• Sitemap
Rural Prosperity

స్వచ్ఛతా హీ సేవ

ఇప్పుడు స‌మ‌ష్టి బాధ్య‌త‌గా పరిశుభ్రత

Posted On: 18 SEP 2026 6:50PM

2014లో ప్రారంభమైన స్వచ్ఛ భారత్ మిషన్ (ఎస్‌బీఎం) తర్వాత కేవలం మరుగుదొడ్ల నిర్మాణం నుంచి విస్తృత పారిశుధ్య ఉద్యమంగా పరిణామం చెందింది. ఇందులో వ్యర్థాల నిర్వహణ, ప్రవర్తనలో మార్పు, పౌరుల భాగస్వామ్యం కూడా ఉన్నాయి. స్వచ్ఛతా హీ సేవ (ఎస్‌హెచ్‌ఎస్) 2017లో ప్రారంభమైంది. పౌరులు, సంస్థలు సమష్టిగా పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రతి ఏడాది ఒక ప్రత్యేక వేదికగా ఇది పనిచేస్తోంది. కాలానుగుణంగా మారుతున్న పరిశుభ్రత ప్రాధాన్యాలకు అనుగుణంగా ఎస్‌హెచ్‌ఎస్ కూడా మారుతూ వచ్చింది. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ, పరిసరాల పరిశుభ్రత, చెత్త రహిత బహిరంగ ప్రదేశాలపై మరింత దృష్టి సారించింది. 2023, 2024 కార్యక్రమాల్లో భారీ స్థాయిలో శ్రమదానం, బహిరంగ ప్రదేశాల రూపాంతరం, యువత భాగస్వామ్యం, సఫాయిమిత్ర సంక్షేమం, సమాజ భాగస్వామ్యాన్ని మరింత విస్తరించారు. 2025లో స్వచ్ఛోత్సవ్, పరిశుభ్రమైన బహిరంగ ప్రదేశాలు, సఫాయిమిత్ర కార్యక్రమాలు, పర్యావరణహిత వేడుకల ద్వారా స్వచ్ఛతను సామాజిక వేడుకల్లో భాగం చేశారు. 2026లో “స్వచ్ఛతా మే సహభాగ్” అనే ఇతివృత్తంతో ఈ పరిణామాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇందులో సమష్టి బాధ్యత, యువత భాగస్వామ్యం, వ్యర్థాల నిర్వహణ బాధ్యతలు, నిరంతర పరిశుభ్రత చర్యలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

స్వచ్ఛ భారత్ మిషన్: పరిశుభ్రమైన భారత నిర్మాణం


స్వచ్ఛ భారత్ మిషన్ (ఎస్‌బీఎం) 2014 అక్టోబర్ 2న ప్రారంభమైంది. ప్రభుత్వం చేపట్టిన అతిపెద్ద పారిశుధ్య ఉద్యమాల్లో ఇది ఒకటి. ఎస్‌బీఎం లోగోలో మహాత్మా గాంధీ కళ్లద్దాలను ప్రతిబింబించారు. పరిశుభ్రతను “దైవత్వానికి సమీపంలో ఉండే లక్షణం”గా గాంధీజీ భావించారు. ఈ లోగో ప్రపంచవ్యాప్తంగా స్వచ్ఛతకు బ్రాండ్ విలువను, భావోద్వేగ అనుబంధాన్ని కల్పించడంలో సహాయపడింది. ప్రజలు ఎస్‌బీఎంతో సులభంగా, త్వరగా అనుసంధానం కావడానికి కూడా ఇది దోహదపడింది.

ఈ మిషన్‌లో రెండు ప్రధాన విభాగాలు ఉన్నాయి: స్వచ్ఛ భారత్ మిషన్-గ్రామీణ్ (ఎస్‌బీఎం-జీ), స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ (ఎస్‌బీఎం-యూ). ఎస్‌బీఎం-జీ గ్రామీణ పారిశుధ్యం, మరుగుదొడ్ల అందుబాటు, వినియోగం, ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణపై దృష్టి పెడుతుంది. ఎస్‌బీఎం-యూ పట్టణ పారిశుధ్యం, వ్యర్థాల నిర్వహణ, బహిరంగ ప్రదేశాలు, పరిశుభ్రత మౌలిక వసతులపై దృష్టి పెడుతుంది.

ఈ మిషన్ ప్రభావం ఇప్పుడు దేశంలోని గ్రామాలు, నగరాల్లో కనిపిస్తోంది. 2019లో గ్రామీణ భారతదేశాన్ని బహిరంగ మలవిసర్జన రహిత (ఓడీఎఫ్) ప్రాంతంగా ప్రకటించారు. 17 సెప్టెంబర్ 2026 నాటికి భారత్‌లో 5.69 లక్షలకు పైగా ఓడీఎఫ్ ప్లస్ గ్రామాలు ఉన్నాయి. 5.25 లక్షలకు పైగా గ్రామాలు ఓడీఎఫ్ ప్లస్ మోడల్ హోదా సాధించాయి. 5.38 లక్షలకు పైగా గ్రామాల్లో ఘన వ్యర్థాల నిర్వహణ ఏర్పాట్లు ఉన్నాయి. 5.65 లక్షలకు పైగా గ్రామాల్లో ద్రవ వ్యర్థాల నిర్వహణ వ్యవస్థలు ఏర్పాటయ్యాయి. 585 జిల్లాల్లో 1,314 గోబర్‌ధన్ బయోగ్యాస్ ప్లాంట్లు ప్రస్తుతం పనిచేస్తున్నాయి. గ్రామీణ కుటుంబాల స్థాయిలో 12.22 కోట్ల వ్యక్తిగత మరుగుదొడ్లు, 98,273 బయోగ్యాస్ ప్లాంట్లు నిర్మించారు.



ఓడీఎఫ్ ప్లస్, ఓడీఎఫ్ ప్లస్ మోడల్ గ్రామాలు
ఓడీఎఫ్ ప్లస్ గ్రామం కేవలం ఓడీఎఫ్ హోదాను కొనసాగించడమే కాకుండా ఘన, ద్రవ వ్యర్థాలను సమర్థంగా నిర్వహిస్తూ పరిసరాల పరిశుభ్రతను కూడా కాపాడుతుంది. ఓడీఎఫ్ ప్లస్ హోదాను కొనసాగిస్తూ ఈ గ్రామాలను మూడు దశలుగా వర్గీకరిస్తారు: ఆస్పైరింగ్, రైజింగ్, మోడల్. ఆస్పైరింగ్ గ్రామాల్లో ఘన లేదా ద్రవ వ్యర్థాల్లో ఏదో ఒకదాన్ని నిర్వహిస్తారు. రైజింగ్ గ్రామాల్లో ఘన, ద్రవ వ్యర్థాలు రెండింటినీ నిర్వహిస్తారు. మోడల్ గ్రామాల్లో ఈ రెండు రకాల వ్యర్థాల నిర్వహణతో పాటు పరిసరాల పరిశుభ్రత, ఓడీఎఫ్ ప్లస్ సందేశాల ప్రదర్శన కూడా ఉంటుంది.

 



పట్టణ ప్రాంతాల్లో 95,478 వార్డుల్లో 100 శాతం ఇంటింటి ఘన వ్యర్థాల సేకరణ జరుగుతోంది. 83,963 వార్డుల్లో మూల స్థాయిలో 100 శాతం ఘన వ్యర్థాల వేర్పాటు జరుగుతోంది. భారత్‌లో 3,254 ఘన వ్యర్థాల నుంచి కంపోస్ట్ తయారీ ప్లాంట్లు ఉన్నాయి. వీటిలో రోజుకు 1.39 లక్షల టన్నుల వ్యర్థాలను ప్రాసెస్ చేస్తున్నారు. 60 ఘన వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్లు రోజుకు 25,759.50 టన్నుల వ్యర్థాలను ప్రాసెస్ చేస్తున్నాయి. మరోవైపు 1,112 మురుగునీటి శుద్ధి ప్లాంట్లు 41,020.63 మెగాలీటర్ల మురుగునీటిని ప్రాసెస్ చేస్తున్నాయి. 1,131 మల వ్యర్థాల శుద్ధి ప్లాంట్లు రోజుకు 95,371 కిలోలీటర్ల ద్రవ వ్యర్థాలను ప్రాసెస్ చేస్తున్నాయి. పట్టణ ప్రాంతాల్లో మొత్తం 68,339 ప్రజా పారిశుధ్య సదుపాయాలు ఉన్నాయి. ఇందులో 37,766 ప్రజా మరుగుదొడ్లు, 25,512 సామూహిక మరుగుదొడ్లు, 5,061 మూత్రశాలలు ఉన్నాయి.

అందువల్ల ఎస్‌బీఎం కేవలం మరుగుదొడ్ల నిర్మాణం నుంచి సమగ్ర సుస్థిర పారిశుధ్య వ్యవస్థల దిశగా పరిణామం చెందింది. ప్రవర్తనలో మార్పు, వ్యర్థాల నిర్వహణ, పౌరుల భాగస్వామ్యం ఇప్పుడు ఈ మార్పులో కీలక భాగాలుగా ఉన్నాయి. ఇంత భారీ స్థాయిలో ప్రవర్తనలో మార్పు సాధ్యమయ్యేందుకు అనేక జాతీయ స్థాయి కార్యక్రమాలు దోహదపడ్డాయి. వాటిలో ప్రముఖమైనది ‘స్వచ్ఛతా హీ సేవ’ కార్యక్రమం.

స్వచ్ఛతా హీ సేవ: ప్ర‌జా ఉద్య‌మంగా పరిశుభ్రత


2017 నుంచి ప్ర‌తి ఏడాది స్వచ్ఛతా హీ సేవ (ఎస్‌హెచ్‌ఎస్) నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 2న నిర్వహించే స్వచ్ఛ భారత్ దివస్కు ముందు ఈ కార్యక్రమం జరుగుతుంది. స్వచ్ఛత కోసం స్వచ్ఛంద చర్యలు, సమష్టి బాధ్యత వైపు పౌరులను ఇది ప్రోత్సహిస్తుంది. ఎస్‌బీఎం విస్తృత జన భాగీదారీ విధానం నుంచి ఈ కార్యక్రమం రూపుదిద్దుకుంది. పౌరులు, సంస్థలు, ప్రభుత్వాలు సమష్టిగా పరిశుభ్రత చర్యలు చేపట్టేందుకు ప్రత్యేక సమయాన్ని ఇది అందిస్తుంది. ఇటీవల ఎస్‌హెచ్‌ఎస్ 2026ను 17 సెప్టెంబర్ 2026న ప్రారంభించారు.

స్వచ్ఛతా హీ సేవ 2026: స్వచ్ఛతా మే సహభాగ్

 


ఎస్‌హెచ్‌ఎస్ 2026 కార్యక్రమం 17 సెప్టెంబర్ నుంచి 2 అక్టోబర్ వరకు కొనసాగుతోంది. దీని ఇతివృత్తం “స్వచ్ఛతా మే సహభాగ్; స్వచ్ఛ భారత్, వికసిత్ భారత్.” ఈ కార్యక్రమం ‘సంపూర్ణ ప్రభుత్వ విధానం’, ‘సంపూర్ణ సమాజ విధానం’తో కొనసాగుతోంది. యువత, సంబంధిత వర్గాల బాధ్యతలు, సమష్టి బాధ్యతకు ఇందులో మరింత ప్రాధాన్యం ఇస్తున్నారు. ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు, 2026పై కూడా ఈ కార్యక్రమం అవగాహన కల్పిస్తోంది. వివిధ వర్గాల బాధ్యతలపై అవగాహనను పెంచడం దీని లక్ష్యం. ఎస్‌హెచ్‌ఎస్ 2026లో స్థానిక సంస్థలు, ప్రభుత్వ సంస్థలు, ప్రజలు ఐదు ప్రధాన స్తంభాల కింద ఈ కింది కార్యక్రమాలను చేపడుతున్నారు:

1. పరిశుభ్రత లక్షిత‌ ప్రాంతాలు (సీటీయూ), పరిశుభ్రమైన బహిరంగ ప్రదేశాల రూపాంతరం
ఈ కార్యక్రమంలో నిర్లక్ష్యానికి గురైన చెత్త ప్రాంతాలు, శుభ్రం చేయడం కష్టమైన ప్రదేశాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ ప్రాంతాల్లో చెత్త తొలగింపు, సుందరీకరణ, నిరంతర నిర్వహణ చేపడతారు. పారిశుధ్యం, చెత్తకు సంబంధించిన ఫిర్యాదులను నమోదు చేసేందుకు స్వచ్ఛతా యాప్ను ఉపయోగించవచ్చు. గుర్తించిన ప్రాంతాలను తరువాత ఎస్‌హెచ్‌ఎస్ 2026 పోర్టల్‌లో మ్యాప్ చేయవచ్చు. మార్కెట్లు, పాఠశాలలు, ఆసుపత్రులు, రవాణా కేంద్రాలు, పార్కులు, జల వనరులు కూడా ఈ కార్యక్రమ పరిధిలోకి వస్తాయి. ప్రజా, సామూహిక మరుగుదొడ్లను ఫేసెస్ (ఫంక్షనల్, యాక్సెసిబుల్, క్లీన్, ఎకో-ఫ్రెండ్లీ అండ్ సేఫ్) ప్రమాణాల ఆధారంగా అంచనా వేస్తారు.



2. స్వచ్ఛ పాఠశాల - యువ ఫర్ స్వచ్ఛత
ఎస్‌హెచ్‌ఎస్ 2026లో విద్యార్థులు, యువతకు ప్రత్యేక పాత్ర ఉంది. నిరంతర ప్రవర్తనా మార్పుపై దృష్టి సారిస్తున్నారు. 6 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు స్వచ్ఛతా జ్ఞాన్ యాత్రల్లో పాల్గొంటారు. ఈ పర్యటనల ద్వారా విద్యార్థులకు వ్యర్థాల నిర్వహణ, పారిశుధ్య సదుపాయాలపై అవగాహన కల్పిస్తారు. పారిశుధ్యం, నీటి సంరక్షణపై చర్చలు నిర్వహించాలని పాఠశాలలను ప్రోత్సహిస్తున్నారు. పరిశుభ్రత, చేతులు కడుక్కోవడం, రుతుక్రమ పరిశుభ్రత, సురక్షిత తాగునీరు వంటి అంశాలను ఈ చర్చల్లో చేర్చవచ్చు.

3. సఫాయిమిత్ర సురక్షా సేవ ఏవం సమ్మాన్ శిబిరాలు
పారిశుధ్య కార్మికులు, వారి కుటుంబాలపై కార్యక్రమం దృష్టిని కొనసాగిస్తోంది. ఈ శిబిరాల్లో ఆరోగ్య సేవలు, భద్రతా పరికరాలు, సంక్షేమ పథకాల అనుసంధానం అందిస్తారు.

4. స్వచ్ఛత కోసం జన భాగీదారీ(ప్ర‌జా భాగ‌స్వామ్యం)
ఎస్‌హెచ్‌ఎస్ 2026లో ప్ర‌జా భాగ‌స్వామ్యం ప్ర‌ధాన‌మైన‌ది. రోజువారీ పరిశుభ్రతపై పౌరులు, సంస్థలు బాధ్యత తీసుకోవాలని ప్రోత్సహిస్తున్నారు. 2026 ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలపై అవగాహన, మూలస్థాయిలో నాలుగు రకాలుగా వ్యర్థాల వేర్పాటుపై ప్రదర్శనలు, ఇంటి వద్ద కంపోస్టింగ్‌పై అవగాహన, చెత్త వేయడం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు వ్యతిరేకంగా కార్యక్రమాలు, స్వచ్ఛత ర్యాలీలు, మానవహారాలు, ప్రజా స్వచ్ఛత ప్రతిజ్ఞలు, పునర్వినియోగించగల గృహ వస్తువుల సేకరణ వంటి కార్యక్రమాలను నిర్వహించనున్నారు.



5. స్వచ్ఛతా సే సమృద్ధి
ఈ కార్యక్రమం పరిశుభ్రతను వనరుల పునరుద్ధరణ, సర్క్యులర్ విధానంతో అనుసంధానిస్తోంది. తగ్గించడం, పునర్వినియోగం, రీసైక్లింగ్ విధానాలను ప్రోత్సహిస్తోంది. కబాడ్ సే జుగాడ్ ద్వారా పనికిరాని వస్తువులతో ఉపయోగకరమైన ఉత్పత్తులను తయారు చేయడాన్ని ప్రోత్సహిస్తారు. కబాడ్ సే కళా ద్వారా వ్యర్థ పదార్థాలతో కళాత్మక వస్తువులను రూపొందించడాన్ని ప్రోత్సహిస్తారు. ఈ కార్యక్రమాలు వ్యర్థాల నిర్వహణను సృజనాత్మకత, వనరుల పునరుద్ధరణతో అనుసంధానిస్తున్నాయి.

వీటితో పాటు 1 అక్టోబర్ 2026న ఏక్ దిన్, ఏక్ ఘంటా, ఏక్ సాథ్ కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా ఒకేసారి పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహిస్తారు. పౌరులు, యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ఇతర సంస్థలు ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని ప్రోత్సహిస్తున్నారు. అక్టోబర్ 2న ప్రత్యేక గ్రామసభలు ఎస్‌హెచ్‌ఎస్ కార్యక్రమాలు, 2026 ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలపై చర్చిస్తాయి. పట్టణ స్థానిక సంస్థలు కూడా ప్రత్యేక కౌన్సిల్ సమావేశాలు నిర్వహిస్తాయి. ఈ విధంగా ఎస్‌హెచ్‌ఎస్ 2026 పరిశుభ్రత, ప్రవర్తనలో మార్పు, యువత భాగస్వామ్యం, వ్యర్థాల నిర్వహణను ఒకే కార్యక్రమంలో అనుసంధానిస్తోంది. పారిశుధ్య కార్మికులు, ప్రజా పారిశుధ్య మౌలిక వసతులపై కూడా దృష్టిని మరింత పెంచుతోంది. ఈ విధానం స్వచ్ఛతను ఒక కార్యక్రమంగా చూడటం నుంచి సమష్టి అలవాటు, బాధ్యతగా మార్చే విస్తృత మార్పును ప్రతిబింబిస్తోంది.

2026 కార్యక్రమాన్ని అర్థం చేసుకోవాలంటే సంవత్సరాలుగా ఎస్‌హెచ్‌ఎస్ ఎలా పరిణామం చెందిందో పరిశీలించడం ముఖ్యం. దాని దృష్టి అంశాలు, ఇతివృత్తాలు నిరంతర పారిశుధ్య ప్రవర్తన దిశగా క్రమంగా సాగిన మార్పును చూపిస్తున్నాయి.

 



2017లో ప్రారంభమైనప్పటి నుంచి పారిశుధ్యం, పరిశుభ్రతకు సంబంధించిన కొత్త ప్రాధాన్యాలకు అనుగుణంగా ఈ కార్యక్రమం తన దృష్టి అంశాలు, పరిధి, జోక్యం చేసుకునే రంగాలను క్రమంగా విస్తరించింది.

స్వచ్ఛతా హీ సేవ 2017: ప్రజల నేతృత్వంలో ఉద్యమానికి శ్రీకారం
మొదటి ఎస్‌హెచ్‌ఎస్ కార్యక్రమాన్ని 15 సెప్టెంబర్ 2017న ప్రారంభించారు. స్వచ్ఛతా హీ సేవ ప్రతిజ్ఞతో పాటు దేశవ్యాప్త భాగస్వామ్యానికి పిలుపుతో కార్యక్రమం ప్రారంభమైంది. పరిశుభ్రతను సమష్టి జాతీయ బాధ్యతగా ఈ కార్యక్రమం పేర్కొంది. శ్రమదానం ద్వారా పౌరులు నేరుగా పాల్గొనేలా ప్రోత్సహించారు. శ్రమదానం అంటే సమాజ సంక్షేమం కోసం స్వచ్ఛందంగా సేవ చేయడం లేదా సహకారం అందించడం. ఎస్‌బీఎం కింద శ్రమదానం ప్రధానంగా పరిశుభ్రత కార్యక్రమాలపై దృష్టి పెడుతుంది. మొదటి ఎస్‌హెచ్‌ఎస్ కార్యక్రమం ఎస్‌బీఎం కింద జరిగిన విస్తృత పారిశుధ్య మార్పుతో సన్నిహితంగా అనుసంధానమైంది. 2017 నాటికి 2014 నుంచి 4.82 కోట్ల మరుగుదొడ్లు నిర్మించారు. ఓడీఎఫ్ గ్రామాల సంఖ్య 2.38 లక్షలకు చేరింది. వ్యక్తిగత మరుగుదొడ్ల వినియోగ పరిధి 2014లో 42 శాతం నుంచి 2017లో 64 శాతానికి పెరిగింది. దీంతో పారిశుధ్య మౌలిక వసతుల వేగవంతమైన విస్తరణతో పాటు ఎస్‌హెచ్‌ఎస్ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ పురోగతికి పౌరుల సమీకరణ, సమాజ భాగస్వామ్యాన్ని జోడించింది.

ఎస్‌హెచ్‌ఎస్ 2017లో ప్రజల నుంచి విస్తృత భాగస్వామ్యం లభించింది. మొత్తం 2.46 కోట్ల మంది పిల్లలు స్వచ్ఛ సంకల్ప్ స్వచ్ఛ సిద్ధి పెయింటింగ్ పోటీలో పాల్గొన్నారు. పరిశుభ్రతపై పిల్లల్లో అవగాహన కల్పించడం ఈ పోటీ ప్రధాన లక్ష్యం. సోషల్ మీడియా ద్వారా కూడా కార్యక్రమానికి విస్తృత ప్రచారం లభించింది. ప్రారంభమైన రోజే #SwachhataHiSeva అనే హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్‌గా నిలిచింది. ఆ తర్వాత పౌరులు తమ శ్రమదానం, పరిశుభ్రత కార్యక్రమాలను ఆన్‌లైన్‌లో పంచుకునేందుకు ఈ హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగించారు.

 


ఇతర కార్యక్రమాల్లో పరిశుభ్రత కార్యక్రమాలు, పారిశుధ్య చర్యలు, బహిరంగ మలవిసర్జనకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో చర్యలు ఉన్నాయి. స్వయం సహాయక సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, స్థానిక సమాజాలు కూడా ఇలాంటి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాయి.

స్వచ్ఛతా హీ సేవ 2018: స్వచ్ఛత కోసం బ‌లోపేత‌మైన ప్ర‌జా ఉద్య‌మం
ఎస్‌హెచ్‌ఎస్ 2018ను సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహించారు. జన భాగీదారీ విధానాన్ని ఈ కార్యక్రమం మరింత బలోపేతం చేసింది. ‘పారిశుధ్యం అందరి బాధ్యత’ అనే భావనను మరింత బలపరిచింది. విద్యార్థులు, స్వచ్ఛాగ్రహీలు, మహిళా నాయకులు, యువజన సంఘాలు, ప్రముఖులు, సామాజిక సంస్థలను ఇందులో భాగస్వాములను చేశారు. గ్రామపంచాయతీ స్థాయిలో పనిచేసే ప్రత్యేక శిక్షణ పొందిన పారిశుధ్య కార్మికులను స్వచ్ఛాగ్రహీలుగా పేర్కొన్నారు. బహిరంగ మలవిసర్జన చేయకుండా గ్రామస్తులను ప్రోత్సహించే నిగ్రాణి సమితులు కూడా ఇందులో పాల్గొన్నాయి. గ్రామసభలు, రైల్వేలు, ప్రముఖ ప్రదేశాలు, విద్యా సంస్థల్లో కార్యక్రమాలను విస్తరించారు.

ఈ కార్యక్రమం పిల్లలు, యువతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చింది. 3 నుంచి 5వ తరగతి విద్యార్థులు చేతులు కడుక్కోవడంపై కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 6 నుంచి 12వ తరగతి విద్యార్థులు బహిరంగ స్వచ్ఛతా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సెప్టెంబర్ 16న స్వచ్ఛతా సభలు నిర్వహించారు. స్థానిక పరిశుభ్రత పరిస్థితిని సమీక్షించేందుకు గ్రామాల్లో ప్రత్యేక గ్రామసభలు నిర్వహించారు. భవిష్యత్తులో చేపట్టాల్సిన పారిశుధ్య కార్యక్రమాల కోసం కార్యాచరణ ప్రణాళికలు కూడా రూపొందించారు. సెప్టెంబర్ 17ను సేవా దివస్‌గా నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర మంత్రిత్వ శాఖలు దేశవ్యాప్తంగా స్వచ్ఛతా కార్యక్రమాలు చేపట్టాయి. మంత్రుల నేతృత్వంలో ప్రభుత్వ ఉద్యోగులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సెప్టెంబర్ 25న అంత్యోదయ దివస్ కూడా ప్రజల భాగస్వామ్యాన్ని మరింత పెంచింది. ప్రతి స్వచ్ఛాగ్రహీ మరింత మంది స్వచ్ఛాగ్రహీలతో విస్తృత నెట్‌వర్క్ ఏర్పాటు చేయాలని ప్రోత్సహించారు. ఈ విధానం పారిశుధ్య కార్యక్రమాల్లో వ్యక్తిగత స్వచ్ఛంద కార్యకర్తలకే పరిమితం కాకుండా మరింత మంది భాగస్వాములు కావడానికి దోహదపడింది. స్థానిక నాయకత్వాన్ని నిరంతర పారిశుధ్య చర్యలతో అనుసంధానించింది.

ఒకే ల‌క్ష్యం, అనేక స్వరాలు: స్వచ్ఛత కోసం ఏక‌మైన‌ భారత్

 


స్వచ్ఛతా హీ సేవ 2018 దేశవ్యాప్తంగా ప్రజలను పరిశుభ్రత కోసం ఒకే సమష్టి ప్రయత్నంలో భాగస్వాములను చేసింది. డిబ్రూగఢ్‌కు చెందిన పాఠశాల విద్యార్థులు, దంతేవాడ, సేలంకు చెందిన మహిళా స్వచ్ఛాగ్రహీలు, బిజ్నోర్‌లో గంగానదిని శుభ్రం చేసిన స్వచ్ఛంద కార్యకర్తలు తమ క్షేత్రస్థాయి కార్యక్రమాలను పంచుకున్నారు. మిస్టర్ అమితాబ్ బచ్చన్ ముంబై బీచ్‌ను శుభ్రం చేయడం గురించి మాట్లాడగా, మిస్టర్ రతన్ టాటా ప్రతి పౌరుడి కోసం చేపట్టిన ఉద్యమంలో భాగస్వామ్యం కావడం గౌరవంగా ఉందని పేర్కొన్నారు. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ జవాన్లు పాంగాంగ్ సరస్సు వద్ద పాల్గొన్నారు. దైనిక్ జాగరణ్ వంటి మీడియా సంస్థలు, సహకార సంఘాలు, రైల్వే ఉద్యోగులు, పౌరులు కూడా తమ వంతు సహకారం అందించారు. ఈ అన్ని వర్గాల భాగస్వామ్యం స్వచ్ఛ భారత్ కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాదని, దేశం మొత్తం భాగస్వామ్యమయ్యే ఉద్యమం అనే ప్రభుత్వ సందేశాన్ని ప్రతిబింబించింది.



స్వచ్ఛతా హీ సేవ 2019: ప్లాస్టిక్ వ్యర్థాలపై దృష్టి
ఎస్‌హెచ్‌ఎస్ 2019ను సెప్టెంబర్ 11 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్లాస్టిక్ వ్యర్థాలపై అవగాహన, నిర్వహణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని పౌరులను ప్రోత్సహించారు. దీనికి ప్రత్యామ్నాయంగా వస్త్రం, జనపనార సంచులను ప్రోత్సహించారు. అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ, వేర్పాటు కోసం శ్రమదానం నిర్వహించారు. శ్రమదానం ద్వారా సేకరించిన ప్లాస్టిక్‌ను రీసైక్లింగ్ చేయడం లేదా తగిన విధంగా పారవేయడం కోసం చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. దీంతో ప్లాస్టిక్ సేకరణకే పరిమితం కాకుండా దాని తదుపరి నిర్వహణపై కూడా దృష్టి పెట్టారు. ఈ కార్యక్రమ సమయంలో అన్ని రాష్ట్రాలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తుల వినియోగాన్ని నిరుత్సాహపరచాలని సూచించారు. ఫలితంగా ఆరు రాష్ట్రాలు, 171 జిల్లాలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించాయి.

 


కోవిడ్-19 మహమ్మారి కారణంగా 2020లో ఎస్‌హెచ్‌ఎస్ నిర్వహించలేదు.

స్వచ్ఛతా హీ సేవ 2021: సంస్కృతిగా పరిసరాల పరిశుభ్రత
ఎస్‌హెచ్‌ఎస్ 2021ను సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహించారు. ఓడీఎఫ్ ప్లస్ కార్యక్రమాలను వేగవంతం చేయడం, గ్రామాల్లో సాధించిన ఓడీఎఫ్ ఫలితాలను కొనసాగించడం ఈ కార్యక్రమ లక్ష్యం. అవగాహన, ప్రజల సమీకరణను ఈ కార్యక్రమం కలిపింది. ఎస్‌హెచ్‌ఎస్ 2021లో 60 లక్షల మందికి పైగా ప్రజలు 1.5 లక్షలకు పైగా శ్రమదానం కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 2021 అక్టోబర్ 1 నాటికి 43,000కు పైగా గ్రామసభలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు వ్యతిరేకంగా తీర్మానాలు చేశాయి.

ఎస్‌హెచ్‌ఎస్ 2021లో ప్రధాన కార్యక్రమాల్లో ఒకటి సత్యాగ్రహ సే స్వచ్ఛాగ్రహ రథయాత్ర. పారిశుధ్యంపై అవగాహన కల్పించేందుకు 783కు పైగా స్వచ్ఛతా రథాలు జిల్లాలు, బ్లాక్‌లు, గ్రామపంచాయతీల్లో పర్యటించాయి. స్వచ్ఛతా శ్రమదానం, 37,507 స్వచ్ఛతా జాగృతి యాత్రల ద్వారా అవగాహనను ప్రత్యక్ష ప్రజా చర్యలతో అనుసంధానించారు. స్వచ్ఛ భారత్ దివస్ రోజున మాత్రమే సుమారు 6.4 లక్షల మంది ప్రజలు 2.4 లక్షలకు పైగా శ్రమదానం కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

గ్రామీణ సమాజాల్లో పారిశుధ్య సందేశాలను విస్తృతంగా చేరవేసేందుకు ఎస్‌హెచ్‌ఎస్ 2021లో వివిధ ప్రచార సాధనాలను ఉపయోగించారు. 9,401 గోడ చిత్రాలు, ర్యాలీలు, పలు నినాదాల రచనలు ఓడీఎఫ్ ప్లస్ సందేశాలను గ్రామాలకు చేర్చాయి. స్వచ్ఛతా ఛాంపియన్లను గుర్తించి సత్కరించడంతో పాటు ప్రజల భాగస్వామ్యాన్ని కూడా ప్రోత్సహించారు.



ఎస్‌హెచ్‌ఎస్ 2021లో పారిశుధ్యంలో అంతగా కనిపించని అంశాలపై కూడా దృష్టి పెట్టారు. స్థాయిత్వ ఏవం సుజలం అభియాన్ ద్రవ వ్యర్థాల నిర్వహణపై దృష్టి పెట్టింది. ఈ కార్యక్రమంలో 15,951 గృహ స్థాయి, 7,216 సామూహిక సోక్ పిట్లు నిర్మించారు. దీంతో సమగ్ర పరిశుభ్రత లేదా సంపూర్ణ స్వచ్ఛత కోసం జన భాగీదారీ మరింత బలోపేతమైంది. ఇది ఎస్‌హెచ్‌ఎస్ 2022లో పరిసరాల పరిశుభ్రతపై మరింత దృష్టి పెట్టేందుకు పునాదిగా నిలిచింది.

స్వచ్ఛతా హీ సేవ 2022: పరిసరాల పరిశుభ్రతపై దృష్టి
ఎస్‌హెచ్‌ఎస్ 2022ను సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహించారు. గ్రామాల పరిసరాల పరిశుభ్రతపై ఈ కార్యక్రమం దృష్టి పెట్టింది. గ్రామాల చుట్టుపక్కల పేరుకుపోయిన చెత్త, వ్యర్థాలను తొలగించడంపై దృష్టి సారించారు. ఓడీఎఫ్ ప్లస్ గ్రామాల కోసం జన భాగీదారీను మరింత బలోపేతం చేయాలని ఎస్‌హెచ్‌ఎస్ 2022 లక్ష్యంగా పెట్టుకుంది. “సంపూర్ణ స్వచ్ఛ గ్రామం” అనే భావనను కూడా ప్రోత్సహించింది. ‘పారిశుధ్యం అందరి బాధ్యత’ అనే సూత్రాన్ని ఈ కార్యక్రమం మరింత బలపరిచింది. వ్యర్థాల వేర్పాటు, ప్లాస్టిక్ నిర్వహణ, జల వనరుల పరిసరాల పరిశుభ్రత వంటి విస్తృత పారిశుధ్య చర్యలతో కనిపించే పరిశుభ్రతను అనుసంధానించారు. ఎస్‌బీఎం-జీ రెండో దశలో సుస్థిర గ్రామీణ పారిశుధ్యం దిశగా సాగేందుకు ఈ విధానం దోహదపడింది.

తొమ్మిది రాష్ట్రాల్లో యునైటెడ్ ఇండియా ఫర్ స్వచ్ఛత కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ కోసం 4ఆర్ విధానం: నిరాకరించడం, తగ్గించడం, పునర్వినియోగం, రీసైక్లింగ్ను ప్రోత్సహించారు. పారిశుధ్యంపై అవగాహన కోసం ఎస్‌హెచ్‌ఎస్ 2022లో అనేక ప్రచార మార్గాలను ఉపయోగించారు. గోడ చిత్రాలు, నుక్కడ్ నాటకాలు, స్వచ్ఛతా రథాలు, సోషల్ మీడియా కంటెంట్ వంటి కార్యక్రమాలు నిర్వహించారు. “చెత్త వేయ‌బోమ‌ని” ప్రతిజ్ఞలు చేయాలని పౌరులను ప్రోత్సహించారు. ఈ కార్యక్రమాలు గ్రామీణ నాయకత్వాన్ని సమాజ స్థాయి పారిశుధ్య చర్యలతో అనుసంధానించాయి.

గ్రామీణ భారతదేశంలో ఈ కార్యక్రమానికి భారీగా ప్రజల భాగస్వామ్యం లభించింది. పారిశుధ్య కార్యక్రమాల కోసం శ్రమదానంలో 9.81 కోట్ల మందికి పైగా పాల్గొన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు వ్యతిరేకంగా 1.59 లక్షలకు పైగా గ్రామపంచాయతీలు తీర్మానాలు చేశాయి. ఓడీఎఫ్ ప్లస్ అంశాలపై నిర్వహించిన సర్పంచ్ సంవాదాల్లో సుమారు 1.68 లక్షల మంది సర్పంచులు పాల్గొన్నారు. దీంతో పరిశుభ్రమైన పరిసరాలను సమాజ బాధ్యత, సుస్థిర వ్యర్థాల నిర్వహణతో అనుసంధానించారు.

స్వచ్ఛతా హీ సేవ 2023: చెత్త రహిత భారత్ దిశగా
ఎస్‌హెచ్‌ఎస్ 2023ను సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహించారు. “గార్బేజ్-ఫ్రీ ఇండియా” అనే ఇతివృత్తాన్ని స్వీకరించారు. స్వచ్ఛంద సేవ, శ్రమదానం, పరిసరాల పరిశుభ్రత, సఫాయిమిత్ర సంక్షేమంపై దృష్టి పెట్టారు. ఇందుకోసం సెప్టెంబర్ 17 నుంచి సఫాయిమిత్ర సురక్షా శిబిరాలు నిర్వహించారు. ఘన వ్యర్థాల నిర్వహణ, వినియోగించిన నీటి నిర్వహణలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల సంక్షేమం, జీవన ప్రమాణాలను మెరుగుపరచడం ఈ శిబిరాల లక్ష్యం.

18 రోజుల కార్యక్రమంలో 109 కోట్లకు పైగా పాల్గొనడం నమోదైంది. స్వచ్ఛత కోసం శ్రమదానంలో సుమారు 53 కోట్ల మంది పాల్గొన్నారు. అంటే ప్రతిరోజూ సగటున దాదాపు మూడు కోట్ల మంది శ్రమదానంలో పాల్గొన్నారు. అక్టోబర్ 1న “ఏక్ తారీఖ్ ఏక్ ఘంటా ఏక్ సాథ్” కార్యక్రమంతో ప్రచారం ముగిసింది. దేశవ్యాప్తంగా దాదాపు 9.2 లక్షల కార్యక్రమాల్లో 8.75 కోట్ల మంది పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 6.8 కోట్ల మంది, పట్టణ ప్రాంతాల్లో 1.95 కోట్ల మంది పాల్గొన్నారు.

ప్రజా ప్రదేశాల్లో ఈ కార్యక్రమం స్పష్టమైన మార్పులను తీసుకొచ్చింది. దాదాపు 7,611 బీచ్‌లను శుభ్రం చేశారు. 6,371 నదీ తీరాలు, జలతీర ప్రాంతాలను పునరుద్ధరించారు. 15,576కు పైగా పాత వ్యర్థాల ప్రదేశాలను పునరుద్ధరించారు. 3,620 పర్యాటక, ప్రముఖ ప్రదేశాలను మెరుగుపరిచారు. 1.23 లక్షలకు పైగా బహిరంగ ప్రదేశాలను పునరుద్ధరించారు. 16,000కు పైగా జల వనరులను శుభ్రం చేశారు. దాదాపు 66,779 చెత్త పేరుకుపోయే ప్రాంతాలను శుభ్రం చేశారు.

ఇండియన్ స్వచ్ఛతా లీగ్ 2.0 కూడా యువతను ఈ కార్యక్రమంలోకి తీసుకొచ్చింది. పాల్గొనేందుకు 4,000కు పైగా నగర బృందాలను సిద్ధం చేశారు. బీచ్‌లు, కొండలు, పర్యాటక ప్రదేశాలను శుభ్రం చేసేందుకు ఈ బృందాలు ర్యాలీలు నిర్వహించాయి. స్వచ్ఛతపై యువతలో నిరంతర బాధ్యతాభావాన్ని పెంపొందించడం ఈ కార్యక్రమ లక్ష్యం.

 



ఎస్‌హెచ్‌ఎస్ 2023 ఎస్‌బీఎం గ్రామీణ, పట్టణ విభాగాలను ఒకే కార్యక్రమంలోకి తీసుకొచ్చింది. 71 మంత్రిత్వ శాఖలు, విభాగాలు తమదైన విధానాల్లో ఈ కార్యక్రమానికి సహకరించాయి. వివిధ రంగాలు, ప్రజా ప్రదేశాల్లో స్వచ్ఛతా చర్యలను విస్తరించాయి. ఉదాహరణకు, పర్యాటక మంత్రిత్వ శాఖ 108 ఎంపిక చేసిన ప్రదేశాల్లో క్లీన్లీనెస్ కోసం ట్రావెల్ ఫర్ లైఫ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఎస్‌హెచ్‌ఎస్ వీడియోను సినిమా థియేటర్లలో ప్రదర్శించింది. టెలికమ్యూనికేషన్స్ విభాగం మొబైల్ నెట్‌వర్క్‌లలో ఎస్‌హెచ్‌ఎస్ రింగ్‌టోన్‌ను ప్రసారం చేసింది.

ప్రభుత్వ సమన్వయం, సమాజ భాగస్వామ్యం ద్వారా ఎంత పెద్ద స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించవచ్చో ఈ కార్యక్రమం చూపించింది. మరుగుదొడ్లకే పరిమితమైన స్వచ్ఛత భావనను వ్యర్థాల నిర్వహణ, ప్రవర్తనలో మార్పు దిశగా విస్తరించవచ్చని కూడా ఫలితాలు చూపించాయి.

స్వచ్ఛతా హీ సేవ 2024: స్వచ్ఛత నుంచి స్వభావం వరకు
ఎస్‌హెచ్‌ఎస్ 2024ను సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహించారు. ప్రవర్తన, సామాజిక విలువలపై మరింత దృష్టి పెట్టడం ద్వారా ఇది కీలక మార్పును సూచించింది. దీని ఇతివృత్తం “స్వభావ్ స్వచ్ఛతా, సంస్కార్ స్వచ్ఛతా”. కార్యక్రమం ప్రధానంగా ఈ అంశాలపై దృష్టి పెట్టింది:
* పరిశుభ్రత లక్ష్య ప్రాంతాల రూపాంతరం (నిర్లక్ష్యానికి గురైన, అపరిశుభ్ర ప్రాంతాలు)
* స్వచ్ఛతా మే జన భాగీదారీ: పరిశుభ్రతలో ప్రజల భాగస్వామ్యం
* సఫాయిమిత్ర సురక్షా శిబిరాలు: పారిశుధ్య కార్మికుల సంక్షేమం

క్లీన్‌లీనెస్ టార్గెట్ యూనిట్స్ (సీటీయూలు) పర్యావరణ, ఆరోగ్యపరమైన ముప్పులు కలిగించే తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ప్రాంతాలు. చెత్త పేరుకుపోయే ప్రాంతాలు, డంప్‌సైట్లు వంటి ప్రదేశాలను వివిధ ప్రాంతాల్లో సాధారణ పరిశుభ్రత కార్యక్రమాల సమయంలో తరచుగా పట్టించుకోలేదు. నిర్దిష్ట కాలపరిమితిలో చర్యలు చేపట్టి ఈ ప్రాంతాలను మార్చడం కార్యక్రమ లక్ష్యం. ఈ కార్యక్రమంలో 3.10 లక్షల నివాస ప్రాంతాలను మార్చారు. 2.11 లక్షల రోడ్డు పక్క ప్రాంతాలను, 56,526 మార్కెట్ ప్రాంతాలను కూడా పునరుద్ధరించారు. కార్యక్రమంలో 61 లక్షలకు పైగా మొక్కలు నాటారు.

ఎస్‌హెచ్‌ఎస్ 2024 సంప్రదాయ పరిశుభ్రత కార్యక్రమాలకు మించి ప్రజల భాగస్వామ్యాన్ని విస్తరించింది. స్వచ్ఛ భారత్ సాంస్కృతిక ఉత్సవాలు పరిశుభ్రతను స్థానిక కళ, సంస్కృతితో అనుసంధానించాయి. ఈ కార్యక్రమాల్లో సమాజ భాగస్వామ్యం, సఫాయిమిత్రల సేవలను కూడా ప్రస్తావించారు. మొత్తం 76,837 స్వచ్ఛ భారత్ సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించారు. సుమారు 15,710 స్వచ్ఛ ఫుడ్ స్ట్రీట్లు ఏర్పాటు చేశారు. వ్యర్థాలతో కళా వస్తువుల తయారీ, పర్యావరణహిత ఉత్పత్తులను కూడా ప్రోత్సహించారు. దీంతో సాంస్కృతిక భాగస్వామ్యం స్వచ్ఛత సందేశాన్ని ప్రజలకు చేరవేసే మరో మార్గంగా మారింది.

 



సఫాయిమిత్ర సురక్షా శిబిరాలు నివారణాత్మక ఆరోగ్య సేవలు, సంక్షేమ పథకాల అనుసంధానాన్ని అందించాయి. దీంతో స్వచ్ఛతకు ఉన్న అర్థం మరింత విస్తరించింది. పరిశుభ్రమైన పరిసరాలతో పాటు పారిశుధ్య వ్యవస్థలకు సేవలందిస్తున్న కార్మికుల సంక్షేమంపైనా కార్యక్రమం దృష్టి పెట్టింది.

2024 అక్టోబర్ 1 నాటికి ఈ కార్యక్రమంలో 29.21 లక్షల కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించారు. ఇందులో 26.44 లక్షల కార్యక్రమాలు పూర్తయ్యాయి. ప్రజల భాగస్వామ్యం 26.25 కోట్ల మందికి చేరింది. పౌరులు 3.04 లక్షల స్వచ్ఛతా ప్రతిజ్ఞలు చేశారు. దీంతో ఎస్‌హెచ్‌ఎస్ 2024 పరిశుభ్రతను అలవాట్లు, విలువలు, ప్రజల భాగస్వామ్యం, గౌరవంతో అనుసంధానించింది.



స్వచ్ఛతా హీ సేవ 2025: సామాజిక వేడుకల్లోకి స్వచ్ఛత
ఎస్‌హెచ్‌ఎస్ 2025, 2024లో చేపట్టిన ప్రవర్తనపై దృష్టిని కొనసాగించింది. “స్వచ్ఛోత్సవ్”, పరిశుభ్రమైన వేడుకల స్ఫూర్తి ప్రధాన అంశాలుగా నిలిచాయి. ఈ కార్యక్రమం సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు కొనసాగింది. స్వచ్ఛోత్సవ్‌లో ఐదు ప్రధాన స్తంభాలు ఉన్నాయి. ప్రజలు, ప్రదేశాలు, లక్ష్యాలను ఒకటిగా చేర్చి పరిశుభ్రమైన, పచ్చదనంతో కూడిన భారతదేశం లక్ష్యాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసేలా ఈ కార్యక్రమాలను రూపొందించారు.

ఎస్‌హెచ్‌ఎస్ 2025లోని ఐదు ప్రధాన స్తంభాలు:
* పరిశుభ్రత లక్ష్య ప్రాంతాల రూపాంతరం
* పరిశుభ్రమైన బహిరంగ ప్రదేశాలు
* సఫాయిమిత్ర సురక్షా శిబిరం
* పరిశుభ్రమైన, పచ్చదనంతో కూడిన వేడుకలు
* స్వచ్ఛత కోసం అవగాహన కార్యక్రమాలు

 



ఈ కార్యక్రమంలో 15.75 లక్షల సీటీయూలను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమాల్లో 7.74 కోట్ల మంది పాల్గొన్నారు. 6.22 కోట్ల మంది పౌరుల భాగస్వామ్యంతో 5.89 లక్షల బహిరంగ ప్రదేశాలను కూడా శుభ్రం చేశారు. ఎస్‌హెచ్‌ఎస్ 2025 పరిశుభ్రతను సాంస్కృతిక వేడుకలతో కూడా అనుసంధానించింది. పండుగల సమయంలో సుస్థిర విధానాలను పాటించాలని సమాజాలను ప్రోత్సహించారు. ఫలితంగా 4.31 లక్షలకు పైగా పర్యావరణహిత పండాళ్లు, 3.18 లక్షలకు పైగా పండుగల అనంతర పరిశుభ్రత కార్యక్రమాలు, 2.81 లక్షలకు పైగా స్వచ్ఛతా రంగోలీలు నమోదయ్యాయి. దీంతో స్వచ్ఛత సామాజిక వేడుకల్లో భాగమైంది.

సఫాయిమిత్ర సురక్షా శిబిరం కార్యక్రమాన్ని కొనసాగించారు. కార్యక్రమంలో 2.71 లక్షలకు పైగా శిబిరాలు నిర్వహించి 5.12 లక్షల పారిశుధ్య కార్మికులను గుర్తించి వారికి సేవలు అందించారు. కార్మికుల కోసం 1.63 లక్షల నివారణాత్మక ఆరోగ్య పరీక్షా శిబిరాలు నిర్వహించారు. 4.55 లక్షల పీపీఈ కిట్లను పంపిణీ చేశారు. మొత్తంగా ఈ శిబిరాల ద్వారా 81.51 లక్షల మంది లబ్ధి పొందారు.

అనేక అవగాహన కార్యక్రమాల ద్వారా ఈ కార్యక్రమాన్ని సమాజంలో మరింత విస్తరించారు. మొత్తం 29.02 లక్షల కార్యక్రమాలు నిర్వహించగా, 3.27 కోట్ల మంది పాల్గొన్నారు. నిర్వహించిన కొన్ని కార్యక్రమాలు:
* 4.09 లక్షల స్వచ్ఛతా ర్యాలీలు
* 1.01 లక్షల వ్యర్థాలతో కళా వస్తువుల ఏర్పాటు
* 2.47 లక్షల స్వచ్ఛతా పోటీలు
* 93,145 క్రీడా లీగ్‌లు
* 3.64 లక్షల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వ్యతిరేక కార్యక్రమాలు
* 15.94 లక్షల ఇంటింటి అవగాహన కార్యక్రమాలు
* 92,971 స్వచ్ఛ ఫుడ్ స్ట్రీట్లు

 



మొత్తంగా, ఎస్‌హెచ్‌ఎస్ 2025లో దేశవ్యాప్తంగా 18.06 కోట్ల మంది పాల్గొన్నారు. దీంతో ఎస్‌హెచ్‌ఎస్ పరిశుభ్రత కార్యక్రమాల నుంచి సామాజిక వేడుకలు, సుస్థిర విధానాల వరకు విస్తరించింది.

పరిశుభ్రతకు మించి: రోజువారీ ప్రవర్తనను మార్చడం
ఎస్‌హెచ్‌ఎస్ ప్రయాణం పరిశుభ్రతకు ఉన్న అర్థం క్రమంగా ఎలా విస్తరించిందో చూపిస్తోంది. ప్రారంభ కార్యక్రమాల్లో పరిశుభ్రత చర్యలు, స్వచ్ఛంద సేవపై దృష్టి పెట్టారు. తరువాతి కార్యక్రమాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు, పరిసరాల పరిశుభ్రత, చెత్త నిర్వహణకు ప్రాధాన్యం పెరిగింది. 2023 నుంచి ఈ మార్పు మరింత స్పష్టమైంది. “గార్బేజ్-ఫ్రీ ఇండియా” ద్వారా బహిరంగ ప్రదేశాలు, వ్యర్థాల నిర్వహణపై దృష్టి విస్తరించింది. 2024లో పరిశుభ్రతను స్వభావ్, సంస్కార్తో అనుసంధానించారు. 2025లో స్వచ్ఛోత్సవ్ ద్వారా పరిశుభ్రతను పండుగలు, సామాజిక వేడుకల్లోకి తీసుకెళ్లారు.

2026లో స్వచ్ఛతా మే సహభాగ్ ద్వారా సమష్టి చర్య, సహకారం అనేవి ప్ర‌ధానమైన‌విగా మారాయి. భౌతిక ప్రదేశాలను శుభ్రం చేయడం నుంచి నిరంతర ప్రవర్తనా మార్పును పెంపొందించే దిశగా ఈ కార్యక్రమం పరిణామం చెందింది. రోజువారీ జీవితంలో స్వచ్ఛతను అలవాటుగా మార్చడం, సమాజ సమష్టి బాధ్యత భావనను బలోపేతం చేయడం లక్ష్యంగా ముందుకు సాగుతోంది.

 

References

Ministry of Jal Shakti

https://gobardhan.sbm.gov.in/

https://swachhatahiseva.gov.in/

https://sbmurban.org/campaign

https://swachhatahiseva.gov.in/daily-bulletin

https://swachhbharatmission.ddws.gov.in/about-us

https://sbm.gov.in/SBMGDashboard/StatesDashboard.aspx

https://sansad.in/getFile/loksabhaquestions/annex/16/AU2540.pdf?source=pqals

https://sansad.in/getFile/loksabhaquestions/annex/173/AU777.pdf?source=pqals

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1964179&reg=48&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1881827&reg=48&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1859823&reg=48&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1755220&reg=48&lang=2

https://www.pib.gov.in/PressReleaseDetail.aspx?PRID=1503113&reg=6&lang=1

https://www.pib.gov.in/PressReleaseDetail.aspx?PRID=2311628&reg=48&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2191618&reg=3&lang=2

https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=1545203&reg=48&lang=2

https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=1584758&reg=48&lang=2

https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=1760608&reg=48&lang=2

https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=1760427&reg=48&lang=2

https://www.pib.gov.in/FeaturesDeatils.aspx?NoteId=150274&ModuleId=2&reg=48&lang=2

https://cdnbbsr.s3waas.gov.in/s3kv02c60549ede842a11ec07346b8928d/uploads/2024/09/2024092083-1.pdf

Ministry of Housing & Urban Affairs

https://sbmurban.org/swachh-bharat-mission-progress

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1957683&reg=48&lang=2

https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=1960088&reg=48&lang=2

Ministry of Commerce & Industry

https://www.ibef.org/blogs/swachh-bharat-mission-s-urban-and-gramin-success-what-s-driving-the-progress

Prime Minister’s Office

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1546223&reg=48&lang=2

Government of Nagaland

https://ipr.nagaland.gov.in/swachhata-hi-seva-campaign-phek-district

PIB Backgrounder

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2191618&reg=3&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2170998&reg=48&lang=2

https://www.pib.gov.in/PressNoteDetails.aspx?NoteId=153227&ModuleId=3&reg=48&lang=2

President's Secretariat

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2145459&reg=48&lang=2

United Nations

https://www.unv.org/Success-stories/together-we-can-celebrating-shramdaan-spirit-volunteerism-india

 

***

(Explainer ID: 160165) आगंतुक पटल : 20
Provide suggestions / comments
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali , Tamil , Kannada , Malayalam