Infrastructure
పీఎంఏవై-యూ: గృహ వసతి, సమ్మిళిత అభివృద్ధి, సాధికారతతో కూడిన ప్రస్థానం
Posted On:
16 SEP 2026 1:05PM
పట్టణ ప్రాంతాల్లో అందరికీ గృహ వసతి కల్పించాలనే లక్ష్యంతో చేపట్టిన ప్రధాన పట్టణ గృహ నిర్మాణ కార్యక్రమం పీఎంఏవై-యూ. దేశవ్యాప్తంగా అర్హులైన పట్టణ కుటుంబాలకు ప్రాథమిక పౌర సదుపాయాలతో కూడిన పక్కా ఇళ్లను ఇది అందిస్తుంది. నగరాలు, పట్టణాల్లోని ఆర్థికంగా బలహీన వర్గాలు (ఈడబ్ల్యూఎస్), అల్పాదాయ వర్గాలు (ఎల్‌ఐజీ), మధ్య ఆదాయ వర్గాల (ఎంఐజీ) కుటుంబాలు, మురికివాడల నివాసితులపై ఈ కార్యక్రమం ప్రధానంగా దృష్టి సారిస్తుంది. పీఎంఏవై-యూ అమలు అనుభవాల ఆధారంగా పునర్వ్యవస్థీకరించిన పీఎంఏవై-యూ 2.0ను 2024లో ప్రారంభించారు. మహిళలతో పాటు పట్టణాల్లోని ఇతర బలహీన వర్గాలకు ప్రయోజనాలు విస్తరించటం ద్వారా సమ్మిళిత అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. జియో ట్యాగింగ్, రియల్ టైమ్ డ్యాష్‌బోర్డులు వంటి సాంకేతిక ఆధారిత వ్యవస్థలు పారదర్శకతను, పర్యవేక్షణను బలోపేతం చేశాయి.
పట్టణ ఆకాంక్షలకు పునాది
సురక్షితమైన ఇల్లు గౌరవప్రదమైన జీవితానికి పునాది. అది కుటుంబాలకు స్థిరత్వం, రక్షణ కల్పించటంతో పాటు మెరుగైన అవకాశాల కోసం ముందుకు సాగే ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. నాణ్యమైన గృహ వసతి జీవన పరిస్థితులను మెరుగుపరచటమే కాకుండా ఆరోగ్యం, విద్య, ఆర్థిక భద్రత, సమగ్ర శ్రేయస్సుకు దోహదం చేస్తుంది. కోట్లాది పట్టణ కుటుంబాలకు శాశ్వత గృహం అంటే కేవలం ఆశ్రయం మాత్రమే కాదు; ఉజ్వలమైన, సురక్షితమైన భవిష్యత్తుకు అది ఒక మార్గం.
సమ్మిళిత వృద్ధికి గృహ వసతి అందించే పరివర్తనాత్మక పాత్రను గుర్తించిన ప్రభుత్వం 2015 జూన్‌లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన-పట్టణ్ (పీఎంఏవై-యూ)ను ప్రారంభించింది. అందుబాటు ధరల్లో గృహ వసతిని పట్టణాభివృద్ధి కేంద్రంగా ఈ కార్యక్రమం నిలిపింది. భారీ స్థాయి అమలు, వినూత్నత, సాయం అత్యవసరంగా అవసరమైన వారిపై ప్రత్యేక దృష్టితో ఏళ్లుగా గృహ నిర్మాణ రంగంలో మార్పులు తీసుకొచ్చింది.
పీఎంఏవై-యూ: పట్టణ గృహ అవసరాలకు జాతీయ స్థాయి పరిష్కారం
ప్రధానమంత్రి ఆవాస్ యోజన-అర్బన్ (పీఎంఏవై-యూ) దేశవ్యాప్తంగా అర్హులైన పట్టణ కుటుంబాలకు ప్రాథమిక పౌర సదుపాయాలతో కూడిన అన్ని వాతావరణ పరిస్థితులకు అనువైన పక్కా ఇళ్లను అందిస్తుంది. మురికివాడల నివాసితులు, ఆర్థికంగా బలహీన వర్గాలు (ఈడబ్ల్యూఎస్), అల్పాదాయ వర్గాలు (ఎల్‌ఐజీ), మధ్య ఆదాయ వర్గాలకు (ఎంఐజీ) చెందిన కుటుంబాల గృహ అవసరాలపై ఇది దృష్టి సారిస్తుంది. అందుబాటు ధరల్లో ఇళ్ల నిర్మాణం, పంపిణీ కోసం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పథకం కింద కేంద్ర సాయం అందుతుంది. అసలు కార్యక్రమ కాలపరిమితి 2022 మార్చి వరకు ఉండేది. అయితే రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల విజ్ఞప్తి మేరకు, అనుమతి పొందిన ప్రాజెక్టుల పూర్తికి వీలు కల్పించేందుకు పథకం కాలపరిమితిని 2026 సెప్టెంబర్ 30 వరకు పొడిగించారు. పీఎంఏవై-యూ అమలు ద్వారా నేర్చుకున్న పాఠాలు, పొందిన అనుభవాలు, పెరిగిన గృహ డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని పథకాన్ని పునర్వ్యవస్థీకరించి, 2024 సెప్టెంబర్‌లో పీఎంఏవై-యూ 2.0గా ప్రారంభించారు. మరింత స్పందనాత్మక, సమ్మిళిత విధానంతో పట్టణ ప్రాంతాల్లో ‘అందరికీ గృహ వసతి’ లక్ష్యాన్ని ఈ పథకం కొనసాగిస్తోంది.
లబ్ధిదారు కుటుంబం అంటే ఎవరు?
పీఎంఏవై-యూ కింద లబ్ధిదారు కుటుంబంలో భర్త, భార్య, అవివాహిత కుమారులు లేదా అవివాహిత కుమార్తెలు ఉంటారు. కుటుంబంలోని ఏ సభ్యుడి పేరిట కూడా భారతదేశంలో ఎక్కడా పక్కా ఇల్లు ఉండకూడదు. అన్ని వాతావరణ పరిస్థితులకు అనువైన నివాస యూనిట్‌ను పక్కా ఇల్లుగా పరిగణిస్తారు. వివాహ స్థితితో సంబంధం లేకుండా ఆదాయం పొందే వయోజన సభ్యుడిని ప్రత్యేక కుటుంబంగా గుర్తిస్తారు. అయితే కింది నిబంధనలు వర్తిస్తాయి:
* ఆ వ్యక్తి పేరిట భారతదేశంలో ఎక్కడా పక్కా ఇల్లు ఉండకూడదు.
* వివాహిత దంపతుల్లో భార్య లేదా భర్త, లేదా ఇద్దరూ సంయుక్తంగా ఒక ఇంటిని పొందవచ్చు. ఇది పథకం కింద కుటుంబ ఆదాయ అర్హతకు లోబడి ఉంటుంది. అర్హులైన లబ్ధిదారులు కార్యక్రమంలోని నాలుగు విభాగాల్లో ఏదో ఒక విభాగం కింద మాత్రమే ప్రయోజనం పొందవచ్చు.
* 21 చదరపు మీటర్ల కంటే తక్కువ విస్తీర్ణం గల పక్కా ఇల్లు ఉన్నవారిని పథకం కింద 30 చదరపు మీటర్ల వరకు విస్తరించి, మెరుగుపరచటానికి పరిగణించవచ్చు. స్థలం లేదా ఇతర పరిమితుల వల్ల ఇది సాధ్యం కాకపోతే పీఎంఏవై-యూ కింద మరో ప్రాంతంలో ఇల్లు పొందవచ్చు.
పీఎంఏవై-అర్బన్ 2.0: తదుపరి అధ్యాయానికి శ్రీకారం

పీఎంఏవై-యూ వేసిన బలమైన పునాదిపై భారత అందుబాటు గృహ నిర్మాణ కార్యక్రమం తదుపరి దశగా పీఎంఏవై-యూ 2.0 ప్రారంభమైంది. అదనంగా కోటి పట్టణ పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలనే లక్ష్యంతో 2024 నుంచి 2029 వరకు పథకాన్ని అమలు చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో అందుబాటు ధరల్లో ఇళ్ల నిర్మాణం లేదా కొనుగోలుకు తోడ్పాటుగా అర్హులైన కుటుంబాలకు ఒక్కో యూనిట్‌కు ₹2.50 లక్షల వరకు ఆర్థిక సాయం అందుతుంది. పట్టణ భారతదేశంలోని విభిన్న గృహ అవసరాలను తీర్చటంలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు అందుబాటు ధరల్లో అద్దె గృహాలను కూడా పీఎంఏవై-యూ 2.0 అందిస్తుంది.
ఈడబ్ల్యూఎస్, ఎల్‌ఐజీ, ఎంఐజీ వర్గాలకు చెందిన కుటుంబాలు పీఎంఏవై-యూ 2.0 పథకానికి అర్హులు. లబ్ధిదారుల ఆదాయ అర్హత ప్రమాణాలు ఇలా ఉన్నాయి:
* ఈడబ్ల్యూఎస్ కుటుంబాలు: వార్షిక ఆదాయం ₹3 లక్షల వరకు.
* ఎల్‌ఐజీ కుటుంబాలు: వార్షిక ఆదాయం ₹3 లక్షల నుంచి ₹6 లక్షల వరకు.
* ఎంఐజీ కుటుంబాలు: వార్షిక ఆదాయం ₹6 లక్షల నుంచి ₹9 లక్షల వరకు.
పీఎంఏవై-యూ 2.0లో నాలుగు విభాగాలు
పీఎంఏవై-యూ అనుభవాల ఆధారంగా పట్టణ భారతదేశంలోని విభిన్న గృహ అవసరాలను తీర్చేందుకు పీఎంఏవై-యూ 2.0 కూడా నాలుగు అంచెల విధానాన్ని అనుసరిస్తోంది.
లబ్ధిదారుల ఆధ్వర్యంలో నిర్మాణం (బీఎల్‌సీ)
బీఎల్‌సీ విభాగం కింద అర్హులైన ఈడబ్ల్యూఎస్ కుటుంబాలకు ₹2.5 లక్షల వరకు ఆర్థిక సాయం అందుతుంది. తమకు అందుబాటులో ఉన్న స్థలంలో గరిష్ఠంగా 45 చదరపు మీటర్ల కార్పెట్ విస్తీర్ణంతో కొత్త పక్కా ఇళ్లను వారు నిర్మించుకోవచ్చు.
భాగస్వామ్యంతో అందుబాటు గృహ నిర్మాణం (ఏహెచ్‌పీ)
పక్కా ఇల్లు సొంతం చేసుకునేందుకు ఈడబ్ల్యూఎస్ లబ్ధిదారులకు ఏహెచ్‌పీ విభాగం కింద ఆర్థిక సాయం అందుతుంది. ప్రభుత్వ లేదా ప్రైవేటు సంస్థలు అర్హులైన లబ్ధిదారుల కోసం 30–45 చదరపు మీటర్ల కార్పెట్ విస్తీర్ణంతో అందుబాటు ధరల్లో ఇళ్లను నిర్మిస్తాయి. ఇంటి కొనుగోలు ధరలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఒక్కో యూనిట్‌కు ₹2.5 లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తాయి.
అందుబాటు ధరల్లో అద్దె గృహాలు (ఏఆర్‌హెచ్)
స్వల్పకాలిక నివాసం అవసరమైన పట్టణవాసులకు లేదా ఇల్లు కొనుగోలు చేయలేని, నిర్మించుకోలేని వారికి ఏఆర్‌హెచ్ విభాగం అందుబాటు ధరల్లో గౌరవప్రదమైన, పరిశుభ్రమైన అద్దె గృహాలను అందిస్తుంది. వలసదారులు, నిరాశ్రయులు, పారిశ్రామిక కార్మికులు, ఉద్యోగినులు, నిర్మాణ కార్మికులు, పట్టణ పేదలు, నిరాధారులతో సహా ఈడబ్ల్యూఎస్, ఎల్‌ఐజీ లబ్ధిదారులు దీని పరిధిలోకి వస్తారు. వీధి వ్యాపారులు, రిక్షా కార్మికులు, కాంట్రాక్టు ఉద్యోగులు తదితరులు కూడా ఇందులో ఉంటారు. ఇళ్లను నివాసయోగ్యంగా తీర్చిదిద్దేందుకు నీరు, మురుగునీరు లేదా సెప్టేజ్ నిర్వహణ, పారిశుద్ధ్యం, అంతర్గత రహదారులు, ఆరోగ్య కేంద్రాలు వంటి అవసరమైన మౌలిక సదుపాయాలపై కూడా దృష్టి సారిస్తారు.
వడ్డీ రాయితీ పథకం (ఐఎస్ఎస్)
పీఎంఏవై-యూ 2.0 కింద అర్హత గల గృహ రుణాలపై ఐఎస్ఎస్ విభాగం వడ్డీ రాయితీ అందిస్తుంది. 2024 సెప్టెంబర్ 1 లేదా ఆ తర్వాత అనుమతి పొంది, విడుదలైన రుణాలు దీని పరిధిలోకి వస్తాయి. అర్హులైన ఈడబ్ల్యూఎస్, ఎల్‌ఐజీ, ఎంఐజీ లబ్ధిదారులు ఇళ్ల కొనుగోలు, తిరిగి కొనుగోలు లేదా నిర్మాణానికి ఈ రాయితీ పొందవచ్చు. ఐదేళ్లకు మించిన కాలపరిమితి గల రుణం తీసుకున్న అర్హులైన లబ్ధిదారులకు గరిష్ఠంగా ₹1.80 లక్షల వడ్డీ రాయితీ అందుతుంది.
పీఎంఏవై-యూ, పీఎంఏవై-యూ 2.0 కీలక విజయాలు
అందుబాటు ధరల్లో గృహ వసతిని భారీ స్థాయిలో చేరువ చేయాలనే నిరంతర నిబద్ధతను పీఎంఏవై-యూ ప్రస్థానం ప్రతిబింబిస్తోంది. 2005 నుంచి 2014 మధ్య పూర్వ పథకాల కింద దాదాపు 8 లక్షల పట్టణ గృహాలు మాత్రమే పూర్తయ్యాయి. 2026 ఆగస్టు 9 నాటికి పీఎంఏవై-యూ, పీఎంఏవై-యూ 2.0 కింద 1.25 కోట్ల ఇళ్లకు అనుమతి లభించింది. వీటిలో కోటికి పైగా ఇళ్లను దేశవ్యాప్తంగా పూర్తి చేసి, లబ్ధిదారులకు అందించారు.
పట్టణ గృహ వసతికి సమాన అవకాశాలు
పట్టణాభివృద్ధి ప్రయోజనాలు ఎంత విస్తృతంగా ప్రజలకు చేరాయనే అంశంపైనే దాని నిజమైన విజయం ఆధారపడి ఉంటుంది. నగరాలు, పట్టణాల్లో బలహీన కుటుంబాలకు అండగా నిలుస్తూ సమ్మిళిత విధానాన్ని ఈ కార్యక్రమం కేంద్రంగా చేసుకుంది.
ఈ పరివర్తనలో మహిళలకు కీలక స్థానం దక్కింది. మహిళా లబ్ధిదారుల పేరిట ఇళ్ల యాజమాన్యం లేదా సహ యాజమాన్యాన్ని పీఎంఏవై-యూ తప్పనిసరి చేసింది. ఈ నిబంధన మహిళల ఆర్థిక భద్రతను బలోపేతం చేయటంతో పాటు కుటుంబ నిర్ణయాల్లో వారి పాత్రను పెంచింది.
ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు, మైనారిటీలు, వృద్ధులు, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్ వ్యక్తులకు గృహ వసతి కల్పించటానికి కూడా ఈ కార్యక్రమం ప్రాధాన్యం ఇస్తోంది. విభిన్న లబ్ధిదారుల అవసరాలను పరిష్కరించటం ద్వారా పట్టణ వృద్ధిని మరింత సమానంగా, అందరికీ అందుబాటులోకి తీసుకురావటంలో పీఎంఏవై-యూ తోడ్పడింది.
విభిన్న లబ్ధిదారుల వర్గాలకు లక్షిత సాయం అందిస్తూ పీఎంఏవై-యూ 2.0 ఈ నిబద్ధతను కొనసాగిస్తోంది. 2026 ఆగస్టు 9 నాటికి ఈ పథకం కింద దాదాపు 18.38 లక్షల ఇళ్లకు అనుమతి లభించింది. బలహీన వర్గాల కోసం ప్రత్యేక చర్యలతో గృహ యాజమాన్య అవకాశాలను ఇది మేళవిస్తోంది.
* అనుమతి పొందిన 18.38 లక్షల ఇళ్లలో 14.40 లక్షల ఇళ్లు లబ్ధిదారుల ఆధ్వర్యంలో నిర్మాణం విభాగం కింద ఉన్నాయి.
* భాగస్వామ్యంతో అందుబాటు గృహ నిర్మాణం విభాగం కింద 2.48 లక్షల ఇళ్లకు అనుమతి లభించింది.
* వడ్డీ రాయితీ పథకం విభాగం కింద 1.36 లక్షల ఇళ్లు ప్రయోజనం పొందాయి.
* అందుబాటు ధరల్లో అద్దె గృహాల విభాగం కింద 13,046 నివాస యూనిట్లకు అనుమతి లభించింది.
* పీఎంఏవై-యూ, పీఎంఏవై-యూ 2.0 కింద అనుమతి పొందిన 1.25 కోట్ల ఇళ్లలో కోటి ఇళ్లను మహిళలకు కేటాయించారు. కుటుంబ మహిళా అధిపతి పేరిట లేదా సంయుక్త యాజమాన్యంలో వీటిని కేటాయించారు.

గృహ నిర్మాణ ప్రయోజనాలు అత్యవసరంగా అవసరమైన వారికి చేరేలా చూడటంపై కార్యక్రమం నిరంతరంగా దృష్టి సారిస్తున్నట్లు ఈ విజయాలు తెలియజేస్తున్నాయి. అందుబాటు ధరలను సమ్మిళిత విధానంతో మేళవిస్తూ మరింత సమానత్వంతో కూడిన, విపత్తులను తట్టుకునే పట్టణ సమాజాల నిర్మాణానికి పీఎంఏవై-యూ తోడ్పడుతోంది.
సాంకేతిక ఆధారిత అమలు, పర్యవేక్షణ
ఆధునిక సాంకేతికత పట్టణ గృహాల పంపిణీకి కొత్త కోణాన్ని జోడించింది. డిజిటల్ డ్యాష్‌బోర్డులు, జియో ట్యాగింగ్, సమీకృత పర్యవేక్షణ వ్యవస్థలు పీఎంఏవై-యూ అమలును బలోపేతం చేశాయి. ఈ సాధనాలు పారదర్శకతను పెంచి, ప్రాజెక్టుల పర్యవేక్షణను మెరుగుపరిచాయి.
* ఏకీకృత వెబ్ పోర్టల్: పట్టణ ప్రాంతాల్లో పీఎంఏవై-యూ 2.0 అమలు, పర్యవేక్షణకు ఏకీకృత వెబ్ పోర్టల్ ఒకే డిజిటల్ వేదికగా పనిచేస్తుంది. అర్హులైన లబ్ధిదారులు గృహ సాయం కోసం దరఖాస్తు చేసుకోవటానికి, దరఖాస్తుల పరిశీలన, స్థితిని తెలుసుకోవటానికి ఇది వీలు కల్పిస్తుంది. లబ్ధిదారులు, పట్టణ స్థానిక సంస్థలు (యూఎల్‌బీలు), రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు, ఇతర అమలు సంస్థలతో సహా కీలక భాగస్వాములను ఒకే వేదికపైకి తీసుకొస్తుంది. నిర్మాణంలోని వివిధ దశల్లో ఇళ్లకు జియో ట్యాగింగ్ చేయటానికి, నిధుల విడుదలను క్రమబద్ధీకరించటానికి కూడా ఈ పోర్టల్ వీలు కల్పిస్తుంది. తద్వారా పథకం అమలులో పారదర్శకత, జవాబుదారీతనం, సమర్థమైన పర్యవేక్షణకు భరోసా ఇస్తుంది.
* పీఎంఏవై-యూ డ్యాష్‌బోర్డు: ప్రధాన పనితీరు సూచికల పురోగతిని డ్యాష్‌బోర్డు రియల్ టైమ్‌లో అందిస్తుంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, యూఎల్‌బీలు/అమలు సంస్థలు, గౌరవ పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, లబ్ధిదారులు, సంబంధిత భాగస్వాములందరికీ ఈ సమాచారం అందుబాటులో ఉంటుంది. సమాచారం, గణాంకాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవటానికి, అమలును సమర్థంగా పర్యవేక్షించటానికి ఇది దోహదం చేస్తుంది.
* జియో ట్యాగింగ్: పనులు ప్రారంభమైన దశ నుంచి పునాది, పైకట్టడం, తుది పనులు-బాహ్య అభివృద్ధి, పూర్తి దశ వరకు ఐదు దశల్లో ప్రాజెక్టులను పర్యవేక్షిస్తారు. దశలవారీ పర్యవేక్షణ భారీ ప్రాజెక్టులు నిర్ణీత గడువులో కొనసాగేలా, నాణ్యత ప్రమాణాలు పాటించేలా చూస్తుంది.
* టెక్నాలజీ సబ్ మిషన్ (టీఎస్ఎం): వేగంగా, మెరుగైన నాణ్యతతో ఇళ్ల నిర్మాణానికి ఆధునిక, పర్యావరణహిత, వినూత్న నిర్మాణ సాంకేతికతలను అనుసరించేందుకు ఇది తోడ్పడుతుంది. టీఎస్ఎం కింద గ్లోబల్ హౌసింగ్ టెక్నాలజీ ఛాలెంజ్-ఇండియా (జీహెచ్‌టీసీ-ఇండియా) నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా నిరూపితమైన సాంకేతికతల్లో 54 విపత్తు నిరోధక సాంకేతికతలను ప్రధాన స్రవంతిలో వినియోగించేందుకు ఎంపిక చేశారు. జీహెచ్‌టీసీ-ఇండియా కింద ఎంపిక చేసిన ఆరు విభిన్న సాంకేతికతలను ఉపయోగించి దేశంలోని ఆరు ప్రాంతాల్లో ఆరు లైట్ హౌస్ ప్రాజెక్టులను (ఎల్‌హెచ్‌పీలు) నిర్మించారు.
* టెక్నాలజీ ఆండ్ ఇన్నొవేషన్ సబ్-మిషన్ (టీఐఎస్ఎం): టీఎస్ఎం పురోగతిని కొనసాగిస్తూ పీఎంఏవై-యూ 2.0 కింద సాంకేతికత, ఆవిష్కరణల ఉప కార్యక్రమం గృహ నిర్మాణంలో వినూత్నతను ప్రోత్సహిస్తుంది. వినూత్న రూపకల్పన, నాణ్యతకు భరోసా, స్థిరమైన గృహ నిర్మాణానికి పర్యావరణహిత భవన ప్రమాణాల అమలును ప్రోత్సహిస్తుంది. విభిన్న భౌగోళిక-వాతావరణ మండలాలకు అనుగుణంగా వాతావరణ పరిస్థితులను తట్టుకునే లేఅవుట్లు, భవన ప్రణాళికలకు టీఐఎస్ఎం అండ అందిస్తుంది.
* టెక్నాలజీ ఇన్నొవేషన్ గ్రాంట్ (టీఐజీ): ఏహెచ్‌పీ ప్రాజెక్టులకు పీఎంఏవై-యూ 2.0 అదనపు సాంకేతిక ఆవిష్కరణల గ్రాంటును అందిస్తుంది. జీహెచ్‌టీసీ-ఇండియా కింద నోటిఫై చేసిన వినూత్న, ప్రత్యామ్నాయ సాంకేతికతల వినియోగానికి ఈ గ్రాంటు తోడ్పడుతుంది.
లబ్ధిదారుల జీవితాలపై ప్రభావం
పట్టణ భారతదేశంలో ఈ కార్యక్రమం తీసుకొచ్చిన మార్పులను లబ్ధిదారుల జీవితాల ద్వారానే స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. సురక్షిత గృహ వసతి లబ్ధిదారుల గౌరవం, స్థిరత్వం, స్వావలంబనను ఎలా బలోపేతం చేసిందో ఈ విజయగాథలు తెలియజేస్తున్నాయి.
సొంత ఇంటి నీడ... అవకాశాలతో కూడిన భవిష్యత్తు
ఆంధ్రప్రదేశ్‌లోని అద్దంకిలో మండలపు అనంతలక్ష్మి తన భర్త, ముగ్గురు పిల్లలతో కలిసి తాత్కాలిక పైకప్పు ఉన్న చిన్న ఇంట్లో నివసించేవారు. గేదెల పెంపకం ద్వారా వచ్చే స్వల్ప ఆదాయంపైనే కుటుంబం ఆధారపడేది. శాశ్వత ఇల్లు నిర్మించుకోవడం వారికి అందని కలలా కనిపించేది. పీఎంఏవై-యూ కింద సాయం పొందిన తర్వాత సొంతంగా ఇంటిని నిర్మించుకుని ఆర్థిక ఇబ్బందులను అధిగమించారు. కొత్త పక్కా ఇల్లు సురక్షిత పారిశుద్ధ్య సదుపాయాన్ని కల్పించింది, బహిరంగ మల విసర్జనకు ముగింపు పలికింది. వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచింది. అంతకంటే ముఖ్యంగా కుటుంబంలో ఆత్మవిశ్వాసాన్ని నింపి, పిల్లల భవిష్యత్తులో పెట్టుబడి పెట్టటానికి స్ఫూర్తినిచ్చింది.
నిరంతర మరమ్మతుల నుంచి శాశ్వత స్థిరత్వం వైపు
మేఘాలయలోని నాంగ్‌పో పట్టణానికి చెందిన లూసిబోన్ సింగ్క్లీ కుటుంబానికి ఏకైక సంపాదనపరురాలిగా తన తండ్రి, సోదరీమణులకు అండగా నిలుస్తున్నారు. ఆశా కార్యకర్తగా, అనాస పంట సాగుదారుగా పనిచేసే ఆమె తరచూ మరమ్మతులు అవసరమయ్యే కచ్చా ఇంట్లో నివసించేవారు. ముఖ్యంగా వర్షాకాలంలో మరమ్మతుల అవసరం ఎక్కువగా ఉండేది. ఆ ఖర్చులు కుటుంబ ఆర్థిక పరిస్థితిపై భారాన్ని మోపటంతో పాటు ఆమె తండ్రి వైద్య చికిత్సపై ప్రభావం చూపేవి. పీఎంఏవై-యూ లబ్ధిదారుగా ఎంపికైన తర్వాత లూసిబోన్ అన్ని వాతావరణ పరిస్థితులకు అనువైన శాశ్వత ఇంటిని పొందారు. దీంతో నిర్వహణ ఖర్చులు తగ్గి, కుటుంబ ఆర్థిక స్థిరత్వం మెరుగుపడింది. ఆదా అయిన డబ్బు ఆమె తండ్రి ఆరోగ్య సంరక్షణ అవసరాలకు ఉపయోగపడుతోంది. ఆ కుటుంబం వర్షపు నీటి సంరక్షణ విధానాన్ని కూడా చేపట్టింది. పండ్ల చెట్లు నాటింది, ఎల్‌పీజీ కనెక్షన్ పొందింది, ఎల్‌ఈడీ దీపాలకు మారింది. కొత్త ఇల్లు మొత్తం కుటుంబానికి మనశ్శాంతిని తెచ్చింది.

అందరికీ గృహ వసతి లక్ష్యం దిశగా ముందడుగు
ఒక నగర గాథ అంటే అంతిమంగా అందులో నివసించే ప్రజల గాథే. పట్టణ కేంద్రాలు పెరిగి, రూపాంతరం చెందుతున్న కొద్దీ సమ్మిళిత అభివృద్ధి, అవకాశాలు, జీవన ప్రమాణాలకు గృహ వసతి అత్యంత స్పష్టమైన సూచికల్లో ఒకటిగా మారుతుంది. ఈ అవగాహనను పీఎంఏవై-యూ ప్రస్థానం ప్రతిబింబిస్తోంది. పట్టణాభివృద్ధిలో చాలాకాలంగా అంచుల్లో ఉన్న కోట్లాది మందికి గృహ వసతిని ఇది చేరువ చేసింది. తద్వారా దేశవ్యాప్తంగా లెక్కలేనన్ని కుటుంబాలకు సొంత ఇల్లు అనే ఆకాంక్షను సాకారం చేయటంలో తోడ్పడింది. ప్రణాళిక, పర్యవేక్షణ, పారదర్శక అమలుకు సాంకేతిక ఆధారిత వ్యవస్థల వినియోగంతో కార్యక్రమం మరింత బలోపేతమైంది. ప్రతి కుటుంబం తమదిగా చెప్పుకునే సురక్షితమైన ఇంటిని కలిగి ఉండేలా పీఎంఏవై-యూ 2.0 తన లక్ష్యాన్ని కొనసాగిస్తోంది.
References
Ministry of Housing and Urban Affairs
https://pmay-urban.gov.in/about
https://pmaymis.gov.in/pmaymis2_2024/PMAY_SURVEY/EligiblityCheck.aspx
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2274164®=48&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2239027®=48&lang=2
https://dashboard.pmay-urban.gov.in/
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2231861®=3&lang=2
https://pmay-urban.gov.in/uploads/progress-pdfs/68ac528160e77-Achievement_under_PMAY-U_&_PMAY-U2.0_cropped.pdf
https://pmay-urban.gov.in/uploads/guidelines/AHP-SOP.pdf
https://pmaymis.gov.in/PMAYMIS2_2024/PmayUrban.aspx
https://pmay-urban.gov.in/uploads/pmayu-9-years/Booklet.pdf
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1953776®=48&lang=2
https://www.pib.gov.in/PressReleaseDetail.aspx?PRID=2296797®=48&lang=1
https://pmay-urban.gov.in/uploads/success-stories/605c36ab8e06f-Meghalaya_Lucybon%20Syngkli.pdf
https://pmay-urban.gov.in/uploads/success-stories/605c2ccda9adb-Andhra%20Pradesh_Mandhalpu%20Ananthalakshmi.pdf
https://pmay-urban.gov.in/uploads/success-stories/605c347e9d8cd-Kerala%20A%20R%20Ragasree.pdf
https://pmay-urban.gov.in/uploads/guidelines/Operational-Guidelines-of-PMAY-U-2.pdf
Click here to see pdf
***
(Explainer ID: 160055)
आगंतुक पटल : 43
Provide suggestions / comments