Culture & Tourism
ఇండియా సినీ హబ్
Posted On:
22 SEP 2026 1:54PM
సినిమా చిత్రీకరణ అనుమతులకు ఒకే ఆన్‌లైన్ వేదిక
ఇండియా సినీ హబ్ (ఐసీహెచ్) దేశీయ, విదేశీ సినీ నిర్మాతలకు చిత్రీకరణ అనుమతులు, వీసా ప్రక్రియ, సేవలు అందించే సంస్థల వివరాలను ఒకే ఆన్‌లైన్ వేదికపై అందిస్తోంది. భారత జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ (ఎన్‌ఎఫ్‌డీసీ) దీన్ని నిర్వహిస్తోంది. రాష్ట్రాల అనుమతులు, పోలీసు అనుమతులు, ఉమ్మడి చిత్ర నిర్మాణ దరఖాస్తులను ఒకే వ్యవస్థలోకి తీసుకురావడంతో పలు రాష్ట్రాల్లో విడివిడిగా దరఖాస్తు చేసే ఇబ్బందులు తగ్గుతాయి. దీంతో భారత్‌లో చిత్రీకరణ వేగంగా, సులభంగా సాగి, దేశ వినోద రంగ అభివృద్ధికి ఊతం లభిస్తుంది.
భారత్‌లో సినిమా నిర్మాణం మరింత సులభం
సుసంపన్నమైన కళారూపాలు, వైవిధ్యభరితమైన సినిమాలకు పేరున్న భారత్ చలనచిత్రాలు, టెలివిజన్, ఆన్‌లైన్ కార్యక్రమాల నిర్మాణంలో ప్రపంచస్థాయి కేంద్రంగా ఎదుగుతోంది. 2024 ఆర్థిక సంవత్సరంలో ఈ రంగం 1,310 కోట్ల అమెరికన్ డాలర్ల ఆదాయాన్ని సాధించింది. ఇది 2019తో పోలిస్తే 18 శాతం ఎక్కువ. రాబోయే ఏళ్లలో ఈ రంగం 6 నుంచి 10 శాతం చొప్పున వృద్ధి చెందుతుందని, 2029 ఆర్థిక సంవత్సరానికి మొత్తం ఆదాయం సుమారు 1,750 కోట్ల నుంచి 1,970 కోట్ల అమెరికన్ డాలర్లకు చేరుతుందని అంచనా. యువ జనాభా, వేగంగా విస్తరిస్తున్న 5జీ నెట్‌వర్క్, తక్కువ ధరకు లభించే డేటా వల్ల దేశంలో వినోద కార్యక్రమాల నిర్మాణం విస్తరిస్తోంది.
సినిమాలు, డిజిటల్ కార్యక్రమాలను నిర్మించడమే కాకుండా దేశీయ, విదేశీ దర్శకులకు ఆకర్షణీయమైన చిత్రీకరణ ప్రదేశంగానూ భారత్ నిలుస్తోంది. అందమైన హిమాలయాల నుంచి అండమాన్–నికోబార్ దీవుల్లోని తెల్లని ఇసుక తీరాల వరకు విభిన్న ప్రాంతాలు ఇక్కడ ఉన్నాయి. రాజస్థాన్ కోటలు, రాజభవనాల వంటి యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాలు సినీ నిర్మాతలతో పాటు పర్యాటకులనూ ఆకర్షిస్తున్నాయి.
భారత్‌లో సినిమా నిర్మాణాన్ని మరింత ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పలు సంస్కరణలు చేపడుతోంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో సినిమాలు, ప్రత్యక్ష కార్యక్రమాల చిత్రీకరణకు అవసరమైన అనుమతులను ఇండియా సినీ హబ్ (ఐసీహెచ్) ద్వారా సులభతరం చేయడం వాటిలో ముఖ్యమైనది.
ఇండియా సినీ హబ్ (ఐసీహెచ్) దేశవ్యాప్తంగా సినిమా చిత్రీకరణ అనుమతుల కోసం రూపొందించిన ఒకే ఆన్‌లైన్ వేదిక. నియంత్రణ ప్రక్రియలను సులభతరం చేసి, సంబంధిత అధికారుల మధ్య సమన్వయం కల్పించడం ద్వారా వ్యాపార నిర్వహణ సౌలభ్యాన్ని పెంచుతోంది. చిత్రీకరణకు అనువైన ప్రపంచస్థాయి గమ్యస్థానంగా భారత్ స్థానాన్ని బలోపేతం చేస్తోంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ చిత్రీకరణ ప్రదేశాలు, మౌలిక సదుపాయాలు, వనరులను ఈ వేదిక ద్వారా పరిచయం చేయవచ్చు. దీనివల్ల పర్యాటకానికి, స్థానిక ఆర్థికాభివృద్ధికి అవకాశాలు ఏర్పడతాయి. సినిమా నిర్మాణ ప్రక్రియలో వేగం, పారదర్శకత, సులభమైన అనుమతులు కల్పిస్తూ ఇండియా సినీ హబ్ నిర్మాతలకు అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తోంది.
సినిమా చిత్రీకరణ అనుమతులతో పాటు ప్రత్యక్ష కార్యక్రమాల అనుమతులకూ ఈ వేదిక సేవలను విస్తరిస్తోంది. ప్రత్యక్ష కార్యక్రమాల అభివృద్ధి విభాగానికి ఇది ప్రధాన ఆన్‌లైన్ వ్యవస్థగా పనిచేస్తుంది. కార్యక్రమం జరిగే ప్రదేశం ఆధారంగా దరఖాస్తులను సంబంధిత స్థానిక అధికారులు, సమన్వయ అధికారులకు పంపి, అనుమతుల ప్రక్రియను సమన్వయం చేస్తుంది. ఇప్పటికే తొమ్మిది ప్రముఖ వేదికలను దీనితో అనుసంధానించారు.
ఇండియా సినీ హబ్: చిత్రీకరణ అనుమతులకు ఒకే పోర్టల్
భారత జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ (ఎన్‌ఎఫ్‌డీసీ) నిర్వహించే ఐసీహెచ్, చిత్రీకరణ అనుమతులకు ఒకే ఆన్‌లైన్ వేదికగా పనిచేస్తుంది. భారతీయ సినిమాను ప్రోత్సహించడం ఎన్‌ఎఫ్‌డీసీ బాధ్యత. ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సంస్థ.

ఎన్‌ఎఫ్‌డీసీ: భారత సినీ పరిశ్రమకు ప్రోత్సాహం
భారత సినీ పరిశ్రమ అభివృద్ధి, ప్రోత్సాహం కోసం ప్రభుత్వం 1975లో ఎన్‌ఎఫ్‌డీసీని ఏర్పాటు చేసింది. కాలక్రమంలో ఫిల్మ్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఇండియన్ మోషన్ పిక్చర్ ఎక్స్‌పోర్ట్ కార్పొరేషన్ దీనిలో విలీనమయ్యాయి. 2020లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం ఫిల్మ్స్ డివిజన్, చలనచిత్రోత్సవాల డైరెక్టరేట్, భారత జాతీయ చలనచిత్ర భాండాగారం, భారత బాలల చలనచిత్ర సమితి కూడా ఇందులో చేరాయి. నేడు భారతీయ భాషలన్నింటిలో సినిమా అభివృద్ధి, నిర్మాణం, ప్రచారం, పరిరక్షణకు సమగ్ర సంస్థగా ఇది పనిచేస్తోంది.
ప్రధాన కార్యకలాపాలు:
1. ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యంతో సినిమాల ఉమ్మడి నిర్మాణం.
2. విదేశీ చిత్రాల భారత్ చిత్రీకరణకు స్థానిక నిర్మాణ సహకారం, విదేశాల్లో యానిమేషన్ సేవలు.
3. గోవాలో జరిగే భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఐఎఫ్‌ఎఫ్‌ఐ)తో పాటు దక్షిణాసియా ఉమ్మడి నిర్మాణం, పంపిణీకి ముఖ్యమైన వేదిక అయిన ఫిల్మ్ బజార్ ఇండియా నిర్వహణ.

మూల సూత్రాలు
లక్ష్యం: పలు భారతీయ భాషల సినిమాలకు మద్దతు ఇచ్చి, సినిమా నాణ్యతను, సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రోత్సహించడం.
దార్శనికత: స్వతంత్ర భారతీయ సినిమాకు దేశీయంగా, అంతర్జాతీయంగా ఆదరణ పెంచడం.
ఉద్దేశాలు:
ఎ. కథల అభివృద్ధి, కార్యశాలలు, ఉమ్మడి నిర్మాణాల ద్వారా ప్రతిభను ప్రోత్సహించడం.
బి. సినిమా ద్వారా భారత సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయడం.
సి. పరిశ్రమ అవసరాలకు వేగంగా స్పందించే సంస్థగా కొనసాగడం.
ఇండియా సినీ హబ్ ప్రత్యేకతలు
భారత్‌లో చిత్రీకరణ చేయాలనుకునే లేదా ప్రత్యక్ష కార్యక్రమాలు నిర్వహించాలనుకునే వారికి ఇండియా సినీ హబ్ ఈ సదుపాయాలు అందిస్తోంది:
1. దేశీయ, విదేశీ నిర్మాతలు చిత్రీకరణ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకునే ఉమ్మడి పోర్టల్‌ను అందిస్తుంది. రాష్ట్రస్థాయి వ్యవస్థలను అనుసంధానిస్తుంది. ఆన్‌లైన్ దరఖాస్తు విధానం లేని రాష్ట్రాల కోసం ఒకే దరఖాస్తు పత్రాన్ని అందిస్తుంది.
* విదేశీ నిర్మాతలు ఐసీహెచ్ ద్వారా చిత్రీకరణ అనుమతులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిల్మ్ వీసా పొందే ప్రక్రియలోనూ ఈ వేదిక సహకరిస్తుంది.
2. ఉమ్మడి సినిమా నిర్మాణానికి సంబంధించిన అనుమతి దరఖాస్తులను పరిశీలిస్తుంది. సంబంధిత ఒప్పందాలపై వివరణాత్మక మార్గదర్శకాలను అందిస్తుంది.
3. ఫిల్మ్ వీసాలు, నిబంధనలు, గగనతలం నుంచి చిత్రీకరణ, జంతువులతో చిత్రీకరణ, అడవులు, స్మారక కట్టడాల వద్ద చిత్రీకరణపై సమగ్ర మార్గదర్శకాలను అందిస్తుంది.
4. జీఐఎస్ ఆధారంగా చిత్రీకరణ ప్రదేశాల జాబితాను అందిస్తుంది. ఆయా ప్రాంతాలు, అనుమతులు ఇచ్చే అధికారులు, దేశంలోని ప్రధాన చిత్రీకరణ కేంద్రాల వివరాలను తెలియజేస్తుంది.
5. రాష్ట్రాలవారీగా స్థానిక సేవలందించే సంస్థల వివరాలతో సినిమా, ఇతర అవసరాలకు సంబంధించిన ధ్రువీకరించిన జాబితాలను అందిస్తుంది. వాటిలో:
- చిత్రీకరణ అనంతర సాంకేతిక సేవల సంస్థలు
- చిత్రీకరణ సామగ్రి అద్దె సంస్థలు
- సినీ నిర్మాతలు, నటీనటులు, ఇతర ప్రతిభావంతులు
- ఫిల్మ్ స్టూడియోలు
- పరికరాల అద్దె సంస్థలు
- నటీనటుల ఎంపిక సంస్థలు
- ఆహార సరఫరా సంస్థలు
- హోటళ్లు, బస సదుపాయాలు
- వైద్య సదుపాయాలు
- భద్రతా సేవలు
- ప్రయాణ సేవల సంస్థలు ఉన్నాయి.
6. పటిష్ఠమైన సమాచార రక్షణ సాంకేతికతతో రూపొందించిన ఈ పోర్టల్ పెద్ద సంఖ్యలో దరఖాస్తులు, వినియోగదారుల రాకపోకలను నిర్వహించగలదు.

అంతేకాకుండా, మొత్తం దరఖాస్తుల సంఖ్యతో పాటు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో ఇచ్చిన అనుమతుల వివరాలను డ్యాష్‌బోర్డ్ ద్వారా తెలుసుకోవచ్చు.

భారత్‌లో నిర్మించిన సినిమాలతో పర్యాటకానికి ప్రోత్సాహం
భారతీయ సినిమాలు అనేక సందర్భాల్లో పర్యాటకుల సంఖ్య పెరగడానికి దోహదపడ్డాయి. ఇందుకు 3 ఇడియట్స్ ఒక ఉదాహరణ. ఆ చిత్రం విడుదలైన తర్వాత లద్దాఖ్‌కు వచ్చే పర్యాటకుల సంఖ్య 2.4 రెట్లు పెరిగిందని ఈవై–ఫిక్కీ నివేదిక పేర్కొంది. అలాగే సింగపూర్ పర్యాటక మండలి సహకారంతో అక్కడ చిత్రీకరించిన క్రిష్ సినిమా ఆ దేశానికి వెళ్లే భారతీయ పర్యాటకుల సంఖ్య 60 లక్షల నుంచి 70 లక్షలకు పెరగడానికి తోడ్పడింది. దేశీయ విజయవంతమైన చిత్రాలు, రాజస్థాన్ వంటి ప్రాంతీయ ఆకర్షణలతో పాటు భారత్‌లోని విభిన్న దృశ్యాలు, తక్కువ నిర్మాణ వ్యయం అంతర్జాతీయ ప్రాజెక్టులనూ ఆకర్షిస్తున్నాయి. ఆస్కార్ పురస్కారాలు పొందిన స్లమ్‌డాగ్ మిలియనీర్, లైఫ్ ఆఫ్ పై నుంచి నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి అంతర్జాతీయ ఆన్‌లైన్ వేదికల నిర్మాణాల వరకు ఇందుకు ఉదాహరణలు.
సమగ్ర పర్యాటక వ్యవస్థను అభివృద్ధి చేసినందుకు మధ్యప్రదేశ్ 68వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ‘చిత్రీకరణకు అత్యంత అనుకూల రాష్ట్రం’ పురస్కారాన్ని అందుకుంది. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, కేరళ, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలు మౌలిక సదుపాయాల ప్రోత్సాహకాలు, ప్రభుత్వ చిత్రీకరణ ప్రదేశాల రుసుము మినహాయింపులు, ₹2 కోట్ల వరకు రాయితీలతో నిర్మాతలను ఆకర్షిస్తున్నాయి. సినిమా ఆధారిత పర్యాటకం స్థానికంగా ఉపాధి కల్పిస్తుంది, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఆదాయం తెస్తుంది. భారత సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చూపుతూ దాని పరిరక్షణకూ తోడ్పడుతుంది.
భారత్‌లోని ఫిల్మ్ సిటీలు
భారత్‌లో పలు ప్రధాన సినిమా నిర్మాణ కేంద్రాలు ఉన్నాయి. వీటి ద్వారా 1.6 లక్షల మందికి పైగా ఉపాధి లభిస్తోంది. ముంబయి, హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, తిరువనంతపురం/కొచ్చి, గువాహటి, భువనేశ్వర్, ఢిల్లీలో ఇలాంటి కేంద్రాలు ఉన్నాయి. వీటిలో మహారాష్ట్రలోని ముంబయి ఫిల్మ్ సిటీ, తెలంగాణలోని హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీ, ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా ఫిల్మ్ సిటీ ముఖ్యమైనవి. ప్రపంచవ్యాప్తంగా సినీ నిర్మాతలను ఆకర్షిస్తూ మీడియా, వినోద సేవలకు భారత్‌ను సమగ్ర గమ్యస్థానంగా తీర్చిదిద్దడంలో ఇవి తోడ్పడుతున్నాయి.
ముంబయి ఫిల్మ్ సిటీ
ముంబయిలోని గోరెగావ్‌లో ఉన్న ఫిల్మ్ సిటీ ప్రపంచంలోని అతిపెద్ద స్టూడియో సముదాయాల్లో ఒకటి. సినీ నిర్మాతలకు అవసరమైన సదుపాయాలన్నీ ఇక్కడ ఉన్నాయి. 520 ఎకరాలకు పైగా విస్తరించిన ఈ ప్రాంగణంలో దాదాపు 42 బహిరంగ చిత్రీకరణ ప్రదేశాలు ఉన్నాయి. కొండలు, లోయలు, కనుమలు, విశాలమైన మైదానాలు, సహజ అడవులు, పొదలు, జలాశయాలు ఇక్కడ కనిపిస్తాయి. మహారాష్ట్ర ప్రభుత్వం 1977లో దీన్ని ఏర్పాటు చేసింది. భారత సినీ పరిశ్రమ ఆద్యుడిని స్మరించుకుంటూ 2001లో దీనికి దాదాసాహెబ్ ఫాల్కే చిత్రనగరి అని పేరు పెట్టింది.
రామోజీ ఫిల్మ్ సిటీ (హైదరాబాద్)
రామోజీ గ్రూప్ 1996లో ఏర్పాటు చేసిన రామోజీ ఫిల్మ్ సిటీని ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ స్టూడియో సముదాయంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించింది. ప్రపంచంలోనే అతిపెద్ద సమీకృత ఫిల్మ్ సిటీగా, భారత్‌లో ప్రత్యేక ఇతివృత్తంతో కూడిన ఏకైక విహార కేంద్రంగా కూడా ఇది నిలుస్తోంది. దాదాపు 6,000 మంది సిబ్బంది పనిచేసే ఈ సముదాయంలో ఒకేసారి సుమారు 40 భారతీయ సినిమాలు నిర్మించవచ్చు. 2,000 ఎకరాల్లో విస్తరించిన ఈ ప్రాంగణంలో 500కు పైగా చిత్రీకరణ ప్రదేశాలు ఉన్నాయి. ఒకేసారి 20 అంతర్జాతీయ సినిమాల చిత్రీకరణకు కూడా సదుపాయాలు ఉన్నాయి.
నోయిడా ఫిల్మ్ సిటీ
నోయిడా ఫిల్మ్ సిటీలో పలు స్టూడియోలు, మీడియా సంస్థలు ఉన్నాయి. శాటిలైట్ ఛానళ్లు, మల్టీప్లెక్స్ కార్యాలయాలు, ప్రచురణ సంస్థలు, రేడియో ప్రసార సంస్థలు, ఆడియో రంగ సంస్థలు, సినీ కంపెనీలు ఇక్కడ పనిచేస్తున్నాయి. ఇది 100 ఎకరాల్లో విస్తరించింది. ఇక్కడ 16 స్టూడియోలు ఉన్నాయి; 350 ఛానళ్లు 162 దేశాలకు ప్రసారాలు చేస్తున్నాయి. టెలివిజన్, మీడియా వ్యాపారాలకు ఇది ప్రధాన కేంద్రం. ఫిల్మ్ సిటీలో దాదాపు 17 వేల మంది మీడియా నిపుణులు పనిచేస్తున్నారు. అనుబంధ రంగాల్లో సుమారు 1.5 లక్షల మందికి ఉద్యోగాలు, జీవనోపాధి అవకాశాలు లభిస్తున్నాయి.
కొత్త ఫిల్మ్ సిటీల అభివృద్ధి
డిజిటల్ కార్యక్రమాలు, మీడియా ప్రస్తుతం భారత్‌లోని అతిపెద్ద మీడియా విభాగాల్లో ఒకటిగా ఉన్నాయి. 15 నుంచి 29 ఏళ్ల వయసులో డిజిటల్ కార్యక్రమాలను ఎక్కువగా చూసే యువత, వాటిని రూపొందించే వారు కూడా దేశంలో పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఈ తరం అంతర్జాతీయ కార్యక్రమాలకు ఆదరణ పెంచడమే కాకుండా చిన్న వీడియోలు, గేమింగ్, ప్రత్యక్ష ప్రసారాలు, ప్రాంతీయ భాషా వేదికల ద్వారా కొత్త ధోరణులను రూపొందిస్తోంది. దేశంలో ఇంటర్నెట్ వినియోగం కూడా విస్తరిస్తోంది. ఇంటర్నెట్ చందాదారుల సంఖ్య 2014లో 25.15 కోట్ల నుంచి 2026 మార్చి చివరి నాటికి 109.2 కోట్లకు పైగా పెరిగింది. వైర్‌లెస్ డేటా ధర 2014లో జీబీకి ₹308 ఉండగా, 2026లో ₹7.51కు తగ్గింది. దీంతో డిజిటల్ సేవలు మరింత అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 99.9 శాతం జిల్లాల్లో 5జీ సేవలు అందుతున్నాయి.
డిజిటల్ వినియోగదారుల సంఖ్య పెరగడం, ఇంటర్నెట్ సదుపాయాలు విస్తరించడం, తక్కువ ధరకు డేటా లభించడం వల్ల ఈ రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందని అంచనా. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా ఉత్తరప్రదేశ్, పంజాబ్, మధ్యప్రదేశ్, అస్సాం, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, బిహార్ వంటి రాష్ట్రాలు ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో ఫిల్మ్ సిటీలను అభివృద్ధి చేస్తున్నాయి. ప్రాంతీయ సినిమాలకు ఆదరణ, రాష్ట్రాల చిత్రీకరణ ప్రోత్సాహకాల వల్ల ఈ రంగంలో ఉపాధి సుమారు 3.2 శాతం చొప్పున పెరిగి, 2030 నాటికి దేశవ్యాప్తంగా దాదాపు రెండు లక్షల మందికి ఉపాధి లభించవచ్చు. డిజిటల్ కార్యక్రమాలను అత్యధికంగా వీక్షించే దేశంగా ఉన్న భారత్, వాటి నిర్మాణం, కొత్త ఆవిష్కరణలు, పంపిణీలోనూ ప్రపంచస్థాయి శక్తిగా ఎదుగుతోంది.
ప్రధాన చిత్రీకరణ కేంద్రంగా భారత్
ప్రపంచంలోని అతిపెద్ద సినీ పరిశ్రమల్లో ఒకటైన భారత సినీ పరిశ్రమ, తక్కువగా తెలిసిన ప్రదేశాలను ప్రేక్షకులకు పరిచయం చేస్తోంది. చిత్రీకరణ ప్రదేశాలను పర్యాటక ఆకర్షణలుగా మార్చి, దేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని చాటుతోంది. ఈ అవకాశాలకు మద్దతుగా ఇండియా సినీ హబ్ (ఐసీహెచ్) సినిమా నిర్మాణానికి సంబంధించిన అనుమతులను సులభతరం చేసే కేంద్రీకృత వేదికగా పనిచేస్తోంది. నిర్మాతలు చిత్రీకరణ అనుమతుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ దరఖాస్తులు సంబంధిత మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర సమన్వయ అధికారులకు ఆన్‌లైన్‌లో చేరతాయి. దీంతో పలు సంస్థల అనుమతులు, చిత్రీకరణ ప్రదేశాల అనుమతులు, ఫిల్మ్ వీసాల కోసం అవసరమైన సమన్వయం సులభమవుతుంది.
References
Ministry of Information & Broadcasting
https://indiacinehub.gov.in/
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2279150®=48&lang=1
https://nfdcindia.com/company-profile/en
Ministry of Commerce and Industry
https://www.investindia.gov.in/team-india-blogs/exploring-potential-film-tourism-india-catalyst-economic-growth-and-cultural
PIB Backgrounders
https://www.pib.gov.in/FactsheetDetails.aspx?Id=150840®=3&lang=2
Deloitte
https://www.deloitte.com/in/en/Industries/telecom-media-entertainment/perspectives/economic-impact-of-the-film-television-and-online-curated-content.html
EY
https://www.ey.com/content/dam/ey-unified-site/ey-com/en-in/insights/media-entertainment/documents/ey-a-studio-called-india-v1.pdf
Click here to see pdf
PIB Research
***
(Explainer ID: 160090)
आगंतुक पटल : 3
Provide suggestions / comments