ఆవిష్కరణలను బలోపేతం చేస్తుంది.
* ఎలక్ట్రానిక్స్ తయారీకి 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్‌డీఐ) విధానం – ప్రపంచ పెట్టుబడులు, సాంకేతిక భాగస్వామ్యాలకు మార్గం సుగమం చేస్తూ భారత్‌ను ప్రపంచ ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ విలువ శ్రేణులతో అనుసంధానిస్తుంది.
ఈ చర్యలు స్థిరమైన సెమీకండక్టర్ వ్యవస్థకు అవసరమైన పారిశ్రామిక పునాది, మార్కెట్ డిమాండ్, పెట్టుబడి వాతావరణాన్ని రూపొందిస్తున్నాయి. ఇవి కీలక సెమీకండక్టర్ కార్యక్రమాలకు తోడ్పాటునిస్తూ, భారత్‌ను ప్రపంచ ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తున్నాయి.
అధునాతన, స్వావలంబన భారత్ దిశగా ప్రయాణం
భారత్ సెమీకండక్టర్ ప్రయాణం తక్కువ కాలంలోనే వేగంగా ముందుకు సాగింది. 2021లో దేశంలో వాణిజ్య చిప్ ప్లాంట్ ఒక్కటి కూడా లేదు. 2026 నాటికి 12 యూనిట్లకు ఆమోదం లభించగా, ఐదు యూనిట్లు ఉత్పత్తి ప్రారంభించాయి. వందలాది కళాశాలలకు చెందిన విద్యార్థులు ఇప్పుడు చిప్‌లను డిజైన్ చేస్తున్నారు. ఈ ప్రయాణంలో సెమికాన్ 2.0 సహజమైన తదుపరి దశగా నిలుస్తోంది. ఇది కొత్తగా మొదలుపెట్టే కార్యక్రమం కాదు. ఇప్పటికే పనిచేస్తున్న వ్యవస్థను మరింత సంపూర్ణంగా తీర్చిదిద్దే ప్రయత్నం. ఫ్యాబ్‌లు, ప్యాకేజింగ్‌తో పాటు యంత్రాలు, మెటీరియల్స్, డిజైన్, పరిశోధన, నైపుణ్యాలు ఇప్పుడు ఈ వ్యవస్థలో భాగమవుతున్నాయి. ముందున్న మార్గం సవాళ్లతో కూడుకున్నది. చిప్ తయారీ ప్రపంచంలోనే అత్యంత సంక్లిష్టమైన పరిశ్రమల్లో ఒకటి. దీనికి సహనం, కచ్చితత్వం, నిరంతర విధానపరమైన మద్దతు అవసరం. సెమికాన్ 2.0 ఈ రంగానికి దీర్ఘకాలిక మద్దతును అందిస్తోంది. ప్రజలకు దీని ప్రయోజనం నెమ్మదిగా కనిపించినా వాస్తవంగా ఉంటుంది. పరికరాల తయారీ ప్రక్రియలో మరిన్ని దశలు భారత్‌లోనే జరుగుతాయి. కీలక వ్యవస్థలు దూర ప్రాంతాల సరఫరా శ్రేణులపై తక్కువగా ఆధారపడతాయి. యువ ఇంజినీర్లకు స్వదేశంలోనే అధిక విలువ కలిగిన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. చిన్న చిప్‌లో పెద్ద ఆశయం దాగి ఉంది. ఆ చిప్‌ను స్వదేశంలోనే నిర్మించాలని భారత్ సంకల్పించింది.
References
Ministry of Electronics and Information Technology
India Semiconductor Mission
Semiconductor Laboratory
Union Cabinet
Press Information Bureau (Factsheets and Backgrounders)
NITI Aayog
Indian Institute of Technology Madras
Indian Institute of Technology Kanpur
https://sathee.iitk.ac.in/sathee-jee/ncert-books/jee-ncert-books/jee-nb-phy-12/phy-12-chapter-14-semiconductor-electronics-materials-devices-and-simple-circuits/
Union Minister for Electronics and Information Technology
India Building Semiconductor Future
***
(Explainer ID: 160167)
आगंतुक पटल : 16
Provide suggestions / comments