• Sitemap
  • Advance Search
Social Welfare

వేవ్స్ ఓటీటీ, మైవేవ్స్

ప్రజా ప్రసారం నుంచి ప్రజా భాగస్వామ్యం దిశగా

Posted On: 23 SEP 2026 12:06PM

సాంప్రదాయ ప్రసారం నుంచి సమగ్ర డిజిటల్ ప్రజా సేవా వ్యవస్థగా ప్రసార భారతి మారుతున్న తీరుకు వేవ్స్ ప్రతిబింబంగా నిలుస్తోంది. వేవ్స్ ఓటీటీ ద్వారా ప్రత్యక్ష టెలివిజన్, రేడియో, ఆన్-డిమాండ్ కార్యక్రమాలు, ఆర్కైవ్‌లు, విద్యా కార్యక్రమాలు, భక్తి సంబంధిత కంటెంట్, ప్రచురణలను ఒకే డిజిటల్ వేదికపైకి తీసుకువచ్చారు. 1.2 కోట్ల మంది నమోదిత వినియోగదారులు, 1.5 కోట్లకు పైగా డౌన్‌లోడ్లు, 24,000కు పైగా టైటిళ్లతో వివిధ పరికరాలు, భాషల్లో సేవలను మరింత విస్తృతంగా అందుబాటులోకి తీసుకువస్తోంది. మైవేవ్స్ ద్వారా కంటెంట్ సమర్పణ, గుర్తింపు, ప్రదర్శన కోసం క్రియేట‌ర్ల‌కు సంస్థాగత వేదిక లభిస్తోంది. జెమ్స్ ఆఫ్ ఇండియా ద్వారా జిల్లా స్థాయి కథనాలు, ప్రతిభకు ప్రోత్సాహం లభిస్తోంది. కొత్త కంటెంట్ సేకరణ, పంపిణీ విధానాలు ప్రజల భాగస్వామ్యాన్ని మరింత విస్తరిస్తున్నాయి. వేవ్స్ సమ్మిట్ వ్యవస్థతో కలిసి ఈ కార్యక్రమాలు భారత్ ప్రసార వారసత్వాన్ని, కొత్త తరం సృష్టికర్తలను విస్తృత ప్రేక్షకులు, ప్రపంచ మార్కెట్లతో అనుసంధానిస్తున్నాయి.

డిజిటల్ తరానికి ప్రజా ప్రసారం
దశాబ్దాలుగా దూరదర్శన్, ఆకాశవాణి కథలు, వార్తలు, సంస్కృతి, సంగీతం ద్వారా కోట్లాది మందిని అనుసంధానించాయి. ప్రస్తుతం ప్రేక్షకులు స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్ టెలివిజన్లు, డిజిటల్ వేదికల ద్వారా కంటెంట్‌ను ఎక్కువగా వీక్షిస్తున్నారు. దీంతో మారుతున్న ఫార్మాట్లు, భాషలు, వీక్షణ అలవాట్లకు అనుగుణంగా ప్రజా ప్రసార వ్యవస్థ కూడా డిజిటల్, ఓవర్-ది-టాప్ లేదా ఓటీటీ విధానాన్ని స్వీకరించింది. ఈ విధానంలో కేబుళ్లు, శాటిలైట్లు, సర్వీస్ ప్రొవైడర్ల అవసరం లేకుండా వీడియో, ఆడియో, సందేశ కంటెంట్‌ను ఇంటర్నెట్ ద్వారా నేరుగా ప్రేక్షకులకు ప్రసారం చేస్తారు. ఈ మార్పుకు ప్రతిస్పందనగా 20 నవంబర్ 2024న ప్రసార భారతి ప్రారంభించిన వేవ్స్ ఓటీటీ అందుబాటులోకి వచ్చింది. టీవీ, రేడియోలోని పాత ఆర్కైవ్ సంపదతో పాటు సమకాలీన కార్యక్రమాలు, ప్రత్యక్ష ప్రసారాలను ఒకే బహుభాషా డిజిటల్ వేదికపైకి తీసుకువచ్చింది. మైవేవ్స్ ద్వారా పౌరులు తమ స్వంత కంటెంట్‌ను రూపొందించి పంచుకునే అవకాశం కల్పిస్తూ ఈ మార్పును మరింత ముందుకు తీసుకెళ్తోంది.

ఈ మార్పు భారత్ క్రియేటివ్ ఎకానమీని బలోపేతం చేయడం, మీడియా, వినోద రంగాల్లో అవకాశాలను విస్తరించడం కోసం జరుగుతున్న విస్తృత జాతీయ ప్రయత్నంలో భాగం. ప్రపంచవ్యాప్తంగా క్రియేట‌ర్లు, పరిశ్రమ ప్రముఖులు, విధాన రూపకర్తలు, పెట్టుబడిదారులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి భాగస్వామ్యాలు, వ్యాపార అవకాశాలు, అంతర్జాతీయ చర్చలను ప్రోత్సహించేందుకు వేవ్స్ సమ్మిట్‌ను వేదికగా రూపొందించారు. వేవ్స్ సమ్మిట్ తొలి ఎడిషన్ 2025లో జరిగింది. వివిధ వేదికల ద్వారా సృష్టికర్తలు, స్టార్టప్‌లకు మద్దతు ఇవ్వడం, పెట్టుబడులను సులభతరం చేయడం, మీడియా, వినోద రంగాల్లో అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయడంలో ఈ సమ్మిట్ సహకరించింది.

వేవ్స్ ఓటీటీ: ప్రజా ప్రసారాన్ని డిజిటల్‌గా మార్చడం
ప్రసార ఆర్కైవ్‌ల నుంచి డిజిటల్ యాక్సెస్ వరకు

A blue and white diagram with white textAI-generated content may be incorrect.


20 నవంబర్ 2024న గోవాలో జరిగిన 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో వేవ్స్ ఓటీటీని ప్రారంభించారు. ప్రసార భారతి ప్రజా సేవా ఓటీటీ వేదికగా దీనిని ఆవిష్కరించారు. ఈ ప్రారంభంతో భారత్ ప్రసార వారసత్వం ఆధునిక డిజిటల్ ప్రపంచంలోకి ప్రవేశించింది. వాణిజ్య ఓటీటీ వేదికలకు భిన్నంగా వేవ్స్ ఓటీటీ వినోదానికి మాత్రమే పరిమితం కాదు. విశ్వసనీయ సమాచారం, విద్య, సంస్కృతి, వార్తలు, ఎంపిక చేసిన వినోద కార్యక్రమాలను ఒకే వేదికపైకి తీసుకువస్తుంది. స్థిర ప్రసార సమయాలు, సంప్రదాయ టెలివిజన్ సెట్లకు పరిమితమైన ప్రజా ప్రసారాన్ని ఇది మరింత విస్తరిస్తుంది. ప్రేక్షకులు తమ సౌకర్యానికి అనుగుణంగా జాతీయ, ప్రాంతీయ కంటెంట్‌ను వీక్షించవచ్చు.

ప్రసార భారతి విస్తృత ఆర్కైవ్‌లను యువత, మరింత విస్తృత ప్రేక్షకులకు కూడా ఇది అందుబాటులోకి తీసుకువస్తుంది. సులభమైన యాక్సెస్ ద్వారా ప్రధాన నగరాలు, చెల్లింపు స్ట్రీమింగ్ సేవలకు దూరంగా ఉన్న ప్రజలకు కూడా చేరువ అవుతుంది. భాగస్వామ్యాలు, సబ్‌టైటిల్స్, మెరుగైన సెర్చ్ సమాచారం ద్వారా ప్రాంతీయ కంటెంట్‌ను సులభంగా గుర్తించవచ్చు. దీని ప్రారంభం మూడు విస్తృత లక్ష్యాలకు తోడ్పడుతోంది: విస్తృత డిజిటల్ యాక్సెస్, సాంస్కృతిక పరిరక్షణ, భాషా వైవిధ్యం. ప్రజా సేవా లక్ష్యాన్ని కొనసాగిస్తూనే ఒక జాతీయ సంస్థ ఆధునిక సాంకేతికతను ఎలా స్వీకరించగలదో ఇది చూపిస్తోంది.

అందువల్ల వేవ్స్ ఓటీటీ మరో స్ట్రీమింగ్ వేదిక మాత్రమే కాదు. ప్రసార భారతి కంటెంట్‌ను పంపిణీ చేసే విధానం, ప్రేక్షకులను చేరుకునే తీరు, సృష్టికర్తలు, నిర్మాతలు, కంటెంట్ భాగస్వాములతో కలిసి పనిచేసే విధానంలో ఇది విస్తృత మార్పుకు ప్రతీకగా నిలుస్తోంది.

ఒకే వేదిక – అనేక అనుభవాలు
వేవ్స్ ఓటీటీ టెలివిజన్, రేడియో, స్ట్రీమింగ్, విద్య, డిజిటల్ ప్రచురణలను ఒకే వేదికపైకి తీసుకువస్తుంది. ప్రస్తుతం దీని లైబ్రరీలో 24,000కు పైగా టైటిళ్లు, 15,000 గంటల కంటెంట్ ఉంది.
* ఆన్-డిమాండ్‌లో వీక్షించండి: సినిమాలు, టెలివిజన్ కార్యక్రమాలు, వెబ్ సిరీస్‌లు, డాక్యుమెంటరీలు, ఆర్కైవ్ కార్యక్రమాలు.
* ప్రత్యక్ష ప్రసారాలను వీక్షించండి: 140కి పైగా టెలివిజన్ ఛానళ్లు, 220 రేడియో సేవలు.
* ప్రధాన కార్యక్రమాలను అనుసరించండి: జాతీయ వేడుకలు, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తి ప్రసారాలు.
* నేర్చుకోండి, సిద్ధమవండి: పీఎం ఈ-విద్య ఛానళ్లు, విద్యా కార్యక్రమాలు విద్యార్థులు, అభ్యాసకులకు సహాయపడతాయి.
* చదవండి, అన్వేషించండి: ఈ-బుక్స్, ఫొటో కలెక్షన్లు, యోజన, కురుక్షేత్ర వంటి మ్యాగజైన్లు.
* ఆడండి, షాపింగ్ చేయండి: గేమ్స్, ఓఎన్‌డీసీ అనుసంధానిత షాపింగ్ ద్వారా వేవ్స్ సంప్రదాయ స్ట్రీమింగ్ పరిధిని మరింత విస్తరిస్తోంది.

ఈ వేదిక వినోదంతో పాటు విద్య, సంస్కృతి, వారసత్వం, ఉపయోగకరమైన ప్రజా సమాచారాన్ని ఒకచోట అందిస్తోంది. ప్రసార భారతి ఆర్కైవ్‌లలోని వేలాది గంటల కంటెంట్ ద్వారా కొత్త ప్రేక్షకులను భారత్ ప్రసార చరిత్రతో మరింతగా అనుసంధానిస్తోంది.

భాషలు, వివిధ తెరలపై విస్తృత చేరువ
వేవ్స్ ఓటీటీకి ప్రస్తుతం 1.2 కోట్ల మంది నమోదిత వినియోగదారులు, 1.5 కోట్లకు పైగా డౌన్‌లోడ్లు ఉన్నాయి. ప్రసార భారతి డిజిటల్ సేవలకు పెరుగుతున్న ఆదరణను ఇది ప్రతిబింబిస్తోంది. ప్రస్తుతం 130కి పైగా దేశాల్లో ప్రేక్షకులకు ఇది చేరువ అవుతోంది.
* దీని ఇంటర్‌ఫేస్ 10కి పైగా భాషలకు మద్దతు ఇస్తోంది. కంటెంట్ 26కు పైగా భాషల్లో అందుబాటులో ఉంది.
* మొబైల్ అప్లికేషన్లు, వెబ్‌సైట్లు, కనెక్టెడ్ టెలివిజన్ల ద్వారా దీనిని యాక్సెస్ చేయవచ్చు.
* ఇతర ప్రసార సంస్థలతో పాటు మొత్తం 35 దూరదర్శన్ శాటిలైట్ ఛానళ్లను ఇది అందిస్తోంది.
* దీని రేడియో సేవలు ఆకాశవాణి జాతీయ, ప్రాంతీయ నెట్‌వర్క్‌లను ఉపయోగించుకుంటున్నాయి.
* ప్రాంతీయ కంటెంట్, సబ్‌టైటిల్స్ ద్వారా వివిధ భాషలు, ప్రాంతాల ప్రేక్షకులకు చేరువ అవుతోంది.

వేవ్స్ ఓటీటీ దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు సేవలు అందిస్తోంది. ముఖ్యంగా యువత, డిజిటల్‌కు ప్రాధాన్యం ఇచ్చే వినియోగదారులు, ప్రాంతీయ, భాషా వర్గాలు, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, ఆర్కైవ్ కంటెంట్‌ను కోరుకునే వారికి ఇది ఉపయోగపడుతోంది. భారతీయ ప్రవాసులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు భారతీయ కంటెంట్, సంస్కృతి, ప్రజా ప్రసార సేవలను కూడా అందిస్తోంది. ఈ విస్తరిస్తున్న డిజిటల్ చేరువ భారత్‌లో అభివృద్ధి చెందుతున్న ప్రజా ప్రసార వ్యవస్థలో వేవ్స్ ఓటీటీ ప్రాధాన్యతను పెంచుతోంది. అదే సమయంలో దేశ సాంస్కృతిక వారసత్వం, జ్ఞాన సంప్రదాయాలు, ప్రాంతీయ వైవిధ్యం, సృజనాత్మకతను ప్రదర్శించే వేదికగా కూడా ఇది పనిచేస్తోంది.

మరింత కంటెంట్‌కు వేదికను తెరవడం
ప్రజా ప్రసారంలోకి కంటెంట్ వచ్చే విధానంలో కూడా వేవ్స్ ఓటీటీ మార్పులు తీసుకువస్తోంది. పే-పర్-వ్యూ కంటెంట్ సోర్సింగ్ పాలసీ ద్వారా నిర్మాతలు, హక్కుదారులు నాణ్యమైన కంటెంట్‌ను వేదికకు అందించేందుకు పారదర్శకంగా, విస్తరించగల విధానం అందుబాటులోకి వచ్చింది.

వేవ్స్ ఓఎన్‌డీసీ అనుసంధానం, రైల్వేలకు సంబంధించిన డిజిటల్ పంపిణీ కార్యక్రమాలను కూడా ప్రారంభించింది. ఈ చర్యలు కంటెంట్ పంపిణీని విస్తరించడం, కంటెంట్ భాగస్వామ్యాలను ప్రోత్సహించడం, భారతీయ, ప్రాంతీయ కంటెంట్ మరింత విస్తృత ప్రేక్షకులకు చేరేందుకు అదనపు మార్గాలను కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.

మైవేవ్స్: ప్రేక్షకులను సృష్టికర్తలుగా మార్చడం
మైవేవ్స్‌ను 23 మార్చి 2026న వేవ్స్ ఓటీటీలో ప్రారంభించారు. ఇది కంటెంట్ వీక్షణ నుంచి ప్రజల క్రియాశీల భాగస్వామ్యం దిశగా వేదికను విస్తరిస్తోంది. పౌరులు జాతీయ స్థాయి వ్యవస్థీకృత వేదిక ద్వారా తమ స్వంత కంటెంట్‌ను రూపొందించి, అప్‌లోడ్ చేసి, పంచుకోవచ్చు. మైవేవ్స్ షార్ట్ వీడియోలు, వర్టికల్ వీడియోలు, ఎపిసోడిక్ కంటెంట్‌కు మద్దతు ఇస్తుంది. దీని బహుభాషా ఇంటర్‌ఫేస్ ద్వారా సృష్టికర్తలు భారతీయ భాషల్లో కథలు చెప్పవచ్చు. క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ సహా జాతీయ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాన్ని కూడా ఇది కల్పిస్తుంది.

ఇప్పటికే ఉన్న మీడియా నెట్‌వర్క్‌లకు వెలుపల ఉన్న అభివృద్ధి చెందుతున్న సృష్టికర్తలకు ఈ వేదిక ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. ప్రాంతీయ కథలు, స్థానిక ప్రతిభ, సమాజ అనుభవాలను విస్తృత ప్రేక్షకులకు తీసుకువెళ్లేందుకు ఇది అవకాశం కల్పిస్తుంది. ఈ విధంగా మైవేవ్స్ పౌరుల భాగస్వామ్యాన్ని, భారత్‌లో అభివృద్ధి చెందుతున్న క్రియేటర్ ఎకానమీని బలోపేతం చేస్తోంది.

భారత్ డిజిటల్ కథన ప్రయాణంలో మైవేవ్స్ పౌరులను కేవలం ప్రేక్షకులుగా కాకుండా భాగస్వాములుగా మారుస్తోంది.

జెమ్స్ ఆఫ్ ఇండియా: ఆచరణలో మైవేవ్స్
దేశవ్యాప్తంగా సృష్టికర్తలకు మైవేవ్స్ ఎలా మద్దతు ఇవ్వగలదో జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ చూపిస్తోంది. దీని పైలట్ దశను 21 జూలై 2026న ఆరు పైలట్ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రారంభించారు. మైవేవ్స్ విభాగం ద్వారా ఒకటి నుంచి మూడు నిమిషాల నిడివి ఉన్న స్వంత వీడియోలను సృష్టికర్తలు సమర్పించవచ్చు. పైలట్ దశకు 1–31 ఆగస్టు 2026 మధ్య దరఖాస్తులు స్వీకరించారు.

తమ జిల్లాలకు సంబంధించిన కథలను చెప్పేందుకు ఈ ఛాలెంజ్ పౌరులను ఆహ్వానిస్తోంది. అంశాల్లో:


* సంస్కృతి, వారసత్వం, చారిత్రక ప్రదేశాలు.
* ప‌ర్యాటకం, ప్రకృతి, అంతగా తెలియని ప్రాంతాలు.
* జానపద సంప్రదాయాలు, పండుగలు, ప్రదర్శన కళలు.
* హస్తకళలు, చేనేత, ప్రాంతీయ వంటకాలు.
* స్థానిక ప్రముఖులు, ఆవిష్కరణలు, విజయాలు.

ఈ కార్యక్రమంలో ప్రసార భారతి, మై భారత్, రాష్ట్ర, జిల్లా పరిపాలనా విభాగాలు భాగస్వాములుగా ఉన్నాయి. సాంస్కృతిక, విద్యా సంస్థలు సృష్టికర్తల భాగస్వామ్యం, కంటెంట్ అభివృద్ధికి మద్దతు ఇస్తున్నాయి. అదనంగా, యూట్యూబ్, మెటా కూడా తమ క్రియేటర్ కమ్యూనిటీల ద్వారా ప్రచారానికి మద్దతు ఇస్తున్నాయి.

ఈ కార్యక్రమాన్ని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు విస్తరించాలని భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా క్షేత్రస్థాయి డిజిటల్ సృష్టికర్తల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడం దీని విస్తృత లక్ష్యం. భారత్‌లోని వివిధ స్థానిక గుర్తింపులతో కూడిన డిజిటల్ సేకరణను రూపొందించేందుకు కూడా ఇది దోహదపడుతుంది.

కంటెంట్, సృష్టికర్తలు, క్రియేటివ్ ఎకానమీని అనుసంధానించడం
భారత్ డిజిటల్ మీడియా పరివర్తన అంటే కేవలం కంటెంట్‌ను ఆన్‌లైన్‌లోకి తీసుకురావడం మాత్రమే కాదు. యాక్సెస్‌ను విస్తరించడం, ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, ప్రతిభకు అవకాశాలను కల్పించడం కూడా ఇందులో భాగమే.

భారత్ సృజనాత్మక ప్రయాణంలో ప్రతి కార్యక్రమం ఒక ప్రత్యేక అంశాన్ని ముందుకు తీసుకువెళ్తోంది. వేవ్స్ ఓటీటీ ప్రసార ఆర్కైవ్‌లను భద్రపరచడంతో పాటు వాటిని కొత్త ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకువస్తోంది. బహుభాషా కంటెంట్ ద్వారా సమాచారం, విద్య, వినోదాన్ని వివిధ ప్రాంతాలు, పరికరాల్లో అందుబాటులో ఉంచుతోంది.

మైవేవ్స్ ఈ అందుబాటును మరింత ముందుకు తీసుకువెళ్తూ పౌరులకు తమ గొంతును వినిపించే అవకాశం కల్పిస్తోంది. ప్రాంతీయ సృష్టికర్తలు స్థానిక సంస్కృతులు, సంప్రదాయాలు, ప్రదేశాలు, విజయాలను నమోదు చేసుకునేందుకు ఇది వీలు కల్పిస్తోంది. గతంలో స్థానిక సమాజాలకు మాత్రమే పరిమితమైన కథలు ఇప్పుడు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే అవకాశం ఉంది.

విస్తృత వేవ్స్ వ్యవస్థ
వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (వేవ్స్) మీడియా, వినోద రంగానికి భారత్ అందిస్తున్న ప్రపంచ వేదిక. 2025 మే 1–4 తేదీల్లో ముంబైలో జరిగిన తొలి ఎడిషన్‌లో సృష్టికర్తలు, వ్యాపార సంస్థలు, పెట్టుబడిదారులు, విధాన రూపకర్తలు, సాంకేతిక రంగ ప్రముఖులు పాల్గొన్నారు. ఇందులో బ్రాడ్‌కాస్టింగ్ అండ్ ఇన్ఫోటైన్‌మెంట్, ఏవీజీసీ–ఎక్స్‌ఆర్, డిజిటల్ మీడియా, సినిమాలు వంటి అంశాలు చర్చకు వచ్చాయి.

వేవ్స్ 2025 – ముఖ్యాంశాలు
100కు పైగా దేశాలు | 10,000కు పైగా ప్రతినిధులు | 1,000 మంది సృష్టికర్తలు | 300కు పైగా కంపెనీలు | 350కు పైగా స్టార్టప్‌లు | లక్షకు పైగా పాల్గొన్నవారు

ప్రధాన వేదికలు
గ్లోబల్ మీడియా డైలాగ్ అంతర్జాతీయ సహకారాన్ని ముందుకు తీసుకెళ్లగా, క్రియేటోస్ఫియర్, క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజెస్ సృజనాత్మక ప్రతిభను గుర్తించి ప్రదర్శించాయి. వేవ్స్ బజార్ ప్రాజెక్టులను కొనుగోలుదారులు, పెట్టుబడిదారులతో అనుసంధానించింది. వేవ్‌ఎక్స్ మెంటార్‌షిప్, ఇంక్యుబేషన్, పెట్టుబడి అవకాశాల ద్వారా మీడియా–టెక్ స్టార్టప్‌లకు మద్దతు ఇచ్చింది. భారత్ పెవిలియన్, నాలెడ్జ్ సెషన్ల ద్వారా భారత్ కథన సంప్రదాయాలు, అభివృద్ధి చెందుతున్న సామర్థ్యాలను ప్రదర్శించారు.

ప్రధాన ఫలితాలు
* వేవ్స్ డిక్లరేషన్‌ను 77 దేశాలు ఆమోదించాయి.
* క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్‌లకు 60కు పైగా దేశాల నుంచి దాదాపు లక్ష రిజిస్ట్రేషన్లు వచ్చాయి. ఇందులో 750కు పైగా ఫైనలిస్టులు, 150కు పైగా అవార్డు గ్రహీతలు ఉన్నారు.
* వేవ్స్ బజార్ 3,000కు పైగా సమావేశాల ద్వారా రూ.1,328 కోట్ల వ్యాపార లావాదేవీలను నమోదు చేసింది.
* వ్యూయింగ్ రూమ్‌లో ఎనిమిది దేశాలకు చెందిన 100 సినిమాలు ప్రదర్శించారు. వేవ్‌ఎక్స్ ద్వారా 30కు పైగా స్టార్టప్‌లు తమ ప్రాజెక్టులను ప్రదర్శించాయి.

సమ్మిట్ తర్వాత కూడా క్రియేట‌ర్లు, వ్యాపారాలు, స్టార్టప్‌ల కోసం వేవ్స్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమాలు ఏడాది పొడవునా ప్రతిభను మార్కెట్లు, పెట్టుబడులు, ప్రపంచ అవకాశాలతో అనుసంధానిస్తున్నాయి.

వేవ్స్ సమ్మిట్ ఈ కార్యక్రమాలను ప్రపంచ సృజనాత్మక పరిశ్రమ వ్యవస్థలోకి తీసుకువచ్చింది. క్రియేట‌ర్లను వ్యాపార సంస్థలు, పెట్టుబడిదారులు, విధాన రూపకర్తలు, సాంకేతిక రంగ ప్రముఖులతో అనుసంధానించింది. మార్కెట్‌ప్లేస్‌లు, క్రియేటర్ ఛాలెంజ్‌లు, స్టార్టప్ వేదికల ద్వారా ప్రతిభకు ప్రొఫెషనల్ నెట్‌వర్క్‌లు, ప్రేక్షకులు, ప్రపంచ అవకాశాలను చేరుకునే మార్గాలను కల్పిస్తోంది. ఈ కార్యక్రమాల బలం వాటి పరస్పర అనుసంధానంలో ఉంది. ఆర్కైవ్‌లు భారత్ సాంస్కృతిక జ్ఞాపకాలను భద్రపరుస్తాయి, ప్రాంతీయ వేదికలు వైవిధ్యమైన కథలకు విస్తృత ప్రచారం కల్పిస్తాయి, కొత్త ప్రతిభకు సృష్టి, ఆవిష్కరణలకు అవకాశాలు లభిస్తాయి. ఇవన్నీ కలిసి భారత్ సమృద్ధమైన సాంస్కృతిక వారసత్వాన్ని అభివృద్ధి చెందుతున్న సృజనాత్మక భవిష్యత్తుతో అనుసంధానిస్తూ, ప్రజా ప్రసారాన్ని మరింత అందుబాటులోకి, కంటెంట్ సృష్టిని మరింత సమ్మిళితంగా మారుస్తున్నాయి.

ఇప్పటికే ఉన్న కథనాలను భద్రపరుస్తూనే కొత్త గొంతులకు అవకాశం కల్పించడం ద్వారా ఈ కార్యక్రమాలు ప్రపంచ మీడియా, వినోద రంగంలో భారత్ విస్తరిస్తున్న ఉనికికి తోడ్పడుతున్నాయి. స్థానిక సాంస్కృతిక గుర్తింపుల్లో వేళ్లూనుకుని, జాతీయ వేదికల ద్వారా అనుసంధానమై, ప్రపంచ వేదికపై మరింతగా కనిపిస్తున్న సృజనాత్మక ఆర్థిక వ్యవస్థను రూపొందించడంలో ఇవి సహాయపడుతున్నాయి.

 

References

Ministry of Information and Broadcasting

https://prasarbharati.gov.in/waves/

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2243949&reg=3&lang=1

https://www.pib.gov.in/waves/2025/index.aspx?reg=48&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2154230&reg=48&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2268091&reg=48&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2286946&reg=48&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2126844&utm&reg=48&lang=2

https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=2125495&utm&reg=48&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2125725&reg=48&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2209982&reg=3&lang=1

PIB Backgrounders

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2229463&reg=48&lang=2

https://www.pib.gov.in/FeaturesDeatils.aspx?NoteId=154360&ModuleId=2&reg=48&lang=2

Click here for pdf file. 

 

****

(Explainer ID: 160117) आगंतुक पटल : 10
Provide suggestions / comments
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali , Assamese , Kannada , Malayalam