Social Welfare
అందరికీ ఆరోగ్య బీమా కల్పించే దిశగా పురోగతి
ఆయుష్మాన్ భారత్ – ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన
Posted On:
22 SEP 2026 2:16PM
ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి–జన్ ఆరోగ్య యోజన (ఏబీ పీఎం–జేఏవై) భారత్ ఆరోగ్య వ్యవస్థలో ఆర్థిక రక్షణకు ప్రధాన పథకంగా ఉంది. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రజలకు కుటుంబానికి ఏడాదికి రూ.5 లక్షల వరకు నగదు రహిత ఆసుపత్రి చికిత్స కవరేజీని ఈ పథకం అందిస్తోంది. ఈ పథకం ఎనిమిదో వార్షికోత్సవం సందర్భంగా, ప్రస్తుతం భారత్ జనాభాలో సుమారు 33 శాతం మందికి ఆయుష్మాన్ కార్డులు ఉన్నాయి. ఇప్పటివరకు రూ.2.03 లక్షల కోట్ల విలువైన 13.25 కోట్ల ఆసుపత్రి చికిత్సలను ఈ పథకం అందించింది. దీంతో ప్రజలు తమ జేబు నుంచి చేసే వైద్య ఖర్చులు గణనీయంగా తగ్గాయి. ఆసుపత్రి చికిత్సకు సంబంధించిన ఈ పథకం, ప్రాథమిక ఆరోగ్య సేవల కోసం ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, సమగ్ర ఆరోగ్య గుర్తింపు కోసం ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్, భౌతిక ఆరోగ్య మౌలిక సదుపాయాల కోసం పీఎం–ఏబీహెచ్‌ఐఎంతో కలిసి దేశవ్యాప్తంగా సమగ్ర సార్వత్రిక ఆరోగ్య కవరేజీ సాధనకు తోడ్పడుతోంది.
అందరికీ ఆరోగ్య కవరేజీ
ఆరోగ్య రంగంలో పెట్టుబడులు సమాజాలను మరింత పటిష్టంగా, సామర్థ్యవంతంగా, ఉత్పాదకంగా మారుస్తాయి. సార్వత్రిక ఆరోగ్య కవరేజీ అంటే అత్యంత బలహీన వర్గాల కుటుంబాలు సహా ప్రతి ఒక్కరికీ అందుబాటు ధరల్లో నాణ్యమైన ఆరోగ్య సేవలు లభించేలా చూడటం. తద్వారా వారు ఆరోగ్యంగా, సంతృప్తికరంగా జీవించేందుకు అవకాశం కల్పించడం.
సార్వత్రిక ఆరోగ్య కవరేజీ లక్ష్యంతో భారత ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి–జన్ ఆరోగ్య యోజన (ఏబీ పీఎం–జేఏవై)ను ఎనిమిదేళ్ల క్రితం 2018 సెప్టెంబర్ 23న ప్రారంభించింది. ఇది ప్రజారోగ్య భరోసా పథకం. సెకండరీ, టెర్షియరీ ఆరోగ్య సేవలకు కవరేజీ కల్పిస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజారోగ్య పథకాల్లో ఇది ఒకటి. పథకం ప్రారంభమై ఎనిమిదేళ్లు పూర్తైంది. 2026 సెప్టెంబర్ 21 నాటికి భారత జనాభాలో సుమారు 33 శాతం మంది అంటే 48.51 కోట్లకు పైగా ప్రజలు ఇప్పటికే ఆయుష్మాన్ కార్డులు కలిగి ఉన్నారు.

ఆగస్టు 31, 2026 నాటికి ఏబీ–పీఎం జేఏవై సుమారు 13.25 కోట్ల ఆసుపత్రి చికిత్సల ద్వారా రూ.2.03 లక్షల కోట్ల వరకు విలువైన చికిత్సలను ప్రజలకు అందించింది. దేశవ్యాప్తంగా 38,000కు పైగా ఎంపానెల్ చేసిన ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల నెట్‌వర్క్ ద్వారా ఈ సేవలు అందుతున్నాయి.
ఆయుష్మాన్ భారత్ కింద సార్వత్రిక ఆరోగ్య కవరేజీని ప్రోత్సహిస్తున్న పథకాల్లో ఏబీ–పీఎం జేఏవై ఒకటి. భారత్ ప్రజారోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తున్న ఇతర పథకాలు: ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు (ఏఏఎం), ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్, పీఎం–ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ (పీఎం–ఏబీహెచ్‌ఐఎం). ఏబీ–పీఎం జేఏవైతో పాటు ఈ నాలుగు ప్రధాన పథకాలు సార్వత్రిక ఆరోగ్య కవరేజీ అందించేందుకు దేశ ప్రజారోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తున్నాయి.
ఏబీ పీఎం–జేఏవై: వైద్య రుణాల నుంచి ప్రజలకు రక్షణ
తీవ్రమైన వైద్య ఖర్చుల భారంతో కుటుంబాలు అప్పుల పాలుకాకుండా చూడటం ఏబీ పీఎం–జేఏవై లక్ష్యం. 27 వైద్య విభాగాల్లో 1,961 చికిత్సా విధానాలకు నగదు రహిత ఆరోగ్య సేవలను ఈ పథకం అందిస్తుంది.

2024 మార్చిలో ప్రభుత్వం ఈ పథకాన్ని విస్తరించి సుమారు 37 లక్షల మంది అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్టులు (ఆశాలు), అంగన్‌వాడీ కార్యకర్తలు, అంగన్‌వాడీ సహాయకుల కుటుంబాలకు కూడా వర్తింపజేసింది. 21.09.26 నాటికి ఈ పథకం కింద ఆశాలు/ఏడబ్ల్యూహెచ్‌లు/ఏడబ్ల్యూహెచ్‌లకు 44.81 లక్షలకు పైగా ఆయుష్మాన్ కార్డులు జారీ అయ్యాయి.
తదుపరి, 2024 సెప్టెంబర్ 11న ప్రభుత్వం ఈ పథకాన్ని 70 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్లందరికీ విస్తరించింది. దీంతో సుమారు 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు ప్రయోజనం కలుగుతుంది. 21.09.26 నాటికి 1.36 కోట్లకు పైగా సీనియర్ సిటిజన్లు ఆయుష్మాన్ వయ్ వందన కార్డులు పొందారు.
బలహీన వర్గాల లబ్ధిదారులకు సాధికారత
లబ్ధిదారుల కుటుంబాలను సామాజిక–ఆర్థిక కుల గణన (ఎస్ఈసీసీ) 2011 ఆధారంగా, నిర్దేశించిన వెనుకబాటుతనం, వృత్తి ప్రమాణాలను ఉపయోగించి గుర్తిస్తారు. గతంలో రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన (ఆర్‌ఎస్‌బీవై) కింద ప్రయోజనం పొందిన కుటుంబాలు కూడా ఈ పథకంలో ఉన్నాయి.
1. గ్రామీణ లబ్ధిదారులు
గ్రామీణ ప్రాంతాల్లో ఏబీ పీఎం–జేఏవై అర్హతను సామాజిక–ఆర్థిక కుల గణన (ఎస్ఈసీసీ) 2011లో పేర్కొన్న వెనుకబాటుతన ప్రమాణాల ఆధారంగా నిర్ణయిస్తారు. కింది ఆరు ప్రమాణాల్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ప్రమాణాలకు సరిపోయే కుటుంబాలు అర్హులు:
* D1: మట్టి గోడలు, మట్టి పైకప్పుతో ఒకే గది ఉన్న కుటుంబాలు;
* D2: 16 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్సులో వయోజన సభ్యుడు లేని కుటుంబాలు;
* D3: 16 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్సులో వయోజన పురుషుడు లేని మహిళా నాయకత్వ కుటుంబాలు;
* D4: దివ్యాంగ సభ్యుడు ఉండి, శారీరకంగా సామర్థ్యం ఉన్న వయోజన సభ్యుడు లేని కుటుంబాలు;
* D5: షెడ్యూల్డ్ కాస్ట్/షెడ్యూల్డ్ ట్రైబ్ కుటుంబాలు; మరియు
* D7: భూమి లేని కుటుంబాలు, తమ ఆదాయంలో ప్రధాన భాగాన్ని రోజువారీ కూలి పనుల ద్వారా పొందేవి.
2. పట్టణ లబ్ధిదారులు
పట్టణ ప్రాంతాల్లో కింది 11 వృత్తి వర్గాలకు చెందిన కార్మికులు ఈ పథకానికి అర్హులు:
* చెత్త సేకరించేవారు
* యాచకులు
* గృహ కార్మికులు
* వీధి వ్యాపారులు/మోచీలు/తోపుడు బండ్ల వ్యాపారులు/వీధుల్లో సేవలు అందించే ఇతరులు
* నిర్మాణ కార్మికులు/ప్లంబర్లు/మేస్త్రీలు/కూలీలు/పెయింటర్లు/వెల్డర్లు/సెక్యూరిటీ గార్డులు/కూలీలు, ఇతర తలపై బరువులు మోసే కార్మికులు
* పారిశుధ్య కార్మికులు/శానిటేషన్ కార్మికులు/మాలి
* ఇంటి వద్ద పనిచేసే కార్మికులు/చేతివృత్తుల వారు/హస్తకళా కార్మికులు/దర్జీలు
* రవాణా కార్మికులు/డ్రైవర్లు/కండక్టర్లు/డ్రైవర్లు, కండక్టర్లకు సహాయకులు/బండి లాగేవారు/రిక్షా కార్మికులు
* దుకాణ కార్మికులు/సహాయకులు/చిన్న సంస్థల్లో ప్యూన్లు/హెల్పర్లు/డెలివరీ సహాయకులు/అటెండెంట్లు/వెయిటర్లు
* ఎలక్ట్రీషియన్లు/మెకానిక్‌లు/అసెంబ్లర్లు/రిపేర్ కార్మికులు
* రజకులు/చౌకీదార్లు
3. ప్రత్యేక కార్యక్రమాల ద్వారా కవరేజీ పొందుతున్న అదనపు లబ్ధిదారుల వర్గాలు
* బిల్డింగ్ అండ్ అదర్ కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ (బీఓసీడబ్ల్యూ), వారి ఆధారితులు;
* పీఎం–రహత్ కింద కవరేజీ పొందుతున్న రోడ్డు ప్రమాద బాధితులు;
* స్మైల్ కార్యక్రమం కింద కవరేజీ పొందుతున్న ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు;
* కోవిడ్–19 మహమ్మారి కారణంగా తల్లిదండ్రులు ఇద్దరినీ, బతికి ఉన్న తల్లిదండ్రుల్లో ఒకరిని, చట్టబద్ధ సంరక్షకుడిని లేదా దత్తత తల్లిదండ్రులను కోల్పోయిన పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్ కింద అర్హత ఉన్న పిల్లలు;
* నమస్తే పథకం కింద కవరేజీ పొందుతున్న చెత్త సేకరించేవారు, గుర్తించిన పారిశుధ్య కార్మికులు;
* ప్రధానమంత్రి జన్‌జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్(పీఎం–జన్మన్) కింద కవరేజీ పొందుతున్న ఆదిమ జాతీయ తెగలు(పీవీటీజీలు).
అనారోగ్యంతో ఉన్న వృద్ధులకు అండ
హర్యానాలోని జింద్ జిల్లాకు చెందిన 65 ఏళ్ల బిర్మతికి తుంటిని కాలుతో కలిపే తొడ ఎముక మెడ భాగంలో తీవ్రమైన ఫ్రాక్చర్ అయింది. అదృష్టవశాత్తూ ఆమెకు సకాలంలో శస్త్రచికిత్స, సరైన వైద్యం లభించాయి. ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా జిల్లా ఆర్థోపెడిక్ అండ్ మెటర్నిటీ ఆసుపత్రిలో రూ.44,140 విలువైన చికిత్సను ఉచితంగా పొందారు. ఆర్థికంగా, సామాజికంగా బలహీన వర్గాలకు అందుబాటు ధరల్లో, సకాలంలో, నాణ్యమైన, అందుబాటులో ఉండే ఆరోగ్య సేవలను అందిస్తూ ఈ పథకం వారికి జీవనాధారంగా నిలుస్తోంది.
ఏబీ–పీఎం జేఏవై నిధుల నిర్మాణం, కేంద్ర బడ్జెట్
ఏబీ–పీఎం జేఏవై కేంద్ర ప్రాయోజిత పథకం. ఈశాన్య రాష్ట్రాలు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతం మినహా అన్ని రాష్ట్రాల్లో కేంద్రం, రాష్ట్రాల మధ్య నిధుల వాటా 60:40గా ఉంటుంది. ఈ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతంలో నిధుల వాటా 90:10గా ఉంటుంది. శాసనసభ లేని కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం 100 శాతం నిధులు అందిస్తుంది. శాసనసభ ఉన్న కేంద్ర పాలిత ప్రాంతాల్లో కేంద్రం, కేంద్ర పాలిత ప్రాంతం మధ్య నిధుల వాటా 60:40గా ఉంటుంది. గత కొన్నేళ్లుగా కేంద్ర బడ్జెట్ కేటాయింపులు పెరుగుతున్నాయి. 2026–27లో రూ.9,500 కోట్ల బడ్జెట్‌ను అంచనా వేశారు.

ప్రజలు తమ జేబు నుంచి చేసే వైద్య ఖర్చుల తగ్గింపు

గతంతో పోలిస్తే ప్రజలు ఆరోగ్య సేవల కోసం తమ సొంత డబ్బును చాలా తక్కువగా ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వ నిధులు పెరగడం, ఏబీ–పీఎం జేఏవై వంటి ఉచిత, తక్కువ ఖర్చు పథకాలు అందుబాటులోకి రావడం వల్ల వ్యక్తిగత ఆరోగ్య ఖర్చులు కూడా తగ్గినట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ఏబీ–పీఎం జేఏవైతో పాటు ఆయుష్మాన్ భారత్‌లోని ఇతర పథకాలు కూడా ప్రజలకు సార్వత్రిక ఆరోగ్య కవరేజీ అందేలా చూస్తున్నాయి.
ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు: క్షేత్రస్థాయిలో ప్రాథమిక ఆరోగ్య సేవల బలోపేతం

ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు (ఏఏఎం) ఆయుష్మాన్ భారత్‌లో రెండో ప్రధాన స్తంభంగా ఉన్నాయి. ఇవి ప్రాథమిక ఆరోగ్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తాయి.
ఏఏఎంలు వైద్య నిపుణుల నాయకత్వంలో పనిచేసే సమాజ ఆరోగ్య కేంద్రాలు. గతంలో ప్రాథమిక ప్రసూతి, శిశు సంరక్షణ సేవలు లేదా ఇతర సేవలు అందించిన ఆరోగ్య కేంద్రాలను తరచుగా ఏఏఎంలుగా అభివృద్ధి చేస్తున్నారు.
ఏఏఎంలలో అవసరమైన అన్ని వనరులను అందుబాటులో ఉంచారు. వాటిలో:
* మెరుగుపరిచిన మౌలిక సదుపాయాలు
* అదనపు మానవ వనరులు
* అవసరమైన మందులు, వ్యాధి నిర్ధారణ సదుపాయాలు
* ఐటీ వ్యవస్థలు తదితరాలు.
ఏఏఎంలు తల్లి, శిశు ఆరోగ్య సేవలకు మాత్రమే పరిమితం కావు. వ్యాధుల గుర్తింపు, చికిత్స నిర్వహణ, నోటి, కంటి, చెవి–ముక్కు–గొంతు సంరక్షణ, మానసిక ఆరోగ్య సహాయం వంటి సేవలను కూడా అందిస్తాయి. ప్రాథమిక స్థాయి అత్యవసర, ట్రామా చికిత్సతో పాటు ఉచిత అవసరమైన మందులు, వ్యాధి నిర్ధారణ సేవలు కూడా ఈ కేంద్రాల్లో అందుతాయి.
ప్రభుత్వం ఆయుష్ (ఆయుర్వేదం, యోగా, నేచురోపతి, యునాని, సిద్ధ, హోమియోపతి) వైద్య సేవలను కూడా విస్తరిస్తున్నందున ప్రజల కోసం ఇప్పుడు ఆయుష్ ఏఏఎంలు కూడా అందుబాటులో ఉన్నాయి.
ఏఏఎంలు కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు, అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్టులు (ఆశాలు) ప్రజల్లోకి వెళ్లి ఆరోగ్య సేవలను అందించే కేంద్రాలుగా పనిచేస్తాయి. ఈ కేంద్రాల్లో వారు ఆరోగ్య కార్యక్రమాలపై అవగాహన కల్పించడం, రోగులను పరామర్శించడం, సమాజ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించడం చేస్తారు.
జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి ఆసుపత్రుల్లోని ఆరోగ్య నిపుణులతో ప్రజలు ఈ–సంజీవని ద్వారా ఏఏఎంల నుంచి అనుసంధానం కావచ్చు. ఈ–సంజీవని ప్రభుత్వం నిర్వహించే టెలిమెడిసిన్ సేవలు.

* 50 కోట్లకు పైగా టెలీకన్సల్టేషన్లు నిర్వహించారు. ఇందులో ఏఏఎంల ద్వారా జరిగిన టెలీకన్సల్టేషన్లు కూడా ఉన్నాయి. (2026 సెప్టెంబర్ 17 నాటికి).
ఇప్పటివరకు ఏఏఎంలకు 540 కోట్లకు పైగా సందర్శనలు నమోదయ్యాయి. ప్రభుత్వం ఈ మౌలిక సదుపాయాలను వేగంగా విస్తరిస్తోంది.
ఏబీడీఎం ద్వారా డిజిటల్ ఆరోగ్య మౌలిక సదుపాయాల నిర్మాణం
భౌతిక ఆరోగ్య మౌలిక సదుపాయాలు సార్వత్రిక ఆరోగ్య సేవల అందింపునకు వెన్నెముకగా ఉంటే, అంతే పటిష్టమైన డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు కూడా అవసరం. ఆరోగ్య సేవలను మరింత సులభంగా, సమర్థంగా, అందుబాటులో ఉండేలా చేయడంలో ఇవి సహాయపడతాయి. దీన్ని గుర్తించిన భారత ప్రభుత్వం సమగ్ర, పౌర కేంద్రిత జాతీయ డిజిటల్ ఆరోగ్య వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఏబీడీఎం)ను 2021 సెప్టెంబర్‌లో ప్రారంభించింది.
ఏబీడీఎం మౌలిక వ్యవస్థకు ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్లు (ఏబీహెచ్‌ఏలు) ఆధారం. ఇవి ప్రతి వ్యక్తికి ఆధార్ నంబర్ మాదిరిగా ఉండే డిజిటల్ ఆరోగ్య గుర్తింపు సంఖ్యలు. ప్రజల ఆరోగ్య రికార్డులు, బీమా క్లెయిమ్‌లను ఏబీహెచ్‌ఏ ఐడీలతో అనుసంధానం చేస్తారు. ఏబీహెచ్‌ఏ ఐడీల ద్వారా వ్యక్తులు తమ పూర్తి వైద్య చరిత్రతో బీమా సంస్థలు, ఆరోగ్య సేవా కేంద్రాలు, వైద్యులు, ఇతర సేవలతో ఒకే ఇంటర్‌ఆపరబుల్ నెట్‌వర్క్ ద్వారా అనుసంధానం కావచ్చు.
2026 సెప్టెంబర్ 17 నాటికి 97.61 కోట్లకు పైగా ఏబీహెచ్‌ఏ ఐడీలు క్రియాశీలంగా ఉన్నాయి. 119.95 కోట్లకు పైగా ఆరోగ్య రికార్డులు ఖాతాలతో అనుసంధానమయ్యాయి. ఏబీహెచ్‌ఏ ఐడీ వినియోగదారుల్లో మహిళలు 49.74 శాతం, పురుషులు 50.26 శాతం, ఇతర లింగాలు 0.01 శాతం ఉన్నారు. అదనంగా 5.78 లక్షలకు పైగా ధ్రువీకరించిన ఆరోగ్య సేవా కేంద్రాలు, 11 లక్షలకు పైగా ఆరోగ్య నిపుణులు ఈ వేదికలో నమోదయ్యారు.
ఏబీహెచ్‌ఏకు మించి ఏబీడీఎం పూర్తి స్థాయి డిజిటల్ ఆరోగ్య వ్యవస్థగా పనిచేస్తోంది. అన్ని ఆరోగ్య సేవా సంస్థలను ఒకే నెట్‌వర్క్‌లోకి తీసుకువస్తోంది.
* హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్ రిజిస్ట్రీ: వైద్యుల నుంచి ఆయుష్ వైద్య నిపుణుల వరకు అన్ని ఆరోగ్య నిపుణులతో కూడిన జాతీయ రిజిస్ట్రీ. వీరిని ధృవీకరించి డిజిటల్‌గా అనుసంధానం చేస్తారు.
* హెల్త్ ఫెసిలిటీ రిజిస్ట్రీ: ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినిక్‌లు, ల్యాబ్‌లు, ఫార్మసీలు సహా అన్ని ఆరోగ్య సేవా కేంద్రాలతో కూడిన జాతీయ రిజిస్ట్రీ.
* యూనిఫైడ్ హెల్త్ ఇంటర్‌ఫేస్: యూపీఐ తరహాలో ఆరోగ్య సేవలకు ఓపెన్ నెట్‌వర్క్. ఏ యాప్ ద్వారా అయినా అపాయింట్‌మెంట్లు బుక్ చేసుకోవడం, వైద్యులను సంప్రదించడం, సేవలను గుర్తించడం చేయవచ్చు.
* ఆరోగ్య సేతు 2.0: డిజిటల్ ఆరోగ్య సేవలు, పర్సనల్ హెల్త్ రికార్డ్ (పీహెచ్‌ఆర్)కు ఏకీకృత యాప్‌గా పనిచేస్తుంది. దేశవ్యాప్తంగా డిజిటల్ ఆరోగ్య సేవల వినియోగాన్ని వేగవంతం చేస్తుంది.

పీఎం–ఏబీహెచ్‌ఐఎం: కీలక ఆరోగ్య సేవలు, వ్యాధుల పర్యవేక్షణకు బలోపేతం
కోవిడ్–19 సమయంలో ప్రభుత్వం సమగ్ర ప్రభుత్వ విధానంతో వేగంగా స్పందించింది. స్థానిక క్లినిక్‌ల నుంచి పెద్ద ఆసుపత్రుల వరకు జాతీయ ఆరోగ్య వ్యవస్థను మార్చేందుకు చురుకైన చర్యలు చేపడుతూ, పీఎం–ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ (పీఎం–ఏబీహెచ్‌ఐఎం)ను 2021–22 బడ్జెట్‌లో భాగంగా 2021 అక్టోబర్ 25న ప్రారంభించింది.
రూ.64,180 కోట్ల భారీ బడ్జెట్‌తో (2021–2026) పీఎం–ఏబీహెచ్‌ఐఎం పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, వ్యాధుల పర్యవేక్షణను మెరుగుపరచడం, ఆరోగ్య పరిశోధనను విస్తరించడంపై దృష్టి పెడుతోంది. భవిష్యత్ ఆరోగ్య సవాళ్లను ఎదుర్కొనేందుకు స్వావలంబన, పూర్తి స్థాయి సామర్థ్యాన్ని సాధించేందుకు ఈ చర్యలు భారత్‌కు బలాన్నిస్తాయి.
పీఎం–ఏబీహెచ్‌ఐఎం ప్రధానంగా కింది అంశాలపై దృష్టి పెడుతోంది:
* 10 అధిక ప్రాధాన్యత రాష్ట్రాల్లో 23,224 గ్రామీణ ఆరోగ్య, వెల్‌నెస్ కేంద్రాలకు మద్దతు.
* అన్ని రాష్ట్రాల్లో 13,736 పట్టణ ఆరోగ్య, వెల్‌నెస్ కేంద్రాల ఏర్పాటు.
* 11 అధిక ప్రాధాన్యత రాష్ట్రాల్లో 3,389 బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ల ఏర్పాటు.
* అన్ని జిల్లాల్లో 744 సమగ్ర ప్రజారోగ్య ప్రయోగశాలల ఏర్పాటు.
* 5 లక్షలకు పైగా జనాభా ఉన్న అన్ని జిల్లాల్లో 631 క్రిటికల్ కేర్ ఆసుపత్రి బ్లాకుల ఏర్పాటు.
సార్వత్రిక ఆరోగ్య కవరేజీ దిశగా
ఏబీ–పీఎం జేఏవై అర్హత ఉన్న లబ్ధిదారులకు నాణ్యమైన, అందుబాటు ధరల్లో సెకండరీ, టెర్షియరీ ఆరోగ్య సేవలను మరింత విస్తరిస్తోంది. ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తున్నాయి. ఏబీహెచ్‌ఏ (ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్) ద్వారా వ్యక్తులు ప్రత్యేక డిజిటల్ ఆరోగ్య గుర్తింపును సృష్టించుకుని, భాగస్వామ్య ఆరోగ్య సేవా కేంద్రాల్లో తమ ఆరోగ్య రికార్డులను పొందవచ్చు. పీఎం–ఏబీహెచ్‌ఐఎం ఆరోగ్య కేంద్రాలు, ప్రయోగశాలలు, క్రిటికల్ కేర్ సదుపాయాల అభివృద్ధికి మద్దతు ఇవ్వడం ద్వారా క్షేత్రస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఆరోగ్య వ్యవస్థ మౌలిక సదుపాయాలు, సన్నద్ధతను బలోపేతం చేస్తోంది.
మొత్తంగా ఈ కార్యక్రమాలు ప్రాథమిక ఆరోగ్య సేవలు, డిజిటల్ ఆరోగ్య సేవల నుంచి ఆసుపత్రి చికిత్స, పటిష్టమైన ఆరోగ్య మౌలిక సదుపాయాల వరకు ఆరోగ్య సేవల నిరంతర వ్యవస్థను బలోపేతం చేస్తున్నాయి. తద్వారా సార్వత్రిక ఆరోగ్య కవరేజీ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తున్నాయి.
References
Prime Minister’s Office
https://www.pib.gov.in/PressReleaseDetail.aspx?PRID=1547032®=48&lang=1
Ministry of Health and Family Welfare
https://www.pib.gov.in/Pressreleaseshare.aspx?PRID=1546948®=48&lang=2#:~:text=Ayushman%20%E2%80%A2%20Bharat%20%E2%80%93Pradhan%20Mantri%20Jan,to%20a%20new%20aspirational%%2020level
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2116209®=48&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2151239®=48&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2152534®=48&lang=2
https://www.pib.gov.in/Pressreleaseshare.aspx?PRID=1848808®=48&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2294278®=6&lang=1
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2241085®=3&lang=1
https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=1577932®=48&lang=2
https://esanjeevani.mohfw.gov.in/#/
National Health Authority
https://dashboard.nha.gov.in/public/
Ministry of Tribal Affairs
https://www.pib.gov.in/Pressreleaseshare.aspx?PRID=1577166®=48&lang=2
Ministry of Finance
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2097868®=48&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2034937®=48&lang=2
https://www.indiabudget.gov.in/economicsurvey/doc/echapter.pdf
https://www.indiabudget.gov.in/
PIB Backgrounder
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2281466®=3&lang=1
National Portal of India
https://www.india.gov.in/spotlight/details/ayushman-bharat-pradhan-mantri-jan-arogya-yojana
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2281466®=3&lang=1
myScheme
https://www.myscheme.gov.in/schemes/ab-pmjay
World Bank
https://www.worldbank.org/ext/en/topic/health/universal-health-coverage
World Health Organisation
https://www.who.int/data/gho/data/themes/theme-details/GHO/universal-health-coverage
Click here to see pdf
PIB Research
***
(Explainer ID: 160116)
आगंतुक पटल : 35
Provide suggestions / comments