• Sitemap
  • Advance Search
Economy

పీఎం విశ్వకర్మ: సంప్రదాయ చేతివృత్తుల కళాకారులు, హస్తకళాకారులకు మరింత బలం

Posted On: 16 SEP 2026 11:14AM

పీఎం విశ్వకర్మ పథకం మూడేళ్లు పూర్తి చేసుకోనున్న తరుణంలో 30 లక్షల మంది లబ్ధిదారుల నమోదు లక్ష్యం నెరవేరింది. నైపుణ్య శిక్షణ, పనిముట్ల కిట్లు, రుణ సాయం, డిజిటల్ ప్రోత్సాహకాలు, మార్కెట్ అనుసంధానాన్ని కూడా ఈ పథకం అందించింది. లబ్ధిదారులను ఉద్యమ్ అసిస్ట్ ప్లాట్‌ఫామ్‌లో నమోదు చేయటంతో పాటు ప్రభుత్వ ఈ-మార్కెట్‌ప్లేస్ (జీఈఎం), ఈ-కామర్స్ వేదికలు, వాణిజ్య ప్రదర్శనలు, ఎగ్జిబిషన్లు వంటి విస్తృత మార్కెట్ మార్గాలతో అనుసంధానిస్తున్నారు. సమ్మాన్, సామర్థ్య, సమృద్ధి అనే మూడు మూలస్తంభాలపై ఈ పథకం రూపుదిద్దుకుంది. సంప్రదాయ నైపుణ్యాలకు సంబంధించిన గురు-శిష్య పరంపరతో పాటు కుటుంబ ఆధారిత వృత్తి విధానాన్ని బలోపేతం చేయటం కూడా దీని లక్ష్యం.

సంప్రదాయ కళాకారులు, హస్తకళాకారులకు అండ
భారత స్థానిక ఆర్థిక వ్యవస్థలో, సాంస్కృతిక వారసత్వంలో సంప్రదాయ చేతివృత్తుల కళాకారులు, హస్తకళాకారులు కీలక భాగంగా ఉన్నారు. వీరిలో చాలామంది వృత్తులు చేతి నైపుణ్యాలు, కుటుంబం నుంచి సంక్రమించిన పరిజ్ఞానం, చిన్న తరహా వ్యాపారాలపై ఆధారపడి సాగుతాయి. ఇలాంటి కళాకారులు, హస్తకళాకారులకు సమగ్ర సాయం అందించేందుకు 2023 సెప్టెంబర్ 17న పీఎం విశ్వకర్మ పథకాన్ని ప్రారంభించారు.

సంప్రదాయ కళాకారులు, హస్తకళాకారులకు గౌరవం, సామర్థ్యం, సంపద చేకూర్చే సమ్మాన్, సామర్థ్య, సమృద్ధి అనే మూడు మూలస్తంభాలపై పీఎం విశ్వకర్మ పథకం నిర్మితమైంది. సంప్రదాయ నైపుణ్యాలకు సంబంధించిన గురు-శిష్య పరంపరను లేదా కుటుంబ ఆధారిత వృత్తి విధానాన్ని బలోపేతం చేసి, ప్రోత్సహించటం కూడా ఈ పథకం లక్ష్యం.

2023-24 నుంచి 2027-28 ఆర్థిక సంవత్సరాల వరకు అమలయ్యే ఈ కేంద్ర రంగ పథకానికి ₹13,000 కోట్ల వ్యయాన్ని కేటాయించారు. దీని పరిధిలో 18 సంప్రదాయ వృత్తులు ఉన్నాయి. కళాకారుల ఉత్పత్తులు, సేవల నాణ్యతను మెరుగుపరచటం, వాటి విస్తృతిని పెంచటం, దేశీయ, అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలతో వారిని అనుసంధానించటం ఈ పథకం లక్ష్యాలు.

2026 సెప్టెంబర్ 17 నాటికి ఈ పథకం మూడేళ్లు పూర్తి చేసుకోనున్న తరుణంలోనే 30 లక్షల మంది లబ్ధిదారుల నమోదు లక్ష్యం నెరవేరింది.

పథకం రూపకల్పన, కీలక అంశాలు
పీఎం విశ్వకర్మ పథకం ద్వారా పలు రకాల సాయాన్ని ఒకే వ్యవస్థ కింద అందిస్తున్నారు. గుర్తింపు, నైపుణ్యాల మెరుగుదల, పనిముట్ల కిట్ ప్రోత్సాహకం, రుణ సాయం, డిజిటల్ లావాదేవీలకు ప్రోత్సాహకం, మార్కెటింగ్ సాయం ఇందులోని ప్రధాన అంశాలు.

గుర్తింపు
నమోదు, ధ్రువీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత లబ్ధిదారులకు పీఎం విశ్వకర్మ ధ్రువపత్రం, గుర్తింపు కార్డు అందిస్తారు.

నైపుణ్యాల మెరుగుదల
* నైపుణ్యాల మెరుగుదల కార్యక్రమం ద్వారా లబ్ధిదారులకు ఆధునిక పనిముట్లు, ఉత్తమ పద్ధతులు, వినూత్న నమూనాలను పరిచయం చేస్తారు. డిజిటల్ లావాదేవీలు, మార్కెటింగ్, వ్యాపార నిర్వహణ పరిజ్ఞానంపై కూడా శిక్షణ ఇస్తారు.
* ప్రాథమిక శిక్షణ 5–7 రోజులు, అధునాతన శిక్షణ 15 రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం కొనసాగుతుంది. శిక్షణ పొందేవారికి రోజుకు ₹500 ఉపకార వేతనం అందుతుంది.



ఆధునిక పనిముట్ల కిట్లు
పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు ₹15,000 వరకు విలువైన ఆధునిక పనిముట్ల కిట్లను కూడా అందిస్తారు.

రుణ సాయం
పీఎం విశ్వకర్మ పథకంలో అధికారిక రుణ సదుపాయం కీలక భాగం. తాకట్టు అవసరం లేకుండా రెండు విడతల్లో ₹3 లక్షల వరకు వ్యాపారాభివృద్ధి రుణాలను ఈ పథకం అందిస్తుంది. తొలి విడతలో 18 నెలల కాలపరిమితితో ₹1 లక్ష వరకు రుణం లభిస్తుంది. ప్రాథమిక శిక్షణ పూర్తి చేసిన లబ్ధిదారులు తొలి విడత రుణానికి అర్హులు. రెండో విడతలో 30 నెలల కాలపరిమితితో ₹2 లక్షల వరకు రుణం అందుతుంది.

ప్రభుత్వం 8 శాతం మేర వడ్డీ రాయితీ భరిస్తుండగా, లబ్ధిదారులకు స్థిర రాయితీ వడ్డీ రేటు 5 శాతంగా ఉంటుంది. తొలి విడత రుణాన్ని తిరిగి చెల్లించటం, డిజిటల్ లావాదేవీలు చేపట్టటం లేదా అధునాతన శిక్షణ పూర్తి చేయటం ఆధారంగా రెండో విడత రుణ అర్హత నిర్ణయిస్తారు.

డిజిటల్, మార్కెటింగ్ సాయం
పీఎం విశ్వకర్మ పథకం ఆర్థిక సాయంతో పాటు డిజిటల్, మార్కెటింగ్ తోడ్పాటును అందిస్తుంది. లబ్ధిదారులు తమ బ్యాంకు ఖాతా ద్వారా చేసే ప్రతి అర్హమైన డిజిటల్ చెల్లింపు లేదా స్వీకరణకు ₹1 చొప్పున, నెలకు గరిష్ఠంగా 100 లావాదేవీల వరకు ప్రోత్సాహకం పొందవచ్చు. వాణిజ్య ప్రదర్శనలు, ఎగ్జిబిషన్లు, బ్రాండింగ్, ప్రభుత్వ ఈ-మార్కెట్‌ప్లేస్ (జీఈఎం) వంటి ఈ-కామర్స్ వేదికలు, ప్రకటనలు, ప్రచారం మార్కెటింగ్ సాయంలో భాగంగా ఉన్నాయి. అధికారిక వ్యాపార పద్ధతులను అనుసరించి, విస్తృత మార్కెట్లకు చేరుకునేలా కళాకారులను ఈ సాయం ప్రోత్సహిస్తుంది.

అర్హత, నమోదు, అధికారిక వ్యాపార వ్యవస్థలో చేరిక
అర్హులైన దరఖాస్తుదారులు

నోటిఫై చేసిన 18 కుటుంబ ఆధారిత సంప్రదాయ వృత్తుల్లో ఏదో ఒక వృత్తిలో చేతులతో, పనిముట్లతో పనిచేసే 18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసు గల కళాకారులు, హస్తకళాకారులు పీఎం విశ్వకర్మ పథకానికి అర్హులు. వారు అసంఘటిత రంగంలో స్వయం ఉపాధి ప్రాతిపదికన పనిచేస్తుండాలి.
* గత ఐదేళ్లలో స్వయం ఉపాధి లేదా వ్యాపారాభివృద్ధి కోసం ఇలాంటి రుణ ఆధారిత ప్రభుత్వ పథకాల కింద దరఖాస్తుదారులు రుణాలు పొంది ఉండకూడదు.
* భర్త, భార్య, అవివాహిత పిల్లలతో కూడిన కుటుంబంలో ఒక్క సభ్యుడికి మాత్రమే నమోదు, ప్రయోజనాలు పరిమితం.
* ప్రభుత్వ ఉద్యోగి, ఆ ఉద్యోగి కుటుంబ సభ్యులు అర్హులు కారు.

ముద్ర, పీఎం స్వనిధి పథకాల కింద తీసుకున్న రుణాలను పూర్తిగా తిరిగి చెల్లించిన లబ్ధిదారులు పీఎం విశ్వకర్మ పథకానికి అర్హులు.

స్వయం ఉపాధి కార్మికుడు, అసంఘటిత రంగం అంటే ఏమిటి?
యజమాని వద్ద ఉద్యోగిగా కాకుండా స్వతంత్రంగా ఒక వృత్తిలో పనిచేసే వ్యక్తిని స్వయం ఉపాధి కార్మికుడిగా పరిగణిస్తారు. సంఘటిత రంగం వెలుపల ఉండే అనధికారిక సంస్థలు, కార్మికులు సాధారణంగా అసంఘటిత రంగం పరిధిలోకి వస్తారు.

పీఎం విశ్వకర్మ పరిధిలోని వృత్తులు

వడ్రంగి

పడవల తయారీదారు

ఆయుధాల తయారీదారు

లోహ పనివారు

సుత్తి, పనిముట్ల కిట్ తయారీదారు

తాళాల తయారీదారు

స్వర్ణకారుడు

కుమ్మరి

శిల్పి, రాళ్లు కొట్టే కార్మికుడు

చెప్పులు కుట్టేవారు / పాదరక్షల తయారీ కళాకారుడు

తాపీ మేస్త్రీ

బుట్టలు / చాపలు / చీపుళ్ల తయారీదారు / కొబ్బరి పీచు నేత కార్మికుడు

బొమ్మలు, ఆటవస్తువుల తయారీదారు

క్షౌర వృత్తిదారు

పూలమాలల తయారీదారు

రజకుడు

దర్జీ

చేపల వలల తయారీదారు



నమోదు
కామ‌న్ స‌ర్వీస్ సెంట‌ర్ల (సీఎస్‌సీ) ద్వారా మాత్రమే దరఖాస్తులు సమర్పించవచ్చు.

మూడు అంచెల ధ్రువీకరణ, ఆమోద ప్రక్రియ
* ధ్రువీకరణ:
గ్రామ పంచాయతీ లేదా పట్టణ స్థానిక సంస్థ స్థాయిలో.
* పరిశీలన, సిఫారసు: జిల్లా అమలు కమిటీ ద్వారా.
* ఆమోదం: స్క్రీనింగ్ కమిటీ ద్వారా.

పీఎం విశ్వకర్మ లబ్ధిదారులను అధికారిక సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) వ్యవస్థలో వ్యాపారవేత్తలుగా ఉద్యమ్ అసిస్ట్ ప్లాట్‌ఫామ్‌లో కూడా నమోదు చేస్తున్నారు. దీనివల్ల వారికి వర్తించే ప్రభుత్వ ప్రయోజనాలను పొందవచ్చు.

ఉద్యమ్ అసిస్ట్ ప్లాట్‌ఫామ్
అనధికారిక సూక్ష్మ సంస్థలను నమోదు చేసి, వాటికి ఉద్యమ్ నమోదు సంఖ్య, ధ్రువపత్రం అందించే ఆన్‌లైన్ వ్యవస్థ ఇది.

పీఎం విశ్వకర్మ పథకం పురోగతి
నైపుణ్యాల మెరుగుదల, పనిముట్ల కిట్ల సాయం

2026 సెప్టెంబర్ 15 నాటికి 24.37 లక్షలకు పైగా కళాకారులు ప్రాథమిక నైపుణ్య శిక్షణ పొందగా, 18.16 లక్షలకు పైగా కళాకారులు పనిముట్ల కిట్లు అందుకున్నారు.

సంస్థాగత రుణ సదుపాయాల విస్తరణ
ఈ పథకం కింద సుమారు ₹5,316 కోట్ల విలువైన 6.19 లక్షలకు పైగా రుణాలకు అనుమతి లభించింది. ముడిసరకులు కొనుగోలు చేయటం, పనిముట్లను ఆధునికీకరించటం, కార్యకలాపాలను విస్తరించటం, వ్యాపారాలను బలోపేతం చేసుకోవటంలో లబ్ధిదారులకు తోడ్పడటం ఈ రుణ సాయం లక్ష్యం.

డిజిటల్ సాధికారత
8.11 లక్షలకు పైగా లబ్ధిదారులకు డిజిటల్ ప్రోత్సాహకాలు అందగా, ప్రోత్సాహకాల రూపంలో ₹42 కోట్లకు పైగా పంపిణీ చేశారు.

బ్రాండింగ్, ఉత్పత్తుల రూపకల్పన, ప్యాకేజింగ్, మార్కెటింగ్ కోసం కృత్రిమ మేధ (ఏఐ) సాధనాలను ఉపయోగించటంపై 12,000 మందికి పైగా కళాకారులకు శిక్షణ ఇచ్చారు.

మార్కెట్ అవకాశాలు, విస్తృత ప్రచారం
* దేశవ్యాప్తంగా 1,500కు పైగా అవగాహన కార్యక్రమాలు, శిబిరాలు, 50కి పైగా వర్క్‌షాపులు, 82 వాణిజ్య ప్రదర్శనలు, 37 రాష్ట్ర స్థాయి ఎగ్జిబిషన్లు, 50కి పైగా ఫ్లాష్‌మాబ్ కార్యక్రమాలు నిర్వహించారు.

* తొలి పీఎం విశ్వకర్మ జాతీయ ఎగ్జిబిషన్-కమ్-వాణిజ్య ప్రదర్శనను 2026 జనవరి 17 నుంచి జనవరి 31 వరకు ఢిల్లీ హాట్‌లో నిర్వహించారు. దేశవ్యాప్తంగా 117 మందికి పైగా కళాకారులు పాల్గొని, ₹2 కోట్లకు పైగా రికార్డు స్థాయి అమ్మకాలు సాధించారు. వివిధ దేశాల విదేశీ దౌత్యవేత్తలు, భారత ప్రభుత్వ సీనియర్ అధికారులు ఈ కార్యక్రమాన్ని సందర్శించారు. 60,000 మందికి పైగా దీనిని తిలకించారు.

* ప్రభుత్వ ఈ-మార్కెట్‌ప్లేస్, ఓఎన్‌డీసీ, మీషో, అమెజాన్, ఫ్యాబ్‌ఇండియా, సులేఖ తదితర ఈ-కామర్స్ వేదికల్లో 30,000 మందికి పైగా విశ్వకర్మ లబ్ధిదారులను నమోదు చేశారు.

* అర్హులైన కళాకారులను అమెజాన్ మార్కెట్‌ప్లేస్‌లో నమోదు చేయటానికి వీలు కల్పిస్తూ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ అమెజాన్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

* దివ్యాంగ విశ్వకర్మ కళాకారులకు మార్కెట్ అవకాశాలు కల్పించేందుకు పీఎం విశ్వకర్మ పథకం ‘ఒక స్టేషన్-ఒక ఉత్పత్తి’ (ఓఎస్‌ఓపీ) కార్యక్రమాన్ని కూడా వినియోగిస్తోంది. అధిక ప్రయాణికుల రద్దీ ఉండే ఎంపిక చేసిన రైల్వే స్టేషన్లలో ప్రత్యేక విక్రయ కేంద్రాలు వారి ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకాలకు అవకాశం కల్పిస్తున్నాయి. వివిధ వృత్తులకు చెందిన 42 మందికి పైగా దివ్యాంగ లబ్ధిదారులకు 14 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో స్టాళ్లు ఏర్పాటు చేసుకునే సదుపాయం కల్పించారు.

* పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు చెందిన అవసర్ పథకం సహకారంతో భోపాల్, చండీగఢ్ సహా పలు విమానాశ్రయాల్లో పీఎం విశ్వకర్మ స్టాళ్లను కూడా ప్రారంభించారు.

* పీఎం విశ్వకర్మ ఉత్పత్తుల ప్యాకేజింగ్, బ్రాండింగ్‌ను ప్రోత్సహించేందుకు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ సహకారంతో ఆరు నగరాల్లో పలు వర్క్‌షాపులు నిర్వహించారు. ఒక్కో నగరంలో 250 మంది చొప్పున మొత్తం 1,500 మంది విశ్వకర్మలకు శిక్షణ ఇచ్చారు.

* గిరిజన కళాకారులను ప్రోత్సహించి, వారి మార్కెట్ విస్తృతిని పెంచేందుకు మంత్రిత్వ శాఖ ట్రైఫెడ్ సహకారంతో పలు గిరిజన కళాకారుల మేళాలను నిర్వహించింది. గిరిజన పీఎంవీ కళాకారులను ట్రైబ్స్ ఇండియా వంటి పేరున్న వేదికలతో అనుసంధానించింది.

* బిహార్, గుజరాత్, గోవా, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, పుదుచ్చేరి తదితర ప్రాంతాల్లో స్టార్ కేటగిరీ హోటళ్లు, రిసార్టుల్లో పీఎం విశ్వకర్మ స్టాళ్లను ఏర్పాటు చేశారు. వివిధ రాష్ట్రాల్లో హోటల్ తాజ్, రాడిసన్, అడ్బుజ్ తదితర సంస్థల్లో ఇవి ఉన్నాయి.

 



లబ్ధిదారుల అనుభవాలు, మూల్యాంకన ఫలితాలు
విభిన్న సంప్రదాయ వృత్తులు, ప్రాంతాల్లో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. వేర్వేరు వృత్తులు, రాష్ట్రాలకు చెందిన ఇద్దరు లబ్ధిదారుల అనుభవాలను కింది అధ్యయనాలు తెలియజేస్తున్నాయి.

 



లబ్ధిదారుల విజయగాథలు
నాగాలాండ్‌లోని జున్హెబోటోకు చెందిన బుట్టల తయారీదారు శ్రీమతి విల్లి పీఎం విశ్వకర్మ పథకం కింద నైపుణ్య శిక్షణ పూర్తి చేసి, తాకట్టు అవసరం లేని ₹1 లక్ష రుణాన్ని పొందారు. ముడిసరకుల కొనుగోలు, తన వ్యాపార విస్తరణకు ఆమె ఈ రుణాన్ని వినియోగించారు. ఆమె నెలవారీ ఆదాయం సుమారు 40 శాతం పెరిగి, దాదాపు ₹15,000కు చేరింది.



ఉత్తరాఖండ్‌లోని చమోలీకి చెందిన శిల్పి శ్రీ దర్శన్ లాల్ మూడు దశాబ్దాలకు పైగా ఈ వృత్తిని కొనసాగిస్తున్నారు. బదరీనాథ్ ఆలయ నిర్మాణంలో పాల్గొన్న కళాకారుల సంప్రదాయంతో ఆయన కుటుంబానికి అనుబంధం ఉంది. పీఎం విశ్వకర్మ పథకం కింద ఆయన నైపుణ్య శిక్షణ, పనిముట్ల కిట్, అందుబాటు ధరలో రుణ సదుపాయం పొందారు. 2026లో ఢిల్లీలో జరిగిన పీఎం విశ్వకర్మ హాట్‌లో కూడా ఆయన పాల్గొన్నారు. జాతీయ రాజధానిలో ఆయన పాల్గొన్న తొలి ప్రదర్శన ఇదే. దీని ద్వారా విస్తృత మార్కెట్ ముందు తన ఉత్పత్తులను ప్రదర్శించే అవకాశం లభించింది.

ఐఐఎం ముంబై సమాంతర మూల్యాంకనం
ఐఐఎం ముంబై నిర్వహించిన పీఎం విశ్వకర్మ సమాంతర మూల్యాంకనంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 11,591 మంది లబ్ధిదారులను చేర్చారు. బ్యాంకులు, ఉమ్మడి సేవా కేంద్రాలు, ఇండియా పోస్ట్ సిబ్బంది, శిక్షణ కేంద్రాల నుంచి కూడా అభిప్రాయాలను సేకరించారు.

మూల్యాంకనం ప్రకారం, శిక్షణ తర్వాత తమ ఆదాయం మధ్యస్థ స్థాయి నుంచి గణనీయ స్థాయి వరకు పెరిగినట్లు సర్వేలో పాల్గొన్న లబ్ధిదారుల్లో 93 శాతం మంది తెలిపారు. సర్వేలో పాల్గొన్న లబ్ధిదారుల్లో అధిక శాతం మందికి నైపుణ్యాల మెరుగుదల స్పష్టమైన ఆర్థిక ప్రయోజనాలను అందించిందని ఈ ఫలితం సూచిస్తోంది.

సంప్రదాయ నైపుణ్యాలు, జీవనోపాధులకు నిరంతర అండ
స్థానిక, కుటుంబ ఆధారిత స్వభావాన్ని కొనసాగిస్తూనే సంప్రదాయ వృత్తులను జాతీయ సహాయక వ్యవస్థ పరిధిలోకి పీఎం విశ్వకర్మ తీసుకొస్తోంది. సంప్రదాయ నైపుణ్యాల కొనసాగింపుతో పాటు వీటిలో అనేక వృత్తులతో ముడిపడి ఉన్న గురు-శిష్య పరంపరను బలోపేతం చేయటం కూడా పథకం లక్ష్యం. కళాకారులు, హస్తకళాకారులకు వారి పనిలోని వివిధ దశల్లో అండ అందించటం ద్వారా మారుతున్న ఆర్థిక పరిస్థితుల్లో సంప్రదాయ పరిజ్ఞానం, నైపుణ్యాల ప్రాధాన్యం కొనసాగేందుకు తోడ్పడుతూనే జీవనోపాధి అవకాశాలను సృష్టించాలని ఈ పథకం లక్ష్యంగా పెట్టుకుంది.

 

References:

Ministry of Micro, Small & Medium Enterprises

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1959098&lang=2&reg=3

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2291931&lang=1&reg=48

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2236871&lang=1&reg=3

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2198702&lang=1&reg=3

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2202916&lang=1&reg=3

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2286958&lang=1&reg=3

https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=2253553&lang=2&reg=48

https://www.msme.gov.in/static/uploads/2026/05/3040dc36fd7023c4d4d1f647ee816165.pdf

https://pmvishwakarma.gov.in/

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2271522&lang=1&reg=6

https://dic.py.gov.in/sites/default/files/pm-vishwakarma.pdf

Ministry of Commerce & Industry

https://www.dpiit.gov.in/static/uploads/2026/03/863a5fef349d79a1bba316c4b51eaacb.pdf

PIB Archives

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2298755&lang=1&reg=3

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2260904&lang=1&reg=3

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2278107&lang=1&reg=1

https://www.pib.gov.in/PressNoteDetails.aspx?ModuleId=2&NoteId=157068&lang=1&reg=3

Rajya Sabha Secretariat

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2238242&lang=1&reg=1

Click here to see pdf 

 

***

(Explainer ID: 160025) आगंतुक पटल : 7
Provide suggestions / comments
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali , Assamese , Kannada , Malayalam