• Sitemap
  • Advance Search
Technology

భార‌త్‌లో డేటా సెంట‌ర్లు డిజిటల్ యుగానికి అవ‌స‌ర‌మైన‌ మౌలిక సదుపాయాలు

Posted On: 14 SEP 2026 10:55AM

భారత డిజిటల్ జీవనానికి శక్తినిచ్చే కనిపించని చోదక శక్తులు డేటా కేంద్రాలు. బ్యాంకింగ్, ఈ–పాలన, ఆన్‌లైన్ సేవలకు ఇవి నిరంతరం మద్దతు ఇస్తాయి. వర్ధమాన సాంకేతికతలతో సమాచారం వేగంగా పెరుగుతున్న వేళ ప్రభుత్వం అనుకూల విధాన వ్యవస్థను నిర్మిస్తోంది. మౌలిక సదుపాయాల హోదా, ఆర్థిక ప్రోత్సాహకాలు, స్వచ్ఛ ఇంధన వినియోగం భారత డేటా కేంద్రాల వ్యవస్థను బలోపేతం చేస్తున్నాయి.

డేటా కేంద్రాలతో భారత డిజిటల్ మౌలిక సదుపాయాలకు మరింత బలం
భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వేగవంతమైన వృద్ధి, సాంకేతిక మార్పులతో కొత్త దశలోకి అడుగుపెడుతోంది. డిజిటలీకరణ వివిధ రంగాల్లో ఉత్పాదకత, పోటీతత్వం, సేవల అందజేతకు కొత్త రూపునిస్తోంది. డిజిటల్ సేవలు విస్తరించేకొద్దీ కంప్యూటింగ్ సామర్థ్యం, సమాచార నిల్వ, అత్యంత వేగవంతమైన అనుసంధానానికి గతంలో ఎన్నడూ లేనంత గిరాకీ పెరుగుతోంది. ఈ అవసరాన్ని తీర్చేందుకు నిరంతరం, సురక్షితంగా, భారీ స్థాయిలో పనిచేసే మౌలిక సదుపాయాలు అవసరం. భారత ఆర్థిక వ్యవస్థ, పాలనను ముందుకు నడిపిస్తున్న డిజిటల్ సేవలకు డేటా కేంద్రాలు కీలక పునాదిని అందిస్తున్నాయి.

 



కంప్యూటింగ్, నిల్వ, నెట్‌వర్కింగ్ పరికరాలను ఉంచే సురక్షిత ప్రాంగణమే డేటా కేంద్రం. భారీ పరిమాణంలోని డిజిటల్ సమాచారాన్ని నిల్వ చేసి, శుద్ధి చేసి, నిర్వహించి, పంపిణీ చేస్తుంది. ఆన్‌లైన్ బ్యాంకింగ్, ఈ–పాలన, డిజిటల్ చెల్లింపులు, క్లౌడ్ కంప్యూటింగ్, ఇతర వర్ధమాన సాంకేతికతలకు ఈ సామర్థ్యాలు మద్దతు ఇస్తాయి.

ఆధునిక డేటా కేంద్రాల్లో కంప్యూటింగ్, నెట్‌వర్కింగ్, విద్యుత్తు, శీతలీకరణ, భద్రత, నిర్వహణ వ్యవస్థలు సమన్వయంతో పనిచేస్తాయి. విశ్వసనీయ కార్యకలాపాలు, సమాచార భద్రత, అంతరాయం లేని డిజిటల్ సేవల కోసం ఈ వ్యవస్థలు నిరంతరం పనిచేస్తుంటాయి. భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థ విస్తరిస్తున్న వేళ ఆవిష్కరణలు, పోటీతత్వం, నిరంతర డిజిటల్ వృద్ధికి ప్రతిఘటన సామర్థ్యం గల డేటా కేంద్రాలు వ్యూహాత్మక మౌలిక సదుపాయాలుగా మారుతున్నాయి.

డేటా కేంద్రం లోపల: డిజిటల్ సేవలకు శక్తినిచ్చే సాంకేతికతలు
కీలక పరికరాలు నిరంతరం పనిచేసేందుకు డేటా కేంద్రానికి విశ్వసనీయ విద్యుత్తు మౌలిక సదుపాయం అవసరం. డేటా కేంద్రంలోని కంప్యూటర్లు ఒక్క మిల్లీసెకను కూడా ఆగకూడదు. విద్యుత్తు సరఫరాలో అంతరాయం తలెత్తిన వెంటనే నిరంతర విద్యుత్తు సరఫరా వ్యవస్థలు (యూపీఎస్) ప్రత్యామ్నాయ విద్యుత్తును అందిస్తాయి. ఎక్కువసేపు విద్యుత్తు నిలిచిపోయినప్పుడు బ్యాకప్ జనరేటర్లు, విద్యుత్తు పంపిణీ వ్యవస్థలు అదనపు రక్షణ కల్పిస్తాయి. ఇంత భారీ స్థాయిలో నిరంతర కార్యకలాపాలకు కంప్యూటింగ్ పరికరాలను తగిన పరిస్థితుల్లో ఉంచే శీతలీకరణ వ్యవస్థలు అవసరం. హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్ (హెచ్‌వీఏసీ) వ్యవస్థలు ప్రాంగణంలోని ఉష్ణోగ్రత, గాలి ప్రవాహాన్ని నియంత్రిస్తాయి. అధునాతన గాలి ప్రవాహ నిర్వహణ, ద్రవ శీతలీకరణతో ఉష్ణ సామర్థ్యం, విశ్వసనీయత మరింత మెరుగవుతాయి.



సమాచార సాంకేతిక (ఐటీ) మౌలిక సదుపాయాలు ప్రధాన కంప్యూటింగ్ పనులను నిర్వహిస్తాయి. సర్వర్లు సమాచారాన్ని శుద్ధి చేసి, డిజిటల్ అప్లికేషన్లను నడుపుతాయి. హార్డ్ డిస్క్ డ్రైవ్‌లు (హెచ్‌డీడీలు), సాలిడ్ స్టేట్ డ్రైవ్‌లను (ఎస్‌ఎస్‌డీలు) ఉపయోగించే నిల్వ వ్యవస్థలు భారీ సమాచారాన్ని సురక్షితంగా భద్రపరుస్తాయి. భౌతిక, డిజిటల్ ముప్పుల నుంచి పరికరాలు, నెట్‌వర్క్‌లు, సమాచారానికి భద్రతా వ్యవస్థలు రక్షణ కల్పిస్తాయి.

రౌటర్లు, అత్యంత వేగవంతమైన స్విచ్‌లతో కూడిన నెట్‌వర్కింగ్ పరికరాలు ప్రాంగణం లోపల, వెలుపల సమాచార మార్పిడికి వీలు కల్పిస్తాయి. డేటా కేంద్రం, బాహ్య నెట్‌వర్క్‌ల మధ్య అత్యంత వేగవంతమైన సమాచార ప్రసారాన్ని ఫైబర్ ఆప్టిక్ అనుసంధానాలు అందిస్తాయి.

చివరగా, నిర్వహణ సాఫ్ట్‌వేర్ వ్యవస్థలను పర్యవేక్షిస్తూ కంప్యూటింగ్ వనరులను సమర్థంగా వినియోగించేందుకు తోడ్పడుతుంది. ఒకే భౌతిక సర్వర్‌పై అనేక వర్చువల్ యంత్రాలు పనిచేసేందుకు వర్చువలైజేషన్ వీలు కల్పించి, వనరుల వినియోగాన్ని మెరుగుపరుస్తుంది. ఒక పెద్ద ఇంటిని వేర్వేరు అపార్ట్‌మెంట్లుగా విభజించినట్లు ఊహించుకోండి. ఒకే భౌతిక కంప్యూటర్‌లో అనేక వర్చువల్ ‘చిన్న కంప్యూటర్లు’ పనిచేసేలా వర్చువలైజేషన్ చేస్తుంది. తద్వారా వనరుల వినియోగ సామర్థ్యం గరిష్ఠ స్థాయికి చేరుతుంది. ఆటోమేషన్ సాధనాలు పనిభారాన్ని నిర్వహించి, నిర్వహణకు మద్దతు ఇస్తూ కార్యకలాపాల్లో సమస్యలను గుర్తించేందుకు తోడ్పడతాయి.

క్లిక్ నుంచి స్పందన వరకు: మీ అభ్యర్థనను డేటా కేంద్రం ఎలా నిర్వహిస్తుంది?

 


యాప్ తెరవటం, బ్యాంకు నిల్వను పరిశీలించటం లేదా పత్రాన్ని పొందటం వంటి సాధారణ చర్యతో ప్రతి డిజిటల్ అభ్యర్థన మొదలవుతుంది. వెంటనే కనిపించే స్పందన వెనుక ఆ అభ్యర్థన నెట్‌వర్క్ ద్వారా డేటా కేంద్రానికి చేరుతుంది. అక్కడ అనేక వ్యవస్థలు సమన్వయంతో పనిచేసి దాన్ని సురక్షితంగా, సమర్థంగా నిర్వహిస్తాయి.

ముందుగా భద్రతా పొర అభ్యర్థనను పరిశీలించి, సైబర్ ముప్పుల నుంచి వ్యవస్థకు రక్షణ కల్పిస్తుంది. ఆ తర్వాత లోడ్ బ్యాలెన్సర్ అభ్యర్థనను అందుబాటులో ఉన్న సర్వర్‌కు పంపుతుంది. దీంతో పనిభారం సమర్థంగా పంపిణీ అవుతుంది.

అప్లికేషన్ సర్వర్ అభ్యర్థనను శుద్ధి చేసి, ఏ సమాచారం లేదా సేవ అవసరమో నిర్ణయిస్తుంది. అవసరమైతే ఇతర అప్లికేషన్లు లేదా సేవలతో సమాచారం పంచుకునేందుకు అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్‌ను (ఏపీఐ) ఉపయోగిస్తుంది.

డేటాబేస్ సర్వర్ అవసరమైన సమాచారాన్ని తీసుకొని అప్లికేషన్ సర్వర్‌కు తిరిగి పంపుతుంది. శుద్ధి పూర్తయిన తర్వాత సమాచారం నెట్‌వర్క్ ద్వారా వినియోగదారు పరికరానికి చేరుతుంది.

ఈ ప్రక్రియ మొత్తం కేవలం 1–2 సెకన్లలో పూర్తవుతుంది. దీంతో వేగవంతమైన, అంతరాయం లేని డిజిటల్ సేవలు సాధ్యమవుతున్నాయి. అనుసంధానం → స్వీకరణ → నెట్‌వర్క్ → శుద్ధి → నిల్వ → భద్రత → స్పందన అనే పరస్పర అనుసంధానిత గొలుసు ద్వారా క్లౌడ్ సేవలు, ఈ–పాలన వేదికలు, కృత్రిమ మేధ (ఏఐ) అప్లికేషన్లు విశ్వసనీయంగా, భారీ స్థాయిలో సమాచారాన్ని అందించగలుగుతున్నాయి. ఆధునిక డేటా కేంద్రాలు కేవలం నిల్వ ప్రాంగణాలు కావని, రోజువారీ ఆన్‌లైన్ సేవలకు వీలు కల్పించే డిజిటల్ మౌలిక సదుపాయాలని ఇది స్పష్టం చేస్తోంది.

సులభంగా చెప్పాలంటే: తెరవెనుక పనిచేసే బృందం
* నెట్‌వర్క్ = కారిడార్లు, ఇంటర్‌కామ్. బృందం మొత్తం తక్షణమే సమాచారాన్ని పంచుకునేందుకు అనుసంధానించే అంతర్గత మార్గాలు.
* భద్రతా పొర = భద్రతా సిబ్బంది. ప్రవేశం వద్ద మీ అభ్యర్థనను పరిశీలిస్తారు.
* లోడ్ బ్యాలెన్సర్ = ట్రాఫిక్ పోలీసు. ఒకే సర్వర్‌పై అధిక భారం పడకుండా వచ్చే డిజిటల్ రద్దీకి దిశానిర్దేశం చేస్తుంది.
* అప్లికేషన్ సర్వర్ = వంట నిపుణుడు. మీ ఆర్డర్ తీసుకొని ఏ సమాచారం లేదా తయారీ విధానం అవసరమో నిర్ణయిస్తారు.
* ఏపీఐ = సేవకుడు. సందేశాన్ని చేరవేసే వ్యక్తిగా పనిచేస్తుంది.
* డేటాబేస్ సర్వర్ = డిజిటల్ ఖజానా. వివరాలను సురక్షితంగా ఉంచి, అవసరమైనప్పుడు తిరిగి అందిస్తుంది.

భారత్‌లో డేటా కేంద్రాల స్థితి
ఈ–పాలన, డిజిటల్ సేవలు వేగంగా విస్తరించిన క్రమంలోనే భారత డేటా కేంద్రాల ప్రయాణం కూడా పరిణామం చెందింది. ఆన్‌లైన్ సేవలపై పౌరుల అంచనాలు పెరగటంతో పటిష్ఠమైన డేటా కేంద్రాల మౌలిక సదుపాయాలకు గిరాకీ పెరుగుతోంది. నేష‌న‌ల్ ఇన్‌ఫ‌ర్మేటిక్స్ సెంట‌ర్‌ (ఎన్‌ఐసీ) దేశవ్యాప్తంగా అత్యాధునిక జాతీయ డేటా కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఢిల్లీలోని ఎన్‌ఐసీ ప్రధాన కార్యాలయం, పుణె, హైదరాబాద్, భువనేశ్వర్‌లో ఈ సదుపాయాలు ఉన్నాయి. వివిధ రాష్ట్ర రాజధానుల్లో 37 చిన్న డేటా కేంద్రాలను కూడా ఎన్‌ఐసీ ఏర్పాటు చేసింది. వివిధ స్థాయుల్లోని ప్రభుత్వ సంస్థలకు ఈ కేంద్రాలు విశ్వసనీయ డిజిటల్ సేవలను అందిస్తున్నాయి. నిరంతర కార్యకలాపాలు, వ్యవస్థల నిర్వహణ, నైపుణ్యం కలిగిన ప్రాంగణ సిబ్బందికి మద్దతు ఇస్తున్నాయి.

 



భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వేగంగా విస్తరించటంతో సురక్షిత, విశ్వసనీయ సమాచార మౌలిక సదుపాయాలకు గిరాకీ మరింత పెరుగుతోంది. 2020లో డేటా కేంద్రాల స్థాపిత విద్యుత్తు సామర్థ్యం సుమారు 375 మెగావాట్లుగా ఉంది. 2026 ఆగస్టు నాటికి అది 1.57 గిగావాట్లకు పెరిగింది. 2030 నాటికి దాదాపు 8 గిగావాట్లకు చేరుతుందని అంచనా. భారత డేటా కేంద్రాల రంగంలో ఇప్పటికే దాదాపు 70 బిలియన్ అమెరికా డాలర్ల పెట్టుబడులు కొనసాగుతున్నాయి. ప్రకటించిన ప్రాజెక్టుల్లో మరో 90 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఉన్నాయి. విస్తరణ స్థాయితో పాటు పెట్టుబడిదారుల బలమైన విశ్వాసాన్ని ఇది తెలియజేస్తోంది.

డేటా కేంద్రాలకు అనుకూల విధాన వాతావరణం
లక్ష్యిత విధానాలు, ఆర్థిక చర్యల ద్వారా డేటా కేంద్రాల వ్యవస్థను ప్రభుత్వం బలోపేతం చేసింది. 2022–23 కేంద్ర బడ్జెట్‌లో డేటా కేంద్రాలను ఏకీకృత మౌలిక సదుపాయాల జాబితాలో చేర్చారు. దీంతో వాటికి మౌలిక సదుపాయాల హోదా లభించి, డిజిటల్ మౌలిక సదుపాయాలకు రుణ సౌకర్యం మెరుగుపడింది. భారత డేటా కేంద్రాల సామర్థ్యంలో పెట్టుబడులు, విస్తరణకు కూడా ఈ చర్య మద్దతు ఇచ్చింది.

అర్హత కలిగిన విదేశీ క్లౌడ్ సేవా సంస్థలకు 2047 వరకు పన్ను మినహాయింపును 2026–27 కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టింది. భారత్‌లోని డేటా కేంద్రాల మౌలిక సదుపాయాలను వినియోగించే ప్రపంచ కార్యకలాపాలకు ఈ ప్రోత్సాహకం వర్తిస్తుంది. నోటిఫై చేసిన విదేశీ సంస్థలకు 2026–27 నుంచి 2046–47 పన్ను సంవత్సరాలను ఇది పరిధిలోకి తీసుకుంటుంది. డేటా కేంద్రాలు, క్లౌడ్ మౌలిక సదుపాయాల పెట్టుబడులకు భారత వాతావరణాన్ని ఈ చర్యలు బలోపేతం చేస్తున్నాయి.

మౌలిక సదుపాయాల హోదా అంటే సులభంగా
డేటా కేంద్రాలకు ‘మౌలిక సదుపాయాల హోదా’ ఇవ్వటం అంటే వాటిని జాతీయ రహదారులు, విమానాశ్రయాలు, విద్యుత్తు గ్రిడ్ల మాదిరిగా పరిగణించటం. దీంతో సులభంగా, తక్కువ వ్యయంతో దీర్ఘకాలిక రుణాలను పొందగలుగుతాయి.

డేటా కేంద్రాల వృద్ధికి మద్దతు ఇచ్చే అనుబంధ పథకాలు
* ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్‌ఎం) కింద ₹1,27,500 కోట్ల కేటాయింపుతో సెమికాన్ ఇండియా కార్యక్రమం రెండో దశకు (సెమికాన్ 2.0) కేంద్ర మంత్రివర్గం 15.07.2026న ఆమోదం తెలిపింది. దేశంలో విశ్వసనీయ, ప్రతిఘటన సామర్థ్యం గల సమగ్ర సెమీకండక్టర్ వ్యవస్థను నిర్మించటం దీని లక్ష్యం.
* దేశంలో సమగ్ర ఏఐ వ్యవస్థను నిర్మించేందుకు మొత్తం ₹10,371.92 కోట్లతో ఇండియా ఏఐ మిషన్‌కు ఆమోదం లభించింది. ఈ మిషన్ కింద ప్రోత్సహిస్తున్న ఏఐ వ్యవస్థ భారత్‌లో డేటా కేంద్రాల వృద్ధికి కీలక చోదక శక్తిగా ఉంది.
* ఎలక్ట్రానిక్ విడిభాగాల తయారీ పథకానికి (ఈసీఎంఎస్) కూడా ఆర్థిక మద్దతు పెరిగింది. కేటాయింపు ₹22,000 కోట్ల నుంచి ₹40,000 కోట్లకు చేరింది.
* సర్వర్ల వంటి ఐటీ హార్డ్‌వేర్ కోసం పటిష్ఠ దేశీయ తయారీ వ్యవస్థను సృష్టించటం, భారీ పెట్టుబడులను ఆకర్షించటం, దిగుమతులపై ఆధారాన్ని తగ్గించటం, భారత్‌ను విశ్వసనీయ ప్రపంచ సరఫరా గొలుసు కేంద్రంగా మార్చటం కోసం ఐటీ హార్డ్‌వేర్‌కు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం 2.0ను భారత ప్రభుత్వం ప్రారంభించింది.

డేటా కేంద్రాల రంగ సుస్థిరత: ఇంధనం, నీటి ప్రణాళిక
డేటా కేంద్రాల సామర్థ్యం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఇంధనం, వనరుల సమర్థ వినియోగం మరింత ముఖ్యమవుతోంది. నిరంతర కార్యకలాపాల కోసం డేటా కేంద్రాలకు విశ్వసనీయ విద్యుత్తు, సమర్థ శీతలీకరణ వ్యవస్థలు అవసరం. కేంద్ర విద్యుత్తు మంత్రిత్వ శాఖ పరిధిలోని కేంద్ర విద్యుత్తు ప్రాధికార సంస్థ (సీఈఏ) అంచ‌నా ప్రకారం 2031–32 నాటికి గిరాకీ 17 గిగావాట్లకు చేరవచ్చు. రంగం విస్తరిస్తున్న వేళ సుస్థిర వృద్ధికి మద్దతుగా స్వచ్ఛ ఇంధనం, వనరుల సమర్థ వినియోగాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.

పునరుత్పాదక ఇంధనం, స్వచ్ఛ విద్యుత్తు
పలు కీలక కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం పునరుత్పాదక ఇంధనాన్ని ప్రోత్సహిస్తోంది. హరిత ఇంధన బహిరంగ ప్రవేశ నిబంధనలు, హరిత ఇంధన కారిడార్ పథకం, జాతీయ హరిత హైడ్రోజన్ మిషన్ వీటిలో ఉన్నాయి. అధిక సామర్థ్యం గల సోలార్ పీవీ మాడ్యూళ్ల జాతీయ కార్యక్రమం, సోలార్ పార్క్ పథకం కూడా స్వచ్ఛ ఇంధన విస్తరణకు మద్దతు ఇస్తున్నాయి. అధిక విద్యుత్తు వినియోగించే డిజిటల్ మౌలిక సదుపాయాలకు స్వచ్ఛమైన, విశ్వసనీయ విద్యుత్తు లభ్యతను ఈ చర్యలు మెరుగుపరుస్తున్నాయి.

శాంతి చట్టం, స్వచ్ఛ విద్యుత్తు
భారత పరివర్తన కోసం అణు ఇంధన సుస్థిర వినియోగం, పురోగతి చట్టం (శాంతి) స్వచ్ఛ విద్యుత్తు వ్యవస్థను బలోపేతం చేస్తోంది. కృత్రిమ మేధ, డేటా కేంద్రాలు సహా వర్ధమాన రంగాలకు విశ్వసనీయ అణు విద్యుత్తును అందించేందుకు మద్దతు ఇస్తుంది. భవిష్యత్తులో చిన్న మాడ్యులర్ రియాక్టర్లు, సూక్ష్మ అణు రియాక్టర్ల ఏర్పాటుకు కూడా ఈ చట్రం వీలు కల్పిస్తోంది.

డేటా కేంద్రాలకు బీఐఎస్ ప్రమాణాలు
డేటా కేంద్రాల సామర్థ్యం కోసం భారత ప్రమాణాల సంస్థ (బీఐఎస్) ప్రమాణాలను రూపొందించింది. క్లౌడ్ కంప్యూటింగ్, సమాచార సాంకేతికత, డేటా కేంద్రాలను దాని ఎల్‌ఐటీడీ 31 సాంకేతిక కమిటీ పరిధిలోకి తీసుకుంటుంది. విద్యుత్తు వినియోగ సామర్థ్యం (పీయూఈ), కర్బన వినియోగ సామర్థ్యం (సీయూఈ) సంబంధిత ప్రమాణాలను బీఐఎస్ ప్రచురించింది. శీతలీకరణ సామర్థ్య నిష్పత్తి (సీఈఆర్), నీటి వినియోగ సామర్థ్యాన్ని (డబ్ల్యూయూఈ) కూడా ఈ ప్రమాణాలు పరిధిలోకి తీసుకుంటాయి.

సులభంగా చెప్పాలంటే
పీయూఈ, డబ్ల్యూయూఈ:
ఒక ప్రాంగణం విద్యుత్తు, నీటిని ఎంత సమర్థంగా వినియోగిస్తుందో కొలిచే హరిత మైలేజీ రేటింగ్‌లుగా పనిచేస్తాయి.

సీయూఈ: డేటా కేంద్రంలోని కంప్యూటర్లు వినియోగించే ప్రతి యూనిట్ విద్యుత్తుకు ఎంత కర్బన కాలుష్యం విడుదలవుతుందో కొలుస్తుంది.

సీఈఆర్: ఫ్యాన్లు, చల్లటి నీటి గొట్టాలు లేదా ద్రవ శీతలీకరణ వంటి వ్యవస్థలు వినియోగించే విద్యుత్తుతో పోలిస్తే వేడిని ఎంత సమర్థంగా తొలగిస్తున్నాయో కొలుస్తుంది.

ఇంధనం, నీటి సామర్థ్య ప్రమాణాలు
ఎన‌ర్జీ క‌న్స‌ర్వేష‌న్ బిల్డింగ్ కోడ్‌ (ఈసీబీసీ) 2017ను బ్యూరో ఆఫ్ ఎన‌ర్జీ ఎఫీషియ‌న్సీ (బీఈఈ) నోటిఫై చేసింది. ఇంధన పరిరక్షణ, సుస్థిర భవన నియమావళి (ఈసీఎస్‌బీసీ) 2024ను కూడా నోటిఫై చేసింది. భవనాలకు ఇంధన సామర్థ్యం, నీటి పరిరక్షణ ప్రమాణాలను ఈ నియమావళులు నిర్దేశిస్తాయి. డేటా కేంద్రాల మౌలిక సదుపాయాలకు వర్తించే నిబంధనలు కూడా వీటిలో ఉన్నాయి.

అధునాతన శీతలీకరణ, నీటి నిర్వహణ
డేటా కేంద్రాల నీటి అవసరాలు అక్కడ వినియోగించే శీతలీకరణ సాంకేతికతలపై ఆధారపడి ఉంటాయి. పారిశ్రామిక అవసరాలు సహా భూగర్భ జలాల వెలికితీతను కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం నియంత్రిస్తారు. డేటా కేంద్రాల్లో అధునాతన శీతలీకరణ సాంకేతికతల వినియోగానికి ఏఐ మౌలిక సదుపాయాలు ఊతమిస్తున్నాయి. చిప్‌కు నేరుగా లిక్విడ్ కూలింగ్‌, అడియాబాటిక్ కూలింగ్‌, ఇమెర్ష‌న్ కూలింగ్‌ వంటి సాంకేతికతలు వీటిలో ఉన్నాయి. క్లోజ్డ్‌-లూప్ లిక్విడ్ కూలింగ్ వ్యవస్థలు కూడా వనరులను సమర్థంగా వినియోగించే పరిష్కారాలుగా ఎదుగుతున్నాయి.

భ‌విష్య‌త్‌ మార్గం
ప్ర‌తికూల ప‌రిస్థితుల‌ను త‌ట్టుకునే సామర్థ్యం, సార్వభౌమత్వం గల డిజిటల్ మౌలిక సదుపాయాల దిశగా కొనసాగుతున్న స్థిరమైన విధాన ప్రయాణాన్ని భారత డేటా కేంద్రాల వృద్ధి ప్రతిబింబిస్తోంది. సమాచార సార్వభౌమత్వం, డిజిటల్ విశ్వాసం, ఆర్థిక పోటీతత్వం, సాంకేతిక స్వావలంబనకు ఇవి మరింత కీలకంగా మారుతున్నాయి. క్లౌడ్, కృత్రిమ మేధ మౌలిక సదుపాయాల విస్తరణ ఆవిష్కరణలు, ఆర్థిక వృద్ధికి కొత్త అవకాశాలను సృష్టిస్తోంది. అయితే ఈ వృద్ధితో పాటు సమాచారం, సాంకేతికత, ఇంధనం, డిజిటల్ మౌలిక సదుపాయాల బాధ్యతాయుత పాలన కూడా అవసరం. సాంకేతిక పాలనా విధానం ఆవిష్కరణలను భద్రత, సుస్థిరత, జవాబుదారీతనం, ప్రజా ప్రయోజనంతో సమతుల్యం చేయటానికి తోడ్పడగలదు. ఇందుకు బలమైన ప్రమాణాలు, పటిష్ఠ సైబర్ భద్రత, బాధ్యతాయుత సమాచార పద్ధతులు, వనరుల సమర్థ నిర్వహణ అవసరం. కంప్యూటింగ్, సెమీకండక్టర్లు, ఇంధనం, కీలక డిజిటల్ మౌలిక సదుపాయాల్లో మరింత దేశీయ సామర్థ్యం కూడా అవసరం. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యం దిశగా దేశం ముందుకు సాగుతున్న వేళ డేటా కేంద్రాలు డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు పునాది పొరగా పనిచేయగలవు.

References:

Niti Aayog

Ministry of Electronics & IT

Ministry of Finance

Ministry of Communications

Press Information Bureau

Others:

Click here to see pdf

***

(Explainer ID: 160022) आगंतुक पटल : 17
Provide suggestions / comments
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali , Assamese , Kannada , Malayalam