• Sitemap
  • Advance Search
Economy

నేషనల్ సింగిల్ విండో సిస్టమ్

భారత్‌లో మారిన‌ వ్యాపార అనుమతుల ప్రక్రియ

Posted On: 22 SEP 2026 9:37PM

నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ (ఎన్‌ఎస్‌డబ్ల్యూఎస్) అనేది పెట్టుబడిదారులు తమ వ్యాపారాలకు అవసరమైన అనుమతులను గుర్తించేందుకు మార్గనిర్దేశం చేసే డిజిటల్ వేదిక. వ్యాపార అవసరాలకు అనుగుణంగా ఆ అనుమతులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా ఇది కల్పిస్తుంది. డీపీఐఐటీ అమలు చేస్తున్న ఈ వ్యవస్థ ద్వారా పెట్టుబడిదారులు ఒకే వేదిక నుంచి అనుమతులను గుర్తించడం, దరఖాస్తు చేసుకోవడం, వాటి స్థితిని తెలుసుకోవడం చేయవచ్చు. ఇందులో నో యువర్ అప్రూవల్స్ మాడ్యూల్, కామన్ రిజిస్ట్రేషన్ ఫారం, అప్లికెంట్ డ్యాష్‌బోర్డ్, డాక్యుమెంట్ రిపాజిటరీ, ఈ-కమ్యూనికేషన్ మాడ్యూల్ వంటి కీలక సదుపాయాలు ఉన్నాయి. సమాచారాన్ని, పత్రాలను ఒక్కసారి సమర్పించడం, ఆన్‌లైన్‌లో ప్రక్రియ పూర్తి చేయడం, అనుమతుల స్థితిని రియల్‌టైమ్‌లో తెలుసుకునే అవకాశం కల్పించడం ద్వారా ఎన్‌ఎస్‌డబ్ల్యూఎస్ పునరావృతం, నిబంధనల పాటింపు భారాన్ని, అనుమతుల సమయాన్ని తగ్గిస్తుంది. అదే సమయంలో పారదర్శకత, సమన్వయాన్ని మెరుగుపరుస్తుంది. కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాలు, నియంత్రణ సంస్థలతో అనుసంధానం విస్తరిస్తున్న నేపథ్యంలో ఎన్‌ఎస్‌డబ్ల్యూఎస్ భారత్‌లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ను బలోపేతం చేస్తూ మరింత సులభమైన పెట్టుబడి వ్యవస్థకు దోహదం చేస్తోంది.

నేషనల్ సింగిల్ విండో సిస్టమ్: సమగ్ర అవలోకనం
పెట్టుబడులు, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించేందుకు సమర్థవంతమైన నియంత్రణ వ్యవస్థ అవసరం. పారదర్శకంగా, పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉండే నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం పలు డిజిటల్ పాలన సంస్కరణలు చేపట్టింది. నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ (ఎన్‌ఎస్‌డబ్ల్యూఎస్) కూడా అలాంటి సంస్కరణల్లో ఒకటి. వ్యాపారాలకు అవసరమైన అనుమతులను గుర్తించి, వాటికి దరఖాస్తు చేసుకునేలా పెట్టుబడిదారులకు మార్గనిర్దేశం చేసే డిజిటల్ వేదికగా ఇది పనిచేస్తుంది.

22 సెప్టెంబర్ 2021న ప్రారంభమైన ఎన్‌ఎస్‌డబ్ల్యూఎస్‌ను డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ), మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అమలు చేస్తోంది. ఈ ఏడాదితో ఇది విజయవంతంగా ఐదేళ్లు పూర్తి చేసుకుంది. కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, నియంత్రణ సంస్థలు అందించే అనుమతులను ఒకే డిజిటల్ వేదికపైకి ఇది తీసుకువచ్చింది.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు తోడ్పాటు
సమాచారం, పత్రాలను ఒక్కసారి సమర్పించే అవకాశం కల్పించడం ద్వారా ఎన్‌ఎస్‌డబ్ల్యూఎస్ అనుమతుల ప్రక్రియను సులభతరం చేస్తుంది. ఇది నిబంధనల పాటింపు, అనుమతుల సమయాన్ని తగ్గించేందుకు సహాయపడుతుంది. రియల్‌టైమ్‌లో దరఖాస్తు స్థితిని తెలుసుకునే అవకాశం, నియంత్రణ సంస్థలతో ఆన్‌లైన్ కమ్యూనికేషన్ ద్వారా ఈ వేదిక పారదర్శకతను కూడా పెంచుతుంది. ఈ సదుపాయాలతో అనుమతుల ప్రక్రియ మరింత అంచనా వేయగలిగేలా, సమర్థవంతంగా మారుతుంది.

 



ఎన్‌ఎస్‌డబ్ల్యూఎస్ సమగ్ర డిజిటల్ వ్యవస్థ ద్వారా వివిధ శాఖల్లో ఒకే సమాచారాన్ని పదేపదే సమర్పించాల్సిన అవసరాన్ని తగ్గిస్తుంది. ప్రభుత్వ సంస్థల మధ్య సమన్వయాన్ని మెరుగుపరుస్తుంది. మొత్తంగా ఈ సంస్కరణలు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను బలోపేతం చేయడంతో పాటు పెట్టుబడులను సులభతరం చేసి, మినిమమ్ గవర్నమెంట్, మ్యాగ్జిమమ్ గవర్నెన్స్ లక్ష్యానికి తోడ్పడుతున్నాయి.

ఎన్‌ఎస్‌డబ్ల్యూఎస్‌లో కీలక సదుపాయాలు
ఎన్‌ఎస్‌డబ్ల్యూఎస్ ద్వారా దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించడం, ఫీజులు చెల్లించడం చేయవచ్చు. ఇందులోని ముఖ్యమైన సదుపాయాల్లో నో యువర్ అప్రూవల్స్ (కేవైఏ) మాడ్యూల్ ఒకటి. ప్రతిపాదిత వ్యాపార కార్యకలాపాల ఆధారంగా ఆ వ్యాపారానికి అవసరమైన అనుమతులను ఈ సాధనం గుర్తిస్తుంది. 32 కేంద్ర మంత్రిత్వ శాఖలు/శాఖలు, 34 రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన అనుమతుల కోసం దరఖాస్తులను ఈ పోర్టల్‌లో అందుబాటులో ఉంచారు. దీంతో వ్యాపారానికి అవసరమైన నియంత్రణ నిబంధనలను అర్థం చేసుకుని ముందుకు వెళ్లేందుకు పెట్టుబడిదారులకు సహాయం అందుతుంది. కేవైఏ ద్వారా అందించే మార్గదర్శకాలు సూచనాత్మకమైనవి మాత్రమే. వాటిని చట్టపరమైన సలహాగా పరిగణించరాదు.

నిబంధనల పాటింపును సులభతరం చేసేందుకు ఎన్‌ఎస్‌డబ్ల్యూఎస్ కామన్ రిజిస్ట్రేషన్ ఫారంను అందిస్తుంది. ఒకే వేదిక ద్వారా సమాచారాన్ని నమోదు చేసి, వివిధ దరఖాస్తుల్లో ఆ సమాచారాన్ని తిరిగి ఉపయోగించుకునే అవకాశం ఇందులో ఉంటుంది. ప్రత్యేక స్టేట్ రిజిస్ట్రేషన్ ఫారం ద్వారా రాష్ట్ర సింగిల్ విండో వ్యవస్థలను కూడా సులభంగా యాక్సెస్ చేయవచ్చు. దీంతో రాష్ట్ర స్థాయి అనుమతుల వ్యవస్థలతో అనుసంధానం మరింత మెరుగవుతుంది.

దరఖాస్తులను సమర్పించడం, వాటి స్థితిని పర్యవేక్షించడం, శాఖల నుంచి వచ్చే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం కోసం ఈ వేదికలో అప్లికెంట్ డ్యాష్‌బోర్డ్ ఉంది. వర్తించే అనుమతులను సులభంగా రెనెవ‌ల్‌ చేసుకోవడంతో పాటు, దరఖాస్తు స్థితిని రియల్‌టైమ్‌లో తెలుసుకునే అవకాశం కూడా పోర్టల్‌లో ఉంది. కేంద్రీకృత డాక్యుమెంట్ రిపాజిటరీ ద్వారా పత్రాలను ఒక్కసారి అప్‌లోడ్ చేసి, పలు అనుమతుల దరఖాస్తుల్లో తిరిగి ఉపయోగించుకోవచ్చు. దీంతో పత్రాలను పదేపదే సమర్పించాల్సిన అవసరం తగ్గుతుంది. ఈ-కమ్యూనికేషన్ మాడ్యూల్ ద్వారా దరఖాస్తుదారులు, సంబంధిత మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ప్రశ్నలు, వివరణలను ఆన్‌లైన్‌లో మార్పిడి చేసుకోవచ్చు.

ఎన్‌ఎస్‌డబ్ల్యూఎస్‌లో అనుమతుల ప్రక్రియ
పెట్టుబడిదారు ముందుగా ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్‌తో ఎన్‌ఎస్‌డబ్ల్యూఎస్‌లో నమోదు చేసుకోవాలి. నో యువర్ అప్రూవల్స్ (కేవైఏ) మాడ్యూల్ ద్వారా తమకు అవసరమైన అనుమతులను గుర్తించవచ్చు. లేదా అనుమతుల జాబితా నుంచి అవసరమైన అనుమతుల కోసం శోధించవచ్చు. ధ్రువీకరణ అనంతరం వివిధ కేంద్ర, రాష్ట్ర అనుమతులకు దరఖాస్తులు సమర్పించవచ్చు.

దరఖాస్తు సమర్పించిన తర్వాత, ఎన్‌ఎస్‌డబ్ల్యూఎస్ దానిని సంబంధిత మంత్రిత్వ శాఖ లేదా రాష్ట్ర ప్రభుత్వానికి ఎలక్ట్రానిక్ విధానంలో పంపిస్తుంది. అక్కడి సంబంధిత బ్యాక్‌ఎండ్ వ్యవస్థ ద్వారా దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. ఎన్‌ఎస్‌డబ్ల్యూఎస్‌లో నమోదు ఉచితం అయినప్పటికీ, సంబంధిత సంస్థ నిర్దేశించిన చట్టబద్ధమైన ఫీజులను దరఖాస్తుదారులు పోర్టల్ ద్వారా చెల్లించాలి.

అప్లికెంట్ డ్యాష్‌బోర్డ్ ద్వారా దరఖాస్తుదారులు తమ దరఖాస్తుల స్థితిని పర్యవేక్షించవచ్చు. ఈ-కమ్యూనికేషన్ మాడ్యూల్ ద్వారా శాఖలు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వవచ్చు. కేంద్రీకృత డాక్యుమెంట్ రిపాజిటరీలో అప్‌లోడ్ చేసిన అన్ని పత్రాలను కూడా యాక్సెస్ చేయవచ్చు.

డిజిటల్ అనుసంధానం విస్తరణ
ఎన్‌ఎస్‌డబ్ల్యూఎస్ పర్మనెంట్ అకౌంట్ నంబర్ (పాన్)ను సింగిల్ బిజినెస్ ఐడీగా అమలు చేస్తోంది. అధీకృత ప్రతినిధుల యూజర్ ధృవీకరణకు డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ (డీఎస్‌సీ), ఏకైక యజమాన్య సంస్థలకు డిజిలాకర్ను ఉపయోగిస్తోంది.

ప్రభుత్వ అనుమతి అవసరమైన ఎఫ్‌డీఐ దరఖాస్తులకు సింగిల్ విండో విధానాన్ని అందించేందుకు ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్ ఫెసిలిటేషన్ పోర్టల్ (ఎఫ్‌ఐఎఫ్ పోర్టల్)ను కూడా ఎన్‌ఎస్‌డబ్ల్యూఎస్‌తో అనుసంధానించారు. ఇండస్ట్రియల్ ఎంటర్‌ప్రెన్యూర్ మెమోరాండం (ఐఈఎం), ఇండస్ట్రియల్ లైసెన్స్ (ఐఎల్) ప్రక్రియలను వరుసగా అక్టోబర్ 2025, మార్చి 2026 నుంచి పూర్తిగా నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ (ఎన్‌ఎస్‌డబ్ల్యూఎస్)కు మార్చారు. ప్రస్తుతం ఈ ప్రక్రియలు పూర్తిగా డిజిటల్ రూపంలో కొనసాగుతున్నాయి. సంబంధిత ప్రభుత్వ డేటాబేస్‌లతో అనుసంధానం ద్వారా సమాచారాన్ని ఆటోమేటిక్‌గా నింపే సదుపాయం ఈ డిజిటల్ ప్రక్రియల్లో ఉంది. దీంతో మాన్యువల్ అనుమతుల అవసరం తొలగి, పరిశ్రమలు వెంటనే అక్నాలెడ్జ్‌మెంట్లు పొందే అవకాశం కలుగుతుంది. ఫలితంగా సామర్థ్యం పెరిగి, ప్రక్రియకు పట్టే సమయం తగ్గుతుంది.

అదనంగా, ప్రొడక్షన్ ఇన్వెస్ట్‌మెంట్ బిజినెస్ రిజిస్ట్రేషన్ మాడ్యూల్‌ను నవంబర్ 2025లో ఎన్‌ఎస్‌డబ్ల్యూఎస్‌లో ప్రారంభించారు. ఈ-ప్రొడక్షన్ ఇన్వెస్ట్‌మెంట్ బిజినెస్ వీసా (ఈ-బీ-4 వీసా) కింద విదేశీ నిపుణులను ఆహ్వానించేందుకు భారతీయ కంపెనీలు స్పాన్సర్‌షిప్ లెటర్లు పొందేలా ఈ మాడ్యూల్ సహాయపడుతుంది. నమోదు, స్పాన్సర్‌షిప్‌కు సంబంధించిన పత్రాల జారీకి ఇది సరళమైన డిజిటల్ విధానాన్ని అందిస్తుంది.

దీంతో పాటు పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోసివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (పెసో) తన 74 లైసెన్సింగ్ మాడ్యూళ్లను ఎన్‌ఎస్‌డబ్ల్యూఎస్‌తో అనుసంధానించింది. దీంతో పూర్తి ట్రాన్సాక్షన్-స్థాయి అనుసంధానం సాధించిన తొలి శాఖగా పెసో నిలిచింది.

విస్తృతి, పనితీరు
ప్రారంభం నుంచి ఎన్‌ఎస్‌డబ్ల్యూఎస్ పరిధి, సేవల అందుబాటు గణనీయంగా విస్తరించాయి. 21 సెప్టెంబర్ 2026 నాటికి ఈ వేదికకు ఏడాదికి సగటున 3.06 లక్షలకు పైగా దరఖాస్తులు వస్తున్నాయి. ప్రతి ఏడాది 2.26 లక్షలకు పైగా అనుమతుల ప్రక్రియను ఇది సులభతరం చేస్తోంది. ఏకైక యజమాన్య సంస్థలు, కంపెనీలు, ఎల్‌ఎల్‌పీలు, విదేశీ సంస్థలు సహా 5.69 లక్షలకు పైగా వ్యాపార సంస్థలు ఈ వేదికలో చేరాయి.

ప్రస్తుతం ఎన్‌ఎస్‌డబ్ల్యూఎస్ 34 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 327కు పైగా కేంద్ర అనుమతులు, 3452 రాష్ట్ర అనుమతులకు యాక్సెస్ కల్పిస్తోంది. కంపెనీ ఏర్పాటు, పారిశ్రామిక లైసెన్సులు, స్టార్టప్ గుర్తింపు, ఎఫ్‌డీఐ అనుమతులు, కాంట్రాక్ట్ లేబర్ యాక్ట్ కింద నమోదు వంటి కీలక నియంత్రణ అనుమతులను ఇది సులభతరం చేస్తోంది. అస్సాం (335), కర్ణాటక (327), తమిళనాడు (223), మణిపూర్ (190) అత్యధిక సంఖ్యలో అనుసంధానిత అనుమతులను అందిస్తున్నాయి.

నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్, ఇథనాల్ పాలసీ, వెహికల్ స్క్రాపింగ్ పాలసీ, ఇండియన్ ఫుట్‌వేర్ అండ్ లెదర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ వంటి ప్రధాన కార్యక్రమాల కింద అవసరమైన అనుమతులకు కూడా ఈ వేదిక ఉమ్మడి గేట్‌వేగా పనిచేస్తోంది.

సులభమైన వ్యాపార వ్యవస్థ దిశగా
పారదర్శకంగా, సాంకేతికత ఆధారంగా పనిచేసే నియంత్రణ వ్యవస్థను రూపొందించేందుకు ఎన్‌ఎస్‌డబ్ల్యూఎస్ ఒక కీలక ముందడుగు. మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాలు, నియంత్రణ సంస్థలతో అనుసంధానం మరింత విస్తరించడం ద్వారా దీని సామర్థ్యం పెరుగుతుంది. డిజిటల్ సాంకేతికతలను వినియోగించడం, ప్రక్రియలను సరళీకరించడం ద్వారా పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెరిగి, భారత్‌లో వ్యాపారం చేయడం మరింత సులభమవుతుంది. వేదిక మరింత అభివృద్ధి చెందుతున్న కొద్దీ, భారత్‌లో ఏకీకృత వ్యాపార నియంత్రణ వ్యవస్థకు ఎన్‌ఎస్‌డబ్ల్యూఎస్ కీలక ఆధారంగా మారే అవకాశం ఉంది.

References

Ministry of Commerce and Industry

https://www.dpiit.gov.in/static/uploads/2026/03/863a5fef349d79a1bba316c4b51eaacb.pdf

https://www.nsws.gov.in/

https://www.dpiit.gov.in/static/uploads/2026/03/863a5fef349d79a1bba316c4b51eaacb.pdf

https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=1880251&reg=48&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1756966&reg=48&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1796506&lang=2&reg=3

PIB Archive

https://www.pib.gov.in/FactsheetDetails.aspx?id=150871&NoteId=150871&ModuleId=16&reg=6&lang=1

Click here to see pdf

PIB Research 

***

(Explainer ID: 160109) आगंतुक पटल : 20
Provide suggestions / comments
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali , Assamese , Tamil , Kannada