• Sitemap
  • Advance Search
Rural Prosperity

దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన 2.0

నైపుణ్యం, స్వావలంబన కలిగిన శ్రామిక శక్తి నిర్మాణం

Posted On: 24 SEP 2026 10:53AM

గ్రామీణ యువతకు అవసరమైన నైపుణ్యాలు నేర్పడం, ఉపాధి అవకాశాలు కల్పించడం సమగ్ర, సుస్థిర గ్రామీణ పరివర్తనకు ఎంతో కీలకం. ఈ లక్ష్యంతో జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్‌ కింద దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన (డీడీయూ–జీకేవై)ను 2014 సెప్టెంబర్‌ 25న ప్రారంభించారు. దీని కొనసాగింపుగా డీడీయూ–జీకేవై 2.0 ప్రస్తుతం 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలవుతోంది. 749కు పైగా ఆమోదిత ప్రాజెక్టులు, 760కు పైగా క్రియాశీల శిక్షణ కేంద్రాలు, 455కు పైగా ప్రాజెక్టు అమలు సంస్థల ద్వారా ఆర్థిక రంగాలన్నింటిలో శిక్షణ అందిస్తున్నారు. 2014–15లో పథకం ప్రారంభమైనప్పటి నుంచి 800కు పైగా ఉద్యోగ విభాగాల్లో 18.47 లక్షల మందికి పైగా శిక్షణ ఇచ్చారు. వీరిలో 12.43 లక్షల మందికి పైగా ఉపాధి లభించింది. నైపుణ్య శిక్షణకు తోడుగా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలు (ఆర్‌ఎస్‌ఈటీఐలు) స్వయం ఉపాధి, గ్రామీణ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నాయి. ప్రస్తుతం 634 జిల్లాల్లోని 647 ఆర్‌ఎస్‌ఈటీఐలు 63.47 లక్షల మందికి శిక్షణ ఇచ్చాయి. వీరిలో 45.60 లక్షల మంది ఉపాధి లేదా స్వయం ఉపాధిలో స్థిరపడ్డారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన శిక్షణ, డిజిటల్‌ సేవలు, ఉద్యోగ స్థిరత్వం, గ్రామీణ యువతకు సుస్థిర జీవనోపాధి అవకాశాలను ఈ కార్యక్రమాలు బలోపేతం చేస్తున్నాయి.

నైపుణ్యాలు, అవకాశాలతో గ్రామీణ యువతకు సాధికారత

 


భారత్‌లో యువ జనాభా ఆర్థిక వృద్ధి, గ్రామీణ జీవనోపాధులను బలోపేతం చేసేందుకు గొప్ప అవకాశాన్ని అందిస్తోంది. 2036 నాటికి దేశ యువ జనాభా దాదాపు 34.5 కోట్లకు చేరుతుందని అంచనా. ఈ జనాభా శక్తిని సమర్థంగా వినియోగించుకోవాలంటే నాణ్యమైన నైపుణ్య శిక్షణ, ఉద్యోగాలు, జీవనోపాధి అవకాశాలను మరింతగా అందుబాటులోకి తీసుకురావాలి.

ఈ అవసరాన్ని గుర్తించిన గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్‌ కింద దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన (డీడీయూ–జీకేవై)ను 2014 సెప్టెంబర్‌ 25న ప్రారంభించింది. ఈ ఏడాది డీడీయూ–జీకేవై 12వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. గ్రామీణ యువతకు నైపుణ్యాల నుంచి ఉద్యోగాలు, సుస్థిర జీవనోపాధి వరకు అవకాశాలను ఈ కార్యక్రమం కల్పిస్తోంది. పేద కుటుంబాలకు చెందిన 15 నుంచి 35 ఏళ్ల గ్రామీణ యువతకు ఉద్యోగ నియామకంతో అనుసంధానించిన నైపుణ్య శిక్షణను దశాబ్దానికి పైగా అందిస్తోంది.

షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగలకు 50 శాతం, మహిళలకు 33 శాతం, దివ్యాంగులకు 5 శాతం తప్పనిసరి ప్రాతినిధ్యం కల్పిస్తూ సామాజిక సమ్మిళితత్వాన్ని కూడా ప్రోత్సహిస్తోంది. గత దశాబ్దంలో ఉద్యోగ ఫలితాలు, నియామకం తర్వాత సహాయంపై ఈ పథకం మరింత దృష్టి పెట్టింది. శిక్షణ, ఉద్యోగ నియామకాలు, ఉపాధి స్థిరత్వం, నియామకం తర్వాత సహాయాన్ని బలోపేతం చేస్తూ మెరుగుపరిచిన డీడీయూ–జీకేవై 2.0 మార్గదర్శకాలను ప్రభుత్వం 2025 మేలో ప్రకటించింది. పరిశ్రమల అవసరాల ఆధారంగా విమాన, అంతరిక్ష రంగం, వ్యవసాయం, సౌందర్యం, ఆరోగ్య సంరక్షణ, హరిత ఉద్యోగాలు, వైద్యం, వస్త్ర రంగం సహా పలు విభాగాల్లో శిక్షణ అందించే అవకాశం సవరించిన విధానంలో ఉంది. గ్రామీణ నైపుణ్యాభివృద్ధిపై నిరంతర దృష్టికి అనుగుణంగా 2026–27 కేంద్ర బడ్జెట్‌లో డీడీయూ–జీకేవైకి ₹750 కోట్లు కేటాయించారు.

ప్రత్యేక కార్యక్రమాలు: వెనుక‌బ‌డిన‌ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
డీడీయూ–జీకేవై 2.0 కింద రెండు ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేస్తున్నారు:



రోషిణి: హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ గుర్తించిన వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాల ప్రత్యేక అవసరాలను ఈ కార్యక్రమం పరిష్కరిస్తుంది. నివాస సదుపాయంతో కూడిన నైపుణ్య శిక్షణను తప్పనిసరిగా అందిస్తూ, మహిళలకు 40 శాతం ప్రాతినిధ్యం కల్పిస్తుంది. స్థానిక మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్యం, సహజ వనరులు, సంప్రదాయ నైపుణ్యాలపై దృష్టి పెట్టేలా ఆకాంక్షిత జిల్లాలకు కూడా దీన్ని విస్తరించారు.

హిమాయత్‌: జమ్మూ కశ్మీర్‌, లద్దాఖ్‌ కోసం అమలు చేస్తున్న ప్రత్యేక డీడీయూ–జీకేవై పథకం. దారిద్య్ర రేఖకు దిగువన, ఎగువన ఉన్నవారితో సహా గ్రామీణ, పట్టణ యువత దీని పరిధిలోకి వస్తారు. వేతన ఉద్యోగాలు, స్వయం ఉపాధి, గిగ్‌ ఉపాధికి ఈ పథకం సహకారం అందిస్తుంది. కేంద్ర ప్రభుత్వం 100 శాతం నిధులు సమకూరుస్తుంది. ప్రత్యేక మిషన్‌ నిర్వహణ విభాగాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అమలు సాగుతుంది.

ఈశాన్య ప్రాంతం: ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేకంగా ఉండే సామాజిక-సాంస్కృతిక పరిస్థితులు, భౌగోళిక సవాళ్లను పరిగణనలోకి తీసుకుని డీడీయూ–జీకేవై మొత్తం కేటాయింపుల్లో 10 శాతం నిధులను ఈ రాష్ట్రాలకు ప్రత్యేకంగా కేటాయించారు.

చేరుకోవడం కష్టమైన ప్రాంతాలు: ప్రత్యేక ప్రాంత భత్యానికి కూడా అవకాశం కల్పించారు. ఇలాంటి ప్రాంతాల్లో ప్రతి అభ్యర్థి ప్రాథమిక శిక్షణ వ్యయంపై అదనంగా 10 శాతం మొత్తాన్ని ప్రాజెక్టు అమలు సంస్థలు పొందవచ్చు.

డీడీయూ–జీకేవై 2.0: సుస్థిర ఉపాధి దిశగా మార్పు
డీడీయూ–జీకేవై 2.0లో నైపుణ్య శిక్షణ నుంచి ఉద్యోగ నియామకం, ఉపాధి కొనసాగింపు, వృత్తిపరమైన పురోగతి వరకు సమగ్ర విధానాన్ని అనుసరిస్తున్నారు.

సవరించిన విధానం శిక్షణ ప్రమాణాలను బలోపేతం చేస్తుంది. కనీస ఉద్యోగ వ్యవధిని పెంచడంతో పాటు నియామకం తర్వాత సహాయాన్ని మెరుగుపరుస్తుంది. వలసలకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తూ సాంకేతిక పరిజ్ఞానం ఆధారిత పర్యవేక్షణ, అమలును కూడా బలోపేతం చేస్తుంది.

శిక్షణ విధానానికి ప్రామాణిక రూపం
డీడీయూ–జీకేవై 2.0లో కనీసం 576 గంటల శిక్షణ కొనసాగిస్తూ, మరింత క్రమబద్ధమైన విధానాన్ని ప్రవేశపెట్టారు. మూడు నెలల కోర్సులో 396 గంటల వృత్తి సంబంధిత శిక్షణ, 180 గంటల తప్పనిసరి సాధారణ శిక్షణ ఉంటాయి. సాధారణ శిక్షణను నాలుగు విభాగాల్లో ప్రామాణికంగా రూపొందించారు. ఆంగ్ల సమాచార నైపుణ్యాలకు 60 గంటలు, ఉద్యోగ–జీవన నైపుణ్యాలకు 60 గంటలు, కంప్యూటర్‌, డిజిటల్‌ అక్షరాస్యతకు 30 గంటలు, పారిశ్రామిక నైపుణ్యాలకు 30 గంటలు కేటాయించారు. దీంతో ఉద్యోగానికి అవసరమైన సాంకేతిక నైపుణ్యాలతో పాటు భావ వ్యక్తీకరణ, కార్యాలయ నిర్వహణ, డిజిటల్‌ పరిజ్ఞానం, వ్యాపార సామర్థ్యాలు అభ్యర్థులకు లభిస్తాయి.

ఉద్యోగ వ్యవధి
గతంలో డీడీయూ–జీకేవై కింద నియామకం అంటే కనీసం మూడు నెలల నిరంతర ఉపాధిగా పరిగణించేవారు. మెరుగైన శిక్షణ విధానానికి అనుగుణంగా డీడీయూ–జీకేవై 2.0లో కనీస ఉద్యోగ వ్యవధిని ఆరు నెలలకు పెంచారు. నిరంతర, విరామాలతో కూడిన ఉపాధి రెండూ సవరించిన మార్గదర్శకాల పరిధిలోకి వస్తాయి. వేతన ఉద్యోగం, స్వయం ఉపాధి, గిగ్‌ ఉపాధిని కూడా పరిగణనలోకి తీసుకుంటారు.

గ్రామీణ యువతను నియామక సంస్థలతో కలిపే ఉద్యోగ మేళాలు
స్థానిక యువతను ఉద్యోగాలు ఇచ్చే సంస్థలతో అనుసంధానించేందుకు రాష్ట్ర గ్రామీణ జీవనోపాధి మిషన్లు మండలాలు, గ్రామపంచాయతీ స్థాయిలో ఉద్యోగ మేళాలు నిర్వహిస్తాయి. యువత నమోదు, వృత్తి మార్గదర్శనం, నియామక సంస్థల ధ్రువీకరణ, కౌశల్‌ పంజీ ద్వారా ఏడాదిపాటు ఉద్యోగ ఫలితాల పర్యవేక్షణ ఇందులో ఉంటాయి. ఉపాధికి అవసరమైన నైపుణ్యాలున్న యువత కోసం ప్రధానంగా ఈ మేళాలు నిర్వహిస్తారు. మెరుగైన ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నించే డీడీయూ–జీకేవై శిక్షణ పొందిన అభ్యర్థులు కూడా వీటిలో పాల్గొనవచ్చు. గ్రామపంచాయతీ స్థాయి మేళాలో 100 మందికి, మండల స్థాయి మేళాలో 200 మందికి ఉద్యోగాలు కల్పించాలనే నిబంధనకు లోబడి, డీడీయూ–జీకేవై బడ్జెట్‌ నుంచి వరుసగా ₹50 వేల వరకు, ₹లక్ష వరకు నిధులు అందుబాటులో ఉంటాయి.

ఉద్యోగ స్థిరత్వం, వృత్తిపరమైన పురోగతికి సహకారం

 


డీడీయూ–జీకేవై 2.0లో స్థిరమైన ఉపాధికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఆరు నెలల ఉద్యోగ వ్యవధికి సహకరించేలా నియామకం తర్వాత 12 నెలలపాటు పర్యవేక్షణ ఉంటుంది. ఉపాధి కొనసాగింపునకు అందించే సహాయం ఇలా ఉంటుంది:
* ఉద్యోగం పొందిన అభ్యర్థులకు ఆరు నెలలపాటు నెలకు ₹1,270 చొప్పున మొత్తం ₹7,620 ఆర్థిక సాయం అందుతుంది.
* గరిష్ఠంగా 60 రోజుల ఉద్యోగ విరామంతో 365 రోజులపాటు ఉపాధిలో కొనసాగిన అభ్యర్థికి ₹5 వేల స్థిరత్వ ప్రోత్సాహకం లభిస్తుంది.
* ఉద్యోగంలో చేరిన 12 నెలల తర్వాత నైపుణ్యాలను పెంచుకునేందుకు, కొత్త నైపుణ్యాలు నేర్చుకునేందుకు అవకాశాలు కల్పిస్తారు. తద్వారా ఉపాధిలో కొనసాగడంతో పాటు వృత్తిపరంగా ఎదిగే అవకాశాలు మెరుగవుతాయి.

వలస సహాయ కేంద్రాలు (ఎంఎస్‌సీలు)
శిక్షణ పొందిన వారిలో గణనీయమైన సంఖ్య జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని వలసదారులకు సహాయ వ్యవస్థలను బలోపేతం చేయడంపై డీడీయూ–జీకేవై 2.0 ప్రత్యేక దృష్టి పెట్టింది. ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో రాష్ట్ర గ్రామీణ జీవనోపాధి మిషన్లు వలస సహాయ కేంద్రాలను ఏర్పాటు చేస్తాయి. సొంత రాష్ట్రాలతో పాటు ఉద్యోగ గమ్యస్థానాలున్న రాష్ట్రాల్లోనూ ఇవి పనిచేస్తాయి. కొత్త ప్రాంతానికి మారే సమయంలో అభ్యర్థులకు బస సదుపాయం, మార్గదర్శనం, ఉద్యోగ సహాయం వంటి సేవలను ఈ కేంద్రాలు అందిస్తాయి.

ఉపాధి సమాచారాన్ని చేరవేయడం, పూర్వ విద్యార్థుల మధ్య సంబంధాలను ప్రోత్సహించడం, నియామక సంస్థలతో సంప్రదింపులను బలోపేతం చేయడంలోనూ ఇవి సహకరిస్తాయి. పట్టణ పని వాతావరణంలో అభ్యర్థులు స్థిరపడేందుకు, దీర్ఘకాలం ఉద్యోగంలో కొనసాగేందుకు స్థానిక పాలనా సంస్థలు, సేవలు అందించే సంస్థలతో సమన్వయం చేస్తాయి. ఈ సహాయ వ్యవస్థకు పెరుగుతున్న ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఒక్కో కేంద్రానికి వార్షిక నిధులను గతంలోని ₹10 లక్షల నుంచి సవరించిన విధానంలో గరిష్ఠంగా ₹30 లక్షలకు పెంచారు.

అమలులో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం
పథకం ప్రారంభం నుంచి డీడీయూ–జీకేవై అమలులో సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషిస్తోంది. భౌగోళిక గుర్తింపు, సమయం నమోదయ్యే బయోమెట్రిక్‌ హాజరు, కంప్యూటర్‌ ప్రయోగశాలలు, ఆన్‌లైన్‌ శిక్షణ సదుపాయాలను వినియోగిస్తున్నారు. కార్యక్రమ పర్యవేక్షణ బలోపేతం కావడంతో పాటు శిక్షణ పొందేవారికి డిజిటల్‌ పరికరాలపై అవగాహన పెరిగింది.

ఈ సాంకేతిక పునాదిని మరింత విస్తరిస్తూ డీడీయూ–జీకేవై 2.0లో కార్యక్రమం మొత్తం కాలవ్యవధిని నిర్వహించే సమగ్ర డిజిటల్‌ వ్యవస్థను ప్రవేశపెట్టారు. ప్రాజెక్టు అమలు సంస్థల నమోదు, ప్రాజెక్టుల సమర్పణ–మూల్యాంకనం, శిక్షణ కేంద్రాలు–అభ్యర్థుల నిర్వహణ, పరీక్షలు–ధ్రువపత్రాలు, ఆర్థిక నిర్వహణ, ప్రాజెక్టుల పర్యవేక్షణ, ఉద్యోగ నియామకాల పరిశీలనను ఈ వేదికలో చేర్చారు.

సవరించిన విధానంలో ఈ సదుపాయాలు కూడా ఉన్నాయి:
* కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు అధునాతన సమాచార సూచికలు.
* శిక్షణ కోసం వెతకడం, ప్రాజెక్టు అమలు సంస్థల పనితీరు రేటింగ్‌లను చూడటం కోసం అభ్యర్థుల ప్రజా పోర్టల్‌.
* ప్రాజెక్టు నమోదు సంఖ్య (పీఆర్‌ఎన్‌) జారీ, ఫిర్యాదుల పరిష్కారం, ధ్రువపత్రాల పరిశీలన వంటి ఆటోమేటెడ్‌ సేవలు.
* ముఖ గుర్తింపు, తక్షణ సమాచార సూచికల ద్వారా డిజిటల్‌ హాజరు, మూల్యాంకనం.
* కోర్సు వివరాలను ఆటోమేటిక్‌గా ధ్రువీకరించేందుకు స్కిల్‌ ఇండియా డిజిటల్‌ హబ్‌తో అనుసంధానం.

డీడీయూ–జీకేవై 2.0 అమలులో ముందంజ (2025–26)
* డీడీయూ–జీకేవై 2.0 కింద శిక్షణ బృందాలను ఏర్పాటు చేసిన తొలి రాష్ట్రంగా గోవా నిలిచింది.
* ఆంధ్రప్రదేశ్‌ కేవలం మూడు నెలల్లోనే 12 వేల మందికి పైగా అభ్యర్థులకు శిక్షణ ప్రారంభించింది.
* జమ్మూ కశ్మీర్‌కు కేటాయించిన లక్ష్యాల్లో 100 శాతాన్ని పంపిణీ చేసి, 91 శాతం లక్ష్యాలకు సంబంధించిన శిక్షణను ప్రారంభించారు.

పథకం సాధించిన ప్రధాన మైలురాళ్లు

 


డీడీయూ–జీకేవై ప్రస్తుతం 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో విస్తృత నైపుణ్య శిక్షణ వ్యవస్థ ద్వారా అమలవుతోంది. ప్రస్తుతం 749 ఆమోదిత ప్రాజెక్టులు, 760 క్రియాశీల శిక్షణ కేంద్రాలు, 455కు పైగా ప్రాజెక్టు అమలు సంస్థలు ఈ కార్యక్రమంలో భాగంగా ఉన్నాయి.

2014–15లో ప్రారంభమైనప్పటి నుంచి ఆర్థిక వ్యవస్థలోని 36 రంగాలు, 800కు పైగా ఉద్యోగ విభాగాల్లో 18.47 లక్షల మందికి పైగా అభ్యర్థులకు డీడీయూ–జీకేవై శిక్షణ ఇచ్చింది. 12.43 లక్షల మందికి పైగా ఉద్యోగాలు లభించాయి. గ్రామీణ యువతకు పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాలను అందిస్తూ పలు రంగాల్లో విస్తృతంగా పనిచేస్తున్న తీరును ఈ ఫలితాలు తెలియజేస్తున్నాయి.

ఈ పథకం కింద 9.71 లక్షల మందికి పైగా మహిళలు శిక్షణ పొందగా, 6.34 లక్షల మందికి పైగా మహిళలకు ఉద్యోగాలు లభించాయి.



గ్రామీణ యువ పారిశ్రామికవేత్తలకు సహకరించే ఇతర కార్యక్రమాలు
డీడీయూ–జీకేవై ఉద్యోగ నియామకంతో అనుసంధానించిన వేతన ఉపాధిపై దృష్టి పెడుతోంది. అదే సమయంలో గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థల (ఆర్‌ఎస్‌ఈటీఐలు) ద్వారా స్వయం ఉపాధి, వ్యాపార అవకాశాలను ప్రభుత్వం బలోపేతం చేసింది. 18 నుంచి 50 ఏళ్ల గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉచిత నివాస శిక్షణను ఈ కార్యక్రమం అందిస్తుంది. సుస్థిర జీవనోపాధిని ఏర్పాటు చేసుకునేందుకు శిక్షణ తర్వాత కూడా సహకారం అందిస్తుంది. దేశంలోని ప్రతి జిల్లాలో ప్రత్యేక నైపుణ్య శిక్షణ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమ లక్ష్యం. ముఖ్యంగా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలు, దీన్‌దయాళ్‌ అంత్యోదయ యోజన–జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్‌ కుటుంబాలకు చెందిన గ్రామీణ యువత నైపుణ్యాలను పెంచడంపై దృష్టి పెడుతుంది.



ప్రస్తుతం 33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 634 జిల్లాల్లో 647 ఆర్‌ఎస్‌ఈటీఐలు పనిచేస్తున్నాయి. 2009లో ప్రారంభమైనప్పటి నుంచి ఈ పథకం 63.47 లక్షల మందికి శిక్షణ ఇచ్చింది. మొత్తం 45.60 లక్షల మంది ఉపాధిలో స్థిరపడ్డారు. ఆర్‌ఎస్‌ఈటీఐ ద్వారా స్థిరపడిన వారిలో దాదాపు 94 శాతం మంది సుస్థిర స్వయం ఉపాధి వ్యాపారాలను ఏర్పాటు చేసుకున్నారు. సుమారు 6 శాతం మంది వేతన ఉద్యోగాలు పొందారు.

భవిష్యత్తుకు అనుగుణంగా గ్రామీణ శ్రామిక శక్తి రూపకల్పన
గ్రామీణ యువతలో నైపుణ్యాలు, ఉద్యోగ సామర్థ్యం, పారిశ్రామిక శక్తిని పెంచడం దేశ సమగ్ర ఆర్థికాభివృద్ధికి కీలకం. డీడీయూ–జీకేవై 2.0 ద్వారా అవసరాలకు వేగంగా స్పందించే, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా పనిచేసే, ఫలితాలపై దృష్టి పెట్టే నైపుణ్య శిక్షణ వ్యవస్థను ప్రభుత్వం రూపొందిస్తోంది. ఈ కార్యక్రమాలు గ్రామీణ యువతను ఉద్యోగాలకు సిద్ధం చేయడంతో పాటు సుస్థిర జీవనోపాధికి సహకరిస్తాయి. నాణ్యమైన శిక్షణ, పరిశ్రమలతో భాగస్వామ్యం, అవసరాలకు అనుగుణమైన సహాయంపై నిరంతరం దృష్టి పెడితే నైపుణ్యాలను దీర్ఘకాలిక జీవనోపాధిగా మార్చవచ్చు. భవిష్యత్తుకు అవసరమైన నైపుణ్యం, సాధికారత, స్వావలంబన కలిగిన గ్రామీణ శ్రామిక శక్తిని నిర్మించే దిశగా డీడీయూ–జీకేవై 2.0 కీలక అడుగు. దేశాన్ని ప్రపంచ ఆర్థిక, విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దాలనే వికసిత భారత్‌–2047 లక్ష్యానికీ ఈ పథకం తోడ్పడుతోంది.

 

References

Ministry of Rural Development

https://kaushal.rural.gov.in/#/about-us
https://kaushal.rural.gov.in/#/training-center-list
https://kaushal.rural.gov.in/assets/files/Deen%20Dayal%20Upadhyaya%20Grameen%20Kaushal%20Yojana.pdf
https://kaushal.rural.gov.in/#/key-features
https://ddugkysop.in/pluginfile.php/21940/mod_resource/content/2/DDUGKY_CNN_aligned_Guidelines_July_2016.pdf
https://www.dord.gov.in/static/uploads/2024/07/ee7db3320bf3aa165fdb69f12cbb2c38.pdf
https://sansad.in/getFile/loksabhaquestions/annex/187/AU3964_UIXOj8.pdf?source=pqals
https://sansad.in/getFile/loksabhaquestions/annex/187/AU5192_zshReo.pdf?source=pqals

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2148466&reg=3&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2294539&reg=3&lang=1

https://cdnbbsr.s3waas.gov.in/s3e9412ee564384b987d086df32d4ce6b7/uploads/2025/06/20250625554506571.pdf

https://cdnbbsr.s3waas.gov.in/s3e9412ee564384b987d086df32d4ce6b7/uploads/2025/06/20250625108042813.pdf

Ministry of Finance

https://www.indiabudget.gov.in/doc/eb/sbe87.pdf

NITI Aayog

https://www.niti.gov.in/sites/default/files/2026-02/Revitalizing-India-Apprenticeship-Ecosystem-Insights-Challenges-Recommendations-and-Best-Practices.pdf

Ministry of Information and Broadcasting

https://www.newsonair.gov.in/bulletins-detail/parikrama-688/

Click here to see pdf 

 

***

(Explainer ID: 160144) आगंतुक पटल : 14
Provide suggestions / comments
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , हिन्दी , Bengali , Assamese