• Sitemap
Farmer's Welfare

రైతుల భవిష్యత్తుకు భద్రత... జీవితానికి గౌరవం

ప్రధానమంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజనకు ఏడేళ్లు

Posted On: 11 SEP 2026 5:26PM

చిన్న, సన్నకారు రైతులు వృద్ధాప్యాన్ని మరింత ఆర్థిక భద్రతతో, గౌరవంగా గడిపేందుకు ప్రధానమంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన (పీఎం-కేఎంవై) ఏడేళ్లుగా అండగా నిలుస్తోంది. 2019లో ప్రారంభమైన ఈ పథకం 60 ఏళ్ల వయసు నుంచి నెలకు కనీస పింఛనుగా ₹3,000 అందిస్తుంది. 2026 ఫిబ్రవరి నాటికి దేశవ్యాప్తంగా 24.96 లక్షలకు పైగా రైతులు ఈ పథకంలో చేరారు. దాదాపు 5.75 లక్షల నమోదులతో హరియాణా అగ్రస్థానంలో ఉండగా, 3.46 లక్షలకు పైగా నమోదులతో బిహార్ తర్వాతి స్థానంలో ఉంది. పథకం అమలు, విస్తృత ప్రచారానికి తోడ్పాటుగా 2019 నుంచి 2026 ఫిబ్రవరి వరకు ₹540.66 కోట్లను వినియోగించారు. రైతు సమాజంలో సామాజిక భద్రత ప్రాధాన్యంపై పెరుగుతున్న అవగాహనను పథకం విస్తృతి తెలియజేస్తోంది. రైతుల వృద్ధాప్య జీవితాన్ని మరింత సురక్షితంగా, గౌరవప్రదంగా మార్చేందుకు పీఎం-కేఎంవై నిరంతర కృషిగా నిలుస్తోంది.

 

పీఎం-కేఎంవైకు ఏడేళ్లు: వ్యవసాయ జీవితానికి ఆవల భవిష్యత్తుపై భరోసా

తరతరాలుగా భారత రైతులు దేశ ఆహార భద్రతకు అండగా నిలుస్తూ పొలాల్లో అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. వయసు పైబడుతున్న కొద్దీ వారి ఏళ్ల కష్టానికి భద్రత, గౌరవం ప్రతిఫలంగా దక్కాలని ప్రభుత్వం గుర్తించింది. వృద్ధాప్యంలో ఆధారపడేందుకు పరిమిత పొదుపులు మాత్రమే ఉండే చిన్న, సన్నకారు రైతులకు ఇది ఎంతో కీలకం.

 

ఈ దృక్పథంతో ప్రధానమంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన (పీఎం-కేఎంవై)ను 2019 సెప్టెంబర్ 12న ప్రారంభించారు. అర్హులైన భూమి కలిగిన చిన్న, సన్నకారు రైతులకు, పురుషులు, మహిళలు ఇద్దరికీ 60 ఏళ్ల వయసు నుంచి స్థిరమైన నెలవారీ పింఛనుపై ఈ పథకం భరోసా కల్పిస్తుంది. వారి వృద్ధాప్య జీవితం స్థిరత్వంతో, మనఃశాంతితో సాగేందుకు ఈ చర్య తోడ్పడుతుంది.

 

ప్రారంభమైనప్పటి నుంచి పీఎం-కేఎంవై రైతు సమాజానికి సామాజిక భద్రత కల్పించే కీలక ఆధారంగా ఎదిగింది. 2026 సెప్టెంబర్ 12న ఈ పథకం ఏడేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటోంది. ఈ ఏడేళ్లలో దేశవ్యాప్తంగా రైతులకు పథకం విస్తృతి క్రమంగా పెరిగింది. వృద్ధాప్యంలో రైతులకు మెరుగైన ఆర్థిక భద్రత, గౌరవం కల్పించాలనే ప్రభుత్వ నిరంతర నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తోంది.

 

ప్రభావం: సామాజిక భద్రత పరిధి విస్తరణ

పీఎం-కేఎంవై ప్రస్థానం ఏడేళ్ల మైలురాయికే పరిమితం కాలేదు. సామాజిక భద్రత పరిధిలోకి వచ్చిన రైతుల సంఖ్య కూడా క్రమంగా పెరిగింది. రైతు సమాజంలో సామాజిక భద్రత హామీకి ఆదరణ పెరుగుతుండటంతో 2026 ఫిబ్రవరి 6 నాటికి పీఎం-కేఎంవై కింద 24,96,252 నమోదులు జరిగాయి.

 

పథకం రాష్ట్రాలవారీ విస్తరణలో దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. దాదాపు 5.75 లక్షల మంది రైతుల నమోదుతో హరియాణా అగ్రస్థానంలో ఉండగా, 3.46 లక్షలకు పైగా నమోదులతో బిహార్ తర్వాతి స్థానంలో ఉంది. ఝార్ఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఒక్కో రాష్ట్రంలో 2.5 లక్షలకు పైగా నమోదులు జరిగాయి. ఛత్తీస్‌గఢ్‌లో 2 లక్షలకు పైగా నమోదులు జ‌రిగాయి. ఒడిశా, జమ్మూ కశ్మీర్, మధ్యప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాలు కూడా పథకం జాతీయ విస్తృతిని మరింత బలోపేతం చేస్తున్నాయి.

 

 

 

ఈ విస్తరణ వెనుక నిరంతర ప్రభుత్వ పెట్టుబడి ఉంది. పథకం అమలు, విస్తృత ప్రచారం కొనసాగేందుకు 2019 నుంచి 2026 ఫిబ్రవరి వరకు దేశవ్యాప్తంగా పీఎం-కేఎంవై కింద ₹540.66 కోట్లను వినియోగించారు.

 

రైతుల వృద్ధాప్య రక్షణ కోసం ప్రవేశపెట్టిన సామాజిక భద్రత చర్య నుంచి పీఎం-కేఎంవై దేశవ్యాప్త రక్షణ వలయంగా ఎదిగింది. తమ ఉద్యోగ జీవితమంతా భారత ఆహార భద్రతకు కృషి చేసే లక్షలాది రైతులకు ఆర్థిక భద్రత హామీని ఇది చేరువ చేస్తోంది.

 

రైతుల వృద్ధాప్య జీవితానికి పింఛను రక్షణ కవచం

ప్రధానమంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన (పీఎం-కేఎంవై) కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని వ్యవసాయ, రైతు సంక్షేమ విభాగం నిర్వహించే కేంద్ర రంగ పథకం. భారత జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) భాగస్వామ్యంతో దీన్ని అమలు చేస్తున్నారు.

 

చిన్న, సన్నకారు రైతులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత కల్పించేందుకు రూపొందించిన స్వచ్ఛంద, చందా ఆధారిత వృద్ధాప్య పింఛను పథకం పీఎం-కేఎంవై. ఈ పథకం కింద అర్హులైన చందాదారులు 60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు కనీస హామీ పింఛను ₹3,000 పొందుతారు.

 

చందాదారు మరణించిన తర్వాత పథకం కుటుంబ పింఛను సాయాన్ని కూడా అందిస్తుంది. పింఛను పొందుతున్న సమయంలో చందాదారు మరణిస్తే, ఆ వ్యక్తి జీవిత భాగస్వామికి చందాదారు పింఛనులో 50 శాతానికి సమానమైన కుటుంబ పింఛను లభిస్తుంది. ఇది నెలకు ₹1,500. ఈ ప్రయోజనం జీవిత భాగస్వామికి మాత్రమే వర్తిస్తుంది. ఆ జీవిత భాగస్వామి ఇప్పటికే పీఎం-కేఎంవై లబ్ధిదారుగా ఉండకూడదు.

 

చందాదారు 60 ఏళ్లు నిండకముందే మరణించిన సందర్భంలో కూడా పథకం ఒక అవకాశాన్ని అందిస్తుంది. లబ్ధిదారు క్రమం తప్పకుండా చందాలు చెల్లించి ఉంటే, నిర్దేశిత చందాలను చెల్లిస్తూ జీవిత భాగస్వామి పథకంలో చేరి కొనసాగవచ్చు. లేదా నిష్క్రమణ, ఉపసంహరణ నిబంధనల ప్రకారం జీవిత భాగస్వామి పథకం నుంచి వైదొలగవచ్చు.

 

పీఎం-కేఎంవై ప్రయోజనాలు ఎవరు పొందవచ్చు?

దేశవ్యాప్తంగా రెండు హెక్టార్ల వరకు సాగు భూమి కలిగిన చిన్న, సన్నకారు రైతులకు ఈ పథకం అందుబాటులో ఉంది. పథకంలో చేరే రైతుల వయసు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. అర్హత పొందాలంటే 2019 ఆగస్టు 1 నాటికి సంబంధిత రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంత భూ రికార్డుల్లో వారి పేర్లు ఉండాలి. పథకం మినహాయింపు ప్రమాణాల పరిధిలోకి వారు రాకూడదు.

 

 

 

మినహాయింపు ప్రమాణాలు: పీఎం-కేఎంవైకు ఎవరు అర్హులు కారు?

చిన్న, సన్నకారు రైతులకు విస్తృత సామాజిక భద్రత వలయంగా ప్రధానమంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజనను రూపొందించినప్పటికీ, వృద్ధాప్యంలో అతి తక్కువ ఆర్థిక రక్షణ ఉన్నవారికే ప్రయోజనాలు చేరేలా కొన్ని వర్గాలను స్పష్టంగా మినహాయించారు.

 

1. ఇతర సామాజిక భద్రత, పింఛను పథకాల పరిధిలో ఉన్న రైతులు

ఇతర చట్టబద్ధ లేదా కేంద్ర సామాజిక భద్రత కార్యక్రమాల్లో ఇప్పటికే చేరిన రైతులు పీఎం-కేఎంవైలో చేరేందుకు అర్హులు కారు:

* జాతీయ పింఛను పథకం (ఎన్‌పీఎస్), ఉద్యోగుల రాష్ట్ర బీమా సంస్థ (ఈఎస్ఐసీ) పథకం లేదా ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ పథకం వంటి చట్టబద్ధ కార్యక్రమాల చందాదారులు.

* ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్‌ధన్ యోజన (పీఎం-ఎస్వైఎం) లబ్ధిదారులు.

* ప్రధానమంత్రి లఘు వ్యాపారి మాన్‌ధన్ యోజన (పీఎం-ఎల్‌వీఎం) లబ్ధిదారులు.

 

2. అధిక ఆర్థిక స్థాయి కలిగిన వర్గాలు

బలహీన రైతు కుటుంబాలకు సాయాన్ని లక్ష్యంగా అందించేందుకు కింద పేర్కొన్న అధిక ఆర్థిక స్థాయి సూచికల్లో ఏదో ఒకటి వర్తించే వ్యక్తులు, కుటుంబాలను పథకం నుంచి మినహాయించారు:

* సంస్థాగత భూస్వాములు: సంస్థల పేరిట భూమి కలిగిన అన్ని వర్గాలు.

* రాజ్యాంగ పదవులు నిర్వహించినవారు: గతంలో లేదా ప్రస్తుతం రాజ్యాంగ పదవులు నిర్వహిస్తున్నవారు.

* ప్రజాప్రతినిధులు: మాజీ, ప్రస్తుత కేంద్ర మంత్రులు లేదా రాష్ట్ర మంత్రులు; లోక్‌సభ లేదా రాజ్యసభ సభ్యులు; రాష్ట్ర శాసనసభలు లేదా శాసన మండళ్ల సభ్యులు; నగరపాలక సంస్థల మేయర్లు; జిల్లా పంచాయతీల ఛైర్‌పర్సన్లు.

* ప్రభుత్వ, ప్రభుత్వ రంగ ఉద్యోగులు: కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలు లేదా క్షేత్రస్థాయి యూనిట్లు; కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు; అనుబంధ లేదా స్వయంప్రతిపత్తి సంస్థల్లో పనిచేస్తున్న లేదా పదవీ విరమణ చేసిన అధికారులు, ఉద్యోగులు; స్థానిక సంస్థల రెగ్యులర్ ఉద్యోగులు.

* మల్టీ టాస్కింగ్ సిబ్బంది (ఎంటీఎస్), నాలుగో తరగతి, గ్రూప్-డీ ఉద్యోగులకు ఈ మినహాయింపు వర్తించదు. వారు పీఎం-కేఎంవైకు అర్హులుగానే ఉంటారు.

* ఆదాయపు పన్ను చెల్లింపుదారులు: గత అసెస్‌మెంట్ సంవత్సరంలో ఆదాయపు పన్ను చెల్లించిన వ్యక్తులందరూ.

* నమోదిత వృత్తి నిపుణులు: వృత్తిపరమైన సంస్థల్లో నమోదై సేవలు అందిస్తున్న వైద్యులు, ఇంజినీర్లు, న్యాయవాదులు, ఛార్టర్డ్ అకౌంటెంట్లు (సీఏలు), ఆర్కిటెక్టులు.

 

3. ధ్రువీకరణ, స్వీయ ధ్రువీకరణ పత్రం

పీఎం-కేఎంవై అర్హత పరిశీలన ప్రధానంగా దరఖాస్తుదారు సమర్పించే స్వీయ ధ్రువీకరణ పత్రంపై ఆధారపడి ఉంటుంది. ఈ స్వీయ ధ్రువీకరణల ఆధారంగా రాష్ట్ర లేదా కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలు అర్హతను ధ్రువీకరిస్తాయి. దరఖాస్తుదారు తప్పుడు లేదా వాస్తవ విరుద్ధమైన ప్రకటన సమర్పించినట్లు తేలితే పథకం కింద ఆర్థిక ప్రయోజనాలకు అనర్హుడవుతారు. కేంద్ర ప్రభుత్వం చెల్లించే సమాన చందా నిలిచిపోతుంది. చందాదారు చెల్లించిన మొత్తాన్ని వడ్డీ లేకుండా తిరిగి చెల్లిస్తారు.

 

సురక్షిత భవిష్యత్తుకు ఉమ్మడి చందా

పీఎం-కేఎంవై ఉమ్మడి చందా నమూనాను అనుసరిస్తుంది. దీని కింద రైతు, కేంద్ర ప్రభుత్వం పింఛను నిధికి సమాన మొత్తంలో చందా చెల్లిస్తారు. రైతులు తమ పని చేసే సంవత్సరాలంతా నెలవారీ చందా చెల్లిస్తుండగా, ప్రభుత్వం దానికి సమాన చందాను జమ చేస్తుంది.

 

రైతు పథకంలో చేరే వయసును బట్టి నెలవారీ చందా ₹55 నుంచి ₹200 వరకు ఉంటుంది. చిన్న వయసులో చేరినవారు ప్రతి నెల తక్కువ మొత్తాన్ని చెల్లిస్తారు. ఎక్కువ వయసులో చేరినవారు కింది వివరాల ప్రకారం అధిక చందా చెల్లిస్తారు:

ప్రవేశ వయసు (ఏళ్లలో)

పదవీ విరమణ వయసు (ఏళ్లలో)

సభ్యుడి చందా (₹)

ప్రభుత్వ చందా (₹)

మొత్తం చందా (₹)

18

60

55

55

110

19

60

58

58

116

20

60

61

61

122

21

60

64

64

128

22

60

68

68

136

23

60

72

72

144

24

60

76

76

152

25

60

80

80

160

26

60

85

85

170

27

60

90

90

180

28

60

95

95

190

29

60

100

100

200

30

60

105

105

210

31

60

110

110

220

32

60

120

120

240

33

60

130

130

260

34

60

140

140

280

35

60

150

150

300

36

60

160

160

320

37

60

170

170

340

38

60

180

180

360

39

60

190

190

380

40

60

200

200

400

 

రైతు చందా పథకంతో అనుసంధానమైన బ్యాంకు ఖాతా నుంచి స్వయంచాలకంగా డెబిట్ అవుతుంది. దీనివల్ల పింఛను నిధికి నెలవారీ చందాలు క్రమం తప్పకుండా జమ అవుతాయి. నమోదు సమయంలో రైతు ఆటో డెబిట్ ఆదేశ పత్రాన్ని అందిస్తారు. అనుసంధానమైన బ్యాంకు ఖాతా నుంచి వర్తించే నెలవారీ చందాను మినహాయించేందుకు ఇది అనుమతిస్తుంది.

 

అర్హులైన చిన్న, సన్నకారు రైతులు పీఎం-కేఎంవైకు స్వచ్ఛంద చందాలు చెల్లించేందుకు తమ పీఎం-కిసాన్ ప్రయోజనాలను వినియోగించుకునే అవకాశాన్ని కూడా ఎంచుకోవచ్చు. ఇందుకోసం రైతు ఎన్‌రోల్‌మెంట్‌-కమ్-ఆటో డెబిట్ ఆదేశ పత్రాన్ని సమర్పించాలి. పీఎం-కిసాన్ ప్రయోజనాలు జమయ్యే బ్యాంకు ఖాతా నుంచి చందా మొత్తాన్ని స్వయంచాలకంగా మినహాయించేందుకు ఇది అనుమతిస్తుంది.

 

నమోదు: సరళమైన డిజిటల్ ప్రక్రియ

అర్హులైన చిన్న, సన్నకారు రైతులకు సమీప ఉమ్మడి సేవా కేంద్రం (సీఎస్‌సీ) ద్వారా సరళమైన, కాగిత రహిత నమోదు ప్రక్రియను పీఎం-కేఎంవై అందిస్తుంది. ఓటీపీ ధ్రువీకరణ కోసం రైతులు తమ ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు, మొబైల్ నంబరు వెంట తీసుకెళ్లాలి.

 

సీఎస్‌సీలో గ్రామ స్థాయి పారిశ్రామికవేత్త (వీఎల్‌ఈ) రైతు వివరాలను ధ్రువీకరించి, ఆన్‌లైన్ నమోదును పూర్తి చేస్తారు. రైతు మాండేట్ ఫామ్‌ సంతకం చేస్తారు. ఈ దశలో తొలి చందాను డిజిటల్ పద్ధతిలో చెల్లిస్తారు.

 

విజయవంతంగా నమోదైన తర్వాత రైతుకు పింఛను ఖాతా సంఖ్య, పింఛను కార్డు అందుతాయి. పింఛను నిధి, పింఛను చెల్లింపులను నిర్వహించే భారత జీవిత బీమా సంస్థకు వివరాలను పంపుతారు. ఆ తర్వాతి చందాలు రైతు బ్యాంకు ఖాతా నుంచి స్వయంచాలకంగా డెబిట్ అవుతాయి.

 

రైతులు తమ ఆర్థిక చక్రాలకు అనుగుణంగా నెలవారీ, త్రైమాసిక, నాలుగు నెలలకోసారి లేదా అర్ధవార్షిక చందా చెల్లింపు ఎంపికలను ఎంచుకోవచ్చు. రైతులు తమకు అనువైన సమయంలో డిజిటల్ పద్ధతిలో నమోదు పూర్తి చేసుకునేందుకు ఈ ప్రక్రియ వీలు కల్పిస్తుంది. వారి చందాలు, పింఛను రికార్డులను క్రమపద్ధతిలో నిర్వహించటానికి కూడా దోహదం చేస్తుంది.

 

రైతుల సంక్షేమానికి నిరంతర నిబద్ధత

భారత చిన్న, సన్నకారు రైతులకు సామాజిక భద్రతను బలోపేతం చేసేందుకు సాగుతున్న నిరంతర కృషిని పీఎం-కేఎంవై ఏడేళ్ల ప్రస్థానం ప్రతిబింబిస్తోంది. 2019లో ప్రారంభమైన ఈ పథకం దేశవ్యాప్తంగా క్రమంగా విస్తరిస్తూ రైతు కుటుంబాలకు వృద్ధాప్య ఆదాయ భద్రతను చేరువ చేసింది. సరళమైన, కాగిత రహిత నమోదు ప్రక్రియ, సౌకర్యవంతమైన చందా ఎంపికలు అర్హులైన రైతులు పథకంలో సులభంగా చేరేందుకు తోడ్పడ్డాయి. మరీ ముఖ్యంగా, రైతుల పని చేసే వయసుకు ఆవల కూడా భద్రత కల్పిస్తూ 60 ఏళ్లు నిండిన తర్వాత ఆధారపడదగిన పింఛనును పీఎం-కేఎంవై అందిస్తుంది. అందువల్ల పీఎం-కేఎంవై ప్రస్థానం కేవలం నమోదు, పథకం పరిధికి మాత్రమే పరిమితం కాదు. వృద్ధాప్యంలో రైతుల గౌరవం, ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడాలనే విస్తృత నిబద్ధతకు ఇది ప్రతీక. పింఛను రక్షణ వలయాన్ని నిర్మించటం ద్వారా తమ ఉద్యోగ జీవితమంతా భారత ఆహార భద్రతకు కృషి చేసే రైతులకు మరింత భద్రత కల్పిస్తామనే హామీని ఈ పథకం బలోపేతం చేస్తోంది.

References

Ministry of Agriculture and Farmers Welfare

https://pmkisan.gov.in/Documents/PM-KMY%20-%20Operational%20Guidelines.pdf

https://sansad.in/getFile/lsapps/loksabhaquestions/annex/187/AU1656_xhexVu.pdf?source=lsapps

https://pmkmy.gov.in/scheme/pmkmy https://agriwelfare.gov.in/Documents/DAFW_AnnualReport_2025_26_En.pdf

PIB Backgrounders

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2053142&reg=48&lang=2

https://www.pib.gov.in/FactsheetDetails.aspx?Id=150838&reg=48&lang=1 https://static.pib.gov.in/WriteReadData/specificdocs/documents/2022/jan/doc20221185101.pdf

Click here for pdf file

 

***

(Explainer ID: 160057) आगंतुक पटल : 51
Provide suggestions / comments
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Assamese , Tamil , Malayalam