Social Welfare
రోజ్‌గార్ మేళా
Posted On:
19 SEP 2026 2:25PM
20 విడతల్లో 12.75 లక్షలకు పైగా నియామక పత్రాల పంపిణీ
జాతీయ రోజ్‌గార్ మేళా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని వేగవంతం చేస్తూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే కార్యక్రమం. 2022 అక్టోబర్‌లో 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల లక్ష్యంతో ప్రారంభమైన ఈ కార్యక్రమం దేశవ్యాప్త నియామక ప్రయత్నంగా విస్తరించింది. ఇప్పటివరకు 20 విడతలు పూర్తికాగా, 12.75 లక్షల నియామక పత్రాలు అందించారు. 2026 సెప్టెంబర్‌లో జరిగిన 20వ విడతలో 51 వేలకుపైగా నియామక పత్రాలు పంపిణీ చేశారు. నియామకాలతో పాటు నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగ మార్గదర్శనం, వ్యాపార ప్రారంభానికి సహకారం కూడా ఈ కార్యక్రమంలో భాగం. ఉద్యోగార్థులు, నియామక సంస్థలు నేరుగా మాట్లాడుకునే అవకాశం కల్పించడం, శిక్షణను ఉద్యోగాలతో అనుసంధానించడం ద్వారా నైపుణ్యం కలిగిన సిబ్బంది సంఖ్య పెరుగుతోంది. ప్రభుత్వ సేవల్లో చేరి దేశాభివృద్ధికి తోడ్పడే అవకాశం యువతకు లభిస్తోంది.
రోజ్‌గార్ మేళా: వేగంగా ప్రభుత్వ నియామకాలు
జాతీయ రోజ్‌గార్ మేళా 20వ విడత 2026 సెప్టెంబర్ 19న జరిగింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కార్యక్రమంలో ప్రసంగించి, ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా చేరుతున్న యువతకు 51 వేలకుపైగా నియామక పత్రాలు అందించారు.
జాతీయ రోజ్‌గార్ మేళా ద్వారా మంత్రిత్వ శాఖలు, విభాగాలు, ప్రభుత్వ సంస్థల్లో ఖాళీల భర్తీని వేగవంతం చేస్తున్నారు. యువతకు అవకాశాలు కల్పించడం, సకాలంలో నియామకాలు చేపట్టడం, దేశాభివృద్ధిపై ప్రభుత్వం పెట్టిన విస్తృత దృష్టిలో ఇది భాగం.
2022 అక్టోబర్ 22న ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా నిర్ణీత గడువులో 10 లక్షల మందిని ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమించాలని తొలుత లక్ష్యంగా పెట్టుకున్నారు. తొలి రోజ్‌గార్ మేళాలో దేశవ్యాప్తంగా 50 కేంద్రాల ద్వారా 75 వేలకుపైగా నియామక పత్రాలు అందించారు. మొదటి 19 విడతల్లోనే 12 లక్షలకుపైగా నియామక పత్రాలు ఇచ్చి, తొలి లక్ష్యాన్ని అధిగమించారు.
మంజూరైన పోస్టుల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు మంత్రిత్వ శాఖలు, విభాగాలు ప్రత్యేక కార్యాచరణతో పనిచేస్తున్నాయి. కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డుల వంటి సంస్థలు నిర్దేశిత నియామక విధానాల ప్రకారం ఈ ప్రక్రియను చేపడుతున్నాయి.
కొత్తగా ఎంపికైన వారు రైల్వే మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, తపాలా శాఖ, ఆరోగ్య–కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం, కార్మిక–ఉపాధి మంత్రిత్వ శాఖతో పాటు పలు ఇతర విభాగాల్లో చేరారు.
ప్రభుత్వ నియామకాలు వేగం పుంజుకోవడంతో యువతకు ప్రజాసేవలో వృత్తి జీవితాన్ని ప్రారంభించి, దేశాభివృద్ధికి తోడ్పడే అవకాశాలు లభిస్తున్నాయి.

రోజ్‌గార్ మేళా: యువతకు ఉద్యోగ అవకాశాలతో అనుసంధానం
రోజ్‌గార్ మేళా సాధారణంగా అరరోజు జరిగే కార్యక్రమం. ఇందులో ఉద్యోగాలు ఇచ్చే సంస్థలు, ఉద్యోగార్థులు ఒకే చోట కలుస్తారు. అందుబాటులో ఉన్న ఉద్యోగాలకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకుని ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చు. సంస్థల ప్రతినిధులతో నేరుగా మాట్లాడి తమకు సరిపోయే అవకాశాలను తెలుసుకోవచ్చు.
జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎన్‌ఎస్‌డీసీ), రంగాలవారీ నైపుణ్య మండళ్లు (ఎస్‌ఎస్‌సీలు), ప్రధానమంత్రి కౌశల్ కేంద్రాలు (పీఎంకేకేలు) కలిసి రోజ్‌గార్ మేళాలను నిర్వహిస్తాయి. అర్హులైన అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించేందుకు ప్రైవేటు సంస్థలను కూడా ఈ మేళాల్లో పాల్గొనేలా ప్రోత్సహిస్తారు.
ప్రధాన లక్ష్యాలు
* ఉద్యోగాలు, నైపుణ్య శిక్షణ అవకాశాలను అందించి యువతకు సాధికారత కల్పించడం
* ఉద్యోగార్థులు, నియామక సంస్థల మధ్య నేరుగా సంప్రదింపులకు అవకాశం కల్పించడం
* నైపుణ్యం కలిగిన యువత ఉపాధి రంగంలోకి ప్రవేశించేలా చేసి, దేశాభివృద్ధిలో భాగస్వాములను చేయడం
* దేశమంతటా సమాన అభివృద్ధి జరగాలన్న ప్రధానమంత్రి దార్శనికతను ప్రతిబింబించడం
ఎవరు పాల్గొనవచ్చు?
రోజ్‌గార్ మేళాలు సాధారణంగా 18 నుంచి 35 ఏళ్ల యువత కోసం నిర్వహిస్తారు. భిన్న విద్యార్హతలు, నైపుణ్యాలు ఉన్న అభ్యర్థులకు అవకాశాలు ఉంటాయి. వీరిలో:
* 8, 10, 12వ తరగతులు ఉత్తీర్ణులైన వారు
* ఐటీఐ, డిప్లొమా పూర్తి చేసిన వారు
* డిగ్రీ పట్టభద్రులు
* జాతీయ నైపుణ్య అర్హతల చట్రం (ఎన్‌ఎస్‌క్యూఎఫ్)కు అనుగుణంగా శిక్షణ పొంది ధ్రువీకరణ పొందిన వారు ఉంటారు.
రోజ్‌గార్ మేళాల సమాచారాన్ని పత్రికా ప్రకటనలు, సామూహిక సంక్షిప్త సందేశాలు (ఎస్‌ఎంఎస్‌లు), సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేస్తారు. కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో నిర్వహించే శిక్షణ కార్యక్రమాలు, మేళాలు జరిగే జిల్లాల్లో చేపట్టే ప్రత్యేక ప్రచారం ద్వారా అర్హులైన అభ్యర్థులకు ఈ అవకాశాల సమాచారం చేరుతుంది.
నియామకాలతో పాటు ఇతర సేవలు
తక్షణ ఉద్యోగ అవకాశాలతో పాటు భవిష్యత్తు వృత్తి ప్రణాళిక, నైపుణ్యాభివృద్ధి, సొంత వ్యాపారానికి అవసరమైన సేవలను కూడా రోజ్‌గార్ మేళాలు అందిస్తాయి.
* ఉద్యోగ మార్గదర్శనం
అందుబాటులో ఉన్న ఉద్యోగాలను అర్థం చేసుకుని తగిన వృత్తిని ఎంచుకునేందుకు ఉద్యోగార్థులకు, అవసరమైన సందర్భాల్లో వారి తల్లిదండ్రులకు మార్గదర్శక సమావేశాలు నిర్వహిస్తారు.
* కౌశల్ మేళాలు
ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన (పీఎంకేవీవై), ప్రధానమంత్రి కౌశల్ కేంద్రం (పీఎంకేకే) వంటి కార్యక్రమాల కింద కొత్త నైపుణ్య శిక్షణ కోసం యువత నమోదు చేసుకోవచ్చు.
* ముద్ర రుణాలకు సహకారం
సొంత వ్యాపారం ప్రారంభించాలని భావించే వారికి రుణ అవకాశాలపై ప్రత్యేక కౌంటర్లు సమాచారం, సహాయం అందిస్తాయి. వ్యాపారాలు ప్రారంభించాలనుకునే లేదా విస్తరించాలనుకునే నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు రుణాలు అందుబాటులోకి తెచ్చేందుకు ఎన్‌ఎస్‌డీసీకి ప్రధానమంత్రి ముద్ర యోజన (పీఎంఎంవై)తో అధికారిక అనుసంధానం ఉంది.
* నైపుణ్య ప్రదర్శనలు
రంగాలవారీ నైపుణ్య మండళ్లు తమ రంగాల్లోని శిక్షణ విధానాలు, పరికరాలు, ఉద్యోగ పాత్రలను ప్రదర్శిస్తాయి. వివిధ పనులు, వృత్తి అవకాశాలను అర్థం చేసుకోవడానికి ఇవి అభ్యర్థులకు ఉపయోగపడతాయి.
భాగస్వాములకు రోజ్‌గార్ మేళాల ప్రయోజనాలు
* ఉద్యోగార్థులకు: నియామక సంస్థలతో నేరుగా మాట్లాడే అవకాశం; ఉద్యోగాలు, సొంత వ్యాపార అవకాశాల సమాచారం.
* నియామక సంస్థలకు: ఉద్యోగార్థులను ఒకే చోట కలిసి, తగిన అభ్యర్థులను గుర్తించే అవకాశం.
* నైపుణ్య శిక్షణ వ్యవస్థకు: అభ్యర్థులు, నియామక సంస్థలు, రంగాలవారీ నైపుణ్య మండళ్లు, శిక్షణ సంస్థల మధ్య అనుసంధానం.
జాతీయ రోజ్‌గార్ మేళా: విడతలవారీ పురోగతి
|
విడత
|
తేదీ
|
పంపిణీ చేసిన నియామక పత్రాలు
|
కేంద్రాలు, ముఖ్య వివరాలు
|
|
1వ
|
22 అక్టోబర్ 2022
|
75,000కు పైగా
|
50 కేంద్రాలు. కార్యక్రమం ప్రారంభం; 10 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ లక్ష్యం ప్రకటన.
|
|
2వ
|
22 నవంబర్ 2022
|
సుమారు 71,000
|
45కు పైగా నగరాలు.
|
|
3వ
|
20 జనవరి 2023
|
71,000
|
—
|
|
4వ
|
13 ఏప్రిల్ 2023
|
సుమారు 71,000
|
45 ప్రాంతాలు, 45 విభాగాలు; తిరువనంతపురంలో నిర్వహణ.
|
|
5వ
|
16 మే 2023
|
71,000కు పైగా
|
45 కేంద్రాలు; మహారాష్ట్రలోని ముంబయి, పుణె, నాందేడ్ సహా పలు చోట్ల నిర్వహణ.
|
|
6వ
|
13 జూన్ 2023
|
సుమారు 70,000
|
గువాహటిలో నిర్వహణ.
|
|
7వ
|
22 జులై 2023
|
70,000కు పైగా
|
44 ప్రాంతాలు; గోవాలో నిర్వహణ.
|
|
8వ
|
28 ఆగస్టు 2023
|
51,000కు పైగా
|
45 ప్రాంతాలు. కేంద్ర సాయుధ పోలీసు బలగాలు—సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్, ఎస్‌ఎస్‌బీ, అస్సాం రైఫిల్స్, సీఐఎస్‌ఎఫ్, ఐటీబీపీ, ఎన్‌సీబీ—తో పాటు ఢిల్లీ పోలీసుల్లో నియామకాలు. కొత్తగా చేరిన వారిని ‘అమృత్ రక్షక్’గా పేర్కొన్నారు.
|
|
9వ
|
26 సెప్టెంబర్ 2023
|
సుమారు 51,000
|
46 ప్రాంతాలు.
|
|
10వ
|
28 అక్టోబర్ 2023
|
51,000కు పైగా
|
కొత్త ఉద్యోగులు ఐగాట్ కర్మయోగి పోర్టల్‌లోని కర్మయోగి ప్రారంభ్ ద్వారా నైపుణ్యాలు పెంచుకోవచ్చు. ఎక్కడి నుంచైనా, ఏ పరికరంలోనైనా నేర్చుకునే వీలుతో 400కు పైగా ఆన్‌లైన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
|
|
11వ
|
30 నవంబర్ 2023
|
సుమారు 51,000
|
37 ప్రాంతాలు. కస్టమ్స్–ఎక్సైజ్, సీజీఎస్‌టీ, సీఐఎస్‌ఎఫ్, సాయుధ బలగాలు, ఐటీబీపీ, కేవీఎస్, తపాలా శాఖ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆరోగ్య విభాగాల్లో నియామకాలు.
|
|
12వ
|
12 ఫిబ్రవరి 2024
|
లక్షకు పైగా
|
న్యూఢిల్లీలో ‘కర్మయోగి భవన్’కు శంకుస్థాపన.
|
|
13వ
|
29 అక్టోబర్ 2024
|
51,000కు పైగా
|
40 ప్రాంతాలు.
|
|
14వ
|
23 డిసెంబర్ 2024
|
71,000కు పైగా
|
45 ప్రాంతాలు.
|
|
15వ
|
26 ఏప్రిల్ 2025
|
51,000కు పైగా
|
—
|
|
16వ
|
12 జులై 2025
|
51,000కు పైగా
|
47 ప్రాంతాలు. మొత్తం నియామక పత్రాల సంఖ్య 10 లక్షలు దాటింది. రైల్వే, తపాలా, హోం వ్యవహారాలు, ఆర్థిక సేవలు, కార్మిక–ఉపాధి విభాగాల్లో నియామకాలు.
|
|
17వ
|
24 అక్టోబర్ 2025
|
51,000కు పైగా
|
40 ప్రాంతాలు. యూపీఎస్‌సీ తుది జాబితా వరకు చేరినా ఎంపిక కాని అభ్యర్థులను ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో అవకాశాలతో అనుసంధానించే ప్రతిభా సేతు పోర్టల్ ప్రకటన.
|
|
18వ
|
24 జనవరి 2026
|
61,000కు పైగా
|
45 ప్రాంతాలు. 8 వేల మందికి పైగా మహిళలకు నియామక పత్రాలు అందాయి.
|
|
19వ
|
23 మే 2026
|
51,000కు పైగా
|
47 ప్రాంతాలు. మొత్తం సంఖ్య సుమారు 12 లక్షలకు చేరింది. ఈ విడత నియామకాల్లో 50 శాతానికి పైగా భారత రైల్వేలోనే జరిగాయి.
|
|
20వ
|
19 సెప్టెంబర్ 2026
|
51,000కు పైగా
|
45 ప్రాంతాలు. ఈ విడతతో కలిపి వివిధ ప్రభుత్వ విభాగాలు, సంస్థల్లో సుమారు 12.75 లక్షల మంది యువత నియామక పత్రాలు పొందారు.
|
ఉద్యోగార్థులు, నియామక సంస్థలు నేరుగా కలిసేందుకు రోజ్‌గార్ మేళా వేదిక కల్పిస్తోంది. యువతకు అవకాశాలు అందిస్తూ నిరుద్యోగ సమస్య పరిష్కారానికి, దేశాభివృద్ధిలో వారి భాగస్వామ్యానికి తోడ్పడుతోంది. ఉద్యోగాలు, నైపుణ్య శిక్షణ, మార్గదర్శనం, సొంత వ్యాపారానికి సహకారం ఒకేచోట అందడం వల్ల నైపుణ్యం కలిగిన సిబ్బంది సంఖ్య పెరుగుతోంది. 20వ విడతతో దేశవ్యాప్తంగా ఉపాధి అవకాశాలను విస్తరించే ఈ ప్రయత్నం మరింత ముందుకు సాగింది.
References
Prime Minister's Office
http://pib.gov.in/PressReleasePage.aspx?PRID=2311973®=48&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2264076®=48&lang=2
https://www.pib.gov.in/PressReleaseDetail.aspx?PRID=1892383®=48&lang=2
https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=2143931®=48&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2218036®=3&lang=1
Ministry of Ports, Shipping and Waterways
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2182324®=48&lang=2
Ministry of Skill Development and Entrepreneurship
https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=2069258®=48&lang=2
Ministry of Home Affairs
https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=1877966®=48&lang=2
Ministry of Housing & Urban Affairs
https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=1870312®=48&lang=2
PIB Backgrounder
https://www.pib.gov.in/PressNoteDetails.aspx?id=154875&NoteId=154875&ModuleId=3®=48&lang=2
Click to see pdf
***
(Explainer ID: 160086)
आगंतुक पटल : 112
Provide suggestions / comments